55

 హరీష్ చెప్పింది విన్నాక అప్పటి వరకు స్వాతి మొహంలో ఉన్న నవ్వు మాయమయింది. తన ఒడిలో కూర్చున్నది లేచీ డెక్ దగ్గరకి వెళ్ళి నిల్చుంది. ఉబికి వస్తున్న కన్నీటిని దాచటానికి ప్రయత్నిస్తోంది


"స్వీటీ.. " అంటూ ఖంగారుగా తన వెనకే వెళ్ళాడు హరీష్ 


స్వాతి చేత్తో ఆగమన్నట్లుగా పెట్టి,  "బావ నేను బానే ఉన్నాను,  భయపడకు. కొంచం టైమ్ ఇయ్యి సద్దుకుంటాను" 


"స్వీటీ.....  నీ చేయి నన్ను దగ్గరకి రావద్దంటోంది. నువ్వేమో టైమ్ కావాలంటున్నావ్....  అలా దూరంగా ఉండకురా.... " అంటూ  హరీష్ స్వాతి ని వెనకనుంచి హత్తుకుని,  "నువ్వు వద్దన్నా సరే నీకు దూరంగా ఉండలేను. నువ్వెలా రియాక్ట్ అవుతావో అని భయమేసి చెప్పలేకపోయాను కానీ,  దాచాలన్న ఉద్దేశం లేదురా. నిన్ను బాధపెట్టాలని కాదు" 


"కృష్ణా ఇప్పుడు నువ్వెందుకు భయపడ్తున్నావ్, కోపం వచ్చి నీకు దూరంగా వెళ్ళిపోతాననా. నువ్వు చెప్పగానే ఒక్క క్షణం నా కన్న తండ్రీ తాగినప్పుడు నన్ను ఎలా కొట్టేవాడో గుర్తొచ్చి భయమేసింది"


స్వాతి ఆపుకుంటున్న కన్నీళ్ళు జలజలా పరవళ్లు తొక్కుతూ చెక్కిళ్లని దాటి ఆమెని చుట్టేసిన హరీష్ చేతిని అందుకున్నాయి.


"స్వీటీ..... " అంటూ హరీష్ స్వాతిని తన వైపుకి తిప్పుకుని బాధగా ఆమె కన్నీళ్ళు తుడుస్తుంటే,  


స్వాతి..., "కృష్ణా.... ఆ మనిషితో  నిన్ను పోల్చను. కారణం,  నాకు దెబ్బ తగిలితే ఆ నొప్పి నాకైనా ఎక్కువ నీకే. నువ్వు నన్నెప్పుడూ బాధపెట్టవు,  పెట్టలేవు" 


"స్వీటీ...  నేను డ్రింక్ చేసాను, ఒప్పుకుంటాను కానీ తాగటం నాకు అలవాటు కాదు,  వ్యసనమూ కాదు. నలుగురులో ఉన్నప్పుడు, మొహమాటాలు వలన తప్పలేదు. అంతేకాని నా మీద నేను కంట్రోల్ పోయే సిట్యుయేషన్ ఎప్పుడూ రాలేదు,  నీ విషయంలో ఎప్పటికీ జరగదు కూడా. అంతవరకు ఎందుకు ఇంకెప్పుడూ మొహమాటాలకు కూడా తాగను..." 


స్వాతి హరీష్ నోటి మీద చేయి పెట్టి, తన కళ్ళలోకి చూస్తూ "ఒద్దు కృష్ణా....  మాటియ్యకు. నువెప్పుడూ ఎలా ఉంటావో అలాగే ఉండు. నీకు నచ్చినట్లుగా నువ్వుండు. నీ దగ్గర మాట తీస్కుని నిన్ను కట్టేయాలని నాకు లేదు. అలా చేస్తే మన ప్రేమ ని అవమానించినట్లే"   


ఆ మాటలకి హరీష్ కి ఏంచెప్పాలో తెలీలేదు. స్వాతిని గుండెలకి హత్తుకున్నాడు. స్వాతి అంతే గట్టిగా తనని పట్టుకుని,  "కానీ కృష్ణా ఒక్క విషయం. నువ్వు తాగినా నేను బాధపడనేమో కానీ నిన్ను అలా మత్తులో తూలుతూ మాత్రం చూసే అవకాశం నాకు ఇయ్యకు. అలా నిన్ను చూస్తే నేను తట్టుకోలేనురా" 


స్వాతి తల మీద ముద్దుపెట్టుకుని,  హరీష్... "అలా ఎప్పటికి జరగదురా. నీకు నా మీదున్న నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టోకును బంగారం. లవ్ యూ సో మచ్" 


"లవ్ యూ టూ కృష్ణా...." 


వాళ్లిద్దరూ అలా హత్తుకుని ఉండిపోయారు. స్వాతి... "బావా.... " 


హరీష్... "హ్మ్మ్..... చెప్పురా" 


"ఫ్లో బావుంది. ఇంకా ఏమైనా దాస్తే ఇప్పుడే చెప్పేసెయ్యి. మళ్ళీ నేను మంచి మూడ్ లో లేకపోతే నీకే నష్టం. ఆలోచించుకో బాగా" అంది  నవ్వుతూ 


"ఇంకొక్క విషయం ఉంది" 


"ఇంకా ఉన్నాయా...  ఏంటి" 


"నీకు ఈ విషయం అసలు చేప్పద్దూ అని అన్నది మీ అన్నయ్యే" 


"ఏంటి....."  అంటూ హరీష్ కౌగిట్లోంచి దూరం జరిగింది. 


"అన్నయ్య కి తెలుసా. అన్నయ్యకెలా తెలుసు. నాకెందుకు తెలియకూడదన్నాడు. అయినా నువ్వు నాకు చెప్పలేదు కానీ అన్నయ్యకి చెప్పావా ధైర్యంగా వెళ్ళి" 


"నేనేమి చెప్పలేదురా. ఒకసారి ఆఫీస్ పార్టీ లో అలా అలా తెలిసిపోయిందంతే. ప్రదీప్ దగ్గర ఏమైనా దాచగలమా నువ్వే చెప్పు. తనే.. "ఏం పర్వాలేదు కానీ చిన్నూ తో అనకు, చెప్తే తర్వాత అదేమి చేస్తుందో నాకు తెలీదు" అన్నాడు. నువిప్పుడు చెప్పేవరకు,  నీ తండ్రీ తాగి కొట్టేవాడని నాకు తెలీదురా" అన్నాడు బాధగా 


"పర్వాలేదు బావా....  అవన్నీ అప్పుడే మర్చిపోయానులే. ఆయనకీ బాధపెట్టటానికే తాగినా తాగకపోయినా నాకు ఒకటే" అంది బాధగా 


స్వాతి తల నిమురుతూ,  "సారీ రా నీకు అవన్నీ గుర్తు చేసి బాధపెట్టాను" 


"లేదులే బావా....  నేను బానే ఉన్నాను.... అవునూ ఇంతకీ అన్నయ్యకి కూడా అలవాటుందా" 


"ఆ...  ఆదీ....  అదీ.....  నేను ఆన్సర్ చేయలేని క్వశ్చన్ లు నన్ను అడగకురా" 


"అర్థమయ్యిందిలే. ఇంటికి వెళ్ళాకా అన్విత చేతిలో ఉంటుందిలే" 


"ఓయి అంత పని చేయకు. నీకేం తెలీదు. అంతే. అయినా మగవాడు బయటకి వెళ్తే వంద మొహమాటాలు ఉంటాయి,  వెయ్యి పనులు తప్పక చేయాల్సి వస్తుంది. ప్రతీది ఇంట్లో చెప్పేస్తారేంటి అందరూ,  నా లాగా" అన్నాడు నవ్వుతూ 


"హహహ...  అందుకే అన్నయ్య చెప్పలేదంటావ్. సరే నువ్వింకా ఏమేమి చేస్తుంటావ్,  ఏదో వెయ్యి పనులన్నావ్ కదా. నాకు ఒక్కటే చెప్పావు మరీ" 


"ఇంక నీకు తెలీని విషయలేవి లేవురా. అయినా ఇంకేముంటాయి చెప్పు ....  అన్నీ చెప్పేసాను, మీ అన్నయ్యే చెప్పద్దన్నాడని కూడా చెప్పేసాను" అంటూ తనని మళ్ళీ హత్తుకుని...."కొంచం సేపు ఇలాగే ఉండరా" 


స్వాతి హరీష్ ని అలా హత్తుకుని,  భుజం మీదే ముద్దు పెట్టి  "ఏమో....  సిగరెట్ స్మోకింగ్ అనో ఇంకేదైనానో...... అయినా ముందే చెప్పేస్తున్నా నాకు సిగరెట్ వాసన అంటే చిరాకు. ఆ కంపు నోటితో ముద్దు పెట్టాలనుకుంటే మాత్రం మంచిగుండదు చెప్తున్నా" అంది నవ్వుతూ 


ఆ మాట వినగానే హరీష్.... "ఏమన్నావ్" అంటూ అప్పటి వరకూ చుట్టేసిన స్వాతిని తన నడుము మీద చిన్నగా గిల్లాడు. వెంటనే ఆమె తనని దూరంగా తోసేసి "ఏంటి బావా ఇదీ.... చూడు ఎర్రగా అయిపొయింది. నొప్పెడుతోంది" అంటూ ఏడుపు మొహం పెట్టుకునీ చూసుకుంది. 


హరీష్ తన దగ్గరకి వెళ్ళి,  అక్కడ ముద్దు పెట్టి,  "ముద్దు పెట్టాను కదా తగ్గిపోతుందిలే. అయినా మరీ ఇంత సున్నితమైతే ఎలారా" అంటూ మళ్ళీ ముద్దుపెట్టాడు. 


స్వాతి సిగ్గుతో "కృ ...   ష్ణా .... ఒద్దు... " అంటూ మాటలు పలకలేక  తడబడింది.  


హరీష్ అమాయకంగా మొహం పెట్టి ... "కంపు నోటితో ముద్దు పెట్టద్దన్నావ్ కానీ నా నోరు వాసన లేదస్సలు. పోనీ నువ్వే చెప్పు ఉందొ లేదో" అంటూ ఆమె  పెదవులని అందుకున్నాడు. ఆ తర్వాత తను సిగరెట్ జోలికి ఎప్పుడూ వెళ్లనే లేదు అని నిరూపించుకునే పనిలో పడ్డాడు. 


తెల్లవారుతుండగా మెలుకువొచ్చిన హరీష్ కి పక్కన స్వాతి లేకపోయేసరికి వెతుకుతూ,  ఫ్రంట్ డెక్ దగ్గరకి వచ్చాడు. అక్కడ స్వాతి ఒక పక్కగా కూర్చుని ఉంది. అప్పుడే నిద్ర నుంచి లేస్తున్న సూర్యుడు మెల్ల మెల్లగా పైకి లేస్తుంటే,  ఆ కిరణాలు స్వాతి మీద పడి ఏదో కొత్త వెలుగు వచ్చి ఇంకా అందంగా కనిపిస్తోంది. తనని అలా చూస్తూ ఆమె దగ్గరకి వచ్చి కూర్చున్నాడు. 


"ఎప్పుడు లేచావురా.... నాకూ నిద్రపట్టేసింది... లేపలేదేం" అంటూ తన తల మీద ముద్దుపెట్టుకున్నాడు


"ఇందాకే లేచాను బావా. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, నీ నిద్ర డిస్టర్బ్ చేయాలనిపించక మెల్లిగా లేచీ ఇక్కడికొచ్చి కూర్చున్నా.....  సూర్యోదయం,  సూర్యాస్తమయం చూడటమంటే నాకు చాలా ఇష్టం. మన ఊళ్ళో ఇలా చూడలేము కదా"


"అవునురా,  చాలా బావుంది" 


"బావా తర్వాత టిఫిన్ ఇక్కడే కూర్చుని చేద్దామా" 


"సరే స్వీటీ " 


"ఇంకా చెప్పు ఏమైనా లేదా అడుగు" 


"ఆమ్మో ఒద్దు. నిన్నా ఇలాగే మొదలెట్టావ్,  అదేమో గొడవైపోయింది. ఇప్పుడు అటు చూడు,  సీనరీ బావుంది. చూస్తూ ఎంజాయ్ చేద్దాం. అంతేకాని, నేనేమి అడగను,  చెప్పను. నువ్వు చెప్పు వింటాను" అన్నాడు నవ్వుతూ 


"అదేంటి బావా అలా అంటావు. నేను గొడవ చేసానా. నిన్ను ఒక్కమాటైనా అన్నానా అసలు" 


"అస్సలు అనలేదురా. నువ్వు నా బుజ్జి బంగారం కదా...... అవునురా...... అందరూ చదువు అవగానే జాబ్ చేయాలి,  ఫైనాన్సియల్ ఇండిపెండెన్స్ అంటూ చెప్తారు కదా. నీకెందుకు ఇష్టం లేదు. ఏదైనా పర్టికులర్ రీసన్ ఉందా. లేదా జస్ట్ ఇంటరెస్ట్ లేదా" 


స్వాతి హరీష్ ఒళ్ళో పడుకుని.... "ఏమో బావా...  ఇంటరెస్ట్ లేదని చెప్పచ్చేమో.... అన్వి ని,  అటు రమ్యని చూసినప్పుడల్లా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ జాబ్ చేయకపోతే దానితో టైమ్ స్పెండ్ చేయటానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు కదా అని చాలా సార్లు అనుకున్నాను" 


స్వాతి తల మీద రాస్తూ, ... "అలా అనుకున్నా, అన్వి నే జాబ్ చేద్దామనుకుంటోంది.అయినా  ఇప్పుడు చేసి ఫ్యూచర్ లో మానేయచ్చు కదా, అదే రీసన్ అయితే. అంటే నువ్వేదో జాబ్ చేయ్యాలని నా ఉద్దేశం కానే కాదు" 


"నీతో లైఫ్ ని ఊహించుకున్న ప్రతీసారి, నువ్వింటికి వచ్చేసరికి నీతో ఏ టెన్షన్స్ లేకుండా స్థిమితంగా కబుర్లు చెప్తూ,  నీకు ఏం కావాలన్నా టైమ్ కి చేస్తూ నీ పక్కనే ఉండాలనుకున్నాను. అంటే వేరే వాళ్ళు చేయటం లేదా అంటే చేస్తున్నారు. కానీ నేనలా ఉండలేను. రమ్య వాళ్ళు నన్ను ముసలివాళ్ళలాగా మాట్లాడతానని తిడతారు. కానీ ఏం చేయనూ నాకిలాగే ఇష్టం. అయితే ఒక విషయం,  నాకు డబ్బు లెక్కలు తెలీవు. నేను జాబ్ చేయటం వలన మనకి సేవింగ్స్ ఉంటాయి లేదా ఇంకోలా అవసరం అవుతుందంటే  మాత్రం తప్పకుండా చేస్తాను" 


"లేదురా స్వీటీ. అంత లేని పరిస్థితి ఏమి లేదు. దాని గురించీ నువ్వేమి ఆలోచించకు కానీ నాకోసం నువ్వు జాబ్ చేయనంటేనే నాకు నచ్చటం లేదు" 


"బావా నాకిలాగే ఇష్టమన్నాను కదా. నీకొక సీక్రెట్ చెప్పనా, కానీ నవ్వకూడదు. నేనీ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎవ్వరికీ తెలీని విషయం" 


"మీ అన్నయ్య కి కూడా తెలీదా" అన్నాడు నవ్వుతూ 


"ఆఁహాఁ తెలీదు. ఇది నాకూ, ఆ రూమ్ లో ఇంకో ఇద్దరు మగవాళ్ళున్నారు. వాళ్ళకి మాత్రమే తెలుసు. బయట ఇంకెవరికి తెలిసే ఛాన్స్ లేదస్సలు. కానీ నువ్వూ చెప్పకు బావా" 


హరీష్ కి ఖంగారుగా అనిపించి,  "ఏమయిందిరా అసలూ. అయినా బావకి చెప్పకపోటం ఏంటి. నాతో కూడా ఇన్నాళ్ళకి ఇప్పుడు చెప్తున్నావా. వాళ్ళేమైనా ఇబ్బంది పెట్టారా. త్వరగా చెప్పు" 


"అబ్బా.....  టెన్షన్ పడేది కాదు. చెప్తే పడి పడి నవ్వుతావు" 


"సరే టెన్షన్ పడటం లేదు కానీ ముందు చెప్పు" 


"నేను డిగ్రీ అయ్యాక ఒకసారి ఒక జాబ్ ఇంటర్వ్యూ కి వెళ్ళా, ఊరికే సరదాగా, ఎలా ఉంటుందో చూద్దామని" 


"అయితే" 


"అక్కడ రూమ్ లో నన్ను పిలిచారు, లోపలికి వెళ్లాను. పేరేంటి ఊరేంటి ఏం చదివావు అడిగారు ఆ తర్వాతేమో,  వాట్  ఆర్  యువర్ స్త్రెంగ్థ్స్ అనడిగారు,  అదేదో సినిమాలో చూసినది గుర్తొచ్చి.. మా అమ్మ అని చెప్పా.... వాళ్లేమో నవ్వేసి ఓహ్ దెన్ వాట్స్ యువర్ వీక్నెస్ అనడిగాడు ఒకడు. ఇంకోడేమో దీనికి అమ్మ అన్నాను కాబట్టి వీక్నెస్ అంటే నాన్న అంటానేమో అనేసి వాళ్ళే నవ్వేసుకున్నారు. బయటకి వచ్చాక కూడా వాళ్లేందుకు నవ్వారో  చాలా కాలం అర్థం కాలేదు. పోనీ ఎవరినైనా అడుగుదామంటే వాళ్లిద్దరూ నవ్వటమే గుర్తొచ్చి ఎందుకులే పరువు తీస్కోటం అని అడగలేదు" 


హరీష్ అప్పటికే గట్టిగా నవ్వేసాడు. స్వాతి బుంగమూతి పెట్టి ... "చెప్పానా ముందరే నవ్వద్దని. నేనింకెప్పుడూ ఏమి చెప్పనులే" 


"ఒద్దొద్దు. చెప్పు...ఇంకా ఏం ఏం చేసావు ఇలాంటి తింగరి పనులు" అంటూ మళ్ళీ నవ్వాడు


"అంతే....  ఇంకేం లేవు"


హరీష్ తనని తను కంట్రోల్ చేస్కుని,  "ఇంతకీ ఇప్పటికైనా అలా అడిగితే ఏమని చెప్పాలో తెలిసిందా. ఇందుకోసమేనా జాబ్ చేయను అంటున్నావు,  ఇంటర్వ్యూ కి భయపడి" 


"అంటే.... అదీ  ఒక కారణమనుకో. ప్లీజ్ బావా ఈ విషయం ఎవరికీ చెప్పకూ. పరువు పోతుంది" 


"ఛా. ఎవరికి చెప్తానురా,  నా స్వీటీని నేనెందుకు తక్కువ చేస్తాను. సరేలే.....  అటు చూడు సూర్య వచ్చేసాడు, చూస్తుండగానే" 


"అదే చూస్తున్నా బావా. ఎంత బావున్నాడో.... వావ్... బావా లవ్ యూ సో మచ్.. ఎప్పటి నుంచో కోరిక ఇలా చూడాలని,  అదీ నీ వలన తీరింది. అంతే కాకుండా నీతో పాటు చూడటం ఇంకా బావుంది. ఈ ట్రిప్ లో ఎన్నో బెస్ట్ మెమోరీస్ ఇచ్చావు. నువ్వు ఫస్ట్ టైమ్ నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పిన  రోజు నాకు అది స్పెషల్ అని చెప్పానని,  వెయిట్ చేసీ మరీ అప్పుడే ఇక్కడికొచ్చేలా ప్లాన్ చేసావు. థాంక్యూ సో మచ్"  


"ఓయి థాంక్స్ ఏంటిరా. నీతో పాటు ఇలా టైమ్ స్పెండ్ చేయటం నాకూ చాలా బావుంది స్వీటీ" 


"నీకో విషయం చెప్పనా ఆ రోజే మనకి ఫస్ట్ కిస్ కూడా"


"నువ్వు నన్ను తోసేసావు ఆరోజు. అందుకే అది నేను ఒప్పుకోను. నీ పుట్టినరోజు పెట్టినదే తొలిముద్దు"


ఇద్దరూ నవ్వుకుంటూ అక్కడే కొంచం సేపు గడిపారు. 


ఆ రోజు వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ బీచ్ దగ్గరకి వెళ్ళి కొంచం సేపు అక్కడే ఆడుకుని తర్వాత ఇంటికి చేరారు. లేట్ అవటం తో,  ఇంట్లో అందరూ పడుకుని ఉన్నారని వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయారు. 


"కృష్ణా.....  నిన్నొక విషయం అడగటమే మర్చిపోయాను" 


"ఏంటిరా " 


"అత్తయ్య నన్ను జీన్స్ అవి వేసుకోమంటుంది,  నాకేమో బాగోదేమో అని ఫీలింగ్. డ్రెస్సులు వేసుకోవచ్చు అందీ. నువ్వేమంటావు. నాకేం  చేయాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నా" 


"మీ ఇంట్లో వేసుకునే దానివా" 


"ఆ " 


"మా నాన్న చెప్పారు కదా వాళ్ళకి నువ్వు కూతురివే అని. వాళ్ళ ముందు మొహమాటం ఎందుకు,  ఎప్పుడూ లాగే ఉండు"


"హ్మ్మ్.... సరేలే.... "


పొద్దున లేచాక హరీష్ వాళ్ళ అమ్మ నాన్నగారితో,  అక్కడ వాళ్ళు చూసిన ప్లేసెస్ గురించీ చెప్తుంటే...  హరీష్ వాళ్ళ అమ్మ సత్య గారు....  "స్వాతి.....  ఇంట్లో పదిరోజులు మాత్రమే ఉన్నావు కానీ,  వెనకాలే ఉండేదానివి. బాగా అలవాటైపోయావు. మీరు వెళ్ళాక ఇంట్లో అస్సలు తోచలేదు" అని ఆవిడ అంటుంటే స్వాతి సంతోషానికి అవధులు లేవు. 


అంతేకదా మరి ఎంత మేనమావయ్య,  అత్తయ్య అయినా ఇప్పుడు ఆవిడ అత్తగారు. ఆ హోదా,  గౌరవం దొరకవేమో అని మొన్న భయపడిన ఆవిడ,  ఈరోజు నువ్వు లేకపోతే నాకు తోచలేదు అని అంటుంటే సంతోషమే కదా మరి



Comments