54
స్వాతికి ఫ్లైట్ ఎక్కటం అదే మొదటి సారి. ఎంత మాములుగా ఉండటానికి ప్రయత్నించినా, ఫ్లైట్ ఎక్కేటప్పుడు కాళ్ళు వణికాయి. హరీష్ తన భుజం మీద చెయ్యేసి పట్టుకుని నడుస్తూ ఉంటే తన కళ్ళలోకి చూసింది. హరీష్ నవ్వుతూ నడుస్తున్నాడు కానీ అతని కళ్ళు మాత్రం "ఏమి కాదు, నేను పక్కనే ఉన్నాను" అనే భరోసానిచ్చాయి.
కొచ్చిలో రిసార్ట్ కి వెళ్లేసరికి రాత్రయిపోయింది. ఆ ప్రదేశాన్ని చూస్తుంటే ఎంతో హాయిగా ఉంది.
"స్వీటీ.... ఇందాకటి నుంచి ఎందుకురా నీలో నువ్వు అంతలా నవ్వుకుంటున్నావు"
"రిసార్ట్ కి వచ్చేటప్పుడు, మళ్ళీ రిసెప్షన్ నుంచి మన రూమ్ వరకు ఇక్కడ అన్నీ బోట్ లే. ఆ బోట్ ప్రయాణం చేస్తున్నంత సేపు నీ పుట్టినరోజుకి మనం బొట్ లో వెళ్ళటం, నీతో కేక్ కట్ చేయించటం అవన్నీ గుర్తొచ్చి నవ్వొచ్చింది"
"హాహా.... అది వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ. నేనూ ఇందాక అదే గుర్తు చేస్కుంటూ ఉన్నా. ఆరోజు అది పెద్ద సర్ప్రైస్ రా. చాలా కాలం తర్వాత నీ వలనే మళ్ళీ సెలెబ్రేట్ చేస్కున్నాను" అంటూ స్వాతి ని ముద్దుపెట్టుకున్నాడు.
స్వాతిని అనుమానంగా చూస్తూ, "స్వీటీ.... ప్రయాణం చేసి అలిసిపోయుంటావు. రెస్ట్ తీసుకో"
"ఆఁహాఁ పర్వాలేదు" అంది హరీష్ నొచ్చుకుంటాడేమో అనుకుంటూ
"స్వీటీ... మనం ఈ ట్రిప్ కి వచ్చింది, ఒకళ్ళతో ఒకళ్లము కొంచం టైమ్ స్పెండ్ చేయాలనీ. పెళ్ళికి ముందర మనమేమి షికార్లకి వెళ్ళలేదు, ఆరోజు వెళ్ళినది కూడా ఫ్రెండ్స్ తోనే వెళ్ళాము. మళ్ళీ ఇంటికి వెళ్తే ఆఫీస్, పని.... లైఫ్ రొటీన్ అయిపోతుంది. అమ్మ వాళ్ళు ఉన్నారంటూ నువ్వూ మొహమాటంగా ఉంటావు. మన మధ్యన అయినా, ఆ మొహమాటాలు పోవాలి అనే ఆలోచించాను కానీ రూమ్ కే పరిమితం అయిపోవాలని కాదు."
ఆ మాటకి స్వాతి, "లవ్ యూ కృష్ణా. నా అభిప్రాయాలని చదివినట్లుగా చెప్తున్నావు. లవ్ యూ సో మచ్ " అంటూ తనని కౌగిలించుకుంది.
తనని అలాగే హత్తుకుని, "ఇప్పుడు చెప్పు, "నిద్రొస్తోందా"
"హ్మ్మ్.... అవును కృష్ణా ... చాలా నిద్రొస్తోంది..... ఏమనుకోకు" అంది స్వాతి మత్తుగా
"పడుకోరా.... నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. రేపు పొద్దునే బీచ్ దగ్గరకి వెళ్ళాలి అటు నుంచి షోస్ ఉన్నాయి. రేపంతా బిజీనే మళ్ళీ"
స్వాతి వెంటనే పడుకునిపోయింది. హరీష్ వచ్చి నిద్ర పట్టక, బాల్కనీ లో నుండి చుట్టూ ఉన్న చెట్లు, ఆ పౌర్ణమి చంద్రుని ప్రతిబింబాన్ని నీళ్లలో చూస్తూ కొద్దిసేపు అక్కడే నిల్చునిపోయాడు. లోపలికి వచ్చి చూసేసరికి, స్వాతి మంచం మీద కూర్చుని మోకాళ్ళ మీద తలవాల్చుకునుంది.
హరీష్... "స్వీటీ... ఏమయిందిరా"
"ఎక్కడికెళ్ళిపోయావు బావా.... నన్నొదిలేసి"
"నేనెక్కడికెళ్తానురా, ఇక్కడే బాల్కనీ లో నిల్చున్నా. పడుకున్నావు కదా, భయపడ్డావా" అంటూ దగ్గరకి తీసుకున్నాడు
"భయపడటం కాదు నిద్రపట్టలేదు"
"పడుకున్నావు కదా, నిద్రపట్టకపోటం ఏంటి"
"మొత్తం నీ వలనే"
"నేనేం చేసానురా"
"రోజూ నీ గుండెల మీద తలపెట్టుకుని, నిన్ను చూస్తూ పడుకోటం అలవాటు చేసేసావు. ఇప్పుడేమో నువ్వు పక్కన లేకపోతే ఎంత నిద్రొస్తున్నా పడుకోలేకపోతున్నాను"
"హాహాహా....... దా బజ్జో" అంటూ స్వాతి పక్కన పడుకుని తన చేయి చాపగానే, స్వాతి తన గుండెల మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది.
"స్వీటీ.. "
"హ్మ్మ్... కృష్ణా..... నీ గుండె చప్పుడు వింటూ ఇలా పడుకోటమంటే చాలా ఇష్టమని తెలుసు కానీ ఇంత అలవాటు పడిపోయానని నాకే తెలీలేదు" అంటూ నిద్రలోకి జారుకుంది.
హరీష్ ఆమె చెక్కిళ్లని ముద్దాడి గట్టిగా హత్తుకున్నాడు. "నాకూ నిన్నిలా హత్తుకుని పడుకోకపోతే నిద్రపోలేను బంగారం". స్వాతి నిద్రలోనే పెదవులపై నవ్వుచేరింది.
పొద్దున్న లేచీ, స్వాతి.... "బావా లేస్తావా.... "
హరీష్.... "ఉహూ" అంటూ నిద్ర లోనే సమాధానమిచ్చాడు. స్వాతి రెండు మూడు సార్లు అడిగేసరికి, అటు పక్కకి తిరిగి పడుకున్నాడు.
స్వాతి.... "రాత్రేమో, నిన్ను పట్టుకుంటే కానీ పడుకోలేనంటూ కబుర్లు చెప్తావు, పొద్దునకేమో అటు తిరిగి పడుకున్నావు. బీచ్ కి వెళదాం అన్నావ్, అక్కడికి వెళ్ళగానే టైమ్ అయిపోయిందని లాక్కొచ్చేస్తావు. కొంచం సేపు కూడా ఆడనీయవు నీళ్లలో" అంటూ హరీష్ కి చెప్తోంది కానీ తనకి వినపడకుండా తనలో తనే మాట్లాడుకుంది
"ఛా... ఏంటిది. పాపం పడుకునుంటే ఇలా లేపేస్తున్నాను. తప్పు కదా" అనుకుంటూ తన చెంపల మీద తనే కొట్టుకుంది. వెంటనే హరీష్ లేచీ కూర్చుని, స్వాతి చెంప మీద చేయి వేసి, "ఏయ్ పిచ్చి..... ఏంటా కొట్టుకోటం. దెబ్బ తగలదూ"
స్వాతి... "సారీ బావా.... లేపేసాను. బీచ్ కి వెళ్ళాలన్న ఆతృతలో బుర్ర పని చేయలేదు. సారీ"
"నేను పడుకోలేదురా, నువ్వు మాట్లాడుతుంటే నవ్వొచ్చి అటు తిరిగాను. అయినా అందుకని అలా కొట్టేసుకుంటావ. మనకి మధ్యాహ్నం వరకూ టైమ్ ఉంది. నీ ఇష్టం వచ్చినంత సేపు ఆడుకోవచ్చు. తొందరేమి లేదు. లే... రెడీ అవుదాము"
"ఆఁహాఁ ఒద్దు..... కొంచం సేపు పడుకోవా. నాకు గిల్టీ గా ఉంటుంది, పొద్దునే లేపేసాను"
"సరే నువ్వూ పడుకో" అంటూ ఇద్దరూ కొంచం సేపు అలాగే కబుర్లు చెప్పుకుని తర్వాత రెడీ అయ్యి బీచ్ కి వెళ్ళారు. అక్కడ స్వాతి, నీళ్ళల్లో ఆడుతూ తనని మొత్తం తడిపేస్తూ, ఆ అల్లరి చూసి హరీష్ కి తను కొత్తగా కనిపించింది.
అక్కడ అలా రోజూకో కొత్త ప్రదేశం చూస్తూ ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. నాలుగు రోజులు తర్వాత....
"స్వీటీ... ఈరోజు అంతా ఇక్కడే బోట్ హౌస్ లోనే ఉంటాము"
స్వాతి... "బావా.... " అంటూ కీచుమని అరిచింది
ఆ అరుపుకి కారణం తెలిసినట్లుగా నవ్వుకుంటూ వెళ్ళి, .. "ఆ... ఏంటిరా"
"చుట్టూ నీళ్ళే..... వావ్..... "
"హహహ... అనుకున్నా, నీకిది నచ్చుతుందని"
స్వాతి అక్కడే అలా కొద్దిసేపు చూస్తూ నిల్చుని, "బావా ఏమైనా మాట్లాడు"
స్వాతిని తన ఒళ్ళో కుర్చోపెట్టుకుంటూ, "నువ్వు చెప్పు.....నీకు నచ్చిందా ఈ ట్రిప్ అంతా"
"చాలా నచ్చింది బావా.... నీ గురించి కొత్త కొత్త విషయాలు తెలిసాయి"
"నా గురించా .... నా గురించీ నేను చెప్తే కానీ నీకు తెలిసే ఛాన్స్ లేదే. అవి నేనూ చెప్పనూ, నీకూ తెలీదు కదా😉😉. ఇంకేముంటాయి 🤔🤔.... అయినా నువ్వు తెలుసుకున్నవేంటో చెప్పూ" అన్నాడు నవ్వుతూ
"అంటే నా దగ్గర దాస్తున్నావ్ కూడానా.... ఏంటో చెప్పవీ ముందరా" అంది బుంగమూతి పెట్టి, తన చుట్టూ వేసిన చేతులు తీసేస్తు
"చూసావా.... చెప్పకుండానే నీకు కోపమొచ్చింది, చెప్పాక ఇంకేం గొడవలొస్తాయో అని భయం అందుకే చెప్పలేదు😜....నువ్వు చెప్పు ఏం తెలుసుకున్నావో, నీ నోటి నుంచి వినాలనుందిరా" అంటూ ఆమె చేతుల్ని మళ్ళీ తన మీద వేసుకున్నాడు
స్వాతి కి హరీష్ సరదాగా అంటున్నాడో లేక మిజంగా దాస్తున్నాడో అర్థం కాలేదు. తను దాస్తున్నాడు అనే దానికన్నా, ఎందుకు దాస్తున్నాడు అనే కుతూహలం మొదలయ్యింది. స్వాతి తన ఆలోచనల్లోంచి బయటకి రాకపోయేసరికి,
"హలో మేడం" అంటూ తన తలతో ఆమె తలని తట్టి, "నేనిక్కడుంటే నువ్వెక్కడికో వెళ్లినట్లున్నావు" అన్నాడు నవ్వుతూ
తనని అలానే చూస్తూ, చిన్నగా నవ్వి.... "మనం కథక్ షో కి వెళ్ళినప్పుడు, వాళ్ళు మేకప్ ఎలా వేసుకుంటారు, ఎలాంటి నగలు పెట్టుకుంటారు, ఆ డాన్స్ చూస్తున్నప్పుడూ నీకు డాన్స్ చాలా ఇంటరెస్ట్ ఏమో అనుకున్నాను. కానీ ఆ కత్తి ఫైట్స్ అవి చూసేటప్పుడూ అంతే ఇంటరెస్ట్.... సో మే బి నీకు ఆర్ట్ చాలా ఇష్టం....అది ఎలాంటిదైనా కూడా. ఎలాంటిదైనా అని ఎందుకన్నాను అంటే, నేను గీసిన పిచ్చి బొమ్మల్ని కూడా నువ్వు బావున్నాయి అంటూ దాచుకున్నావ్ అప్పట్లో. అది గుర్తొచ్చి. ఇంకా.... నీకు అమ్మాయిలు ఎలా ఉన్నా నచ్చుతారు.... "
"ఓయి... అన్నీ బానే చెప్పావు, అమ్మాయిలు నచ్చటం ఏంటి. నేనెవరి వెనక తిరిగాను, అసలు నిన్ను కాకుండా ఇంకెవరినన్నా చూసానా" అన్నాడు ఖంగారుగా
"హాహాహా.... అది కాదు బావా.....కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిలు జీన్స్ అవీ వేసుకుంటే నచ్చదు. నీకు అలా ఏమి ఉండదు కానీ మగరాయుడులా ఉండేవాళ్ళంటే చికాకు. సరదాగా ఉండాలి కానీ లిమిట్ క్రాస్ చేయకూడదని నీ ఉద్దేశం"
"అదెలా చెప్పగలవురా"
"వాటర్ఫాల్స్ దగ్గర నువ్వు ఎంత మందిని విసుక్కోటం చూడలేదు. వాళ్ళు నిన్ను చూస్తుంటే నువ్వేమో ఆల్రెడీ నేను బుక్డ్ అని చెప్పటానికన్నట్లు నన్ను గట్టిగా పట్టుకునే వాడివి"
"ఆమ్మో బానే తెలుసుకున్నావ్. నువ్వప్పుడు అవేవీ గమనించలేదనుకున్నా... "
"నేనే మూడ్ లో ఉన్నా, గమనించనట్లు ఉంట్లా కానీ చూస్తూనే ఉంటా"
"హహహ... సరే.... ఇంకా....."
"ఇంకా అంటే, నీకు నేను చీర కట్టుకుంటే నచ్చుతుంది"
"అవును... నువ్వు చాలా ముద్దొస్తావురా. ఇంకా ఏం తెలుసుకున్నావ్"
"ఇంక అన్నీ చెప్పేయరూ.... నువ్వు చెప్పు"
"నీ గురించీ నాకు తెలీనిదేమి లేదురా..... అనే అనుకున్నా కానీ .... నీకు నీళ్ళు చూస్తే చాలా ఇష్టం. అది వాటర్ఫాల్స్ కానీ బీచ్ కానీ లేక మన ఊళ్ళో ఉన్న మూసి నదైనా ఓకే నీకు. నీళ్లుంటే చాలు"
"అలా ఏమి కాదు, నీళ్ళని ఎంజాయ్ చేయాలి కదా అలా కంపు కొడ్తుంటే ఎలా"
"సరేలే మూసి నది కాదులే పోనీ, టీ ఎస్టేట్స్ కి వెళ్ళినప్పుడు అలా చూస్తూ ఉండిపోయావు.. నాకు ఆర్ట్ అంటే ఇష్టం అన్నావ్ కదా నీకు నేచర్ తో ఉండటం అంటే చాలా ఇష్టం. నీలో ఎప్పుడూ చూడని కొత్త మనిషిని చూసాను.. మీ అన్నయ్యతో అత్తయ్యా వాళ్ళతో ఉన్నప్పుడు చిన్న పిల్లలాగే కనిపిస్తావు కానీ నీళ్లలో ఉంటే ఇంకా అల్లరి చేస్తావు, నేచర్ ని నీలాగ ఎంజాయ్ చేసేవాళ్ళని నేను చూడనే లేదు"
"నువ్వూ నన్ను చిన్న పిల్లంటున్నావ్ ".... "సరేలే... ఇంకా చెప్పు ఏమైనా, లేదా ఏమైనా అడుగు"
"ఏమడగాలి, నువ్వే అడుగు. మనమేదైనా ఇప్పుడే కలిసామేంటి. చిన్నప్పటి నుంచి చూస్తున్నా నిన్ను"
"ఎందుకుండవు ఉంటాయి. నాకైతే నీ గురించీ ఏమి తెలీదు. చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగావు, మన వాళ్ళతో ఎలా ఉంటావు, అత్తయ్యా మావయ్య ని ఎలా చూస్కుంటావు, నేనంటే నీకెంత ఇష్టమో తప్పించి ఇంకేమి తెలీవు" అంది నవ్వుతూ
"సరే ఏం తెలియాలో అడుగు చెప్తాను" అన్నాడు తన మెడ ఒంపుల్లో ముద్దు పెడుతూ
"బావా.... నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా"
"నువ్వు తప్ప ఇంకెవరూ లేరు" అన్నాడు స్వాతి నడుం చుట్టూ తన చేతిని బిగిస్తూ
"కాదు, నాకన్నా ముందర"
"ప్రియా తప్ప ఇంక ఏ అమ్మాయిలతో అంత పరిచయాలు లేవు. తనని నువ్వు కలిసావు. అంతే ఇంక"
"తను ఫ్రెండ్..... అది కౌంట్ కాదు"
"అయితే ఇంకెవరూ లేరు"
"బాగా ఆలోచించు, నువ్వు ఎవరినైనా ముద్దు పెట్టావేమో, నిన్నెవరైనా ముద్దుపెట్టారేమో, లేదా..."
"స్వీటీ..... నువ్వేం ఆన్సర్ ఎక్సపెక్ట్ చేస్తున్నావు. నువ్వు హ్యాపీ అవుతా అంటే చాలా మందున్నారు అని చెప్తాను కానీ నా లైఫ్ లో నువ్వు తప్ప నన్ను ఎవరూ టచ్ చేయలేదు" అన్నాడు కొంచం అసహనంగా
"సరే.... సరే.... ఎందుకంత కోపం"
"కోపమేమి లేదు. వేరే ఏమైనా మాట్లాడు"
"సరే..... పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటున్నా కానీ అడగటం మర్చిపోయా, ప్రియా రాలేదేం పెళ్ళికి"
"తను జాబ్ లో జాయిన్ అయ్యింది. కొత్త జాబ్ కదా, లీవ్ దొరకలేదు. వాసు కేమో నేను దాన్ని పిలిచానని కోపమొచ్చింది"
"ఎందుకూ"
"అప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టింది కదా. దానికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసీ ఇంకా దానితో టచ్ లో ఉండటం అవసరమా అని తిడతాడు"
"సరే వాసన్నయ్య సంగతీ పక్కన పెట్టు, నువ్వేమనుకుంటున్నావ్"
"ఏమో స్వీటీ.... తను ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్. అదలా బిహేవ్ చేయటం తప్పే. కానీ దానికి సారీ చెప్పింది కదా. మనమూ మళ్ళీ దానికి ఒక ఛాన్స్ ఇయాలని నా అభిప్రాయం. దానికి మాత్రం ఫ్రెండ్స్ ఎవరున్నారు. నేనూ వాసునే. వాడేమో నన్ను మాట్లాడద్దన్నాడు. వాడికి కోపం తెప్పించి ఇటు నిన్ను బాధపెట్టి... అవసరమా ఇదంతా అని నేనూ ఊరుకున్నా"
"మరి తనకి జాబ్ వచ్చిందని నీకెలా తెలిసింది"
"తనే మెసేజ్ పెట్టింది. ఇదీ రీసన్. పెళ్ళికి రాలేకపోయాను సారీ అంటూ. నెక్స్ట్ మంత్ ఎప్పుడో వచ్చి కలుస్తా అంది"
"అయినా కూడా నువ్వు రిప్లై చేయలేదా"
"లేదురా... "
"బావా.... వాసన్నయ్య మన మధ్యన తన వలన డిస్టర్బన్స్ రాకూడదని అన్నాడు. తనని నేను తప్పు పట్టను. కానీ, ప్రియా నీకు మంచి ఫ్రెండ్. నా వలన మీ ఫ్రెండ్షిప్ పాడవటం నాకిష్టం లేదు. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు"
"స్వీటీ...."
"బావా... నేను పోసేస్సివ్వే నీ విషయంలో, జెలసి కూడా ఉంటుంది కానీ వాటికన్నా ఎక్కువ నా ఫీలింగ్స్ ని నేను చెప్పకుండానే నువ్వు అర్థం చేస్కోగలవు, నన్ను బాధపెట్టవని నమ్మకముంది. అదీ ఒక రీసన్ ఏమో, నేనిలా చెప్పటానికి"
"సరేలే.... తను మళ్ళీ మెసెజ్ చేసినప్పుడు ఆలోచిద్దాం. ఈ టాపిక్ నీ దగ్గర చెప్పకుండా తప్పు చేస్తున్నానా అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు రిలాక్స్డ్ గా అనిపిస్తోంది"
స్వాతి చిన్నగా నవ్వింది. హరీష్ కి మూడ్ మార్చటం కోసం.. "బావా... నువ్వు నన్ను అడగనే లేదు, నాకెవరన్నా ఉన్నారా అని"
"హాహా.... నీకా.... మీ అన్నని దాటుకుని నీ దగ్గరకి ఎవరొస్తారు"
"ఉన్నారు" అంది అదేదో హరీష్ తనని అవమానించినట్లుగా
"ఎవరు" హరీష్ ప్రశ్న లో ఆశ్చర్యం లేదు, అనుమానము లేదు. స్వాతి "ఉన్నారు" అనగానే వచ్చే నవ్వుని ఆపుకుని సీరియస్ గా ఉండటానికే ప్రయత్నిస్తున్నాడు పాపం.
"మనోజ్ అని మా కాలేజే. ఇంటర్ నుంచి పరిచయం"
హరీష్ గట్టిగా నవ్వి.... " ఇందాక ఫ్రెండ్స్ కౌంట్ ఆవరన్నావ్ కదా"
"మనోజ్ నాకు ప్రొపోజ్ చేసాడు"
"ఆహా.... నువ్వు రిజెక్ట్ కూడా చేసావ్ కదా. నీకు తెలీని ఇంకో విషయం చెప్పనా. తనని నేను ఆల్రెడీ మీ కాలేజ్ లో ఒకసారి కలిసాను. తన నెంబర్ కూడా ఉంది నా దగ్గర.... అందుకని ఇంకేమన్నా చెప్పు కథలు"
"నీకు నా గురించి అన్నీ తెలుసూ. నాకే ఏమి తెలీవు. తెలీనీకుండా దాస్తున్నావు"
"నేనేమి దాచానురా"
"నాకేం తెలుసూ.... ఇందాక నువ్వే చెప్పావు. నువ్వు చెప్తే కానీ నాకు తెలీవు అని" అంది బుంగమూతి పెట్టి
"సరే చెప్తాను.... కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని ఆలోచిస్తున్నా"
"ఏంటి బావా అదీ.... "
"............."
హరీష్ చెప్పింది విన్నాక అప్పటి వరకు స్వాతి మొహం లో ఉన్న నవ్వు మాయమయింది. తన ఒడిలో కూర్చున్నది లేచీ డెక్ దగ్గరకి వెళ్ళి నిల్చుంది. ఉబికి వస్తున్న కన్నీటిని దాచటానికి ప్రయత్నిస్తోంది
Comments
Post a Comment