53
స్వాతి.... "హలో నాన్నా.... ఎలా ఉన్నారు"
రామ్ గారు.. "బావున్నాము తల్లీ. నువ్వెలా ఉన్నావురా. అక్కడంతా బావుందా"
"నేను బావున్నాను. మీరేంటి డల్ గా ఉన్నారు"
"డల్ ఏమిలేదురా. హరీ ఎలా ఉన్నాడు"
"బావ కూడా బావున్నారు. నాన్నా, మీరు ఇంట్లోనే ఉన్నారా"
"ఇంట్లోనే ఉన్నాము. వస్తున్నారా తల్లి"
"రావాలనుంది .... మిమ్మల్ని చూడాలనుంది నాన్నా"
"రారా బంగారు. ఇంట్లోనే ఉన్నాము. వచ్చేయండి"
"బావని అడుగుతాను. సాయంత్రం ప్రయాణం కదా, ఏమనుకుంటాడో అని ఆలోచిస్తున్నా. అడిగి మెసేజ్ చేస్తాను వచ్చేదుంటే"
"తనని ఇబ్బంది పెట్టకమ్మా. నీకు కుదరకపోతే మేమే వచ్చి కలుస్తాము"
"అలాగే నాన్న "
"సరేనమ్మా..... జాగ్రత.... ఉంటాను"
పద్మ గారు ఆయన మాటలు వినీ, "వస్తోందా అదీ"
"రావాలనుంది, ప్రయాణం కదా ఇప్పుడిక్కడికి వస్తా అని హరిని అడగటానికి మొహమాట పడుతోంది"
"దీని మొహమాటం ఏంటో. సరేలెండి ..... అది మాట్లాడింది కదా, కొంచం తృప్తి గా ఉందా"
"పెళ్ళయ్యి అప్పుడే పది రోజులైపోతోంది పద్మా. కానీ పొద్దున్న మనమందరం కూర్చున్నప్పుడు అది మన పక్కన లేదని తల్చుకోకుండా ఉండలేకపోతున్నాను, ఇంటికి రాగానే ఎదురయ్యేది, మీరందరూ ఉన్నా ఏదో లోటు అనిపిస్తోంది. ఫోన్ లో మాట్లాడినంత మాత్రాన ఆ బెంగ తీరిపోదు కదా"
"మీకే అలా ఉంటే రోజంతా ఇంట్లో ఉండేదాన్ని, నేనెవరికీ చెప్పుకోనండి. కానీ అలా అని మీరు బెంగ పెట్టుకునీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయటం ఏమి బాలేదు"
"నేనేం నిర్లక్ష్యం చేసాను, కొంచం నీరసంగా ఉంటోంది. అంతే కదా. దానికంత ఖంగారు ఎందుకు"
హరీష్ ఇంట్లో ........
"బావా.... సూట్ కేసు సద్దేసాను. చిన్న చిన్నవి కావాల్సినవి లిస్ట్ రాసాను. అలాగే అత్తయ్య ఇంట్లో కావాల్సినవన్నీ కూడా లిస్ట్ ఇచ్చారు. ఇంకా ఏమైనా పనులున్నాయా వెళ్ళేలోపు నేను చేసేవి"
"మరి లిస్ట్ లో సామానులు తెచ్చుకోవాలంటే బయటకి వెళ్ళాలి కదా. అయినా నువ్వెంటి ఏదో హడావిడిలో ఉన్నావు"
"ఆహా హడావిడేమి లేదూ. ఇప్పుడు బయటకి వెళ్ళాలా అయితే" అంటూ దిగాలుగా పెట్టింది
"ఏంట్రా..... నీకేం కావాలో చెప్పు"
"నాన్నని చూడాలనుంది చాలా. పనులన్నీ త్వరగా చేసేస్తే తీస్కెళతావేమో అనుకున్నా. పోనీ వాళ్ళనే రమ్మందామంటే బయటకి వెళ్ళాలంటున్నావ్" అంది బాధగా
"మావయ్యగారిని చూడాలనుంటే ఆ మాట చెప్పాలి కదరా ముందర. ఇవన్నీ చేస్తేనే తీసుకునివెల్తా అనలేదు కదా. సరేలే. రెడీ అవ్వు. నిన్ను అక్కడ దింపేసి మీరు కబుర్లు చెప్పుకునేలోపు నేను వెళ్ళి సరుకులు తీస్కుని మళ్ళీ వస్తాను. సరేనా "
"ఆ.... మరి నువ్వొక్కడివే వెళ్తావు కదా షాపింగ్ కి. ఒద్దులే నేనూ వస్తా"
"ఈలోపు నన్నెవరూ ఎత్తుకుపోరులే. ఏం పర్వాలేదు"
"నిన్ను ఎత్తికెళ్లినా నీ ప్రేమని తట్టుకోలేక నాకే ఇచ్చేస్తారు" అంది నవ్వుతూ
"స్వీటీ..... రేపటి నుంచి నీకు చుక్కలే"
"ఆహా... నేనేమనలేదు బావా. అనుకోకుండా నిజాలు బయటకి వచ్చేసాయి" అంది నవ్వుతూ
"అదే.....అదే బాగా నవ్వుకో ఇప్పటికైతే. ముందరైతే రెడీ అయ్యి బయల్దేరు, అమ్మ కి చెప్పేసి వస్తా"
"ఏం చెప్తావ్ బావ... నిన్ను తట్టుకోవటం కష్టమనా లేక నువ్వు నాకు చుక్కలు చూపిస్తా అన్న విషయమా "
"స్వీటీ..... రేపటి వరకూ కాదు ఇప్పుడే అయిపోయావురా నా చేతిలో" అంటూ తన మీదకి దూకి ఆక్రమించేసుకున్నాడు
"కృష్ణా... ఇప్పుడొద్దు. బయటకి వెళదాం అన్నావ్ కదా. ఇక్కడ ఆడుతూ ఉంటే తర్వాత లేట్ అయిపోతుంది" అంది బతిమాలుతున్నట్లుగా
స్వాతి చేతులు కదలకుండా బిగించి "సారీ చెప్పు.... వదిలేస్తా"
తనకి అంత దగ్గరగా ఉన్న హరీష్ ని చూస్తూ మైమరచిపోయి, "కృష్ణా.... లవ్ యూ రా" అంది కళ్ళలోకి చూస్తూ రెప్పవేయడం కూడా మర్చిపోయి
స్వాతి అలా చెప్పగానే, తన చేతులని విడిచిపెట్టి తన మొహాన్ని దగ్గరకి తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు. స్వాతి హరీష్ ని చుట్టేసి తనని కౌగిట్లో బంధించేసింది.
హరీష్ ప్రేమగా..... "స్వీటీ... "
స్వాతికి అతని మనసులో మాట తెలిసినట్లుగా, "నీ కళ్ళలో ఏదో మాయ ఉంది కృష్ణా. ఆ కళ్ళని చూస్తే, నా మనసే కాదు నాకు నేను కూడ వశం తప్పుతాను. మొదటి సారి కూడా నీపై నా మనసులో మాటల్ని పెదాల మీద తెచ్చేసాయి. ఇప్పుడూ అదే అయ్యింది" అంది సిగ్గుపడుతూ.
"నా కళ్ళలో ఉన్న మాయ కాదురా, అది నీ మనసులో నాపై ఉన్న ప్రేమ. నువ్వు ఎంత దాచాలనుకున్నా అది దాగదు..... స్వీటీ... ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా.... ఇలా బావుందిరా"
"అయ్యో మర్చేపోయాను చూసావా. ఇలాగే ఉంటుంది నీతో ఉంటే. లే వెళదాము" అంటూ తొందర చేసింది
ఇద్దరూ రెడీ అయ్యి, పద్మగారి ఇంటికి వెళ్ళారు. పద్మగారిని చూడగానే ఆవిడని పట్టుకుని ఏడ్చేసింది.
పద్మగారు స్వాతిని చూడగానే, ... "ఎలా ఉన్నావు తల్లీ. ఎందుకురా ఏడుపు. చిన్న పిల్లలాగా. కళ్ళు తుడుచుకో. మా తల్లివి కదూ"
"పది రోజులైపోయింది చూసీ. మీకసలు నేను గుర్తే రానా. ఒక్కసారి కూడా రాలేదు"
రామ్ గారు.... "అదేంటమ్మా.... నువ్వు గుర్తు రాకుండా ఎలా ఉంటావురా. అయినా లోపలికొస్తూనే అలా ఏడవచ్చా నాన్నా" అంటూ ఆయన దగ్గరకి తీసుకున్నారు. అప్పటి వరకూ అక్కడే ఉన్న హరీష్ ని ఎవరూ గమనించనే లేదు.
అన్విత.... "అన్నయ్యా బావున్నావా" అనేసరికి పద్మ, రామ్ గారు హరీష్ వైపు చూసీ, "హరీ, చూస్కోలేదురా. ఎలా ఉన్నావ్"
"బావున్నాను"
అన్విత.... "అదలా చిన్న పిల్లలా ఏడుస్తుంటే నువ్వు మాత్రం ఏం చేయగలవత్తయ్యా"
ప్రదీప్..... "ఎవరినే అంటున్నావ్. అది మాకెప్పుడూ చిన్నపిల్లే. కదరా చిన్నూ"
స్వాతి.... "అన్నయ్యా" అంటూ ప్రదీప్ భుజం పట్టుకుని, "చూడు మీ ఆవిడ ఎప్పుడూ నన్నేదో ఒకటో అంటూనే ఉంటుంది"
ప్రదీప్ స్వాతిని బుజ్జగిస్తూ... "చిన్నూ, మరి నువ్వలా ఏడవటం బావుందా చెప్పు. నువ్వు నవ్వుతూ వస్తే మాకూ బావుంటుంది కదా. అక్కడ బావ పరిస్థితి చూడు, ఎలా ఖంగారు పడిపోతున్నాడో" అంటూ నవ్వాడు
హరీష్.... "తను యేడ్చినందుకైనా ఎక్కువ, ఎందుకు ఏడుస్తోంది అంటూ నలుగురూ నా మీద ఎటాక్ చేస్తారేమో అని ఎక్కువ భయమేసింది బావ" అంటూ నవ్వేసాడు
స్వాతి హరీష్ ని కోపంగా చూసీ, "ఆవునూ నువ్వెప్పుడొచ్చావు అన్నయ్యా"
అన్విత.... "యే అదే మాట నేను కనిపించినప్పుడు అడిగావా. తను రాగానే అడుగుతున్నావ్ కానీ. నువ్వడగక పోయినా నేనే చెప్తా, మేమూ ఇందాకే వచ్చాము"
స్వాతి ఒక వెర్రి నవ్వు నవ్వి, "హీహీ.... అప్పుడు గుర్తు రాలేదు" అంటూ ప్రదీప్ వెనకాల దాక్కుంది.
రామ్ గారు.... "నాన్నా వాళ్లెలా ఉన్నారు. పెళ్ళి అలసట తగ్గిందా హరీ."
"ఆ బానే ఉన్నారు మావయ్యగారు", "బావా.... మీ ట్రిప్ ఎలా అయ్యింది"
ప్రదీప్ అందరి వైపు చూసీ మొహమాటంగా, ... "బానే అయ్యింది బావా"
స్వాతి..... "అబ్బో ఎవరో సిగ్గుపడ్తున్నారే" అంటూ ప్రదీప్ ని ఆటపట్టించింది
అన్విత స్వాతి కి మాత్రమే వినిపించేలాగా.... "ఆడుకో, నువ్వూ వెళ్తున్నావా కదా. వచ్చాకా మీరిద్దరూ దొరకకపోతారా, అప్పుడు మేము ఆడుకోకపోతామా"
వెంటనే స్వాతి సైలెంట్ అయిపొయింది. ఇంతలో హరీష్ స్వాతికి కళ్ళతోనే చెప్పి, "మావయ్యగారు... కొంచం పనులు ఉన్నాయి. నేను బయటకి వెళ్లివస్తాను" అంటూ లేచాడు
"ఆగు బావా.... ఒక్కడివే...." స్వాతికి ఇంట్లో ఇదే మాట అన్నప్పుడు జరిగిన విషయం గుర్తొచ్చి, "నేనూ వస్తాను. వెళదాములే"
హరీష్, స్వాతి ఎందుకలా తడబడిందో అర్ధమయ్యి నవ్వుకుంటూ, "పర్వాలేదురా. నువ్వు అందరితో కొంచం సేపు టైమ్ స్పెండ్ చేయి. నేను మళ్ళీ వస్తాను" అంటూ వెళ్ళిపోయాడు
"ఏంటే ఇప్పుడే వచ్చావు మళ్ళీ వెళ్ళిపోతా అంటున్నావు"
"అది కాదే, పాపం ఒక్కడు షాపింగ్ కి వెళ్తే బోర్ కొడ్తుంది కదా అని వెళ్తా అన్నాను..... అయినా ఏంటే ఇందాక నన్ను చిన్న పిల్ల అంటున్నావ్. పోనీలే బావ ముందర ఎందుకని ఊరుకున్నా. అన్నయ్యా ఊరుకుంటావేంటి అడుగు గట్టిగా"
ప్రదీప్... "చిన్నూ..... నేనూ అదే అనుకుంటున్నా. ఇందాక ఏంటిరా అన్నావు. నిన్ను మర్చిపోయామా. మళ్ళీ చెప్పు" అన్నాడు కోపంగా
"నాన్నా..... వీళ్ళిద్దరూ చూడండి నన్ను కోప్పడుతున్నారు" అంటూ రామ్ గారి పక్కకి చేరింది
రామ్ గారు.... "నా బంగారు తల్లిని ఎవరూ ఏమనరమ్మా. ప్రదీపు దీన్ని ఏమైనా అంటే ఊరుకోను"
ప్రదీప్, అన్విత నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయారు.
"చెప్పరా తల్లి...... ఎలా ఉన్నావు"
"నేను బావున్నాను నాన్నా. మీరెలా ఉన్నారు. ఎందుకలా డల్ గా ఉన్నారు. మీ హెల్త్ ఎలా ఉంది"
"బానే ఉందిరా. నీరసంగా ఉంటోందంతేరా బంగారం"
"అదేంటి, డాక్టర్ దగ్గరకి వెళ్ళారా. అమ్మా నువ్వైనా చెప్పలేదేం"
"ఏం చెప్పనే. ఏం పర్వాలేదు, చెప్పక్కర్లేదంటారు. ప్రదీప్ తోనే మాట్లాడనీయటం లేదు. ఆ బీపీ ఎలా ఉందొ ఏంటో చూపించుకోమంటే వినరు" అంటూ బాధపడ్డారు
"ఇప్పుడు నేనొచ్చా కదా. నాన్నా ఏంటసలు. మీరు మాకు చెప్పాల్సిందిపోయి మీరే ఇలా పట్టించుకోకపోతే ఎలాగా" అంటూ ప్రదీప్ ని పిలిచింది.
"ఇప్పుడు వాడెందుకమ్మా. తగ్గిపోతుందిలే. నిన్నటి వరకూ ఇంట్లో మేమిద్దరమే ఉండేసరికి, కొంచం బెంగగా అనిపించింది. అన్నయ్య వాళ్ళు వచ్చేసారు కదా. అదే సద్దుకుంటుంది"
ఇంతలో ప్రదీప్.... "ఏంటి చిన్నూ"
"అన్నయ్యా నాన్నకి నీరసంగా ఉంటోందిట. కొంచం బాలేదు. నీకు కుదిరితే ఒకసారి డాక్టర్ దగ్గరకి వెళదామా"
"అదేంటి నాన్నా నాతో చెప్పనే లేదు. ఎలా ఉంది అసలు. సరేలెండి ఇప్పుడే బయల్దేరుదాము, పదండి. చిన్నూ నువ్వు అమ్మతో ఉండరా ఇంట్లో. అన్వి నేను వెళ్తున్నాము. బావ వస్తే ఉండటానికి ట్రై చేయి. వచేస్తాము. " అంటూ బయల్దేరారు
"ఖంగారు పడకులే అమ్మా. అన్నయ్య చూస్కుంటాడులే. నువ్వు చెప్పు ఏమైనా కబుర్లు"
"నా కబుర్లెముంటాయి. ఇంట్లో పని అదే సరిపోతోంది. నువ్వు వెళ్ళాకా ఎలా ఉన్నావో అని బెంగ తప్పించి ఇంకేమి లేవురా మాకు"
"నాకేంటమ్మా బానే ఉన్నాను. ఫస్ట్ టూ డేస్ కొంచం అత్తయ్యకి, నాకూ ఇద్దరికీ అడ్జస్ట్ అవటానికి టైమ్ పట్టింది. కానీ అత్తయ్యా చాలా బావుంటుందమ్మా. "రోజూ చీరలే కట్టుకోవాలని నేనేం చెప్పలేదు కదా. పెళ్ళికి ముందర డ్రస్సులు వేస్కునేదానివిగా, అలాగే వేసుకో. ఇంట్లో కూడా చుడీదార్లు వేసుకోవచ్చు" అని చెప్పింది. ఈరోజే అసలు నేను డ్రెస్ వేసుకోటం. పైగా పొద్దున్న ఇక్కడికొస్తున్నా అంటే జీన్స్ తెచ్చుకో, ఊరు తీస్కెల్దువుగానీ అని సలహా ఇచ్చింది" అంది నవ్వుతూ
"పొనీలేవే నీతో బావుంటే అది చాలు మాకు. మరి ఏమేమి కావాలో తీసి ఎదురుగా పెట్టుకో, వెళ్ళేటప్పుడు హడావిడిలో మర్చిపోతావు"
"సరేలే అమ్మా....ఇంకా"
"చూడు నాన్నా, ఎక్కడికీ వెళ్ళినా హరీష్ పక్కనే ఉండు, తనని వదిలేసి ఏవో చూస్తూ ఉండిపోకు. ఏదైనా ఇబ్బందనిపించినా అవసరం ఉన్నా తనతో మాట్లాడు. మొహమాటపడకు. అలాగే విసిగించకు. తనకి మూడ్ బాలేకపోతే కొంచం సేపు నెమ్మదిగా ఉంటే సద్దుకుంటారు. వాడేదైనా కోపం లో మాట అన్నా కూడా ఏది మనసుకి తీసుకోకు, ఎదురు చెప్పకు. ప్రతీది నీకు నచినట్లే జరగాలని లేదు కదా, నచ్చకపోయినది చేయాల్సి వచ్చినా, నువ్వు సద్దుకోవటంలో తప్పులేదు. ఏదీ తెగేవరకు తెచ్చుకోకు"
"అమ్మా ఎందుకివన్నీ చెప్తున్నావు ఇప్పుడు. నేనలా బావని ఏమి సతాయించను. బావ కానీ అత్తయ్యా వాళ్ళు కానీ ఏమైనా చెప్పారా "
"ఎవరూ ఏమి అనలేదమ్మా. నేనే చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండు అని"
"సరే...."
హరీష్ రావటం "వెళదామని" అడగటం జరిగిపోయాయి
"బావా నాన్న కోసం ఆగుదామా, హాస్పిటల్ కి వెళ్ళారు"
"అదేంటి. ఏమైయింది"
ప్రదీప్ వాళ్ళు లోపలికి వస్తూ, "బీపీ కొంచం ఎక్కువుంది అంతేట. వేరే టెస్ట్స్ చేశారు. అన్నీ నార్మల్ ఉన్నాయి"
రామ్ గారు..... "ఈ తిరుగుళ్ళకి దానికి కొంచం అటు ఇటు అవుతుందీ. కొన్ని రోజులైతే మళ్ళీ సద్దుకుంటాయి. వీళ్ళేమో భయపడిపోతున్నారు" అన్నారు నవ్వుతూ
"మరి మాకు భయముండదేంటి"
పద్మగారు ..... "సరేలే, నాన్న వాళ్ళు కూడా వచ్చారు కదా. మీకు పనులు ఉంటాయేమో బయల్దేరండి నాన్నా. జాగ్రత్త"
రామ్ గారు.... "అవునమ్మా.... పనులు చూస్కోలే ..... జాగ్రత్తగా వెళ్ళిరండి. బావ చేయి వదలకు. తనతోనే ఉండు"
అన్విత, స్వాతి హరీష్ కి మాత్రం వినిపించేలాగా, "అవును అసలే చిన్న పిల్ల కదా జాగ్రత్త అన్నయ్య" అంటూ నవ్వింది
అక్కడనుండి స్వాతి హరీష్, ఇంటికి వెళ్ళి సాయంత్రానికి కేరళ బయల్దేరారు.
Comments
Post a Comment