52
ప్రదీప్ మెసేజ్... "చిన్నూ ఎలా ఉంది బావా"
హరీష్ దానికి రిప్లై చేసాడు...."నిన్న వచ్చాక కొంచం సేపటికి సద్దుకుంది బావ. నేను నీతో ఒక్క సారి మాట్లాడాలి తర్వాత"
స్వాతి రెడీ అయ్యి వచ్చి హరీష్ పక్కన కూర్చుంది. హరీష్ తనని దగ్గరికి తీసుకొబోతుంటే, "బావా... ఫ్రెష్ అయ్యిరా ముందర. లేవగానే ఫోన్ చూస్తున్నావు"
"మరేం చేయమంటావు, నిన్ను చూద్దామంటే నేను లేచేసరికి వాష్రూమ్ లో కి దూరుతున్నావు, అయినా నువ్వు మాత్రం లేవగానే ముద్దు పెట్టుకోవట్లేదేంటి. ఒక్క ముద్దురా... "
స్వాతి .... "కృష్ణా.... మారం చేయకుండా ఫ్రెష్ అయ్యిరా... లే....కావాలంటే అప్పుడు ముద్దు పెట్టుకోలే"
హరీష్ వాష్రూమ్ లో కి వెళ్తూ, "ముద్దు కోసం ఎంతలా బతిమాలించుకుంటున్నావురా. దీనికి వచ్చి పనిష్మెంట్ ఇయ్యకపోతే చూడు"
స్వాతి నవ్వుకుని కిందకి వెళ్ళింది. ఎవరూ ఇంకా లేవకపోవటంతో, దేవుడి దగ్గర దీపం పెట్టుకునీ, హరీష్ కి టీ ఇద్దామనుకుని, అత్తయ్య ఇప్పుడే వంట చేయకూడదని చెప్పటం గుర్తొచ్చి హరీష్ దగ్గరకి వెళ్ళింది.
హరీష్ స్నానం చేసి వచ్చి రెడీ అవటం చూసీ, "కృష్ణా.... ఇప్పుడు చెప్పు.... ఇందాకేదో చెప్తున్నావు" అంటూ చుట్టేసింది
"ఇందాక ఒక్క ముద్దు అడిగితే పొమ్మన్నావ్ కదా, ఇప్పుడొచ్చి చెప్పూ... అంటున్నావ్. నేనేమి చెప్పేది లేదు, నాకూ ఏమక్కర్లేదు"
హరీష్ ని హత్తుకుని ఉన్న స్వాతికి తనలా మాట్లాడేసరికి, అతనికి కోపమొచ్చిందని తన మీద చేతులు తీసి, జరగబోయింది. హరీష్ వెంటనే తనని వెళ్ళనీయకుండా పట్టుకుని,
"ఎక్కడికీ వెళ్ళిపోతున్నావ్.... వద్దంటే వెళ్ళిపోతావా, బుజ్జగించాలి.... బంగారం. అన్నీ నేనే నేర్పించాలంటే ఎలారా" అంటూ దగ్గరకి తీసుకున్నాడు
కొద్దిసేపటికి, "స్వీటీ, నేను బయటకి వెళ్ళొస్తానురా. ఒక అరగంటలో వచ్చేస్తాను"
"అదేంటి బావ సడన్ గా, అదీ ఇంత పొద్దునే"
హరీష్ నవ్వి... "నేను ఇందాకే రెడీ అయ్యాను, నువ్వే నన్ను కదలనీయలేదు. త్వరగా వచేస్తానురా"
"సరే... బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికీ అని అడక్కూడదు అందుకే అడగను"
"గుడ్" అంటూ వెళ్ళబోయాడు
"కానీ అత్తయ్యా వాళ్ళు అడిగితే ఎక్కడికెళ్లావని చెప్పను"
"స్వీటీ..... నీకు తెలివితేటలు ఎక్కువైపోయాయి. నీకూ తెలీదని చెప్పు" అన్నాడు నవ్వుతూ
కిందకి వచ్చేసరికి, సత్య గారు, ఆవిడ చెల్లెలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు
"ఏంటమ్మా, పొద్దునే కబుర్లు మొదలెట్టారు. ఏముంటాయి అసలూ అన్ని కబుర్లు"
"మావేముంటాయిరా. మాములేను. లేచి, వచ్చి కూర్చున్నాము. నువ్వెంటి ఎక్కడికో బయల్దేరావు పొద్దునే"
"అమ్మా బయటకి వెళ్ళొస్తాను. ఒక అరగంట లో వచేస్తాను"
"టీ అయినా తాగి వెళ్ళరా"
"వచ్చి తాగుతానులే" అంటూ బయటకి వెళ్ళిపోయాడు
వాళ్లిద్దరూ స్వాతి వైపు చూసారు తనకన్నా సమాధానం తెలుసేమో అన్నట్లుగా
"నాకూ చెప్పలేదత్తయ్యా" అంది వాళ్ళడగక ముందరే
సత్య గారు "హాహా.... సరే స్వాతి. వాడెప్పుడూ అంతే, చెప్పడు. వచేస్తాడులే"
స్వాతి.... "సరే" అంటూ వాళ్ళ దగ్గర కూర్చుంది
హరీష్... ప్రదీప్ కి ఫోన్ చేసి, "బావా.... నీతో పర్సనల్ గా మాట్లాడాలి. బయటకి రాగలవా"
"ఇంటికి రా బావా. ఇంట్లో ఎవరూ లేరు. అన్వితనే ఉంది"
"అదేంటి అత్తయ్య వాళ్ళు..?? "
"వాళ్ళు ముగ్గురూ తెల్లారకుండానే బయల్దేరారు"
"సరే అయితే.... మీ సందు చివర్లోనే ఉన్నా. వచ్చేస్తున్నా" అంటూ ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళాడు
ఇంటి దగ్గర కార్ ఆపగానే, ప్రదీప్... "ఏంటి బావా... సందు చివరుండి ఫోన్ చేస్తున్నావ్. ఇంటికి రావచ్చు కదా"
"లేదు బావ. నిన్న ఏమయిందో మాట్లాడాలి. ఇంట్లో అందరూ ఉంటే కుదరదని బయటకి వెళదాం అన్నాను"
"పర్వాలేదులే బావ. ఇప్పుడింట్లో ఎవరూ లేరులే. రా. అన్వికి కూడా రావద్దని చెప్తాను"
"అన్వి ఉంటే ఓకే. కానీ నేను ఇక్కడికొచ్చినట్లు స్వాతికి తెలీనీకుండా ఉంటే చాలు. లేకపోతే నన్ను చంపేస్తుంది, తీసుకునిరాకుండా వచేసానని"
"హహహ... మరి దాన్ని తీసుకునిరావచ్చు కదా" అంటూ లోపలికి వెళ్ళారు
అన్విత.... ప్రదీప్ కి కాఫీ ఇచ్చి, హరీష్ కి, తనకి టీ తెచ్చుకుంది.
"నిన్న అసలూ ఏమయిందో కనుక్కుందామని వచ్చాను. తను ఉంటే నువ్వు చెప్పవేమో అని డౌట్ వచ్చి నేనొక్కడినే వచ్చా"
అన్విత.... "మీరు మాట్లాడుతూ ఉండండి. నేను లోపలుంటాను" అంటూ లేవబోయింది
హరీష్..... "పర్వాలేదు అన్వి కూర్చో. నీ దగ్గర దాచేటంత ఏమి లేవులే"
అన్విత ప్రదీప్ ని చూసింది. ప్రదీప్ కళ్ళతోనే ఉండమని చెప్పటంతో కూర్చుంది. ప్రదీప్, ముందు రోజు స్వాతి బాధపడటం గురించి మొత్తం అంత చెప్పాడు.
హరీష్...... "బావా.... ఇంత జరుగుతున్నప్పుడు పక్క రూమ్ లోనే ఉన్నాను కదా, నాకెందుకు చెప్పలేదు"
ప్రదీప్... "బావా.... అదసలు నాకు చచ్చిపోవాలని లేదనగానే నాకు ఫ్యూస్ ఎగిరిపోయింది. నాకసలు ఏం చేయాలో కూడా తెలీలేదు. తర్వాత అసలు విషయం విన్నాకా దానికి నచ్చ చెప్పి ఇటు తిరిగేసరికి నువ్వొచ్చావు. నీతో మాట్లాడదామనుకునేసరికి అది రావటం తో చెప్పటానికి అవలేదు"
"నువ్వేదో చెప్పటానికి ట్రై చేయటంతో, తనెందుకో బాధ పడుతోందని అర్థమయ్యింది. రాత్రికి అయితే "ఆ టాపిక్ గురించీ ఇప్పుడెందుకు" అన్నాను. ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి, ఏం మాట్లాడాలో మెల్లిగా ఆలోచిద్దాంలే"
అన్విత వాళ్ళ మాటలూ వింటూ ఆలోచనలో పడింది.
ప్రదీప్ ..... "ఏంటి అన్వి, ఏమాలోచిస్తున్నావ్"
"బావా.... మంటపంలో కూర్చున్నా లేక అదెక్కడున్నా ఎంత బిజీ లో ఉన్నా మన గురించీ ఆలోచిస్తూనే ఉంటుంది కదా.... వాళ్ళ నాన్న దాన్ని చిన్నప్పుడు అంత బాధపెట్టినా, ఈరోజుకీ అయన అసలు ఒక రీసన్ లేకుండా దాన్ని ద్వేషిస్తున్నా దానికి మాత్రం ఆయనంటే ప్రేమే. ఆయన్ని ఏదైనా అన్నా దీనికి బాధే. అసలు, ఆయన్నే అంత ప్రేమిస్తే, హరన్నయ్య మీద ప్రాణాలు పెట్టుకుంది. మరి దానికేదైనా అయితే తనేమైపోతాడా అని ఆలోచించటం లో నాకైతే ఆశ్చర్యం అనిపించట్లేదు.
"హరన్నయ్యా... స్వాతి నీకు ఫస్ట్ టైమ్ ఐ లవ్ యు చెప్పినప్పుడు, అదంటే నీకు ఎంత ఇష్టమో చెప్పింది. గుర్తుందా. నీ మనసులో ఏముందో నువ్వు చెప్పకపోయినా దానికి తెలుసు, అది అర్థం చేసుకోగలదు. కానీ ఏమి తెలీనట్లుగా ఉంటుందంతే. మనము ప్రేమని మన మాటల్లోనో, చేతల్లోనో చూపిస్తాము. అది మాత్రం మిమల్ని ఎవడేంచేస్తాడో అని అర్థరాత్రిళ్ళు లేచీ అలా కాపలా కాస్తూ కూర్చునేది. మిమ్మల్ని లేపితే మీ నిద్ర డిస్టర్బ్ అయిపోతుందని ఆలోచించే పిచ్చిదది (ఎపిసోడ్42). దాని ప్రేమ అలాగే చూపిస్తుంది. అన్నయ్యా, దాని భయాన్ని చూడకూ ఆ భయం వెనక ప్రేమని చూడు, అర్థం చేస్కో".... ప్రదీప్ అన్వి ని భుజం మీద చేయి వేసి దగ్గరకి తీసుకున్నాడు.
"హేయ్ అన్వి.... నువ్వంతలా చెప్పాలా, నాకు మాత్రం తెలీదా ఇవన్నీ. అందుకే తనంటే అంత ఇష్టం. తను అందరితోనూ ధైర్యంగా మాట్లాడలేదు, అందుకే తన ముందర నేను ఉంటాను, తన బదులు కూడా నేనే మాట్లాడతాను. తనేంటో నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు"
అలాకబుర్లు చెప్పుకుని హరీష్ బయల్దేరబోతుండగా, అన్విత కి స్వాతి నుంచి ఫోన్ వస్తుంది. అన్విత అనుమానంగా హరీష్ కి ఫోన్ లో పేరు చూపించి, కాల్ తీసింది. హరీష్ వెళ్ళేవాడు ఆగిపోయాడు.
"హాయ్ స్వాతి..... ఏంటి పొద్దునే గుర్తొచ్చా"
"ఏంలేదే ఊరికే చేశా"
"సరే...... కాఫీలు తాగారా టిఫినీలు తిన్నారా" అంది నవ్వుతూ
"లేదే, అత్తయ్యతో నా ఒక్కదానికి కాఫీ కలిపించుకోవాలంటే మొహమాటంగా ఉంటుంది. పాపం తను కలుపుతాననే అంటుంది. నేనే ఒద్దని చెప్పేశా. టిఫిన్ కి ఇంకా టైమ్ ఉందిలే. బావ కోసం వెయిటింగ్"
"అన్నయ్య లేడా, పొద్దునే ఎక్కడికెళ్ళాడే" అంది అన్వి హరీష్ ని చూసీ నవ్వుతూ.
"ఏమోనే, పైగా ఎప్పుడూ చెప్పడట ఇంట్లో, బయటకి వెళ్ళే ముందర. నాకు ఉన్న టెన్షన్ని బావ ఇంకా ఎక్కువయ్యేలా చేస్తున్నాడు. సరేలే, మీరేం చేస్తున్నారు. అమ్మ వాళ్లు బయల్దేరారా"
"ఆ... ఇంకొంచెం సేపట్లో రీచ్ అయిపోతారు కూడా"
"సరే. అన్వి నాకో హెల్ప్ కావాలె. నాకు కొన్ని థింగ్స్ కావాలి. పంపించగలవా"
"ఏం కావాలేంటి"
స్వాతి కి కావాల్సినవన్నీ అడిగిందీ అన్వి ని.
"సరేలే, బావ తో పంపిస్తాలే"
"అన్వి... అన్నయ్య అక్కడ ఉన్నాడా. ఒకసారి మాట్లాడాలి"
"ఇస్తున్నా ఆగు" అంటూ ప్రదీప్ కి ఇచ్చింది.
ప్రదీప్..... "చిన్నూ..... ఎలా ఉన్నావూ...... పొద్దునే కాల్ చేశావేంటిరా.... అంతా ఓకేనా"
"ఆ.... బానే ఉన్నాను. నువ్వు ఖంగారు పడుతూ ఉంటావేమో అని కాల్ చేసాను. అసలు ఈపాటికి మెసేజ్ చేస్తావనుకున్నా. బావకి చేసావేమో మరి తెలీదనుకో"
"అవునురా ...... పొద్దున బావ ని అడిగాను. కానీ చిన్నూ... ఇప్పుడు సద్దుకున్నావా. దేని గురించీ ఎక్కువ ఆలోచించకమ్మా"
"సరే... అన్నయ్యా... "
"చిన్నూ ఏమయిందిరా"
"ఊరెళ్ళే ముందర ఒకసారి వస్తావా కుదిరితే"
"వస్తానురా....అడగాలేంటి"
అన్విత పక్క నుంచి, "స్వాతి.... నువ్వేవో కావాలన్నావ్ కదా, అవి పంపించనా ఇప్పుడు"
"ఆహా ఒద్దులే, ఇప్పుడు మీరూ వెళ్ళే హడావిడిలో ఉంటారు కదా, బావకి ఇచ్చేయి"
ఆ మాటతో ముగ్గురూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు.
ప్రదీప్... "బావకి ఎలా ఇస్తానురా"
స్వాతి.... "తను బయటకి వెళ్ళాడు, ఇంటికి వచ్చేటప్పుడు మీ దగ్గరకి రమ్మని చెప్తాలే"
"సరే చిన్నూ...... నువ్వు జాగ్రత్త"
"అలాగే అన్నయ్యా" అంటూ ఫోన్ పెట్టేసింది.
అక్కడ ముగ్గురూ... కొంచం ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో హరీష్ కి మెసేజ్ చేసింది స్వాతి. అది చూసీ తను అడిగినవన్నీ తీస్కుని ఇంటికి బయల్దేరాడు హరీష్.
ఇంట్లో, ప్రదీప్ తో మాట్లాడి ఫోన్ పెట్టేసి కిందకి రాబోతూ, సత్య గారి మాటలు వినీ ఆగిపోయిందీ స్వాతి.
సత్య గారు..... "నిన్న చూసావు కదా వీడు ఏమని చెప్పాడో. ఒక పక్క మనమేమో "బావ" అని పిలవద్దంటుంటే వీడేమో బావా అనే పిలువు, పేరు పెట్టి పిలువు అని చెప్తున్నాడు. ఈయన కూడా వాడికే వత్తాసు పలుకుతున్నారు. ఇంక ఇంట్లో నా మాటకి గౌరవం ఏది అసలూ. వీళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉంటే నేనేం మాట్లాడగలను. ఆరోజున కట్న కానుకల విషయాల్లో గట్టిగా మాట్లాడాల్సిందన్నావ్ కదా, నిన్న ఏమయిందో చూసావుగా, ఇంకేం మాట్లాడగలుగుతాను. పెళ్ళి కూడా మాములుగానే చేశారు, ఏ హడావిడి లేకుండా"
స్వాతి తన గదిలోకి వెళ్ళి కూర్చుని ఆలోచనల్లో పడింది. కొద్దిసేపటికి హరీష్ వచ్చి, "ఏంటిరా ఇక్కడ ఒక్కదానివి కుర్చున్నావు"
స్వాతి నుండి ఏమి సమాధానం రాకపోయేసరికి, "స్వీటీ" అంటూ తన పక్కకి వెళ్ళి తట్టాడు.
స్వాతి తన ఆలోచనల్లోనుంచి బయటకి వచ్చి, "బావ.... ఎప్పుడొచ్చావు" అనడిగింది ఖంగారుగా
"ఇప్పుడే వచ్చాను కానీ ఏమయ్యింది అలా ఉన్నావు"
"ఏమిలేదు బావా...... అమ్మా వాళ్ళు గుర్తొచ్చారు"
"ఒకసారి కాల్ చేయాల్సింది కదరా"
"ఒద్దులే పర్వాలేదు. పదా ఏమైనా తాగుదువుగానీ. ఏమి తినకుండా తాగకుండా వెళ్ళావు పొద్దునే"
"నేను టీ తాగాను, అన్వి ఇచ్చింది. నువ్వేమైనా తాగావా"
"ఆహా లేదు. తాగాలని లేదు"
"ఈరోజు నా చేతి కాఫీ తాగు. అవునింతకీ ఇవన్నీ ఏంటి" అంటూ అన్విత ఇచ్చినవి అర్థం కానట్లుగా అడిగాడు
"కృష్ణా నువ్వు నాకు కాఫీ కలపటం ఏంటీ. నాకిప్పుడేమి ఒద్దు. ఇవన్నీ అంటావా .... మీ పిన్ని గారి పిల్లలు, అర్జున్, నిధి ఉన్నారు కదా. ఇంట్లోనే ఉండాలంటే వాళ్ళకీ బోర్ గా ఉంటుందని తీసుకుని రమ్మన్నాను. ఏదో టైంపాస్ కి. కృష్ణా.... నీకు వీలుంటే ఈరోజు వాళ్ళతో ఎక్కడికైనా వెళ్దామా. మళ్ళీ రేపు ఊరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమి చూడలేదుట అసలు. సరదాగా తీస్కుని వెళదాము. నువ్వు బిజీ కాకపోతేనే... "
"నాకు ఏమి పనులు లేవురా. వెళదాములే.
హరీష్ వంటిట్లోకి వెళ్ళి, "అమ్మా నేను టీ కలుపుకుంటున్నా ఎవరికైనా కావాలా"
సత్య గారు.... "ఒద్దురా... నేను కలుపుతాను. నువ్వు జరుగు" అంటూ వెళ్ళారు
"పర్వాలేదులే. ఈరోజు సరదాగా చేసుకుందామనిపించింది" అంటూ టీ తో పాటు కాఫీ కూడా చేసి స్వాతికి ఇచ్చాడు.
సత్య గారు... "అదేంటి స్వాతి, కాఫీ ఇస్తానంటే ఇందాక, ఒద్దన్నావు కదా. మళ్ళీ వాడిని కలపమన్నావా"
స్వాతి సమాధానం చెప్పే లోపల, హరీష్... "అమ్మా.... తను ఇప్పుడు కూడా ఒద్దనే అంది. నేనే కలిపాను. తను ఒకదానికి మనం కలపాల్సి వస్తుందని వద్దంటోంది రోజూ"
"అదేమీ లేదు బావ"
"సరేలే ఇప్పటికైతే తీస్కో. అమ్మా, అర్జున్ వాళ్ళని తీస్కుని అందరమూ బయటకి వెల్దామా. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా రేపు"
"అలాగే హరీ.... మీరూ పిల్లలు వెళ్లిరండిలే. మేమెందుకు"
"అందరమూ వెళదాము.... నాన్నని అడుగు ఏమంటారో"
మహేశ్వర రావు గారు, "ఏంటిరా నన్ను అడగమంటున్నావు"
"ఏమిలేదు నాన్న. అందరమూ బయటకి వెల్దామా అని అడుగుతున్నాను. అమ్మ ఏమో పిల్లలు వెళ్ళిరండి, మేమెందుకులే అంటోంది. మీరేమంటారు"
"నాకు బయట పనులు ఉన్నాయిరా. అమ్మ, పిన్ని ని కూడా తీస్కుని వెళ్ళులే. వాళ్ళు అలాగే అంటారు. అలా ఇంట్లోనే ఎంతసేపు ఉంటారు"
హరీష్ వాళ్ళ అమ్మగారి వైపు కళ్ళెగరేసి "సరే నాన్నా. అమ్మా మీరూ రెడీ అవ్వండి త్వరగా" అన్నాడు నవ్వుతూ
ఆరోజంతా అందరూ సరదాగా బయట తిరిగి ఇంటికి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ రాత్రి లేట్ గా పడుకోటానికి వెళ్ళారు.
హరీష్ వాళ్ళ రూమ్ లో, "నువ్వేంటిరా స్వీటీ, నీకన్నా వాళ్ళిద్దరూ చిన్నవాళ్లు. వాళ్ళని పట్టుకుని మీరు, తను అంటూ మాట్లాడ్తావు"
"అదేదో అలవాటులే. అయినా నువ్వు మాత్రం నన్ను అలాగే అంటావు కదా. ఇక్కడ అలాగే పిలుచుకుంటారేమో అని నేనూ అలాగే పిలిచాను" అంది నవ్వుతూ
"మేమేమి అలా పిలుచుకోము. మాములుగా మాట్లాడు వాళ్ళతో, అలా బాలేదు స్వీటీ, చిన్నవాళ్ళని మీరు అంటుంటే"
స్వాతి హరీష్ ని చూస్తూ, "నువ్వు నన్ను అలా పిలువు అప్పుడు నేనూ అలవాటు చేస్కుంటాలే"
"సరే వెళ్ళి పడుకోవే" అన్నాడు నవ్వుతూ, తన మాటకి స్వాతి కూడా నవ్వేసింది.
హరీష్... " స్వీటీ..... అర్జున్, నువ్వూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్లున్నారు. వాడసలు తొందరగా ఎవరితోనూ కలవడు"
"హాహా... అవునా.... నాకూ బాగా అనిపించింది. కాలేజ్ జాయిన్ అవుతున్నాడుట కదా, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. సరే కానీ, ఇందాక మనం తీస్కున్నవి చిన్న గిఫ్ట్ బాగ్స్ లో పెట్టి ఉంచాను. అవి వాళ్ళు రేపు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇయ్యి నువ్వే"
"అవి వాళ్ళకోసం తీస్కున్నావా. మరి నువ్వే ఇయ్యి అయితే"
"ఆహా..... అన్నయ్యవి నువ్విస్తేనే బావుంటుంది"
"నేను ఇయ్యను, నాకలాంటి అలవాటు లేదు ఎవరికీ గిఫ్టులు ఇయ్యటాలు"
"నిన్ను ఇయ్యమని చెప్పాను. అంతే. ఇంక పద పడుకుందాము" అంది సరదాగా కోప్పడుతున్నట్లు
"ఏంటిరా గొంతు లేస్తోంది"
"లే.... దు బావా...... సరదా...గా అన్నాను. నీ మీద ఎందుకు గొంతు లేపుతాను" అంది గారంగా సాగదీస్తూ
పొద్దున్న లేచీ ఇంట్లో అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మహేశ్వర రావు గారు, "నిధి నిన్న బాగా ఎంజాయ్ చేశారా.... అర్జున్ మీరు ఆ మ్యుసియంకి వెళ్ళారా. నీకు అలాంటివి చాలా ఇంటరెస్ట్ కదా"
అర్జున్... "పెదనాన్నగారు, అన్నయ్య ఎంత ట్రై చేసాడో, అది స్కిప్ చేయటానికి. వదిన తీస్కుని వెళ్తా అన్నది, అప్పుడు ఇంక అన్నయ్య వచ్చాడు. వదిన బాగా చూపించింది. ఉన్న టైమ్ లోనే అమ్మ వాళ్ళని బిర్లా మందిర్ తీసుకెళ్లింది, అన్నయ్య రానన్న కూడా మాకు ప్లానిటోరియం, మ్యుసియం చుపిస్తానంది. తర్వాత వచ్చాడనుకోండి." అంటూ ఉత్సాహంగా చెప్పాడు
హరీష్... "ఒరేయ్.... మీ వదిన ని పొగిడితే పొగిడావు కానీ నన్నెందుకురా అనటం. నీకోసం వెళ్తే పాపం నిధి కి బోర్ కొడ్తుంది కదా అని అన్నాను. అది చిన్నది కాబట్టి దానికి ఇష్టమైన వాటికీ వెళ్ళాలి కదా అని ఒద్దన్నాను. నిధి నీకు నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళామా లేదా"
నిధి.... "అవును పెదనాన్నగారు. మాల్ కి వెళ్ళాము. అమ్మ వాళ్ళు ఒద్దని గొడవ చేశారు కానీ అన్నయ్య లంచ్ కి బయటకి తీస్కెళ్ళాడు. మాకు ఈ ట్రిప్ చాలా నచ్చిందీ, అన్నయ్య వదినతో స్పెండ్ చేయటం బావుంది"
స్వాతి నవ్వుతూ ... " కదా.... అందుకే మళ్ళీ హాలిడేస్ కి ఇక్కడికి వచ్చేయండి. ఈసారి కొంచం ఎక్కువ రోజులు ఉండేలా వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయచ్చు"
అర్జున్... "తప్పకుండా ఒదినా"
సాయంత్రం వాళ్ళు ఊరు బయల్దేరుతుంటే, హరీష్ కి చెప్దామని తన రూమ్ కి వెళ్ళారు పిల్లలిద్దరూ. వాళ్ళకి స్వాతి తీసుకున్న బాగ్స్ ఇచ్చి, బాగా చదువుకోమని చెప్పారు.
ఆ గిఫ్ట్స్ చూసిన హరీష్ వాళ్ళ పిన్నిగారు మాత్రం, "స్వాతి అదేంటమ్మా, అవి నీకోసమని కొనుక్కున్నావు కదా. అవి వీళ్ళకి ఇచ్చావేంటి. నువ్వు ఉంచుకో. ఇప్పుడు వీళ్ళకేమి అక్కర్లేదు. అక్క వాళ్ళకోసం బట్టలవి తీసుకుంది"
స్వాతి.... "అత్తయ్యగారు, అవి వాళ్ళకోసమే తీసుకోమన్నారు తను. నాగురించి కాదు. అత్తయ్య వాళ్ళు ఇచ్చారు కానీ ఇవి ఊరికే మా సరదా కోసం తీసుకున్నాము"
అర్జున్, నిధి..... "థాంక్యూ అన్నయ్యా, ఒదినా. అన్నయ్యా నీది సూపర్ సెలక్షన్. మాకు వదిన చాలా నచ్చేసింది" వాళ్ళ మాటలకి స్వాతి సిగ్గుపడింది. హరీష్ కి మాత్రం స్వాతిని చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది, తన పిన్ని పిల్లలైనా కూడా వాళ్ళతో అంత బాగా కలిసిపోయినందుకు.
సత్య గారు.... "హాహా.... అర్జున్ నువ్వు మాట్లాడటం ఇప్పుడేరా చూస్తున్నాం అసలూ"
హరీష్.... "సరే పదండి ట్రైన్ కి టైమ్ అవుతోంది"
సత్య గారి చెల్లెలు, సత్య గారికి మాత్రమే వినిపించేలా... "నీ కోడలు విషయంలో రాంగ్ సెలక్షన్ అనుకున్నా కానీ, పెళ్ళి తరువాత భర్త తరపు వాళ్ళని తన సొంత వాళ్ళలా చూడగలుగుతోంది. నువ్వు నిజంగానే అదృష్టవంతురాలివి" అని చెప్పి వెళ్ళిపోయింది.
సత్య గారు ఆలోచనలో పడ్డారు
Comments
Post a Comment