51

 హాల్ లో అందరూ కబుర్లు చెప్తుండగా అన్విత స్వాతిని లోపలికి రమ్మనమని సైగ చేసి వెళ్ళిపోయింది.  


స్వాతి... "ఏంటే పిలిచావ్" 


"ఏమైనా కబుర్లు చెప్పవే. పొద్దున్న,  మా అన్న గురించైతే ఎంతైనా చెప్పచ్చన్నావ్ కదా. మరీ అంతలా ఏం చేసేసాడేంటి" అంది అన్విత,  కథ వినటానికి రెడీ అయినట్లుగా మంచం మీద కూర్చుని 


"హాహాహ...ఏంటే అంత ఇంటరెస్ట్. నేనింకేంటో అనుకుని వచ్చా. నేనెళ్తున్నా" 


"ఆగవే. కూర్చో. వాళ్ళేవో మాట్లాడుకుంటారులే కొంచం సేపు" 


"హేయ్ పాపం బావ కి బోర్ కొడ్తుందే" 


"బోరా.... వాళ్ళు రాజకీయాలు డిస్కషన్ మొదలెట్టారు. ఇప్పుడప్పుడే అవ్వదులే కానీ నువ్వు చెప్పు" 


"నీ సరదా....  ఏం చెప్పాలే" 


"సరేలే నేను చెప్తా వింటావా" 


"సెన్సార్ అయితే చెప్పకు సెన్స్ లేకుండా" 


"సరే....లే.... అవి కాదు కానీ....  మీ అన్నయ్య నేను జాబ్ చేయచ్చన్నారు.  అత్తయ్యా వాళ్ళు కూడా నా ఇష్టం అన్నారు" అంది ఆనందంగా 


"ఒహ్హ్. . .  అది తెల్సిందేలే.......  మా అన్నయ్య ఒద్దంటాడని నేనూ అనుకోలేదు .. మరింతకీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నావ్ ట్రయల్స్" 


"నెక్స్ట్ మంత్.....  మళ్ళీ హనీమూన్ ఒకటుంది కదా.  ఇవన్నీ అయ్యాకా,  మొదలు పెడదామని.  అవునింతకీ మీరెక్కడికి వెళ్తున్నారేంటి"


"ఏమోనే... ఎక్కడికి వెళ్ళటం లేదు.  నాతో  అయితే ఏమనలేదు. బావకి ఆ ఆలోచన ఏమి ఉన్నట్లుగా లేదు. నేనూ అడగలేదసలు. ఇంతకీ మీరెప్పుడు బయల్దేరటం" 


"రేపు అమ్మా వాళ్ళింటికి వెళ్తాము. ట్రిప్ అయితే ఫోర్ డేస్ తర్వాత" 


"సూపర్. ఇంకేం ఫుల్ ఎంజాయ్ చేసి రా" 


"నువ్వు కూడా అడగవే. ఇలాంటి సరదాలు లైఫ్ లో మళ్ళీ మళ్ళీ వస్తాయా" 


"ఇప్పుడు కాకపోతే ఇంకో రెండేళ్ల తర్వాత వెళ్తాము. ఎప్పుడెళ్తే  ఏంటే" 


"ఓయి ముసల్దానిలాగా ఏంటే. మా అన్నయ్య నీతో ఎలా పడతాడో. పెళ్ళి అవగానే సరదా వేరు పెళ్ళయ్యాక రెండు, మూడు, అరవై ఏళ్ళు అయ్యాక వెళ్ళటం వేరు" 


"అబ్బా చంపకే. నేను అడగను. నాకు మొహమాటంగా ఉంటుంది అలా అడగాలంటే"


అన్విత నవ్వుతూ ... " నిన్న తర్వాత కూడా ఇంకా మొహమాటమా" 


"హహహ....  నిన్న...  నాకు భయమేస్తోందని  చెప్పా"


"ఏంటీ.....  ఈ విషయం అర్జెంటు గా అత్తయ్యతో... కాదు కాదు బామ్మగారికి చెప్పాలి" అంటూ లేవబోయింది అన్విత. అన్విత ని కదలనీయకుండా గట్టిగా పట్టుకుంది స్వాతి. స్వాతి ని తప్పించుకుని హాల్ లో కి వచ్చి,  "బామ్మగారు .....  మీకో విషయం చెప్పాలి" అంది అరుస్తూ.


"ఏంటమ్మా" 


"అదీ...  అదీ....  స్వాతి..... " అన్విత కి అసలైతే చెప్పే ఉద్దేశం లేదు కానీ స్వాతి ఖంగారు చూసి ఆటపటిద్దామనుకుంది. కానీ బామ్మగారు ఏంటని అడిగేసరికి ఏం చెప్పాలో తెలీలేదు


స్వాతి లోపల నుంచి వస్తూ,  "అన్నయ్యా మీ ఆవిడ నన్ను తోసేసింది. కింద పడిపోయాను. దెబ్బ తగిలిందేమో,  చేయి విరిగిపోయిందేమో" అంటూ ఏడుపు మొహం పెట్టి లోపల నుంచి వచ్చింది. 


ప్రదీప్ ఖంగారుగా.....  "నొప్పిగా ఉందా....  ఎక్కడ తగిలింది" అంటూ చూస్తుంటే  అన్విత మాత్రం స్వాతి అబద్ధాలకి నోరు మూసేస్కుని కళ్ళు పెద్దవి చేసి చూసింది. హరీష్ కి అన్విత మొహం చూసీ స్వాతి అబద్దం చెప్తోందని అర్ధమయ్యి ప్రదీప్ ని నవ్వుతూ చూసాడు. 


ప్రదీప్... "అన్వి.... చూసుకోవద్దా. బాగా నొప్పిగా ఉందా చిన్నూ" అని ఖంగారుగా అడుగుతుంటే స్వాతి అన్విత వైపు చూసీ కళ్ళెగరేసి నవ్వింది. 


హరీష్... "బావ, హాస్పిటల్ కి వెళదాం పదా. ఏమంటావ్ స్వాతి" 


"ఏంటి.....  హాస్పిటలా.....ఏమక్కర్లేదు. అదే తగ్గుతుంది. ఇప్పుడు కొంచం నొప్పి తగ్గిందిలే" 


హరీష్... "ఓహ్....  నొప్పి తగ్గిందిటలే అన్వి,  నువ్వు చెప్పు ఇందాకేదో చెప్తున్నావ్ కదా" అన్నాడు నవ్వుతూ  


పద్మగారు నవ్వుతూ... "వీళ్ళిద్దరూ కలిస్తే ఇలాగే ఉంటుంది. ఎటొచ్చి ఇప్పటి వరకు వీళ్ళ మధ్య లో నన్ను చంపేసేవాళ్ళు,  ఇప్పుడు ప్రదీప్ ని ఆడుకుంటున్నారు" 


అమ్మమ్మగారు... "అన్విత నువ్వెంటమ్మా పిలిచావు" 


"ఆహా... ఏమిలేదు బామ్మగారు" 


స్వాతి.... "నాన్నా....  మీరు అమ్మమ్మ ని దింపటానికి వెళ్తారు కదా,  అదేదో రేపు వెళ్తే అన్నయ్య వాళ్ళు కూడా ఉండరు కదా. మీకూ మార్పుగా ఉంటుంది. ఒక రెండు రోజులు ఉండి రావచ్చు.ఆలోచించండి..." 


స్వాతి మాటలకి ఏం చెప్పాలో తెలీక రామ్ గారు,  పద్మగారు,  ప్రదీప్ మొహామొహాలు చూసుకున్నారు. 


"ఏమైందీ ఐడియా బాలేదా " 


పద్మ గారు..... "అది కాదు స్వాతి,  వాడూ వూరెళ్తాడు, మేమూ ఇక్కడ లేకపోతే ఏదైనా కావాలంటే ఒక్కదానివి అయిపోతావు కదా" 


హరీష్..... "అత్తయ్య తను నాతోనే ఉంటుంది కదా. నేను ఉంటాను. మరేం పర్వాలేదు. మీరు వెళ్ళిరండి"


రామ్ గారు..... "సరే హరీ.....  అలవాటులో ఆలోచన అటు వెళ్ళిపోయింది. దానికీ పెళ్లయిపోయిందని మర్చిపోయాము ఒక్క క్షణం. ఏమనుకోకు" అని నవ్వి, "అత్తయ్యగారు,  రేపు వెళదామా అయితే" 


అమ్మమ్మగారు.... "అలాగే బాబు" 


"సరే....  మేమూ బయల్దేరుతాము నాన్నా " 


"అలాగేనమ్మా" 


"అమ్మమ్మా.  మేమెళ్ళోస్తాము.. నువ్వు జాగ్రత్త" 


అమ్మమ్మ గారు... "స్వాతి,  అన్విత ఈసారి నేను వచ్చేసరికి శుభవార్త చెప్పాలి ఇద్దరూ కూడాను" అన్నారు నవ్వుతూ 


అన్విత. .... "బామ్మగారు....  ఇప్పుడేగా పెళ్లయ్యింది. అప్పుడే శుభవార్తలా" 


అమ్మమ్మగారు.... "ఎన్నాళ్ళు కావాలేంటి మరీ" 


"ఒక ఐదారేళ్ళ అయితే ఓకే.... " అంది ప్రదీప్ వైపు చూసీ నవ్వుతూ కన్నుకొట్టి 


అందరూ అన్విత మాటలతో నవ్వుతూ స్వాతిని గమనించనేలేదు. కానీ అమ్మమ్మగారు తనని చూసీ,  "స్వాతి ఒక సారి ఇలా రామ్మా,  ఇందాక నీకు ఒకటి ఇయ్యటం మర్చిపోయాను" అంటూ భుజం మీద చేయి వేసి లోపలికి తీస్కుని వెళ్ళారు 


"ఏమైందీ స్వాతి" 


స్వాతి భయంగా అమ్మమ్మగారి వైపు చూస్తూ, "అమ్మమ్మా....  బావా.... నాన్నా....బా.. " స్వాతికి మాట్లాడటం కష్టంగా ఉంది. 


ఆవిడకి తనని అలా చూసేసరికి ఖంగారుగా అనిపించి,  "ప్రదీపు కొంచం మంచినీళ్ళు తీస్కుని రావా" అంటూ ప్రదీప్ ని పిలిచారు 


పద్మగారు,  "ఆగరా నేనిస్తాను" అంటూ వెళ్ళబోతుంటే, 


"మంచినీళ్లిచ్చినంత మాత్రాన నేనేమి అరిగిపోనులే" అంటూ ప్రదీప్ లోపలికి వెళ్ళాడు. ప్రదీప్ రాగానే,  ఆవిడ తలుపు వేసేసి,  


"ప్రదీపు... స్వాతి ని చూడరా. నాకు కాలు చేయి ఆడటం లేదు" అన్నారు 


"ఏమైందమ్మమ్మా" అంటూ స్వాతి దగ్గరకి వెళ్ళి,  తనని కూర్చోబెట్టి,  "చిన్నూ.... ఏమయిందమ్మా" 


"అన్నయ్యా...." అంటూ ప్రదీప్ ని పట్టుకుని ఏడ్చేసింది 


"అమ్మమ్మా....  ఏమయ్యిందసలు..... ఎందుకు ఏడుస్తోంది" 


"ఏమోరా....  బయట దాని మొహం చూసి ఎందుకో బాధపడుతోంది,  అందరిలో చెప్పలేదని లోపలికి తీసుకొచ్చాను. కానీ బావ అంటోంది కానీ ఏమి చెప్పటం లేదు. ఆ అబ్బాయి ఏమన్నా .... " 


"అమ్మమ్మా..... " కోపంగా అరిచాడు ప్రదీప్.... నువ్వాగు.... నేను మాట్లాడతాను" 


"చిన్నూ....  తల్లీ....  ఏమయిందమ్మా" 


"అన్నయ్యా.....  నాకు బావని వదలాలని లేదు. నాకు చచ్చిపోవాలని లేదు" 


"చిన్నూ.....  ఏంట్రా ఆ మాటలు అసలేమయ్యిందమ్మా..... ఎందుకలా మాట్లాడుతున్నావు" 


"అన్నయ్యా.....  నేను పుట్టినప్పుడు అమ్మ చనిపోయింది,  పిల్లలు పుడితే అలా నేనూ చనిపోతానేమో. కానీ బావకి దూరమవ్వాలని లేదు. దానికన్నా ఎక్కువ, నాన్న ని అందరూ తిట్టుకుంటున్నట్లుగా బావని కూడా తిడ్తారేమో. నాన్న లాగా బావ కూడా ఒక్కడు అయిపోతాడు. ఎవరూ ఉండరూ" 


ప్రదీప్ కి అసలు విషయం అర్థమయ్యాక,  అమ్మమ్మగారి వైపు చూస్తూ,  "ఇప్పుడర్థమయ్యిందా దాని బాధేంటో" 


"చిన్నూ....  నువ్వు ముందు నీళ్ళు తాగు..." 


"చిన్నూ....  నువ్వు పుట్టినందువల్ల పిన్నీ చనిపోలేదురా. కావాలంటే ఇదిగో అమ్మమ్మ ఇక్కడే ఉంది కదా అడుగు" 


అమ్మమ్మగారు స్వాతి పక్కన కూర్చుని,  తల నిమురుతూ,  "అవునమ్మా. నువ్వు పుట్టాక మీ అమ్మ ఆరు నెలలు వరకూ బ్రతికే  ఉందిరా. అప్పట్లో ఏదో జబ్బు చేసింది. అదేంటో తెలిసే లోపే ప్రాణం పోయిందమ్మా. అంతే కానీ నీ వలన కాదు. మీ నాన్న ఆ దేవుడి మీద కోపం చూపించలేక కళ్ళెదురుగా ఉన్న నీ మీద చూపించాడు. అంతేనమ్మా" 


"చిన్నూ....  బావా, మీ నాన్న లాగా కాదురా. తనకి మంచి చెడు తెలుసు. అసలు అన్నిటికన్నా ముందర, పిన్ని కి జరిగినట్లుగా నీకేమి అవ్వదు". 


"నిజంగానా అన్నయ్యా....  నాన్న పెళ్ళికి రాలేదని అందరూ తిట్టారు. బావని అలా తిట్టరు కదా..." 


"ఎవ్వరూ ఏమి అనరు,  నేను బావ ని మాట పడనీయను.  నీకు కూడా ఏమి అవదూ. నన్ను నమ్మరా చిన్నూ...." 


స్వాతి కొంచం సద్దుకున్నాకా,  "లే నాన్నా....  లేచీ మొహం కడుక్కుని రా. బావ నిన్ను ఇలా చూస్తే కంగారు పడతాడు. దా " అంటూ తనని లేపి వాష్రూమ్ లో కి పంపించాడు


ఎంతకీ రావటం లేదనుకుంటూ హరీష్ అప్పుడే అటు వచ్చాడు. 


ప్రదీప్... "చూసావా అమ్మమ్మా. అతనెలాంటివాడో ఏం భయపెట్టాడో అని నువ్వు అనుకున్నావు కానీ అదేమో బావ గురించీ బెంగెట్టుకుంటోంది. దానికేదైనా అయిపొతుందెమో అని ఆలోచన, అంతకన్నా ఎక్కువ...  అదే జరిగితే....  బావా ఏమయిపోతాడు అని" 


"ప్రదీపు ఇలా ఉంటే ఎప్పటికైనా ఇబ్బందే కదా. మనసులో ఇంత భయం ఉందనుకోలేదురా " 


"అమ్మమ్మా.....  దానితో బావనే మాట్లాడగలడు. తన మాటైతేనే వింటుంది" 


"కానీ ఇవన్నీ అబ్బాయి కి తెలిస్తే ఏమనుకుంటారో" 


"ఎంటమ్మమ్మా..... ఇన్నాళ్ళు లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు. నీకు తెలీదా హరీష్ గురించీ. అయినా దీనికేమి జబ్బు చేసేయలేదు. మీ అల్లుడు చేసిన గాయం,  మనసుకి తగిలింది. టైమ్ పడ్తుంది. బావ మాత్రమే దానికి ధైర్యం చెప్పగలడు. యే పరిస్థితుల్లోనూ వదిలేయడు అమ్మమ్మా. దాని బాదేంటో అర్థం చేసుకోగలడు" 


"థాంక్స్ బావ. ఆ నమ్మకం ఉందంటే చాలు నాకు. ఇంతకీ ఏమయ్యిందీ....స్వీటీ ఏది" అంటూ లోపలికొచ్చాడు హరీష్ 


"ఏముందీ..... వాళ్ళ నాన్న గురించీ...." అంటూ చెప్పేలోపు స్వాతి  వాష్రూమ్ నుంచి వచ్చి,  హరీష్ ని చూడగానే తనని గట్టిగా హత్తుకుంది. స్వాతి ని దగ్గరకి తీస్కుని తల మీద చేయి వేసి,  "ఏమయిందన్నట్లుగా" ప్రదీప్,  అమ్మమ్మ గారి వైపు చూసాడు. వాళ్ళ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కనిపిస్తూనే ఉంది. ప్రదీప్ ఇందాక "ఏదో వాళ్ళ నాన్న గురించీ"... అంటున్నాడు అందుకేనేమో" అనుకుని స్వాతిని ఇంకేమి అడగలేదు. 


స్వాతిని తల మీద ముద్దుపెట్టుకుని,  "స్వీటీ.. బయల్దేరుదామా,  అమ్మా వాళ్ళు ఎదురుచూస్తుంటారేమో" 


"హ్మ్మ్.... సరే" అంటూ అమ్మమ్మ గారి దగ్గరకి వెళ్ళి ఆవిడని హత్తుకుని,  ఆవిడకి మాత్రమే వినిపించేలాగా ఆవిడ చెవిలో  "సారీ అమ్మమ్మా నిన్ను ఖంగారు పెట్టేసాను. నేను బానే ఉన్నాను ఇప్పుడు" అంటూ ప్రదీప్ కి కూడా చెప్పి  ఇద్దరూ బయల్దేరారు 


దారిలో స్వాతి ఏమి మాట్లాడకుండా హరీష్ ని పట్టుకుని అలా ఉండిపోయింది 


"స్వీటీ... "


"ఆ..  చెప్పు బావ" 


"ఏమయిందిరా సైలెంట్ గా ఉన్నావ్" 


"ఏమిలేదు" 


"ఇంతకీ అన్విత ని ఏదో విషయం చెప్పనీయకుండా అడ్డు పడ్డావేంటి" 


"బావా...   నేను అడ్డుపడ్తున్నానని తెలిసి,  దాన్ని చెప్పమని అడుగుతావేంటి ఇందాక. ఏదో వాళ్ళ హనీమూన్ ట్రిప్ గురించి వచ్చి,  నిన్ను అడగమని...." తల కొట్టుకుని,  "అదేదో నన్ను సతాయిస్తుంటే,  నిన్న నాకు భయమేసింది అని వాగాను,  ఒక చోట  తప్పించుకోబోయి ఇంకో టాపిక్ లో ఇరుక్కుపోయాను. అక్కడ నుంచి అమ్మకి చెప్తా అమ్మమ్మకి చెప్తా అంటూ పరిగెత్తుకొచ్చింది" 


హరీష్... "ఇక్కడ మన ఇల్లూ వచ్చేసింది" అంటూ నవ్వాడు. ఎన్ని కబుర్లు చెప్పినా స్వాతి మొహం లో నవ్వు కనిపించలేదు. ఇంట్లోకి వెళ్ళాక హరీష్ వాళ్ళ పిన్ని గారి పిల్లలు రావటంతో అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు


స్వాతి.... "నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ..." అంటూ వాళ్ళ రూమ్ కి వెళ్ళింది. 


మనసేమి బాగోలేక బట్టలు మార్చుకుందామని వెళ్ళి అక్కడే డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుండిపోయింది. తనకోసం వచ్చిన హరీష్,  స్వాతిని అలా చూసీ ఖంగారుపడీ,  అది కనిపించనీయకుండా,  నవ్వుతూ..."స్వీటీ మన డ్రెస్సింగ్ రూమ్ ని చిన్నగా చేసేద్దామనుకుంటున్నా. లేకపోతే రూమ్ లో కన్నా ఎక్కువ నువ్విక్కడే ఉండేట్లున్నావు" అన్నాడు స్వాతి పక్కనే కూర్చుంటూ 


"అదేమీ లేదు బావా. పదా వస్తున్నాను" 


"ఎక్కడికీ వెళ్తావు. వాళ్ళూ పడుకోటానికని వెళ్ళారు. అక్కా చెల్లెళ్ళిద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.  నువ్వొస్తే పడుకోవచ్చు" 


"సరే" అన్నా కదలకపోవడంతో,  "ఏమయిందిరా స్వీటీ. ఎందుకంత డల్ గా ఉన్నావు" 


"బావా....  మనకి పిల్లలు అప్పుడే ఒద్దు బావా. నాకు నీతో హ్యాపీ గా ఉండాలనుంది" 


అస్సలు ఊహించని ఆ మాటకి హరీష్ కి నవ్వొచ్చింది. " హహహ .. ఇప్పుడు పిల్లల గురించీ టాపిక్ ఎందుకొచ్చింది" 


"ఇందాకా అమ్మమ్మ గుడ్ న్యూస్ చెప్పాలంది  కదా..." 


"పెద్దవాళ్ళు ఏదో అంటారు. దానికే అంత ఆలోచించాలా. అన్విత చెప్పినట్లు ఇప్పుడు కాకపొతే తరువాత అని చెప్పటమే" 


స్వాతి హరీష్ ఒళ్ళో కూర్చుని తన గుండెల మీద వాలిపోయి... "కృష్ణా...... పిల్లలు పుడితే నువ్వు మాత్రం మా నాన్న  లాగా చేయవు కదా" 

.

"హేయ్ పిచ్చి పిల్లా ఇందుకా ఇందాకటి నుంచి డల్ అయిపోయావు. ఎప్పటికి అలా చేయను. పిల్లలంటే నాకు చాలా ఇష్టంరా,  ఇప్పుడే కాదు కానీ కొన్నాళ్ళాగి ప్లాన్ చేసుకుందాము. సరేనా" 


"ఆ.. " 


"కానీ ఇలా కూర్చునుంటే పిల్లలెలా వస్తారురా" 


"చి పో బావా....  నీకస్సలు సిగ్గులేదు" అంటూ అల్లేసుకుంది 


"స్వీటీ.... అన్విత వాళ్ళు హనీమూన్ కి వెళ్తున్నారు కదా,  మనం ఎక్కడికైనా వెళదామని ఒక్కసారి అడగలేదేంట్రా" 


స్వాతి హరీష్ ని చూస్తూ,  " కృష్ణా.....  అన్విత ఏమన్నా అన్నదా" 


హరీష్ అయోమయంగా...."లేదూ.... ఎందుకూ" 


స్వాతి సిగ్గుపడుతూ.... "ఇందాక ఇదే మాట నన్ను నీతో మాట్లాడమంది,  నాకు మొహమాటం. నేను అడగను అన్నాను" 


"ఇంకా మొహమాటముందా. హ్మ్...  అయితే పొద్దున్న డోస్ సరిపోలేదన్నమాట"అంటూ స్వాతి ని ఎత్తుకుని రూమ్ లో కి వెళ్ళాడు.


తెల్లవారుతుండగా స్వాతి నిదుర లేచీ,  హరీష్ ని ముద్దు పెట్టుకునీ ఫ్రెష్ అవటానికని వెళ్ళింది. ఇంతలో మెసేజ్ ఏదో రావటం తో హరీష్ కి మెలుకువొచ్చి ఫోన్ చూసుకున్నాడు.  


ప్రదీప్ మెసేజ్... "చిన్నూ ఎలా ఉంది బావా" 


హరీష్ దానికి రిప్లై చేసాడు...."నిన్న వచ్చాక కొంచం సేపటికి సద్దుకుంది బావ. తనతో మాట్లాడాను ఇప్పటికైతే. నేను నీతో ఒక్క సారి మాట్లాడాలి తర్వాత"



Comments