50

అప్పుడే సూర్యుడు ఇప్పుడే రావాలా వొద్దా అని ఆలోచిస్తూ పైకి వస్తున్నాడు.  అలవాటుగా స్వాతికి పొద్దునే మెలుకువొచ్చేసింది. 

ఎదురుగా హరీష్ తనకి దగ్గరగా పడుకుండటం చూసీ చిన్న ముద్దు తన పెదవులపై పెట్టింది. ఆ స్పర్శ తెలిసినట్లుగా,  హరీష్ నిద్రలోనే చిరునవ్వు వచ్చింది. స్వాతి బద్ధకంగా లేచీ చుట్టూ చూసీ,  ఇందాక హరీష్ ని చూస్తూ మర్చిపోయిన విషయం ఇప్పుడు గుర్తొచ్చి,  నిట్టూర్చింది. 


హరీష్ పడుకుని,  స్వాతి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ,  "ఏమాలోచిస్తున్నావురా" అన్నాడు బద్దకంగా


తన చేతుల్ని ముద్దు పెట్టి విడిపించుకుంటూ,  "ఏమీ లేదు కృష్ణా" అంది నవ్వుతూ


స్వాతిని మళ్ళీ అలాగే చేయి వేసి వెనక్కి వాల్చి, తన కళ్ళలోకి చూస్తూ,  ముంగురులు సరిచేస్తూ,  "నాతో చెప్పవా" 


"ఇల్లు గుర్తొచ్చింది. ఈరోజు నుంచి ఒక కొత్త లైఫ్ కృష్ణా. ఆ లైఫ్ లాగా ఉండదు కదా" అంది బాధగా 


"స్వీటీ నేనున్నాను కదా ఏ లైఫ్ అయినా నువ్వు హ్యాపీగా ఉండేలా చూడటానికి" అన్నాడు ముద్దు పెట్టుకుంటూ 


"థాంక్స్ కృష్ణా"అంటూ తనని హత్తుకుని,  లేవబోయింది. 


"గువ్వ పిట్టలాగా అలా గుండెల మీద పడుకుంటే నాకూ హాయిగా నిద్ర పట్టింది. నువ్వు కదలాగానే మెలుకువొచ్చేసింది. కొంచం సేపు బజ్జోవా నాకు నిద్రొస్తోంది" 


హరీష్ అలా అడుగుతుంటే స్వాతికి నవ్వొచ్చింది.  "దా కృష్ణా.....  బజ్జో.  కానీ కొంచం సేపు ఆగి నేను లేస్తాను.  లేకపోతే అందరి ముందు బాగోదు" 


"సరే" అంటూ హరీష్ నిద్రలోకి జారుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత స్వాతి మంచం దిగుదామని ప్రయత్నించింది కానీ హరీష్ తనని గట్టిగా పట్టుకుని పడుకోడంతో కదలలేకపోయింది.  లేద్దామంటే  కదలనీయకుండా పట్టుకుని పడుకుని ఉన్నాడు.  చేసేది లేక అలా చూస్తూ,  


"నీ ప్రేమతో మాయ చేసేసావు,  మొన్న నన్ను కట్టేసుకున్నావ్, నిన్న నీ దాన్ని చేసేస్కున్నావు,  ఇంకెక్కడికి వెళ్ళిపోతాననిరా ఇంత గట్టిగా పట్టుకున్నావ్. ముద్దుల కృష్ణయ్య. లవ్ యూ రా" 


"లవ్ యూ టూ " 


"క్... క్.. కృష్ణా....నువ్వు లేచే ఉన్నావా" 


"ఇప్పుడే లేచానురా. వెళ్ళు,  ఫ్రెష్ అయ్యిరా" 


"హమ్మయ్యా.....  కృష్ణా.... నువ్వూ త్వరగా లే,  అమ్మా వాళ్ళింటికి వెళ్ళాలి కదా పూజ కి" 


"సరే " 


స్వాతి వచ్చేసరికి హరీష్ లేస్తుంటే,  "కృష్ణా  ఫ్రెష్ అయ్యిరా.....  కాఫీ తీసుకొస్తాను" 


"లేదురా నేనూ వస్తాను..... ఇద్దరం కలిసే వెళదాము కిందకి. నాకు ఏమైనా డ్రెస్ సెలెక్ట్ చేయి,  ఈలోపు" 


"నేనా.... నాకేం తెలుసు బావా " 


"నువ్వే..... మనం వెళ్ళేది పూజకి. నా బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి. నీకు నచ్చింది తీయి" 


స్వాతి నవ్వుతూ "సరే" అంది. 


హరీష్ డ్రెస్  తీసుకొచ్చి,  మంచం మీద పెట్టి,  "నీతో కాఫీ తీసుకొస్తా అన్నాను కానీ,  రాత్రి ఇంట్లో అత్తయ్యా, మీ పిన్నీ గారు, పెద్ద అత్తయ్యా,  అక్కా అందరూ నన్ను దగ్గరుండి రూమ్ లో కి పంపించారు. ఇప్పుడు నేనొకదాన్ని కిందకి వెళ్ళి వాళ్ళందరిని  కలవాలంటే మొహమాటంగా ఉండింది. నీకు నా మనసులో మాటలు అలా ఎలా అర్థమమయిపోతాయిరా" 


"ఎందుకంటే నువ్వు నా బుజ్జి బంగారం కదా" 


హరీష్ మాట వినిపించీ,  వెనక్కి తిరిగేసరికి, అప్పుడే స్నానం చేసి వచ్చిన హరీష్ ని టవల్లో  అలా చూసీ, సిగ్గుతో తల తిప్పేసుకుని, "నువ్వు డ్రెస్ మార్చుకో బావా ఇక్కడ పెట్టాను" అంటూ అక్కడ నుంచి వెళ్ళబొయింది. 


హరీష్ తనని దగ్గరికి లాక్కుని,  "ఎందుకురా పారిపోతున్నావ్" 


"అదీ...  నువ్వూ.. " 


స్వాతి కళ్ళలోకి చూస్తూ "సిగ్గా..." అడిగాడు కొంటెగా 


"హ్మ్.. " 


హరీష్ స్వాతి పెదవులని అందుకున్నాడు. కొద్దిసేపు  స్వాతికి ఊపిరాడకుండా చేసి,  "ఇంకా సిగ్గుగా ఉందా. ఉంటే చెప్పేయి. మొత్తం సిగ్గు పోగెట్టేస్తాను" అంటూ నవ్వాడు 


"బాబోయ్..... నాకస్సలు సిగ్గు లేదు" 


"హహహ.....  సరే" అంటూ రెడీ అయ్యాడు. "అవునురా,  నువ్వెంటి ఈ చీర కట్టావు. మీ ఇంటికి వెళ్ళాలి కదా" 


"ఆ.....  వెళ్ళే ముందు మార్చుకుంటా" అంటూ ఇద్దరూ కిందకి దిగేసరికి ఏడు దాటింది. హరీష్ వాళ్ళ అమ్మ గారు అప్పుడే లేచినట్లుగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి హరీష్ వాళ్ళ పిన్నిగారు కూడా వచ్చారు. 


స్వాతి తనలో తను... "ఎంత మార్పు. అమ్మ వాళ్ళింట్లో ఆరున్నర అయితేనే అమ్మ "ఇంకా లేవలేదా" అంటూ యుద్ధం చేసేస్తుంది. ఇక్కడ పెద్దవాళ్ళే లేవలేదు. అయినా అమ్మ మరీ మరీ చెప్పింది కదా, వ్రతానికి త్వరగా రమ్మని.  మరి ఎప్పుడు వెళ్తాము. సరేలే,  ఇప్పుడు నా ఫేస్ లో ఫీలింగ్స్ మారాయంటే బావ...  ఆమ్మో బావా కాదు కదా,  ఆయన,  ఏవండీ అనాలి, టైమ్ కి బానే గుర్తొచ్చింది. ఇంతకీ నవ్వుతూ ఉండకపోతే ఆయన గారు కనిపెట్టేస్తారు" అనుకుంటూ చిన్నగా నవ్వింది 


హరీష్ కళ్ళతోనే "ఏమయ్యిందీ నవ్వుతున్నావ్" అన్నట్లుగా కళ్ళతోనే అడిగాడు 


"మనసులోమాటలు వినిపించాయా ఏంటి కొంపదీసి" అనుకుంటూనే... "ఏమిలేదు " అంటూ కళ్ళతోనే చెప్పింది 


సత్య గారు.... "ఏంటిరా హరీ,  పొద్దునే రెడీ అయ్యావు. ఇంకా టైమ్ ఉంది కదా" 


"మేము ముందర వెళ్ళకపోతే బాగోదు కదమ్మా" 


"సరే " అంటూ వంటిట్లోకి వెళ్ళారు. స్వాతి అక్కడ అలా ఖాళీగా కూర్చుని ఏం చేయాలో అర్థం కాక,  అత్తగారి వెనకాలే వంటిట్లోకి వెళ్ళింది. 


"అత్తయ్యా నేనేమైనా చేయనా" 


"నువ్విప్పుడే వంట చేయక్కర్లేదులే స్వాతి. ఇంకా టైమ్ ఉంది. నేనయినా ఏమి చేయట్లేదు, టీ పెడ్తున్నా. ఇంకేమి లేదు. నువ్వూ తాగుతావు కదా,  లేక కాఫీ పెట్టనా"  


స్వాతికి టీ అస్సలు నచ్చదు. కానీ మొహమాటంగా, "ఎవరైనా కాఫీ తాగుతా అంటే నేను తాగుతాను. నా ఒక్కదానికి ఒద్దు అత్తయ్యా"  


"లేదు,  ఇంట్లో ఎవరికి కాఫీ అలవాటు లేదు. నీకు కలపమంటే కలుపుతాను." 


"ఒహ్హ్ సరే. నాకూ ఒద్దు. ఇప్పుడేమి అసలు తాగాలని లేదు" 


"సరే....ఇదిగో,  ఇది హరీ కి,  చెల్లాయి కి ఇచ్చేసెయ్యి. నేను మావయ్యగారికి ఇచ్చి వస్తాను" అంటూ రెండు కప్పులు ఇచ్చి ఆవిడ లోపలికి వెళ్ళారు 


పిన అత్తగారు...."హరీ,  ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావు. అదిప్పుడు మీ అత్తగారి ఇల్లు. అలా ముందరే వెళ్తే నిన్నూ ఇంకో రెండు పనులు చేయమంటారు. నీకు మర్యాద ఉండదు." 


"పనులు చెప్తే ఏమైందీ పిన్నీ. అత్తయ్య వాళ్ళే కదా" 


"అత్తయ్య కాదురా,  అదిప్పుడు నీకు అత్తగారిల్లు. నువ్వక్కడ మేనల్లుడివి కాదు,  అల్లుడివి. గుర్తు పెట్టుకో" 


"అటు చేసి ఇటు చేసి బయల్దేరేసరికి అదే టైమ్ అవుతుందిలే పిన్నీ" అంటూ న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు


టీ కప్పులు తీసుకొచ్చిన స్వాతి,  పిన అత్తగారికి ఇచ్చి,  హరీష్ కి ఈయబోయింది. కానీ హరీష్ పేపర్ చదువుతూ గమనించకపోవటంతో..."బా.. " అని ఆగిపోయి,  "ఏవండీ" అంది. 


కానీ సమాధానం లేకపోవటంతో మళ్ళీ పిలిచింది,  మూడోసారి పిలవబోయేసరికి,  పిన అత్తగారు.... "హరీ,  అమ్మాయి టీ తీసుకొచ్చింది. తీసుకో" అనటంతో,  టీ తీస్కుని,  "పిలవచ్చు కదా" అన్నాడు


"పిలిచానూ  " అంది బుంగమూతి పెట్టి 


ఇంతలో మహేశ్వర రావు గారు,  సత్యగారు టీ తాగుతూ వచ్చి కూర్చున్నారు. 


మహేశ్వర రావు గారు,  "అవునురా....,  ఎప్పుడు బయల్దేరుతున్నావు. ముందర వెళ్తే బావుంటుంది కదా. ఏదైనా సాయం కావాలన్నా కూడా ఉంటావు. మేము మెల్లిగా వస్తాములే" 


"సరే నాన్నా అయితే నేను బైక్ తీసుకెళ్తాను" 


మహేశ్వర రావు గారి ముందర ఎవరూ మాట్లాడలేరు. అందుకే సత్యగారి చెల్లెలు ఏమి అడ్డు చెప్పలేదు. 


స్వాతి.... "అత్తయ్య గారు,  మీరూ,  పిల్లలూ కూడా  వస్తున్నారు కదా" 


"వస్తామమ్మా.....  మీ అమ్మ గారు వాళ్ళు మరీ మరీ చెప్పారు అసలే" 


మహేశ్వర రావు గారు,  "స్వాతి నువ్వూ రెడీ అవ్వమ్మా. బయల్దేరుదురుగానీ" 


"అలాగే మావయ్యగారు" అంటూ అక్కడ నుంచి లేచీ పైన రూమ్ లో కి వెళ్ళి,  ప్రదీప్ కి మెసేజ్ చేసింది. 


"అన్నయ్యా ఒక అరగంట లో వస్తాము. మీవి కాఫీ లు అయ్యాయా"  


స్వాతి మెసేజ్ చూడగానే ప్రదీప్ ఫోన్ చేసి.... "చిన్నూ రారా త్వరగా..... ఇంట్లో పూజ కి నువ్వు లేకపోతే ఏంటోగా ఉంది. త్వరగా బయల్దేరండి" 


"వస్తాను కానీ,  నేనొస్తే నాకు కాఫీ దొరుకుతుందా చెప్పు ఇప్పుడే వచ్చేస్తా" 


"కాఫీకి మన ఇంట్లో లోటేమి లేదు. రా ముందైతే" 


"కాఫీ తో పాటు తాగటానికి తోడు ఎవరున్నారు మరి" 


"అందరమూ ఉంటాము రారా చిన్నూ" 


"అయితే ఒక పని చేస్తా,  అమ్మ కి ఫోన్ ఇయ్యవా" 


పద్మగారితో మాట్లాడుతుండగా,  హరీష్ రావటంతో,  "సరే అమ్మా,  ఈయన వచ్చారు. మేము బయల్దేరుతాములే. బాయ్" అంటూ ఫోన్ పెట్టేసింది 


"స్వీటీ ఏమైందీ" 


"ఏమవలేదు. చీర తీసుకుందామని వచ్చాను. ఇంతలో అన్నయ్యతో మాట్లాడుతున్నా" 


"అది కాదు,  ఈ రూమ్లో ఏం చేస్తున్నావ్ అని. మన రూమ్ అది. ఇది గెస్ట్ రూమ్" 


"తెలుసూ....  కానీ నా సూట్కేస్ ఇక్కడే ఉంది" 


"పద నేను తీసుకొస్తా" అంటూ అది తన రూమ్ లో పెట్టి,  "ఇదిగో ఈ డ్రెస్సింగ్ రూమ్ లో నీకు ఎలా కావాలంటే అలా సద్దుకో తర్వాత. ముందరైతే రెడీ అవ్వు" 


"బావా చీర,  నెక్లెస్ అవీ బాగ్ లో పెట్టేసుకున్నా. అక్కడే మార్చుకుంటా. బయల్దేరుదామా. అన్నయ్యా వాళ్ళు వెయిటింగ్. మావయ్యా కూడా వెళ్లమన్నారు కదా. పదా" అంటూ హడావిడి చేసింది


"సరే " అన్నాడు స్వాతి ని చూసీ నవ్వుతూ 


ఇద్దరూ ఇంటికి వెళ్ళగానే,  అందరూ గుమ్మం దగ్గరకొచ్చి వాళ్ళకి స్వాగతం పలికారు. లోపలికి వెళ్ళగానే, పద్మగారు కాఫీ తీసుకు వచ్చి ఇచ్చారు. 


హరీష్.... "ఇప్పుడేమి ఒద్దు అత్తయ్యా. ఇంట్లో తాగే బయలుదేరాము" 


"అమ్మా....  ఆయనకి వద్దేమో కానీ నాకు కావాలి" అంటూ ఆవిడ చేతిలో నుంచి కప్ తీసుకింది. హరీష్ తప్ప అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంగా స్వాతిని చూసారు.


"ఎందుకలా చూస్తారు,  అమ్మ చేతి కాఫీ తాగాలనిపించింది" అంది అమాయకంగా


రామ్ గారు,  ప్రదీప్....  హరీష్ తో కబుర్లు చెప్తుంటే స్వాతి లోపలికి వెళ్ళి అమ్మమ్మగారిని పలకరించి,  అన్విత తో మాట్లాడుతూ కూర్చుంది. 


"ఏంటే  సంగతులు....  అన్నయ్యని ఆయన ఏవండీ అంటున్నావు" అంది అన్వి నవ్వుతూ 


స్వాతి చిన్నగా నవ్వి,  "కొన్ని అలా అవుతూ ఉంటాయి. ఇక్కడ కబుర్లు చెప్పు" 


"ఇక్కడేముంటుంది. పొద్దున్న నుంచి,  స్వాతి లేచిందో లేదో,  కాఫీ తగ్గిందో లేదో,  స్వాతి ఉంటే డెకొరేషన్ బాగా చేసేది.... ఇంట్లో అందరూ బెంగ పెట్టేసుకున్నారు స్వాతి నీ గురించి. వాళ్ళు అనుకుంటున్నారని కాదు కానీ ...." 


స్వాతి... "నేనెలా ఉన్నా అంటావు. బానే ఉన్నానే. ఒక్క రోజులో ఏం తెలుస్తుంది చెప్పు లైఫ్. అదే మా అయన గురించి అడిగావనుకో....  ఏదైనా  ఆలోచించచ్చు... చెప్పటానికి" అంది నవ్వుతూ 


"అబ్బో.....  చెప్తే వినీ తరిస్తాము" 


"ఇప్పుడు కాదులే,  ముందు వ్రతం హడావిడి అవనీయి. తర్వాత మాట్లాడచ్చు" అంటూ అన్విత తో పాటు రెడీ అయి బయటకి వచ్చి హరీష్  పక్కన కూర్చుని,  


స్వాతి... "అన్నయ్యా....  బావుందా" 


పద్మగారు... "అదేంటే నిన్ను ఆ గ్రీన్ కలర్ పట్టు చీర కట్టుకోమన్నాను కదా. ఇది తెచుకున్నావేం. పైగా వాడిని అడుగుతున్నావు" 


ప్రదీప్...  "అమ్మా అది చీర గురించి అడగటం లేదులే. బావుందిరా చిన్నూ...."


అమ్మమ్మగారు..... "పద్మా అది వాళ్ళాయనతో మాచింగ్ కోసమని నువ్వు చెప్పిన చీర కట్టుకోలేదు. అంతేనా మనవరాలా" అన్నారు నవ్వుతూ 


"నీకన్నీ అర్థమయినా మళ్ళీ ఎందుకడుగుతావ్ అమ్మమ్మా" అంది సిగ్గుపడుతూ 


అప్పటి వరకూ హరీష్ కూడా గమనించలేదు,  అతను బ్లూ కలర్ కుర్తా,  స్వాతి కూడా బ్లూ కలర్ పట్టుచీర కట్టుకుందని. 


పద్మగారు..... "అవును పిన్నీ,  నేనూ గమనించలేదు. బావున్నారు ఇద్దరూను" అని మురిసిపోయారు 


కొద్దిసేపటికి వ్రతం మొదలయ్యింది. హరీష్ వాళ్ళ ఇంట్లో  వాళ్ళందరూ వచ్చారు. స్వాతి ప్రదీప్ దగ్గరే కూర్చుంది. 


రామ్ గారు.... "వెళ్ళి అల్లుడిగారి  దగ్గర కూర్చో,  ఒక్కరూ   ఉన్నారు" 


స్వాతి రామ్ గారికి మాత్రమే వినిపించేలా,  "నాన్నా అల్లుడుగారా... మీకన్నా చిన్నవాళ్లు నాన్నా " 


"నీకు అర్థం కాదులే కానీ,  నువ్వు ముందు అక్కడ కూర్చో" అనటంతో ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది 


వ్రతం భోజనాలు అయ్యాక, వచ్చిన చుట్టాలు వెళ్ళిపోయారు. 


స్వాతి..  "ఏవండీ" అంటూ హరీష్ ని పిలిచింది. తను ఫోన్ లో ఏదో చూసుకుంటూ వినిపించుకోకపోయేసరికి రెండు సార్లు పిలిచి,  "మిమ్మల్నే" అంటూ తట్టింది. 


హరీష్,  ఏంటన్నట్లుగా తనని చూసాడు. 


"మీరు డ్రెస్ మార్చుకుంటారా.కంఫర్ట్ గా ఉండదేమో అని" 


"నేనేమి తెచ్చుకోలేదు కదా. పర్వాలేదు,  నేను ఓకేనే" 


"మీ డ్రెస్ తీసుకొచ్చాను ఇంకోటి. అమ్మ నాకు అలా పెట్టుకోమని ఎప్పుడూ చెప్తూ ఉండేది ఆ అలవాటులో...... " 


"సరే....  ఎక్కడుంది" 


"నేను తీసుకొస్తాను. మావయ్యగారు వాళ్ళు వెల్దామంటున్నారు. మనం ఎప్పుడు బయల్దేరుతామో అడగమన్నారు. ఏవండీ మీకు పర్వాలేదంటే,  మనము అమ్మమ్మ బయలుదేరక వెళ్దామా" 


ఆ మాటకి స్వాతిని సీరియస్ గా చూసాడు హరీష్. తనకి ఉండాలని లేదేమో అనుకుంటూ 


స్వాతి... "ఒద్దులెండి. వెళదాము. నేను మీ డ్రెస్ తీసుకొస్తాను"


"నేను నాన్నతో మాట్లాడి వస్తాను" అంటూ హరీష్ కూడా వాళ్ళ దగ్గరకి వెళ్ళాడు 


హరీష్,  వాళ్ళ నాన్నగారితో, .... "నాన్న,  బామ్మగారు సాయంత్రం ఊరు బయల్దేరుతున్నారు. మేము కొంచం సేపు ఉండి వస్తాము" 


"అలాగే హరీ" 


ఇంతలో స్వాతి అక్కడికి వచ్చి,  హరీష్ ని పిలిచింది. ఈ సారి మాత్రం హరీష్ అసహనంగా స్వాతిని చూసాడు. హరీష్ వాళ్ళ అమ్మ నాన్నగారు,  పిన్నీ,  బామ్మగారు,  అన్విత ప్రదీప్,  పద్మ రామ్ గారు అందరూ అక్కడే ఉన్నారు. అందరి వైపు ఒకసారి చూసీ,  


"స్వీటీ పోద్దున నుంచి చూస్తున్నాను. ఏమిటీ ఈ కొత్త పిలుపు. నువ్వు నన్ను ఎప్పుడూ పిలిచేలాగా "బావా" అంటేనే నాకు ఇష్టం. పేరు పెట్టి పిలిచినా సంతోషిస్తాను కానీ ఇలా "ఏవండీలు, గారులు" ఒద్దురా. "ఏవండీ" అంటేనే నాకు గౌరవం ఇచ్చి నలుగురిలో నా పరువు నిలుస్తుందనుకుంటున్నావా. పెళ్ళి మనుషుల్ని దగ్గర చేయాలి,  ఇలా కొత్త మర్యాదలు ఇచ్చి దూరం పెంచకూడదు" 


రామ్ గారిని చూస్తూ,  "మావయ్యగారు,  మీరు నాకైనా పెద్దవారు. మీరు నన్ను అల్లుడు గారు అనటం ఏంటండీ. హరీ అని మీరు పిలుస్తుంటే ఆప్యాయంగా అనిపిస్తుంది. నేను మీలో ఒకడిగా ఉండాలనుకుంటున్నాను.ఇలా పిలిచి దూరం పెట్టకండి. మీతో ఇలా మాట్లాడినందుకు క్షమించండి. " 


రామ్ గారు... "నువ్వా మాట అన్నావు మాకు అదే మాకు పెద్ద బలం,  హరీ" అంటూ బొంగురుపోయిన గొంతుతో హరీష్ భుజం తట్టారు 


మహేశ్వర రావు గారు..... "హమ్మయ్యా నా మనసులో మాట చెప్పావురా హరి. అమ్మా స్వాతి,  నీకు నా దగ్గరకు చిన్నప్పటి నుంచి చనువు. అలాంటిది కొత్తగా మావయ్యగారు ఎందుకమ్మా. మీ అమ్మ కి మాటిచ్చాను,  కోడలైనా కూతురైనా నువ్వేను నాకు. మరి మీ నాన్నగారిని "గారు" అనవు కదా నన్నెందుకు అంటున్నావు కొత్తగా" అంటూ స్వాతిని దగ్గరకి తీసుకున్నారు


హరీష్.... "ఇంతకీ ఎందుకు పిలిచావురా " అన్నాడు,  స్వాతి అందరిలోనూ ఖంగారు పడుతోందని మాట మారుస్తూ 


"బట్టలు..."  అంటూ కవర్ చూపించింది


"ఇటు ఇయ్యి" అని తీస్కుని బయటకి వెళ్ళి,  మళ్ళీ స్వాతిని పిలిచాడు 


"ఏంటి బావా" 


"బట్టలు ఇచ్చేస్తే ఎక్కడ మార్చుకోనురా" 


"హాహా....  రా...  "అంటూ తన రూమ్ చూపించి,  వెళ్ళమంది


స్వాతిని కూడా రూమ్ లోకి తీస్కుని వెళ్ళి, తలుపు వేసి,  నుదుటి మీద ముద్దు పెట్టుకునీ... " గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందిరా,  ఏమనుకోకు.  నిన్ను కోప్పడలేదు" అన్నాడు తనని కౌగలించుకుని బుజ్జగిస్తూ 


హరీష్ ని గుండెల మీద ముద్దు పెట్టుకుంటూ...."పర్వాలేదు కృష్ణా. నాకూ అలా నచ్చలేదు.  కానీ తప్పలేదు" 


"అందుకే అందరి ముందర చెప్పాను.  ఇంక నిన్నెవరూ ఏమి అనరూ" 


"నన్నెవరేమన్నారు" అనడిగింది కొంచం ఖంగారుగా 


"రమ్య కి నిజంగానే పెద్ద గొంతే" అంటూ నవ్వాడు 


"అంటే.... " 



"నిన్న తన మాటలు బాగానే వినిపించాయి.  మా పిన్నీ అంటే,  నువ్వు నాతోనైనా చెప్పద్దూ.  రేపొద్దున్న మళ్ళీ ఇంకెవరూ ఈ మాట అనకుండా అనే అందరి ముందర చెప్పాను.  జాబ్ విషయం లో అయినా సరే,  నీకు నచ్చినది నువ్వు చేయి. ఇంకెప్పుడైనా ఎవరైనా నిన్ను అన్నారనుకో,  మా బావ ఇలానే పిలవమన్నాడు అని చెప్పు.  సరేనా" 


"హ్మ్మ్... అంటే నీకు నిన్ననే తెలుసా..... మరి ఒక్క మాట చెప్పలేదేం" 


"నిన్నా మాట్లాడదామనే అనుకున్నా. కానీ రాత్రి కొంచం బిజీ అయిపోవటం తో మర్చిపోయాను. పొద్దున్న నుంచి నువ్వేమో ఏవండీ ఏవండీ అంటూ బుర్ర తినేసావు" 


"హీహీ... " 


"ఇంతకీ పెళ్ళి లో ఏమైందీ. ఏమన్నారు నిన్ను" 


"ఏమవలేదు కానీ,  త్వరగా రా బావా..... నేనిక్కడే ఇంత సేపు ఉంటే బాగోదు" అంటూ వెళ్ళిపోయింది


ఆ తర్వాత కొంచం సేపటికి,  హరీష్ వాళ్ళ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 


*********************************************


ఈరోజుతో నా సీరియల్ యాభై ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నా తొలి రచనను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు. ఒక రచయిత్రి కి కావల్సిన ప్రోత్సాహం....  తను రాసినది నలుగురూ చదవటం,  చదివినదాని గురించీ మీ అభిప్రాయాలూ తెలపటము.  నలుగురు కాదు ఈరోజు ఇంతమంది అభిమానమే నన్ను ముందుకి నడిపిస్తోంది.



Comments