48

 అప్పగింతలు కార్యక్రమంలో స్వాతిని ఓదార్చటం ఎవరి తరం  కాదని అందరూ భయపడ్డారు. కానీ అందరి ఆలోచనలకూ భిన్నంగా,  ఒక్క కన్నీటి చుక్క రానీయలేదు. తన బదులు కూడా ప్రదీప్ యే బాధపడ్డాడు. అన్నీ చూస్తున్నా,  మౌనంగా వెళ్ళిపోయింది స్వాతి. 


కళ్ళ నిండా నీళ్ళతో కూతుర్ని వదలలేక,  మౌనంగా ఉండిపోయారు రామ్ గారు.  పద్మగారు మాత్రం మహేశ్వర రావు గారితో,   ... "అన్నయ్యా,  స్వాతి జాగ్రత్త" అన్నారు బాధలో మాటలు కూడగట్టుకుంటూ 


"పద్మా...  ఏంటమ్మా ఇదీ. స్వాతి మా ఇంటికి కోడలు అయినా మాకు మాత్రం తను కూతురే.  ఏమి బెంగ పెట్టుకోకు. అయినా ఎక్కడికెళ్తోంది,  నీ పుట్టింటికే కదా. నువ్వెప్పుడైనా రావచ్చమ్మా" 


పద్మగారు,  సత్యగారి వైపు చూసారు,  ఆవిడ ఏమంటారో అన్నట్లుగా. ఆవిడ కళ్ళతోనే నాదీ అదే మాట అన్నట్లుగా చెప్పారు (నిజంగా చెప్పారో,  పద్మగారు అలా అర్థం చేసుకున్నారో మరి 🤔🤔)


కార్ లో ఇంటికి వెళ్తున్నంత సేపు, విండో లో నుంచి బయటకు చూస్తూ ఉండిపోయింది స్వాతి


హరీష్.... "స్వీటీ....  నేను  నీతోనే ఉంటాను కదరా. బాధపడకూ. ఒక్కసారి ఏదో ఒకటి మాట్లాడరా" అంటూ తన చేతిని పట్టుకున్నాడు


స్వాతి చిన్నగా నవ్వి తన చేతిని మెల్లిగా హరీష్ చేతుల్లోంచి విడిపించుకుని,  "బావా నువ్వు పట్టుకుంటే ఇందాకటి నుంచి ఆపుకుంటున్న దుఃఖం బయటకి వచ్చేసేలా ఉంది. ప్లీజ్ ఏమనుకోకు" అని మనసులోనే అనుకుంటూ,  "పర్వాలేదు బావా. బానే ఉన్నాను" అంది మొహాన్ని పక్కకి తిప్పి కిటికీలో నుంచి బయటకు చూస్తూ. 


ఇంటికి వెళ్ళాకా,  గృహప్రవేశం చేయబోతుంటే, హరీష్ వాళ్ళ చుట్టాలు, వీళ్ళిద్దరిని ఆపి పేర్లు చెప్పమన్నారు.... 


స్వాతి సిగ్గుపడుతూ,  "నేనూ,  బావా వచ్చాము" 


హరీష్ వాళ్ళ పిన్నీ.... "బావ ఏంటి...... ఆ బావ కి పేరు లేదా "


హరీష్ కి స్వాతి ఇబ్బంది అర్ధమయ్యి,  "నేను చెప్తా కదా

"నేనూ,  నా భార్య స్వాతి కలిసి వచ్చాము. ఇంక దారి వదులుతారా" 


"ఆ మరే..... తను చెప్పదేంటి" 


"నేను చెప్పాను కదా,  ఇద్దరి బదులు. అసలే రెండు రోజులు నుంచి నిద్ర లేదు. తను చాలా టైర్డ్ గా ఉంటుంది" 


"అబ్బో....  ఇప్పటి నుంచే సపోర్టింగా. అదేమీ కుదరదు. తనూ చెప్పాల్సిందే" 


స్వాతి మెల్లిగా...  "నేనూ,  మా బావ హరీష్ కృష్ణ కలిసి వచ్చాము"


అందరూ నవ్వులతో లోపలికి తీస్కుని వెళ్ళారు. అక్కడ కార్యక్రమాలు అయ్యాక,  


సత్య గారు....  "స్వాతి....  మీరు పైన ఇంకో రూమ్ లో కొంచం సేపు  రెస్ట్ తీస్కుని ఫ్రెష్ అయ్యి రండీ. వ్రతం మొదలవటానికి ఇంకా టైమ్ ఉంది" అంటూ ఆ రూమ్ కి దారి చూపించారు 


స్వాతి,  రమ్యా ఆ రూమ్ లో కి వెళ్ళారు. రూమ్ లో కి వెళ్ళగానే,  


రమ్య...  "ఓయి నేనెందుకు నీతో పాటు. రాను అంటుంటే,  ఆంటీ ఫోర్స్ చేసి పంపించారు,  నీకు తోడు ఉంటానని. నాకెవరు తెలుసు చెప్పు ఇక్కడా" 


"రమ్మీ,  అక్క కూడా వచ్చారు కదే. తనూ బాగా మాట్లాడ్తుంది. నీకు టైమ్ పాస్ అవుతుందిలే. అయినా పూజకి అమ్మా వాళ్ళు వస్తారు. ఆ తర్వాత వెళ్ళిపోతావుగా ఎలాగో" 


"అవునే ఆ అక్క ఎవరు" 


"హేయ్ మర్చిపోయావా,  నా బర్త్డే కి మా పెద్ద మావయ్యా వాళ్ళొచ్చారు కదా. ఆ పెద్దబావ వాళ్ళ వైఫ్ తను. మా అందరితో బాగా క్లోజ్..." 


"సరే,  ఇంతకీ నువ్వెందుకు అంత డల్ గా ఉన్నావు" 


"ఏంలేదే....  నువ్వు కొంచం సేపు పడుకో మళ్ళీ తర్వాత లేపేస్తారు. అదిగో అక్క కూడా వచ్చేసారు" 


"స్వాతి, నేనే కాదు నాతో ఎవరొచ్చారో చూడు" అంటూ ఆవిడ హరీష్ ని లోపలికి రమ్మన్నారు. 


అప్పటి వరకు మంచం మీద మోకాళ్ళ పైన  తల వాల్చుకుని కూర్చునదల్లా,  "బావా... " అంటూ లేచింది


హరీష్ నవ్వుతూ,  "స్వీటీ ఏమైనా కావాలా ఇక్కడా" 


"ఆఁహాఁ ఏమి ఒద్దు బావా...  అన్నీ ఉన్నాయి" 


"సరే... ".... "ఒకసారి బయటకిరా" అంటూ కళ్ళతో సైగ చేసాడు 


"వీళ్ళు ఉన్నారంటూ" స్వాతి కూడా అలాగే సమాధానం చెప్పింది


రమ్య...  "అక్కా...  వీళ్ళ మూగ సైగలు నాకేనా మీకూ కనిపిస్తున్నాయా" 


"కనిపిస్తూనే ఉన్నాయి రమ్య...స్వాతి....మీ ఆయనే కదా  పిలుస్తున్నాడు,  వెళ్ళిరా" అని అనటంతో తప్పదని బయటకి వెళ్ళింది స్వాతి


రూమ్ బయటకి వెళ్ళగానే,  ఆ తలుపు దగ్గరకి వేసి,  ఎదురుగా ఉన్న హరీష్ రూమ్ లోకి లాక్కుని వెళ్ళి తనని గట్టిగా హత్తుకోబాయడు. 


"బావా....  ఏంటిది. అమ్మమ్మ ఇవన్నిటికి టైమ్ ఉందని చెప్పమంది" అంది తనని దూరం జరుపుతూ 


"బామ్మగారా....  నాకు చెప్పమనటం ఏంటి. నేనిలా చేద్దామని నేనే అనుకోలేదు ఆవిడకి ఎలా తెలిసిందంటావ్" అన్నాడు ఆలోచిస్తూ 


"నీ గురించీ తెలుసు కదా. అందుకేనేమో" అంది తనూ చిన్నగా నవ్వుతూ 


స్వాతి మెడలోని తాళి ని బయటికి వేసి,  "ఈ పసుపు తాడుతో నువ్వు ఇంకా ముద్దొచ్చేస్తున్నావురా పండూ.... దూరం గా ఉండమంటే ఎలా చెప్పూ" 


"అందుకే నేను వెళ్తాలే" అంటూ కదలబోయింది. 


"సరే ఏమి చేయను కానీ ఇటు రా"అంటూ స్వాతి చెంపల మీద చేతులు వేసి తన కళ్ళలోకి చూస్తూ,   "ఇప్పుడు చెప్పు ఎందుకు డల్ గా ఉన్నావు" 


"ఏమి లేదు బావా" అంటూ హరీష్ కళ్ళలోకి చూడలేక చూపు తిప్పుకునే ప్రయత్నం చేసింది కానీ ఎటూ కదలలేక కళ్ళు దించేస్కుంది 


"ఏమిలేకపోతే నన్ను చూడు. కళ్ళల్లో ఆ నీళ్ళెందుకు. సరే, ఒక సారి అత్తయ్యతో మాట్లాడతావా. ఫోన్ చేయనా" అంటూ తన భుజం మీద ప్రేమగా చేయి వేసాడు 


"ఒద్దు బావా. మాట్లాడలేను" అంటూ అప్పటివరకూ ఆపుకున్న దుఃఖం తన్నుకొచ్చేసింది. హరీష్ గుండెల మీద వాలి... "బావా...  ఇందాక కార్ లో నీ చేయి తీసేసినందుకు సారీ. నీ స్పర్శ తో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకే తీసేసాను. సారీ" 


"నేనేమి ఫీల్  అవలేదురా. దానికి సారీ ఎందుకు. ఇప్పుడు అందుకోసం ఏడుస్తున్నావా"


"కాదు....  ఇందాక అమ్మ వాళ్ళని వదిలి వస్తుంటే వాళ్ళకి దూరంగా వచ్చేస్తున్నట్లనిపించింది. అన్నయ్య బాధపడుతుంటే ఏడుపొచ్చేసింది" 


హరీష్ స్వాతి తల మీద రాస్తూ,   తననింకేమి అడగలేదు. హరీష్ గుండెల మీద అలా కొద్ది సేపు ఉన్నాకా, లేస్తూ "బావ నేను ఏడ్చానని ఎవరితోనూ చెప్పకూ" అంది కళ్ళుతుడుచుకుంటూ


అప్పటివరకూ ఏడ్చి అంతలోనే ఎవరికీ చెప్పద్దనేసరికి హరీష్ కి నవ్వొచ్చేసింది. "హహహ...  ఎందుకు  చెప్పకూడదు"  


"నేను ఏడవకపోతే అన్నయ్య రోజు వచ్చి నన్ను కలుస్తా అన్నాడు.   అందుకే ఏడుపు ఆపెసుకున్నా ఇందాక కూడా" అంది హరీష్ నుంచి దూరం జరుగుతూ 


" తను నిన్ను కలవడు......  కలవనీయను" 


అప్పటి వరకూ నవ్వుతూ ప్రేమగా మాట్లాడిన హరీష్ అలా కోపంగా మాట్లాడటం అర్థం కానట్లుగా తన కళ్ళలోకి చూసింది. 


"ఏం చూస్తున్నావ్. నువ్వు విన్నది నిజమే. మీ అన్నయ్య  ఎన్ని సార్లు నాతో ఆడుకున్నాడో... ఎవరికీ చెప్పుకోలేక నేనెంత బాధపడ్డానో నీకేం తెలుసు. అందుకే తనకి ప్రాణం అయినా నిన్ను పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు. వాళ్ళెవరూ ఇక్కడకి రారు,  రానీయను"



Comments