47

 పద్మగారు.... "స్వాతి ఏదిరా చేతులు చూపించూ... చాలా బాగా పండిందమ్మా" అంటూ మురిసిపోయారు 


రామ్ గారు.... "బంగారం....  త్వరగా పడుకో తల్లీ. పొద్దున లేవాలి మళ్ళీ" 


"అమ్మా....  మీతో పాటు పడుకోవచ్చా. ప్లీజ్ నాన్నా" 


"సరే తల్లీ పడుకో. పదా" 


ప్రదీప్ కూడా వాళ్ళ రూమ్ లో కే చేరాడు. స్వాతి పద్మ గారి పక్కన పడుకుని,  


"అన్నయ్యా,  మనం ఫ్యామిలీ గా స్పెండ్ చేసే లాస్ట్ నైట్ ఇదే కదా. రేపు సంగీత్ అంటూ ఫంక్షన్ హాల్ కి వెళ్తే ,  ఆ తర్వాత పెళ్ళి పనులు మొదలయిపోతాయి.  ఆ తర్వాత నుంచి నా ప్లేస్ లో అన్వి వచ్చేస్తుంది. ఎప్పుడంటే అప్పుడు ఇలా రాగలనో లేదో" 


"చిన్నూ,  నీ ప్లేస్ లో అన్వి రావట్లేదు. తనని అమ్మ వాళ్ళు నీతో సమానం గా చూస్తారు. ఎప్పుడు కావాలన్నా రాగలవు,  అలాంటి భయాలు పెట్టుకోకు. బావ గురించి నాకు తెలుసు" 


పద్మ గారు...."హరీష్ అనుకుంటే సరిపోతుందా ప్రదీపు. అది ఇక్కడకి రావాలంటే అత్తయ్యా మావయ్యా ని కుడా అడగాలి. స్వాతి,  అక్కడ పొద్దునే త్వరగా లేచీ,  అత్తయ్య కి ఏదైనా కావాలంటే సాయంగా ఉండు. నీకు కుదిరినంత వరకు  ఇంట్లో  పనులు చేయటానికి ప్రయత్నించు. ఇక్కడకి అక్కడకి అలవాట్లు వేరు ఉండచ్చు. తెలుసుకుని మెలగరా. అది నీ ఇల్లు" అని కూతురి తల నిమురుతూ జాగ్రత్తలు చెప్పారు 


"సరే అమ్మా. అమ్మా..... అన్వి ని ఒక్క మాట అనకమ్మా. నేను " 


"చిన్నూ అప్పగింతలప్పుడు ఏడ్చావంటే మాత్రం ఊరుకోను చెప్తున్నా.  అందరూ మన వాళ్ళే. నువ్వెక్కడికి వెళ్ళిపోవటం

లేదు.  అర్థమయ్యిందా" 


స్వాతి ప్రదీప్ ని చూసింది.  ఆ చూపులో కోపం,  బాధ అన్నీ ఉన్నాయి.  కానీ ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది.  రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని,  తెరవకుండానే.... "అన్నయ్యా అలా నేను నవ్వుతూ వెళ్ళాలి అంటే మీరు రోజూ,  పోనీ రోజూ కుదరకపోయిన రోజు విడిచి రోజైన సరే మిమ్మల్ని నేను చూడాలి. ఏం వంక పెడ్తారో మీ ఇష్టం" 


"సరే....  మాలో ఎవరికీ వీలున్నప్పుడు వాళ్ళము వచ్చి కలుస్తాములే" 


"నిజంగానా " అంటూ లేచీ కూర్చుని మెరిసే కళ్ళతో ప్రదీప్ ని చూసింది" 


"నిజంగానే" 


"రామ్ గారు.....  "ఇంక పడుకోండి.  పొద్దునే లేపేస్తారు అమ్మమ్మగారు.  తర్వాత మీ ఇష్టం" 


ఆయన మాటకి అందరూ ముసుగు వేసేసారు.  ఆయన ఏవో ఆలోచనలతో మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు.  


తెల్లవారుతూనే ఇంట్లో సందడి మొదలయ్యింది.  అందులోను ఇంట్లో  రెండు శుభకార్యాలు  అవటం తో,  హడావిడి రెట్టింపయ్యింది.  


మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టారు. స్వాతికి, వాళ్ళ అమ్మా నాన్న గారికి తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేశారు. రామ్ గారి వైపు ఆయన అక్కా,  పిల్లలు మాత్రమే వచ్చారు. పద్మ గారి వైపున ఆవిడ పెద్దన్నయ్య కుటుంబం వచ్చింది. అమ్మమ్మగారు,  ఆవిడ మిగతా పిల్లలు కూడా వచ్చారు. అక్కడ కార్యక్రమం ఎంతో సంప్రదాయబద్ధంగా జరుగుతుంటే వెనకాల ఏవో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. 


స్వాతి.... "అన్నయ్యా.... ఇంట్లో ఏదో అవుతోంది. ఎందుకో అత్తయ్యా సంతోషంగా లేదనిపిస్తోంది" 


"చిన్నూ,  అవేమి పట్టించుకోకు. ఆవిడ సంగతీ తెలిసిందే కదా. వదిలెయ్యి" 


అన్విత అక్కడ వాళ్ళింట్లో ఫోటోలు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంది.  స్వాతి కి తనని చూడాలని ఎంతో ఆశగా ఉన్నా ఇంట్లో ఒప్పుకోకపోవటంతో ఎదురు చెప్పలేకపోయింది.  


పొద్దున్న హడావిడి అయ్యేసరికి సాయంత్రం సంగీత్ కి అందరూ బయల్దేరారు. 


స్వాతి ... "అన్వి.....రమ్యేమో డాన్స్ అంటోంది. చేయకపోతే ఊరుకోదు. నాకెందుకో సిగ్గుగా,  టెన్షన్ గా ఉంది. చెప్తుంటే అర్థం చేసుకోవటం లేదే" 


"స్వాతి....  అన్నయ్య దగ్గర సిగ్గెంటి చెప్పు. పోనీ కొంచం సేపు ఏవైనా కబుర్లు చెప్పు. నీకూ టెన్షన్ తగ్గుతుంది" 


"అన్వి నీకిలా లేదా" 


"ఏమోనే ఏమి అనిపించటం లేదు. నేను ఎక్ససైటెడ్ ఉన్నాను,  నేనసలు ఈ పెళ్ళి అవ్వదేమో అనుకున్నాను,  అలాంటిది నీ వలన తను నా లైఫ్ లో కి మళ్ళీ వచ్చాడు, అదీ ఈసారి జీవితాంతం తోడుగా ఉండబోతున్నాడు. ఇంక దానికైనా ఏమి కావాలి చెప్పు. నా సంగతి సరే,  నువ్వు ముందు హరన్నయ్య తో మాట్లాడు" అంటూ ఎవరో పిలిస్తే వెళ్ళిపోయింది 


స్వాతి కూడా వెల్దామనుకునేలోపు అప్రయత్నంగా తనకి సత్య గారి మాటలు వినిపించడంతో ఆగిపోయిందీ. 


లోపల సత్య గారి చెల్లెలు తనతో,  


"అక్కా మన హరి కి ఎంతెంత పెద్ద సంబంధాలు వచ్చాయి. ఎంత కట్నం అయినా కూడా ఇయటానికి క్యూలో ఉన్నారు. అవన్నీ కాదని ఈ పిల్లని చేసుకోటం ఏంటి" 


"ఏంచేయమంటావే. వాడేమో ఇంక వేరెవ్వరిని చేసుకోనని తెగేసి చెప్పేసాడు. ఎప్పుడూ లేనిది మీ బావగారు నా మీద అరిచారు. ఇంక నేనేం మాట్లాడినా వాళ్ళు వినిపించుకోరని తప్పక ఒప్పుకున్నాను. కట్నం అడగటానికి వీల్లేదన్నాడు" 


"వాడు ఇప్పుడు ఒప్పుకోకపోయినా కొన్నాళ్ళాగితే వాడే మనం చెప్పేది అర్థం చేసుకునేవాడు. ఇంకో సంబంధాలైతే వాడూ లైఫ్ లో సెటిల్ అయ్యేవాడు. తొందరపడ్డావు" 


స్వాతి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. "అత్తయ్య కి ఇష్టం లేకుండా ఒప్పుకున్నారా. వాళ్ళు సరే అన్నారని చెప్పినప్పుడు ఒక్కసారి కూడా నేనూ అడగనేలేదు. నన్ను చేస్కోకపోయుంటే బావ లైఫ్ సెటిల్ అయ్యేదా" కళ్ళలో నుంచి నీరు కారిపోతోంది. కానీ అవేవి పట్టించుకునే స్థితి లో లేదు. 


"చిన్నూ... " తన కన్నీళ్ళని తుడుస్తూ,  "ఏమయిందిరా. ఎందుకేడుస్తున్నావు" అన్నాడు ప్రదీప్ తనని అలా చూసీ ఖంగారుగా


"అన్నయ్యా.....  నేను తొందరపడ్డానేమో. నేను బావ లైఫ్ లో కి రాకపోతే తనకి ఇంకా మంచి సంబంధం బాగా కట్నం ఇచ్చేవాళ్ళు ఉన్న సంబంధం వచ్చి హ్యాపీ గా సెటిల్ అయ్యి ఉండేవాడేమో" 


"చిన్నూ... అటు చూడు. బావ హ్యాపీగా లేడా. ఈరోజు కోసం మీ ఇద్దరూ ఎదురుచూస్తున్నారు. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. ఇంక డబ్బు అంటావా, తన గురించీ నేను నీకు చెప్పక్కర్లేదేమో. తనకి నీకైనా ఏది ఎక్కువ కాదు." 


"తెలుసన్నయ్యా. కానీ ఈ పెళ్ళి.... " 


"చుప్...  అనవసరమైన వాటి గురించి ఆలోచించకు. పదా వెళదాము" అంటూ తనని తీస్కుని వెళ్తూ,  ఏదో గుర్తొచ్చినవాడిలాగా ఆగి,  


"చిన్నూ,  ఎవరైనా ఏమైనా అన్నారా" 


"...." 


"నీతోనా? " 


"కాదు....  విన్నాను. ఎవరని మాత్రం అడక్కు" 


"సరే....  చిన్నూ...  పెళ్ళికి వచ్చినప్పుడు ఏవో ఒక మాటలు అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోవక్కర్లేదు. పెళ్ళితో,  మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. సరేనా" 


"హ్మ్.. " 


"హ్మ్...  కాదు. నవ్వు చక్కగా,  లేదా బావ ని పిలుస్తాను" 


"ఆమ్మో ఒద్దు....  బానే ఉన్నానూ. ఏంటో వినగానే ఏదోగా అయిపోయింది. అంతే. నా వలన బావ మాట పడ్డాడు అని కొంచం బాధ అంతే. సరేలే...,  చూడు నవ్వుతున్నా,  వెళదాము.... మళ్ళీ మీ అన్విత కూడా నన్ను తిట్టుకుంటుంది ఇప్పుడూ"  


"దాని మొహం అదేమీ అనుకోలేదు కానీ,  ఇంకొకళ్ళు గురించి ఆలోచించి లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ని మిస్ అవ్వకు" అంటూ మెల్లిగా చెప్పి హరీష్ పక్కన కూర్చోమని,  హరీష్ కి స్వాతి ని చుస్కోమన్నట్లుగా కళ్ళతోనే చెప్పి, తనూ అన్విత పక్కన కూర్చున్నాడు. 


అన్విత "ఏమయిందన్నట్లుగా" ప్రదీప్ ని చూసింది. ప్రదీప్ కూడా కళ్ళతోనే,  "ఏమిలేదని" చెప్పాడు 


స్వాతిని చూసిన హరీష్ కి తను ఏడ్చింది అని చూస్తేనే అర్థమయ్యింది. హరీష్ మెల్లగా,  "స్వీటీ ఎందుకురా ఏడ్చావు. ఎవరైనా ఏమైనా అన్నారా" 


"ఆహా ఏమి లేదు బావా" 


తనెలాగో చెప్పదని  తెలిసి,  "సరే" అంటూ స్వాతి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. హరీష్ స్పర్శ తో అప్పటి వరకూ ఉన్న భయం,  బాధ అన్నీ మరిచిపోయింది. మనసు తేలిక పడింది.


ఇంతలో పిల్లలు అందరూ కలిసి ప్రదీప్ ని ఆటపట్టిస్తూ డాన్సులతో తన చూట్టూ చేరారు


నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా...


నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా...


నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా...


ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా...


తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ పోయా... 


ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా...



నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా...


నా చెంత నువు చేరిక ఓ దారమల్లె లాగా...


నీ నీలి కురుల నుండి ఓ పూల గాలి రాగా...


నా ప్రేమ అన్న గాలి పటం చంద్ర మండలాన్ని చేరగా...



తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ పోయా... 


అసలు చందమామ నువ్వే అంటూ నేల మీద వాలిపోయా... 


అంటూ ప్రదీప్ స్టెప్పులేశాడు. తర్వాత రమ్య వచ్చి,  "స్వాతి....మీ అన్నయ్య అన్విత ని చందమామ అంటూ ఇంక ఏవేవో తో పోల్చేసాడు. మరి హరి అన్నయ్య గురుంచి నువ్వేమంటావు"  అని అడిగేసరికి స్వాతి.... 


నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా

నాతో నేను నీతో నేను నీవెంటే నేను రా

ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను

ఎంత ఎంత ముద్దొస్తున్నావో

ఎంత ఎంత అల్లేస్తున్నావో

నువ్విలా నాలో నుంచి నన్నే

మొత్తంగా తీసెసావు


అంటూ స్వాతి మొదలు పెట్టేసరికి,  హరీష్ కూడా తనతో కిలిసాడు. 


చల్లగాలి చక్కలిగింతల్లో నువ్వే

చందమామ వెన్నెల కాంతుల్లో నువ్వే నువ్వే

రంగు రంగుల కుంచెల గీతం లో నువ్వే

రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే

అటు ఇటు ఎక్కడో నువ్వు ఎటు నిలిచినా

మనసుకు పక్కనే నిన్నిలా చూడనా

నీది ధ్యాసలో నను నేను మరిచిన

సంతోషంగా సర్లే అనుకొన్న ఎన్నాళ్లయినా


రమ్య.....  "అబ్బో అన్నా ....  స్వాతి మీ గురించీ చాలా బాగా డాన్స్ చేసి మరీ చెప్పింది. మీరేదో ఒక గిఫ్ట్ ఇయ్యాల్సిందే" 


స్వాతి...... "హేయ్ రమ్య" అంటూ స్వాతి రమ్య ని ఆపబోతుంటే,  హరీష్ లేచీ వెళ్ళి.... 


నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

నెలవంకకు ఇద్దామనుకున్నా..

నీ నవ్వుకు సరిపోదంటున్నా...

నువ్వే నడిచేటి తీరుకే

తారలు మొలిచాయి నేలకే

నువ్వే వదిలేటి శ్వాసకే

గాలులు బ్రతికాయి చూడవే

ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే


నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా


హో... వానవిల్లులో ఉండని రంగు నువ్వులే

ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే

నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే



ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే

చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే

నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే


ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా

ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా

కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా................


అంటూ స్వాతి ముందర మోకాళ్ళ మీద కూర్చుని తన చేతిని చాపాడు. స్వాతి తన చేతిని అందించగానే,  హరీష్ లేచీ సంతోషంగా స్వాతి ని దగ్గరకి తీసుకున్నాడు. అందరూ విజిల్స్ వేసి చప్పట్లు కొట్టారు. 


ఆ తర్వాత వచ్చిన చుట్టాలందరూ కూడా తలో పాటా అందుకున్నారు. దూరంగా పద్మ,  అమ్మమ్మగారు కనిపించి ప్రదీప్ వెళ్ళబోతూ,  అన్విత కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళాడు. 


"ఒదినగారు.....  సారథికి రమ్మని మరీ మరీ చెప్పమండి.  నిన్న కూడా ఈయన ఫోన్ చేసి మాట్లాడారు.  ఇక్కడ విషయాలు తను వినిపించుకున్న లేకపోయినా ఈయన చెప్తూనే ఉన్నారు" అంటున్నారు పద్మ గారు బాధగా 


రామ్ గారి అక్క మాత్రం,  "వాడి కూతుర్ని మీరు తీస్కొచేసి, దాన్ని వాడికి దూరం చేసేసారు. అత్తయ్యగారు (స్వాతి వాళ్ళ అమ్మమ్మగారితో ) మీరైనా వాడిని పిలవలేదా. పెద్దవారు మీకు మేము చెప్పాలా" 


అప్పుడే అక్కడికొచ్చిన ప్రదీప్ కి విషయం అర్ధమయ్యి,  "అత్తయ్యా...  మీ తమ్ముడ్ని మేమూ పిలిచాము, అమ్మమ్మగారు చెప్పారు. ఆయన రాకపోతే మమ్మల్ని ఎందుకు అంటారు. అయినా మరీ అంత బాధపడిపోయే బదులు మీరు చెప్పాల్సింది రమ్మని చెప్పి"


"వాడు ఈ విషయం లో నా మాటా వినడు" 


దూరం నుంచి చూస్తున్న అన్విత కి అక్కడేం జరుగుతోందో అర్థంకాలేదు కానీ ప్రదీప్ కోపంగా ఉన్నాడంటే ఏదో పెద్ద విషయమే అని తన దగ్గరకు వెళ్ళబొయింది.  


హరీష్ అన్విత దగ్గరకి వచ్చి,  "అన్వి నేను బావని తీసుకొస్తాను.  స్వాతి తో ఉండు.  ఇవేవి తనకి తెలీనీకు" అంటూ వెళ్ళాడు. అన్వి స్వాతి పక్కన కూర్చుని తనని కబుర్లలో పెట్టింది


అక్కడ ప్రదీప్..... "ఇప్పుడర్థమయ్యిందా.  ఒకళ్ళని అనటం కాదు.  నిజాలు తెలుసుకోండి. కూతురి గురించీ ఆలోచనే ఉంటే అది మా ఇంటికి వచ్చేదే కాదు. ఆ మనిషికి అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అదంటే ప్రేమ లేదు,  ప్రేమ అక్కర్లేదు మనిషిలాగ కూడా చూడడు" 


పద్మ గారు.....  "ప్రదీపు నువ్వు వెళ్ళరా, నాన్న వస్తే బాధపడతారు"......  ప్రదీప్ కోపం గా చూడటం తో ఆవిడింకేమి మాట్లాడలేదు. 


వాళ్ళ అత్తయ్య మాత్రం ఆపకుండా...  " పెళ్ళి కూడ మీ వాళ్ళకే ఇచ్చి చేస్తున్నారు. వాడి ఆస్థి అంతా దానికే వస్తుందని,  బయటకి వెళ్ళనీయకుండా ఇలా చేస్తున్నారు" 


ప్రదీప్ ఏదో అనేంతలో,  హరీష్ తన భుజం మీద చేయి వేసి,  "పిన్ని గారు,  ఆయన కూతురి మీద ప్రేమతో వస్తే మాకైనా ఎక్కువ సంతోషం ఎవరికీ ఉండదు. అప్పుడు కూడా,  ఆయన ఆస్థి మాకు అక్కర్లేదు.  మీకు నమ్మకం లేకపోతే మమ్మల్ని ఇదే మాట రాసిమ్మన్నా మేము రెడీ.  నాకు మీ అమ్మాయి కావాలి.  అంతే.  అయినా మీకు స్వాతి అంటే ఎంత ప్రేమలేకపోతే తన కోసం ఇంతలాగా గొడవ పడతారు చెప్పండి. మరి,  అంత ప్రేమ పెట్టుకునీ తన పెళ్ళి సందడిలో మీరు ఇక్కడ ఉంటే ఎలాగా.  రండీ స్వాతి దగ్గర కూర్చోండి" అంటూ ఆవిడని పంపించి... 


"అత్తయ్యా, ఆవిడ సంగతీ నీకు కోత్తేమి కాదు కదా.  ఈరోజు కొత్తగా బాధపడటానికి.  ఇలాంటివి ముందర అనుకున్నవే.  వీటికోసం మనసు కష్టపెట్టుకోటం ఎందుకూ.  మీరు వెళ్ళండి" అంటూ పంపించాడు. 


"హా....  ఇప్పుడు చెప్పు బావా" 


ప్రదీప్..... "చెప్పేదేముంది.  అన్నీ విన్నావు కదా బావా" 


"దీని గురించీ కాదు బావ,  ఇందాక మీ చెల్లి ఎందుకు ఏడ్చిందో ఆ విషయం... ఎవరేమన్నారు.  నేనెవరితో మాట పడ్డాను" 


"అంటే బావా...  నువ్వు విన్నావా మొత్తం" 


"లేదు బావా.  అందుకే కదా నిన్నడిగేది.  తను ఏది బయటకి చెప్పదు,  అందుకే తను నన్ను తిట్టుకున్నా సరే,  తన వెనకాలే ఉంటా,  లేకపోతే ఏంజరిగినా నాకు తెలీదు" అన్నాడు నవ్వుతూ..  "సరే ఇంతకీ ఎవరేమన్నారు" అన్నాడు,  అసలు టాపిక్ ఇంకా మర్చిపోలేదన్నట్లుగా


"నాకూ సరిగ్గా తెలీదు బావా.  నీ లైఫ్ లోకి అది రాకపోతే ఇంకా మంచి సంబంధం, కట్నం  వచ్చేదేమో అని ఎవరో మాట్లాడుకుంటుంటే ఇది విందిట" 


"వాట్...  ఎవరో ఏదో అంటే ఏడ్చేస్తుందా. ఇదే మాట పెళ్ళయ్యాక అంటే ఏం చేస్తుంది,  వదిలేసి వెళ్లిపోతుందా. అయినా నా పెళ్లికొచ్చి నేను చేస్కునేవాళ్ళ గురించి కామెంట్ చేయటం ఏంటసలు. ఎవరా అన్నది" 


"నాకూ చెప్పలేదు.  మీరిద్దరూ హ్యాపీ గా ఉంటే ఇంకొకళ్ళేమనుకుంటే ఏంటిలే అని చెప్పా. అయినా ఇందాక నీ దగ్గరకి రాగానే సద్దుకుంది బావా. నువ్వు పక్కనుంటే దానికేం టెన్షన్ ఉండదు"


హరీష్ "సరే" అన్నాడు కానీ కట్నం,  మంచి సంబంధం అని వింటుంటే మనసులో ఏదో ఆలోచిస్తున్నాడు. 


ప్రదీప్ మాత్రం హరీష్ అలా ఆలోచిస్తుండటం చూసీ స్వాతి మీద కోపంగా ఉన్నాడేమో అని.... "బావా ..... " 


హరీష్..... "చెప్పు బావా..."


"స్వాతి నిన్నెప్పటికీ వదులుకోదు. అది ఏం చేసినా అందులో ప్రేమే ఉంటుంది. అది ఏమైనా అన్నా దాన్ని కోప్పడకు బావా, అది భయపడిపోతుంది. నీ చుట్టుపక్కల్లో ఉండదు మళ్ళీ దానికది సద్దుకునేవరకూ. కష్టం వస్తే అది చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టకూడదనుకుంటుంది కాని నీ దగ్గర దాచాలని దాని ఉద్దేశం కాదు.  ఎంత అలిగినా,  తిక్క చేసినా మెల్లిగా నచ్చచెప్తే వింటుంది. ఇంట్లో చిన్నప్పటినుంచి అదేంటే మా అందరికీ గారం" 


"తన గురించి నువ్వంతగా చెప్పాలా. మీ గారాల పట్టి ని నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. తన గురించేమీ టెన్షన్ పడకు" అంటూ ఇద్దరూ అక్కడ నుంచి కదిలారు


చిన్న చిన్న గొడవలు కూడా సద్దుమణగటంతో, ఆ రాత్రంతా సందడిగా ముగిసింది. 


తర్వాత రోజున పొద్దునే స్వాతిని పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, "గౌరీ పూజ" కు తీసుకెళ్ళారు. ఆ పట్టు చీర,  అలంకారంలో లక్ష్మి దేవిలా మెరిసిపోతోంది స్వాతి. ఆ తరువాత జీలకర్ర బెల్లం పెట్టి తెర తీసాక ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు తృప్తిగా చూసుకున్నారు. హరీష్ తాళి కట్టేసమాయలో స్వాతి కళ్ళలో నీళ్ళు చూసీ,  హరీష్ ఖంగారుగా "స్వీటీ.... " అనేసరికి,  తను తల పైకెత్తి అతనిని చూస్తూ నవ్వి,  సిగ్గుతో తలదించుకుంది. ఆ కన్నీళ్ళ వెనక అర్ధమేంటో   అర్ధమయ్యి నవ్వుతూ తాళి కట్టాడు. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ చకచకా జరిగిపోయాయి. 


పెళ్ళి తంతు అయ్యాక,  పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరుగా విశ్రమించటానికి కదిలారు. పెళ్ళికొడుకు,  పెళ్ళికూతుర్ని.... పిల్లలు చుట్టూ చేరి ఆటపట్టిస్తూ సరదా కబుర్లతో గడిచింది. 


హరీష్ స్వాతి చేయి పట్టుకుని తనకి మాత్రమే వినిపించేలాగా ....  "ఎప్పటి నుంచో ఎదురు చూసిన రోజిది,  స్వీటీ. నాకు నువ్వు,  నీకు నేను ఎప్పటికీ.... ఇదిగో చూడు బ్రహ్మ ముడి వేశారు. ఇప్పుడు నువ్వు నా సొంతం" అన్నాడు  గర్వం,  సంతోషం కలగలిపిన స్వరంలో 


"అవును బావ...... ఇది కలో నిజమో ఇంకా నమ్మలేకపోతున్నా"


"స్వీటీ ఈరోజు ఒక స్పెషల్ డే.... ఎందుకో చెప్పు" 


"మన పెళ్ళి జరిగింది కదా బావ" 


"ఆఁహాఁ.... ఇది కాకుండా... "


"ఇంకా ఏం ఉంది" అంది ఆలోచిస్తూ 


"నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి ఈరోజు కి వన్ ఇయర్ రా" అన్నాడు నవ్వుతూ 


"కానీ,  బావా అదింకా 10డేస్ ఉంది కదా" 


"అది నేను నీకు చెప్పిన రోజు. నువ్వసలు నాకు ఆ రోజున చెప్పి ఉండకపోతే,  ఈరోజంటూ అసలు వచ్చేదా. నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నా,  ఎప్పుడూ నీకు చెప్పే ధైర్యం చేయలేకపోయాను. దేనికి భయపడని నేను నీ విషయం లో మాత్రం నువ్వు ఒప్పుకోకపోతే అనే భయంతో ఎప్పుడూ నీ ముందుకి రాలేకపోయాను. నువ్వు ఆ రోజు మాట్లాడిన తరువాత ఈ ఏడాది కాలం లో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నానురా..ఐ లవ్ యూ స్వీటీ...  లవ్ యూ సో మచ్ రా"  


"బావా....  ఐ లవ్ యూ టూ" 


అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్ ని స్వాతి హరీష్ కి పరిచయం చేసేలోపు, మనోజ్ "ఏంటి లవ్ బర్డ్స్....  ఏంటా గుసగుసలు. ప్రైవసీ కావాలా సార్ " 


హరీష్ తో మనోజ్ పరిచయమున్నట్లు మాట్లాడటం చూసీ ఆశ్చర్యంగా...


స్వాతి.... "బావా తను నీకు ముందరే తెలుసా" 


హరీష్..... "తెలుసా ఏంటిరా,  తను నాకు ఫోన్ చేయటం వలనే  ఇక్కడేం జరుగుతుందో తెలిసి,   నేను వచ్చేలోపే మావయ్యగారికి మన  విషయం చెప్పాను" 


"నీకెందుకు ఫోన్ చేసాడు. నీ నెంబర్ ఎలా తెలుసు" 


రమ్య..... "అదో పెద్ద కథలేవే" 


స్వాతి.... "అదేంటి మనోజ్,  ఇంత లేట్ గా వచ్చావు" 


రమ్య.....  "మాములుగా మీ బావ పక్కనుంటేనే నీకు లోకం తెలీదు,  ఈరోజు అయితే అసలేది పట్టించుకోవనుకో. వీడొచ్చి చాలా సేపయ్యింది. వెళ్తున్నా అని చెప్పటానికి  వచ్చాడు" 


మనోజ్  వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ చెప్పి బయల్దేరుతుంటే రమ్య తనతోపాటు బయటకి వెళ్తూ,  "మనోజ్....  నువ్వొస్తావనీ ఎక్సపెక్ట్ చెయ్యలేదురా అసలూ" 


"అదేంటే... ఎందుకు రాను. మనమంతా ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్.. అలాంటిది రాకుండా ఎలా ఉంటాను" 


"కానీ అది నీ లవ్ రిజెక్ట్ చేసింది కదా" 


"అయితే ఇప్పుడు నేను దేవదాసు అవ్వాలా. అసలు మొదటగా అయితే నాది లవ్ యే కాదు. ఆ విషయం ఆ రోజే స్వాతి కి చెప్పాను. పెళ్ళి కి  తనైతే తెలిసిన అమ్మాయి కదా అని అడిగాను, అది కూడా థాట్ వచ్చిన నెక్స్ట్ మినిట్ అడిగాను  కానీ తను ఆల్రెడీ సార్  అంటే ఇష్టపడుతోందని తెలిసాకా నేనసలు ఆ విషయమే వదిలేసాను. నాకు తన మీద ఫ్రెండ్ కి అయినా వేరే ఫీలింగ్స్ యే లేవు ఎప్పుడూ కూడా" అంటూ నవ్వుతూ కదిలాడు. 


సాయంత్రానికి మళ్ళీ ప్రదీప్ పెళ్ళి హడావిడి మొదలయ్యింది. అన్విత మెడలో ప్రదీప్ మూడు ముళ్ళు వేయగానే స్వాతి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి అన్వితని నుదుటి మీద ముద్దు పెట్టుకునీ ఎంతో సంతోషంగా పక్కనే నిల్చుని ఉన్న పద్మగారిని కౌగిలించుకుంది. 


"అమ్మా,  అన్నయ్య కోరుకున్న సంతోషం తనకి దొరికేసింది. నాన్నా.... మన ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది" అంది ఎగురుతూ. "అవునమ్మా" అంటూ వాళ్లిద్దరూ ప్రదీప్ వైపు చూసారు. 


అప్పగింతలు కార్యక్రమంలో స్వాతిని ఓదార్చటం ఎవరి తరం  కాదని అందరూ భయపడ్డారు. కానీ అందరి ఆలోచనలకూ భిన్నంగా,  ఒక్క కన్నీటి చుక్క రానీయలేదు. తన బదులు కూడా ప్రదీప్ యే బాధపడ్డాడు. అన్నీ చూస్తున్నా,  మౌనంగా వెళ్ళిపోయింది స్వాతి. 


******************************


ఏంటి పెళ్లయిపోయింది,  స్వాతి తో పాటు మీరు ఇంటికి వెళ్లిపోదామనుకుంటున్నారా. అలా ఎలా పంపిస్తానండి. ప్రతీ ప్రేమ కథకి పెళ్ళే ముగింపు కాదు కదా. 


స్వాతి ని ఎవరేమన్నారో హరీష్ తెలుసుకుంటాడా,  తెలుసుకుంటే తనేమి చేస్తాడు. ఇంట్లో ఇష్టం లేకుండా చేసుకున్నందుకు జీవితాంతం కలిసి ఉండగలడంటారా



Comments