46
అమ్మమ్మ గారు.... "స్వాతి.... నీ పట్టు చీరలు, హారం అన్నీ నీకు నచ్చాయా"
"బావున్నాయి అమ్మమ్మా. అదేంటలా అడిగావు"
"నువ్వు నిన్న షాపింగ్ నుంచి వచ్చాక, ఎందుకో డల్ గా ఉన్నావు. ఏమయ్యిందమ్మా"
స్వాతి అక్కడ జరిగింది చెప్పి, "అమ్మమ్మా, బావని నేనేమి కంట్రోల్ చేయలేదు. అత్తయ్య తో అలా మాట్లాడమని నేను అననే లేదు" అంది బాధగా
"నువ్వన్నట్లు, హరీష్ నీ తరపున మాట్లాడుతుంటే, నువ్వెందుకు 'లేదు ఇదీ బావుంది' అంటూ 'సరే' అన్నావు"
"అమ్మమ్మా..... అలా అనకపోతే వాళ్లిద్దరూ వాదించుకోవటం బావుందా. చెప్పి చూసాను. వినిపించుకోలేదు. సరే అని తీసుకున్నాను"
"మరి అంత చక్కగా ఆలోచించినదానివి ఇప్పుడెందుకురా బాధ పడతావు. కూతురు వెళ్ళే ఇంట్లో అందరూ తనతో కలిసిపోతారో లేదో, మొగుడెలా చూసుకుంటాడో, అంటూ వంద ఆలోచనలు ఉంటాయి పెళ్లికూతురు తల్లి తండ్రులకి. అదే పెళ్ళి కొడుకు గురించీ బెంగలు ఏమి ఉండవనుకుంటారు. వాళ్ళకి ఉంటాయి. కొంతమంది ఇదిగో మీ అత్తగారి లాగా బయట పడతారు. ఇంకొంతమంది, మనసులోనే ఒక మూలకి కప్పేస్తారు. చాలామంది అవేవి పట్టించుకోని వాళ్ళూ ఉన్నారు. అవన్నీ తనని చేసుకునే నువ్వూ అర్థం చేసుకోవాలి స్వాతి. ఎప్పుడూ హరీష్ నిన్ను అర్థం చేసుకోవటమే కాదు, తనని తనతోపాటు వాళ్ళ కుటుంబంలో అందరినీ నువ్వూ అర్థం చేసుకోవాలి. అప్పుడే వాళ్లలో నువ్వూ ఒకదానిలాగా కలిసిపోగలవు. "
"సరే అమ్మమ్మా"
"ఆవిడ నిన్నేదో అనేసారన్న బెంగ మానేసి, దాని వైపు నుంచి నీ ఆలోచనని మళ్ళించు. భూతద్దం లో చూస్తే ప్రతీది పెద్దగానే కనిపిస్తుంది"
స్వాతికి కూడా అమ్మమ్మగారి మాటలు నిజమే అనిపించాయి. "హరీష్ కి చెప్పగలిగిన విషయం తనకి తను ఎందుకు చెప్పుకోవట్లేదనుకుంటూ" ఆ ఆలోచనల నుంచి వేరే పనుల్లోకి మళ్లించుకుంది.
*****************
"హాయ్ రమ్మీ.... ఏంటే ఇలా గుర్తొచ్చాము. అసలు ఫ్రెండ్ పెళ్ళి, వచ్చి ఏం కావాలో చూద్దామని లేదు. అక్కడ కూర్చుని ఫోన్లు చేస్తున్నావ్"
రమ్య... "ఒసేయ్ ఇప్పుడు కూడా ఫోన్ చేసింది నేనే. నీకసలు నేను గుర్తున్నానా. ఇంతకీ సంగీత్ కి మీరు ఏం చేస్తున్నారో కనుక్కుందామని చేశా"
"ఓహ్ అదొకటుంది కదా. ఏమోనే మేము ఏం చేయటం లేదనుకుంటా"
"అదేంటే అలా అన్నావు"
"ఆరోజు షాపింగ్ లో కలవటమేనే, సార్ గారు మహా బిజీ అయిపోయారు. ఫోన్ మాట్లాడటానికే ఫోజు కొడ్తున్నారు"
అన్వి.... "ఏంటే కోపం లో మర్యాద ఎక్కువైపోయింది"
"హేయ్ అన్వి.... నువ్వూ ఉన్నావా కాల్ లో. చెప్పనే లేదు. అయినా నా సంగతి కాదు, మీరేం చేస్తున్నారో చెప్పు ముందర"
"మాది సాంగ్ సెలక్షన్ అయ్యిందే. అది సరే కానీ "గారు" అంటూ... ఏదో చాలా మర్యాద ఇచ్చేస్తున్నావ్ మా అన్నయ్యకి"
"బూతులు మాట్లాడితే మీ అన్నని అంటున్నా అని ఏడుస్తారేమో అని మర్యాదగా మాట్లాడుతున్నా. కోపమొస్తోంది"
రమ్య... "ఏం పర్వాలేదు. నీకెంత కావాలంటే అంత తిట్టుకో ఈరోజు. నేనేమి అనుకోను. లేదా డైరెక్ట్ గా తిట్టేయచ్చు కదా"
"డైరెక్ట్ గానా. తనని చూస్తేనే నాకేమో నోరు పెగలదు. ఆ....మనిషేమో ముద్దులు పెట్టేసి లవ్ యూ అనేసి నన్ను మాయ చేసేస్తాడు. ఇంకేం అంటాను. ఎంగేజ్మెంట్ అయిపొయింది ఇంకెక్కడికిపోతుందిలే అని మాట్లాడటం మానేసాడు. ఇప్పుడే ఇలా ఉన్నాడు రేపొద్దున పెళ్ళయ్యాక, ఇదెక్కడికిపోతుందిలే అని అర్థరాత్రిళ్ళు ...."
అన్విత... "ఒసేయి స్వాతి.... ఆపవే. అన్నయ్య వున్నాడు ఇక్కడే"
"ఓహ్ బావ మీ ఇంటికొచ్చాడా. అందరి దగ్గరకి వెళ్తాడు, సరేలే ఫోన్ పెట్టేసి మీ అన్నయ్య తో మాట్లాడుకో. నేను మా రమ్మీ తో మాట్లాడుకుంటాను"
"అన్వి వాళ్ళింట్లో లేను స్వీటీ ఇక్కడే కాల్ లో ఉన్నా నేను కూడా...."
"బా... బావా..... ను... నువ్వు కూడా ఉన్నావా. ఇంకా ఎవరెవరున్నారు"
రమ్య నవ్వుతూ....."నేను ఇందాక అన్వి కి మీ అన్నయ్య కి కాల్ చేసాను. ఆ తర్వాత తను పెట్టేసాక అన్వినే మా బ్రదర్ కి లైన్ కలిపింది"
"స్వీటీ.... ఇందాకేవేవో అన్నావు కదా ఏంటో మళ్ళీ చెప్పు ఇప్పుడూ"
అన్విత..... "అసలు అన్నయ్యా నువ్వలా సైలెంట్ గా ఉన్నావేంటి ఏమి మాట్లాడకుండా"
హరీష్ నవ్వుతూ... "ఇంకా ఏమేమి అంటుందా అని వింటున్నా"
స్వాతి... "రమ్మీ..... నేను పెడ్తున్నా..... మీరు మాట్లాడుకోండి. బాయ్"
అన్విత... "ఓయి ఆగు. రేపు నువ్వూ, అన్నయ్య మా ఇంటికి వస్తున్నారు. అంతే ఫైనల్. నేను ఉంటా" అంటూ అన్విత ఫోన్ పెట్టేసింది
స్వాతి ఖంగారుగా హరీష్ కి ఫోన్ చేసింది
"చెప్పు స్వీటీ"
"బావా... కోపమొచ్చిందా..... నువ్వున్నావనుకోలేదు..... "
"అంటే నేను లేకపోతే ఓకే అనమాట"
"అది కాదు బావా.... "
"స్వీటీ రేపు రమ్మని చెప్పింది కదా అన్వి, రేపు కలిసినప్పుడు మాట్లాడదాము. బాయ్" అంటూ ఫోన్ పెట్టేసాడు.
తర్వాత రోజున ఎన్నో ఆలోచనలతో అన్విత ఇంటికి వెళ్ళిన స్వాతికి హరీష్ ఇంటిబయటే ఎదురయ్యాడు. స్వాతి మాట్లాడబోయేంతలో, "తర్వాత మాట్లాడచ్చులే, ఇప్పుడు కాదు" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు
అందరితో మాములుగా మాట్లాడుతున్నా తన వైపు చూడకపోవటంతో, కొంచం బాధగా అన్విత ని కళ్ళతోనే అడిగింది. అన్విత కి అర్థమైనట్లుగా, "అన్నయ్యా మీరు ఏం సాంగ్ డిసైడ్ అయ్యారు. ఇదైతే నీకే తెలుసంది"
"లేదు అన్వి. ఆలోచించాలి ఇప్పుడూ"
"సరే మీరు చించండి. ఇప్పుడే వస్తా" అంటూ వాళ్ళ అమ్మ గారి దగ్గరకి వెళ్ళిపోయింది
"బావా..."
"అదేంటి స్వీటీ మళ్ళీ బావ లో కి వచ్చేసావు. నిన్నేదో సార్ గారు అంటూ మాట్లాడావు కదా" అన్నాడు కోపంగా చూస్తూ
స్వాతి ఏడుపు మొహం పెట్టేసరికి, హరీష్... "హేయ్..... స్వీటీ..... ఏమైందీ" అంటూ దగ్గరకి తీసుకున్నాడు
"ఏమక్కర్లేదు. కోపమొచ్చింది కదా. మళ్ళీ ఎందుకు పట్టుకుంటున్నావు" అంటూ దూరం జరగబోయింది
"హాహా..... నీ మీద నాకెందుకు కోపమొస్తుందిరా స్వీటీ" అంటూ తనని కదలనీయకుండా పట్టుకున్నాడు.
"మరి ఎందుకు నాతో మాట్లాడలేదు. ఇందాకటి నుంచి కూడా నన్నసలు చూడటంలేదు"
"నిన్నేదో ఆటపట్టించాలని ... అంతే కానీ ఇలా ఏడుపు మొహం పెట్టేస్తావేంటి. దా..... చెప్పు నీకు ఏ పాట కావాలి" అంటూ కొంచం సేపు మాట్లాడుకుని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు
పెళ్ళి రెండు రోజుల్లోకి వచ్చేసింది.
స్వాతి.... "అమ్మా.... అదీ..... మరే...... సాయంత్రం మెహేంది కి "
పద్మగారు .... "ఏంటి సాయంత్రం..... సరిగ్గా చెప్పమ్మా..... ఏం కావాలి"
"అమ్మా..... అన్నయ్య ఉంటాడు కదా, బావ ని కూడా పిలవచ్చు కదా"
"అత్తయ్య కి చెప్పమమ్మా. కానీ ఆడవాళ్ళ ఫంక్షన్ కి వాడేందుకు అంది. అందుకే ఇంకేమి అనలేకపోయాము. అన్నయ్య ని అన్విత వాళ్ళ అమ్మ వాళ్ళు తీస్కుని రమ్మని చెప్పారు. ఏవో సరదాగా అందరమూ స్పెండ్ చేయటానికి ఇదొక రీసన్. సరేలే వాళ్ళని మనం గట్టిగా అడగలేము కదా. చెప్పటం చెప్పాము"
స్వాతి సాయంత్రంకి కావాల్సినవి అన్నీ సెట్ చేస్కుని తన రూమ్ సద్దుకుంటూ కూర్చుంది.
"హలో "
"స్వీటీ ఏంటిరా డల్ గా ఉన్నావు"
"రూమ్ లో బుక్స్ అవీ అన్నీ సద్దుతున్నాను. బావా ఎల్లుండి నుంచి ఈ ఇంట్లో నేను గెస్ట్ అయిపోతానంటే నాకు కడుపులోంచి బాధోచేస్తోంది"
"స్వీటీ... అక్కడ నువ్వు గెస్ట్ అయిపోతావని ఎవరైనా అన్నారా ఇంట్లో. నాకు తెలిసీ అనుండరే. అదెప్పటికైనా నీ ఇళ్ళు కూడా""
"హ్మ్... సరే"
"ఇంకేంటి. సాయంత్రం ఎప్పుడు ప్రోగ్రాం"
"ఆరింటికన్నారు. మన టైమ్ తెలిసిందే కదా. బావా అందరూ ఉంటారు అక్కడా. నేనే ఒక్కదాన్ని ఉండాలి"
"నేను ఉంటాను కదా, ఒక్కదానివి ఎందుకవుతావు"
"కానీ అత్తయ్యా... అమ్మా.... నువ్వు రావట్లేదందీ"
"నీకవన్నీ ఎందుకురా. నేను నీకోసం వస్తాను. నీకేమి తెలీనట్లే ఉండు. ఎవరితోనూ అనకు. సరేనా"
"సరే. కానీ ఎవరితోనూ మాట పడకు. జాగ్రత్త"
"సరే..... ఉంటాను....."
సాయంత్రం ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. పెద్దా, చిన్నా అందరూ తమకి నచ్చిన డిజైన్స్ సెలెక్ట్ చేస్కుంటున్నారు.
రమ్య...... "హాయ్..... ఈరోజు మెహేంది లో మీ లైఫ్ పార్టనర్ పేరు రాయించండి. అది వాళ్ళు కనిపెట్టగలిగితే మీరు ఓడిపోయినట్లు, అప్పుడు మీరే వాళ్ళని మెచ్చుకుంటూ ఏదైనా గిఫ్ట్ ఇయ్యాలి, వాళ్ళు వాళ్ళ పేరు కనిపెట్టలేకపోతే అప్పుడు వాళ్ళు ఇస్తారు. చీటింగ్ చేయకూడదు. మీరు గెలిచేలాగా ట్రై చేయండి, మీ పార్టనర్స్ కాదు" అంది నవ్వుతూ
అందరూ డిజైన్స్ పెట్టించుకుంటున్నారు. హరీష్ వాళ్ళ అమ్మ గారు స్వాతి పక్కన కూర్చున్నారు. మగవాళ్ళు అందరూ వచ్చారు. అందరూ తమ తమ భాగస్వాముల గోరింటాకు అందాలని చూస్తూ మురిసిపోతూ, నవ్వులూ, సరదాలు ఒక పక్క, మరదళ్ళు, చిన్న పిల్లల ఆటపట్టించటాలు మరోవైపు. రమ్య... మగ వాళ్ళకీ ఏం చేయాలో చెప్పటంతో అందరూ గిఫ్ట్ లు కోనే హడావిడిలో పడ్డారు.
స్వాతి మనసులో.... "బావ. .. అందరూ వచ్చారూ. నువ్వూ నా పక్కనుంటే బావుండు" అనుకుంటూ దిగులుగా కూర్చుంది. అది తనకి అర్థమయినట్లుగా హరీష్ వాళ్ళ అమ్మ గారు స్వాతి భుజం మీద తల ఆనించారు (మరి చేతులు బిజీ గా ఉన్నాయి కదా).
"ఏంటి అత్త కోడళ్ళు ప్రేమ కురిపించేస్కుంటున్నారు"
సత్య గారు.... "ఏవండీ వచ్చారా. అయినా మీరేంటి ఇక్కడా" అన్నారు, వచ్చినందుకు సంతోషంగా ఉన్నా, రావద్దన్నా వచ్చారేంటి అనే అనుమానంతో ఇంకో పక్క
మహేశ్వర రావు గారు.... "ఇంట్లో బోర్ గా ఉంది. సరే మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా అని"
ఆయన్ని చూడగానే, స్వాతి హరీష్ కోసం చుట్టూ చూసింది. తను కనిపించకపోవడంతో రాలేదని బాధగా ఉండేసరికి, " ఏంట్రా అంత డల్ గా ఉన్నావూ" అన్న మాట వినీ తిరిగి చూసీ
"బావా... నువ్వూ వచ్చావా..... రాలేదేమో, మావయ్యా ఒకరే వచ్చారనుకున్నా "
"నాన్నా నేనూ కలిసే వచ్చాము స్వీటీ"
మహేశ్వర రావు గారికి మాత్రమే వినిపించేలాగా, సత్య గారు..... "వచ్చి మంచిపని చేశారు. ఆడవాళ్ళ ఫంక్షన్ అని ఒద్దన్నాను కానీ, మీరొస్తే బావుండు అని ఇందాకటి నుంచి ఎన్ని సార్లనుకున్నానో. అందరూ ఉన్నారు, మీరు తప్పా "
ఆయన హరీష్ వైపు గర్వంగా చూస్తూ, "నేను నా భార్య మాటే వినీ, ఆలోచించకపోయినా నా కొడుకు ఆలోచించాడు...వెళ్ళద్దు అనే మాటకైనా తన కాబోయే భార్య మనసుని అర్థం చేస్కుని వచ్చాడు" అనుకున్నారు
అందరూ మెహేందిలు పెట్టించుకోటం అయ్యాక మగవాళ్ళు ఒక్కఒక్కరూ వాళ్ళ పేర్లు వెతికేపనిలో పడ్డారు. కష్టపడి కనిపెట్టి వాళ్ళ భార్యల దగ్గర గిఫ్టులు కొట్టేశారు.
హరీష్ వంతు రాగానే చేతులు చూపించే ముందరే స్వాతి గిఫ్ట్ తో రెడీ అయిపొయింది.
హరీష్ ఎంత వెతికినా తన పేరు కనిపించలేదు.
"స్వీటీ..... పేరు రాయించావా లేక అక్షరమా"
"పేరు బావా"
"ఎక్కడో చెప్పరా "
రమ్య.... "హలో బ్రదర్.... అది ఎక్కడో చెప్పాల్సింది మీరు. ఓడిపోతే ఒప్పేసుకుని దానికి గిఫ్ట్ ఇయ్యండి ముందర"
హరీష్ స్వాతి చెప్పలేదని కోపంగా చూస్తూ తను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చాడు. ఆడవాళ్ళందరూ స్వాతిని స్వర్ణ పతకం తీసుకొచ్చినట్లు ఎత్తేసారు. వాళ్ళల్లో ఒక్కరైనా మగవాళ్ళ చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకున్నందుకు.
హరీష్... " స్వీటీ... ఏమైనా తిన్నావా"
"ఇప్పుడెలా తింటాను బావా. ఇది పండాకా, తీసేసాక... అప్పుడూ తింటాను" అంది చేతులు చూపిస్తూ
"ఎందుకలాగా, కొంచం సేపు ఉంచుకుని తీసెయ్యి. ఆకలేస్తుందిరా నీకూ"
అమ్మమ్మగారు ఆ మాటలు వినీ, ...
"మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామ అతనే దిగి వస్తాడు"
అంటూ పాట అందుకున్నారు.
"అలాగే, చేతి గోరింటాకు ఎంత ఎర్రగా పండితే భార్యా భర్తల మధ్య ప్రేమ కూడా అంత గాఢంగా ఉంటుందంటారు"
అక్కడికొచ్చిన రమ్య ఆ మాటలు వినీ, "బ్రదర్..... ఇప్పుడు మీరు మా స్వాతిని ఎంత ప్రేమిస్తున్నారో మాకూ తెలుస్తుందీ" అంది ఆటపట్టిస్తూ
"పర్వాలేదు సిస్టర్, మీ ఫ్రెండ్ కి తెలుసు. అది చాలులే. ఇప్పుడు దాని కోసం తినటం మానేస్తుందేంటి"
"మానటం ఎందుకు అన్నా" అంటూ అందరిని ఉద్దేశించి,
"ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్, హస్బండ్స్ అండ్... టు బి హస్బండ్స్... వాళ్ళ పార్టనర్స్ కి ఫుడ్ తినిపిస్తారు"
ఆడవాళ్ళు ముందర ఒప్పుకోకపోయినా, పిల్లలు గొడవ చేసేసరికి కాదనలేకపోయారు.
"ఏంటన్నా..... నీ ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింది కదా. ఇప్పుడా మెహేంది బాగా పండేలా చూస్కో" అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
హరీష్... స్వాతికి తినిపిస్తుంటే, స్వాతి... "థాంక్ యూ బావా...... నువ్వు రాకపోయుంటే ఈ సరదాలు అన్నీ మిస్ అయ్యేదాన్ని" అంది హరీష్ భుజం మీద తల వాల్చి.
స్వాతి తల మీద ముద్దు పెట్టుకునీ, "స్వీటీ.... నీతో ఉండే యే ఛాన్స్ ని మిస్ చేసుకోనురా. అందరి మధ్యలో నిన్ను ఒక్కదాన్ని ఎలా వదిలేస్తాననుకున్నావు" అన్నాడు నవ్వుతూ...
"అవునురా ఇంతకీ నా పేరు ఎక్కడ పెట్టించుకున్నావు చూపించనేలేదు"
స్వాతి కొంచం కోపం నటిస్తూ, "నీకు నిజంగా కనిపించలేదా బావా. నన్ను చూసీ చెప్పూ"
"లేదురా కనిపించలేదు..... ఎక్కడ రాసావూ..... కలువ పూవు రేకుల మధ్యలో నాలుగు వేళ్ళ మీద "HARI" అని రాసావూ అది చూడనే లేదు, అరచేతిలో నీ మనసులో ఒక రెయిన్బో వేసి దానిలో డిజైన్స్ మధ్యలో చిన్నగా "కృష్ణ " అని రాసున్నదీ కనపడలేదూ" అన్నాడు స్వాతి కళ్ళలోకి చూసీ నవ్వుతూ
"బావా.... వేళ్ళ మీద చూస్తావనయితే అనుకున్నాను కానీ అరచేతిలో ఎలా కనిపెట్టావు. అయినా చూసీ కూడా చూడలేదని చెప్పావేం"
"నా స్వీటీ గెలిచినా నేను గెలిచినా ఒకటే కదా. నేను ఓడిపోయాననుకో, అప్పుడు నేను తీసుకొచ్చిన గిఫ్ట్ నీకు ఇయచ్చు కదా అని"
"బావా... నాకు తినిపించింది చాలు, నువ్వూ తినూ. ఇంతకీ నా గిఫ్ట్ ఓపెన్ చేసి చూపించూ"
ఇంతలో ప్రదీప్ అక్కడికి వచ్చి, "చిన్నూ తిన్నావా. ఏమైనా కావాలా"
"ఏమి వొద్దన్నయ్యా. ఇప్పుడే తిన్నాను. నువ్వు తిన్నావా"
"లేదురా తింటాను. అన్విది అయ్యింది. మీకు ఏమైనా కావాలేమో చూద్దామని వచ్చాను. బావా ఈ నీళ్ళు చేతి మీద అద్దుతూ ఉండాలిట. బాగా పండుతుందిట" అంటూ ఇచ్చాడు
"థాంక్స్ బావా..... అసలే పెద్దోళ్ళు, ఆ రమ్య నన్ను భయపెట్టేసారు ఇందాక. ఇప్పుడిది ప్రేస్టిజ్ క్వశ్చన్ అయిపొయింది" అన్నాడు నవ్వుతూ
"అదే కదా బావ. సరే నువ్వూ తినేసెయ్యి. మీరు మాట్లాడుకొండిలే. నేను మళ్ళీ వస్తా" అంటూ వెళ్ళిపోయాడు
ప్రదీప్ అలా వెళ్ళగానే స్వాతి, "బావా చూపించూ.... ఏముందీ ఆ బాక్స్ లో"
"స్వీటీ.... నేను తీస్కోచ్చింది నీ దగ్గర ఉండే ఉంటుంది. కానీ ఇది చూడగానే తీస్కోవాలనిపించింది. నీకు నచ్చితే పెట్టుకో" అంటూ తను ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసి కాళ్ళ పట్టీలు చూపించాడు.
"బావా చాలా బావున్నాయి. నువ్వన్నట్లు నా దగ్గర ఉన్నా కూడా, నువ్వు నాకోసం కొన్న మొదటి గిఫ్ట్. ఇది జీవితాంతం స్పెషల్ గానే ఉంటుంది"
"మరి నా గిఫ్ట్ ఏది"
"నీ గిఫ్ట్ ఏంటి"
"మనిద్దరికీ తెలుసు నేను ఓడిపోలేదని. నేను గెలిచాను కదా. ఇయ్యి నా గిఫ్ట్"
స్వాతి.... హరీష్ ని పట్టీలని చూస్తూ, "లేదు బావా. నేనేమి తీసుకోలేదు. రేపు ఇస్తాను"
"నా స్వీటీ గురించి నాకు తెలీదా. నీ చూపులు చాలానే చెప్పాయి. ఇస్తావా ఇయ్యవా"
"సరే ఆగు" అంటూ ప్రదీప్ ని పిలిచి తన చెవిలో ఏదో చెప్పింది
ప్రదీప్ హరీష్ కి ఒక బాగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. హరీష్, అది ఓపెన్ చేసి, "స్వీటీ..... వాచ్ ఆ"
"ఆ... వాచ్ యే ..... నువ్వు ఎక్కడున్నా టైమ్ చూడగానే నేను నీకోసం ఎదురుచూస్తుంటా అని గుర్తు రావాలి. అందుకే" అంది నవ్వుతూ
"టైమ్ చూడకపోతే గుర్తురావేంటి. సరే ఇదిగో ఇప్పుడే పెట్టుకుంటా" అని పెట్టుకునీ చూపించాడు. "బావుందిరా"
"స్వీటీ నీ కాలు ఇలా పెట్టూ"
"ఎందుకూ"
"నువ్విచ్చింది నేను పెట్టుకున్నాను మరి నేనిచ్చింది పెట్టుకోవా"
"హహ... పెట్టుకుంటా బావా..... కానీ ఇలా... ఇప్పుడు కాదు. నేనెప్పుడో సడన్ గా అడుగుతాను. అడిగినప్పుడు నీ దగ్గర ఉంటే అప్పుడు పెట్టుకుంటాను. లేకపోతే నేనేం చేయలేను, నా తప్పు కాదు. ముందరే చెప్తున్నా. ఒక్క సారి మాత్రమే అడుగుతాను" అంది నవ్వుతూ
Comments
Post a Comment