45
."నాకు నచ్చినది చూపించాక కూడా నువ్వు ఓకే అనే అన్నాకే కొన్నాను కానీ అది నువ్వు మార్చేసుకున్నావు. నువ్వు మార్చినందుకు కూడా బాధ అనిపించలేదు. నాతో నీకది నచ్చలేదని ఒక్క మాట చెప్పలేదే అని బాధగా ఉంది. నువ్వు చెప్తే అది కాదు ఇంకేదైనా కూడా చేసేవాడిని కదా" అన్నాడు బాధగా
అన్విత తన మాటలు వినీ గట్టిగా నవ్వబోయి చుట్టూ చూసీ ఆపేసుకుంది.
ప్రదీప్..... "చేసిందంతా చేసి నవ్వుతున్నావా" అన్నాడు కోపంగా
అన్విత కష్టంగా నవ్వాపుకుని, "ఇందుకోసమేనా ఇందాకటి నుంచి అంత మూడీగా ఉన్నావు. నేనేం చేసాను బావా. నువ్వు మొన్న కొన్న రింగ్ గురించే అడుగుతున్నావు. మరి అంతకైనా ముందర, నన్ను పెళ్ళి చేసుకోవా అంటూ నీ మోకాళ్ళ మీద కూర్చుని మరీ నాకు రింగ్ పెట్టావు కదా దాన్నేం చేయమంటావు"
"ఇప్పుడదీ లేదు కదా"
"ఎలా ఉంటుంది. మొన్న నువ్వు సెలెక్ట్ చేసిన రింగ్ దానికి ముందర నువ్వు పెట్టిన రింగ్ రెండూ ఒకదాని మీదొకటి వచ్చేలాగా అటాచ్ చేయించాను. నువ్వేమో నేను మొత్తానికే మార్చేశాననుకుంటున్నావు. సరిగ్గా చూడు బావా" అంటూ ఆ రింగ్ ని మళ్ళీ చూపిస్తూ....
" నిన్ను ప్రేమిస్తున్నాను బావ. నీ ప్రతీ ఇష్టాన్ని ప్రేమిస్తున్నా. నీ కోపం కూడా ఇష్టమే నాకు. నీ బాధ్యతల్ని, నీ కలల్ని ప్రేమిస్తున్నా, నువ్వు నా కోసం చేసే ప్రతీ పనిని ప్రేమిస్తున్నాను. ఆఖరికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే నేనంటే నాకు ఇంకా ఇష్టం బావ. అలాంటిది నువ్వు పెట్టె ఒక ఉంగరం కోసం ఇంకోదాన్ని తీయాలనిపించలేదు. అందుకే ఇలా చేసాను. నీకు సర్ప్రైస్ ఇద్దామని చెప్పలేదు. చూడగానే గుర్తు పడ్తావనుకున్నాను. నేనూ చెప్పుండాల్సింది. సా..... "
ప్రదీప్ అన్విత మాట పూర్తి చేయనీయలేదు. తన పెదవులతో ఆమెని అందుకని నోటిని మూసేసాడు. అలా తొలిముద్దులోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ ఇద్దరూ మైమరచిపోయారు. అప్పుడే అటుగా వచ్చిన రమ్య వాళ్ళని చూసీ అక్కడున్న ఇంకొంతమందిని పిలుచుకొచ్చి అందరూ చుట్టూ గుమికూడి అరవటంతో ఆ జంట మళ్ళీ ఈ లోకం వచ్చారు. అన్విత సిగ్గుతో అక్కడ నుంచి స్వాతి వెనకగా దాక్కుంది.
అమ్మమ్మగారు.... "ఏంట్రా ప్రదీపు..... ఆ పనులు"
ప్రదీప్ ఎవరో పిలిచినట్లుగా......"ఆ... నాన్నా.... వస్తున్నా " అంటూ అక్కడ నుంచి తప్పించుకోబోయాడు
"ఒరేయ్ నేనూ ఇక్కడే ఉన్నా" అన్నారు రామ్ గారు ఒకింత కోపం నటిస్తూ
"ఆ.... అందరూ ఇక్కడే ఉంటే, అక్కడ ఏదైనా కావాలేమో ఎవరు చూసుకుంటారు అంటూ కదలబోయాడు
ప్రదీప్ ని హరీష్ ఆపుతూ ..... "ఏం బావా నన్నిందాకా ఏదో అన్నావు. ఇప్పుడెవరు తొందరపడుతున్నారు"
"బాబోయి ఆడేసుకోకండి బావా" అంటూ అక్కడ నుంచి పారిపోయాడు
అందరూ అన్విత వైపు చూడగానే, "నేనేమి చేయలేదు బామ్మగారు" అంటూ మొహం దాచేసుకుంది.
అమ్మమ్మ గారు.... "ఎందుకు చేయలేదు. మా మనవడు నిన్ను వదలలేకపోతున్నాడు. అమ్మాయి పద్మా, వీళ్ళనీ ఈ నెల రోజులూ కొంచం కనిపెట్టుకుని ఉండాలమ్మా. వీళ్ళు ఆ మూడుముళ్ళు పడే వరకూ కూడా ఆగేలా లేరు."
స్వాతి... "ఎంటమ్మమ్మా మరీను. అందరూ కలిసి దాన్ని అంటారు. పద అన్వి. ఆకలేస్తోందంటే మనకి ఇక్కడ ఎవరూ భోజనం కూడా పెట్టటం లేదు. మనమే వెళ్ళి తిందాము" అంటూ లేవబోయింది
పద్మ గారు...."ఏంటే నువ్వు తప్పించుకుందామనుకుంటున్నావా ఇప్పుడూ, నిన్ను అనే ముందరే "
"నేనేం చేశానమ్మా ఇప్పుడూ"
సత్య గారు.... "అవును పద్మా. స్వాతి ఏం చేసింది. ముద్దు పెట్టింది మావాడు. వీడిని ముందర పట్టుకోవాలి. అసలు నువ్వే, లేని ఐడియాలు అన్నీ ఇస్తున్నావ్"
"నేనేం చేశానమ్మా మధ్యలో. మాకు ఆకలేస్తోంది. ఇక్కడ మీటింగ్ ఆపి తిందాము పదండి" అంటూ అందరినీ తోస్తూ, "పాపం స్వాతికి ఆకలేస్తోందిట" ఆ మాటకి మళ్ళీ అందరూ ఆగిపోయి హరీష్ ని చూసారు. "అబ్బా మనకి కూడా ఆకలేస్తోంది కదా అంటున్నా"
స్వాతి తినబోతూ, "ఏమైంది అన్వి, తినకుండా ఆలోచిస్తున్నావు"
"స్వాతి ఒక హెల్ప్ చేయవా"
"ఏంటే "
"ఇందాక ప్రదీప్ బావ ఈ గొడవ కి ఎక్కడికో వెళ్ళాడు. తనూ తినలేదు. నేనొక్కదాన్నే వెళ్తే అందరికీ డౌట్ వస్తుంది. ఒకసారి చూసొద్దాం, వస్తావా"
"హ్మ్... సరే పదా" అంటూ ఇద్దరూ అక్కడ నుంచి జారుకుని ప్రదీప్ దగ్గరకి వెళ్ళారు.
అన్విత.. "బావా...."
"అన్వి.... నువ్వెంటి ఇటొచ్చావు"
"నిన్ను వెతుక్కుంటూ వచ్చా. రా లోపలికి...అందరూ భోజనం చేస్తున్నారు"
"అన్వి.... నీకు నా మీద కోపంగా ఉందా. సారీ..... ఇందాకా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చెప్తుంటే నన్ను నేను కంట్రోల్ చేస్కోలేకపోయాను"
అన్వి ప్రదీప్ చేయి పట్టుకుని..... "కోపమేమి లేదు బావా. చెప్పాను కదా నువ్వేం చేసినా నాకిష్టమే"
ప్రదీప్ అన్విత ని దగ్గరకి తీసుకొబోతుంటే తననుంచి దూరం జరుగుతూ , "బావా... స్వాతి వచ్చింది. అక్కడ పక్కన నిల్చుంది. నీతో మాట్లాడమని నన్ను పంపింది"
"అదేంటిరా. ఒకత్తి నిల్చుందా."
"ఆ.... నేను ఒకదాన్ని వస్తే మళ్ళీ అందరూ ఏడిపిస్తారని తనని తోడు తీసుకొచ్చాను. పదా వెల్దాము"
స్వాతి దగ్గరకి వెళ్లేసరికి, వాళ్ళని వెతుకుంటూ వచ్చిన హరీష్ స్వాతి తో మాట్లాడుతూండటం చూసీ,
"చూసావా బావ మీ చెల్లెల్ని మా అన్నయ్య ఒక్కతిని ఏం వదిలేయలేదు"
హరీష్ .... "అదేంలేదు అన్వి. మీరు ఎక్కడున్నారనే అడుగుతున్నాను......అంతా ఓకే నా" అన్నాడు వాళ్ళిద్దర్నీ అనుమానంగా చూస్తూ
"ఓకేనే. మేము లోపలికి వెళ్తున్నాము. మీరిద్దరూ తర్వాత రండీ" అంటూ అన్విత నవ్వేసి స్వాతి తో వెళ్ళిపోయింది.
ఆరోజు అక్కడి కార్యక్రమాలు ముగించుకుని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. స్వాతి, ప్రదీప్ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయాక, రామ్ గారు, పద్మ గారు, అమ్మమ్మ గారు కూర్చుని ఆరోజు జరిగినవన్ని తల్చుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు
పద్మ.... "ఒక మెట్టు ఎక్కామండి. ఎలాంటి గొడవలు లేకుండా అన్నీ అనుకున్నట్లుగా బాగా జరిగాయి. సత్యోదిన కూడా బాగా ఆరెంజ్ చేశామంది"
"నిజమే ఒక మెట్టు ఎక్కాము. తమ్ముడు కూడా వచ్చి ఉంటే బావుండేది. స్వాతికి అత్తగారింట్లో దాని మర్యాద ఉండాలి కదా. వాడికి చెప్తే అవన్నీ అర్థం చేస్కోడు. ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలీట్లేదు. ఇన్నేళ్ళైనా ఇంకా ఆ మంకు పట్టుదల ఏంటో"
"సరేలే బాబు. అల్లుడి గురించి తెలిసిందే కదా. నేనూ చెప్పి చూసాను. ఇప్పుడా ఆలోచన ఎందుకు. దానికి తల్లి తండ్రీ మీరున్నారు. దాని మర్యాదకి యే లోటు లేదు. ఆ అబ్బాయే అన్నీ చూసుకుంటాడు"
"హరీష్ ని నమ్మే మేమూ ఈ పెళ్ళికి ఒప్పుకున్నాము పిన్నీ"
రామ్ గారు... "పద్మా అసలైనవి ముందర ఉన్నాయి. అత్తయ్యగారు, మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలో చెప్తూ ఉంటే అలా చేస్కుంటూ వెళదాము. పద్మా, చివరి నిమిషం లో ఖంగారు పడకుండా ఇచ్చి పుచ్చుకునేవన్ని ముందరే సిద్ధం చేస్కో"
"అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఇద్దరూ భయపడకండి. జంటలు మాత్రం చూడముచ్చటగా ఉన్నారు. పద్మా దిష్టి తీసావామ్మా ఇద్దరికీ"
"తీశాను పిన్ని. పిన్ని... ఎల్లుండి చీరలు నగలు షాపింగ్ కి వెళదాం రమ్మంది వదిన. సుధా (అన్విత వాళ్ళ అమ్మగారు) వాళ్ళని కూడా రమ్మన్నాను. అన్వితకి మనం పెట్టేవి కూడా తీసుకోవచ్చు కదా అని. తను వస్తే తనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటుందని"
"సరే పద్మా. ఇప్పటికైతే మీరూ వెళ్ళి పడుకోండి. పొద్దున్నుంచి అలిసిపోయున్నారు"
"సరే పిన్నీ"
రామ్ గారు.... "అత్తయ్యగారు..... మీకు ఇక్కడ వీలు గానే ఉంది కదా. మీకేదైన కావాలంటే చెప్పండీ"
"ఏమి లేదయ్యా. అన్నీ బావున్నాయి. నా గురించీ మీరేమి దిగులుపడకండి. ఏదైనా కావాలంటే అడుగుతాను. వెళ్ళి పడుకోండి"
తర్వాత రోజున అందరూ షాపింగ్ కి బయల్దేరారు. కార్ లో స్వాతి.... "అమ్మా ముందే చెప్తున్నా మీరు నాకేమి బంగారం తీసుకోకండి. ఇంట్లో చాలా ఉంది. మరీ ఎక్కువ చేయకంpడి. ఉన్నవి చాలు"
రామ్ గారు ... "పెళ్ళికి కొత్తవి తీసుకోకపోతే ఎలాగమ్మా"
"నాన్నా ప్లీజ్..... అన్నీ నేనసలు పెట్టుకొను కూడా. దాని బదులు ఇంకెందుకైనా వాడచ్చు. ఇప్పుడేమి కొనద్దు"
"సరే"
"అన్నయ్య రాడా"
పద్మ గారు....."నువ్వు అన్నయ్య కోసం అడుగుతున్నావా లేక హరీష్ కోసమా"
రామ్ గారు... "అన్నయ్య అయితే ఆఫీస్ నుంచి వచ్చేస్తా అన్నాడురా. బయల్దేరుంటాడు"
"ఓహ్" అనైతే అంది కానీ హరీష్ గురించి ఎలా అడగాలో తెలీక తడబడుతూ ఉంది.
అది చూసీ, పద్మగారు.... "హరీష్ కూడా అన్నయ్యతోనే వస్తున్నాడు. నువ్వడగలేదని నాన్న చెప్పలేదు" అన్నారు నవ్వుతూ.
"నాన్నా.... "
"ఆ... అన్నయ్య గురించీ అడిగావు కదా, అదిగో అన్నయ్యా" అంటూ కార్ వాళ్ళ పక్కగా షాప్ ఎదురుగ పార్క్ చేశారు.
"రామ్ గారు....."ఏమయిందిరా ప్రదీపు ఇక్కడే ఆగిపోయావు. హరీష్ రాలేదా" అంటూ స్వాతిని చూపించి ఏదో సైగ చేశారు
"లేదు నాన్నా తను రాలేదు. షాపింగ్ బోర్ అని వెళ్ళిపోయాడు. మీరెలాగూ దగ్గర్లో ఉన్నారు కదా అని ఆగాను ఇక్కడే"
అది వింటూనే స్వాతి మనసులో "షాపింగ్ బోర్ అంట, నాకు మాత్రం సరదా ఏంటి. తనూ వస్తాడనుకుంటే ఇలా చేసాడు..... అని తిట్టుకుంటూనే" బయటకి మాత్రం..
"అన్నయ్యా.... అన్వి వాళ్ళు లోపలే ఉన్నారు ఇంకా ఇక్కడెందుకు వెళ్ళూ"
ప్రదీప్ ఒక్క అడుగు వెనక్కి వేసి, స్వాతి తల మీద చిన్నగా తట్టి, "చిన్నూ..... నా మీద కౌంటర్లు వెయ్యి కానీ ఇలా అమ్మా వాళ్ళ ముందర బుక్ చేయకురా" అని బతిమాలుతూ అన్నాడు
స్వాతి నవ్వి లోపలికి వెళ్ళబోతుంటే, వెనక నుంచి ఒక ఆకతాయి తనని ముట్టుకుంటూ అల్లరి పెడ్తుంటే, స్వాతి ప్రదీప్ ని గట్టిగా పట్టుకుంది. ప్రదీప్ తన ఇబ్బందిని గమనించి,
"చిన్నూ, ప్రతీసారి నీ పక్కన నేను ఉండలేను కదా. నీకు నువ్వు చిన్న విషయాల్లో అయినా రియాక్ట్ అవ్వకపోతే ఎలాగా" అంటూ ప్రదీప్ ని పట్టుకుని ఉన్న చేతిని తీసేసాడు.
స్వాతి ప్రదీప్ ని చూసీ ధైర్యం కూడగట్టుకుని, వాడిని కొట్టటానికి విసురుగా వెనక్కి తిరిగేసరికి హరీష్ తన చేతిని ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో తనని దగ్గరకి లాక్కుని అరవకుండా నోరుమూసేసాడు. ప్రదీప్ ఇద్దరినీ చూసీ నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయాడు.
స్వాతి గింజుకుంటుంటే, నోటి మీద చేయి తీసి, తనని వదిలి "ఏంటి, ఎప్పుడు చూడు నా మీద చేయి ఎత్తుతావు. పెళ్ళి కూడా అవలేదు, ఇలా ఇప్పటి నుంచే నన్ను కొట్టటం ఏమైనా బావుందా"
"బావా నువ్వనుకోలేదు. అయినా ఎప్పుడూ వెనక నుంచి పట్టుకుంటావేం. ఇప్పుడైతే నా తప్పు కాదు. అన్నయ్యే అన్నాడు అల్లరి పెడ్తుంటే ఊరుకోకూడదని. అందుకే.... అయినా నువ్వు అన్నయ్య తో రాలేదా"
"ఇద్దరమూ కలిసే వచ్చాము. అమ్మా వాళ్లు ఎక్కడున్నారో అని ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళాను" అంటూ ప్రదీప్ వాళ్ళ దగ్గరకి వెళ్ళారు.
పద్మగారు.... "స్వాతి... నువ్వూ, అన్వి ఏ డిజైన్స్ నచ్చుతాయో చూడండి, అన్వికి. మేముంటే చెప్పటానికి మొహమాట పడుతోంది కొత్తగా" అంటూ పెద్దవాళ్ళు పక్కకి వెళ్ళి ఇంకేవో మోడల్స్ చూస్తున్నారు.
"అన్వి నాకిది చాలా నచ్చిందీ. చూడూ" అంటూ అక్కడున్న ఒక నెక్లెస్ తీయమని చూపించింది స్వాతి.
అన్వి "అవునే. నాకూ ఇది నచ్చిందీ. సింపుల్ గా అయినా చాలా గ్రాండ్గా ఉంది. చాలా బావుంది"
పద్మ, సుధా గారు వచ్చి చూసీ, పద్మగారు... "అన్వి... పెళ్ళికి కదమ్మా, కొంచమేదైనా పెద్దది తీసుకో"
"అత్తయ్యా, అమ్మ ఎలాగో పెద్దవే తీసుకుంది. ఇదైతే ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకోటానికి బావుంటుందని. సరే ఇంకా చూస్తాములే"
స్వాతి.... "అమ్మా.... నాకూ ఇదే చాలా నచ్చింది. ఆ పెద్దవి వేసుకుంటే పీక పట్టేసినట్లుంటుంది"
అన్విత మెల్లిగా స్వాతి తో... "నాదీ సేమ్ ఫీలింగ్" అంటూ నవ్వింది.
పద్మ గారు... "సరేలెండి అయితే ఆ చైన్ ప్యాక్ చేయండి. దానితో పాటు వేరే ఏవైనా కూడా పెడతాము సుధా.. చెవికి బుట్టలు లాంటివేవైనా తీసుకుందాము" అంటూ పక్కకి వెళ్ళారు పద్మ సుధా గారు
"స్వీటీ.... నీకంతాలా నచ్చితే నీక్కూడా అదే తీసుకోరా"
అన్వి... "హేయ్ అవునే.... ఇద్దరం మాచింగ్ మాచింగ్ పెట్టుకోవచ్చు. తీసుకో"
ప్రదీప్ "అవునురా.... ఇద్దరికీ తీసుకుందాము. నీకూ నచ్చిందంటున్నావ్ కదా"
"ఆహా.... నాకిప్పుడేమి వొద్దన్నయ్యా. ఇప్పుడు కూడా అత్తయ్య అన్నారని వచ్చాను. అత్తయ్య కి నచ్చితే ఇదే తీస్కుంటాలే"
అన్వి... "ఎందుకు నచ్చదే. హరన్నయ్యా... నువ్వు చెప్పు ఎలా ఉందొ" అంటూ స్వాతి మెడకి ఆ చైన్ ని పెట్టింది
హరీష్.... "అవునురా నీకు చాలా బావుంది"
"ఏంటి స్వాతి. మరీ అంత చిన్న చైన్. అది పెడితే రేపు పెళ్ళిలో అందరూ మా గురించి ఏమనుకుంటారు. హరీ నువ్వైనా చెప్పద్దా"
"అమ్మా.... చిన్నదైనా బావుంది కదా, తనకీ నచ్చిందీ"
"తనకి నచ్చితే సరిపోతుందా" అంటూ గట్టిగా అడిగేసరికి,
స్వాతి... "అత్తయ్యా.... అన్వి తీసుకున్నది జస్ట్ చూస్తున్నాను అంతే టైంపాస్ కి. నాది మీరు సెలెక్ట్ చేయండి. రండీ"
ఆవిడ చాలా సేపు అన్నీ తీయించి చివరికొక సెట్ ని సెలెక్ట్ చేశారు. అది చూసీ స్వాతి... "అత్తయ్యా.... ఇది చాలా హెవీ గా ఉంది. ఇలాంటివి నేను పెట్టుకోలేదు ఎప్పుడూ"
సత్య గారు....."ఏంటి స్వాతి. మేము పెట్టేవి మాకు నచ్చినవి తీసుకుంటాము. ఏమిచ్చినా కూడా పెట్టుకోవాలి" అంటూ కొంచం గట్టిగా అనేసరికి స్వాతి ఏమి మాట్లాడలేదు
తనతో అలా గట్టిగా మాట్లాడేసరికి, హరీష్.... "అమ్మా ఏంటది. తనకి నచ్చలేదంటే ఎందుకంత బలవంత పెడతావు. నువ్వు ఇచ్చేది తను వేసుకునేలా ఉండాలి కానీ అందరికీ చూపించి లాకర్లో మూలకి తోసేయటానికి కాదు కదా"
"బావా.... అత్తయ్య అన్నదాంట్లో తప్పేముంది. పెళ్ళిలో పెద్ద హారం వేసుకుంటే అది ఎంత గొప్పగా ఉంటుంది. ఇది బావుందత్తయ్యా. తీసుకోండి"
"స్వీటీ.... నీకు నచ్చకపోతే ఎందుకు కాంప్రమైస్ అవ్వటం. నచ్చినదే తీస్కోవచ్చు కదా"
"బావా..... నాకు నచ్చలేదనలేదు. ఎప్పుడూ పెట్టుకోలేదు అన్నాను అంతే. ఇలాంటి మోడల్ లేదసలూ చాలా బావుంది. నిజంగా"
స్వాతి అంతగా చెప్తుంటే హరీష్ ఇంకేమి మాట్లాడలేకపాయాడు. అప్పుడే అక్కడికి అన్విత, సుధగారు వచ్చారు.
స్వాతి.. "అన్వి.... అత్తయ్య ఇది సెలెక్ట్ చేశారు. చూడు బావుంది కదా.."
అన్విత ఏదో మాట్లాడబోతుంటే, స్వాతి అన్విత చేయి మెల్లిగా నొక్కటం తో, "చాలా బావుందే" అని ఊరుకుంది
మొత్తానికి అక్కడ ఆ సెట్ తీస్కుని, పద్మగారు పిలుస్తున్నారంటూ అన్వి, స్వాతి పక్కకి వెళ్ళారు. హరీష్ ఫోన్ మాట్లాడుతూ బయటకి వెళ్ళటం తో, సత్య గారు సుధా గారితో..
"చూడు సుధా. పెళ్ళికి ముందరే వీడు తన వైపు మాట్లాడుతూ నా మీద ఎగురుతున్నాడు. ఇప్పట్నుంచే ఇంత కంట్రోల్ లో పెట్టేస్తోంది. పెళ్ళైతే వీడసలు నా మాట వింటాడా. ఇంకా ఎన్ని చూడాలో"
"అదేమీ ఉండదులే అక్కా, నువ్వేం ఖంగారు పడకు. మన హరీష్ ఎలాంటివాడో నీకు తెలీదా"
"తెలుసు కాబట్టే, వాడు నన్ను ఎదిరించి ఎప్పుడూ మాట్లాడలేదు ఈరోజు వరకూ అంటున్నాను"
స్వాతి, అన్విత ఆ మాటలు విన్నారు. అన్విత స్వాతి భుజం మీద చేయి వేసి పక్కకి తీస్కెళ్ళి, "స్వాతి.... అసలేమయ్యిందే"
స్వాతి అంతకముందు అక్కడ జరిగినది చెప్పి, "బావ నాకు మంచి చేయబోయి మాట పడ్డాడే. నేనూ తనని సపోర్ట్ చేయలేదు"
"హ్మ్.... సరేలే నువ్వక్కడా ఏమి అనలేవు కూడా. సరే పదా. అందరూ వస్తున్నారు"
పద్మ గారు.... "స్వాతి ఇక్కడ అయిపొయింది. పెళ్ళి పట్టుచీరలు అవీ తీసుకోవాలి అటు వెళదాం రండీ. అది కింద ఫ్లోర్ ట"
స్వాతి సత్య గారి వైపు చూసీ, "అమ్మా.... అత్తయ్య సెలక్షన్ సూపర్ ఉంటుంది. అత్తయ్య డెసిషన్ ఫైనల్. తనకి ఏది నచ్చితే అదే"
"అబ్బో ఇంకేం మరి. వదినా మీ కోడలు సర్టిఫికెట్ ఇచ్చేసింది. పదండి."
"అమ్మా.... ఒకసారి నాన్న దగ్గరకు వెళ్ళొస్తా, మెన్స్ సెక్షన్ లో ఉన్నారు..." అంటూ వెళ్ళింది
రామ్ గారి దగ్గరకి వెళ్ళి, "నాన్నా కార్ కీస్ ఇస్తారా. తల నొప్పిగా ఉంది. కార్ లో కూర్చుంటా" అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయి కార్ లో కళ్ళు మూసుకుని కూర్చుంది
కొద్ది సేపటికి, అన్విత కార్ విండో పైన తట్టటం తో తలుపు తీసి... "ఏమైందే షాపింగ్ అయిపోయిందా"
"నాది అయ్యింది. పెద్దవాళ్లది ఇప్పట్లో తేలేలాలేదు. నీకేమయ్యింది. సడన్ గా తలనొప్పి ఏంటి. పెద్దమ్మ మాట్లాడినడని గురించి ఆలోచిస్తున్నావా"
"ఏమిలేదే.... అన్వి... "
"చెప్పవే.."
" బావ తో మాత్రం ఇందాక అత్తయ్య అన్నవి ఏవి మాట్లాడకూ. ప్లీజ్. ప్రామిస్ చేయి. ఈ విషయం ఇంకా పెద్దదవటం నాకిష్టం లేదు"
"సరే ప్రామిస్" అంటూ స్వాతి చేతిలో చేయి వేసి మాట ఇచ్చింది
అంతలో అక్కడికి హరీష్, ప్రదీప్ రావటం అన్వి ప్రామిస్ చేయటం... ఎందుకు అన్నది వినిపించకపోయినా, కనిపించింది.
స్వాతి వాళ్ళని బయటకి రమ్మని సైగ చేసి,
హరీష్... "పెద్దవాళ్లకు ఇక్కడ వెయిట్ చేసేబదులు పక్కనే ఐస్క్రీమ్ కార్నర్ ఉంది, అక్కడ కొంచం సేపు కూర్చుని చల్ల చల్లగా ఏమైనా తినచ్చు కదా"
"సరే మాకు ఓకే. పదండి"
నలుగురూ అక్కడికి వెళ్ళి కూర్చున్నాక, ప్రదీప్... "అవును చిన్నూ.... ఇందాకరేంటి అన్వి తో ప్రామిస్ చెయించుకున్నావ్. ఏం చెప్పద్దని చెప్పావు. అన్వి నువ్వు చెప్పూ"
అన్విత .... "బావా నువ్వే చెప్తున్నావా ప్రామిస్ చేయించుకుందని. ఇంక నేనేం చెప్తాను. దాన్నే అడుగూ" అంటూ హరీష్ ని ప్రదీప్ ని చూసింది.
"ఏమిలేదన్నయ్యా తల నొప్పిగా ఉంది. అయితే ఎవరికైనా చెప్పి వెళ్లిపోదాము అందీ, ఎవరికీ చెప్పకూ బాగోదు అన్నాను. అంతే జరిగింది"
"సరే.... అన్వి వస్తావా. నీకేం కావాలో నువ్వే ఆర్డర్ చేస్కో. తీస్కోచ్చాక వంద వంకలు పెడతావు. హరీష్ నీకూ?? "
హరీష్... "స్వాతి నీకేం కావాలి"
"దానిది ఎప్పుడూ ఒక్కటే ఫ్లేవర్. నీకు ?? "
"నాకూ అదే తీస్కో బావా "
"సరే అయితే ఇద్దరికీ బట్టర్ స్కాచ్ యే తీసుకుంటాము" అంటూ అన్వి, ప్రదీప్ ఆర్డర్ చేయటానికి వెళ్ళారు
"స్వీటీ.... ఏమైందీ. ఎందుకు డల్ గా ఉన్నావు, ఇందాక షాప్ లో గురించా" అంటూ తన పక్కన కూర్చుని ప్రేమగా చేయి పట్టుకుని అడిగాడు
"బావా ఇందాక నువ్వు నాకోసం మాట్లాడుతుంటే నేను నిన్ను సపోర్ట్ చేయలేకపోయాను. అక్కడ నేనేమి మాట్లాడినా ఆ చిన్న విషయం పెద్ద గొడవ అవుతుందీ. అందుకని అలా మాట్లాడాను. సారీ"
"ఓయి.... సారీ ఏంటి. నువ్వు ఎందుకు చెప్పావో నాకర్థమయ్యింది. అందుకే ఏమి మాట్లాడకుండా ఊరుకున్నా. ఇప్పుడెందుకు మరి డల్ గా ఉన్నావ్. నిజం గా తల నొప్పా"
"ఆ...." అంది ఫేస్ డల్ గా పెట్టి హరీష్ భుజం మీద వాలుతూ
ఇంతలో ప్రదీప్, అన్విత రావటం తో కబుర్లు చెప్పుకుంటూ ఐస్క్రీమ్ తినేసి షాప్ లో పెద్దవాళ్ళదగ్గరకి వెళ్ళారు. వాళ్ళు తీసుకున్న బట్టలు అవీ అన్నీ చూసీ ఇంటి ముఖం పట్టారు
ఇంటికివెళ్ళాక, ప్రదీప్ "అమ్మా చిన్నూ కి ఈ చైన్ తీసుకున్నాను"
"అన్నయ్యా ఇప్పుడు నాకు ఎందుకు"
"అవునురా, అదీ ఒద్దందనే కొనలేదు. లేకపోతే దానికీ తీసుకునేవాళ్ళమే"
"అమ్మా ఇప్పుడు మిమ్మల్ని ఎవరేం అన్నారు. నేను దాని పెళ్ళికి ఏమైనా తీస్కోవాలనుకున్నాను, ఇది దానికీ నచ్చిందీ. అన్విత చిన్నూ ఒకేలాంటివి పెట్టుకుందామని సరదా పడ్డారు కూడా. అందుకే తీసుకున్నాను" అన్నాడు నవ్వుతూ
అన్విత వాళ్ళింట్లో....
సుధగారు.... "ఏవండీ, మన అమ్మాయి, చాలా పెద్దదైపోయింది"
రమేష్ గారు..... "ఎందుకు సుధా, ఏమైందీ "
"ప్రదీప్ స్వాతి విషయంలో చాలా బాధ్యతగా ఉంటాడు. ఇదేమో ఆడుతూ పాడుతూ ఉంటుంది. వాడి కోపానికి దీని చిన్నపిల్ల తత్వానికి మధ్యలో ఏదైనా మాట మాట వస్తాయేమో అని భయపడ్డాను. కానీ ఈరోజు బంగారం కొనేటప్పుడు దాన్ని చూసీ ఆశ్చర్యమేసింది." అంటూ జరిగినవి, హరీష్ వాళ్ళ అమ్మగారి మాటలు చెప్పి, "ప్రదీప్ దగ్గరకి వెళ్ళి, అతన్ని స్వాతికి కూడా తీసుకోమని చెప్పింది. అక్కడ జరిగినవేవి చెప్పకుండా, బావా స్వాతికి మనిద్దరి గిఫ్ట్ గా ఇయ్యి, పెళ్ళి కి అన్న గారివి నువ్వు ఏమి తీసుకోకపోతే ఎలా అంటూ"
"మరి తీసుకున్నాడా"
"తీస్కున్నాడండి. అటు స్వాతికి నచ్చిందీ కొనిపించింది, అక్కయ్య మాటలకి బాధపడినప్పుడు ఒక అమ్మ లాగా దగ్గరకి తీస్కుని ఓదార్చింది, అలాగే వాడి కోపం గురించి తెలిసీ వాళ్ళ గురించి ఏమి చెప్పలేదు. పెళ్ళి అనేసరికి పిల్లలు ఎంత మారిపోతారో"
"సుధా.... ఈ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండేదానివో మర్చిపోయావా. మా చిన్నొదిన ఏమన్నా కూడా మనసు నొచ్చుకున్నా, నా వరకూ రానీయలేదు, మా అక్కతో నీ సొంత తోబుట్టువులా ఉంటావు. అన్విత నీ కూతురు. ఆ పోలికలు ఎక్కడికి పోతాయి. అందులోను అక్కడ మా అక్క, బావగారు కోరి దాన్ని కోడల్ని చేసుకుంటున్నారు. అందుకే దాని విషయం లో నాకు బెంగ లేదు" అంటూ తృప్తిగా పడుకున్నారు
Comments
Post a Comment