44

 ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది.  అమ్మమ్మగారు కూడా ఊరి నుంచి వచ్చేసారు.  ఇల్లంతా హడావిడి.  రెండు జంటలు ఉండటంతో ఫంక్షన్ హాల్ తీసుకున్నారు.  


పద్మ గారు...  "రమ్యా....... స్వాతి రెడీ అయ్యిందా"  


"అవుతోంది ఆంటీ. ఒక పావుగంటలో అయిపోతుంది " 


"అదేంటి ఇంకా చీర మార్చుకోలేదు. త్వరగా కానీయి స్వాతి" 


"సరే అమ్మా....  అమ్మా నువ్వేమైనా తిన్నావా" 


"లేదు.  అక్కడికి తీస్కెళ్ళాల్సినవి అన్నీ సద్దుతున్నాను.  తర్వాత తింటానులే" 


"అమ్మా నాకు కొంచం పాలు ఇస్తావా" 


"అయ్యో.....  నేనసలు ఇయ్యనేలేదా.  ఈ హడావిడిలో మర్చిపోయానమ్మా.  ఇదిగో తీసుకొస్తున్నా" అంటూ తీస్కుని వచ్చి ఇచ్చారు.  


"నువ్వు ఇందాక తీసుకొచ్చి నాకు ఇచ్చావు.  ఈ పాలు నీకోసమే.  ఒక్క క్షణం నిల్చుని తాగేసి  వెళ్ళి నీ పనులు చూస్కో.  నేనేమి అడ్డుపడను" 


"పాలు ఏంటే.  ఇప్పుడు కాదు.  తర్వత తాగుతాలే" 


"ఓయి ముందు తాగు.  బతిమాలించుకునే టైమ్ లో ఆ పని అయిపోతుంది కూడా"....  


"సరే ....  ఇదిగో తాగేసాను.  వెళ్ళనా ఇంకా.  నువ్వూ త్వరగారా నాన్నా,  కబుర్లతో కూర్చోకండి.  అక్కడికి వెళ్ళాకా చాలా టైమ్ ఉంటుంది" 


రమ్య ... "సరే ఆంటీ మీరు ఖంగారు పడకండి" 


స్వాతి రెడీ అయ్యి పద్మ గారి దగ్గరకు వెళ్ళింది. పద్మ గారు "స్వాతి ఎంత బావున్నావో. నా దిష్టే తగిలేలా ఉంది" అంటూ మెటికలు విరిచి తనని హత్తుకున్నారు   


" అమ్మా.....  నాన్న ఎక్కడా" 


"లోపల ఉన్నారు " 


"సరే  నువ్వూ రా"  అంటూ స్వాతి పద్మగారిని తీస్కుని రామ్ గారి దగ్గరకు వెళ్ళింది 


"నాన్నా..... ఎలా ఉన్నాను"


"బంగారు తల్లివి రా నువ్వూ. చాలా బావున్నావమ్మా" 


రమ్య..."అంకుల్ బావున్నావ్ అంటే సరిపోతుందేంటీ. ఇదిగోండి అక్షింతలు. మీ అమ్మాయిని ఆశీర్వదించండి" 


ఆ దంపతులిద్దరూ స్వాతి ని ఆశీర్వదించి దగ్గరకు తీసుకున్నారు 


"అమ్మా ఏంటి కన్నీళ్ళ...." 


"నిన్నో మొన్నొ నిన్ను తీస్కొచ్చినట్లుగా ఉందిరా. రేపు మాపో మళ్ళీ వెళ్ళిపోతావు. ఇంత పెద్దదానివెప్పుడైపోయావే" 


అమ్మమ్మా.... "ఆడపిల్లలు అంతే పద్మా.  ఇట్టే ఎదిగిపోతారు. దాన్ని కన్నతల్లితండ్రుల్లా పెంచారు. మిమ్మల్ని వదిలి అదెక్కడికి వెళ్ళిపోతుంది. దాన్ని ఎంత మంది మీకు దూరం చేయాలనుకున్నా అది ఎప్పటికి మీ అమ్మాయే"


"అమ్మమ్మా.... " అంటూ ఆవిడ కాళ్ళకి దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది.. 


పద్మ గారు.... "పిన్ని...  ఇది మనము హరీష్ కి పెట్టాల్సిన రింగ్,  ఇవి బట్టలు. అన్విత కి ఇయ్యాల్సినవి ఇదిగోండి. ఇవి మీ దగ్గరకు ఉంచండి. నేను ఖంగారులో ఎక్కడైనా పెట్టేస్తానేమో" 


"అన్విత రింగ్ లేదమ్మా దీంట్లో" 


"అది వాళ్ళ దగ్గరే ఉంది పిన్ని. రెండూ వాళ్ళే తీసుకొస్తున్నారు" 


"సరేనమ్మా" 


"అమ్మా నేను అన్నయ్యని చూసొస్తా" 


"త్వరగా రండమ్మా. మీరు వస్తే ఇంక బయల్దేరటమే "


"నేనూ, అమ్మమ్మ, అన్నయ్య కార్ లో వచేస్తాము. మీరు ముందర బయల్దేరండి. రమ్యా నువ్వూ  అమ్మా వాళ్ళతో  వెళ్ళవే" 


"పర్వాలేదు నేనూ నీతో ఉంటాను" 


"ఒస్సెయి నువ్వు ముందు వెళ్ళి బావకి ఒక పిక్ తీసి పంపించవే. ఎలా ఉన్నాడో చూద్దామంటే ఒక్క సెల్ఫీ పంపటం లేదు" అంటూ స్వాతి రమ్య కి మాత్రమే వినిపించేలా చెప్పింది


రమ్య కూడా అంతే మెల్లిగా,   "నువ్వూ ఫోటో పంపమంటే పంపలేదు కదా.  అందుకే అన్నయ్య కూడా పంపలేదు" 


"అంటే నీకు ఆ విషయం చెప్పేశాడా బావా. అయినా నువ్వు నా ఫ్రెండా బావ చెల్లివా ఇక్కడా" 


"మా అన్న కాబట్టే తన ఫోటోస్ నీకు పంపించను అలాగే నీ ఫ్రెండ్ని కాబట్టే ఇప్పుడు నీకోసం ఇక్క్కడికొచ్చా,  ఇంత ముద్దుగా ఉన్నా ఒక్క పిక్ కూడా నువ్వన్నట్లు అన్న కి పంపించలేదు" అని నవ్వేసింది 


పద్మ గారు....  "ఏమిటీ మీ గుసగుసలు. రమ్యా వెళదామా" 


"అక్కర్లేదులే అమ్మా.  ఇది ముందరే....  వచ్చి అక్కడ ఏమి పని చేయదుట. అందుకే మాతోనే వస్తుందిలే" అంది స్వాతి రమ్య ని కోపంగా చూస్తూ 


"సరే అయితే " అంటూ రామ్ పద్మగారు వెళ్ళిపోయారు. 


"అన్నయ్యా....  వావ్ అన్నయ్యా... సూపర్ ఉన్నావ్" 


"చిన్నూ......  నేనెంటిరా.....  నువ్వెంత బావున్నావో"


స్వాతి ప్రదీప్ కాళ్ళకి దణ్ణం పెట్టి, "అన్నయ్యా నన్ను ఆశీర్వదించు" 


"హేయ్ చిన్నూ....  లే ముందరా. నాకివన్నీ నచ్చవని తెలుసు కదా"


"నువ్వు అక్షింతలు వేయి అప్పుడే లేస్తాను. లేకపోతే ఇలాగే ఉంటా" 


ప్రదీప్ అక్షింతలు వేసి,  తను లేచాక,  స్వాతి మొహాన్ని చేతుల్లోకి తీస్కుని,  " బుజ్జి తల్లీ" అంటూ నుదుటి ముద్దు పెట్టుకునీ,  "చిన్నూ......  నువ్వు హ్యాపీ ఏ కదా" 


అమ్మమ్మ గారు "ఆఁహాఁ.... లేదురా అంటే ఇప్పుడేం  చేస్తావు" 


"ఏం చేయటం ఏంటి. అది హ్యాపీ గా లేకపోతే ఈ సెలెబ్రేషన్స్ లేవు. ఇవన్నీ దీని సంతోషం కోసమే కదా" 


రమ్య వాళ్ళ మాటలు వినీ,  పక్క రూమ్ లో నుంచి వచ్చి,  "ఏంటి ఏమన్నారు. మళ్ళీ చెప్పండి. సరిగ్గా వినిపించలేదు" 


"అవునూ....  దీని సంతోషం కోసమే ఇదంతా. ఇది హ్యాపీ గా లేదు అంటే...." 


"అన్నయ్యా....  అలా సరదాగా కూడా ప్లీజ్ అనకూ. ఎందుకో, అన్నీ అనుకున్నట్లుగానే అవుతున్నా,  పెళ్ళికి ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే సంతోషంగానే ఉన్నా  ఏదో బెంగగా ఉంది. కానీ నువ్వలా అంటుంటే,  గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది" 


"ఛా.....  అవేమి మాటలురా. మా చిన్ని తల్లికి ఏం కావాలో నాకు తెలీదా" 


"ప్రదీపు ఇంక బయల్దేరుదామా" అమ్మమ్మ గారి మాటతో అందరూ కదిలారు. 


ఫంక్షన్ హల్ లో కి అడుగు పెట్టేసరికి అప్పటికే అక్కడికొచ్చేసిన హరీష్ స్వాతిని చూసీ, మైమరచిపోయి తన వైపే అడుగులు వేస్తూ వెళ్ళి తన చేయి అందుకోబోయాడు


స్వాతి చేయికి బదులుగా ప్రదీప్ చేయి ఇచ్చి,  "బావా కంట్రోల్....  అందరూ చూస్తున్నారు బాగోదు. పదా" అని అన్నాకా హరీష్ మళ్ళీ ఈ లోకం లో కి వచ్చి, నవ్వుతూ ముగ్గురూ స్టేజ్ దగ్గరకు వెళ్ళారు. 


మంత్రాల మధ్యన పెద్దల  అందరి ఆశీస్సులు తీస్కుని,  పెళ్ళికి లగ్న పత్రిక రాయించారు. రెండు జంటలు తాంబూలాలు మార్చుకుని ఉంగరాలు తీస్కుని రమన్నారు 


స్వాతి హరీష్ చేతికి ఉంగరము పెట్టాక,  హరీష్ స్వాతి కి ఉంగరం తొడిగి ఆ చేతిని ముద్దాడాడు. అక్కడ ఉన్న అందరూ "ఓ...  " అని అరుపులు గోలతో హాల్ మారుమోగిపోయింది


ప్రదీప్... "బావా....  ఇది నిశ్చితార్థం మాత్రమే. ఇంకా పెళ్ళి అవలేదు. మరీ అంత తొందర పడకు" అంటూ ఏడిపించాడు 


హరీష్.... "బావా...  నిశ్చితార్థం అంటేనే సగం పెళ్ళి అయిపోయినట్లు. ఈ కొన్ని రోజులు మా ఆవిడని మీ ఇంట్లో ఉంచుతున్నాను అంతే. అయినా ఇందాకేమన్నావ్. కాన్సల్ చేయించేస్తావా,  ఇప్పుడు ఆఫీషియల్ గా నా సగం పెళ్ళి అయిపొయింది. ఇప్పుడేం పీకుతావ్" 


"హేయ్...  ఆ విషయం నీకెలా తెలుసు. స్వాతి.... " 


"మీ చెల్లి,  ఏమి చెప్పదు బావా,  మా చెల్లి ఫోన్ చేసి మరీ వినిపించింది" అంటూ రమ్య ని చూసాడు 


"రమ్యా నా..... అయిపొయింది. ఈ హడావిడి అవనీయి" 


"నువ్వేం చేయలేవు కానీ,  బావా మేము ఎలా ఉన్నాం" అంటూ స్వాతి భుజం మీద చేయి వేసి దగ్గరకి తీస్కుని అడిగాడు 


ప్రదీప్..... "బావా నీకేంటి చెప్పు. మా చెల్లి పక్కనుంది కదా,  మీ జంట డెఫినిట్ గా బావుంటుంది. దాని సెలక్షన్ ఎప్పుడూ సూపేరే"


స్వాతి వీళ్ళ మాటలకి ముసిముసి గా నవ్వుకుంటూ,  హరీష్ అలా చేయి వేసి మాట్లాడ్తున్నందుకు సిగ్గు పడుతూ అందరినీ చూస్తోంది


"అంటే బావా....  అది కూడా మీ చెల్లి క్రెడిట్ యే అంటావు" 


"అంతేగా...  అంతేగా" అంటూ నవ్వుతాడు ప్రదీప్ 


"ఇదిగో స్వీటీ,  మీ అన్న ఏమైనా అన్నా కూడా ఏం బాధపడకు మనల్ని ఇంకెవరూ దూరం చేయలేరు. " 


స్వాతి సమాధానంగా అందరినీ చూసీ నవ్వి తల దించుకుంది. 


అమ్మమ్మ గారు హరీష్ దగ్గరకి వచ్చి....."ఏంటి మనవడా,  అప్పుడే మా అమ్మాయిని ఏదో అంటున్నావు" 


"అది కాదు బామ్మగారు,  మీ మనవరాలు మాట్లాడ్తుందేమో  ముత్యాలేరుకుందామనుకుంటే నిన్నటి వరకు బానే ఉండి ఇప్పుడేమో నోరు విప్పటం లేదు" 


"బంగారాన్నే ఇచ్చాక ఇంకా ముత్యలెందుకయ్యా" అంటూ ఆటపట్టించారు


"ఇంతలో పురోహితులుగారు ప్రదీప్ ని అన్వితని రమ్మనటం తో  అందరూ వాళ్ళని తీస్కుని వెళ్ళి చుట్టూ చేరారు


ప్రదీప్ పద్మగారి చేతిలో నుంచి ఉంగరం తీస్కుని అన్విత కి పెట్టబోతూ ఆ ఉంగరాన్ని చూసీ ఆశ్చర్యంగా అన్విత వైపు చూస్తూ ఆగిపోయాడు. 


అమ్మమ్మ గారు,  "ఒరేయి ప్రదీపు,  తరువాత మీ ఆవిడని చూడచ్చు, అమ్మాయి ఎదురు చూస్తోంది. ముందు ఉంగరం పెట్టరా" అనటం తో  అందరినీ చూసీ,  ఒక చిన్న నవ్వు నవ్వి,  అన్విత కి ఉంగరం పెట్టాడు. 


తరువాత పిల్లలందరూ డాన్స్ లు పాటలు తో హోరెత్తిస్తే..   హరీష్,  స్వాతి వాళ్లతో పాటు చిందులేశారు. కానీ ప్రదీప్ ఎందుకో ముభావంగా ఉండటంతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ అన్విత దగ్గరకి వెళ్ళలేదు 


అన్విత ఏదో మాట్లాడటానికి వచ్చి..... "బావా....." 


"అన్వి...... ఇప్ప్పుడు ఇక్కడ టైమ్ కాదు. కొంచం సేపు తర్వాత మాట్లాడదాము" అని తన మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు


కొద్దిసేపటికి అందరూ భోజనాలు చేయటానికి వెళ్లగా,  స్వాతి హరీష్,  అన్విత ప్రదీప్,  కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పటికే స్వాతి ప్రదీప్ ఎందుకో ముభావంగా ఉండటం చూసీ,  "బావా... నీతో ఒకటి చెప్పాలి" అంటూ పక్కకి తీస్కుని వెళ్ళి


హరీష్..... "ఏంటిరా ఇప్పుడు ఎవరూ లేకపోయేసరికి అమ్మాయిగారికి ధైర్యం వచ్చిందా. సరే ఏం మాట్లాడాలి" అంటూ చిలిపిగా అడిగాడు 


"అది కాదు బావా,  అన్వి కి అన్నయ్య కి మధ్యన ఏదో అయ్యింది. ఇందాకటి నుంచి వాళ్ళు అసలు మాట్లాడుకోలేదు. మనం పక్కకి వస్తే వాళ్ళేదైనా ఉంటే మాట్లాడుకుని క్లియర్ చేసుకుంటారు కదా అని" 


అక్కడ....  అన్వి... "బావా ఇప్పుడైనా ఏమయ్యిందో చెప్పవా. ఎంతో సంతోషంగా ఉండాల్సిన మూమెంట్ ఎందుకంత డల్ గా ఉన్నావు. నా వలన ఏమైనా తప్పయ్యిందా" 


"తప్పా అని అడిగితే తప్పేమి కాదు అన్వి. కానీ ఏదైనా నచ్చకపోతే నాతో చెప్పచ్చుగా కదా. ఆ రోజు రింగ్ కొనేటప్పుడు ఒకటికి వందసార్లు అడిగాను,  నీకు నచ్చిందా అని. నువ్వేమన్నావు" 


"నీకు ఏది నచ్చితే నాకు అది ఓకే అన్నాను బావా. ఇప్పుడేమయ్యింది" 


"నాకు నచ్చినది చూపించాక కూడా నువ్వు ఓకే అనే అన్నాకే కొన్నాను కానీ అది నువ్వు మార్చేసుకున్నావు. నువ్వు మార్చినందుకు కూడా బాధ అనిపించలేదు. నాతో నీకది నచ్చలేదని ఒక్క మాట చెప్పలేదే అని బాధగా ఉంది. నువ్వు చెప్తే అది కాదు ఇంకేదైనా కూడా చేసేవాడిని కదా" అన్నాడు బాధగా  



*******************************************


ఇంతకీ అన్విత రింగ్ ఎందుకు మార్చేసిందంటారు.



Comments