43
"అమ్మమ్మా ...... అక్కడేదైనా అవుతుందేమో అని ఆలోచన కాదు, కానీ ఏ చిన్న కష్టం అనిపించినా అన్నయ్య తో షేర్ చేసుకుంటాను. తనకి తోచిన సలహా చెప్తాడు. ఏదీ చెప్పకపోయినా, ఒకసారి షేర్ చేసుకుంటే కొంచం గుండె బరువు దిగుతుందీ. లేదా అమ్మ తో మాట్లాడతాను. అలాంటిది, ఒక్కసారిగా వీళ్ళందరూ పరాయివాళ్ళు అయిపోతారా పెళ్ళైతే. ఇంట్లో జరిగే ప్రతి విషయం బావతో చెప్పుకోలేకపోతే.... ఇంకెవరితోను మాట్లాడలేనా. పెళ్ళైతే అమ్మాయిలు తల్లీ తండ్రులకి దూరమైపోతారా, అంత పరాయి వాళ్ళయిపోతారా ????"
"చిన్నూ..... "
"అ... అన్నయ్యా... ఎ.. ఎప్పుడొచ్చావు"
"ఏదో చెప్తున్నావ్ కదా. పరాయి వాళ్ళంటూ..... అప్పుడే వచ్చాను"
"నేనేమి అనట్లేదన్నయ్యా... "
""చూడు చిన్నూ...... నువ్వేదైనా బాధపడుతున్నట్లు నువ్వు చెప్పకుండా మాకు తెలిసిందనుకో, బావకి సంబంధం లేకపోయినా సరే, బావని వచ్చి ఉతికేస్తాను. నీకు పెళ్ళి చేసేది, నువ్వు ఇష్టపడ్డావని.... నీ సంతోషం కోసమని మాత్రమే. నిన్ను పరాయి దాన్ని చేసుకోటానికి కాదు. పిచ్చ మాటలు మాట్లాడకు"
"అన్నయ్యా ఎందుకంత కోపం. అసలు నేను మాట్లాడను అన్నానా. మాములుగా చెప్తున్నా. అంతే. మధ్యలో బావనెందుకు లాగుతావు. చూడమ్మోమ్మా ఎలా కోప్పడుతున్నాడో నా మీద"
"ఒరేయి మేమేదో లోకం తీరు మాట్లాడుకుంటున్నాం. నువ్వెంటిరా. అయినా అల్లుడ్ని అలా అనచ్చా. తప్పు కదూ. సరదాగా కూడా అనకూడదురా"
"నేనూ సరదాగా అనలేదు. ఇద్దరూ చెరిసగం కదా, అందుకే ఇది వెధవ్వేషాలేస్తే ఆయనకి పడతాయంటున్నా. దీన్ని ఏమైనా అన్నా కూడా ఇది వినదు కదా మరి"
"ప్రదీపు ఆపు. నువ్వూ చిన్నపిల్లాడివైపోతున్నావ్. ఆ అబ్బాయి వింటే బాగోదు. అయినా స్వాతి, మీ అత్త అంటుంటే మీ అమ్మ ఏమి అనలేదా"
"అమ్మ లేదమ్మోమ్మా. అయినా ఆవిడ అన్నందుకు నేనేమి బాధపడలేదు. ఆవిడ ఎప్పుడూ మా మంచికే చెప్తారు. ఆవిడ కాకపోతే ఇంకొకరు అనేవారు. టాపిక్ ఎవరు అన్నారని కాదు, ఇష్టపడి చేసుకున్నా లేదా అసలు పెళ్ళి చేసుకుంటే మీతో..... " ప్రదీప్ మొహం చూసీ నోరు మూసేసుకుంది చేతితో
"స్వాతి...... అంటున్నారని మాట ఉండిపోతోంది కానీ, ఏ పిల్లలు తల్లితో కష్టం వస్తే చెప్పుకోకుండా ఉండగలుగుతారు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి, ఏ సమస్య వచ్చినా ఇంట్లో ప్రతీవాళ్ళూ నీ వాళ్ళుగా భావించు అనే ఉద్దేశం తో చెప్పేవాళ్ళు. ఇప్పుడసలు కొన్ని చోట్ల అత్త మామలు కూడా ఉండటం లేదు. వేరు కాపురాలు. అత్త మామల్లో తల్లీ తండ్రుల్ని చూసుకోమంటారు. అందుకే ఇంటి గుట్టు గుమ్మం దాటనీయకు అంటారు. మరి అత్తగారు గయ్యాళి అయితే ఎవరితో చెప్పుకుంటుంది ఆ అమ్మాయి. ప్రతీసారి అత్తగారే గయ్యాళిది అవక్కర్లేదు. ఈరోజు రేపట్లో చదువులు ఎక్కువైపోయి, ఒద్దమ్మా అని అత్తగారు అనగానే ఆమ్మో రాచిరంపాన పెట్టేస్తోంది మా అత్తగారు అంటూ ఆవిడని నోటికి వచ్చినట్లు తిట్టే కోడళ్ళూ ఉన్నారు"
"ఇవన్నీ నేను మీకు చెప్పను స్వాతి. అన్విత..... ఇటు రామ్మా. ప్రదీపు, స్వాతి... ముగ్గురికి చెప్తున్నాను వినండి ... మొగుడు పెళ్ళాలు ఎంత పెళ్ళికి ముందర నుంచి తెలిసినవాళ్ళైనా చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపులు రావచ్చు. ఇద్దరూ సద్దుకోవాలి. మేము ఆడపిల్లల్ని సద్దుకోమంటాము కానీ అలా చేస్తే ఆ పెళ్ళిలో జీవం పోతుంది కొన్నాళ్ళకి. భర్త కూడా సద్దుకోవడం నేర్చుకోవాలి, భార్యకి చేదోడుగా ఉండటం తప్పు కాదు. నీ తల్లి తండ్రుల్ని ఎలా తను గౌరవించాలనుకుంటున్నావో తన వాళ్ళనీ నువ్వు అంతే ప్రేమగా చూసుకోవాలి. ప్రదీపు.... మీ అమ్మా నాన్నే మీకు ఆదర్శం. అందరి ముందర వాళ్లిద్దరూ ఒకే మాట మీద ఉంటారు. వారిలో ఏవైనా భేదాలు ఉన్నా అవి గదిలోపలే మాట్లాడుకుంటారు, ప్రతీసారి మీ అమ్మే రాజీ పడదు, అలాగే ప్రతీసారి నాన్నే గెలుస్తారని కాదు. ఇరువురిలో ఒకరు నిర్ణయం తీసుకుంటే అదే మాటకి ఇద్దరూ కట్టుబడి ఉంటారు. మీరూ అలాగే ఉండాలి. అంతే కానీ అమ్మా నాన్నని, అన్న చెల్లెళ్లని గుమ్మం బయట ఉంచమని అర్థం కాదు. అర్థమయ్యిందా ముగ్గురికీ"
"సరే అమ్మమ్మా" అన్నారు ఏక కంఠం తో
"సరే లెండి. ఆ అబ్బాయి లేస్తాడేమో. కాఫీ ఇయ్యాలేమో చూడు స్వాతి"
ప్రదీప్... "తనకి రాత్రి నిద్రలేదు అమ్మమ్మా. కొంచం లేట్ గా లేస్తాడేమోలే. పడుకోనీయి"
"అదేంట్రా ఎందుకూ.... కొత్తేమో"
"అదేమీ కాదులే" అని స్వాతి ని చూసీ నవ్వాడు.
"సరేలేరా... ఈలోపు మీరు రెడీ అవ్వండి"
ప్రదీప్, అన్విత వెళ్ళగానే.... "చూసావా అమ్మమ్మా ఎంత కొప్పమొచ్చిందో అన్నయ్యకి. అందుకే ఆపేసాను నిన్న కూడా"
"అయిపొయింది కదా వదిలెయ్యి. కానీ స్వాతి, అబ్బాయికి ఏం కావాలో నువ్వు దగ్గరుండి చూసుకోవాలి తల్లీ. మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చే అవకాశం ఇయ్యకు ఎప్పుడూ కూడా"
"అమ్మమ్మా.... నా కృష్ణ అలాంటివాడు కాదు. నాకు తన మీద నమ్మకముంది"
"ఒసేయ్ పిచ్చిదానా...... మీ అన్నయ్య కూడా మీ మధ్యన మూడో వ్యక్తే. ఇద్దరి మధ్యలోకి రానీయకు అంటే ఏ గొడవని పెద్దది చేసుకోకు అని. ఎప్పుడైనా చిరాకులో విసుక్కున్నా, కోపం లో మాట జారినా, సహనంగా ఉండు. తనే సద్దుకుంటాడు. అంతే కానీ మ అయన అరిచాడు విసుక్కున్నాడు అని ప్రతీది కంప్లైంట్ చేయకు ఇంకొకళ్ళకీ అంటున్నాను. అలాగే, ప్రతీరోజు ఏదో ఒక తేడా కనిప్పిస్తోంది అని అనిపించినప్పుడు, నీ బాధ ఇంకొకరితో పంచుకో. ఏడుస్తూ కూర్చునిపోకు. ఎప్పటి వరకూ ఓర్పుగా ఉండాలి, ఎప్పుడు బాధని పంచుకోవాలి అనేది నీ తెలివితేటలూ మీదుంది. కానీ ఆ అబ్బాయిని చుస్తే అలా లేడులే. నిన్ను బాధ పెట్టడు, నువ్వు బాధపడినా చూడలేడు" అన్నారు నవ్వుతూ
"అవును అమ్మమ్మా.... నిజమేను"
"అత్తవారింట్లో నిన్ను పెంచినవాళ్ళు మాట పడకుండా నడుచుకోవాలి. ఈ మాత్రం కూడా చెప్పలేదా అనిపించుకోకు. వంట కూడా మెల్లిగా నేర్చుకో నాన్నా. జాగ్రత్తగా చిన్న చిన్న పనులు అమ్మ పక్కన ఉండి చేస్తుంటే అవే వస్తాయి"
"సరే అమ్మమ్మా"
"లే తల్లీ.... స్నానం చేసి వద్దువు కానీ"
"అమ్మమ్మా.... " అంటూ చేతులు చాపింది
ఆవిడ లోపలికి వెళ్ళబోతూ మనవరాలిని దగ్గరకి వెళ్ళి హత్తుకున్నారు
"ఏమయిందిరా" అంటూ తల మీద నిమురుతూ ప్రేమ గా అడిగారు
"అమ్మమ్మా బెంగగా ఉంది. కానీ.... నీకేమయ్యింది. ఎందుకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి"
"ఏమిలేదమ్మా, మీ అమ్మ గుర్తొచ్చింది. నువ్వు పుట్టకముందరే ప్రాణాలు నీ మీద పెట్టుకుంది, ఈరోజు తనే ఉంటే ఎంత హడావిడి చేసేదో. పోనిలే ఆ సంతోషాన్ని పద్మ కళ్ళలో చూసాను" అంటూ కళ్ళు తుడుచుకుని,
"అయినా నీకెందుకురా బెంగ. నిన్ను సంతోషంగా చూసుకునే మొగుడునే చేస్కుంటున్నావు, మీ అమ్మ వాళ్ళకి నిన్ను ఎప్పుడూ దూరం కాకుండా చూస్కుంటాడమ్మా. భయపడకు"
"కదా.... మీకు ఉన్న నమ్మకం తనకి లేదు బామ్మగారు" అంటూ వాళ్ళిద్దరిని కలిపి హత్తుకున్నాడు.
"బావా....."
"దానికీ నమ్మకముంది మనవడా, కానీ ఆడపిల్ల కదా బెంగగా ఉండటం సహజం. సరే పదండి. రెడీ అయితే గుడికి వెల్దాము" అంటూ కదిలారు
"అమ్మమ్మా మరి నేను అడిగిందీ... "
"గుడిలో పూజారి గారినే అడుగుతానమ్మా. భయపడకు. పదా "
అమ్మొమ్మగారు లోపలికి వెళ్ళాక, హరీష్ స్వాతి వైపు చూసాడు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాక.
"ఏమిలేదులే బావ. పద కాఫీ తాగు" అంటూ లోపలికి వెళ్ళారు.
ప్రదీప్ స్నానానికని వెళ్ళాడు. అమ్మమ్మ గారు ఇంటి బయట తోట దగ్గర ఏవో పనులు పురమాయిస్తుంటే అన్వి ఆ తోటని కలియచూస్తోంది.
ఇంతలో స్వాతి...... " అమ్మా " అంటూ కేక పెట్టటం తో హరీష్ ఖంగారుగా ఆ శబ్దం వచ్చిన దగ్గరకి వెళ్ళాడు.
"స్వీటీ..... ఏమైందీ అన్నాడు"
"ఏమి లేదు బావా, కాఫీ తీసుకొస్తుంటే పడిపోయింది అంతే....." అంది గ్లాస్ కడుగుతూ
"నీ మీద పడిందా..... చూపించు"
"లేదు బావా పడలేదు.... పదా వెల్దాము. గంగా కొంచం కాఫీ తీసుకునిరావా బావకి" అని చెప్పి ఏదో సైగ చేసి వెళ్ళిపోయింది.
తర్వాత అందరూ రెడీ అయ్యాక, అమ్మమ్మ గారు స్వాతి హరీష్, ప్రదీప్ అన్విత నలుగురికి బట్టలు ఇచ్చి మార్చుకుని గుడికి రమ్మన్నారు.
అన్విత... "బామ్మగారు ఇప్పుడివన్నీ ఎందుకండీ"
"మీరు రాత్రి అనుకోకుండా ఉండిపోయారు. ఆ బట్టలతోనే గుడికి వస్తారేంటి. ఇంటికి వచినవాళ్ళకి బట్టలు పెట్టి పంపటం మన సంప్రదాయం. తర్వాత ఇచ్చేది ఇప్పుడే ఇస్తే కట్టుకుంటారు కదా అని. వెళ్ళి మార్చుకుని రండీ. లేట్ అవుతోంది"
స్వాతి, అన్వి చీరలు కట్టుకుని వస్తుంటే.... ప్రదీప్ హరీష్ కి మాట రాలేదు. వాళ్ళని చూసీ స్వాతి అమ్మమ్మ గారితో....
"అలా దగ్గరగా ఉండకూడదు తిరగకూడదు అంటావ్, ఇలా చీర కట్టుకుంటే ఇంకేమైనా ఉందా మీ మనవడితో. టెంప్ట్ చేసేస్తున్నావ్ అంటూ మీద పడిపోయి నన్ను టెంప్ట్ చేసేస్తాడు. చూడు రెప్ప వేయటం కూడా మర్చిపోయి ఎలా చూస్తున్నాడో" అంటూ గొణిగింది
"హహహ...... అలా అన్నీ బయటకి చెప్పకూడదే"
"పెళ్ళి తర్వాత అయితే చెప్పకూడదు. ఇక్కడ ఇంకా టైమ్ ఉంది "
"అందుకని బొట్టు పెట్టి జీన్స్ ఇయ్యమంటావేంటి. అయినా మీ అన్నయ్య ని చూడు, వాడిదీ అదే పరిస్థితి" అంటూ నవ్వుకుని
అమ్మమ్మ గారు... "చూసింది చాలు పదండర్రా"
గుడిలో అమ్మమ్మ గారు పూజారి ఏదో మాట్లాడి, ముగ్గురికీ తాడు కట్టి, "ఇది అమ్మ వారి రక్షా. ఇంక మీకు ఏమి జరగదు. ఖంగారు పడకమ్మా" అంటూ స్వాతికి చెప్పారు
"మరి ఇది ఎప్పుడైనా ఊడిపోతే...."
అమ్మమ్మ గారు స్వాతిని వారించబోతుంటే, "పర్వాలేదమ్మా" అంటూ ఆవిడకి చెప్పి, "అది ఊడే లోపలే సమస్యలు అన్నీ చక్కబడతాయి. అది ఊడిపోయిందంటే ఇంక మీకు ఏ సమస్యా లేనట్లే తల్లీ" అన్నారు
అక్కడ నుంచి పొలాలు దగ్గర చుట్టూ తిరిగీ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి బయలుదేరటానికి సిద్ధమయ్యారు.
అమ్మమ్మ గారు..... "పిల్లలూ ఇటురండర్రా" అంటూ లోపలి నుంచి పిలవటం తో అందరూ అటు వైపు వెళ్ళారు
స్వాతి..... "ఇప్పుడేంటి అమ్మమ్మా.... "
"స్వాతి.... ఇవి మీ అమ్మ నగలు తల్లీ. ఇవి ఎంగేజ్మెంట్ కైనా లేదా పెళ్ళిలో అయినా పెట్టుకుంటావని ఇప్పుడే ఇస్తున్నాను. పద్మ వాళ్ళు కూడా ఏవో కొనే ఉంటారేమో. అందుకే నీ వీలు చుస్కో అమ్మా. మీ అమ్మవి నీకు అందజేయటం నా బాధ్యత"
స్వాతి కళ్ళలో నీళ్ళతో ప్రదీప్ వైపు చూసింది, ప్రదీప్ తీసుకోమన్నట్లుగా చెప్పటంతో అవి తీసుకుని ఆవిడని పట్టుకుని ఏడ్చేసింది. హరీష్ తనని ఓదార్చి పక్కకి తీస్కెళ్ళాడు.
ఆవిడ, అన్విత కి కూడా కొన్ని నగలు ఇచ్చి, "ఇవి కూడా స్వాతి వాళ్ళ అమ్మ నగలేనమ్మా"
అన్విత... "బామ్మగారు ఏమిటిది. ఇవి కూడా స్వాతికే ఇయ్యండి. నేను తీసుకోలేను"
"వీడి తల్లీ దానికి అమ్మ అయ్యింది. మరి వీడు కూడా మా అమ్మాయికి కొడుకే కదా. తన కోడలికి ఇస్తున్న నగలు. తీస్కో. కాదనకూ"
"అమ్మమ్మా ఏమిటిది. స్వాతి కోసం ఉంచావు పిన్ని నగలన్నీ కూడా, ఇప్పుడు అన్విత కి ఇయ్యటం ఏంటి"
"అన్నయ్యా... నేనూ అమ్మమ్మ మాటే చెప్తున్నా. నువ్వు నా అన్నవి. వదిన కి ఇయ్యటం లో తప్పేమి లేదు. ఇందాక చెప్పావు కదా, పెళ్ళైతే పరాయిదాన్ని అయిపోనని ఇప్పుడు నువ్వు అలా వేరు చేసి మాట్లాడకు. ఇంక ఈ విషయం లో నేనేమి వినిపించుకొను" అంది స్వాతి గట్టిగా. అన్విత ఏమి మాట్లాడలేక అవి తీసుకుంది.
"బాబు హరీష్.... మీరు కట్న కానుకలు ఒద్దన్నారని చెప్పారు. కానీ ఇది నా సంతోషం కోసం... "
"బామ్మగారు...... డబ్బులు ఇచ్చి నన్ను చిన్నవాడిని చేయకండి. నాకు వచ్చేదానితో తనని సంతోషంగా, ఏది తక్కువ చేయకుండా చూసుకోగలను. నేను ఒద్దంటున్నానని తప్పుగా అనుకోకండి కానీ నేను అడిగిందీ కాదనకుండా ఇయ్యండి. మీరిచ్చే కట్నం అదే నాకు"
అందరూ ఆశ్చర్యంగా హరీష్ ని చూసారు. హరీష్ మాత్రం అమ్మమ్మ గారి సమాధానం కోసం ఆవిడని చూస్తున్నాడు
"సరే బాబు.... ఏం కావాలో అడుగు. తప్పకుండా"
"మీరు ఎంగేజ్మెంట్ కి వస్తాను అన్నారు కదా. అప్పుడు వచ్చి, పెళ్ళి వరకు ఉండి, పెళ్ళి జరిపించి మీ మనవరాలితో పాటు మా ఇంటికీ వచ్చి ఒక్కరోజైనా మాతో గడపాలి. అదే మీరు నాకిచ్చే కట్నం"
ప్రదీప్.... "బావా సూపర్ గా లాక్ చేసావ్ అమ్మమ్మ ని. ఇప్పుడు చెప్పు అమ్మమ్మా ఏమంటావ్"
"ఏమంటానురా....సరే బాబు వస్తాను"
స్వాతి... " వావ్ అమ్మమ్మా...... సూపర్..... థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ బావా. ఎంత బతిమాలామో మేమూ, అమ్మా. థాంక్యూ"
అమ్మమ్మ గారు స్వాతి ఆనందాన్ని చూసీ నవ్వుకున్నారు.
ప్రదీప్... "అమ్మమ్మా నీ పంపకాలు అయితే మేము బయల్దేరుతాము. లేట్ అవుతోంది"
"సరే నాన్నా..... జాగ్రత్తగా వెళ్ళిరండి"
ప్రదీప్.... "అమ్మమ్మా..... అందరికీ ఇచ్చావు, మరి నాకేమి పంపకాలు పెట్టలేదు. నేను నీకెప్పుడూ ఇష్టం లేదు" అన్నాడు ఏడుపు మొహం పెట్టి, సరదాగా
"ఒరేయ్ ప్రదీపు, నీకు ఏమిచ్చినా తక్కువేరా. అందుకే నీకు బాధ్యతలు ఇస్తున్నా. ఇన్నాళ్ళు మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూస్కున్నావ్ కదా, ఇప్పటినుంచి ఆ చెల్లెలు ఈ బావగారు ఇద్దరి బాధ్యతా నీదే. ఇద్దరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళు ఇంటికి. అలాగే నీ కాబోయే పెళ్ళాన్ని ఏ విషయం లోను బాధపెట్టకు. ఇవే నేను నీకు ఇచ్చే పంపకాలు. తర్వాతవి పెళ్ళి కి వస్తాను కదా అప్పుడు మాట్లాడదాములే"
"సరే అమ్మమ్మా తప్పకుండా. వెళ్ళొస్తాం"
స్వాతి..... "అమ్మమ్మా మర్చిపోకు ఎంగేజ్మెంట్ నుండి పెళ్ళి వరకు మాతోనే ఉంటున్నావు. త్వరగా బట్టలు సద్దుకో. మేమే వచ్చి తీసుకెళ్తాము" అంటూ బయల్దేరారు
కార్ లో కొద్ది దూరం వెళ్ళాకా, ప్రదీప్... "బావా ఇందాకటి నుండి నువ్వే డ్రైవ్ చేస్తున్నావు, నేను కొంచం సేపు చేయనా"
"పర్వాలేదు బావా. నేను చేస్తాలే"
"హమ్మయ్య బతికించావ్ బావ. చాలా నిద్రొస్తోంది. కానీ బాగోదేమో అని అడిగా" అని నవ్వేసాడు
వెనక సీట్ లో కూర్చున్న అన్విత..... "బావా నిద్దరొస్తోందా. నీకు నిద్రేగిరిపోయే విషయం చెప్పనా"
స్వాతి..... "కృష్ణా వీళ్ళేవో పర్సనల్స్ మాట్లాడుకుంటారేమో కార్ ఆపు. మనం దిగిపోదాము ఎందుకైనా మంచిది. ఏం వినాల్సొస్తుందో"
"కారేం ఆపక్కర్లేదు. పర్సనల్ ఏమి కాదు స్వాతి. నీకు తెలిసిన విషయమే. నాకు మాత్రం ఈరోజే తెలిసింది. మీ అన్నయ్య కి ఇంకా తెలీదు"
ప్రదీప్..... "ఏంటి అన్వి అదీ"
"మన ప్రేమ గురించీ అత్తయ్య కి ముందరే తెలుసు. అందుకే మీ చిన్నూ.... గారికి తెలిసిన వారం లోపే ఇంట్లో పెళ్ళి మాటలు అన్నీ జరిగిపోయాయి"
ప్రదీప్ ఆ మాట వింటూనే ఖంగారుగా వెనక్కి తిరిగి స్వాతి వైపు చూసాడు నిజంగానా అన్నట్లుగా. స్వాతి తల పక్కకి తిప్పేసి పడుకున్నట్లుగా నటించింది.
"దాని వైపు చుస్తే అదేమీ చెప్తుంది. పైగా దొంగ నిద్ర చూడు. అయినా చెప్పేది అయితే ఎప్పుడో చెప్పేది"
హరీష్ నవ్వుకున్నాడు.
"నీకెలా తెలుసు అన్వి, అది చెప్పిందని"
"పొద్దున్న బామ్మగారి తో మాట్లాడేటప్పుడు విన్నాను "
"అంటే అప్పటి నుంచి అక్కడే ఉన్నావా" అంది స్వాతి
" ఆ..... నేను అక్కడే ఉన్నా, మీ అన్నయ్య జస్ట్ ఆ టాపిక్ అవగానే వచ్చారు"
"అదేంట్రా చిన్నూ.... అలా బుక్ చేసేసావు. అమ్మా వాళ్ళు ఏమనుకున్నారో"
"ఏమైనా అనుకుని ఉంటే పెళ్ళికి ఒప్పుకునేవాళ్ళా అన్నయ్యా. అన్వి ఇంట్లో ఒప్పించేవాళ్ళా చెప్పు"
"హ్మ్... అదీ నిజమేలే "
కొద్దిసేపటికి మళ్ళీ అన్విత.... "స్వాతి... " అని గట్టిగా అంది
స్వాతి..... "ఎందుకే అలా అరుస్తావు. మాములుగా మాట్లాడు" అంది
ప్రదీప్ కళ్ళు మూసుకునే, "నా బదులు కూడా గట్టిగా చెప్పు చిన్నూ. .. . నా నిద్ర డిస్టర్బ్ చేస్తోంది". అన్విత ప్రదీప్ ని భుజం మీద కొట్టింది
ప్రదీప్ కళ్ళు మూసుకుని ఉండటం తో వెనకాల జరిగింది తెలీదు కానీ హరీష్ కి ముందర అద్దం లో మొత్తం కనిపించింది.
అన్విత... "స్వాతి" అని అరవగానే, స్వాతి అన్వి నోరు మూసేసి "ఎందుకు అరవటం" అంటూనే కళ్ళతో చెప్పద్దని సైగ చేయటం, హరీష్ ని చూపించి ఒద్దని చెప్పటం అన్నీ గమనించాడు. హరీష్ కార్ ని ఆపగానే, "ఏంటి బా... వచేసామా" అంటూ లేచాడు ప్రదీప్
"లేదు బావా.... దాబా దగ్గర ఆపాను. కొంచం టీ తాగి వెళదాము"
కార్ దిగీ, స్వాతి ని బయటకి రానీయకుండా డోర్ కి అడ్డం గా నిల్చున్నాడు.
ప్రదీప్, అన్వి దిగగానే, "మీరు వెళ్ళండి. మేము వస్తాము" అని వాళ్ళు వెళ్ళగానే డోర్ ఓపెన్ చేసి స్వాతి ని జరగమని తన పక్కన కూర్చున్నాడు.
స్వాతి... "ఎందుకు దిగనీయలేదు నన్ను"
"ఏంటి నా దగ్గర దాస్తున్నావ్. అన్వి ని చెప్పద్దంటున్నావ్" అంటూ స్వాతిని కదలకుండా చేయి గట్టిగా పట్టుకుని అడిగాడు
"నేనేం దాయలేదు బావా...... బావా.... ప్లీజ్ చేయి వదలవా.... నొప్పిగా ఉంది"
"హేయ్..... నేనంత గట్టిగా పట్టుకోలేదు కదా. ఏమైందీ" అంటూ అప్పటి వరకు చీర చెంగున దాచిన చేతిని చూసీ..."స్వీటీ ఏమైందీ చేతికి" అంటూ అరిచాడు
"పొద్దున్న చేతి మీద కాఫీ పడిపోయింది. నొప్పి లేదులే"
"పొద్దున్న పడితే నాకు చెప్పలేదా. నాకు కాఫీ ఇచ్చేటప్పుడే కదా. నేను చూసినప్పుడేమి లేదు కదా. అసలేమయ్యిందీ"
"నీకు నేనే కాఫీ చేసి తీసుకొద్దామనుకున్నాను. కానీ గ్లాస్ లో పోస్తుంటే చేతి మీద పడిపోయింది మొత్తం. . పడగానే చల్ల నీళ్లలో పెట్టేసాను. ఆ తడి మీద వెంటనే కనిపించలేదు"
"ఇంత టింగరిదానివెంటే. జాగ్రత్తగా చూసుకోవద్దా"
"ఇదిగో ఇలా అంటావేమో అని భయమేసే చెప్పలేదు నీకు. నాకేమవలేదు. పదా వెళదాము" అంటూ హరీష్ మాట వినిపించుకోకుండా కార్ దిగీ లోపల ప్రదీప్ వాళ్ళ దగ్గరకి వెళ్ళింది.
ప్రదీప్.... "బావ ఏడి చిన్నూ"
"ఏమో తెలీదు. నేనొచ్చేసా. వస్తాడులే"
"ఏమయ్యిందే, అన్నయ్య ఏమైనా అన్నాడా" అంది స్వాతి చేయిని చూస్తూ
"అసలంతా నీవలనే.అన్నయ్యకీ చెప్పేసావా, ఇప్పుడు తనూ ఏడిపించటానికి"
"ఏంటి చెప్పటం. ఏం చేసావు"
"నేనేమి చెప్పలేదు. నువ్వే వాగావు. ఆన్సర్ చెప్పుకో" అంది అన్విత స్వాతి కి మాత్రమే వినిపించేలాగా
"ఏంలేదులే అన్నయ్యా. బావ కి ఫోన్ చేయి రమ్మను త్వరగా"
ఇంతలో హరీష్ రావటంతో అందరూ టీ తాగి కొంచం సేపు కూర్చుని బయల్దేరారు.
హరీష్ ... "బావా నువ్వు డ్రైవ్ చేయి, అన్వి నువ్వు ముందర కూర్చోవా"
"సరే అన్నయ్యా" అంటూ అన్వి ముందరకి వెళ్ళింది. స్వాతి ఎందుకో అలిగిందని ప్రదీప్ కి అర్థమవటం తో మారు మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసాడు.
"స్వీటీ.... "
"ఏంటీ"
"సారీ రా..... మళ్ళీ అనను. ముందు ఆయింట్మెంట్ పెట్టనీయి"
అంటూ చేయి తీసుకోబోయాడు
"ఏం అక్కర్లేదులే. నాకేమి నొప్పి లేదు. నువ్వు నన్ను చూసీ నవ్వావు" అంటూ కిటికీ లో నుంచి బయటకి చూస్తూ ఇందాక ధాబా లో కి రావటానికి ఎందుకు ఆలస్యమయ్యిందో తెలిసీ తనలో తను నవ్వుకుంది. అది గమనించి, హరీష్ స్వాతి దగ్గరగా జరిగి తన చెవిలో,
"మర్యాదగా ఆయింట్మెంట్ రాయనిస్తావా లేకపోతే మీ అన్నయ్య ఇక్కడే ఉన్నాడు నిన్ను దగ్గరగా ఎలా లాక్కోవాలో నాకూ తెలుసూ. నా పద్ధతి లో ట్రై చేయనా "
"ఆమ్మో తను అన్నంత పని చేసినా చేస్తాడు" అనుకుని ఏమి మాట్లాడకుండా చేయి ఇచ్చింది.
Comments
Post a Comment