42

రెండు జంటలకు ఒకే ముహూర్తంకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఎంగేజ్మెంట్ సింపుల్ గా చేసుకోవాలని పిల్లలు బతిమాలటంతో, దగ్గర వాళ్ళని మాత్రమే పిలిచారు.  


స్వాతి హరీష్ కి ఫోన్ చేసి.... "బావా...మేమూ అమ్మొమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం.  పెద్ద దూరం కాదూ ఒక మూడు గంటల డ్రైవ్.... " 


"సరే,  జాగ్రత్తగా వెళ్ళిరండి" 


"నీ పర్మిషన్ కోసం ఫోన్ చేయలేదయ్యా మహానుభావా" అని మనసులోనే అనుకుని,  " ఆ సరే బావా....  అందరమూ వెళ్తున్నాము.  అమ్మ,  నాన్న,  అన్నయ్యా,  అన్వి కూడా వస్తోంది... " 


"హహహ సరే " 


"కృష్ణా .... " 


"మరేమనమంటావు,  అందరూ వెళ్తున్నాం అంటే వెళ్ళూ అనే అంటాను కదా,  కృష్ణా నువ్వూ వస్తావా అని అననేలేదు,  నేనూ వస్తాను అందామంటే " అంటూ నవ్వాడు. 


"వస్తావా " అంటూ కీచుగా అరిచింది స్వాతి 


మధ్యాహ్నం హరీష్ కార్ లో స్వాత,  హరీష్ ,  తర్వాత అందరూ ప్రదీప్ కార్ లో బయల్దేరారు 


"స్వీటీ.....  మీ అమ్మొమ్మ గారి గురించీ ఎప్పుడూ చెప్పలేదు. నువ్వెప్పుడైనా కలిసావా" 


"ఆ... వెళ్తూనే ఉంటాను బావా. అమ్మొమ్మ మనతో సమానంగా కూర్చుని కబుర్లు చెప్తుంది. ఎంత సరదాగా ఉంటుందో. అన్నయ్యకి కూడా తన దగ్గరకు వెళ్ళటమంటే చాలా ఇష్టం. ఒకత్తి ఊర్లో ఉంటుంది. ఆవిడ ఆ ఊరు వదిలిపెట్టి రారు.  మా అమ్మ గురించి కబుర్లు చెప్తూ ఉంటుంది,  వాళ్ళది లవ్ మ్యారేజ్ ట. మా నాన్న ఇప్పటికీ రెగ్యులర్ గా అమ్మొమ్మ దగ్గరకి వెళ్ళి వస్తారు. అమ్మ అంటే చాలా ఇష్టం నాన్న కి. అమ్మ కి సంబంధించిన అన్నిటిని,  అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటారు,  నన్ను తప్ప. మరి ఆవిడ.... " 


స్వాతి మాటని ఆపేసి కళ్ళు మూసుకుంది. హరీష్ తనని కదపలేదు. ఆ కార్ లో ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. హరీష్ పలకరించలేదు కానీ స్వాతి ని గమనిస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి కార్ ఆగటంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఏదో మట్టి రోడ్,  ముందర కొంచం దూరం లో వెళ్లిపోతున్నా ప్రదీప్ కార్.... ఒకటో రెండో వెహికల్స్ తప్ప ఏమి లేవు. 


"ఏమైందీ" అని అడుగుదామనుకునే లోపు హరీష్ ఫోన్ మోగింది. 


"చెప్పు బావా..... వస్తున్నాం ఒక్క టూ మినిట్స్..... నీ లొకేషన్ షేర్  చేయి. వచ్చేస్తాము. ఆగకండి..... ఆఁహాఁ ఏమిలేదు...  బాయ్" 


హరీష్ ఫోన్ పెట్టేసి,  పక్కనున్న వాటర్ బాటిల్ స్వాతికి ఇచ్చాడు,  తాగమన్నట్లుగా. స్వాతి కూడా ఏమి మాట్లాడకుండా మంచి నీళ్ళు తాగి బాటిల్ పక్కన పెట్టేసి హరీష్ వైపు చూసింది. హరీష్ తననే చూస్తుండటంతో,  తల దించేసుకుని


"అర్థమయ్యిందిలే. ఇంకెప్పుడూ మాట్లాడను ఆయన గురించి. అలా చూడకు కోపంగా. సారీ" 


హరీష్ చిన్నగా నవ్వి,  "స్కూల్ దగ్గరకు వదిలేసి వెళ్ళిన నాన్న కోసం ఏడ్చే చిన్న పిల్లలా కనిపిస్తున్నావు నువ్వు. నిన్ను చూస్తే కోపం ఎందుకొస్తుంది. ప్రతీసారి అందరూ నిన్ను నీ ఫీలింగ్స్ బయటకి మాట్లాడనీయటం లేదు. నీ బాధ చెప్పుకుంటే నీకూ ప్రశాంతంగా ఉంటూంది. అందుకే నువ్వు చెప్పేటప్పుడు ఏమి అనలేదు,  విన్నాను. ఇప్పుడే కాదు,  ఎప్పుడైనా కూడా మాట్లాడచ్చు. కానీ మీ నాన్న చేసిన తప్పుని పదే పదే గుర్తు తెచ్చుకోకు. నీ చుట్టూ నిన్ను ప్రేమించే మేమందరము ఉన్నాము. అయన చేసినదాని గురించి బాధ పడిన ప్రతీ సారి మా ప్రేమ నీకు కనిపించటం లేదా అనిపిస్తోంది" 


"అలా ఎప్పటికి కాదు కృష్ణా"  అంటూ తన భుజం మీద వాలిపోయింది. 


"సరే.....  ఆయన వదిలేసారు అని బాధపడకు. ఆ థాట్ వచ్చిన ప్రతీ సారి,  ఆయన అలా వదలటం వలనే,  నీకు అమ్మ నాన్న అన్నయ్యా,  ఇన్ని రిలేషన్స్ వచ్చాయి లైఫ్ లో అనుకో. మీ అమ్మ వలన నేనూ నీ లైఫ్ లో కి వచ్చాను. దానికి కూడా నీ కన్న తండ్రే కారణం. నిన్ను వదిలేయటం వలన నీ లైఫ్ హ్యాపీ గా ఉందనుకో. హాయిగా అనిప్పిస్తుంది. ట్రై చేసి చూడు."


"సరే...." 


హరీష్ కార్ స్టార్ట్ చేసాడు. తను ఇంకా మౌనంగా ఉండటం తో,  స్వాతి... " సరే అన్నాను కదా ఇంకా ఎందుకంత కోపం" 


"కోపం కాదురా....  ఆలోచిస్తున్నాను...మీ అమ్మొమ్మ కి నేను నచ్చుతానో లేదో. ఆవిడ దగ్గర మంచి మార్కులు తెచుకోటానికి ఏమైనా చెప్పు " 


"హహహ కృష్ణా.....  నువ్వు ప్రేమిస్తున్నావ్ అని చెప్పగానే మొదట చెప్పినది అమ్మొమ్మకే.  నీకోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ అక్కడా" 


"అవునా.....  మరి ఒక్కసారైనా ఫోన్ కూడా చేయలేదేం. నేనూ మాట్లాడేవాడిని కదా' 


"ఆహా....  అప్పుడు మీరిద్దరూ ఒకటైపోయి నన్ను వదిలేస్తే." 


"హాహా..... అంత అసూయేటిరా..    నిన్నెప్పటికీ వదిలేదు లేదు. సరదాగా ఆటపట్టిస్తానేమో కానీ వదిలేయను. నువ్వు నా ముద్ద్దుల స్వీటూవి కదా" అంటూ తన  పెదవులని చేతికి తో లాగి ముద్దుపెట్టుకున్నాడు 


అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరారు. వాళ్ళు కార్ దిగుతుండగా ప్రదీప్ ఎదురొచ్చి,  "ఏమైంది బావా, కార్ ఏమైనా ప్రాబ్లెమా" 


హరీష్ స్వాతి వైపు చూసీ "కార్ కాదు బావ,  మంచినీళ్ళ  కోసం ఆగాము. అంతే" అంటూ లోపలికి వెళ్ళారు. 


పద్మ గారు వివాళ్ళిద్దరిని చూసీ...... "అదిగో పిన్ని,  మీ మనవడు,  మనవరాలు" 


అమ్మొమ్మ గారు..... "అబ్బా ఎంత చూడ చక్కగా ఉన్నారో. జంట చాలా బావుందర్రా" 


ప్రదీప్.... "అంతేలే అమ్మొమ్మ. నీకెంతైనా మీ మనవరాలే ముద్దు. మా గురించీ ఒక్క మాట అనలేదు" అన్నాడు ఉడుక్కుంటూ 


"ఎందుకనాలిరా. పెళ్ళి సెటిల్ అయ్యి ఎన్నాళ్ళయింది. ఒక్క మాట చెప్పావా అసలూ" 


"అదేదో అలా అయిపొయింది. నన్ను క్షమించూ" అంటూ చెవులు పట్టుకున్నాడు 


"సరేలే ఈసారికి ఊరుకుంటున్నాను,  ఇంకోసారి ఇలా చేసావనుకో,  బడిత పూజే" 


"బామ్మగారు.....  ఇంకోసారి అలా చేస్తే నేనే చేస్తాను ఆ పూజేదో. నేను ఉండగా మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఊరుకుంటానా" అంటూ ప్రదీప్ కి కన్ను కొట్టింది 


హరీష్,  స్వాతి లోపలికి వచ్చి అమ్మొమ్మగారి కాళ్ళకి దణ్ణం పెట్టి,  ఆశీర్వాదం  తీస్కున్నారు. స్వాతి ఆవిడని, "ఎలా ఉన్నాడు" అని కళ్ళు ఎగరేస్తూ అడిగిందీ 


ఆవిడ కూడా సమాధానం గా పెదవి విరిచారు,  "ఏమి బాలేదన్నట్లుగా"


స్వాతి మొహం వాడిపోవటం చూసీ,  ప్రదీప్ "మీరు గుమ్మం లోకి రాకుండానే,  జంట ఎంత బావుందో అని మురిసిపోయిందమ్మా అమ్మొమ్మ. నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. మీ ఆయన్ని ఎవరూ యేమనేయలేదు" 


స్వాతి మొహం వెంటనే వెలిగిపోయింది. హరీష్ కి తనని చూస్తుంటే నవొచ్చింది. అన్విత... హరీష్,  స్వాతి కి మంచినీళ్ళు ఇచ్చింది. 


అమ్మొమ్మ గారు..... "పద్మా.....  మంచి కోడల్ని తెచుకుంటున్నావమ్మా. అప్పుడే ఇంటల్లుడికి,  ఆడపడుచుకి సేవలు మొదలెట్టేసింది" 


స్వాతి....  "అవును అన్వీ.....  నేనిప్పుడు ఆడపడుచుని కదా,  అంటే అర్థమొగుడ్ని. నన్ను మంచిగా చూస్కో,  నేను అలిగాననుకో అప్పుడు నీ మొగుడితో నీకే ప్రాబ్లెమ్. ఏమంటావ్ అన్నయ్యా" 


"నువ్వెలా అంటే అలా చిన్నూ" 


అన్నా చెల్లెలు తనని కార్నర్ చేసేయటంతో అన్వీ హరీష్ పక్కకి వెళ్ళి మొహం వేలాడేసుకుని నిల్చుంది. 


"ఓయి....  తనూ మా ఇంటి ఆడపడుచు. నువ్వే తనతో జాగ్రత్తగా ఉండు. తననేమైనా అంటే నేనూ ఊరుకోను" అన్నాడు స్వాతి,  ప్రదీప్ ని చూస్తూ 


పద్మగారు....  "బావున్నారు నలుగురూను..... పిన్ని మీరూ మాతో పాటు వస్తే బావుంటుంది కదా. మాకుమీరు తప్ప పెద్దవాళ్లెవరున్నారు" 


స్వాతి.... "అదేంటీ.....  అమ్మోమ్మా నువ్వు రావా" 


"వస్తానురా... ఇక్కడ పనులు ఆగిపోతాయి  కదా సడన్ గా రావాలంటే. ఎంగేజ్మెంట్ టైమ్ కి  వస్తాను. పెళ్ళి కి నాలుగు రోజులు ముందరే వస్తాను కదా" 


స్వాతి... "ఎందుకూ....  అదీ అక్కర్లేదు. ఈ ఊళ్ళోనే కూర్చో" అంది ఏడుపు మొహం పెట్టి 


"అలా బుంగమూతి పెట్టకురా....వస్తానని చెప్తున్నా కదా" 


"సరే నువ్వు చెప్పినట్లు ఎంగేజ్మెంట్ కి రాకపోయినా పెళ్ళికి ముందరే రాకపోయినా నీ దోస్త్ కట్టి..." 


"సరే " 


రామ్ గారు... "అత్తయ్యగారు..... మేము బయల్దేరుతాము. చీకటి పడింది. మళ్ళీ దూరం ప్రయాణం చేయాలి" 


"ఈరోజు రాత్రికి ఉండిపోయి పొద్దునే బయల్దేరచు కదా. ఎప్పటికో కానీ మీరు అసలు రానే రారు" 


"లేదండి రేపు పొద్దున్న త్వరగా వెళ్ళాలి ఆఫీస్ కి. సెలవులు పెట్టటానికి అవదూ. మీరు మాత్రం దగ్గరుండి మీ మనవరాలి పెళ్ళి జరిపించాలి. తప్పకుండా రండీ. కార్డ్స్ వచ్చాక మళ్ళీ వస్తాము" 


"అలాగే బాబూ ..... పద్మా.....  పిల్లల్ని ఉంచచ్చు కదా. ఇక్కడ అమ్మవారి గుడికి తీస్కుని వెళ్ళి పూజ చేయిస్తాను. రేపు వస్తారులే"


స్వాతి... "మరి బావో.... ఒద్దు నేనూ వెళ్తాను" 


అమ్మొమ్మ గారు...."ఏంటమ్మా" అన్నారు నవ్వుతూ 


స్వాతి సిగ్గుపడి హరీష్ వెనకాల దాక్కుంది. అందరి ముందర స్వాతి తనతో ఎప్పుడూ అంత చనువుగా లేదు. 


పద్మగారు...... "చూసారా పిన్ని. పెళ్ళికి ముందరే బావని వదలలేకపోతోంది. ఇంక పెళ్ళైతే మనము అసలు కనిపించమేమో" అంటూ నవ్వారు 


"పిల్లలు అంటే.... మీ బావా,  వదిన కూడానే మనవరాలా" 


"అలా అయితే ఓకే" అంటూ హరీష్ వెనక నుంచి వచ్చింది స్వాతి. కానీ తనేమంటాడో అని అనుమానంగా తన వైపు చూసీ,  "నీకు ఫర్వాలేదా" అంటూ కళ్ళతోనే అడిగిందీ. తనూ "సరే" అని కళ్ళతోనే చెప్పాడు. 


అన్విత మాత్రం ఇబ్బంది పడటం గమనించిన పద్మగారు, .... "అన్వి ... అమ్మ కి నేను చెప్తాలే.  నీకు ఉండాలనుంటే ఉండూ" 


"అత్తయ్య నేను ఫోన్ చేస్తానులే. ఇప్పుడే వస్తాను " అంటూ లోపలికి వెళ్ళింది. తను వెళ్ళిన రెండు నిమిషాలకి ప్రదీప్ తన దగ్గరకి వెళ్ళి ఇబ్బందిగా ఉండటం చూసీ 


"ఏమయిందిరా.... అత్తయ్య ఒద్దన్నారా" అంటూ తన భుజం మీద చేయి వేసి దగ్గరకి తీసుకున్నాడు 


"లేదు  బావా,  ఒప్పుకున్నారు. నాకే మొహమాటంగా ఉంది. స్వాతి వాళ్ళ అమ్మొమ్మ గారి ఇంట్లో... " 


"స్వాతికే కాదమ్మా మీ ఆయనకీ నేను అమ్మొమ్మనే " అన్నారావిడ లోపలికి వస్తూ. ప్రదీప్ ఆవిడని చూడగానే అన్వి భుజం మీద చేయి తీసి దూరం గా నిల్చున్నాడు. కానీ అప్పటికే ఆవిడ అది గమనించారు. అదేమీ పట్టించుకోకుండా,  


"వీడేలేకపోతే స్వాతి ఇంత సంతోషంగా ఉండేదే కాదు. నాకు స్వాతి ఎంతో ప్రదీపు అంతేనమ్మా. నువ్వు బామ్మా అని పిలిచావు మరి ఈ బామ్మ దగ్గర మొహమాటం ఎందుకూ" 


"సరే బామ్మగారు....  ఉంటాను" 


"ఒరేయ్ ప్రదీపు.....  తనని మరీ ఎక్కువ సేపు ఓదార్చకుండా త్వరగా వచ్చేయి. మీ చెల్లి కంట్లో పడ్డావనుకో,  ఇంక అంతే సంగతులు" 


"ఆ మరే.......  అదేమో అందరి ముందు బావని పట్టేసుకుని ఆడచ్చు  నేనేమో ఎవరూ లేనప్పుడైనా చేయి వేసుకోకూడదెంటి నా పెళ్ళాం మీదా" 


"ఎంట్రోయ్.....  మాటలు నేర్చావు" 


"అది కాదు అమ్మోమ్మా,  దాని ముందు మాట్లాడననుకో,  నన్ను ఆడించేస్తుంది,  నువ్వైతే మా మంచి అమ్మొమ్మవి కదా నీతో నా బాధ చెప్పుకున్నాననుకో నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమో అని" 


అన్విత,  ప్రదీప్ ని కొట్టబోతుంటే తననుంచి దూరం జరిగి "చూడు ఇప్పుడు ఈ అలక కూడా తీర్చాలి. కొంచం టైమ్ ఇయ్యీ" 


"హహహ సరే.....  కానీరా మనవడా. కాపురం పెట్టేయకూ. అయిదు నిమిషాల్లో మీ చెల్లి ని పంపిస్తాను రాకపోతే" అంటూ బయటకి వెళ్ళిపోయారు 


అమ్మొమ్మ గారు వెళ్ళగానే ఆవిడ వెనకాలే వెళ్ళిపోబోతున్న అన్వి చేయి పట్టుకుని తనని వెళ్ళనీయకుండా ఆపి తన వైపుకి లాక్కున్నాడు. అన్విత ని అలాగే వెనకాల నుంచి కౌగిలించుకొని,  


"ఏంటే......  ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావ్. అసలు నన్ను పట్టించుకోవటం లేదు.  పెళ్ళి ఫిక్స్ అయ్యాకా మరీ ఎక్కువ చేస్తున్నావ్" 


"నేనేం చేసానురా. చుట్టూ అందరూ ఉంటే నీ దగ్గరకి ఎలా వస్తాను. అయినా ఇంకొద్ది రోజుల్లో పెళ్ళైపోతోంది కదా,  ఇంక నీ పక్కనేగ ఉండేది" అంటూ ప్రదీప్ చేయిని ముద్దాడింది 


ప్రదీప్ తన వైపుకి తిప్పుకుని,  అలాగే గట్టిగా హత్తుకుని,  "సారీ రా.... నా మొహమాటాల వలన కొంచం,  ఇంకొంచం వేరే కారణాలు చెప్పి  నిన్నెప్పుడూ దూరం పెడుతున్నాను." 


"ఏంటి బావా  కొత్తగా. నువ్వు అందరి ముందర ఉన్నట్లుగా నాతో ఎప్పుడూ లేవు. నీ మనసేంటో నాకు తెలీదా "


ప్రదీప్ ఏమి మాట్లాడకుండా అన్విత తో ఉన్న ఆ కొద్ది  క్షణాల్ని మనసులో నింపుకుంటున్నాడు 


"బావ....  ఎవరైనా వస్తారేమో. వెళ్దామా. అత్తయ్యా వాళ్ళకి కూడా చెప్పాలి కదా" 


ప్రదీప్ తన నుంచి జరిగి,  "హ్మ్...  సరే" అంటూ అన్విత బుగ్గ మీద  ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు


అన్విత సిగ్గుపడుతూ ప్రదీప్ వెనకాలే బయటకి వచ్చింది. 


అక్కడ స్వాతి హరీష్ ని,  "కృష్ణా నువ్వు ఉంటావా..... అత్తయ్యని అడుగు ముందర" 


"పర్వాలేదురా. నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు అడిగావు కదా. ఉంటాను" అన్నాడు  స్వాతి కళ్ళలోకి చూసి నవ్వుతూ. 


ఇంతలో ప్రదీప్ అక్కడికి వచ్చి,  "చిన్నూ...అమ్మ వాళ్ళు ఎక్కడ"


"ఆ రూమ్ లో. అమ్మొమ్మ ఏదో మాట్లాడాలంది" 


"సరే. బావా ఉంటున్నావా.... సరదాగా నలుగురం ఉందాము. రేపు పొద్దున్న గుడికి వెళ్ళి వచ్చి ఇక్కడ అమ్మొమ్మ వాళ్ళ పొలాలు అవీ ఉన్నాయి. అటు వైపు వెళదాము. మన సిటీ లో ఈ వాతావరణం ఉండదు. " 


"సరే బావా....  ఉంటాను" 


ఇంతలో రామ్,  పద్మగారు అక్కడికి వచ్చి మౌనంగా నిల్చున్నారు ఏదో ఆలోచిస్తూ. 


"ఏమయిందమ్మా" అన్నాడు ప్రదీప్


"ఆఁహాఁ ఏమిలేదురా....హరి మొహమాటం ఏమి లేదు. ఇక్కడ ఉంటావా. అమ్మ వాళ్ళని అడిగి చూడు ఏమంటారో" 


హరీష్ స్వాతిని చూడటం గమనించి,  పద్మగారు.... " అదేదో అంటుందిలే . నీ వీలు చూసుకోరా" 


"లేదతయ్యా ఉంటాను. పర్వాలేదు. రేపు మేము మా కార్ లో వచేస్తాము" 


"సరే నాన్నా.....  జాగ్రత్త" 


ప్రదీప్.... "నాన్నా లోపల ఏంజరిగింది. ఎందుకు ఇద్దరూ అలా ఉన్నారు. అమ్మొమ్మ ఏది" 


"మేము బానే ఉన్నామురా.  అన్విత వచ్చేస్తుందా,  ఉంటుందా" 


"ఉంటాను అత్తయ్యా.  అమ్మ తో మాట్లాడాను" 


"సరే... రేపు అందరూ జాగ్రత్తగా వచ్చేయండి.  మేము బయల్దేరుతాము" 


స్వాతి....  "అమ్మా......  అమ్మొమ్మ ఏమైనా అందా మిమ్మల్ని.  మీరెందుకు అలా ఉన్నారు.  నేను వచ్చేస్తాను మీతో" 


"లేదమ్మా.  పిన్ని ఏమంటుంది.  మేము బానే ఉన్నాము.  అమ్మొమ్మతో ఒక రోజు మీరందరూ ఉంటే ఆవిడకి సరదా కదా.  మంచిగా ఎంజాయ్ చేసి రండీ.  అమ్మొమ్మని సతాయించకు. మేము బయల్దేరతాము" 


అమ్మొమ్మగారు..... "అది నన్నేం సతాయిస్తుంది.  దాని తిక్కని భరించటానికి,  అది సతాయించటానికి అబ్బాయి ఉన్నాడు కదా" అంటూ హరీష్ ని చూసీ నవ్వారు. "మీరు వెళ్లిరండిలే" 


"సరే అత్తయ్యగారు. ఎంగేజ్మెంట్ కి తప్పకుండా రండీ" అని చెప్పి రాంగారు,  పద్మగారు  వెళ్ళిపోయారు 


ఆరోజు రాత్రికి అందరూ భోజనాలు చేసి,  నిద్రకి ఉపక్రమించారు.


ప్రదీప్,  హరీష్ ఒక రూమ్ లో పడుకున్నారు. స్వాతి,  అన్విత,  అమ్మొమ్మగారు మరో రూమ్ లో పడుకున్నారు. 


ప్రదీప్,  ఇంకో వాళ్ళ రూమ్ లో నే మరో పక్క వేస్తుండటం చూసి...  


"అదెవరికి బావా " 


"హాహా....  రాత్రి ఇక్కడికో దెయ్యం వస్తుంది. దానికోసం. నువ్వు దడుచుకోకు" 


"ఎవరూ...... అన్వినా......  నేను వేరే రూమ్ లో పడుకుంటాను బావా. మీ మధ్యలో నేనెందుకు" అంటూ నవ్వాడు 


"బావా నీకలా అర్థమయ్యిందా. చూడు ఏం జరుగుతుందో" అంటూ పడుకున్నారు 


హరీష్ కి పడుకోగానే నిద్రపట్టేసింది. మధ్యరాత్రిలో ఏదో అలికిడయ్యి కళ్ళు తెరిచిన హరీష్ ఖంగారుగా లేచాడు. 


ప్రదీప్ కళ్ళు తెరవకుండానే,  "ఏంటి బావా దెయ్యం కనిపించిందా" 


"బావా.... అదేంటి స్వాతి......" 


ప్రదీప్ కళ్ళు తెరిచి అటు వైపు చూసీ,  "అప్పుడు కాలేజ్ ఇన్సిడెంట్ తర్వాత చాలా కాలం ఇదే పరిస్థితి బావా. నన్నెవడో చంపేస్తాడేమో అని కలలు...  అక్కడ నుంచి,  ఇలా కాపలా కూర్చుని అలాగే పడుకోటం. తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ కొంచం సద్దుకుంది. నువ్వు యు.స్ నుంచి వచేసాక మళ్ళీ కలలు మొదలయ్యాయి. అర్థరాత్రిళ్ళు  నీకు కాల్ చేయలేక ఇంట్లో ఉండలేక రాత్రంతా టెన్షనే.  నీ మెసేజ్ చూసాక మళ్ళీ ఊపిరి తీసుకుంటుంది. మళ్ళీ పొద్దున్న బానే ఉంటుంది"


హరీష్ బాధగా... "బావా నేను తన దగ్గరకి... " 


"అడగాలా బావా....  వెళ్ళు" 


హరీష్..... "స్వీటీ...  లే" 


"కృష్ణా.... ఏమైందీ,  అన్నయ్య ఏడి" అంది స్వాతి ఖంగారుగా లేస్తూ 


"ఏమి కాలేదు. ఇద్దరమూ బానే ఉన్నాము. అలా కూర్చుని పడుకుంటే మెడ పట్టేస్తుంది. ఇలా నా ఒళ్ళో బజ్జో...దా" 


"ఒద్దు బావా...  నువ్వూ ఇక్కడే పడుకోవా" 


"సరే " అంటూ తన పక్కన పడుకుని,  తల నిమురుతూ ఉంటే స్వాతి మెల్లగా మళ్ళీ నిద్రలోకి జారుకుంది. అలా తనని చూస్తూ హరీష్ కి ఎప్పటికో నిద్ర పట్టింది. 


పొద్దునే అయిదింటికి మెలుకువొచ్చేయటంతో హరీష్ పక్క నుంచి లేచీ బయటకి వచ్చి, ఫ్రెష్ అయ్యి,  తలుపు తీసి ఉండటంతో ఆరుబయట గట్టు మీద కూర్చుంది.  


"ఎందుకే పొద్దునే లేచేసావు.  కొంచం సేపు పడుకోవాల్సింది కదా"  అంటూ అమ్మొమ్మగారు వచ్చి కూర్చున్నారు.  వెనకాలే గంగ ఇద్దరికీ కాఫీ లు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది.  


"ఏమో అమ్మోమ్మా.  మెలుకువొచ్చేసింది.  ఇంట్లో చప్పుళ్ళు వినిపిస్తే నువ్వు లేచేసుంటావులే అని వచ్చేసా" 


"రాత్రి బాగా నిద్రపట్టిందా" 


"ఆ... మధ్యలో భయమేసింది... " 


"మీ బావ పక్కలోకి దూరి పడుకున్నావు.  హాయిగా నిద్రపటింది.  అంతేనా" 


"అమ్మొమ్మా" 


"ఆ అమ్మొమ్మనే.... ఇంకెవరైనా చూసుంటే వాత పెట్టేవాళ్ళు.  పెళ్ళి కాకుండా ఆ పడుకోటాలెంటే.  " 


"అబ్బా ఏమయిపోలేదు.  అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడుగా,  అడుగు కావాలంటే" 


"హాహా...  సరేనే....  నాకు తెలీదా మా బంగారాని గురించి.  అందుకే నేనూ లేపలేదు.  ఇంతకీ ఎందుకు భయమేసింది.  మళ్ళీ అవే కలలా" 


"అవునమ్మోమ్మా.  నీకు ఇక్కడా తెలిసినవాళ్ళు ఉంటారు కదా వీళ్లిద్దరికీ ఏదైనా తాడు కట్టించు" 


"హ్మ్...  సరేలే... చూద్దాం.....  ఇంకెంటే కబుర్లు. ప్రదీప్ కి తెలుసా నువ్వే పద్మ వాళ్ళతో వాళ్ళ ప్రేమ గురించీ చెప్పి పెళ్ళికి ఒప్పించావని ఇంట్లో" 


"లేదు" 


"అన్విత కి " 


"లేదు అమ్మొమ్మ. నువ్వే చెప్పేసేలా ఉన్నావ్ ఇప్పుడూ. వాళ్లిద్దరూ హ్యాపీ,  నాకది చాలు....  నేనో విషయం గమనించాను అమ్మోమ్మా. అన్నయ్య నన్ను కూతురులా చూస్కోటం గొప్ప కాదు. అన్వి నాతోటిదైనా కూడా మా అమ్మలానే ఉంటుంది నాతో" 


అప్పుడే బయటకి రాబోతున్న అన్విత వాళ్ళ మాటలు వినీ అక్కడే ఆగిపోయుంది. తన వెనకగా వచ్చిన ప్రదీప్ కూడా వాళ్ళ మాటలు వింటూ ఉండిపోయాడు. 


ప్రదీప్... "అన్వి.... నిన్ను అడగలనుకున్నది ఇదొక్కటే. అదీ నేను అడగకుండానే చేసేసావు" అంటూ అన్విత ని తల మీద ముద్దు పెట్టుకున్నాడు. 


"బావా.....  చెప్పానుగా,  నీ మనసేంటో నాకు తెలుసు. నీ ప్రేమ నాదైనప్పుడు నీ బాధ్యతలు నావి కావా" అంటూ చిన్నగా నవ్వింది. 


స్వాతి...."అమ్మోమ్మా....  నేను రేపు వెళ్ళిపోయినా అమ్మా వాళ్ళు నన్ను మిస్ అవ్వరూ. బావ తో పెళ్ళి కోసం ఎంత ఎదురు చూశానో,  ఇప్పుడు పెళ్ళి పేరుతో వీళ్ళకి దూరం అయిపోతున్నానేమో అనిపిస్తోంది" 


"స్వాతి....  నువ్వు సంతోషంగా ఉన్నావా తల్లీ" 


"హహహ......  నేను బానే ఉన్నాను అమ్మోమ్మా" 


"నిన్న ఏదో చెప్పబోయి ప్రదీప్ వస్తున్నాడని ఆగిపోయావేం. వాడికి చెప్పుకోలేని విషయం ఏమిటా అని" 


"అదేమీ లేదు అమ్మోమ్మా......  మొన్న పెద్ద అత్తయ్య వచ్చినప్పుడు,  "మీ అత్తగారు కొట్టినా తిట్టినా నువ్వే సాల్వ్ చేసుకోవాలి. కోరి చేస్కుంటున్నావ్ మీ బావ ని. రేపు వాడు వాళ్ళ అమ్మకి వత్తాసు పలికినా నీదే బాధ్యత. మీ అమ్మ దగ్గరకి వచ్చి ఏడిస్తే అదేమీ చేయలేదు" అంది.


"అమ్మోమ్మా......  అక్కడేదైనా అవుతుందేమో అని ఆలోచన కాదు,  కానీ ఏ చిన్న కష్టం అనిపించినా అన్నయ్య తో షేర్ చేసుకుంటాను. తనకి తోచిన సలహా చెప్తాడు. ఏదీ చెప్పకపోయినా,  ఒకసారి షేర్ చేసుకుంటే కొంచం గుండె బరువు దిగుతుందీ. లేదా అమ్మ తో మాట్లాడతాను. అలాంటిది,  ఒక్కసారిగా వీళ్ళందరూ పరాయివాళ్ళు అయిపోతారా పెళ్ళైతే. ఇంట్లో జరిగే ప్రతి విషయం బావతో చెప్పుకోలేకపోతే.... ఇంకెవరితోను మాట్లాడలేనా. పెళ్ళైతే అమ్మాయిలు తల్లీ తండ్రులకి దూరమైపోతారా,  అంత పరాయి వాళ్ళయిపోతారా ???? "



Comments