41
ఫోన్ మోగటంతో పద్మ గారు ఖంగారుగా రామ్ గారి వైపు చూసారు. ఆయన ప్రదీప్ తో మాట్లాడుతూ ఆవిడని గమనించకపోవటంతో,
"స్వాతి... నాన్న ని ఒకసారి రమ్మని చెప్పు" అంటూ ఫోన్ తీసి మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయారు. రామ్ గారు లోపలికి వెళ్లేసరికి ఆవిడ "పర్వాలేదండి... ఉంటాను" అంటూ ఫోన్ పెట్టేసి గట్టిగా ఊపిరి తీసుకుని అయోమయంగా చూస్తున్న భర్తని చూసి
"మనోజ్ వాళ్ళ అమ్మ గారండీ. ఏం చెప్పాలో అర్థం కాలేదు. మొహమాటంగా ఉండింది. కానీ ఆవిడే నా బరువు తగ్గించారు"
"నిజమే పద్మా. వీళ్ళ గురించి ఆలోచనలో వాళ్ళ విషయమే మర్చిపోయాము. ఏమన్నారు ఆవిడ "
"మనోజ్ ని అడిగారట. ఆ అబ్బాయేమో, ఇప్పుడే పెళ్ళి చేస్కునే ఉద్దేశం లేదు అని గట్టిగా చెప్పాడట. మాకోసం మిమ్మల్ని ఆగమని చెప్పటం కూడా భావ్యం కాదు అని ఆవిడే అన్నారు"
"హ్మ్... సరేలే. పదా"
"ఏవండీ... ఆవిడతో మాట్లాడుతుండగా వదిన ఫోన్ చేసింది"
"ఏ వదిన"
"అబ్బా... మీరొకరూ..... సత్య ఒదిన ఫోన్. నేను చేయాలా..... ఆవిడే చేస్తుందని ఊరుకోనా"
"నువ్వు ఫోన్ తీయలేదు కదా. చేయి నువ్వే. ఆవిడ ఏమంటారో విను. కానీ తొందరపడి మాట్లాడకు"
"సరే, స్పీకర్ లో పెడతాను" అంటూ ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టారు
"హా ఒదినా.... ఇందాకా ఫోన్ చేశారు, వేరే కాల్ లో ఉన్నాను అప్పుడూ"
"ఏంటి పొద్దునే బిజీ గా ఉన్నట్లున్నావు"
"బిజీ ఏమి లేదు ఒదినా, ఏదో సంబంధం గురించీ మాట్లాడటం కోసం చేశారు"
రామ్ గారు, "ఇప్పుడది అవసరమా" ఫోన్ లో వినిపించకుండా మెల్లిగా మందలించారు భార్యని.
అటు వైపు నుంచి హరీష్ వాళ్ళ అమ్మ గారు, "అవునా...... మేమూ సంబంధం గురించి మాట్లాడదామనే ఫోన్ చేసాము. మీరు ఇంట్లోనే ఉంటారా పద్మ. కొద్ది సేపటి తర్వాత నేనూ అన్నయ్యా వొద్దమనుకుంటున్నాము"
"అదేంటి ఒదినా అడగాలా, రండీ. ఇంట్లోనే ఉంటాము"
"అన్నయ్యగారు ఉన్నారా ఇంట్లోనే. మీ ఇద్దరితో మాట్లాడదామని .... "
"ఉన్నారు వదిన..... ఏంటి విశేషం"
"ఏమి లేదు, ఇలా ఫోన్ లో ఎందుకు.... వచ్చి మాట్లాడతాములే " అంటూ ఫోన్ పెట్టేసారు
పద్మ గారు ఫోన్ ని అలాగే చేతిలో పట్టుకుని, "వాళ్లిప్పుడు మాట్లాడటానికి వస్తున్నారా. ఇది ఇంత త్వరగా అయిపోతుందనుకోలేదండి. ఆవిడ ఒప్పుకోరనుకున్నాను"
"నీదీ.... సంతోషమా బాధా పద్మా??? "
"రెండూను. ఆవిడ ఒప్పుకుంది కాబట్టి ఆవిడ బానే చుస్కుంటుందిలే అని ధైర్యం. స్వాతి కోరుకున్నవాడితో పెళ్ళి కుదుర్తుందంటే సంతోషం ఒక పక్కా, పెళ్ళంటే అది వెళ్ళిపోతుందని బాధ"
"అవును పద్మా"
"అది మన అమ్మాయిగా ఉండేది ఇంకొంత కాలమే. ఆ తర్వాత ఈ చనువు, సరదాలు ఉండవు. పెద్దరికం వచ్చేస్తుంది. మొగుడు సంసారం బాధ్యతలు అంటూ మరోలోకలో కి అడుగుపెడ్తుందీ. ఎలా నెట్టుకొస్తుందో " అన్నారు ఆవిడ బాధగా
"ఏంటి పద్మా. ఈరోజే దానికి అప్పగింతలు అవుతున్నట్లుగా అంత బాధపడిపోతున్నావు. వాళ్ళు సంబంధం మాట్లాడటానికి మాత్రమే వస్తున్నారు. పెళ్ళి ఈరోజు కాదు" అన్నారాయన
"ఏమోనండి" ఆవిడ గొంతు పెగలటం లేదు.
ఇంతలో ఫోన్ మళ్ళీ మోగేసరికి ఎవరో కూడా చూస్కోకుండా పద్మ గారు ఫోన్ తీసి
"హలో"
"అత్తయ్యా నేను హరీ ని. ఏమయిందత్తయ్యా, గొంతు అలా ఉంది. అమ్మ ఏమన్నా అన్నదా"
"లేదురా. అమ్మా వాళ్ళు వస్తామన్నారు. మరి నువ్వు రావటం లేదా"
"వస్తానత్తయ్యా కానీ స్వాతికి తెలీనీయకండి. అత్తయ్య, ఒక చిన్న విషయం. నేనూ, నాన్నా మీతో మావయ్య గారితో మాట్లాడినట్లు చెప్పకండి. అమ్మే మీతో మాట్లాడుతుంది"
"సరే హరీ"
"అత్తయ్య.... అంతా ఓకేనా"
"ఆ.... అంతా బానే ఉంది"
"సరే ఉంటాను. కొద్దిసేపట్లో కలుద్దాం. బాయ్"
రామ్ గారు..... "హరి ఏమంటాడు"
హరీష్ చెప్పింది చెప్పి, "నా గొంతు వినీ అమ్మ ఏమన్నా అందా అంటూ ఖంగారుగా అడిగాడు. ఎక్కడో చిన్న భయం ఉండింది కానీ వీడు స్వాతి ని ఎవరితోనూ మాట పడనీయడని ఇప్పుడు కొంచం నమ్మకమొచ్చిందండి"
"అవును పద్మా. వాళ్ళు వస్తారన్నారు కదా. స్వాతిని రెడీ అవ్వమను. ఇంకేమన్నా కావాలేమో చూసి చెప్తే, తీసుకొస్తాను బయటకి వెళ్ళి"
అక్కడ హరీష్ వాళ్ళింట్లో......
ఫోన్ పెట్టేసి హరీష్ ఏదో ఆలోచిస్తూ తన రూమ్ లో కూర్చుని ఉన్నాడు.
"ఏంట్రా హరీ అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు"
"ఏంలేదు నాన్నా. అత్తయ్యకి ఫోన్ చేసాను. మాట చాలా డల్ గా ఉంది. ఏదో బాధగా అనిపించింది. ఏమైంది అంటే ఏమిలేదంది. కానీ నాకలా అనిపించలేదు"
"హరీ....... వాళ్ళ అమ్మాయి పెళ్ళి చేయబోతున్నారురా. వాళ్ళకి బాధ ఉండదా. ఇప్పటివరకూ అపురూపంగా పెంచుకున్న కూతుర్ని, అందులోను స్వాతి ఎప్పుడూ ఇల్లు దాటని పిల్ల...... ఇప్పుడు వేరే ఇంటికి పంపించాలంటే బాధ ఉంటుందిగా. ఇక్కడ ఉండగలదో లేదో, బాధ పడితే పక్కన వాళ్ళు ఉండరు కదా, అది ఒకత్తి ఉంటుందా ఇలా ఏవో భయాలు. అది నీ మీదో నా మీదో అనుమానం కాదు.... వాళ్ళ ప్రేమ. అంతే. సొసైటీ కోసం అంటారు "ఆడపిల్ల" కదా అని కానీ ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. ఎలా పంపించేయగలరు. మనం చేయగలిగినదల్లా వాళ్ళకి వాళ్ళ అమ్మాయిని బాగా చూస్కుంటాము అనే భరోసా ఇయటమే. అదే వాళ్ళకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది"
"సరే నాన్న. ఇంతకీ మీకు ఆడపిల్లలు లేకపోయినా ఇవన్నీ ఎలా తెలుసు. ఏదో ఎక్స్పీరియన్స్ తో చెప్పినట్లు చెప్పారు" అన్నాడు చిన్నగా నవ్వుతూ హరీష్
"మీ అత్తయ్య పెళ్ళి చేసి పంపించలేదేంటి. దాంట్లోనూ అది పెద్దనాన్న తో కన్నా నాతోనే అన్నీ షేర్ చేసుకునేది. అది పెళ్ళి అయ్యి వెళ్ళాకా నేను సద్దుకోటానికి టైమ్ పట్టింది. పక్కనే ఉన్నా, రోజుకోసారి చూసొచ్చేవాడినేమో కానీ వేరే ఊళ్ళో ఉండేవాళ్ళు"
"హహహ...... ఇప్పుడు ప్రదీప్ బావ కూడా రోజుకోసారి వస్తాడేమో"
"పొనీలేరా. అలా ఏదన్నా జరిగినా నువ్వు అర్థం చేసుకుంటే చాలు"
"సరే నాన్నా"
*****************************************
పద్మ గారు ప్రదీప్, స్వాతికి విషయం చెప్పగానే,
ప్రదీప్ "వావ్ చిన్నూ.... మొత్తానికి అన్నీ సద్దుకున్నాయిరా. కంగ్రాట్స్"
స్వాతి చిన్నగా నవ్వి, "అమ్మా నీకు నిజంగా ఇష్టమే కదా"
పద్మగారు..... "ఇష్టమే తల్లి. లే... లేచీ ముందర రెడీ అవ్వు. ప్రదీపు నువ్వూ లే"
స్వాతి తన రూమ్ లో కి వెళ్ళి హరీష్ కి మెసేజ్ చేసింది
"బావా.... అమ్మ మన పెళ్ళికి ఒప్పుకుంది. నువ్వు అత్తయ్య వాళ్ళనీ ఒప్పించేసావు కదా. వాళ్ళు కొద్దిసేపట్లో వస్తున్నారట. నువ్వూ ఉంటే బావుండు. నిన్ను చూడాలనుంది"
"స్వీటీ.... నాకూ నిన్ను చూడాలనుందిరా. ఇన్నాళ్ళు ఓపిక పట్టావు కదా ఇంకొంచం ఓపిగ్గా ఉండు వచ్చేస్తాను"
"కృష్ణా....... ఆన్లైన్ ఉన్నావా.... ఎలా ఉన్నావు. ఎప్పుడొస్తున్నావ్. వర్క్ అయిపోయిందా. నిన్ను చూడాలనుంది. అమ్మ వాళ్లందరూ పెళ్ళి గురించి ఈరోజు మాట్లాడుతుంటే, నాకెందుకో ఆ సంతోషం ఫుల్ గా లేదు"
"అదేంట్రా అలా అన్నావు. ఎందుకు లేదు"
"నువ్వు లేవూ ఇక్కడా. అన్నీ నువ్వొచ్చాక చూసుకుంటాను అన్నావ్, ఇప్పుడేమో అన్నీ నువ్వు పక్కన లేకుండా అయిపోతున్నాయి. ఏం బాలేదు"
హరీష్ మనసులో... "నేను ఎలా మిస్ అవుతాను బంగారం, ఇంకొద్దిసేపట్లో నీ ముందరుంటానుగా" అనుకుంటూ..
"హహహ.... వస్తానురా.... వచ్చినప్పుడు మాత్రం నీకు గుర్తుంది కదా నువ్వు నన్ను ఏమన్నా చేస్కోమన్నావ్. అది మర్చిపోకు"
"నీకు గుర్తుందా.... నాకేం గుర్తులేదు....సరే బాయ్ మళ్ళీ మెసేజ్ చేస్తా అమ్మ పిలుస్తోంది. లవ్ యూ కృష్ణా"
"లవ్ యూ టూ"
ఇంతలో పద్మగారు వచ్చి..... "అదేంటే..... లంగా వోణి వేస్కున్నావ్, చీర కట్టుకోమంటే. వెళ్ళి మార్చుకో"
"అమ్మా ప్లీజ్ అమ్మా. అసలైతే డ్రెస్ వేసుకుందామనుకున్నా. నువ్వింకా గొడవ చేస్తావని ఇది వేసుకున్నా. నాకెంటో గాభరాగా ఉంది. ప్లీజ్ అమ్మా"
రామ్ గారికి హరీష్ మాటలు గుర్తొచ్చాయి. "తను భయపడుతోంది, అందుకే నేను వచ్చాక ఇద్దరం కలిసి మాట్లాడదాం అనుకున్నాడని"
స్వాతి దగ్గరకి వెళ్ళి, తల మీద చేయి వేసి "తల్లీ..... వచ్చేది ఎవరో బయట వాళ్ళు కాదు కదా, నువ్వు చిన్నప్పటి నుంచి చూసే అత్తయ్య, మావయ్యానే. కొత్తగా వాళ్ళ ముందర ఖంగారు పడటం దేనికి. నువ్వెప్పుడూ ఎలా ఉంటావో అలాగే ఉండు. మేమందరం కూడా నీతోనే ఉంటాము కదా"
"సరే నాన్నా"
ప్రదీప్.... "నాన్నా..... బయటేదో కార్ ఆగింది. మీరు వెళ్ళండి. నేను స్వాతితో ఉంటానులే"
"సరే.... ప్రదీపు..... ఇప్పుడు వాళ్ళెందుకొస్తున్నారో మనకి తెలీదు. గుర్తుంది కదా"
"అలాగే నాన్న"
పద్మగారు.... "రండీ అన్నయ్యా"
రాంగారు ... " కూర్చోండి. ఎలా ఉన్నారు? హరీ నీ ట్రిప్ ఎలా అయ్యింది. మళ్ళీ వెళ్ళాలా"
మహేశ్వర రావు గారు...... "మేము బావున్నాము"
"బాగా అయ్యింది మావయ్యగారు, వర్క్ ఫినిష్ అయిపొయింది. ఇప్పట్లో మళ్ళీ వెళ్ళేదేమి లేదు"
లోపల ఉన్న స్వాతి, ప్రదీప్ హరీష్ మాట వినగానే ఆశ్చర్యంగా, "అన్నయ్యా బావొచ్చాడా??"
"ఆగరా చూస్తాను. నాకూ తెలీదు"
పద్మా..... "మంచినీళ్ళు తీసుకో ఒదినా"
"మీతో మాట్లాడదామని వచ్చాము అన్నయ్యగారు"
"చెప్పండి, దేని గురించి"
ప్రదీప్ బయటకి రాబోతూ ఆగిపోయాడు.
"అన్నయ్యగారు, మా హరి మీ స్వాతిని ఇష్టపడ్తున్నాడు. మీరు ఒప్పుకుంటే, స్వాతి ని మా ఇంటి కోడలుగా చేసుకుందామని అడగటానికి వచ్చాము" అంటూ క్లుప్తంగా చెప్పారు హరీష్ వాళ్ళ అమ్మగారు
పద్మ, రామ్ గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, పద్మ గారు "వదిన... హరీష్ కన్నా మంచి వాడిని మేము ఎంత వెతికినా తీస్కుని రాలేమేమో. కానీ ఒదినా.... "
"ఏంటి పద్మా, దేని గురించి అనుమానం"
పద్మగారు భర్తని చెప్పమన్నట్లుగా చూడటంతో, రామ్ గారు అందుకుంటూ, "ఏమి లేదమ్మా. మేము మీకు సరితూగలేము, కట్న కానుకలు ఎక్కువ ఇయ్యలేము. అదే కాదు, స్వాతి చిన్న పిల్ల. దాని వలన ఏదైనా తప్పు జరిగి, రేపు వీళ్ళిద్దరూ ఎందుకన్నా గొడవ పడితే వాళ్ళ అన్న చెల్లెళ్ళ మధ్యలో దూరం పెరుగుతుంది"
"అన్నయ్యగారు, కట్న కానుకలు ఏవి మాకొద్దు. మా వాడు ఆ మాట ముందరే చెప్పాడు, వాడికి తీసుకోవటం ఇష్టం లేదని...."
"మావయ్య గారు..... పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడటం పద్దతి కాదని తెలుసు. కానీ ఈ విషయం నేనే మాట్లాడితే బావుంటుందని చెప్తున్నాను. మా మధ్యలో గొడవలు రావు. అది నా మీద నాకున్న నమ్మకం కాదు, స్వాతి మీదున్న నమ్మకం. తనని ఇష్టపడటానికి కారణం కూడా తను మా అమ్మా నాన్నకి కూతురిలా ఉండగలదనే నమ్మకమే. మీరు తను చిన్న పిల్ల అంటున్నారు కానీ తను చాలా తెలివైన అమ్మాయి. అందరి మంచి ఆలోచిస్తుంది. అలాంటిది మా వలన ఈ అన్న చెల్లెల్లు ఎప్పుడు మాట పడరూ. గొడవలు వచ్చినా అవి పెద్దవాళ్ళని దూరం చేసేవి ఎప్పటికి కావూ. మీ అమ్మాయి నా బాధ్యత. తనకి ఏ కష్టం రానీయను. వచ్చినా, తనకి తోడుగా ఉంటాను. మీకు ఏనాడు నన్ను పెళ్ళి చేసుకుందే అని బాధ పడే అవకాశం ఇయ్యనూ"
హరీష్ మాట్లాడుతుంటే, వాళ్ళ అమ్మ గారు ఆశ్చర్యంగా అలా తననే చూస్తూ ఉండిపోయారు. "ప్రేమిస్తున్నా అన్నాడు కానీ తన కొడుకు ఇంతలా మాట్లాడగలడని ఊహించలేదావిడ"
ఆవిడేంటి, అక్కడ ఉన్న అందరి పరిస్థితి అదే. స్వాతికి, తన బావకి తన ప్రేమ మీద ఉన్న నమ్మకానికి, ఆనందభాష్పాలు తనకే తెలీకుండా వచ్చేసాయి.
ప్రదీప్ మాత్రం హరీష్ మాటలు వింటూనే సంతోషం లో చప్పట్లు కొట్టి "సూపర్ గా చెప్పావు బా..." అని అరిచి నాలిక్కర్చుకున్నాడు.
"చిన్నూ అయిపోయానురా ఈ రోజు అమ్మ నన్ను ఉతికేస్తుంది. నాన్న అసలే చెప్పి మరీ వెళ్ళారు" అన్నాడు ఖంగారుగా.
ఎవరూ ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దం గా ఉండటంతో, హరీష్... "బావ అక్కడే లోపల ఎందుకూ. ఇక్కడికి రావచ్చు కదా"
రామ్ గారు కూడా ఇంక బాగోదనుకుని, "ప్రదీపు ఇటు రా"
"అయిపోయాను, బావ నన్ను ఫుల్ గా బుక్ చేసేసాడు. ఇప్పుడే వస్తాను" అంటూ బయటకి వెళ్ళాడు
మహేశ్వర రావు గారు, "బావగారు మా అబ్బాయి చెప్పాల్సింది చెప్పాడు. మాది కూడా అదే మాట. స్వాతికి ఎలాంటి ఇబ్బంది రానీయము. స్వాతి తో కూడా ఒకసారి మాట్లాడండి. మీ అందరికీ నచ్చితే...."
"అన్నయ్యా...... హరీ అంతగా చెప్పాక కూడా ఇంక మాకు ఏమి అనుమానాలుంటాయి" అంటూ పద్మ గారు ప్రదీప్, రామ్ గారి వైపు వాళ్ళ అభిప్రాయం కూడా అదే కదా అన్నట్లుగా చూసీ చెప్పారు
మహేశ్వర రావు గారు, రామ్ గారిని... "మీరేమంటారు బావగారు"
"పద్మది నాదీ ఒకే మాట బావగారు"
"మీరందరు సరే అంటే సరిపోతుందేంటీ అసలు స్వాతి మనసులో ఏముందో. తను ఇంట్లో లేదా, కనిపించటం లేదు" అన్నారు హరీష్ వాళ్ళ అమ్మ గారు
"లోపలే ఉంది అత్తయ్యా, నేను తీసుకొస్తా" అంటూ ప్రదీప్ లేవబోతుంటే
హరీష్ లేచీ, "అత్తయ్యా మీకు అభ్యంతరం లేకపోతే మీరు తన అభిప్రాయం అడిగే ముందర నేను స్వాతితో ఒకసారి మాట్లాడచ్చా"
పద్మగారు .... "దాని అభిప్రాయం తెలుసు కదా, కొత్తగా అడిగేదేముంది" అని మనసులోనే అనుకుంటూ, "అలాగే హరీ. లోపలే ఉంది. వెళ్ళు" అన్నారు
హరీష్ స్వాతి గది దగ్గరకి వెళ్ళి తలుపు తీసి లోపలికి వెళ్ళి తలుపు దగ్గరకి వేసాడు
హరీష్ లోపలికి వస్తుండటంతో, వెనక్కి తిరిగి కళ్ళు తుడుచునే టైమ్ లోనే హరీష్ లోపలికి వచ్చాడు. వెనకకి తిరిగున్న స్వాతిని అలాగే వెనక నుంచి వెళ్ళి హత్తుకుని తన భుజం మీద తల వాల్చి
"స్వీటీ"
"హ్మ్... "
"లవ్ యూ రా. ఇప్పుడు హ్యాపీ నా" అంటూ తన వైపుకి తిప్పుకున్నాడు
"బావ నువ్వు వచ్చావని నాకు చెప్పలేదేం"
"ఊరికే... నిన్ను సర్ప్రైస్ చేద్దామని. స్వీటీ.... లంగా వోణి లో సూపర్ గా ఉన్నావు" అంటూ తనని దగ్గరకి తీస్కుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు
స్వాతి సిగ్గుపడుతూనే, "బావా, నువ్వు నన్నేదో అడగటానికి వచినట్లున్నావు కదా"
"నిన్ను అడగాలా, నాకు తెలీదా నీ మనసులో ఏముందో" అంటూ తనని దూరం జరిపి తేరిపారా చూసీ,
"స్వీటీ ఎన్నాళ్ళ నుంచి ఏడుస్తున్నావురా. మొహం ఎలా అయిపోయిందో చూసుకున్నావా. నేను చూసుకుంటాను అని చెప్పాను కదా. టైమ్ కి మనోజ్ ఫోన్ చేసాడు కాబట్టి సరిపోయింది. అయినా ఇంత జరుగుతున్నా ఒక్క మాట చెప్పలేదు."
"మనోజ్ విషయం ఈరోజు పొద్దున్న వరకూ తెలీదు బావ. నీకు చెప్తే నువ్వూ టెన్షన్ పడతావని చెప్పలేదు"
"నేను టెన్షన్ పడతానని నా బదులు నువ్వేడ్చేస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందా. పిచ్చి బంగారం. నువ్వు ఏడ్చేసినంత మాత్రాన నా నొప్పి తగ్గదు కదరా. నాకు తెలిస్తే ఇదే పని ఎప్పుడో చేసేవాళ్ళము" అంటూ బయటకి వెళ్ళబోతుంటే స్వాతి హరీష్ ని హత్తుకుని,
"బావ కొంచం సేపు ఇలాగే ఉండవా. ఎంత కాలమయ్యిందో నిన్ను ఇంత దగ్గరగా చూసీ"
హరీష్ స్వాతి నడుము మీద చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు. స్వాతి దూరం జరగబోతుంటే, "నేను యు స్ కి వెళ్ళేముందర, వచ్చేసాక నా ఇష్టం అన్నావు కదా ఇప్పుడు దూరం వెళ్తావేం" అంటూ తన పెదవులని అందుకున్నాడు.
కొద్దిసేపటికి స్వాతి హరీష్ ని జరుపుతూ "పద బావ . అందరూ వెయిటింగ్ అక్కడా"
"బుద్ధిగా వెళ్ళేవాడిని టెంప్ట్ చేసిందెవరు. రా బయటకి నిన్ను ఆడుకుంటాను అందరి ముందర" అంటూ తలుపు తీసాడు
"బావ ఒద్దు బావ..... ప్లీజ్" అంటూ స్వాతి బతిమాలుతున్నా, నవ్వుకుంటూ బయటకి వచ్చేసి, ప్రదీప్ పక్కన కూర్చున్నాడు.
ప్రదీప్... "ఇంతసేపు ఏం చేసావ్ బా ... " అనడిగాడు హరీష్ కి మాత్రమే వినిపించేలాగా
"తనని పిలువూ....... పిలిచి అడుగు బావ నువ్వే. కన్విన్స్ చేయటానికి ఇంత సేపు పట్టింది బావ"
ప్రదీప్, స్వాతిని పిలవమని పద్మగారికి సైగ చేయటం తో ఆవిడ వెళ్ళి స్వాతిని తీసుకొచ్చారు. హరీష్ వాళ్ళ నాన్న గారు, ఆయనకి సత్య గారికి మధ్యలో కూర్చోపెట్టుకుని, "అమ్మా వాళ్ళు అడగటం కాదు, హరీష్ నీతో మాట్లాడాడు కదా. నీ మనసులో మాట చెప్పు తల్లీ"
స్వాతి, హరీష్ వైపు చూస్తుంటే, హరీష్ మాత్రం అదేమీ పట్టనట్లూ .... "నాన్నా తను కవితలు బాగా చెప్తుంది కదా. నాతో పెళ్ళి ఇష్టముంటే ఒక కవిత చెప్పమను"
స్వాతి కోపంగా హరీష్ వైపు చూసీ, ఏంచేయాలో తోచక పద్మగారి వైపు చూసింది.
ఆవిడ "పర్వాలేదు.... చెప్పు" అని సైగ చేయటం తో తప్పదనుకుని...
ఏమని చెప్పను బావా
నా మదిలోని మాటలను.
నీ ప్రేమని నువ్వు మౌనంగా తెలిపావు
నా ప్రేమని మాటల్లో చెప్పమంటున్నావు.
నా మనసులో నింపుకున్న నిన్ను
నేడు నా కళ్ళ ముందర నిల్చుని
నిన్ను మనువాడటం ఇష్టమా అనడుగుతున్నావు.
ఏమని చెప్పమంటావు బావా,
ఈ క్షణం కోసమే నేను వేచి వున్నానని
నీతో సంబంధం నాకు సమ్మతమేనని.
స్వాతి అలా చెప్పటంతో హరీష్ తల్లీ తండ్రులు చాలా సంతోషంగా స్వాతిని దగ్గరకి తీసుకున్నారు.
ప్రదీప్.... హరీష్ చెవిలో, నీ ప్రేమని మౌనంగా తెలిపావా, కన్విన్స్ చేయటానికి ఇంత టైమ్ పట్టిందన్నావ్. బావా ఏం చేసావ్ లోపల మా చెల్లిని" అంటూ ఆటపట్టించాడు
"ప్రేమలో మునిగిపోయిన నీకు నేను ఏం చెప్తాను బావ. తనని నేనేదో ఆటపట్టిద్దామనుకుంటే నన్ను బుక్ చేసేసింది. అయినా, సమ్మతమే అని చెప్పేసిందోచ్" అన్నాడు సంతోషంగా
"ఆ విషయం ఇప్పుడు తెలిసిందా బా.... నీకు"
Comments
Post a Comment