40

 మరుసటి రోజు పొద్దున అందరూ కాఫీ తాగటానికి  కూర్చున్నారు.  


పద్మ గారు....  "ప్రదీపు స్వాతి ఏది" 


"ఇప్పుడే లేచిందమ్మా. ఫ్రెష్ అవుతోంది. వస్తుందిట"


రామ్ గారు... "ప్రదీపు....  స్వాతికి మంచి సంబంధం వచ్చిందిరా. దాని క్లాసుమేట్ మనోజ్ అని ఉన్నాడు కదా, ఆ అబ్బాయే. వాళ్ళ అమ్మ గారు అమ్మకీ గుడిలో కనిపించినప్పుడు అడిగారట. అప్పుడింకా దానికీ పరీక్షలు కదా అని ఆగాము. ఇప్పుడెలాగో అయిపోయాయి కదా. మాకు అన్నీ బావున్నాయనిపించింది.  నువ్వేమంటావ్" 


"అమ్మా....  నీకూ ఓకేనా " 


"నాన్న చెప్తున్నారు కదరా. అయన చెప్పాక ఇంక మళ్ళీ నాదింకోమాట ఉంటుందా" 


"అమ్మా....  నాన్న కి తెలీదు. నీకు తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడతావు" అంటూ కొంచం గట్టిగా మాట్లాడాడు ప్రదీప్ 


కానీ రామ్, పద్మ గారు ఇది ముందర ఊహించిందే కాబట్టి నవ్వుకున్నారు. అది బయటకుండా, రామ్ గారు మాత్రం కోపంగా..... "ఏంటి ప్రదీపు, అమ్మతో ఆ మాట్లాడటం. ఏం పెద్దవాడివి అయిపోయావనుకుంటున్నావా" 


"కాదు నాన్నా. అది మనసులో ఒకళ్ళని పెట్టుకునీ ఇంకొకళ్ళని పెళ్ళి ఎలా చేసుకుంటుంది. అది సంతోషంగా ఉండలేదు" 


"ఏం మాట్లాడ్తున్నావురా నువ్వు" 


"అవును నాన్నా. అమ్మ కి కూడా తెలుసు. అది హరీష్ ని ఇష్టపడుతోంది. కానీ అమ్మ, వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మీకు ఆ విషయం చెప్పకుండా ఇంకో సంబంధం గురించి అడుగుతోంది"


పద్మగారిని చూస్తూ.... "హరీష్ ని ఇష్టపడటం ఏంటి. ఈ విషయం నాకు చెప్పాలనిపించలేదా" అంటూ ప్రదీప్ వైపుకి తిరిగి, ... "ఎన్నాళ్ళ నుంచి తెలుసురా నీకు"  అని కోపంగా అడిగారు 


"అదీ....  నాన్నా....  చాలా రోజులనుంచి తెలుసు" అంటూ నీళ్ళు నమిలాడు 


"ఏరా......  నీకెప్పటి నుంచో తెలిసినా నువ్వు ఇంట్లో చెప్పలేదు, కానీ అమ్మ చెప్పలేదని అమ్మ మీద ఎగురుతున్నావా. 


"నాన్నా....  నిజమే అమ్మతో అలా మాట్లాడకూడదు. కానీ చిన్నూ విషయం లో హరీష్ ని కాకుండా ఇంకెవరిని చెప్పినా నేనొప్పుకోను. దాన్ని వాడు చూసుకున్నంత ప్రేమగా ఇంకెవరూ చూస్కోరు" 


పద్మగారు.... "అందుకేరా మేమూ ఒప్పుకున్నాము" 


"వాట్...  నిజంగానా....  మరి మనోజ్....." 


రామ్ గారు "మనోజ్ వాళ్ళ అమ్మ గారు వాళ్ళు అడగటం మాట నిజమే. కానీ మాకు స్వాతి సంతోషం ముఖ్యం. అత్తయ్య వాళ్ళు ఒప్పుకుంటే మాకే అభ్యంతరము లేదూ" 


లోపల నుంచి వస్తున్న స్వాతిని చూసీ "రారా బంగారు..... ఇప్పుడు నీకు సంతోషమే కదా. ఇప్పటికన్నా కొంచం నవ్వరా" అన్నారు రామ్ గారు 


"నాన్నా,  నాకీ పెళ్ళి ఒద్దు నాన్నా. నేను బావని చేస్కోను" 


ప్రదీప్ ఒక్కసారిగా షాక్ అయ్యి.... "చిన్నూ ఏంటి జోక్ చేస్తున్నావా. ఇంట్లో అందరూ ఒప్పుకున్నాక ఇప్పుడు  పెళ్ళి చేసుకోనంటావేంటి. ఏమయ్యిందీ" 


"అన్నయ్యా....  అమ్మ వాళ్ళ పరువు తీసేలా నేనే పనీ చేయను, నా వలన వాళ్ళు తలదించుకోకూడదు" 


పద్మ గారు బాధగా రామ్ గారి వైపు చూసీ అక్కడ నుంచి వెళ్ళిపోయారు


స్వాతి కూడా వెళ్ళిపోబోతుంటే,  "స్వాతి ఆగు " అని రామ్ గారు కొంచం గట్టిగా మాట్లాడటం తో ఆగిపోయిందీ. తన తండ్రి తనని పేరు పెట్టి పిలిచింది చాలా తక్కువ సార్లు. అందులోను గట్టిగా మాట్లాడినది లేదు. 


కళ్ళలో ఉబికి వస్తున్న నీళ్ళని ఆపుకుని ఆయన వైపు కి తిరిగింది. 


"మీ నాన్న ఎవరూ" అన్నారు అయన ఇంకా కోపంగా 


ప్రదీప్ ఆ మాటకి ఏదో చెప్పబోయేంతలో, ఆయన చేతితో ఎవరిని మాట్లాడద్దనట్లుగా చూపించారు. స్వాతి మాట్లాడకపోవటం తో మళ్ళీ రెట్టించి,  "చెప్పూ.....  ఎవరూ" 


"మీరే నాన్నా" 


"నువ్వెక్కడ పెరిగావు,  ఎవరి దగ్గరా?? "


"మీ దగ్గరే" 


"మరి మా పెంపకం లో పెరిగి నువ్వు తప్పు చేసావా ఎప్పుడైనా"


"లేదు" 


"చేయనప్పుడు ఈరోజు ప్రేమిస్తే తప్పేలా అవుతుందీ. ఇటు రా తల్లి"అంటూ ప్రేమగా స్వాతిని ఆయన పక్కన కూర్చోపెట్టుకుని,  "నువ్వెప్పటికీ మాకు చెడ్డ పేరు తీసుకునిరావని మాకు తెలుసు. మీ అమ్మకి నీ గురించి బెంగ తప్ప నీ మీద కోపం కాదు. నువ్వేమయిపోతావో అని భయం. అది నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగ నాన్నా. నువ్వలా బాధగా పెళ్ళి ఒద్దు అంటే నీకన్నా ఎక్కువ బాధపడేది తనెను"  అన్నారు 


స్వాతి లోపల వాళ్ళ అమ్మ గారి దగ్గరకి వెళ్ళి,  ఆవిడని హత్తుకుని,  క్షమించమని అడిగిందీ. 


ఇంతలో ఆవిడ ఫోన్ మోగేసరికి,  అది చూసీ రామ్ గారి వైపు ఖంగారుగా చూసారు


*******************************


అక్కడ హరీష్ ఇంట్లో..... 


"నాన్నా....  అమ్మ లేచిందా" 


"లేదురా....  నువ్వు తెల్లవారుఝామున అయిదింటికి వచ్చేస్తే ఏం లేస్తుంది. అదీ నువ్వేమో చెప్పదన్నావు. లేస్తుందిలే. నువ్వెళ్ళి ఈలోపు ఫ్రెష్ అయ్యిరా. వచ్చాక నీతో కొంచం మాట్లాడాలి" 


"మీరే పైకి రండీ. మాట్లాడేసాక  ఫ్రెష్ అవుతా.".... హరీష్ రూమ్ లో కి వెళ్ళాక "చెప్పండి నాన్నా....  ఏమిటి కబుర్లు" 


"ఏమిటి కబుర్లేంటిరా...... అత్తయ్య తో మాట్లాడమన్నావు కదా" 


"ఇప్పట్లో మంచి రోజులు లేవంటూ పోస్టుపోన్ చేశారు కదా" 


"అవునురా,  అలా చెప్పకపోతే నువ్వు అక్కడ ఒక్కడివి కూర్చుని బాధపడ్తావ్ అంటూ స్వాతి నన్ను ఏమి చెప్పద్దంది" 


"నాన్నా మిమ్మల్ని పంపించినదే అక్కడ ఏమవుతోందో తెలుస్తుందని. అలాంటిది తన మాటలు వినీ మీరు చెప్పకపోటం ఏంటి. అసలేమయ్యింది" అన్నాడు ఒకింత అసహనంగా 


"తను చెప్పింది నీకోసమే కదరా. సరేలే,  అత్తయ్య... అమ్మ ఒప్పుకుంటే ఆలోచిద్దాములే అనే అంది నాతో. కానీ బయటకి వచ్చాక స్వాతి చెప్పటం అయితే,  అత్తయ్య పెళ్ళికి ఒప్పుకునేలా లేదందిరా. హరీ..... " 


"ఏంటి నాన్నా, ఇంకేమైనా చెప్పిందా" 


"లేదురా. నువ్వంటే చాలా ఇష్టంరా. అంత ఏడుస్తూ కూడా నువ్వు ఒక్కడివి అక్కడున్నావ్,  ఇవన్నీ తెలిస్తే బాధపడ్తావు అంటూ నీ గురించే బెంగ. హరీ...  తనని వదులుకోకురా. అమ్మని,  అత్తయ్యని ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు" 


"సరే నాన్నా......నాన్నా.....  స్వాతి ఏడ్చిందా" 


"అవునురా" 


"నాన్నా....  ఒక్కసారి తనని కలిసేసి వస్తాను. తనని చూడాలనుంది" 


"ఈ టైమ్ లో ఏం వెల్తావురా. బాగోదు. ముందు అత్తయ్య వాళ్ళని ఎలా ఒప్పించాలో అది ఆలోచించు" 


"నాన్నా...  మీరు అత్తయ్యతో చెప్పారు, నిన్న నేను బయల్దేరే ముందర మావయ్యగారితో మాట్లాడాను" 


"బావగారితో మాట్లాడావా....  ఆయనేమన్నారు " 


"అత్తయ్య తో కూడా మాట్లాడాలి కదా అన్నారు. ఒప్పుకున్నారని అనలేను ఒప్పుకోలేదని చెప్పలేను. నమ్మకమైతే ఉంది" 


"సరేలేరా.....  నువ్వు రెస్ట్ తీస్కుని ఫ్రెష్ అవ్వు. ఈ లోపున అమ్మని లేపుతాను" అని అయన ఆ రూంన్లో నుంచి వచ్చేసారు 


"అందరినీ ఒప్పిస్తే కానీ నాకు రెస్ట్ దొరకదు. స్వీటీ ఎలా ఉందొ అక్కడ" అని తనలో తనే ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. 


ఇంతలో హరీష్ వాళ్ళ అమ్మ గారు తన రూమ్ దగ్గరకి వచ్చి, "ఒరేయ్ హరీ.....ఎప్పుడు వచావ్వురా. ఎన్నాళ్ళయ్యిందిరా నిన్ను చూసీ. మాట వరసకన్నా చెప్పనే లేదు. నిన్నంతా ఫోన్ చేయకపోతే బిజీగా ఉన్నావనుకున్నాను" అంటూ హరీష్ ని దగ్గరకి తీస్కుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు 


"అమ్మా.....  నీకు సర్ప్రైస్ ఇద్దామనే నాన్నని చెప్పద్దని చెప్పాను. నిన్నంతా ఫ్లైట్ లో ఉంటే నీకెలా ఫోన్ చేస్తాను. సరే కానీ నువ్వెలా ఉన్నావు. నీ ఆరోగ్యమెలా ఉంది". 


"నాకు బానే ఉందిరా. రోజూ పొద్దునెళ్తే రాత్రొచ్చేవాడివి, అయినా ఎదురుగా కనిపిస్తుంటే అదో ధైర్యం. అక్కడికెళ్ళాక ఎంత ఫోనుల్లో మాట్లాడినా, చూసుకున్నా.... ఇలా దగ్గరకి తీసుకున్న తృప్తి ఉండదురా. మళ్ళీ వెళ్లాల్సి ఉంటుందా" అంటూ అనుమానంగా అడిగారు


"లేదమ్మా ఇక్కడే ఉంటాను. ఇప్పట్లో ఇంకేం టూర్లు లేవు. సరే కానీ, అమ్మ కిందకి పదా మీ  ఇద్దరితో ఒక విషయం గురించి మాట్లాడాలి" అంటూ కింద హాల్ లో కూర్చున్నారు


"ఇప్పుడు చెప్పరా.....  ఏమిటంత ముఖ్యమైన విషయం. నాన్నని, నన్ను లాక్కొచ్చావు" అంటూ కూర్చున్నారు 


"అమ్మా, నేను స్వాతిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్ళి చేసుకుంటాను" 


"ఏంటి మన స్వాతినా??" అన్నారావిడా నమ్మలేనట్లుగా 


వాళ్ళ నాన్నగారు మాత్రం........  "చాలా సంతోషంరా. ప్పొద్దునే మంచి మాట చెప్పావు" అన్నారు


"అవునమ్మా మన స్వాతినే" 


"హరీ...  అభిమానం వేరు. ప్రేమ వేరు. నీకోసం ఎంత మంచి సంబంధాలు వస్తున్నాయో తెలుసా. స్వాతికన్నా ఎంతో అందంగా  ఉన్నవాళ్ళు, ఉద్యోగం చేస్కునేవాళ్ళు, రేపు పెళ్ళిలో కట్న కానుకలు బాగా ఇయ్యగలిగేవ్వాళ్లు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో గొప్ప సంబంధాలు వస్తున్నాయిరా" 


"అమ్మా అవేవి నాకొద్దు. నేను పెళ్ళి చేసుకుందామనుకున్న అమ్మాయి మన ఇంట్లో కలిసిపోవాలి,  నాకు బాధ వస్తే తను ఏడ్చేసే అంత ప్రేముండాలి. ఇంకోమాట లో చెప్పాలంటే, తను నీలా నన్ను చూస్కోగలగాలి. కూతురిలా మిమ్మల్ని చూసుకోవాలి..." 


"అవునురా...  స్వాతి మన ఇంట్లో  కలిసిపోతుంది. చిన్నప్పటి నుంచి చూస్తోంది, మన పద్ధతులు తెలుసు. నెమ్మది, అణుకువ ఉన్న అమ్మాయి. తను వస్తే మళ్ళీ మా పద్మ వచ్చినట్లే ఉంటుంది" అన్నారు మహేశ్వరరావు గారు. 


ఆయన మాటలకి "చాలులెండి" అన్నట్లు హరీష్ వాళ్ళ అమ్మ గారు కళ్ళతో ఒక చూపు విసిరారు


హరీష్ వాళ్ళిద్దరిని చూసీ, "అమ్మా.....  డబ్బు అంటావా,  కట్న కానుకలు నాకు ఒద్దు. నేను మిమ్మల్ని, వచ్చే నా భార్యని పోషించొకోగలను. వాళ్ళ డబ్బు నాకక్కర్లేదు. ఇది స్వాతి కాబట్టి అని చెప్పటం లేదమ్మా, నువ్వింకెవరినో చూపించినా ఇదే మాట చెప్పేవాడిని. అలాగే తను ఉద్యోగం చేసినా అది తన ఇష్టం, సంతోషం కోసమే. దాంట్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను" 


"హరీ.... నేనింకేం  చెప్పగలనురా. నీ పెళ్ళి నీ ఇష్టం" 


"అమ్మా అదేంటీ అలా అంటావు. మీకు ఇష్టం లేకుండా నేను పెళ్ళి చేసుకోలేను. కానీ స్వాతి కాకుండా ఇంకో అమ్మాయి మాత్రం నా లైఫ్ లో కి రాదు" అని అక్కడ నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు 


మహేశ్వరరావు గారు " ఏంటి సత్య నీకు ఈ పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో ఒక్క మాట చెప్పు. డబ్బే నీ సమస్యా. వాడికి ఆ డబ్బు అక్కర్లేదంటున్నాడు కదా" 


"ఎందుకు అక్కర్లేదు. వాడు చిన్నవాడు వాడికేం తెలీదు" 


"సరే నీకు డబ్బే కావాలి కదా, నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యం. నీకెంత కట్నం కావాలో చెప్పు నేను ఇస్తాను. అది నా చెల్లెలి కూతురు,  మేనమామగా నేను ఇస్తాను" 


"తను మీ చెల్లెలి కూతురు కాదు, వాళ్ళు పెంచుకున్న కూతురని మర్చిపోయినట్లున్నారు. అది వస్తే మీ చెల్లెలు వచ్చినట్లే ఉంటుందా?? ఎలా అవుతుందీ. పుట్టగానే తల్లి చనిపోయింది... " 


"సత్యా...." మహేశ్వర రావు గారి అరుపు అక్కడ రీసౌండ్ వచ్చింది. బాధగా తన రూమ్ లో కూర్చుని ఉన్న హరీష్ పరుగున కిందకి వచ్చాడు. 


"నాన్నా.....  ఏమయ్యిందీ" 


"నువ్వు వెళ్ళు హరీ.  ఇది నీ గురించి కాదు" హరీష్ అక్కడ నుంచి కదలకపోవడంతో....  "వెళ్ళు అని చెప్పానా" అన్నారు అంతే గట్టిగా. హరీష్ ఏమి మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. 


"ఏమన్నావ్,  అది పుట్టగానే తల్లి చనిపోయిందా. కానీ ఆవిడ చనిపోతుందని  తెలిసి కూడా ఆవిడ దానికి జన్మనిచ్చారు. వాళ్ళ ప్రేమకి గుర్తు అది. కానీ దాని తండ్రీ కూడా ఆ విషయాన్నీ మర్చిపోయి అర్థం లేని కోపం పెంచుకున్నాడు. అయినా కూడా దానికి ఆయన మీద ప్రేమ తగ్గలేదు. దాన్ని అసహ్యించుకునే తండ్రినే ప్రేమించే పిచ్చిదది అలాంటిది నీ కొడుకు దాన్ని ప్రేమిస్తున్నాడంటే ఇంకెంత ప్రాణంగా చూసుకుంటుంది. అది వాడి జీవితం లోకి వస్తే నీ కొడుకే అదృష్టవంతుడవుతాడు. నిన్ను కూడా మరిపించగలదు దాని ప్రేమతో. వాడు ప్రేమిస్తున్నానో అంటుంటే కట్నం అంటావ్, అందం అంటావు. వాడి సంతోషం గురించి మాత్రం ఆలోచించవేం. నువ్వు చెప్పేవన్నీ నీకు సంతోషాలు, వాడికి కాదు. ఇంక నువ్వాలోచించుకో" అని ఆయన అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయారు 


హరీష్ లోపలికి వెళ్ళినా ఆయన చెప్పినవి వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడ ఏమి జరిగి ఉంటుందో ఊహించాడు. స్వాతి గురించి వాళ్ళ నాన్నగారు అన్నవి మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. మనసులో ఏదో బాధ. కానీ సడన్ గా వాళ్ళ అమ్మ గారు ఒక్కరు అక్కడ కూర్చున్నారని గుర్తొచ్చి కిందకి వెళ్ళాడు.


"అమ్మా...." 


ఆవిడ మౌనంగా ఉండిపోయారు. 


"అమ్మా, నాన్న నా గురించి ఏదో బాధలో మాట్లాడారు. నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు" అంటూ ఆవిడ భుజం మీద తల పెట్టి, చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. 


హరీష్ చేతుల మీద ఆవిడ చేయి వేసి.... "లేదురా హరీ. మీ నాన్న బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కోపం లో ఏదైనా అన్నా,  నా వలన అయన మాట పడినప్పుడు కూడా నన్ను ఒక్క మాట అనలేదురా. ఈరోజు అంత కోపం వచ్చిందంటే అది నీ మీద ప్రేమేరా. నాకేమి బాధ లేదు. ఆయన అన్నదీ నిజమే. నీ సంతోషమే కదరా మాకు కావల్సినది. మీ ఇద్దరికి ఇష్టమైతే నాదేముంది. అత్తయ్యా వాళ్ళకి ఫోన్ చేసి నేనే అడుగుతాను. 


అప్పుడే అక్కడికొచ్చిన మహేశ్వరావు గారు ఆవిడ మాటలు వినీ "సారీ సత్య....  " 


"పర్వాలేదండి......  సరే నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను పద్మ కి" అంటూ ఫోన్ కోసం లోపలికి వెళ్ళిందావిడ. 


"అమ్మా....  మరీ ఇంత పొద్దునేనా" అని హరీష్ అంటున్నా తన మాటలు వినిపించుకోలేదు ఆవిడ 


"లేడి కి లేచిందే పరుగు అన్నట్లు ఇంక దాన్ని ఇప్పుడు ఆపలేమురా" 


"థాంక్యూ నాన్నా..... నేను అమ్మని కన్విన్స్ చేయగలననుకున్నా కానీ ఇందాకా ఆశ వదిలేసాను. మీవలనే ఒప్పుకుంది. కానీ అంత గట్టిగా మాట్లాడకుండా ఉండాల్సిందేమో" 


"ష్....  అమ్మ వింటుంది. ఒక్కోసారి మెల్లిగా వినకపోతే షాక్ ట్రీట్మెంటే కరెక్ట్" అని కన్ను కొట్టి నవ్వారు. 


వాళ్ళ అమ్మగారు రావటం చూసీ,  హరీష్.... "ఏమయిందమ్మా" 


"తను ఎవరితోనో మాట్లాడుతోందిరా. కలవటం లేదూ" 


"కొంచం సేపు ఆగి చేయచులే సత్యా....  ముందర టిఫిన్ సంగతీ చూడు. బాబు ఎప్పుడు తిన్నాడోను" 


"ఏం తింటాను. ముందర స్వీటీ దగ్గరకి వెళ్ళాలి. తనని చూసే వరకూ నేనే పని చేయలేను" అని గట్టిగా అరిచాడు హరీష్,  తన మనసులోనే. 


*************ఇంతకీ హరీష్ వాళ్ళ అమ్మ గారు ఫోన్ చేసినప్పుడు ఎంగేజ్ వస్తుంటే మరి పద్మ గారికి కాల్ చేసిందెవరు,  ఆ కాల్ చూసీ ఎందుకావిడ ఖంగారు పడ్డారు 🤔🤔🤔*****



Comments