39

 


ఆరోజు త్వరగా ఆఫీస్ కి వెళ్ళిపోయినా ప్రదీప్ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అయ్యింది. 


రామ్ గారు... "ఏంటి ప్రదీపు ఇంత ఆలస్యమయింది" 


"ఆఫీస్ లో చాలా వర్క్ ఉంటోంది నాన్నా. రేపు సండే కదా అని ఫినిష్ చేసేసుకుని వచ్చాను. లేకపోతే,  రేపూ వెళ్ళాల్సివచ్చేది" 


"మంచి పని చేసావు" 


"మీరెప్పుడొచ్చారు" 


"నేనూ ఇదిగో ఇప్పుడే లోపలికి వచ్చాను" 


పద్మగారు.... "కాఫీ తీస్కుని రానా"


"ఆహా ఒద్దు....  ఎలాగో ఆలస్యమయింది కదా,  భోజనం చేసేస్తానులే. ఇంతకీ ఇద్దరూ తిన్నారా లేదా. మళ్ళీ ఉపవాసమా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు" 


"ఏమయిందిరా,  అమ్మ మీద అలా గట్టిగా మాట్లాడుతున్నావు" 


"ఆ....  మీరు ఇంట్లో లేరు కదా. అమ్మ తినటం మానేసింది. అమ్మ తినలేదని చిన్నూ మానేసింది..... అవునూ చిన్నూ ఏది" 


"అవును పద్మా నేను వచ్చాకా కనిపించలేదు"


పద్మ గారు.... "దాని రూంలోనే ఉంది" అని లోపలికి వెళ్ళిపోయారు 


"ఏం చేస్తోంది లోపల,  ఇక్కడే ఉన్నా బయటకి రాలేదు" అంటూ ప్రదీప్ స్వాతి రూమ్ లో కి వెళ్ళాడు. రూమ్ చీకటిగా ఉండటం తో లైట్ వేసి,  


"చిన్నూ ఏంటిది, వేళ కానీ వేళ లో పడుకోటం ఏంటి. లేవరా"


స్వాతి లేచీ కూర్చుని,  "ఎప్పుడొచ్చావన్నయ్యా. ఆగు ఫ్రెష్ అయ్యి వస్తాను" అంటూ లేవబోయింది


"చిన్నూ ఏమయిందిరా..... మొహం ఏంటి అలా పీక్కుపోయింది. ఏడ్చావా..... ఎందుకురా. ఎవరేమన్నారు నిన్ను. బావతో ఏమన్నా గొడవ పడ్డావా, అమ్మ ఏమన్నా అన్నదా" 


ప్రదీప్ మాట్లాడుతుంటే స్వాతికి ఏం చెప్పాలో తెలీలేదు. "అన్నయ్యా.... " అంటూ ప్రదీప్ ని పట్టుకుని ఏడ్చేసింది. 


"చిన్నూ ఏమయిందమ్మా. ఎవరేమన్నారురా. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది" అంటూ ఖంగారుగా చెల్లెలి తల నిమురుతూ అడిగాడు.


"అన్నయ్యా...  అమ్మా.... " స్వాతి వాళ్ళ నాన్నగారు రావటంతో చెప్పబోయినది ఆపేసింది


"ఏంటమ్మా ఏం చేస్తున్నావ్" అంటూ ఆయన లోపలికి వచ్చి, స్వాతి ఏడుస్తుండటం చూసీ,  "ఏమయిందిరా" అంటూ ప్రదీప్ ని అడిగారు 


"తెలీదు" అని చేతితో సైగ చేసి,  "చిన్నూ ఏమయిందమ్మ" 


స్వాతి కళ్ళు తుడుచుకుని,  ప్రదీప్ ని,  వాళ్ళ నాన్న గారిని చూసీ, "నిన్నటి నుంచి అన్నయ్య అస్సలు మాట్లాడలేదు" అంటూ రామ్ గారి దగ్గరకి వెళ్ళింది


"నిన్నంతా పని లో ఉండిపోయానురా" 


"బంగారం....  ఒక్క రోజు వాడు పని లో పడి మాట్లాడకపోతే ఇంత బెంగెట్టేస్కుంటే,  రేపు పెళ్ళి అయ్యి వెళ్ళాక ఏం చేస్తావురా" అనడిగారు వాళ్ళ నాన్న గారు 


"పెళ్ళా.... నేనసలు పెళ్ళే చేసుకోను నాన్నా. మీతోనే ఉండిపోతాను. ఏం నేను మీకొద్దా" 


ప్రదీప్ కి స్వాతి మాటల్లో బాధ అర్థమవుతోంది. కానీ ఏమయ్యిందో తెలీలేదు. వాళ్ళ నాన్న గారు లేనప్పుడు మళ్ళీ మాట్లాడాలనుకున్నాడు. 


"నీకోసం అక్కడెవరో ఒకళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా. నువ్వు చేసుకోనంటే వాళ్ళేమైపోతారు. అందుకోసమైనా పెళ్ళి చేస్కోవాలిరా" 


ఆయన అన్నీ తెలిసి మాట్లాడుతున్నారో లేక  కో-ఇన్సిడెన్స్ అర్థం కాక అయోమయంగా చూసింది వాళ్ళ నాన్న గారిని.... ప్రదీప్ పరిస్థితి అదే. 


రామ్ గారు....  "పెళ్ళి చేసినంత మాత్రాన నిన్ను మేము ఒద్దనుకుంటున్నట్లు కాదురా. మేము ముగ్గురమూ నీకు పంచే  ప్రేమని తానొక్కడై నిన్ను చూసుకుంటూ, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే వాడికే ఇచ్చి పెళ్ళి చేస్తాము. మేము ఎప్పటికి ఉండము కదరా" 


"నాన్నా ఎందుకలా అంటారు" 


"మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. వీడికి రేపో మాపో పెళ్ళైపోతుంది. తర్వాత వాడి లైఫ్ వాడిది. నీకంటూ నీ తోడు ఉండాలిరా..... సరేలెండి. ఎక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళింది టాపిక్. అమ్మ భోజనాలు పెడుతోంది. ఫ్రెష్ అయ్యి రారా ప్రదీపు. నువ్వూ రా బంగారు" 


అందరూ భోజనం చేసాక,  స్వాతి మేడ మీదకి వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు అన్న మాటలు గుర్తు చేస్కుంటూ...  


"నాన్నా మీరన్నట్లుగా,  అంతలా ప్రేమించేవాడు దొరికాడు. ప్రాణంలా చూసుకుంటాడు. అందుకే బాధగా ఉంది. తనని దూరం చేసుకోలేను...... మిమ్మల్ని కాదనలేను" 


"చిన్నూ...."  ప్రదీప్ పిలుపుతో తన ఆలోచనల్లోంచి బయటకి వచ్చి,  కళ్ళు తుడుచుకుంటూ "ఏంటన్నయ్యా" 


"ఏమాలోచిస్తున్నావురా" 


"అదే.....  ఇందాకా నాన్న అన్నారు కదా,  నువ్వు పెళ్ళయ్యాకా నీ లైఫ్ నీది అని...అంటే ఇంక అప్పుడు నాతో ఇంత ప్రేమగా ఉండవా, నన్ను ఇంట్లో కూడా ఉండనీయవా" 


"నేను పెళ్ళయ్యాక మారుతానో లేదో నీకు తెలీదా చిన్నూ. అయినా ఇంట్లో ఉండనీయకపోవటానికి నువ్విక్కడుంటావేంటి, మా బావ నిన్ను తీస్కెళ్ళిపోతాడు కదా. నువ్వు ఉంటానన్నా వదలడు" 


"పెళ్ళయితేనే కదా అన్నయ్యా తీస్కెళ్ళేది" 


"చిన్నూ ఏమయిందిరా" 


"అన్నయ్యా....  అమ్మ పెళ్ళికి ఒప్పుకోలేదు. అమ్మ చెప్పేసింది" అంటూ భోరున ఏడ్చింది. 


"చిన్నూ ఎప్పుడు మాట్లాడావు,  నాకెందుకు ఇప్పటి వరకు చెప్పలేదు. అయినా బావ వచ్చాక చెప్దామన్నావ్ కదా"  


"నిన్న మావయ్య వచ్చి వెళ్ళారు. అత్తయ్య ఒప్పుకోవాలి కదా,  నాన్నని కూడా అడుగుతాను అంది మావయ్యతో అయితే. ఆయన వెళ్ళాక మాత్రం తను ఒప్పుకోను ఈ పెళ్ళికి అంది. నేను ఇంట్లో చెప్పలేదని చాలా కోపమొచ్చింది. నీతో చెప్పటానికి నువ్వేమో బిజీ. అసలు నాతో ఇప్పటి వరకు మాట్లాడావా" అంది ఏడుస్తూ 


"చిన్నూ.... బంగారు ఏడువకురా. నేను బిజీ అయితే ఏంటి నాన్నా. సరేలే,  నేను ఒప్పిస్తాను కదా. నువ్వు బాధపడకు. పదా ఇప్పుడే మాట్లాడదాము" 


"అన్నయ్యా....  ఇప్పుడెలాగో పడుకునిపోయి ఉంటారు. రేపు మాట్లాడచ్చులే. ఇప్పటి వరకు ఆగిన వాళ్ళము, రేపటి వరకూ ఆగలేమేంటి" 


"రేపటి వరకు ఆగాలంటే నువ్వు ఏడుపు ఆపాలి. నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు. మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. అవునూ బావకి కూడా చెప్పలేదా" 


"లేదన్నయ్యా. అక్కడ ఒక్కడు కూర్చుని బాధ పడతాడు. పక్కన మనిషే ఉండరు" 


"సరే, లే ముందర. కళ్ళు తుడుచుకో. పొద్దున్నకి నేను మాట్లాడతాను." 


"వొద్దన్నయ్యా.... ప్లీజ్ మాట్లడకులే. చూద్దాం. ఏదైతే అదే జరుగుతుంది. వెళ్దాం పదా" అంటూ కిందకి వెళ్ళింది 


"ఇందాకటి వరకూ ఒప్పుకోలేదని బాధపడి ఇప్పుడు ఒప్పిస్తా అంటే ఒద్దంటుందేంటి. ఇది వద్దన్నా రేపు నేను అమ్మ వాళ్ళతో మాట్లాడతాను" అనుకుని వెళ్ళిపోయాడు


పద్మ గారు వంటిట్లో అన్నీ సద్దుకుని,  పడుకున్నారు. రామ్ గారు,  "పద్మా....  తలుపులు అన్నీ వేసేసావా" 


"పిల్లలు మేడ మీద ఉన్నారు. వాళ్లొచ్చాక ప్రదీప్ వేస్తాడు లెండి" అంటూ పక్కకి తిరిగి పడుకున్నారు 


"పద్మా...  ఎందుకు సాయంత్రం నుంచి ముభావంగా ఉన్నావు" 


"అదేమీ లేదండి. మామూలుగానే ఉన్నాను" 


"మనకి పెళ్ళయి ముప్పై ఏళ్ళు అవుతోంది దగ్గర దగ్గరా. నువ్వు మాములుగా ఉన్నావో ముభావంగా ఉన్నావో నేను చెప్పలేనంటావా ఇన్నాళ్లయినా. ఏమైందీ. నీకు స్వాతి కి మధ్యన ఏం జరిగింది" 


"అదేంటి అలా అడిగారు" అంటూ లేచీ కూర్చున్నారు


"స్వాతి ఇందాకా ఎందుకో బాధపడుతోంది. నువ్వూ ముభావంగానే ఉన్నావు. నీ కళ్ళలో కనిపించనీయకుండా దాస్తున్న ఆ సన్నటి కన్నీటి ధార వచ్చేస్తానంటూ దాగుడుమూతలు ఆడుతోంది. ఇవేవి గమనించలేదనుకున్నావా" 


"నిన్న చిన్నన్నయ్య వచ్చాడు" అంటూ అయన వచ్చి వెళ్ళిన విషయం చెప్పారు. 


"స్వాతి ఇంత పెద్ద విషయం నాతో చెప్పలేదండి. ముందరే తెలిసుంటే ఇంత వరకూ రానిచ్చేదాన్ని కాదు" అంటూ బాధపడ్డారు 


"పద్మా.....  వాళ్ళు ఇష్టపడటం తప్పా..... హరీష్ ఎంత మంచివాడో మనకి తెలీదా. వాడికన్నా మంచివాడు మనమ్మాయికి దొరుకుతాడంటావా" 


"పిల్లాడు కాదండీ,  పిల్లాడి తల్లి గురించీ భయం నాకు. ఆవిడ వలన వీళ్ళిద్దరూ గొడవ పడితే మనం ఏమి చేయలేకుండా అయిపోతాము, బాధ పడేది ఇదే. ఈరోజు ఏడ్చినా, జీవితాంతం  బాధపడుతూ ఉండదు కదా. దాని మంచి కోసమే కదండీ చెప్పేది. నాకేమన్నా దాని మీద కోపమా" 


"నువ్వు చెప్పినట్లు రేపు ఇంకో సంబంధం చుస్తే వాళ్లెలా ఉంటారో నువ్వు చెప్పగలవా. అక్కడ అత్తగారు మంచివారైనా, చేస్కునే వాడేలా ఉంటాడో చెప్పగలవా. ఆడపడుచు వేధింపులు ఉంటే అప్పుడేమి చేస్తుంది. ఆడపిల్లకి మొగుడు మంచివాడు,  అర్థం చేస్కునే వాడైతే ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలిగే శక్తి ఉంటుందని నా నమ్మకం. కాదంటావా" 


"హ్మ్మ్....  అవుననుకోండి. అయినా మీరు ఫిక్స్ అయిపోయారు కదా. ఇంక నేనేం అంటాను. మీ ఇష్టం" 


"నా ఇష్టం కాదు పద్మా. అది మన కూతురు. మన ఇద్దరికీ నచ్చాలి, ఇద్దరమూ ఒప్పుకోవాలి" 


పద్మ గారు ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. రామ్ గారు ఖంగారుగా.... "ఏమైందీ పద్మా. నేనేదైనా తప్పుగా మాట్లాడానా" 


"లేదండి. మీరు తప్పుగా మాట్లాడలేదు. నేనే స్వాతి మనసు బాధ పెట్టాను. మీ నాన్న ముందర మా పరువు తీసెసావు,  ఆయనకేం సమాధానం చెప్పాలి అని అడిగాను. ఎంత బాధపడి ఉంటుందో" 


"వాడికి సమాధానం చెప్పటానికి వాడు దాని గురించి పట్టించుకోవాలి కదా. పెళ్ళి చేద్దామనుకుంటున్నాం అంటే మీ ఇష్టం అన్నయ్యా అంటూ డబ్బులు గురించీ ఏదో వాగాడు. నీ డబ్బులు అక్కర్లేదురా అని వచ్చేసాను. అలాంటి వాడికి ఏం సమాధానం చెప్పాలి. అయినా స్వాతి మన పెంపకం లో పెరిగిన పిల్ల. అదెప్పుడూ మన పరువు తీసే పని చేయదు" 


"తెలుసండి దాని గురించి,  కానీ ఒదిన గురించి భయపడి....." 


"అర్థమయ్యింది పద్మా" 


"అది నాతో ఇంక మాట్లాడదేమోనండి. దాన్ని బాధపెట్టాను" 


"అలా ఏమి జరగదు,  నేనున్నాను కదా.  అయినా పద్మా,  ఇంత జరుగుతుంటే ప్రదీప్ కి ఏమి తెలీదంటావా" 


"అవునండి నిజమే... ఈ విషయం నేనూ ఆలోచించలేదు" 


"తెలిసీ వాడు హరీష్ ని దూరం పెట్టలేదంటే,  తన మీద మంచి అభిప్రాయమే ఉందని కదా" 


"అవును లెండి" 


"సరే,  వాళ్ళ అమ్మ గారే  వచ్చి అడిగితే మరి ఏమని చెప్తావు" 


"నిజంగా అయితే తను ఈ పెళ్ళికి ఒప్పుకోదని నా నమ్మకం,  ఒప్పుకుని మరీ వచ్చి అడిగితే, మీరన్నట్లు హరీష్ ఉన్నాడు కదా,  స్వాతిని తను బాగా చూసుకుంటాడు. నాకు అభ్యంతరం లేదు" 


"హహహ్ సరే....." 


"ఎందుకా నవ్వు" 


"అక్కడ నా ఫోన్ అందుకో. దాంట్లో పొద్దున్న ఫోన్ ఎవరు చేశారో చూడు" 


ఫోన్ చూసిన పద్మగారు ఆశ్చర్యంగా "హరీష్ ఫోన్ చేశాడా. వాడు వచేసాడా" 


"రేపు పొద్దునే దిగుతున్నాడుట" 


"మరి ఇంతలో ఎందుకు ఫోన్ చేసాడు.....అంటే.... " 


"ఆ.... అదే....  అందుకే ఫోన్ చేసాడు....


"మావయ్యగారు,  నేను స్వాతి ఒకరినొకరు ఇష్టపడ్తున్నాము. మా ప్రేమ తన చదువుకి అడ్డు కాకూడదని ఇన్ని రోజులు మీకు చెప్పకుండా ఆగవలసి వచ్చింది. అంతే కానీ మీ మీద గౌరవం లేక కాదు. తీరా పరీక్షలు అయ్యేసరికి నేను ఇక్కడ ఉండిపోయాను. తను ఒకత్తి మీతో చెప్పటానికి ఖంగారు పడుతోంది, మీరు ఒప్పుకోకపోతే... అని భయంతో. అందుకే నేను వచ్చాక ఇద్దరమూ కలిసి మాట్లాడదామనుకున్నాను. ఇంకొద్దిసేపట్లో ఫ్లైట్ ఎక్కుతున్నాను. రేపే అమ్మ వాళ్ళని తీస్కుని వస్తాను. దయచేసి మా పెళ్ళికి ఒప్పుకోండి. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను,  అరికాలు కింద పెట్టనీయను లాంటివి చెప్పను కానీ తను నా ప్రాణం. నా ప్రాణానికి ఏ బాధ రానీయకుండా చూసుకుంటాను. వచ్చినా,  తనకు తోడుగా ఉండి,  ఎలాంటి కష్టానన్నా ఇద్దరమూ కలిసి  పరిష్కరించుకుంటాము. అంతే కానీ తనని మధ్యలో వదిలేయను. తను నా బాధ్యత. మావయ్యగారు. మీకిలా సడన్ గా ఫోన్ చేసి చెప్పటం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ తనకి వేరే సంబంధాలు చూస్తున్నారని తెలిసి వెంటనే కాల్ చేసాను"


"అదీ పద్మా తను చెప్పిన మాట" 


"హ్మ్....  అంతా వాడే మాట్లాడాడా,  మిమ్మల్నెమైన మాట్లాడనిచ్చాడా. మీరేం అన్నారు" 


"తను చెప్పిన విషయాలు చెప్పాను. తను చెప్పిన విధానం నాకు నచ్చిందీ పద్మా. అలా అని నేను సరే అనలేదు. నువ్వు మీ అన్నయ్య కి చెప్పినట్లే నేనూ,  ఇంటికి వెళ్ళి అత్తయ్య అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా, ఇప్పటికేమి చెప్పలేను  అన్నాను. నేను ఈ విషయం గురించి పొద్దున్న నుండి ఆలోచిస్తున్నాను. తను చెప్పగానే సరే అనేసేటంతటి చిన్న విషయం కాదు కదా. తను రేపు ఫ్లైట్ దిగాక,  వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ఇక్కడికి తీస్కుని వస్తాడట" 


"అయితే అన్నీ తెలిసీ, ఏమి తెలీనట్లు నన్ను అడిగారా,  నేనేమంటానో అని. నేను ముందే అన్నాను కదా,  మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఏదో నన్ను అడగాలని అడిగారు" 


"కాదు పద్మా. నీకు చెప్దామనుకునే వచ్చాను కానీ నువ్వు ముభావంగా ఉండేసరికి ఏమయిందో అనుకున్నా,  తర్వాత నువ్వే నేను మాట్లాడదామనుకున్న విషయాలు చెప్పేసరికి ఆగాను. నీ దగ్గర తెలీనట్లు దాచటానికి ఏం ఉంది. నేను ఫిక్స్ అయ్యానని అనను కానీ హరి చెప్పిన మాట నచ్చింది పద్మా. కష్టం అన్నది వస్తే తనకి తోడుగా ఉంటాను అన్నాడు. అది చాలు కదా. జీవితం అంటే కష్ట నష్టాలు ఉంటాయి. రానీయము అనుకున్నా ఆగవు. కానీ అవి వచ్చినప్పుడు మొగుడూ పెళ్ళాలు ఒకరికొకరు తోడుగా ఉంటే ఎలాంటి ఇబ్బందైన ధైర్యంగా దాటగలరు. ఇంతకన్నా అర్థం చేసుకోగలిగే భర్త ని మనం తీస్కుని రాగలమా చెప్పు" 


"మీరు చెప్తుంటే కరెక్టే అనిపిస్తోంది. కానీ....  ఒదినా..." 


"ఆ సమస్య వాళ్ళది. కానీ స్వాతి కోసం, ఇష్టం లేకుండా మాత్రం ఒప్పుకోకు. రేపొద్దున్న అది కష్టం వచ్చి "అమ్మా" అన్నప్పుడు నేనారోజే చెప్పాను అనే మాట రానీయకు. అలా ఉండగలనంటే రేపు వాళ్లోచ్చినప్పుడు మనకీ ఇష్టమే అని చెప్పు, లేదా... నీ ఇష్టం" 


"సరేనండి. నేను మాత్రం అలా ఎందుకంటాను. మరి పిల్లలతో రేపు మీరు మాట్లాడతారా" 


"ప్రదీప్ నోరు తెరవలేదు కదా ఇప్పటివరకూ. రేపు వాడసలు ఏమంటాడో విందాము అప్పుడు చెప్పచ్చు" అన్నారు తాపీగా



Comments