38
"అన్నయ్యా బావ ని తప్ప నేను వేరేవాళ్లని పెళ్ళి చేసుకోలేను. కానీ బావ తో పెళ్ళికి అమ్మ ఒప్పుకునేలా లేదు. మాట వరసకి పెద్ద అత్తయ్యా, బావని అల్లుడుగా చేసుకోమంటేనే అమ్మ చాలా సీరియస్ అయ్యింది. ఇన్నాళ్ళు ఒక చిన్న ఆశ ఉండేది, అదీ పోయిందన్నయ్యా. అమ్మ ని బాధపెట్టి నేను పెళ్ళి చేసుకోను, అలా అని బావని కాకుండా ఎవరిని ఊహించుకోలేను"
"అందుకని అందరికీ దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నావా"
"అన్నయ్యా... అదీ... "
"చెప్పు చిన్నూ...... వెళ్ళిపోదామనుకున్నావా " అని రెట్టించి అడిగాడు.
"ఏమో అన్నయ్యా. అసలేం చేయాలో కూడా తెలీటం లేదు"
"చిన్నూ నేనున్నాను కదరా. అమ్మని ఎలాగైనా ఒప్పించే బాధ్యత నాది"
"సరే అన్నయ్యా, కానీ బావ వచ్చేవరకూ ఏమి మాట్లాడకూ. ఎలాగో వచ్చేస్తాడు కదా"
"సరే చిన్నూ. నువ్వు మాత్రం టెన్షన్ పడిపోయి పిచ్చి పిచ్చిగా ఆలోచించేయకు. నీ డెసిషన్ నీ ఒక్క దానికే కాదు బావ లైఫ్ కూడా. సరేలే పద భోజనం చేద్దాం".
హరీష్ తో ఎలా అయినా మాట్లాడాలని ఎదురు చూసిన స్వాతి కి నిరాశే మిగిలింది. అర్థరాత్రి ఎప్పుడో హరీష్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది.
" స్వీటీ.... అనుకున్న దానికన్నా ముందరే వచ్చేస్తాను. కానీ కొంచం వర్క్ హెవీ గా ఉంది. మాట్లాడటానికి అవదేమోరా. కానీ ఏదో ఒక టైమ్ లో మెసేజ్ చేస్తాను. బెంగ పెట్టేసుకోకు. బాయ్"
"సరే కృష్ణా..... జాగ్రత్త"
"హేయ్..... ఈ టైమ్ లో ఆన్లైన్ ఉన్నావేంటి. కాల్ చేయచ్చా"
"గట్టిగా మాట్లాడలేను కానీ చేయి పర్వాలేదు"
వెంటనే హరీష్ కాల్ చేయగానే, స్వాతి నెమ్మదిగా "బావా చెప్పు"
"ఏమయిందిరా ఇంకా పడుకోలేదు. మీకు ఒంటిగంట అయ్యింది కదా"
"నిద్ర రావట్లేదు. కృష్ణా....... త్వరగా వచ్చేయవా. ఇంట్లో చెప్పకుండా ఇలా టెన్షన్ పడుతూ ఉండటం నా వల్ల కాదు"
"స్వీటీ ఇంట్లో ఏమైనా అన్నారా. నేను ఆల్రెడీ ఇన్ఫోర్మ్ చేసానురా. త్వరగానే వచ్చేస్తాను. ఒక వారం లో రావటానికి ట్రై చేస్తున్నాను. టికెట్స్ దొరకాలి"
"సరే"
"సరే కాదురా, ఏమైందో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది. ఎవరైనా ఏమైనా అన్నారా"
"నన్నెవరూ ఏమనలేదు. అయినా ఏమవుతుంది. అయ్యిందే అనుకో, నువ్వు అక్కడెక్కడో ఉన్నావు. ఏం చేస్తావు"
"ఎందుకో డిస్టర్బ్ గా ఉన్నావ్ కానీ చెప్పటం లేదు. నువ్వెప్పుడూ ఇలా మాట్లాడవురా. నీ గురించీ నాకు తెలుసు. సరే, వచ్చాకే మాట్లాడదాం. ఇక్కడ నుంచి నేనేం చేయగలనో అదే చేస్తాను, మళ్ళీ అప్పుడు నన్ను అనకూ"
"ఏం చేస్తావు"
"చూస్తూ ఉండు ఏం చేస్తానో. సరే నేనుంటానురా. మీటింగ్ ఉంది. నువ్వు జాగ్రత్త. కాల్ చేయటానికి కుదరకపోవచ్చు. త్వరగా వచ్చేస్తాను. టెన్షన్ పడకు దేనికీ. ఏదైనా ఉంటే మెసేజ్ చేయి. దూరంగా ఉన్నంత మాత్రాన దూరం పెట్టకురా. బాయ్"
"బావ, అత్తయ్య గురించీ అమ్మ భయపడుతోంది. అందుకే పెళ్ళికి ఒప్పుకోనంటుందేమో. ఈ మాట నీకెలా చెప్పనూ" అని మనసులోనే అనుకుని ఎప్పటికో నిద్ర పోయింది.
తర్వాత రోజున హరీష్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసాడు.
"చెప్పు హరీ. ఎలా ఉన్నావు. వర్క్ ఎలా ఉంది"
"నాన్నా నేను బానే ఉన్నాను. మీ పక్కన ఎవరైనా ఉన్నారా? "
"ఇక్కడ మేము బానే ఉన్నాము..... ఇప్పుడు చెప్పు. ఒక్కడినే ఉన్నానులే"
"నాన్నా.... ఒక్కసారి స్వాతి వాళ్ళింటికి వెళ్తారా. అక్కడ ఏదో అయ్యిందని అనుమానంగా ఉంది. మీరు అత్తయ్య తో మాట్లాడరా. నేను ఇంకో ఫోర్ డేస్ లో వచ్చేస్తున్నాను. టికెట్స్ దొరికాయి"
"హరీ... నువ్వే ఎలాగో వస్తున్నప్పుడు, అత్తయ్య వాళ్ళతో అమ్మ, నేను కలిసి మాట్లాడితేనే బావుంటుందిరా. స్వాతి ఏమంటుంది"
"నాన్నా, అమ్మతో వెళ్ళే ముందర అసలు అత్తయ్యా అభిప్రాయం కూడా తెలుస్తుంది కదా. అలాగే వాళ్ళింట్లో సిట్యుయేషన్ ఏంటో చూస్తారని. స్వాతితో కూడా నేనొస్తున్నా అని ఇంకా చెప్పలేదు. సర్ప్రైస్ ఇద్దామని. అమ్మకీ ఇప్పుడే ఏమి చెప్పకండి"
"సరే. ఈరోజు రేపట్లో మంచి రోజు చూసుకుని మాట్లాడొస్తాను"
"సరే నాన్నా. కానీ లేట్ చేయకండి. మీరు వెళ్లొచ్చాక మెసేజ్ చేయండి. ఒకసారి అమ్మకి ఇయ్యారా"
వాళ్ళ అమ్మగారితో కొంచం సేపు కబుర్లు చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఆ రోజు బానే ఉందనుకుని, మహేశ్వర రావు గారు సాయంత్రం స్వాతి వాళ్ళింటికి వెళ్ళారు.
పద్మ గారు....."రా అన్నయ్యా. ఎన్నాళ్ళయ్యిందో. అసలిటు రావటమే లేదు" అన్నారు మంచి నీళ్ళు ఇస్తూ
"రిటైర్ అయ్యాకే బిజీ అయిపోయాను. పని లేదు తీరుబడి లేదు. కొంచం ఖాళీ ఉంది, ఇంట్లో ఉండచ్చనుకుంటే మీ ఒదిన ఏదో ఒక గుడి ప్రోగ్రాం పెట్టేస్తుంది" అన్నారు నవ్వుతూ
"ఒదిన ని తీస్కుని రావచ్చు కదా"
"నేను బయట నుంచి వస్తున్నాను. హరీష్ నాకో విషయం చెప్పాడు. తెలియగానే నీతో మాట్లాడదామని ఇటు వచ్చాను. బావగారు లేరా, స్వాతి ఏది" అన్నారు ఇంట్లోకి చూస్తూ
"అది పక్కనెవరో పిల్లలు పిలిస్తే అటు వెళ్ళింది, కాలనీ లోనే. వచ్చేస్తుంది. ఈయన మళ్ళీ టూర్ వెళ్ళారు. చాలా రోజులయినట్లుంది కదా హరీష్ వెళ్ళి. వాడి కబుర్లేంటి"
"ఆ.. ఇంకో వారం రోజుల్లో వస్తాడనుకుంటా. పద్మా.... "
"చెప్పన్నయ్యా.... నాతో మాట్లాడటానికి సంకోచిస్తావేంటి. చెప్పూ"
"పద్మా.... పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. స్వాతి మా ఇంటికి కోడలుగా వస్తుందంటే నాకూ సంతోషమే. నువ్వేమంటావు"
"అన్నయ్యా.... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారా... . " పద్మగారు తను విన్నది నమ్మలేనట్లుగా మళ్ళీ అడిగారు.
ఏ ఇంటికైతే ఇంకొకరి అమ్మాయి కోడలుగా వెళ్తుందంటేనే ఒద్దన్నారో ఆ ఇంటికి తన కూతురే వెల్దామనుకుంటోందా అనే బాధ ఒక వైపు, కూతురు ఇంత విషయం తనకి చెప్పలేదే అనే బాధ మరో వైపు.
" హరీష్ నీకు చెప్పాడు కానీ స్వాతి నాతో ఒక్క మాట కూడా అనలేదు" అన్నారు బాధగా
"స్వాతి పరీక్షలు అవగానే ఇద్దరూ కలిసి మీతో చెప్పాలనుకున్నారు. కానీ ఇప్పుడేమో వాడు ఊళ్ళో లేడు. అందుకే నాకు చెప్పి, నీతో మాట్లాడమని పంపించాడు. రాగానే వాడే వస్తాడు. ఇప్పుడు నేనొస్తున్నట్లు కూడా స్వాతికి తెలీదు"
"అన్నయ్యా.....నన్ను తప్పుగా అనుకోవద్దు. ఈయన్ని అడక్కుండా నేనేమి చెప్పలేను. వదిన కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి కదా అన్నయ్యా. స్వాతి చిన్న పిల్ల..."
పద్మ గారు బయటకి చెప్పకపోయినా, చెల్లెలి భయం అర్థం అయ్యినట్లుగా, "మీ వదిన ఒప్పుకున్నాక మేము మళ్ళీ వస్తాము. తనే అడిగితే, నీకు అభ్యంతరం లేదు కదా"
"ఈయన కూడా ఒప్పుకోవాలి కదా. నేను ఈయనతో మాట్లాడి చెప్తాను"
"సరేనమ్మా. నేనూ బయల్దేరుతాను. ఈసారి మీ వదినే వచ్చి మాట్లాడ్తుంది. అప్పటికైనా నీ భయాలు తగ్గుతాయేమో" అంటూ లేచీ బయల్దేరారు.
అప్పటి వరకూ వాళ్ళ మాటలు బయట నుంచిని విన్న స్వాతి, ఆయన బయటకి వస్తుంటే అక్కడ నుంచి బయటకి వెళ్ళిపోయింది. ఆయన ఇంట్లో నుంచి బయటకి వచ్చి, స్వాతి ని చూసీ ఆప్యాయంగా తల మీద చేయి వేసి " ఎలా ఉన్నవురా" అని అడిగారు
"ఏమి బాలెను మావయ్యా" అంది కళ్ళలో నీళ్ళని ఆపుకుంటూ
"రా ముందు కార్ ఎక్కు. నిన్ను మళ్ళీ దింపేస్తానులే" అంటూ కార్ లో తనని తీస్కుని వెళ్ళారు.
కొంచం దూరం వెళ్ళి, కార్ ఆపి...."ఇప్పుడు చెప్పు ఏమయిందమ్మా. ఎందుకు బాధపడ్తున్నావు"
"మావయ్యా..... అమ్మ పెళ్ళికి ఒప్పుకునేలా లేదు. భయంగా ఉంది. అమ్మ మాట కాదని పెళ్ళి చేసుకోలేను మావయ్యా. అలా అని బావకి దూరంగా ఉండలేను"
"పిచ్చితల్లీ..... మేమున్నాము కదరా. ఏమి బాధపడకు. మీ అమ్మ ని ఒప్పించే బాధ్యత మాది"
"సరే. మావయ్యా.... బావకి ఇప్పుడే ఏమి చెప్పకండి ప్లీజ్. తనెలాగో వచేస్తానన్నాడు కదా. ఇప్పుడే చెప్పి ఎందుకు టెన్షన్ పెట్టటం, దూరాన ఉన్నాడు."
"అలాగే. వాడి గురించి ఎంత ఆలోచిస్తున్నావురా నవ్వు. నిన్ను ఇంటి దగ్గర దింపి నేను వెళ్తాను"
"పర్వాలేదు మావయ్యా. నేను వెళ్తానులే. కానీ బావకి చెప్పకండి" అంటూ కార్ దిగీ ఇంటికి వెళ్ళింది బాధగానే
స్వాతి లోపలికి వెళ్తూనే, పద్మ గారు చాలా కోపంగా, "నువ్వేం అనుకుంటున్నావు అసలూ. ఏదైనా ఉంటే ఇంట్లో చెప్పటం ఉందా లేదా. నీకు హరీష్ అంటే ఇష్టమని ఒక్కసారైనా నాతో చెప్పావా. ఎక్కడో వాడెవడో ఏడిపిస్తే నాతో చెప్పినదానివి ఇంత పెద్ద విషయం చెప్పాలనిపించలేదా. నువ్వేది అడిగినా సరే అంటూ ఒప్పేసుకుంటాము అనుకుంటున్నావా. ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను"
"అమ్మా.... "
"నీకు స్వేచ్ఛ ఇచ్చాము కదా, మాదే తప్పు. ఇప్పుడు మీ నాన్న కి ఏం సమాధానం చెప్పాలి మేము. ఆ మనిషి నిన్ను బాధపెడుతున్నాడని నిన్ను గొప్పగా పెంచాలని ఇక్కడకి తీసుకోచ్చాము. ఈ ఒక్క పనితో ఆయన ముందర మా పరువు తీసెసావు. ఏ మొహం పెట్టుకుని మీ నాన్నకి చెప్పాలి?? అసలు ఎవరిని ప్రేమించావన్నదానికైనా మాతో చెప్పలేదన్నందుకే బాధగా ఉంది...... " అని బాధగా అని లోపలికి వెళ్ళిపోయారు.
కొద్దిసేపటికి, ప్రదీప్ ఇంటికి వచ్చి, "చిన్నూ ఆఫీస్ వర్క్ కొంచం ఉంది. లోపల ఉంటాను. అమ్మని కొంచం కాఫీ ఇయ్యమనవా" అని "ఏంటిరా నువ్వలా ఉన్నావు. ఏమైంది"
"ఏంలేదన్నయ్యా. మంచినీళ్ళు తీసుకొస్తా అంటూ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి, వాళ్ళ అమ్మగారికి ప్రదీప్ కి కాఫీ కావాలని చెప్పి మరో మాట అనకుండా తన రూమ్ లో కి వెళ్ళిపోయింది.
ఆ రాత్రికి ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. తెల్లవారుఝామున హరీష్ ఫోన్ చేస్తుండటంతో ప్రదీప్ కి మెలుకువొచ్చింది.
"చెప్పు బావ"
"సారీ బావ పొద్దునే డిస్టర్బ్ చేసాను"
"పర్వాలేదు బా.... ఏంటి సంగతులు" అన్నాడు ఆవులిస్తూ
"బావ సంగతులు ఏమి లేవు. నేను రేపు అవుట్ ఆఫ్ నెట్వర్క్ లో ఉంటాను. స్వాతికి మీ నైట్ నుంచి కాల్ చేస్తుంటే కాల్ కట్ చేస్తోంది. ఇంట్లో ఏమయినా అయ్యిందా ఏంటని కాల్ చేసాను"
"నాకు తెలిసి అలాంటిదేమి లేదు బావ. నిన్న నేనూ కొంచం వర్క్ లో బిజీ గా ఉన్నాను. అసలెవరితోను మాట్లాడలేదు. అమ్మ డిన్నర్ కూడా రూమ్ లోనే ఇచ్చేసింది.........బావ, చిన్నూ అసలేం చెప్పింది నిన్న"
"ఏమి చెప్పలేదు బావ. నా ఫోన్ ని కట్ చేస్తోంది. మెసేజ్ చేస్తుంటే చూస్తోందని తెలుస్తోంది కానీ రిప్లై లేదు. ఇందాకటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యినట్లుంది. అందుకే నీకు కాల్ చేశాను. బావా నువ్వైనా నిజం చెప్పు, ఏమయ్యిందీ"
"ఏమిలేదు బావ, నిజంగానే చెప్తున్నా. చిన్నూ తో కాల్ చేయిస్తాలే" అంటూ ఫోన్ పెట్టేసాడు ప్రదీప్
"చిన్నూ.." అంటూ స్వాతి రూమ్ లో కి వెళ్ళి పిలిచాడు
ప్రదీప్ వస్తున్న అలికిడి అవటంతో ముసుగు తన్నేసి పడుకున్నట్లుగా.... "ఏంటన్నయ్యా" అంది దుప్పటి తీయకుండా
"చిన్నూ... బావ ఫోన్ చేస్తున్నాడట కదమ్మా. ఒక్కసారి మాట్లాడు. కంగారు పడ్తున్నాడు. మళ్ళీ రేపు నెట్ ఉండదుట. మాట్లాడేసి పడుకోరా"
"సరేలే.... చేస్తాను" అంటూ చేయి బయట పెట్టి ఫోన్ వెతుక్కుని ముసుగులో నుంచే కాల్ చేసింది
"ఆ బావా చెప్పు"
ప్రదీప్ ఫ్రెష్ అవటానికి తన రూమ్ లో కి వెళ్ళిపోయాడు.
"ఏమయిందిరా కాల్ కట్ చేస్తున్నావ్ రాత్రి నుంచి. ఆన్లైన్ ఉన్నా మెసేజ్ లేదు. నువ్వసలు రాత్రి పడుకున్నావా" హరీష్ అప్పటి వరకు పడ్డ టెన్షన్ తో మాట గట్టిగా వస్తోంది.
స్వాతి ముసుగు తీసి, "బావ.... పడుకోలేదని తిడతావని రిప్లై చేయలేదు. ఏమవుతుందీ అంత టెన్షన్ పడటానికి. ఏంటి బావా ఎప్పుడూ లేనిది నువ్వూ నా మీద అరుస్తున్నావు"
"సారీ రా...... ఫోన్ తీయకపోయేసరికి, అత్తయ్య నిన్నేదయినా అందేమో, నువ్వు ఫోన్ అందుకే తీయటం లేదేమో అనుకుంటూ ఏవేవో ఆలోచించేసానురా. మనసులో ఇదీ రీసన్ అని చెప్పలేను కానీ ఏదో అలజడిగా ఉంది. నువ్వు బానే ఉన్నావా"
"బానే ఉన్నాను బావ. అయినా అలా ఖంగారు పడిపోతే ఎలా. అవునూ ఏంటీ రేపు నెట్ ఉండదా"
"ఉండదురా. ఎల్లుండి వస్తాను. "
"సరే బావ. జాగ్రత్త నువ్వు. ఉంటా" అని ఫోన్ పెట్టేసి,
" బావ నేను కొంచం డల్ గా మాట్లాడేసరికి అప్పటి వరకు అరిచినవాడివి మళ్ళీ నువ్వే ఫీల్ అయ్యి సారీ చెప్పేస్తున్నావ్. ఇక్కడ నేను బాధ పడితే అక్కడ నీ మనసుకి బాధ తెలుస్తోంది. కాని బావా, ఇప్పుడు అమ్మ ఒప్పుకున్నా నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను. ఈ విషయం నీకు చెప్పే ధైర్యం నాకు లేదు."
Comments
Post a Comment