37
స్వాతి మెల్లగా కోలుకుంది. కానీ రాత్రయితే మాత్రం చాలా భయపడేది. ఒక్కో సారి అమ్మ దగ్గర చిన్న పిల్లలాగా దూరిపోయి పడుకునేది ఇంకోసారి ప్రదీప్ కి ఏదో అయిందన్నట్లుగా భయపడి అతని రూమ్ లో ఒక మూలగా కూర్చుని తనకేమి కాకూడదనుకుంటూ అలా చూస్తూ ఎప్పటికో నిద్ర పోయేది.
రోజూ పరీక్షలు కోసం తను కష్టపడుతుంటే, ఒక పక్క ఆఫీస్ వర్క్ మరో పక్క స్వాతికి అర్థం కానీ టాపిక్స్ ఉంటే చెప్తూ, తన మనసుని చదువు వైపు మళ్లించటానికి స్వాతికన్నా ఎక్కువ హరీష్ కష్టపడ్డాడు.
స్వాతి "బావా... నీకసలూ మంచి మార్క్స్ రావాలి అని అంత పట్టుదలెందుకు. పాస్ అయితే సరిపోదా"
హరీష్.... "మంచి మార్క్స్ రావాలని కాదు నువ్వు ఒక పని మొదలుపెడితే నీ 100% ఇచ్చి, దానికోసం కష్టపడాలి, అయినా మార్క్స్ రాలేదంటే అప్పుడు నీ తప్పు లేదు, ఎక్కడో ఏదో అయ్యింది. నేను మనస్ఫూర్తిగా చదివాను అనే సాటిస్ఫాక్యిన్ ఉంటుంది"
"సరే"
"ఏంటి సరే..... వీడు మళ్ళీ క్లాస్ మొదలెట్టాడు అని తిట్టుకుంటున్నావా"
"హహహ.... కాదులే. నువ్వన్న మాట నాకు నచ్చిందీ, ఒక పని మొదలుపెడితే నా 100% దానికే ఇయాలి అని.... అందుకే నేనూ నా లైఫ్ లో నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ అయ్యాను. ఎప్పటి నుంచో నీకెలా చెప్పాలా అనుకున్నా"
"అది నేను నీకెప్పుడో చెప్పాను. నీ ఇష్టం అని. ఏది డిసైడ్ చేసుకున్న సపోర్ట్ చేస్తాను అని. ఇంక మరి ఆలోచించటానికి ఏముందీ నాకు చెప్పటం కోసం. ఇంతకీ, ఏం డిసైడ్ అయ్యావు"
"ఎగ్జామ్స్ అవగానే నెక్స్ట్ గోల్ పెళ్ళి"
"అదెలాగో అనుకున్నదే కదా"
"నాకు అదే ఫైనల్ గోల్. నిన్ను చేరుకోటం. ఆ తర్వాత నా 100% కాన్సంట్రేషన్ నీదే. జాబ్, చదువు అంటూ డైవర్ట్ అవటం ఇష్టం లేదు"
"జాబ్ చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేయరంటావా"
"కాదు బావా.... నాకు ఇష్టం లేదన్నాను. నా అటెంషన్ నీకే, వర్క్ టెన్షన్, ఎగ్జామ్స్ టెన్షన్లు ఏమి లేకుండా నీతో హ్యాపీగా ఉండాలి, అంతే. ఇది ఇప్పుడు కాదు, ఎప్ప్పుడో అనుకున్నది. నీకోసమే నేను, నాకింకేమి ఒద్దు.
"స్వీటీ..... లవ్ యూ రా. నీ అంత బాగా నేను చెప్పలేను. ఎలా చెప్పాలో కూడా తెలీదు. నా ప్రేమనంతటిని లవ్ యూ అని రెండుపదాల్లో మాత్రమే చెప్పగలను.
"కృష్ణా.... నీ మనసులో ప్రేమ, అక్కడున్న నాకు, తెలీదా "
హరీష్ నవ్వి "స్వీటీ.... నీకు ఏది నచ్చితే అది చేయరా, నువ్వు హ్యాపీగా పక్కనుంటే చాలు నాకు"
"సరే అయితే మరి మీ ఆఫీస్ లో నీ పక్కనే జాబ్ ఇప్పించు. అప్పుడు ఇంట్లో, ఆఫీస్ లో 24 / 7 నీతోనే ఉంటాను" అంటూ నవ్వింది
"నువ్వు చేస్తానంటే తప్పకుండా ట్రై చేద్దాము. అప్పుడు ఇద్దరమూ కలిసి వెళ్ళి రావచ్చు. ఎంత బావుంటుందో"
"అప్పుడు కానీ ఆరు నెలలకి అవ్వాల్సింది నెల రోజుల్లోనే నేనంటే బోర్ కొట్టేస్తుంది. ఏం అక్కర్లేదు"
"బోర్ ఎందుకురా. అలా ఎప్పటికి అవ్వదు. సరే జాబ్ సంగతి తర్వాత ముందు ఎగ్జామ్స్ రాయి. చదువుకో. బ్రెయిన్ కి కొంచం సేపు బ్రేక్ ఉంటుందని కాల్ చేసాను. మళ్ళీ మాట్లాడతాలే. బాయ్" అంటూ ఫోన్ పెట్టేసాడు
ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ప్రదీప్ కి నచ్చచెప్పి తనని రావద్దని వాళ్ళ నాన్నగారితో ఎగ్జామ్స్ కి వెళ్ళేది. ప్రదీప్ కి కూడా తన భయం అర్ధమయ్యి, ఏమి మాట్లాడలేదు.
ఒక రోజు పద్మ గారు, రామ్ గారితో.... "ఏవండీ పొద్దున్న వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు అవుతున్నాయంటే వెళ్లాను కదా. అక్కడ, స్వాతి ఫ్రెండ్ మనోజ్, వాళ్ళ అమ్మ నాన్న గారు కనిపించారు. మాటల్లో, స్వాతి కి సంబంధాలు చూస్తున్నామని చెప్పాను"
"ఓహ్... సరే. నేనూ మా ఫ్రెండ్స్ లో చెప్పి పెట్టాను పద్మా. తెలిసినవాళ్ళైతే మంచిదని నా ఉద్దేశం"
"అదే..ఆవిడ స్వాతి ని వాళ్ళ అబ్బాయికి అడిగారు. నేనేమి మాట్లాడలేదు. మిమ్మల్ని అడిగి చెప్తాను అని వచ్చేసాను"
"అదేంటి పద్మా. ఆ అబ్బాయి మన స్వాతి తోటి వాడు. అతనికి ఇంకా జాబ్ కూడా లేదు. అలా ఎలా చేయగలము. అది కాకుండా అంటే, పిల్లాడు మంచివాడే. చూస్తున్నాను కదా ఎగ్జామ్ సెంటర్ లో.
"ఆ అబ్బాయి కి మొన్న క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాడు. అదేదో కంపెనీ అండి. "గుడిలో మాట్లాడుతున్నాం అని ఏమనుకోకండి. మాట వచ్చింది కాబట్టి అడిగాము. అసలైతే అబ్బాయి కి ఇంక చూడటం లేదు, కానీ స్వాతి మాకు బాగా తెలిసిన అమ్మాయి. మీ కుటుంబం గురించి తెలుసూ. అందుకే సంబంధం కలుపుకోవచ్చని అడిగాము" అన్నారు"
"సరే పద్మా. ఒకసారి స్వాతి ని కూడా అడిగి మాట్లాడదాములే"
"ఇప్పుడెలాగో పరీక్షలవుతున్నాయి కదా. అయ్యాక మాట్లాడచ్చులెండి. ఆవిడకి అదే చెప్పాను. పరీక్షల తర్వాత ఇంట్లో అడిగి చెప్తా అని"
"సరే. నువ్వెందుకు అలా ఉన్నావు. నా అభిప్రాయం అడిగావు కానీ నీకు ఈ సంబంధం ఇష్టం లేదా"
"ఈ సంబంధం గురించి కాదు..... స్వాతి కి ఇప్పుడే పెళ్ళి చేయాలంటారా"
"అదేంటి పద్మ. ఎందుకు ఇదే మాట అంటున్నావు ముందర నుంచి. నీ ఉద్దేశం ఏంటో సరిగ్గా చెప్తే కదా తెలిసేది"
"ఏమోనండి. రెండు మూడేళ్ళవరకూ దానికి అస్సలు బాలేదన్నారు కదా. ఇలాంటి టైమ్ లో పెళ్ళి అంటే ఏమవుతుందో అని భయం గా ఉంది. చిన్నప్పుడు, తండ్రి దగ్గరే ఉండాలని తీసుకెళ్లిపోయారు. కష్టాలు పడింది. మళ్ళీ మన దగ్గరకి వచ్చాకే సంతోషంగా ఉంది. ఇప్పుడు పెళ్ళి వంక తో పంపించేస్తే ఎలా ఉంటుందో. పోనీ, ఇల్లరికం తెచ్చుకుందాము. మన పిల్ల మనతోనే ఉంటుంది"
"పద్మా నువ్వేనా ఇలా మాట్లాడేది. ఇంట్లో అందరికంటే ధైర్యంగా ఉండేది నువ్వు, పిల్లలకి ఏదొచ్చినా వాళ్ళతో గట్టిగానొ బుజ్జగించో సమస్యలని ఎదుర్కోవటం నేర్పించే నువ్వు ఈరోజు ఇలా ఏదో జరుగుతుందేమో అంటూ బెంగపడిపోతావా"
" తల్లినండి. బెంగా ఉండదా. ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా భయంగానే ఉంది"
"స్వాతికి అంతా మంచే జరుగుతుంది. ఖంగారు పడకు. మన ప్రయత్నం మనం చేద్దాము. మనోజ్ తెలిసిన పిల్లాడు. స్వాతి అంటే అభిమానముంది. చూద్దాము, పిల్లల ఇష్టాలు కలవాలి కదా ముందర. ఆ తర్వాత సంగతి "
"సరే అండి"
ఎగ్జామ్స్ అయిపోయిన చివరి రోజున సంతోషంగా ఇంటికి వచ్చేసరికి, పద్మగారి పెద్ద అన్నయ్య వదిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు.
"ఏంటి స్వాతి, పరీక్షలు ఎలా రాసావు"
"బాగా రాసాను పెద్ద అత్తయ్యా"
"మీరు ఎలా ఉన్నారు. పెద్ద బావా, అక్కా, పాపా ఎలా ఉన్నారు "
"అందరూ బావున్నారు స్వాతి"
"పరీక్ష అయిపోయాక ఫ్రెండ్స్ తో సరదాగా బయటకి వెళ్లకుండా ఇంటికి వచ్చేసావా బుద్ధిగా"
"నాన్న పక్కనే ఉంటే ఇంకెక్కడికి వెళ్తాను మావయ్యా" అంది రహస్యం చెప్తున్నట్లు
"ఆ.... లేకపోతే వెళ్ళిపోయేటట్లేను" అన్నారు పద్మగారు వాళ్ళ రహస్యం విన్నారనట్లుగా
రామ్ గారు కొంచం సేపు కూర్చుని ఆఫీస్ లో పనుందని వెళ్లిపోయారు. పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటున్నారని స్వాతి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది.
"ఇంకేంటి పద్మా.... దీనికి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా"
"మొదలుపెట్టాము అన్నయ్యా"
"వేరే ఏవో చూడటం ఎందుకు, ఎలాగో తమ్ముడి కూతుర్ని కోడలుగా తెచుకుంటున్నావు కదా, మీ చిన్న అన్నయ్య కొడుకుని అల్లుడిగా చేసుకో" అన్నారు పద్మ వాళ్ళ వదినగారు నవ్వుతూ
పద్మ గారు "చాల్లే వదిన..... నాకా సంబంధం అస్సలు ఇష్టం లేదు. చిన్నోదిన మాట చాలా కరుకు. ఇప్పటి వరకు మాకు అపురూపంగా చూసుకున్నాము. దీని నెమ్మది కి ఆవిడ కరుకుదనం కి సరిపడదు వదిన. అందులోను మనంతట మనం వెళ్ళి అడిగామానుకో, ఇంకా కొండెక్కి కుర్చుంటుందావిడ. నేనస్సలు ఒప్పుకోను వదిన"
"సరేలే పద్మా. అదేదో సరదాగా అంది. నువ్వు పట్టించుకోకు. ఆవిడ సంగతి, మాకు మాత్రం తెలీదా"
"అయ్యో.... వదిన అందని కాదులే అన్నయ్యా. మాటొచ్చింది కాబట్టే నేనూ మాములుగా చెప్పాను" అన్నారు పద్మ గారు వాళ్ళ వదిన చేతిని పట్టుకుని
సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రదీప్ ఆఫీస్ నుంచి వస్తూనే....
"చిన్నూ ....... ఎలా రాసావ్ రా"
"అదిప్పటి వరకూ కంప్యూటర్ ముందర కూర్చుని ఇప్పుడే మేడ మీదకి వెళ్ళిందిరా" అన్నారు వాళ్ళ అమ్మగారు మంచి నీళ్ళు ఇస్తూ
తనూ ఫ్రెష్ అయ్యి మేడ మీదకి వెళ్ళాడు.
"చిన్నూ ఏం చేస్తున్నావ్ రా ఇక్కడా. మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయాయి, కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ డే కోసం వెయిటింగ్ కదా"
స్వాతి సమాధానంగా నవ్వి ఊర్కుంది, ఏమి మాట్లాడలేదు. ప్రదీప్ అనుమానంగా స్వాతి వైపు చూసాడు కానీ తనకి ఏమి తెలీలేదు.
"ఇంతకీ బావ ఎప్పుడొస్తున్నాడు"
"ఏమో అన్నయ్యా పదిహేను రోజులు పట్టచ్చేమో. అన్నయ్యా నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను, రెండేళ్లు ఆగుతాను అన్నాననుకో, నువ్వు పెళ్ళి చేస్కుంటావా, ఆగుతావా? "
"నువ్వు ఆగుతానన్నా మా బావ ఆగేలా లేడులే"
"నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతే తను మాత్రం ఏం చేస్తాడు, ఐ మీన్ యు.స్, యు.కే లేకపోతే వైజాగ్, చెన్నై... ఎక్కడో అక్కడికి"
"నువ్వెక్కడికెళ్ళినా బావ నీ ముక్కు పట్టుకుని లాక్కొచ్చి మరీ పెళ్ళి చేస్కుంటాడు. ఇన్నాళ్ళు సతాయించేసి పారిపోతే ఊరుకుంటాడేంటి. అయినా నువ్వెక్కడికి వెళ్ళిపోతావు" ప్రదీప్ అంటున్నాడే కానీ స్వాతిని గమనిస్తూనే ఉన్నాడు. కానీ తనకి స్వాతి మనసులో ఏం ఉందొ తెలీయలేదు.
స్వాతి మళ్ళీ నవ్వింది. "జాబ్ ఎక్కడొస్తే అక్కడికి. ఇందాకే రెస్యూమ్ ప్రిపేర్ చేసాను. కొన్ని ఓపెనింగ్స్ పడ్డాయి, పంపించాను. చూడాలి"
"జాబ్ ఏంటి సడన్ గా. ఏమయిందిరా. ఎందుకలా మాట్లాడ్తున్నావు"
"అన్నయ్యా బావ ని తప్ప నేను వేరేవాళ్లని పెళ్ళి చేసుకోలేను. కానీ బావ తో పెళ్ళికి అమ్మ ఒప్పుకునేలా లేదు. మాట వరసకి పెద్ద అత్తయ్యా బావని అల్లుడు చేసుకోమంటేనే అమ్మ చాలా సీరియస్ అయ్యింది. ఇన్నాళ్ళు ఒక చిన్న ఆశ ఉండేది, అదీ పోయిందన్నయ్యా అమ్మ ని బాధపెట్టి నేను పెళ్ళి చేసుకోను, అలా అని బావని కాకుండా ఎవరిని ఊహించుకోలేను"
"అందుకని అందరికీ దూరం గా వెళ్ళిపోదామనుకుంటున్నావా" గట్టిగా అడిగాడు ప్రదీప్
Comments
Post a Comment