35
"చిన్నూ.... బావ మెసేజ్ చేశాడా. సేఫ్ గా రీచ్ అయ్యాడా, ప్రాబ్లెమ్ ఏమి కాలేదు కదా"
"ప్రాబ్లెమ్ ఏమి అవలేదుట అన్నయ్యా. ఎయిర్పోర్ట్ కి వాళ్ళ కంపెనీ వాళ్లొచ్చి పిక్ చేసుకున్నారు. తనతో పాటు ఇంకో అమ్మాయితో కలిసి గెస్ట్ హౌస్ లో ఉంటారు, బెంగళూరు నుంచి వెళ్ళిందిట" అని హరీష్ చెప్పిన విషయాలన్నీ చెప్పింది స్వాతి
"సరే, కానీ చిన్నూ మీ మధ్యన అనుమానాలతో గొడవలు తెచ్చుకోకు. బావ గురుంచి నీకు బాగా తెలుసు" అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు
స్వాతి "అవును నిజమే. బావ గురుంచి నాకు తెలుసు. తనని ఎంతమందైనా కావాలనుకోవచ్చేమో కానీ తను నన్ను ప్రేమిస్తున్నాడు కదా" అని తనలో తనే నవ్వుకుంది
ఒక రోజు హరీష్ కాల్ చూసీ స్వాతి సంతోషం గా "బావా ఎన్నాళ్ళయ్యిందో మాట్లాడీ, ఎలా ఉన్నావు"
"బావున్నానురా. ఈ టైమ్ డిఫరెన్స్ వలన కాల్ చేయటానికి కుదరటం లేదు. నువ్వెలా ఉన్నావు"
"బావున్నాను. నువ్వడక్కుండానే చెప్పేస్తా.... బాగా చదువుతున్నాలే. నీ కోచింగ్ కదా. ఇంకా చెప్పు. నీ వర్క్ ఎలా ఉంది. మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది"
"ఓయి గర్ల్ ఫ్రెండ్ ఎవరే"
"ఒకే రూమ్ లో ఉంటున్నారు కదా "
"రూమ్ లో కాదు, ఒకే ఇంట్లో ఉంటున్నాము"
"అదేలే ఏదో ఒకటి. నాతో కైనా తనతోనే ఎక్కువుంటున్నావ్ కదా"
"నువ్విప్పుడెక్కడున్నావ్"
"కాలేజీ బయట. రమ్య కోసం వెయిటింగ్"
"సరే వీడియో కాల్ తీయి" అంటూ వీడియో ఆన్ చేసాడు హరీష్
"ఏయ్..... కృష్ణా ఎలా ఉన్నావు. ఎన్నాళ్ళయ్యిందో చూసీ"
"స్వీటీ లవ్ యూ రా. మిస్సింగ్ యూ సో మచ్... "
హరీష్ ని చాలా రోజులకి చూసేసరికి స్వాతి కళ్ళు తడుస్తుంటే అవి కనిపించనీయకుండా "ఓయి హాటీ.... అసలే నీకు ఫాన్స్ ఎక్కువ ఇక్కడా. ఆగు" అని కళ్ళు తుడుచేసుకుని పక్కకి తిరిగి,
"బావా ఆఫీస్ కి వెళ్ళాలా. ఎప్పుడు వెళ్తావు రోజూ"
"ఇంకా టైమ్ ఉందిరా. సరే... మా రూమ్ చూస్తావా" అంటూ తను ఉండే ప్లేస్, బయటకి ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తూ ఆ అమ్మాయిని కూడా పరిచయం చేసాడు
స్వాతి కొంచం సేపు మాట్లాడి, "బావా రమ్యా వాళ్ళు వస్తారు నేను పెట్టనా"
"సరే రా, జాగ్రత్త"
"కృష్ణా"
"హహ... చెప్పూ "
"ఎందుకూ నవ్వావు పిలిస్తే"
"నవ్వటం కాదురా, నువ్వలా పిలిస్తే బావుంటుంది. చెప్పూ"
"నువ్విప్పుడు వీడియో కాల్ ఎందుకు చేసావు"
"నిన్ను చూడటానికి.... అలాగే నువ్వూ ఇక్కడ నా రూమ్ అవీ చూస్తావని చేసాను"
"అంతేనా లేక ఆ అమ్మాయి రూమ్ వేరే అని చూపించి ఆ అమ్మాయిని పరిచయం చేయటానికా"
"అంటే అది కూడా ఒక రీసన్ అనుకోలే, నువ్వు చెప్తే నమ్మటం లేదు కదా"
"హహహ.... మా బుజ్జి కృష్ణా.... నువ్వు నా బంగారం రా, నువ్వెంటో నాకు తెలీదా. వేరే రూమ్ లో కాదు, నీ రూమ్ లోనే ఉన్నా నాకు నీ మీద నమ్మకముందిరా"
"హమ్మయ్యా ఆ మాట అన్నావు బ్రతింకించావ్..... అవునూ ఏమన్నావ్ 'రా' నా "
"గమనించేసావా.... హహ... అయినా నీ మీద నమ్మకముంది కానీ అవతల వాళ్ళు నిన్ను ఏమైనా చేసేస్తారేమో అని భయం కృష్ణా" అంటూ చిలిపిగా నవ్వింది. "సరే బావా ఉంటాను. రమ్య వస్తే మీటింగ్ కి రాలేదని మళ్ళీ అరుస్తుంది"
"ఏం మీటింగ్ రా"
"అదీ... కాలేజ్ ఫెస్ట్ ఉందీ, దాంట్లో కల్చరల్ అంత రమ్యా హేండిల్ చేస్తోంది. అదేమో దానికి తోడు అంటూ, నన్ను లాక్కెళ్ళింది"
హరీష్... " సరే. ఫోటోస్ పెట్టు"
"అలాగే. బాయ్. కృష్ణా "
"సరే. నువ్వూ జాగ్రత్త. లవ్ యూ" అని ఫోన్ పెట్టేసారు ఇద్దరూ. కానీ వీళ్ళకి తెలియనిది, అప్పటికే స్వాతిని చాటుగా ఒకరు గమనిస్తున్నారు.
స్వాతి కల్చరల్ ఈవెంట్స్, ఎగ్జామ్స్ ప్రేపరషన్ తో బిజీ అయిపోయింది. హరీష్ కూడా తన ప్రాజెక్ట్ లో తలమునకలవుతున్నాడు.
"స్వీటీ కుదిరినప్పుడు కాల్ చేయవా. నీతో మాట్లాడాలి. నువ్వెప్పుడూ ఫ్రీ అయితే అప్పుడే. నాకు లేట్ అయినా పర్వాలేదు"
నిద్రలేస్తూనే హరీష్ మెసేజ్ చూసీ ఏమయిందో అనుకుంటూ స్వాతి ఫోన్ చేసింది
"గుడ్ మార్నింగ్ స్వీటీ. ఇప్పుడే లేచావా"
స్వాతి ఆవులిస్తూ "అవును కృష్ణా. లేస్తూ ఉన్నా. చెప్పు"
"మీ కాలేజ్ ఫంక్షన్ ఎప్పుడురా"
"ఈరోజే... ఈవెనింగ్ "
"సరే.... ఎంజాయ్ చేయి మంచిగా. మరి ఈవెనింగ్ అంటే లేట్ అయిపొతుందెమో ఇంటికి వచ్చేసరికి, ఎలా వస్తావురా"
"అన్నయ్య కూడా వస్తున్నాడు. కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కదా. తను ఉంటాడు. సరే కానీ నువ్వు ఇది అడగటానికి చేయమనుండవు, ఏంటి సంగతీ. రేపే బయల్దేరుతున్నావా. వచేస్తున్నావా" అంది ఉత్సాహంగా
హరీష్ బాధగా "కాదురా, దానికి రివర్స్ లో ఇంకో మంత్ ఎక్స్టెండ్ అయ్యింది. ముందర నుంచి డౌట్ గానే ఉండింది. ఎలా అయినా ఫినిష్ అవ్వాలని చాలా ట్రై చేసాను. కుదరలేదురా"
"....."
"స్వీటీ??? "
"ఆ బావా... ఉన్నాను"
"ఏదో ఒకటి మాట్లాడు"
"ఏం మాట్లాడాలి బావా. ఏమి తెలీటం లేదు. సరేలే. ఫీల్ అవకూ. వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. మనమెలాగో మాట్లాడుకుంటున్నాం, చూసుకుంటూనే ఉన్నాము కదా. ఇప్పుడన్నీ ఫినిష్ చేస్కుని వచ్చేసావనుకో, తర్వాత వచ్చాక సరదాగా స్పెండ్ చేయచ్చు. సరేనా"
"ఆ "
"ఏంటి ఆ.... అంత డల్ గా. నవ్వు"
"సరే "
"ఇంతకీ ఈ విషయం నీకు ముందరే తెలుసా, మరి నాకెందుకు చెప్పలేదు"
"ఇలా అవచ్చేమో అనుకున్నానురా. డౌట్ ఉందని చెప్పి, నీ మూడ్ పాడు చేయటం ఎందుకని చెప్పలేదు. ఇందాకే తెలిసిందీ. తెలియగానే మెసేజ్ చేసాను"
"సరేలే కృష్ణా నేనేదో సరదాగా అన్నాను"
"సరే... లేచీ ఫ్రెష్ అవ్వు. ఎప్పుడు బయల్దేరుతావు"
"వెళ్ళటం మధ్యాహ్నం వెళ్తాను, నైట్ అన్నయ్య తో వచ్చేస్తాను. ఈరోజు మళ్ళీ మెసేజ్ చేయటానికి అవ్వదేమో"
"పర్వాలేదురా. నువ్వు చక్కగా ఎంజాయ్ చేయి. ఫోటోస్ తీస్కో. సరేనా. హావ్ ఫన్" అని ఫోన్ పెట్టేసాడు
స్వాతి ఫ్రెష్ అయ్యి పెరట్లో కూర్చుంది. ప్రదీప్..... "ఏంటిరా అలా ఉన్నావు"
"బావకి ఇంకో మంత్ పట్టచుట అన్నయ్యా రావటానికి"
ప్రదీప్ నవ్వుతూ... "అక్కడ బాగా నచ్చేసిందా. రానంటున్నాడేంటి"
"అదే కదా" అంది మొహం వేలాడేసుకుని
"చిన్నూ.... సరదాగా అన్నాను.. నువ్వెలాగో ఎగ్జామ్స్ హడావిడిలో ఉంటావు. తనొచ్చినా నీకు టైమ్ ఉండదూ. ఇప్పుడైతే చక్కగా ఎగ్జామ్స్ అయ్యేసరికి తనూ వచ్చేస్తాడు, రాగానే ఇంట్లో చెప్పేసి ఇంక తర్వాత పెళ్ళే"
స్వాతి నవ్వుతూ... "నా పెళ్ళి కోసమా... నీ పెళ్ళి కోసమా తొందరా"
"చిన్నూ.... నీకు బాగా మాటలొచ్చాయిరా. నీ పెళ్ళి కోసమే ఆలోచించేది. నా గురించేమీ కాదు"
ఇంతలో పద్మ, రామ్ గార్లు కూడా అక్కడికొచ్చి అందరూ కూర్చున్నారు. స్వాతి వాళ్ళ నాన్నగారి కుర్చీ దగ్గర కింద కూర్చుని ఆయన ఒళ్ళో తల పెట్టుకుంది. అయన తన తల నిమురుతూ
"ఏంటిరా బంగారు"
"ఏమో నాన్నా. ఏదో గా ఉంది. చాలా భయంగా... ఏమవుతుందో....."
ప్రదీప్, వాళ్ళ అమ్మ, నాన్నగారు ముగ్గురూ తన మాటలకి అయోమయంగా చూసీ, ప్రదీప్.... "ఈరోజు ప్రోగ్రాం గురించీ భయమా"
"కాదు అన్నయ్యా... అది కాదు. ఎవరికైనా ఏదైనా అవుతుందేమో అన్నట్లు"
పద్మ గారు....."ఏమవుతుందే.... ఏమి కాదు. లే... లేచీ స్నానం చేసి చక్కగా దేవుడికి దణ్ణం పెట్టుకో. అన్నీ బానే ఉంటాయి. ఏవేవో ఆలోచించేస్తుంటావు"
రామ్ గారు..... "ఏమి అవదమ్మా. అమ్మ చెప్పినట్లు దణ్ణం పెట్టుకో. హాయిగా స్పెండ్ చేయి మీ ఫ్రెండ్స్ తో"
"సరేలెండి" అంటూ లేచీ లోపలికి వెళ్ళి హరీష్ కి మెసేజ్ చేసింది.. "బావా జాగ్రత్త" అంటూ
కొద్దిసేపటికి హరీష్ నుంచి మెసేజ్ వచ్చింది.... "స్వీటీ ఏమయిందిరా"
"ఏంలేదు చెప్పాలనిపించింది. ఉంటా"
స్వాతి రెడీ అయ్యి మధ్యాహ్నం రమ్యా వాళ్ళింటికి వెళ్ళి అటు నుంచి కాలేజీ కి వెళ్ళిపోయింది. సాయంత్రం ప్రోగ్రాం టైమ్ కి ప్రదీప్ వెళ్ళాడు. ప్రోగ్రాం అయిపోయాక,
"రమ్య... అన్నయ్యని కలిసేసి వస్తానే. అవునూ నువ్వు మాతో వచ్చేస్తావా"
"లేదే, మీరు వెళ్ళండి. అయినా ఎలాగో ఇక్కడ అయిపొయింది. నువ్వెళ్ళాలంటే బయల్దేరులే"
"సరే అయితే. చూస్కో. బాయ్ "
కొద్దిసేపటి తర్వాత ప్రదీప్ బ్యాక్ స్టేజ్ లో రమ్య దగ్గరకొచ్చి "రమ్యా... మేము బయల్దేరుతాము. స్వాతి ఎక్కడుంది"
"అదేంటి అదెప్పుడో నీ దగ్గరకే వస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. గంట పైనే అయ్యింది అది వెళ్ళి కూడా"
"గంట పైనా.... నేనిక్కడే ఉన్నాను" అంటూ ప్రదీప్ ఖంగారుగా స్వాతి కి కాల్ చేసాడు. ఫోన్ స్విచెడ్ ఆఫ్ వచ్చింది
"ఛార్జ్ అయిపోయిందేమో అన్నయ్యా..... ఖంగారు పడకూ, మేమందరము చూస్తాము" అంటూ అందరూ చెరో వైపు వెతకటం మొదలుపెట్టారు. ఎక్కడా ఎవరికీ కనిపించలేదు.
ప్రదీప్.... "ఇక్కడ అన్నీ రూమ్స్ చెక్ చేసారా. నేను ఇక్కడే ఎదురుగా ఉన్నాను. నన్ను దాటి తను వెళ్ళే ఛాన్స్ లేదు. ఒక్కసారి వెనక వైపే మళ్ళీ చూడండి. మే బి ఏదైనా గమనించలేదేమో"
మనోజ్.... "లేదు సర్. అన్నీ రూమ్స్ చూసాము. ఆ గ్రీన్ రూమ్ ఒక్కటి బయట నుంచి లాక్ ఉంది, అది కాకుండా అన్నీ కూడా వెతికాము"
రమ్యా.... "లాక్ ఏంటి.... అన్నీ రూమ్స్ ఓపెన్ చేయించాను నేనే దగ్గరుండి"
ప్రదీప్ అనుమానంగా "మనోజ్ ఆ రూమ్ చూపించూ... పదా" అంటూ అందరూ అటు వెళ్ళారు.
ఆ గదికి ఉన్న తాళం ని పగలగొట్టి లోపలికి వెళ్లేసరికి స్వాతి చేతులు కాళ్ళు కట్టేసి, అరవనీయకుండా నోటికి చున్నీ ని కట్టేసి ఉంది. తనని ఎవరో కొట్టినట్లుగా మొహం మీద వేళ్ళ గుర్తులు ఉండి, బుగ్గ అంత కందిపోయింది.
రమ్య, స్వాతి నోటికి ఉన్న చున్నీని తీసి సరిచేసింది. ప్రదీప్ తన కట్లు విప్పి, "చిన్నూ..... చిన్నూ" అంటూ లేపటానికి ప్రయత్నించాడు. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ప్రదీప్ ని చూడగానే "అన్నయ్యా " అంటూ తనని పట్టుకుని ఏడ్చేసరికి "చిన్నూ....నేను ఉన్నాను కదా ఇక్కడే. భయపడకురా. ఏమయిందమ్మా అసలూ. ఎవరు చేశారు" అంటూ తనని పట్టుకుని అడిగాడు
స్వాతి తన చుట్టూ అందరినీ చూసీ, "ఏమో అన్నయ్యా. నాకేమి తెలీదు ఎవరు వాళ్ళో.... అన్నయ్యా ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాము. పోలీసులు హడావిడి ఏమి ఒద్దు. ప్లీజ్"
రమ్యా... "స్వాతి నేనూ వస్తాను"
స్వాతి "ఒద్దు రమ్యా. నేను బానే ఉన్నాను. అన్నయ్య ఉన్నాడు కదా. వెళ్తాను. ఏమనుకోకు " అంటూ
ఇంటికి వెళ్ళాక తన రూమ్ లో కి వెళ్ళి పడుకుంది. పద్మగారితో జరిగింది చెప్పి అక్కడే కూలబడిపోయాడు ప్రదీప్.
"అమ్మా.... ఇందాక దాన్ని చుస్తే భయమేసింది. తట్టుకోలేకపోయానమ్మా. ఇంటి వరకు ఎలా వచ్చానో తెలీదు. పొద్దున్న అంటూనే ఉందమ్మా, ఏదో అవుతుందేమో అని భయపడుతూనే ఉంది. దానికి ఈ దెబ్బలు తగలటం ఏంటో చిన్నప్పటి నుంచి" అంటూ బాధపడ్డాడు
ఆ రాత్రి ఎవరికీ నిద్ర లేదు. పడుకోకపోతే మిగతావాళ్ళు బెంగపడ్తారనుకుంటూ అందరూ పడుకోటానికి వెళ్ళారు.
అర్థరాత్రి స్వాతి పద్మగారిని నిద్ర లేపింది. "ఏమయిందమ్మా...." అంటూ ఆవిడ ఖంగారుగా లేచారు
"అమ్మా, నేను మీ దగ్గర పడుకోవచ్చా, భయంగా ఉంది"
"రా తల్లీ ఇలా పడుకో" అంటూ ఆవిడ పక్కన పడుకోపెట్టుకున్నారు.
పొద్దున్న ఆవిడకి మెలుకువొచ్చేసరికి, ప్రదీప్ వాళ్ళ మంచం ఎదురుగా కింద కూర్చుని అలాగే పడుకుని ఉన్నాడు.
పొద్దున్న హరీష్ ఫోన్ తో ప్రదీప్ కి మెలుకువొచ్చింది. ఆ రూమ్ లో నుంచి బయటకి వచ్చి.... "చెప్పు బావా ఎలా ఉన్నావు" అంటూ మాములుగా పలకరించాడు, ఇక్కడ విషయాలు చెప్పి తనని ఖంగారు పెట్టలేక
"బావా... నేనూ అదే అడుగుతున్నా. స్వాతి ఎలా ఉంది. ఏమయ్యిందీ నిన్న రాత్రి"
హరీష్ కి ఎలా తెలిసిందీ అనే అనుమానం, అయ్యో తెలిసిందా ఎలా తట్టుకుంటాడో అనే ఖంగారు.... "అదీ బావా... "
"చెప్పు బావా..... ఒక్కసారి స్వాతి ని చూపించు. ఫోన్ చేస్తుంటే స్విచెడ్ ఆఫ్ వస్తోంది"
"ఆ బావా.. ఛార్జ్ లేదేమో"
"నేను ఇప్పుడే తనని చూడాలి. ప్లీజ్ చూపించూ"
"బావా తను ఇంకా లేవలేదు"
"తను మాట్లాడక్కర్లేదు. జస్ట్ చూస్తాను అంతే "
ఇంక ప్రదీప్ కి వీడియో కాల్ చేయక తప్పలేదు. ప్రదీప్ వాళ్ళ అమ్మా నాన్నగారు హాల్ లో కూర్చుని ఉన్నారని చూసీ, తను లోపల వీడియో ఆన్ చేసాడు
"బావా నువ్వెందుకు అలా ఉన్నావు. స్వాతి ఏది"
స్వాతి ని చూసీ "బావా ఆ బుగ్గ మీద ఏమయ్యిందీ. అసలు సరిగ్గా చెప్పండి" అనడిగాడు హరీష్ అసహనంగా
"ఒక్క నిమిషం బావా" అంటూ తన రూమ్ లో కి వెళ్ళి, తలుపు దగ్గరకి వేసి జరిగినది మొత్తం చెప్పాడు. "బావా వాళ్లెవరో ఇది చూడలేదంటోంది"
హరీష్ మెల్లగా "తను చూసింది బావా. తనకి తెలుసు"
Comments
Post a Comment