7
స్వాతి ఇంటికి వచ్చాక ప్రదీప్ మళ్ళీ ఏదన్నా అడుగుతే ఏం చెప్పాలా అని ఆలోచించింది కానీ ప్రదీప్ ఆ మాటే ఎత్తలేదు. తర్వాత రోజున అన్వి ఫోన్ చేసి
స్వాతి..... "హలో"
అన్వి... "హే స్వాతి ఎలా ఉన్నావే"
"బానే ఉన్నాలే.... చెప్పు 🙄 "
"ఏమైందే"
"మండిపోతోంది, మాట్లాడకూ. మళ్ళీ ఏమైందే అంట "
"నీకెందుకు మండుతుంది. నాకు కదా కోపం రావాల్సిందీ"
"నీకెందుకుట కోపం రావటం. అన్నయ్య దగ్గర నన్ను కదా ఇరికించావ్. అప్పటికీ వద్దే అని చెప్పా ఆ మాట కూడా వెళ్లి చెప్పేసావు. ఇంకా నీకెందుకు కోపం"
"హీహీహీ చెప్పేశాడా. చెప్పద్దని అన్నానే అప్పటికీ 🤔. అయినా నాకెందుకు కోపం రావాలా. నువ్వీ మధ్య నా దగ్గర ఏంటే దాస్తున్నావు. అసలు నిన్న మూడ్ ఆఫ్ అయిపోటానికి ఏమయ్యిందిట "
"అదా.... మూడ్ ఆఫ్ అని కాదులే ఆలోచిస్తూ కూర్చుండిపోయా. తరువాత మాములుగా అయిపోయా కదా 😁"
"అయితే చెప్పనంటావ్"
"టైమ్ వచ్చినప్పుడు చెప్తా అంటున్నా ".... నాకో క్లారిటీ రానీయి ముందర అని మనసులో అనుకుంటూ
వారం రోజులు దాటింది.....
హరీష్... "స్వాతి నుంచి ఎలాంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ లేదు. దాని మనసులో లో మాట తెలియనన్ని రోజూలూ చూడకుండా ఉండగలిగాను కానీ ఇప్పుడలా కాదే. ఏం చేయనూ. ఈ పిచ్చిది నిజంగానే రాదా. ఫోన్ చేద్దామంటే నెంబర్ లేదు. అత్తయ్య కి చేసి మాట్లాడదామంటే, ఎందుకు అంటే ఏం చెప్పనూ" అని అనుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్ళాడు.
అక్కడ స్వాతిది కూడా అదే పరిస్థితి...
"ఆ రోజు నేను చాలా ఆశపడ్డానే. ఫోన్ చేస్తాడనే అనుకున్నాను. అయితే నిజంగానే తనకి నేనంటే ఇష్టం లేదా. అది వట్టి నా భ్రమేనా" అలా అనుకుంటుంటే స్వాతి కి మనసంతా ఏదోగా అయిపొయింది.
"భగవంతుడా నేను మాములుగా ఉండేలా చూడూ. నేను బాధపడ్డానంటే ఎందుకో కూడా చెప్పుకోలేని సిట్యుయేషన్ లో ఉన్నాను. అన్నిటిని ఫేస్ చేసే ధైర్యాన్ని ఇయ్యి"...
ఇంతలో "స్వాతీ" అంటూ వాళ్ళ అమ్మా గారు పిలిస్తే అటు వెళ్ళింది.
"ఏంటమ్మా"
"అత్తయ్య కాల్ చేసిందే. హరీష్ చెప్పిన టాపిక్స్ అర్థం అయ్యాయా అని అడిగిందీ. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాడు. అంతేకాని వాడితో చెప్పించుకోటం ఇష్టం లేకపోతే, ఇంటికి రావటం మానేయక్కర్లేదు అని చెప్పమందే"
స్వాతి ఆశ్చర్యంగా "ఏంటీ.... అత్తయ్య ఈ మాట చెప్పటం కోసమనే కాల్ చేసిందా "
"కాదులే, మావయ్య చాలా రోజులయ్యింది మాట్లాడదామని చేసాడు ఇందాక. నీతో మాట్లాడటానికి అవలేదూ అనుకున్నాడు. అప్పుడే అత్తయ్య ఫోన్ తీస్కుని చెప్పింది" అని ఫోన్ లో జరిగింది చెప్పారు
"ముందర చెప్పినా సండే వెళ్లి కలిసొచ్చేదాన్ని కదా మావయ్యని. సరేలే కాలేజీ నుంచి వస్తూ రేపు అటు వెళ్ళొచ్చేస్తాను, రేపెలాగో ముందరే వచ్చేస్తాను క్లాస్సేస్ లేవు మధ్యాహ్నం నుంచి" అంది
అన్నదే కానీ, హరీష్ ని ఎలా ఫేస్ చేయాలో తెలీలేదు. అదే ఆలోచిస్తూ లోపలికెళ్తుంటే,
ప్రదీప్.... "ఏంటిటా ఫోన్. ఎవరూ"
"చిన్న మావయ్య వాళ్ళు. రేపు వెల్దామనుకుంటున్నా. నీకేమన్నా కుదురుతుందా"
"నాకు ఆఫీస్ లో ఆడిటింగ్ అవుతోందమ్మా, ఈ వీక్ అవదూ..." అని అంటూ అంతకు ముందర అక్కడకి వెళ్ళి వచ్చాక ఏడుస్తూ చూడటం గుర్తొచ్చి "తర్వాత మెల్లిగా వెళ్లచ్చులే కంగారేముంది. నేను కూడ వస్తాను"
"డౌట్స్ ఉన్నప్పుడు వెళ్లి, మళ్ళీ రాలేదనుకుంటారేమో అన్నయ్యా. పర్వాలేదులే నేను వెళ్ళొచ్చేస్తా" అని చెప్పి తన రూమ్ లో కి వెళ్లి ఆలోచిస్తూ కూర్చుంది
"ఏంటో అమ్మ ఏమో అత్తయ్య చెప్పిందంటుంది కానీ డబల్ మీనింగ్ లు ఉన్నాయి ఆ చెప్పిన మాటలో. నాకే అనిపిస్తోందా లేక ఆవిడ అలాగే చెప్పారా. బావ చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాడా.....?? ఏమని చెప్తాడు. "అలాంటి ఆలోచనలు ఒద్దు" అని చెప్తాడా?? లేదా తనకీ ఇష్టమే అని ఈసారి కళ్ళతో కాకుండా నోటితో చెప్తాడా??. అందుకోసం ఇంటికి రావటం మానేయక్కర్లేదంటే ఏంటీ అర్థం??? ఆమ్మో ... తల వేడెక్కిపోతోంది. రేపెలాగో మావయ్య ఉంటారు కాబట్టి బుద్ధిగా హాయ్ చెప్పేసి వచ్చేస్తాను".
స్వాతి గదిలోకి వచ్చిన ప్రదీప్ ఆమె ఏదో ఆలోచనలో ఉండటం చూసి "చిన్నూ, నేను తీసుకుని వెళ్తాను తర్వాత. అమ్మ ముందు గట్టిగ చెప్పలేక ఇందాక ఏమనలేదు. మొన్న అలాగే వెళ్ళావు, ఏమయ్యిందో చెప్పకుండా ఏడుస్తూ కూర్చున్నావ్. ఒకదానివి అక్కడకి వెళ్ళకు" తన భయాన్ని చెప్పాడు ప్రదీప్.
స్వాతి "అన్నయ్యా, వాళ్ళు నన్నేమి అనలేదు. నిజంగా. నువ్వు వస్తానంటే రా. కానీ వాళ్ళు నన్ను బాధపెట్టారేమో అని భయపడి వస్తా అనకూ".
ప్రదీప్ "అయితే అక్కడ నుండి వచ్చేటప్పుడు దారిలో ఎవరన్నా ఇబ్బంది పెట్టారా" తన అనుమానం తీరేవరకూ చెల్లెలిని అక్కడకి పంపించకూడదని అతని ఆలోచన.
కానీ జరిగిందేమిటో స్వాతి అతనికి చెప్పలేదు. చెప్పకపోతే హరీష్ కుటుంబాన్ని దగ్గరకి కూడా రానీయడు. అంటే అర్థం... వాళ్ళ అమ్మ గారు తన అన్నని కలవనీయడు. స్వాతికన్నా ఆ ఇంట్లో ఎవరూ ఎవరికీ ముఖ్యం కాదు. ఇలా అయిపోయిందేంటి అని స్వాతి ఆలోచనలోపడగా, ప్రదీప్ "చెప్పు చిన్నూ, దారిలో ఎవరన్నా అల్లరి పెట్టారా??" అని అడగటంతో స్వాతి "అవును. అంతేను... మావయ్య వాళ్ళు ఏమనలేదు" అంది అతనికి అబద్ధం చెప్పటానికి బాధగా.
ప్రదీప్ "మరి రేపు వెళ్ళగలవా??" ఇంకా అనుమానంగానే అడిగాడు. స్వాతి అవునని చెప్పి నిద్రొస్తోందాంటూ కళ్ళుమూసుకుంది, లేకపోతే అన్నగారు కదలరని.
పొద్దున్న లేచీ కాలేజీకి రెడీ అవుతోంది కానీ ఆలోచనల్లో నుంచి బయటకి రావటం లేదు....
"మావయ్య వాళ్లకి చెప్పాడా, తెలిసే వాళ్ళు రమ్మని అడిగారా" అనే ఆలోచన ఇప్పుడు ఇంకా భయపెడుతోంది
ప్రదీప్... "ఏంటిరా తెగ ఆలోచించేస్తున్నావ్"
"ఏంలేదన్నయ్యా. ఈరోజు వెళ్లాలా అని ఆలోచిస్తున్నా"
"ఎక్కడికీ...... మావయ్య వాళ్ళింటికా"
"ఆ..." మళ్ళీ కంగారుగా " కాదు కాలేజీ కి. టెస్ట్ ఉంది. భయమేస్తోంది"
"టెస్ట్ కే ఆలా అయిపోతే ఎలాగరా. బానే రాస్తావులే. నేను దింపనా కాలేజీ దగ్గరా"
"ఒద్దులే అన్నయ్య. నేను వెళ్తానులే" అని టిఫిన్ చేసి కాలేజీ కి వెళ్ళిపోయింది
కాలేజీ లో కూడా అవే ఆలోచనలు. ఒక్కో సారి ఎప్పుడు వెల్దామా అనిపిస్తుంటే ఒక్కోసారి వెళ్తే ఏమవుతుందో అని. మొత్తానికి కాలేజీ అయ్యాక హరీష్ వాళ్ళింటికి వెళ్లనే వెళ్ళింది
హరీష్ వాళ్ళ ఇంట్లో....
డోర్ బెల్ సౌండ్ కి హరీష్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే స్వాతిని చూసీ, ఆనందం ఆశ్చర్యం కలిపి
"హేయ్.... ఏంటీ సడన్ సర్ప్రైస్. రా లోపలికి. కాలేజీ లేదా"
స్వాతి అంతే మొహమాటంగా, "ఉందీ. కాలేజ్ నుంచే వస్తున్నా. మావయ్య వాళ్ళు లేరా, పడుకున్నారా" అడిగింది లోపలికి కళ్ళతోనే వెతుకుతూ
హరీష్... "నువ్వు ముందర కూర్చో" అని మంచినీళ్లు ఇస్తూ "నాన్నా వాళ్ళు పెదనాన్న ఇంటికి వెళ్లారు. సాయంత్రం అవుతుంది వచ్చేసరికి"
" ఒహ్హ్ అవునా. సరేలే నేను మళ్ళీ తర్వాత వస్తాను" అంది తాగుతున్న నీళ్ళ గ్లాసు ఖంగారుగా పక్కన పెట్టి
"అదేం .... మీ మావయ్య కోసమే వస్తావా. నాతో అయితే మాట్లాడవేంటి"
"అలా అని కాదూ, మొన్న మావయ్యతో మాట్లాడకుండా వెళ్ళిపోయానని కాల్ చేశారట. ఈ రోజెలాగో త్వరగానే ఇంటికి వెళ్తున్నా కదా అని ఇటొచ్చేసాను"
"సరే.... ఇప్పుడు ఇక్కడ నేను ఉండేసరికి వెళ్లిపోతున్నా అంటున్నావ్. అంటే నాతో మాట్లాడవా" అన్నాడు ఈసారి కొంచం బాధగా
స్వాతి తల దించుకుని "అయ్యో అదేంలేదు బావా. మొన్న నోటికొచ్చినట్లు మాట్లాడేసాను. నిన్ను ఇంకా ఇబ్బందిపెట్టకూడదని వెళ్తా అంటున్నా" అంటూ లేవబోయింది
హరీష్ కి స్వాతి మాటల్లోని బాధ అర్థమయ్యి, తనని లేవనీయకుండా తన కుర్చీ ముందర కింద కూర్చుని, స్వాతి చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ, "మొన్న నీ మనసులోవి అన్నీ చెప్పేసి నన్ను అసలు మాట్లాడనీయకుండా వెళ్లిపోయావు. అసలూ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టటం ఏంటే కొత్తగా"
స్వాతికి అతని చేతి స్పర్శ ఊరట కలిగిస్తుంటే, లోపల అణిచేస్కున్న బాధ బయట తన్నుకొచ్చేస్తోంది. అది ఆపుకుంటూ, తన చేతుల్ని విడిపించుకుని, నిల్చుని
"నువ్వు మాట్లాడకపోడమేంటి బావా. చెప్పావు కదా... అట్రాక్షన్ అని" ఆ మాట అనేటప్పుడు బాధ, కోపం రెండూ వినిపించాయి హరీష్ కి.
హరీష్ అంతే ప్రేమగా స్వాతి మొహాన్ని చేతులతో పైకి ఎత్తుతూ "చిట్టీ, ఎంత సేపూ నాకు నువ్వంటే ఇష్టం అంటున్నావ్. నేను అలా అంటే కానీ నీకు నేనంటే ఎంత ప్రేమో చెప్పలేదు కదా మరి. నువ్వు నా ఫీలింగ్స్ చెప్పటం కాదు. నేనే చెప్తున్నా, ఐ లవ్ యు సో మచ్ స్వాతి. నువ్వు చెప్పాక కానీ... ఈ మాట చెప్పే ధైర్యం నేను చేయలేకపోయాను"
స్వాతి హరీష్ కళ్ళలోకి చూస్తూ, "బావా నా మీద జాలిపడి చెప్తున్నావా. నీకు.... " స్వాతి మాట ఆగిపోయింది, కాదు హరీష్ ఆపేసాడు. తనని మాట్లాడనీయకుండా ఆమె పెదవులని అతని పెదవులతో బంధించాడు.
స్వాతి తనని మెల్లిగా పక్కకి తోసి, "ఏంటి బావా ఇదీ" అంది కొంచం కోపంగా
హరీష్ నవ్వుతూ "మరి నా ప్రేమని చెప్తే నమ్మటం లేదు కదా, చూపిద్దామని. ఇంకోసారి నా ప్రేమని అనుమానించావనుకో ఈసారి మాత్రం తోసేసినా వదిలేది లేదు" స్వాతిని దగ్గరకి తీసుకున్నాడు
స్వాతి కూడా హరీష్ గుండెల మీద తల పెట్టి, "బావా, ప్రేమ అంటే ముద్దులు, కౌగిలింతలు కావూ. నాకు నువ్వు నీకు నేను ప్రతీ విషయం లోను తోడుగా ఉంటామనే ధైర్యం, నమ్మకం. ఆ ధైర్యం జీవితాంతం ఉండటానికి పెళ్లి అనే బంధం. నీ తోడు నాకు దొరికితే లైఫ్ లాంగ్ నేను హ్యాపీ గా ఉంటానని, ఉంచగలవని నమ్మకం నాకుంది. మరి ఆ నమ్మకం నా మీద నీకుందా" అంటూ తల ఎత్తి హరీష్ వైపు చూసింది.
హరీష్ ఆమెని ముద్దు పెట్టుకుని (ఈసారి మాత్రం తల మీదలేండి) , కూర్చోపెట్టి.... "స్వాతి, నన్ను నాకన్నా బాగా నువ్వే అర్థం చేసుకున్నావు. నువ్వంటే నాకెంత ఇష్టమో నేను నీకు కొత్తగా చెప్పేదేమీ లేదు. నేను ఇష్టపడ్డ నువ్వు, నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాక, నిన్ను చూడకుండా ఈ పది రోజులూ స్థిమితం లేదస్సలు. అందుకే నాన్నతో నేనే అత్తయ్యకి ఫోన్ చేయించాను"
స్వాతి ఆశ్చర్యంగా "నువ్వా..."
"నేనే.... మరేం చేయనూ నీకు నెంబర్ కూడా లేదు నాదగ్గరా"
********************************************************
Comments
Post a Comment