6
స్వాతి అతన్ని అలా చూస్తూ, "లవ్ యు బావా"
"వాట్ "
హరీష్ అరుపు కి స్పృహలోకి వచ్చిన స్వాతి అతన్ని చూసింది
తన కళ్ళు పెద్దవి చేసి అతను సరిగ్గానే విన్నాడా అనే అనుమానంతో ఆమెనే చూస్తుండగా,
"సారీ ..... ఏదేదో మాట్లాడేస్తున్నా. నేను వెళ్తాను బావ" అంటూ లేవబోయింది
"స్వాతి నువ్విప్పుడేమన్నావ్? మాట్లాడకుండా వెళ్ళిపోడం కాదు. ఆగు. ఏదో సరదాగా మాట్లాడేసరికి ఏదేదో అనేసుకుంటున్నావు" హరీష్ గొంతు ఎప్పుడూ అంత గట్టిగా విననే లేదు.
"బావా ఈరోజే ఫస్ట్ టైమ్ నిన్ను చూసీ, చూడగానే 'ఐ లవ్ యు' అని చెప్పేయటానికి నాది అట్రాక్షన్ కాదు బావా. ప్రేమని మనసులో దాచుకోలేక నాకే తెలీకుండా బయటకి వచ్చేసింది ఆ మాట. లేకపోతె ఇప్పుడే కాదు ఎప్పటికీ నీకు చెప్పేదాన్ని కాదేమో. అమ్మా, నాన్న, అన్నయ్య తర్వాత నాకు నచ్చినట్లుగా ఉండగలిగేది నీతోనే. నేను ఏమి చెప్పకుండానే నన్ను అర్థం చేసుకుంటావు, ఏ టెన్షన్ ఉన్నా నీతో మాట్లాడగలను. నీకూ నేనంటే చాలా ఇష్టం, నువ్వు ఏమి చేసినా నాతో చెప్తావు, ఊరు నుంచి ఎప్పుడొచ్చినా నాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవాడివి అందరితోకంటే. ఇంతెందుకూ.... ఇందాక నువ్వు చెప్పినదాంట్లో డౌట్ వచ్చి అడిగితె ఏమనుకుంటావో అని ఆలోచిస్తుంటే నా మనసులో ఏముందో తెలుసుకుని, "అడగకపోతే ఎలాగా" అన్నావు. ఎవరడుగుతారు బావ అలాగ. ఫస్ట్ టైమ్ నీకు నేను పడిపోయా అని రియలైజ్ అయ్యిందేప్పుడో తెలుసా?? రెండేళ్ళ క్రితం ఊరొచ్చినప్పుడు చిన్న ఆక్సిడెంట్ అయ్యింది నాకు. అప్పుడు నాకన్నా ఎక్కువ బాధపడింది నువ్వే. అంతలా నన్ను ఇష్టపడేవాడు నా జీవితాంతం తోడుగా ఉండాలనుకున్నాను. తప్పా బావా??". హరీష్ ని చూడకుండా తల తిప్పి తను చెప్పాలనుకున్నది చెప్పేసింది స్వాతి.
హరీష్ ... "కానీ స్వాతి, ఈ ఊరు వచ్చేసి మేము ఆరు నెలలు పైనే అయ్యింది. ఇన్నాళ్లలో నువ్వు ఎన్ని సార్లు నన్ను చూసావు. వచ్చిన కొత్తలో రెండు మూడు సార్లు వచ్చావేమో అంతే కదా. అయినా నా గురించి నీకేం తెలుసనీ" అన్నాడు స్వాతికి అడ్డుచెప్తూ
"నీ గురించి తెలుసుకోవటంకి, ఏమి తెలియాలి బావా. అత్తయ్యని మావయ్యని ఎలా చూస్కుంటావో నాకు తెలీదా. అలాంటివాడివి నిన్ను ప్రేమించేవాళ్ళని ఎలా చూస్కుంటావో ఊహించలేనా బావా. ప్రతీరోజు వస్తే, నిన్ను చూస్తూ నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్కోలేనని భయం. నేను ఈ మాట బయటకి చెప్తే నువ్వు నాతో మాట్లాడవేమోనని భయం. నిన్ను దూరం నుంచి అయినా చూస్తూ ఉండిపోగలను కాని నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే తట్టుకోలేను బావ. నిన్ను కలవలేదని నువ్వంటున్నావు కానీ నిన్ను తలచుకోని క్షణం లేదు. నేనేం చేసినా నాలోనే ఉన్న నీకు చెప్తూనే ఉంటాను. నువ్వైతే ఇలా అంటావు , నువ్విప్పుడు ఏమి చేస్తూ ఉంటావో అనుకుంటూ, నీ ఆలోచనలే. కానీ ఏ రోజూ బయటపడలేదు బావా ఇన్నాళ్లలో"
స్వాతికి దుఃఖం ఆగటం లేదు. హరీష్ ఆమెని దగ్గరకి తీసుకుని ఓదారుస్తాడేమోనని అంత బాధలోనూ ఆశపడింది. కానీ హరీష్ ఏవో ఆలోచనలలో మౌనంగా ఉండిపోయాడు. అతని సమాధానం అర్థమయ్యి "ఒక చిన్న హెల్ప్. ఈ విషయాలేవీ మావయ్య వాళ్లకి చెప్పకూ. నా వలన అమ్మా, మావయ్య వాళ్ళ మధ్యన డిస్టర్బన్స్ లు రాకూడదు బావా. ప్లీజ్... నిన్ను కూడా ఇంకెప్పుడూ ఇబ్బంది పెట్టను. ఈ టాపిక్ ఈరోజుతో మర్చిపో. సారీ "
హరీష్ వాళ్ళ అమ్మా నాన్న గారు ఇంట్లోకి రావటం తో తను ఇంకా ఏదో చెప్తూ ఆపేసింది.
"అత్తయ్యా మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అమ్మ ఫోన్ చేసింది. ఇంటికి వెళ్ళాలి" అంది స్వాతి, హరీష్ వాళ్ళ అమ్మగారిని చూసి.
"అదేంటే సడన్ గా. నేను చెప్తాలే మీ అమ్మ కి. ఉండూ కొంచం సేపు." అన్నారు ఆవిడ వెనకే లోపలికి వచ్చిన హరీష్ వాళ్ళ నాన్న గారు
"మళ్ళీ వస్తాను మావయ్యా. ఏమనుకోకు" అంటూ హరీష్ ని తప్పించుకుని పరిగెత్తింది స్వాతి, అక్కడ అతని ఎదురుగా ఉండలేక
"ఏమయిందిరా, ఎందుకలా వెళ్ళిపోయిందీ" అనడిగారు హరీష్ వైపు అనుమానంగా చూస్తూ వాళ్ళ నాన్నగారు
"ఏదో క్వషన్లు అడిగి భయపెట్టేసి ఉంటాడు, అదేమో పరిగెట్టేసింది" అన్నారు వాళ్ళ అమ్మ
"ఇది మరీ బావుంది. ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డటు ఇద్దరూ నా మీద పడ్డారు. అత్తయ్య ఫోన్ చేసి రమ్మంటే అది పారిపోయింది. మధ్యలో నేనేం చేసాను" అంటూ విసుక్కుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు హరీష్, స్వాతి ఇచ్చిన షాక్ లో నుండి తెరుకోలేక.
Comments
Post a Comment