నాలో "నీ" నేను ఎపిసోడ్ 4

 "బావా నిజంగా నువ్వు నాకోసం వెయిట్ చేస్తున్నావా. లేదా చుట్టాలు కాబట్టి అంటున్నావా. నీ దగ్గరగా ఉంటే 'బావా నువ్వంటే  నాకు పిచ్చి' అనేస్తానేమో అని రాను"  అనుకుంది స్వాతి ఈసారి మాత్రం మనసులోనే. 


తనని అలా ఆలోచించటం చూసీ,  "అవునూ ఏవో డౌట్స్ ఉన్నాయన్నావు కదా. ఏంటో అడుగు" అంటూ ఇద్దరూ పుస్తకం పట్టారు.  


మొదట్లో చూపు తిప్పుకోటానికి కష్టపడినా,  మనసుని అదుపులో పెట్టుకుని బుద్ధిగా అతను చెప్పేది వినసాగింది. అలా చాలా సేపటి తర్వాత,  "నీకు ఇప్పటి వరకు చెప్పినదాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడుగు" అనడిగాడు హరీష్. 


స్వాతి మొహమాటంగా "ఆహా....  ఏమిలేవూ"" అంటూ దీర్ఘం తీసింది. 


హరీష్ కనుబొమ్మలు పైకి ఎగరేసి స్వాతిని చూస్తూ,  "అర్థం కాకపోతే అడగాలి కదా. నాకెలా తెలుస్తుంది" అని అనటంతో స్వాతి తన డౌట్స్ అన్ని అడిగి,  క్లియర్ చేసుకుంది. 


"తెలియకపోతే అడగటం లో తప్పేమి లేదు స్వాతి. అది చిన్నదనో, లేక ఎవరేం అనుకుంటారో అనో అడగటం మానేస్తే తర్వాత వీటికి సంబంధించిన ఇంకో టాపిక్ వస్తే అదెలా అర్థమవుతుంది. ఇక్కడ మనిద్దరమే ఉన్నాము. మొహమాట పడటానికేముంది" చిన్నగా మందలించాడు హరీష్. 


"థాంక్స్ బావా" అంది స్వాతి అతన్ని ప్రేమగా చూసి. 


హరీష్ ఏదో అనేలోపు,  వాళ్ళ అమ్మ గారు వచ్చి,  "నేనూ నాన్నా మార్కెట్ వరకూ వెళ్ళొస్తాము. దానికీ కొంచం బ్రేక్ ఇయ్యరా. రెండు గంటల నుంచి చదువుతోంది. కిందకొచ్చి కూర్చోండి. అరగంట ఆగి మళ్ళీ చదువుకోవచ్చు" 


"లేదత్తయ్యా,  నేనూ బయల్దేరుతాను" అంటూ స్వాతి పుస్తకాలు సద్దుకుని బయల్దేరబోయింది. 


"అదేంటే,  మావయ్యని కలవకుండా వెళ్ళిపోతానంటావేంటి. ఉండూ, అరగంట లో వచేస్తాము"


వచ్చినప్పటినుంచి స్వాతి ఇబ్బందిగా ఉండటం హరీష్ చాలా సేపటి ముందరే గమనించాడు. కాని 'ఎందుకు' అనేది అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినవాళ్ళు ,  కలిసి చాలా కాలమైనంత మాత్రాన అంత మొహమాట పడిపోవడానికి ఏముంటుందో తెలియలేదు. 


"అమ్మా తననెందుకు ఇబ్బంది పెడతావు. ఇక్కడే ఉంటే నేను క్వశ్చన్ లు అడుగుతానని భయమేమో. అసలే తనకి నేను చెప్పిందేది అర్థం కాలేదు" అన్నాడు హరీష్ నవ్వుతూ 


"నాకేం భయం లేదూ. నువ్వెళ్లిరా అత్తయ్యా. నేనుంటాలే వచ్చేవరకూ. బావా నువ్వు చెప్పిన వాటిలో ఏమన్నా అడుగు నేను చెప్పగలనూ" అంది హరీష్ ని కోపంగా చూస్తూ


"సరే కింద హాల్ లో నే కూర్చుందాం పదా. అడిగిన వాటికీ చెప్పలేదో అప్పుడు చెప్తాను" అంటూ కిందకి వెళ్లారు. 


హరీష్ వాళ్ళ నాన్నగారు స్వాతిని చూసీ "అదేంటిరా నువ్వు వచ్చినట్లే నాకు తెలీదు. మీ అత్తయ్య ఇప్పుడు చెప్తోంది" అన్నారు స్వాతి తల మీద చేయి వేసి. 


"ఇందాక మీరు ఫోన్ లో ఉన్నారు మావయ్యా. తర్వాతేమో బావ క్లాస్ పీకుతూ కదలనీయలేదు"


హరీష్ కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తున్నట్లు నటిస్తూ "నేను క్లాస్ పీకానా?? కదలనీయలేదా?? " 


"హాహాహా....  సరే మీరు కొట్టుకుంటూ ఉండండి నేనొచ్చి జాయిన్ అవుతా. అసలే సండే, షాప్ మూసేస్తాడో ఏంటో" అనుకుంటూ మావయ్య వాళ్ళు వెళ్లారు. 


హరీష్ మళ్ళీ సీరియస్ గా "ఏంటమ్మా ఇప్పుడు చెప్పు. నేను నీకు క్లాస్ పీకానా??" 


"అది కాదు బావా,  మా లెక్చరర్ లు ఇంకా నీకన్నా కొంచం తక్కువ రెడీ అవతారేమో. ఐరన్ చేసిన షర్ట్, అందులోను వైట్ షర్ట్ లో మిలమిల మెరిసిపోతూన్నావ్ ...  ఏదో సబ్జెక్టు అర్థం కాలేదు అన్నానే అనుకో మరీ ఇంట్లో ఉంటూ కూడా కాలేజీ లో క్లాస్ తీసుకోటానికి వెళ్తున్నట్లు ఇంత హ్యాండ్సమ్ గా రెడీ అవ్వాలా" అంది స్వాతి నవ్వుతూ 


"స్వాతీ,  ఇందాకటి నుంచి ఏంటో మొహమాటంగా ఉన్నావు. నీకు నా దగ్గర మొహమాటం ఎందుకూ కొత్తగా అనుకుంటూ ఉన్నా. నువ్వేమో  నేనేం వేసుకున్నాను, ఎలా కూర్చున్నాను అని చూస్తున్నావా. చెప్పేది వినకుండా" 


తనని గమనించాడని కంగారు పడుతూనే అది కవర్ చేస్కుంటూ "అయినా నీ దగ్గర నాకు మొహమాటం ఏంటి మరీను. ఈ షర్ట్ లో నువ్వింత.... హ్యాండ్సమ్ గా కనిపిస్తుంటే చూడకుండా ఎలా ఉంటాను"


"అంత మొహమాటాలు లేనప్పుడూ కొత్తగా థాంక్స్ చెప్పటాలు ఏంటో మరీ. నువ్వు కాబట్టే రమ్మని చెప్పాను. అందరికన్నా అత్త(స్వాతి వాళ్ళ అమ్మ ) దగ్గరే నాకు చనువెక్కువ. చిన్నప్పుడు ఊరు నుంచి వచ్చినా కూడా మీతోనే ఎక్కువ ఉన్నాను. అలాంటిది నాకు థాంక్స్ చెప్తావా. ఇందాకే తిడదాం అనుకున్నా,  అమ్మ ముందర ఎందుకులే అని ఏమనలేదు" అన్నాడు స్వాతి చెవి పట్టుకుని.


"బావా నొప్పెడుతోంది. వదులూ" అంది స్వాతి దీనంగా మొహం పెట్టి, బావ ఆటపట్టిస్తుంటే మనసులోనే సంతోషపడుతూ.


"ఇంకోసారి అలా థాంక్స్ చెప్పి, నా దగ్గర మొహమాటంగా ఉండనని చెప్పు, వదిలేస్తాను". 


స్వాతి అతన్ని అలా చూస్తూ "లవ్ యు బావా" 


"వాట్?? ఏమన్నావ్??" అన్నాడు వెంటనే చెవి వదిలేసి ఆశ్చర్యంగా


హరీష్ ఆమెనే సూటిగా చూస్తూ అలా గట్టిగా అడిగేసరికి స్పృహలోకి వచ్చిన స్వాతి అతన్ని భయంగా చూసింది. 



Comments