32
"తను ఏం చెపుదాం అనుకున్నదో అర్థమైన ప్రదీప్ "చుప్. అదేమీ కాదురా. హరీష్ నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోడు. తన పరిస్థితి ఏంటో మనకి తెలీదు కదా. అలా ఆలోచించకు"
"సరే అన్నయ్య"
"పద కిందకి వెళ్దాం. అమ్మ కూడా బాధపడుతోంది. నేనూ హరీష్ తో మాట్లాడతానులే"
"ఒద్దన్నయ్యా. నువ్వేమీ అనేక. తనే వస్తాడులే. నువ్వన్నట్లు తను ఏదో పనిలో ఉండుంటాడు. నువ్వు కిందకెళ్ళు. నేనూ వస్తాను"
"ఎందుకు? నేను వెళ్ళాక మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు ఏడవటానికా. పదా" అనూ కిందకి తీసుకెళ్లాడు.
భోజనాలు చేసేటప్పుడు, రామ్ గారు "రేపు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు, నాదొక ట్రైన్ టికెట్ కాన్సల్ చేయించాలిరా. నీకేమన్నా కుదురుతుందా"
"చేస్తానులెండి. కానీ కాన్సల్ చేయటం ఎందుకు"
"ఆదివారం మా ఫ్రెండ్ కూతురి పెళ్లి ఉందని చెప్పాను కదా వైజాగ్ లో. రేపు వెళదామని అసలు ప్లాన్. కానీ ఇప్పుడు అమ్మ రానంటోంది"
పద్మ గారు "నేను ముందర నుండి రాననే అంటున్నాను. మీరు లాస్ట్ మినిట్ వరకు కూర్చున్నారు. నేను వద్దంటున్నా ఎందుకు కొన్నట్లు"
"నాన్న ఎప్పుడూ రమ్మని అడగరు కదమ్మా. ఎందుకు వెళ్ళనంటున్నావ్"
పద్మగారు స్వాతి వైపు చూస్తూ "రెండు రోజులు ఇంట్లో లేకపోతె మీకూ ఇబ్బందే కదరా"
"ఏంటమ్మా మేమేమన్నా చిన్నపిల్లలమా ఇంకా. మేముండగలము. కదరా చిన్నూ"
స్వాతి "అవునన్నయ్య. మేము ఉంటామమ్మ. నువ్వూ నాన్నా వెళ్ళిరండి. నువ్వెప్పుడూ ఎక్కడికీ వెళ్లవు. ఒకసారి అందరిని కలిసినట్లు ఉంటుంది"
ప్రదీప్ కూడా కళ్ళతో వెళ్ళమని చెప్పటంతో పద్మగారు కూడా ఒప్పుకున్నారు. స్వాతి "ఎప్పుడు బయలుదేరాలి నాన్న. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు"
"రేపు సాయంత్రం బయల్దేరుతామురా. నువ్వు కాలేజ్ నుండి వచ్చేసరికి మేము స్టేషన్ కి వెళ్లిపోతామేమో. మళ్ళీ సోమవారంకి వచేస్తాము"
ప్రదీప్ "అయితే నేను మధ్యాహ్నం వచ్చేస్తాను. స్టేషన్ కి నేను దింపుతాను"
స్వాతి "నేనూ కాలేజీ నుండి స్టేషన్ కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను"
రామ్ గారు "సరే మీ ఇష్టం"
భోజనాలయ్యాక స్వాతి పద్మగారి దగ్గరకి వెళ్లి "అమ్మ నీ చీరలు తీయి. ఏం సద్దుకుంటున్నావు" అంటూ ఆవిడకి బాగ్ సద్దింది.
పద్మగారు "స్వాతి, నిజంగానే వెళ్ళనా? నువ్వెందుకు డల్ గా ఉంటున్నావ్. నిన్నలా వదిలి వెళ్ళాలని లేదు. అందుకే నాన్నకి రానని చెప్పాను"
"అమ్మా నేనేమి డల్ గ లేను. మొన్నసారైతే చక్కగా ఎక్కువ మార్కులొచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మార్కులు తగ్గిపోతాయేమో అని భయంగా ఉంది. ఎలా చదువుకోవాలి ముందే ప్లాన్ చేసుకోవాలి కదా"
"నీ మార్కులు గురించి ఎప్పుడైనా మేము నిన్నొక మాటన్నా అన్నామా అంత భయపడిపోవటానికి. ఎగ్జామ్స్ గురించి వదిలేసి నువ్వు మాములుగా ఉండు చాలు"
"ఇందాక అన్నయ్య అదే చెప్పాడులే. సరేలే నేను బాగానే ఉన్నాను. నువ్వు హ్యాపీ గా ఎంజాయ్ చేసారా" అని నవ్వుతూ చెప్పింది
తరువాత రోజు ప్రదీప్ ఆఫీస్ లో ఉండగా "బావా బిజీగా ఉన్నావా" అంటూ వచ్చాడు హరీష్
ప్రదీప్ ముభావంగా "పర్వాలేదు. ఏంటో చెప్పు"
"బావ, కంపెనీ వాళ్ళు వచ్చే సోమవారమే యుఎస్ కి వెళ్ళమంటున్నారు. చాలారోజులనుండి అది పోస్టుపోన్ చేయటానికి రీ చేస్తున్నాను బావ. అవలేదు. స్వీటీకి ఎలా చెప్పాలో. తను ముందే బెంగ పెట్టేసుకుంటుంది"
స్వాతి పేరు రాగానే ప్రదీప్ కోపంగా చూసి, తమాయించుకుని "నువ్వు ఆల్రెడీ వెళ్లిపోయానుకున్నానే. అయినా చిన్నూ ఎలా ఉందోనని ఇప్పుడు ఆలోచించటం ఎందుకు? ఇప్పుడెలా ఉంటోందో అలాగే ఉంటుంది"
"బావ ఏమయ్యింది. స్వీటీ ఎలా ఉంది. నువ్వెందుకలా ఉన్నావు" అనడిగాడు హరీష్ కంగారుగా.
"నీకు ముందే చెప్పాను. దాన్ని అవొఇద్ చేస్తే అది తట్టుకోలేదని. అదెలా ఉందని అడుగుతున్నావా .... నీకది ఎన్ని మెసేజ్ లు చేసింది. ఈ ఇరవై రోజుల్లో ఒక్కసారి కూడా ఒక్క క్షణం దాని కోసం టైం ఇవ్వలేకపోయావా. అది ఏడుస్తుంటే ఏమని చెప్పాలో కూడా తెలీలేదు"
"బావ, నాకు ఖాళీ ఉంటె నేను చేయనా? నీకు తెలీదా నేను ఒకేసారి మూడు ప్రాజెక్స్ మీద వర్క్ చేస్తున్నానని. ఎప్పటికప్పుడు మెసేజ్ చేయటానికి ఎంత ట్రై చేసానో, తనతో మాట్లాడలేక నేనెంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆఫీస్ లో పరిస్థితేంటో తనకి తెలియకపోవచ్చు. నీకు తెలీదా బావ"
"సారీ బావ. చిన్నుకి చెప్పాను కానీ అది ఏడ్చేసరికి బాధలో నిన్ను అనేశాను ఆలోచించకుండా"
"పర్వాలేదులే బావ. తనిప్పుడు కాలేజీలో ఉంటుంది కదా, సాయంత్రం మాట్లాడతాను. నీకు ఓకే అయితే నేను పిక్ చేసుకుంటా కాలేజ్ నుండి ఈరోజు"
"అది స్టేషన్ వచ్చేస్తా అంది బావ, కాలేజీ నుండి త్వరగా వచేస్తుందేమో"
"స్టేషన్ కి ఎందుకు"
"అమ్మా వాళ్ళు ఊరెళ్తున్నారు"
"ఓహ్. సరేలే. అయితే తనకి కాల్ చేసి మాట్లాడతాను. మళ్ళీ కలుస్తా" అని వెళ్ళబోయాడు.
ప్రదీప్ "బావ లంచ్ కి వెళ్దాం పద. తనకి తర్వాత చేయచ్చులే" అని హరీష్ తో కలిసి ఇద్దరూ కాంటీన్ కి వెళ్లారు.
కొంచం సేపు ఏవో మాట్లాడి, హరీష్ "నువ్వు చెప్పినట్లే నేను తనకి మెసేజ్ చేయను. కలవను. కానీ తను ఏడిస్తే మాత్రం ఉండలేను" అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు. ప్రదీప్ మాత్రం హరీష్ వెళ్ళినవైపే చూస్తూ ఉండిపోయాడు.
********************************
ఆరోజు సాయంత్రం పద్మ రామ్ గారిని ట్రైన్ ఎక్కించి అన్వితతో పటు సినిమాకి వెళ్లి రాత్రికి ఇంటికి చేరారు. అన్విత, ప్రదీప్ కబుర్లు చెప్పుకుంటుంటే స్వాతి ఫ్రెష్ అయ్యి వచ్చి "రావచ్చా. మీరు బిజీగా ఉంటె తరువాత వస్తానులే" అంది కళ్ళు మూసుకుని వెనక్కి తిరగబోతూ
"చిన్నూ..."
అన్న పిలుపుతో కళ్లమీద నుండి చేయి తీసి "సరదాగా అన్నాను. అన్నయ్యా నిన్నొకటి అడుగుతాను. నువ్వు సరే అనాలి"
"ఏంటిరా"
"రేపు కాలేజీ కి వెళ్ళను. ఒక్కరోజే. ప్లీజ్"
"ఇంట్లో .... " ప్రదీప్ ఏదో చెప్పబోతుంటే మధ్యలో అడ్డుపడుతూ స్వాతి "నాకు తెలుసు ఏమంటావో. నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపోతావ్. అన్వి కూడా పొద్దునే వెళ్ళిపోతుంది. ఇంట్లో ఒకదాన్ని ఎలా ఉంటాననే కదా. ఏమో నాకు అలాగే ఉండాలనుంది"
"అయితే కాలేజ్ కి వేళ్ళు చిన్నూ. ఎందుకంటే, రేపు శనివారం. అంటే మాకు సెలవు. అన్వి కూడా ఇక్కడే ఉంటానని చెప్తోంది. నేనే అడుగుదామనుకున్న ఇంట్లో మేము ఉంటాం కదా నువ్వూ వెళ్ళకూ అని. ఇంతలో నువ్వే అడిగావు. ఒకదానివి ఉండాలనుకుంటే మరి మేము ఉంటాం. అది కుదరదు కాబట్టి కాలేజ్ కి వెళ్ళిరా"
"అయితే ఇంకేం మరి. నేనూ ఉంటాను" అంటూ రాత్రి వరకు కబుర్లు చెప్పుకుని పడుకున్నారు.
పొద్దున్న స్వాతి ఇంకా లేవకపోవటంతో, "అత్తయ్య లేకపోతె ఇంక లేవవా. ఏడయ్యింది లే" అని బలవంతంగా లేపి ఫ్రెష్ అవటానికి పంపింది అన్విత.
ముగ్గురూ కాఫీలు తాగుతూ, ప్రదీప్ "స్వాతి నీకో విషయం చెప్పాలిరా. నేనేం చెప్పినా కూడా వింటాను, బాధ పడను అని నాకు ముందు మాట ఇయ్యి"
"ఏంటన్నాయ ముందరే మాట అడుగుతున్నావు"
"నీ దగ్గర నేర్చుకున్నదే. నా మీద నమ్మకముందే ఇయ్యి. లేకపోతె లేదులే"
"సరే అన్నయ్యా. వింటాను"
"స్వాతి, అమ్మ వాళ్ళు ఎవరో ఈరోజు పెళ్లి చూపులకి వస్తారని చెప్పారు నీకోసం. వాళ్ళు నిన్న నైట్ వీళ్ళు ట్రైన్ లో ఉండగా కాల్ చేశారట"
"అన్నయ్యా నన్ను ఇంకొకళ్ళు చూసుకోవటానికి వస్తారా? నేను బాధపడకూడదా? నీ మాట వినాలా?" అన్న చెప్పినవన్నీ తను సరిగ్గానే అర్థం చేసుకుందా అన్నట్లుగా ప్రదీప్ ని మళ్ళీ అడిగింది స్వాతి. అతను "కాదు, జోకు" అంటాడేమో అని ఆశగా చూస్తూ.
ప్రదీప్ ఏమీ సమాధానం ఇవ్వకపోవటంతో "అమ్మ చెప్పిందంటే తనకి తెలీదు అనుకోవచ్చు. అన్నీ తెలిసి నువ్వు కూడా అదే చెప్తున్నావా. బావని కాకుండా నా లైఫ్ లో... " గొంతులో మాటలు పెదవి దాటకుండా, కళ్ళలో నీళ్ళని బయటపడనీయకుండా, స్వాతి మొహం మూసేసుకుంది.
ప్రదీప్ అసహనంగా లేచి "ఆ బావ నిన్ను పట్టించుకోవట్లేదని కదా నువ్వూ ఫీల్ అయ్యావు. నువ్వు తననే చేసుకుంటా అన్నప్పుడు నేను నీ మాట విన్నాను. నిన్ను వదిలేశాడేమో అని నీకూ అనుమానంగానే ఉందిగా. ఇంక అలాంటివాడి కోసం బాధపడటం ఎందుకు? ఇప్పుడు నా మాట నువ్వు విను. ఏడవనని మాట ఇచ్చావు" అని చెప్పి అక్కడనుండి లోపలకి వెళ్ళిపోయాడు. ఆ అసహనం చెల్లెలి కన్నీళ్ళు చూడలేకో, లేక మరేదన్నా కారణమో అతనికే తెలియాలి.
కాళ్ళ మీద చేతులని తీయకుండా, ఏమీ మాట్లాడకుండా స్వాతి అలాగే కూర్చుని ఉండిపోయింది. అన్వితకి ప్రదీప్ మీద ఒకింత కోపం వచ్చింది కానీ అక్కడ అరవటం ముఖ్యం కాదని ఆగి, స్వాతిని ఓదార్చే ప్రయత్నం చేసింది. "స్వాతీ..."
"బావ నుండి ఒక్క మాటన్నా వినాలని తహతహలాడాను కానీ నన్ను పట్టించుకోవట్లేదనుకోలేదు అన్వి. తను మెసేజీ చేయనంత మాత్రాన తనకి ప్రేమ లేదనా? అన్నయ్యకి నా బాధ అర్థం కాలేదు"
"స్వాతీ, ఇవి జస్ట్ పెళ్లిచూపులు కదా. తను నచ్చకపోతే చెప్పేసేయి. అప్పుడు నిన్నెవరు కాదంటారు. లే ... లేచి ముందర రెడీ అవ్వు"
"ఇంకొకడి ముందర కూర్చోవాలంటే బావని మోసం చేస్తున్నట్లుగా ఉందే. మళ్ళీ తనకి నా మొహం చూపించలేను. మాట తీసుకుని అన్నయ్య పెద్ద పనిష్మెంటే ఇచ్చాడు. కాలేజ్ మానేయకుండా ఉండాల్సిందేమో... " అని బాధగా నిట్టూర్చింది. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లుగా అన్విత చేతులు పట్టుకుని "నాకేదన్న అయ్యిందంటే ఎన్ని పనులున్నా బావ వస్తాడేమో అన్వి. తను వస్తే అయినా అన్నయ్యకి తెలుస్తుందేమో, బావ నన్ను వదులుకోడని. బావనే ఒప్పిస్తాడు"
స్వాతి ఏం చెప్తోందో అర్థంకాక అన్విత "అంటే?? నీకేమన్నా ఏం అవుతుంది??" అని అంటూ ఆమె మాటలు అర్థమయినట్లుగా "ఏయ్ పిచ్చి పనులు చేయకు. హరీష్ అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఇప్పటికైతే ఇది జరగనీయి"
"సరేలే. అన్నయ్య ఇష్టం" అని స్వాతి లోపలి వెళ్ళిపోయింది.
కొద్దిసేపటి తరువాత ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారన్న పెళ్ళికొడుకు (అదేలెండి చూపులకోసమే) రానే వచ్చాడు.
ప్రదీప్, అన్వి ఇంటి పెద్దలయ్యారు. అతన్ని బయటకి వెళ్లి ఆహ్వానించారు. "బావా ఒప్పిస్తా అన్నావు. మరెక్కడున్నావ్ బావ" అనుకుంటూ బాధగా కిటికీ లో నుండి బయటకి చూస్తూ నిలుచుంది.
వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టి, అన్విత లోపలికి వచ్చి స్వాతి తో "ఆ అబ్బాయ్ఎంత బావున్నాడో. కానీ చాలా సిగ్గు. ఏమీ మాట్లాడటం లేదు. నువ్వే చూస్తావు కదా. అన్నీ వాళ్ళ చెల్లెలే మాట్లాడుతోంది. వాళ్లిద్దరే వచ్చారు. ఆ అబ్బాయికి ఓకే అయితే వాళ్ళింట్లో వాళ్ళకి ఒకేట"
స్వాతి "వాడిని చూడాల్సిన అవసరం నాకు లేదు" అని అన్విత మీద కోపంగా అరిచి, ప్రదీప్ రావటంతో "ఏదన్నా కూడా అన్నయ్య ఇష్టం. నాదేం లేదు"
ప్రదీప్ "అన్వి, వాళ్ళు చిన్నూని తీసుకుని రమ్మంటున్నారు" అని చెప్పటంతో, అన్విత స్వాతి కలిసి హాల్ లోకి వెళ్లి స్వాతిని ఆ అబ్బాయి ముందర ఉన్న కుర్చీలో కూర్చోమని ప్రదీప్ స్వాతి పక్కన కూర్చున్నాడు. స్వాతి మనసు మాత్రం హరీష్ ఆలోచనల్లోనే ఉండిపోయింది.
పెళ్ళికొడుకు చెల్లెలు "నా పేరు సంజన. మరి మీ పేరేంటండి"
స్వాతి ఆ ప్రశ్న వినిపించుకోలేదు. ఆమె సమాధానం చెప్పకపోవడంతో, ఆమె వెనకే నిల్చున్న అన్విత స్వాతి భుజం మీద మెల్లగా తట్టింది. స్వాతి అయోమయంగా అన్వితని చూడగా, "నీ పేరు చెప్పు" అంటూ వాళ్ళ వైపు సైగ చేసింది.
స్వాతి నిట్టూర్చి "స్వీటీ.... అదే స్వాతి" అంది తడబడి.
"స్వీటీ స్వాతినా? బావుందండి"
అన్విత "ఇంట్లో అలా పిలుస్తాము. తన పేరు స్వాతి అండి"
"ఓహ్. అయితే మా అన్నయ్యకి మీరు నచ్చితే, తానూ అలాగే పిలుస్తాడులెండి"
స్వాతి ఆమెని కోపంగా చూసి "నేను మా బావకే స్వీటీని. మీ అన్నకి కాదు" అని అరావాలనుకుని, అరవలేక మౌనంగా తల దించుకుంది.
"మీరు చదువుకుంటున్నారు కదా మరి నెక్స్ట్ మంత్ పెళ్ళి అంటే చదువు మానేస్తారా"
"లాస్ట్ సెమిస్టర్ లో ఉన్నాను. అయినా ఈ ఇయర్ తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నాను" అని చెప్పి "మా బావని" అనే మాట మాత్రం మనసులో అనుకుంది.
"చదువు తరువాత ఏం చేద్దామని, జాబా లేక ఇంకా చదవాలనుకుంటున్నారా"
"బావ ఇదే మాట నువ్వూ అడిగావు. ఆ రోజు చెప్పలేదు. ఇంక మళ్ళీ చెప్పలేనేమో నీకు" అని బాధగా నిట్టూర్చి "రెండూ కాదు. ఇంట్లోనే ఉంటాను"
"ఏంటండీ తనకి మా సంబంధం ఇష్టం లేనట్లుంది. చాలా కోపంగా ఉన్నారు. అసలు తల పైకెత్తటం లేదు. ఒకసారి మా అన్నయ్యని చూడమని చెప్పండి"
ప్రదీప్ స్వాతికి మాత్రమే వినిపించేలాగా "చిన్నూ ఒకసారి తనని చూడరా. బాగోదు"
"మా ఇంట్లోవాళ్ల ఇష్టంతోనే నా పెళ్లి జరగాలనుకున్నాను. అందుకే వాళ్ళకి నచ్చితే చాలు" అంటూ ప్రదీప్ వైపు చూసింది.
సంజన "అన్విత గారు, ఇలాగే మనం కూర్చుని ఉంటె, మా అన్నయ్య నాతోనే మాట్లాడిస్తాడు. మనముంటే వీళ్ళు సిగ్గుపడ్తున్నారు. వీళ్ళనే మాట్లాడుకోనిద్దాం. మనం బయటకి వెళదాము" అంటూ అందరూ బయటకి వెళ్ళారు.
స్వాతి అన్వితని వెళ్ళనీయకుండా ఆమె చేయి గట్టిగ పట్టుకుంది. అన్విత "స్వాతి, నీకిదే ఛాన్స్. తను నచ్చలేదని అతనికే చెప్పేసెయ్యి. మేము బయట ఉంటాము" అని స్వాతి చేయి తీసి ఆమె ప్రదీప్ వెనకే వెళ్ళిపోయింది.
Comments
Post a Comment