31
"నేనూ అన్నయ్యా ఈ పెద్ద వాళ్ళ మధ్యలో నుంచి జంప్ అవుతున్నాము. అటు రావచ్చా"
"ఆ అడగడమేంటి. రండీ..... "
స్వాతి నవ్వి "సరే" అని ఫోన్ పెట్టేసింది
అన్విత ఏదో గుర్తొచ్చినట్లుగా, "అన్నయ్యా, కంప్యూటర్ ఉందా. ఒక చిన్న వర్క్ ఉండిపోయింది కాలేజ్ ది. ఈలోపు ఫినిష్ చేసేసుకుంటాను"
హరీష్ నవ్వుతూ, మా ఇంట్లో కంప్యూటర్ ఎక్కడుందో నీకు తెలీదేంటి. బావ వచ్చాక వెళ్ళచ్చులే, అప్పటి వరకూ ఉండు. నాకు నీ హెల్ప్ కావాలి కిచెన్ లో" అంటూ వంటిట్లోకి వెళ్ళాడు.
తన వెనకాలే అన్విత కూడా వెళ్ళి, ఇద్దరూ తినటానికి ఏవో చేశారు, స్వాతి వాళ్ళొచ్చేలోపు. డోర్ బెల్ మోగగానే, హరీష్ నవ్వుతూ, "ఇందాక కంప్యూటర్ పనుందన్నావ్ కదా, వెళ్ళి చేసుకోలే. నేను చూస్తాను"
"అబ్బా అన్నయ్యా!! అదేమీ లేదు. మీకు ప్రైవసీ కావాలని చెప్పచ్చుగా" అంది అన్విత సిగ్గుపడుతూ
"మాకు అంతలేదులే. వెళ్ళు వెళ్ళు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు" అంటూ అన్వితని పంపించి డోర్ తీసాడు హరీష్
"రా బావా..... కంగ్రాట్స్. అవునూ ఇంతకీ పార్టీ ఎప్పుడూ"
ప్రదీప్, స్వాతి లోపలికి వస్తూ, "పార్టీది ఏముంది. నీ ఇష్టం బా... నువ్వెప్పుడంటే అప్పుడు" అన్నాడు నవ్వి. స్వాతి "అవును బావా..... అన్వి ఏది" అంది చుట్టూ చూస్తూ
హరీష్, "తను కంప్యూటర్ లో ఏదో వర్క్ ఉందని చేసుకుంటోంది. బావా తనని పిల్చుకుని రా. నేను పిలుస్తుంటే రావట్లేదు". ప్రదీప్ "అంత లేదులే బా..... పనయ్యాక అదే వస్తుందిలే" అన్నాడు హరీష్ తనని ఎందుకు వెళ్ళమంటున్నాడో అర్థమయ్యి నవ్వుతూ. "అబ్బా పిలువన్నయ్యా. అది వస్తే దాన్నో క్వశ్చన్ అడగాలి" అంటూ ప్రదీప్ ని తోసింది స్వాతి
ప్రదీప్ పైన హరీష్ రూమ్ కి వెళ్ళగానే, స్వాతి "బావా ఏమైందీ. నా వైపు చుడను కూడా చూడటంలేదు" అని అడుగుతుంటే, హరీష్ వంటిట్లోకి వెళ్ళాడు. తన వెనకాలే వెళ్ళి, హరీష్ ని వెనక నుంచి హత్తుకుని, "కృష్ణా కోపమొచ్చిందా" అని అడిగింది ప్రేమగా. హరీష్ ఏమి మాట్లాడకుండా ఏవో సద్దు్తుండగా, స్వాతి అవేమి పట్టించుకోకుండా, అతని వీపు మీద తల ఆన్చుకుని, "నాతో మాట్లాడవా కృష్ణా"
హరీష్ స్వాతి వైపుకి తిరిగి "నోరు తెరువు" అనగానే, అతనేందుకు అన్నాడో అర్థం కాకపోయినా నోరు తెరిచింది.
స్వాతికి తినటానికి పెట్టగానే "కృష్ణా..... పానీపూరి" అని గట్టిగా అరిచింది స్వాతి. హరీష్ "కోపమొస్తే నీకు ఇష్టమైనవి చేస్తానా" అన్నాడు ఆమెని దగ్గరకి తీసుకుని. "నా కోసం చేసావా?? నువ్వే చేసావా?? థాంక్యూ థాంక్యూ థాంక్యూ.... " అంటూ హరీష్ బుగ్గ మీద ముద్దు పెట్టి, "ఇంకోటో" అడిగింది స్వాతి. "ఇంకా ఒక్కటే. మీ అన్నయ్య వాళ్లొచ్చాక తినచ్చు మళ్ళీ" అని హరీష్ అనగానే, మళ్ళీ ముద్దు పెట్టి రెండోది తింది. "ప్రతీ పూరి కి ఒక ముద్దా. అయితే అన్నీ నువ్వే తిను" ఆమెని ప్రేమగా చూస్తూ. "అన్నిటికి ఇచ్చేస్తారేంటి" అంటూ అక్కడ నుంచి పరిగెత్తి వెళ్ళి సోఫా లో కూర్చుంది.
హరీష్, స్వాతి వెనకాల కూర్చొని తనని దగ్గరకి తీసుకున్నాడు. స్వాతి హరీష్ మీదకి వాలిపోతే, హరీష్ తనని పొదవిపట్టుకుని, స్వాతి కళ్ళలోకి చూస్తూ, "ఇప్పుడు చెప్పు, ఇందాక ఏదో చెప్తున్నావ్ కదా ఫోన్లో" అని అనగానే "నేనా, ఏం లేదు బావా" అంటూ స్వాతి లేవబోయింది. హరీష్, స్వాతిని లేవనీయకుండా గట్టిగా పట్టుకుని, "కాదు, చెప్పు. ఏమన్నావో"
స్వాతి కళ్ళు మూసేసుకుని, హరీష్ గుండెల్లోకి తల దాచేసుకుంది. హరీష్ తన తలతో స్వాతి తల మీద కొట్టి, "పిచ్చి పిల్లా. ఎందుకురా అంత భయం మన పెళ్ళవదేమోనని. మొదట్లో ఎవరూ ఒప్పుకోకపోవచ్చేమో, కానీ అందరినీ ఒప్పించె మనం పెళ్లిచేసుకుంటాము."
"కానీ కృష్ణా...."
"ఏంటి కానీ, అర్థణాలు. అంతా స్మూత్ గా జరిగేలా నేను ఒప్పిస్తాను, నేను చూస్కుంటా అవన్నీ. నువ్వు టెన్షన్ తీసుకోకుండా, నా పక్కన ధైర్యంగా నిల్చుంటే చాలు నాకు వందెనుగుల బలం వస్తుంది, నేను చేసేవన్నీ చేస్తాను. సరేనా. ఇందాకా నువ్వడిగిన ఇంకో మాట, నీ మీద ఎప్పుడూ కోపం రాదు. నువ్వేదన్నా నాకు చెప్పకుండా మన విషయంలో నువ్వొక్కదానివే సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చాలా బాధపడ్తాను. అంతే. అదొక్కటే. నిన్ను వదిలే సమస్యే లేదు"
"లవ్ యూ బావా"
స్వాతి నుదురు మీద ముద్దు పెట్టుకుని "లవ్ యూ రా"
"కృష్ణా, నువ్విలా దగ్గరకి తీస్కుని నన్ను వదలనూ అంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది"
ప్రదీప్, అన్వి మెట్ల దగ్గర నుంచి వాళ్ళ మాటలు వినీ, "ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది అన్వి. స్వాతి టెన్షన్ కి ఎలాంటి వాడు వస్తాడో అనుకునేవాడిని"
"బావా, హరీష్ అన్నయ్యకి అదంటే ప్రాణం. దాన్ని బాగా చూస్కుంటాడు. నువ్వు టెన్షన్ పడకూ" అంటూ తన భుజం మీద చేయి వేసి, "హరీష్ అన్నయ్యా మేము కిందకి రావచ్చా" అని నవ్వుతూ అడిగిందీ. స్వాతి హరీష్ కి ముద్దు పెట్టి దూరం జరగగా, హరీష్ నవ్వుతూ "రండీ. మీకోసమే వెయిటింగ్."
అన్విత రాగానే స్వాతి, "ఒదినా ఎన్నాళ్ళయ్యిందో నిన్ను చూసీ" అంటూ పట్టుకుని, "అబ్బో నీ ఉంగరం భలే ఉందే. బావా ఇది చూసావా?? డిజైన్ బావుంది కదా. ఎప్పుడు కొన్నావ్ అన్వి , చూపించ లేదు" అంటూ ఆపకుండా మాట్లాడింది
ప్రదీప్, స్వాతి వైపు కోపంగా చూస్తుంటే, అన్వి మాత్రం "ఏంటే కొత్తగా ఒదిన లో కి వచ్చావు. ఏమక్కర్లేదు. పేరు పెట్టె పిలువు"
"ఒద్దులే, మా అన్నయ్య మళ్ళీ ఫీల్ అవుతాడు వాళ్ళ డార్లింగ్ని పేరుతో పిలిస్తే"
"చిన్నూ" అంటూ ప్రదీప్ స్వాతి దగ్గరకి రాబోతుంటే స్వాతి హరీష్ వెనకాల దాక్కుని గట్టిగా పట్టుకుంది.
హరీష్ పక్కకి జరిగి స్వాతి ని గట్టిగా పట్టుకుని, "ఎందుకు బావ తనని బెదిరిస్తావు, చిన్న పిల్లని చేసి"
స్వాతి.... "అదే కదా, అలా అడుగు బావ. అన్నట్లూ బావ నువ్వా ఉంగరం చూసావా ఎంత బావుందో కదా" అంటూ హరీష్ వెనకగా ఉన్న చేత్తో తన వీపు చిన్నగా తట్టింది.
హరీష్ కి అర్థమయినట్లుగా, "అవును స్వీటీ, నేనూ గమనించనేలేదు. వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయిందా, నాకెవరూ చెప్పనే లేదు"
"ఎవరికైనా చెప్తే కదా. మా ఈ హిట్లర్ అన్నయ్య వాళ్ళ డార్లింగ్ కి ప్రపోజ్ చెసాడు"
అన్వితకి సిగ్గుతో మాటలు రావటం లేదు. ప్రదీప్ కోపంగా "హిట్లరా??"
"ఆ పేరు పెట్టింది నేను కాదు మీ రంభ గారే పెట్టారు"
ప్రదీప్ అన్వి వైపు చూడగా, అన్వి "ఇది నన్ను ఇరికించేసింది" అనుకుంటూ "అన్నయ్యా ఇందాకా వీళ్ళొస్తారని ఏదో చేసినట్లున్నావ్ కదా తీసుకొద్దామా" అంటూ లోపలికి పరిగెత్తింది
హరీష్ నవ్వుతూ "వస్తున్నా" అంటూ వెళ్ళగా, స్వాతి ప్రదీప్ ని పట్టుకుని, "సరదాగా ఆటపట్టిస్తున్నా అన్నయ్యా. ఫీల్ అయ్యావా. సరేలే ఇంకెప్పుడూ నిన్నేమీ అననులే" అంటూ బుంగమూతి పెట్టింది
"అంత నటించకు చిన్నూ. నేనేమి ఫీల్ అవలేదు కానీ ఇదే ఫ్లో లో ఇంట్లో చెప్తావేమో అని భయం రా" అన్నాడు నవ్వుతూ
వారం రోజులు దాటింది. ఒకరోజు హరీష్ కి మెసేజ్ చేసింది స్వాతి "ఏం చేస్తున్నావ్ బావా"
హరీష్ ఒక రెండు గంటల తర్వాత రిప్లై చేసాడు, "పనిలో ఉన్నానురా. ఈరోజు కూడా ఇంటికి వెళ్లేసరికి లేట్ అయ్యేలా ఉంది".
"సరే చూస్కోలే. తిన్నావా ఏమన్నా" అనడిగింది స్వాతి. కానీ మళ్ళీ ఇంక సమాధానం రాలేదు.
సాయంత్రం చల్లగాలికి మేడ మీదకి వెళ్ళి కూర్చుంది. "వారం రోజులు నుంచి ఇదే జరుగుతోంది. ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడావు, మళ్ళీ కబురు లేదు. కృష్ణా ఒక్కసారి నీ గొంతు వినాలనుంది" అంటూ కళ్ళు మూసుకుని హరీష్ కబుర్లని తల్చుకుంటూ కూర్చుంది.
"చిన్నూ ఏం చేస్తున్నావిక్కడ" అంటూ వచ్చిన ప్రదీప్ పిలుపుతో కళ్ళు తెరిచి
"ఏంలేదు. ఊరికే కూర్చున్నా అన్నయ్యా"
"ఏంటిరా సంగతులు. కాలేజ్ ఎలా ఉంది"
"కాలేజ్ బానే ఉంది. అవునూ....అన్నయ్యా, బావ ఏంటీ ఈ మధ్యన అసలు ఇంటికి రాలేదు. మీ ఇద్దరూ కలిసి వెళ్ళటం లేదా"
"లేదురా. తనకి నాకు టైమింగ్స్ సెట్ అవటం లేదు. ఏమయ్యిందీ"
"ఏంలేదు, ఊరికే అడిగాను" అంది నీరసంగా
"చిన్నూ"
స్వాతి బాధగా "వన్ వీక్ నుంచి కాల్ లేదు. మనిషి కనపడనే లేదు, మెసేజ్ చేసినా పనిలో ఉన్న అని తప్ప ఇంకేం మెసేజ్ లేదు"
"చిన్నూ..... ఒక వారం కి ఇలా అయిపోతే ఎలా. తనూ బిజీ గా ఉన్నాడని చెప్తున్నాడు కదా. ఓపిక పట్టాలిరా. నువ్వలా డల్ అయిపోతే తనెలా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. నీకు కుదిరినప్పుడు నువ్వు మెసేజ్ చేయి, తను రిప్లై చేయలేకపోతే బాధపడకు, తనూ నిన్ను అంతే మిస్ అవుతాడు. అర్థం చేసుకోకపోతే ఎలాగా"
"అవుననుకో...... కానీ ఏమో"
"అదే పనిగా తన గురించే కాకుండా, ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయటమో, నీ బుక్స్ కి దుమ్ము దులపటమో చేస్తే మూడ్ మారుతుంది" అన్నాడు నవ్వుతూ
"మళ్ళీ మొదలెట్టేసాడు" అనుకుంటూ "సరే అన్నయ్య" అని ఊరుకుంది.
అలా చూస్తుండగానే ఇంకో పది రోజులు గడిచాయి. హరీష్ నుంచి "పనిలో ఉన్న" అనే సమాధానం తప్ప ఏమి లేదు. ఆ బాధ లోపల తనని తినేస్తున్నా బయటకి ఏమి చెప్పకపోయినా, తనలో మార్పుని గమనిస్తూనే ఉన్నారు ఇంట్లో.
స్వాతి హాల్ లో కూర్చుని చదువుకుంటుండగా,
"అమ్మా పెద్దత్తయ్య కాల్ చేస్తోంది నీకు"
"వస్తున్నా" అంటూ స్వాతి దగ్గర ఫోన్ తీస్కుని పద్మగారు మాట్లాడారు. వాళ్ళ కుశల ప్రశ్నలు అయ్యాక, స్వాతి ధ్యాస వాళ్ళ మాటలు మీద పడి, చేసే పని ఆపేసింది
"ఒదినా హరీష్ బంగారం లాంటి పిల్లాడు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు, పెద్దలంటే భయం, గౌరవం ఉన్నాయి. వాడితో పెళ్ళైతే ఏ అమ్మాయైనా సుఖపడ్తుంది. కానీ ఒదినా, ఒక సారి వాళ్లకి చెప్పేముందర నువ్వూ ఆలోచించుకో"
వాళ్ళ అమ్మగారి మాటలు వినీ, స్వాతి మొహం వెలిగిపోయింది. అటు వైపు ఏం మాట్లాడారో వినిపించలేదు కానీ, మళ్ళీ పద్మగారు "ఆ... అదే నేను అనేది. ఆవిడతో పడలేరు ఒదినా ఎవరూను. వాడెంత మంచి వాడైనా ఆవిడ నోటి గురించి తెలిసి తెలిసీ సంబంధం ఏం చెప్తాము. నా సలహా అడిగితె మాత్రం ఒద్దనే చెప్తాను ఒదినా"
ఆ తరువాత వాళ్లింక ఏం మాట్లాడుకున్నారో, ఆవిడ ఫోన్ ఎప్పుడు పెట్టేసిందో ఇంకేమి తెలీవు, వినిపించలేదు. స్వాతికి దుఃఖమొచ్చేసింది.
ఒక రోజు ప్రదీప్ ఇంటికి వచ్చి, కాఫీ తాగుతూ, "అమ్మా చిన్నూ బయటకి వెళ్ళిందా"
"లేదురా మేడ మీద కూర్చుందేమో. ప్రదీపు ఏమయిందిరా దానికి. అది, అయితే కాలేజ్ లో ఉంటుంది, ఇంట్లో ఉంటే దాని రూమ్ లో ఉంటుంది లేదా మేడ మీద ఉంటుంది. ఏమీ మాట్లాడటం లేదు. ఏదైనా గట్టిగా అడిగితే విసుక్కుంటోంది. తిండి సరిగ్గా తినటం లేదు. మూడు రోజులు నుంచి మరీ నీరసమైపోయిందిరా"
"నేనూ చూస్తూనే ఉన్నానమ్మా. నేనడిగితే ఏంలేదు బానే ఉన్నాను అంటోంది. రమ్య ని అడిగాను, కాలేజ్ లోను వాళ్ళతో కలవటం లేదుట. వాళ్ళు ఆగమన్నా, ఇంటికి వెళ్ళిపోతా, చదువుకుంటాను అని వచ్చేస్తోంది. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా భయపడుతోందేమో అంటుంది రమ్య"
"ఆ మరే. ఆ ఎగ్జామ్స్ ఇంకా మూడు నెలలు ఉన్నాయి. ఇప్పటి నుంచి బెంగెట్టేసుకోటానికి"
"అదే కదా. నేను మళ్ళీ మాట్లాడతానులే. నువ్వు ఖంగారు పడకూ" అంటూ ప్రదీప్ స్వాతి దగ్గరకి వెళ్ళాడు
స్వాతి గోడ మీద కాళ్ళు బయట వైపు పెట్టి కూర్చుంది. ప్రదీప్ వెనక నుంచి వచ్చి, " చిన్నూ, ఏంటా కూర్చోటం. గోడ మీద నుంచి దిగూ, కిందపడ్తావ్"
ప్రదీప్ ని చూసీ చిన్నగా నవ్వి, గోడ దిగింది. "ఎప్పుడొచ్చావు అన్నయ్యా ఆఫీస్ నుంచి"
"వచ్చి అరగంటయ్యింది. ఏంటిరా సంగతులు"
"ఏంలేదు అన్నయ్యా. అన్వి తో మాట్లాడావా"
"ఈరోజా?? లేదు"
"ఈరోజని కాదులే. నిన్న దానికి చేస్తే బయట ఉన్నాను మళ్ళీ చేస్తా అందీ"
"అవునురా, ప్రాజెక్ట్ సబ్మిషన్ డేట్ దగ్గర పడిందిట. ఆ పనుల్లో కొంచం బిజీ గా ఉంది. వేరే ఆఫీస్ కి వెళ్ళి వస్తోంది. అందుకే ఖాళీ ఉండట్లేదు"
"సరే అన్నయ్యా. అంత బిజీగా ఉంటుంటే మరి నీకు కాల్ చేసిందా ఈ మధ్యలో"
"చేస్తూనే ఉంటుందిరా" ప్రదీప్ అనుమానంగా, "చిన్నూ, హరీష్ తో మాట్లాడావా, ఏమంటున్నాడు"
స్వాతి మౌనంగా ఉండిపోయింది.
"చిన్నూ.... "
ప్రదీప్ భుజం మీద తల వాల్చి, బొంగురుగొంతుతో "అన్నయ్యా..... ట్వంటీ డేస్ అయ్యింది. తన నుంచి మెసేజ్ లేదు అన్నయ్యా. మరీ అంత బిజీ అయిపోతారా ఎవరన్నా. ఎన్ని సార్లని నాకు నేను సర్దిచెప్పుకొను. నేను కలవమని కూడా అడగటం లేదన్నయ్యా, ఫోన్ కూడా అక్కర్లేదు, ఒక్క మెసేజ్ చాలు"
"అది కాదురా, మీరేమన్నా గొడవ పడ్డారా"
"అన్నయ్యా ఫోన్ తీస్తే కదా గొడవ పడేది. అప్పటికి నేను ఎప్పుడూ కూడా నువ్వు మెసేజ్ చేయటం లేదెందుకు అని కూడా అనలేదు. బాధనిపించినా ఒక్క మాట తనని అననేలేదు. నువ్వు చూడు పోనీ నీకేం అనిపిస్తోందో " అంటూ ప్రదీప్ కి తన ఫోన్ మెసేజెస్ చూపించింది.
స్వాతి నాలుగైదు మెసేజ్ లు చేస్తే, "బిజీ గా ఉన్నాను", "మళ్ళీ మెసేజ్ చేస్తా", "బయట ఉన్నాను".... ఇవే ఉన్నాయి.
"అన్నయ్యా.... బావ.... నన్ను....." స్వాతికి మాట రావటం లేదు. అప్పటి వరకూ బలవంతంగా ఆపుకున్న ఏడుపు ఇంక ఆపుకోలేకపోయింది.
తను ఏం చెప్దామనుకున్నదో అర్థమయిన ప్రదీప్... "చుప్..... అదేమీ కాదురా. హరీష్ నిన్ను ఎప్పటికి దూరం చేస్కోడు. తన పరిస్థితి ఏంటో మనకి తెలీదు కదా. అలా ఆలోచించకూ"
"సరే'
"సరే రా కిందకి వెల్దాము. అమ్మ కూడా బాధపడుతోంది. నేనూ హరీష్ తో మాట్లాడతానులే"
"ఒద్దన్నాయా. నువ్వేమి అనకు. తనే వస్తాడులే. నువ్వు కిందకి వెళ్ళు నేనూ వస్తాను"
Comments
Post a Comment