30

 ఏదో మెసేజ్ వచ్చిందని చూసిన ప్రదీప్ ఖంగారుగా స్వాతి రూమ్ కి పరుగున వెళ్ళాడు.  


ప్రదీప్ ని చూసి స్వాతి నవ్వుతూ,  "ఫోటో బావుందా అన్నయ్యా" 


"చిన్నూ....  ఈ ఫోటో....  అంటే నువ్వూ.....  " 


"హహహ్.. అన్నయ్యా,  నువ్వేనేంటి ఎప్పుడూ నా మీద స్పై చేస్తావు.  ఈ సారి నేనూ చేశా, నువ్వు దొరికిపోయావ్. నేనడిగింది ఏమైనా చేయలేదనుకో,   ఇందాకా నీకు అన్వికి మధ్య జరిగిందంతా ఈసారి ఫోటో కాదు అమ్మ కి వీడియో చూపించేస్తాను" అంటూ నవ్వింది 


"వీడియోనా,  అంత పని చేయకురా.  ఏం కావాలో చెప్పు" అన్నాడు భయపడుతూ బుజ్జగించినట్లు 


"మరి నాకు పానీపూరి" 


"నీకీ పిచ్చేంటిరా. మొన్ననే సెలైన్ పెట్టుకున్నావు సరిపోలేదా" 


"సరేలే ఒద్దులే. జరుగు అన్నయ్యా. నేను అమ్మ దగ్గరకి వెళ్ళాలి. అమ్మా ఈ వీడియో... " 


ప్రదీప్ స్వాతి నోరు మూసేసి "చిన్నూ ఆడేసుకుంటున్నావు కదా. సరేలే" 


ప్రదీప్ చేయి తోస్తూ, స్వాతి "ఏంటి సరే.... " 


"పానీపూరి అడిగావు కదా సరే ఇప్పిస్తాలే" 


"అదీ....  గుడ్"


"హరీష్ బావ కి కాల్ చేయి" 


స్వాతి అనుమానంగా "ఎందుకూ" 


"నీకెప్పుడు పానీపూరి కావాలన్నా చేసి పెడ్తా అన్నాడు కదా. ఇప్పుడు బలయ్యాడు. తనతోనే చేయిస్తా. నువ్వు నాతో ఆడుకున్నావనుకో నేను తనని ఆడుకుంటా చూడూ...." 


"అక్కర్లేదులే..... నీ ఫోటోలు నువ్వే దాచుకో. నాకేమక్కర్లేదు. బావ ని సతాయించకు. నాకేమి నీ పానీపూరి లు అక్కర్లేదులే. వెళ్ళి పడుకో,  మీ డార్లింగ్ ని తల్చుకుంటూ " అంటూ ప్రదీప్ ని తోసింది 


"నీకు బాగా నోరు ఎక్కువయ్యిందిరా చిన్నూ" అంటూ నవ్వుకుని వెళ్ళిపోయాడు 


తర్వాత రోజు పొద్దున అందరూ కాఫీలు తాగుతూ,  రామ్ గారు "ప్రదీపు, ఈరోజు రమేష్  మావయ్య,  అత్తయ్య వస్తామన్నారు, మాట్లాడటానికి. పెద్ద మావయ్య, మహేశ్వర రావు మావయ్య (అదేనండి హరీష్ వాళ్ళ నాన్నగారు)  వాళ్ళు కూడా వస్తారనుకుంటా. నువ్వూ ఉంటే బావుంటుందేమోరా" 


"లేదు నాన్నా. మీరు మాట్లాడండి. కానీ,  మీకు నేను చెప్పక్కర్లేదని తెలుసు, ఏ విషయంలోనూ వాళ్ళని ఇబ్బందిపెట్టకండి. అందరమూ మధ్యతరగతి వాళ్ళమే కదా" 


పద్మగారు "చూసారా అప్పుడే మావగారిని సపోర్ట్ చేసేస్తున్నాడు. నువ్వు మరీ ఇంత మారిపోతావనుకోలేదురా" అన్నారు నవ్వుతూ 


"అబ్బా.... అమ్మా...  అన్విత నాన్న కాబట్టి చెప్పటం లేదు. నాకు అయన మేనమామ కాబట్టి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టి నేను పెళ్ళికి ఒప్పుకోను అంటున్నా" 


"సరే. అమ్మ సరదాగా అందిలే. మాకు తెలీదా నీ గురించి. అయినా మావేమి డిమాండ్స్ లేవురా. నువ్వు హ్యాపీగా ఉండాలి. అంతే" అన్నారు రామ్ గారు 


"సరే నాన్నా"


హరీష్ వాళ్ళ ఇంట్లో.... 


మహేశ్వర రావు గారు తలుపు తీస్తూ, "రండి రండి. అన్విత ఎలా ఉన్నావు" అంటూ పలకరించారు 


"ఎవరూ" అంటూ వంటింట్లో నుంచి హరీష్ వాళ్ళ అమ్మ గారు అడిగేసరికి, "ఇంకెవరు, పెళ్ళివాళ్ళు వచ్చారు" 


"అప్పుడే ఎక్కడ పెళ్లి, స్వాతి కి పెళ్ళవ్వాలి అని షరతు పెట్టారుటగా. ఎప్పటికవుతాయి ఇవన్నీ" అంటూ ఆవిడ లోపలి నుంచి వచ్చారు. 


ఆవిడ మాట విన్న అందరికీ ఒకసారి మనసు చివుక్కుమంది. 


అన్విత వెంటనే,  "అదేంటి పెద్దమ్మ. స్వాతి, నేనూ ఇంకా చదువుకుంటున్నాము. మా చదువులు అవ్వాలి కదా ముందర. అది ఇప్పుడే పెళ్ళి చేసుకోనన్నా పర్వాలేదు నాకైతే. తొందరపడేకన్నా,  నెమ్మదిగా అయినా పర్వాలేదు, మంచివాడు వస్తే చాలు దానికి." 


లోపలికి వస్తున్న హరీష్ వైపు చూసి "అదిగో అన్నయ్య వచ్చాడు" అంది నవ్వుతూ 


హరీష్ వాళ్ళ నాన్నగారు మాత్రం,  "స్వాతికేంటే, బంగారం. చూస్తూ ఉండు, ఇట్టే అయిపోతాయి రెండు పెళ్ళిళ్ళూను" 


హరీష్ కి అన్విత మాటలు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అన్నదీ అర్థం కాక, "ఏమయ్యింది" అంటూ అన్విత ని కళ్లతోనే అడిగాడు 


"ఏంలేదు" అని అన్విత కూడా కళ్ళతోనే చెప్పింది 


"అక్కా... మీరు కూడా వస్తున్నారు కదా" అనడిగారు అన్విత వాళ్ళ అమ్మగారు 


"వీళ్ళ ఆఫీస్ వాళ్ళు పిలిచారట. అటు వెళ్ళాలి. అందుకే ఆలోచిస్తున్నాము" 


మహేశ్వర రావు గారు.... "పర్వాలేదులే సత్య. వీళ్ళతో వెళ్ళి,  అటు నుంచి వెళ్దాములే" అని చెప్పి,  తమ్ముడితో మాత్రం...


"అయినా మేము పెళ్ళికొడుకు తరపున వస్తున్నామురా" అంటూ నవ్వేశారు


"అంతేలే అన్నయ్యా. నువ్వేప్పుడూ అక్క వైపే. తమ్ముడిని ఒక్కడిని వదిలేసావు" అన్నారు సరదాగా నొచ్చుకున్నట్లు


"నిన్నొక్కడిని ఎక్కడ వదిలానురా. పెద్దన్నయ్య,  వదిన వస్తున్నారు కదా మీ వైపు. పద్మ ఒకత్తి అవుతుందని అటు వెళ్తా అన్నాను",   "అన్విత ఇక్కడుంటుంది రమేషు. మనం వెళ్ళొద్దాములే" 


రమేష్ ... "మేమూ అదే అనుకున్నాము అన్నయ్యా" 


అందరూ భోజనలవి చేసి,  స్వాతి వాళ్ళింటికెళ్ళారు. 


అన్విత....  "హరీష్ అన్నయ్యా.....  సారీ" 


హరీష్ అర్థం కానట్లుగా.... "సారీ ఎందుకూ" 


"స్వాతి... నీ గురించీ చెప్పినప్పుడు నేను చాలా నెగటివ్ గా రియాక్ట్ అయ్యాను. అదేదో నీ మీద కోపంతో కాదు. ఇద్దరి మధ్యన ఏ చిన్న డిస్టర్బన్స్ వచ్చినా అది తట్టుకోలేదు. అది మీ ఇద్దరూ గొడవ పడతారని కాదు, ఇంట్లో ఒప్పుకోకపోయినా ఇంకేమైనా అయినా కూడా అని...సారీ" 


హరీష్ నవ్వేసి "నేనెప్పుడూ ఆ విషయం పట్టించుకొనే లేదు. అయినా ఇప్పుడు సారీ చెప్తున్నావంటే నా మీద నమ్మకమొచ్చేసిందా" 


"ఆ...  ఈరోజు కాదు. స్వాతి పుట్టినరోజు నాడు,  ఫోన్ లో నాతో చెప్పావు కదా వాళ్ళ నాన్నతో దెబ్బలాడానని. ఆరోజే అనుకున్నాను. దాని కళ్ళలో నీళ్ళు రానీయవని. నేనే తప్పుగా అనేస్కున్నాను ముందర. కానీ ఆరోజు తర్వాత నీతో మాట్లాడె  సందర్బం రాలేదు. సారీ అన్నయ్య" 


"హ్మ్...  నీ సారీ ఆక్సిప్ట్ చేయాలంటే నువ్వు నాకో ప్రామిస్ చేయాలి" 


"ప్రామిసా.... ఏమని " 


"నువ్వు ఓకే అంటే చెప్తాను" 


"సరే...... చెప్పు" 


"స్వాతికి ఏదన్నా విషయంలో బాధపడుతోందని నీకు చిన్న అనుమానమొచ్చినా సరే, లేదా తను నీతో ఏమన్నా చెప్పినా, నువ్వు నాకు చెప్పాల్సిందే" 


"దానికి తెలిస్తే నన్ను చంపేస్తుంది" 


"నీ పేరు ఎందుకొస్తుంది. తనకసలే ప్రతీది దాచేసే అలవాటు. ఏదైనా పీకల మీదకొస్తే,  ఎవరైనా ఏం చేస్తారు. ఇంట్లో చెప్పాలన్నా లేదా రేపొద్దున పెళ్ళైనా కూడా,  అదేదో త్యాగం చేసేయాలనుకుని  నాకు ఏది తెలియనీయదని ఎక్కడో ఒక చిన్న భయం. అది బాధపడితే నేను చూడలేను అన్వి" 


"అన్నయ్యా..... నువ్వన్నా లాస్ట్ వర్డ్స్ కోసమైనా తప్పకుండా చెప్తాలే" 


"థాంక్స్ అన్వి" 


"థాంక్స్ కాదు,  అసలు నీ లవ్ స్టోరీ చెప్పూ.  స్వాతి చెప్పేసింది. నీ గురించే తెలీదు నాకస్సలు" అడిగిందీ నవ్వుతూ 


" హహహ.....  నేనెప్పుడూ స్వాతి తోనే ఈ టాపిక్ చెప్పలేదు. ఇప్పుడేముందిలే చెప్పేటంత" 


"అంటే దానికి చెప్పకపోతే నాకు చెప్పవేంటి,  చెప్పూ" 


"చిన్నప్పటి నుంచి అదంటే  పిచ్చే. దానితోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవాడిని. నాన్న కూడా ఎప్పుడూ దాన్ని బాగా చూస్కోవాలిరా,  బాధపెట్టకూడదు,  దాన్ని సతాయించకు... ఇవే చెప్పేవారు. అప్పట్లో తెలీదు కానీ ఇప్పుడనిపిస్తుంది, నాన్న కి స్వాతి చిన్నతనంలో విషయాలు తెలుసు కాబట్టే అలా చెప్పేవారేమో. కానీ ఎలా మొదలయ్యిందో తెలీదు, అదెప్పుడొచ్చినా ఊరుకి, దాన్నలా చూస్తూ గడిపేసేవాడిని. మేము ఇక్కడికొచ్చినప్పుడు, తనకి దగ్గర్లో ఉండాలనే ఈ లొకాలిటీ సెలెక్ట్ చేసాను,  తర్వాత కూ.. " 


"అవునా అన్నయ్యా..... వావ్" 


" హహహ ఇంక చాలులే" అన్నాడు హరీష్ సిగ్గుపడుతూ 


"ఆహా చెప్పు.... చెప్పూ....  ఇక్కడికొచ్చి ... ఏంటి"


"నేను వాళ్ళ కాలేజ్ కి వెళ్ళేవాడిని. తనకి తెలీదంతే. ఫస్ట్ టైమ్ తను ఐ లవ్ యూ చెప్పినప్పుడు,  షాక్ అయ్యాను,  ఎన్నేళ్ల నుంచో తన చుట్టూ తిరుగుతున్నాను కానీ ఈ విషయం తెలుసుకోలేకపోయాననిపించింది.  నేనెంత తన వెనకాలే తిరిగేవాడినో ఇప్పటికీ చెప్పలేదు తనకీ. అంత ధైర్యంగా ఆరోజు మాట్లాడింది కాని ఇప్పటి వరకూ ఎప్పుడూ అలా మాట్లాడటం విననేలేదు. తనలో నాకు చాలా నచ్చేదేంటో తెలుసా,  అందరినీ ప్రేమగా చూసుకుంటుంది. అందరి గురించి ఆలోచిస్తుంది,  అందరూ మనవాళ్లనుకుంటుంది. అదే నాకు తనలో చాలా బాగా నచ్చేది. అదే తనలో నెగటివ్ కూడా... ఇంకొకళ్ళకోసం దూకేయాలన్నా ఆలోచించకుండా దూకేస్తుంది. ఇప్పుడు నా భయమెంటంటే అదెందుకు దూకుతోందో అర్థం కాదు. అందుకే నీ హెల్ప్ అడిగాను" 


"సరే అన్నయ్యా. తప్పకుండా. నువ్వింతలా ప్రేమిస్తున్నావని అస్సలు తెలీదు నాకు. ఇంకో మాట,  ఆ రోజు ధైర్యంగా మాట్లాడిందన్నావ్ కదా ఆ రోజు దానికి చెప్పకపోతే ఇంక ఉండలేనేమో అనిపించిందిట. నాకదే చెప్పింది. నిన్ను చూస్తూ మైమరచిపోయి బయటకి అనేసిందిట" అంటూ నవ్వేసింది. "కానీ అన్నయ్యా,  అబ్బాయిలు కూడా ఇంతలా ప్రేమిస్తారా" 


"ఏ మా బావ ప్రేమించట్లేదూ నిన్ను. అలాగే. నేను పెద్ద గొప్పేమి కాదు" 


"ప్రదీప్ బావ వేరు. తన ప్రేమ కళ్ళలో కనిపిస్తుంది బయటకి చెప్పలేడు. అది మళ్ళీ నా ఒక్క విషయంలోనే. అన్నింట్లో మాత్రం గంటలు గంటలు మాట్లాడగలడు. కానీ అన్నయ్యా తను కళ్ళతో చెప్పిన ఒక్క మాట అయినా చాలు నాకు ఎంత టెన్షన్ లో ఉన్నా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. తనకోసం ఏం చేసేయటానికైనా నేను రెడీ" 


"హాహాహా.....  అబ్బాయిలంతే. బయటకి మీరు ఎక్సప్రెస్ చేసినట్లు మేము చేయలేము. నా కేసు వేరు. నేనొక్కడినే అబ్బాయిని ఇంట్లో. నాన్న ఎప్పుడూ ఇంట్లో తక్కువే,  జాబ్ లో ఉన్నన్నాళ్ళు. అమ్మ వెనకాలే ఉండేవాడిని.  అలా కొంచం మాట్లాడటం అలవాటయ్యింది. ఇప్పుడు బాగా యూస్ అవుతోంది" అంటూ కన్ను కొట్టి నవ్వాడు 


ఇద్దరూ నవ్వుకుని,  అన్వి.... "అన్నయ్యా ఒకసారి స్వాతి కి కాల్ చేసి వస్తాను. అక్కడేం జరుగుతోందో అడుగుతా" 


హరీష్  నవ్వుతూ ...  "స్పీకర్ లో పెట్టు. నేనూ వింటాను" 


అన్విత,  స్వాతి కి కాల్ చేసింది.


స్వాతి నీరసంగా "చెప్పవే " 


అన్వి... "ఏమైందే అలా ఉన్నావ్" 


"ఓయి నువ్వెందుకు కాల్ చేసావే" 


"ఎందుకే విసుక్కుంటావు. ఏం జరుగుతోందక్కడ అనే చేశాను కానీ నువ్వెందుకు అలా ఉన్నావు" 


"ఏమవ్వటం లేదు. వీళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అయినా ఏముంటాయి చెప్పు,  నాన్న ఫస్ట్ చెప్పేసారు, 'మీ అమ్మాయి పెళ్ళి మీరెలా చేయాలనుకుంటే అలా చేయించండి. ఖర్చులు సమానంగా పెట్టుకుందాము' అన్నారు. కానీ అన్వి.."


"ఆ చెప్పూ..  ఏమైందీ" 


"నీకు యాభై ఏళ్ళొస్తే కానీ పెళ్ళవదేమోనే. నా పెళ్ళితో లింక్ పెట్టుకునీ కూర్చున్నారు,  ఇప్పట్లో అయ్యేలా లేదు" 


అన్విత,  హరీష్ ఇద్దరూ స్వాతి మాటలు అర్థం కాకా మొహాలు చూసుకుని,  "నీ మొహం....  ముందసలు అర్ధమయ్యే భాష లో చెప్పవే. టెన్షన్ పెట్టకుండా" 


"ఏంలేదులే సరదాగా అన్నాను. పక్కన అన్నయ్య ఉన్నాడా" 


"మీ అన్నయ్య నాతో ఎందుకుంటారు. ఇంకేం పనిలేదనుకున్నావా" 


"అది కాదే,  నేనొకటి ఆలోచిస్తున్నా. అన్నయ్య వింటే చంపేస్తాడని అడిగా ముందర. నా పెళ్ళికి మా నాన్నని ఫైనాన్సియల్ హెల్ప్ చేయమంటే ఎలా ఉంటుందే" 


"ఒసేయ్ ఏం మాట్లాడుతున్నావ్" అంటూ స్పీకర్ ఆఫ్ చేసేసి హరీష్ నుంచి దూరంగా వెళ్ళి,  "నీకేమైనా పిచ్చి పట్టిందా. ఇప్పుడసలు నీ పెళ్ళి గురించీ ఎందుకు టెన్షన్. ఎవరేమన్నారు" 


"అత్తయ్యా వాళ్ళు వచ్చారు కదే. అమ్మని కట్నం తీసుకోకపోతే ఎలాగా అందే" 


"అయితే కట్నాలు అడిగారా" 


"అబ్బా.....  అడగలేదే. కానీ అత్తయ్యకి బావ పెళ్ళి మీద చాలా హోప్స్ ఉన్నాయి. కట్నాలు,  కానుకలు ఎంత గ్రాండ్ గా చేయాలి అన్నీ కూడా. ఆ నంబర్లు విన్నప్పటి నుంచి బ్రెయిన్ పనిచేయట్లేదు.  అమ్మ వాళ్ళు చాలా కష్టపడతారే . అయినా వాళ్ళు చేయగలిగిన కూడా నేను ఒప్పుకోలేను. అలా అని బావని మర్చిపోలేను. ఏం చేయనే" 


"స్వాతి.....  పిచ్ఛాలోచనలు మానేసి ముందు ఈ ఇయర్ ఫినిష్ చేయి. ఆ తర్వాత కదా పెళ్ళి సంగతీ. హరీష్ అన్నయ్య ఇంట్లో చెప్పాక,  తనే చూస్కుంటాడేమో. అన్నిటి గురించీ ఇప్పుడే ఎందుకే  బుర్ర పాడుచేసుకోటం"


"అంతే అంటావా అయితే. సరేలే"


"నువ్వు నాకేం చెప్పకుండా పిచ్చి పనులు చేయకు. ఉంటా" అంటూ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ హరీష్ దగ్గరకి వెళ్ళింది 


"ఏమయ్యిందీ అన్వి.  ఇప్పుడా మనిషి దగ్గరకి వెళ్ళటం ఎందుకు. అసలు పెళ్ళి గురించీ సడన్ గా ఎందుకొచ్చింది. ఎవరైనా ఏమైనా అన్నారా" 


"లేదన్నయ్యా...  అదీ..... పెళ్ళి కబుర్లొచ్చి,  పెద్దమ్మ వాళ్ళు నీ పెళ్ళికి వాళ్ళ ఎక్సపెక్టషన్స్ అవీ ఏవో చెప్పారుట. అందుకని కొంచం ఖంగారు పడింది. 'అవేం పర్వాలేదులే. ముందు ఈ ఇయర్ అవ్వనీయి. అన్నయ్య మాట్లాడినప్పుడు,  తనే చూసుకుంటాడు అని చెప్పాను'. మళ్ళీ ఆ మనిషితో మాట్లాడ్తుందేమో ఎవరికీ తెలీకుండా అని,  నాతో చెప్పకుండా ఏంచేయకు అని అన్నాను. తప్పు చెప్పానా అన్నయ్యా"


"లేదు అన్వి. తను పెళ్ళి గురించి చాలా భయపడుతోంది. తనకి తగ్గట్లు ఏదో ఒక కారణం తో పోస్టుపోన్ అవుతోంది"


"అన్నీ సద్దుకుంటాయిలే అన్నయ్యా. ఈ విషయం కాదు కానీ,  ఒకసారి స్వాతి తో మాట్లాడు" 


హరీష్ ఏదో తడబడటం చూసీ అన్వి నవ్వుతూ,  


"లోపలికెళ్ళి మాట్లాడు పర్వాలేదు. నేనేం....  అనుకోను" 


ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లు హరీష్ గబగబా లోపలికి వెళ్ళి స్వాతికి ఫోన్ చేసాడు. 


"కృష్ణా  ఏం చేస్తున్నావ్. నువ్వూ రావచ్చు కదా,  మావయ్య వాళ్ళతో" అంది ప్రేమగా 


"పెద్దవాళ్ళతో బాగోదని రాలేదురా. అన్వి ఇప్పుడే  వచ్చింది,  ఇప్పుడు అవదులే ఇంక. నువ్వేదో డల్ గా ఉన్నావంది తను. ఏమైంది" 


"అది ఉందా..... ఏమని చెప్పింది" 


"ఏమి చెప్పలేదు. అంతే చెప్పింది. ఏమయింది" 


"ఏమవలేదు. ముందు చదువుకో,  పెళ్ళి సంగతీ తర్వాత అంది.  కృష్ణా .... నిన్ను చూడాలనుంది" 


"ఎలారా" 


"ఏమో....  నేనొకటి చెప్పచ్చా " 


"ఏంట్రా" 


"ఈ మాట నీ కౌగిట్లో,  నీ గుండెలకి దగ్గరగా ఉన్నప్పుడు మాట్లాడాలనుంది కానీ నీ కళ్ళలోకి చూసీ మాట్లాడలేను ..... కృష్ణా... ఒకపక్క అమ్మ,  నాన్న,  అన్నయ్య ఇంకో పక్క నువ్వూ ఉండే పరిస్థితే వస్తే నేనెలా ఫేస్ చేయను. వాళ్ళని కాదని నీ దగ్గరకొచ్చేస్తే మనస్ఫూర్తిగా,  సంతోషంగా ఉండలేను. అలాగే,  నేను వాళ్ళని కాదనలేకపోయినా,  వాళ్ళ మాటకి కట్టుబడినా, ప్రాణం నీ దగ్గర ఉంచి ఒక బొమ్మ లాగా ఉండిపోతాను. ఏ ఫీలింగ్స్ ఉండవు. నీకు దూరంగా ఉండలేను అలా అని వీళ్ళనీ బాధపెట్టలేను. భయమేస్తోంది" 


"   " 


"కృష్ణా " 


"ఆ" 


"ఏమయినా చెప్పు" 


"ఏం చెప్తాను,  నువ్వు చెప్తున్నావు కదా. వింటున్నా" 


"సరేలే. నేనుంటాను బావ. మళ్ళీ మాట్లాడతాను" అని ఫోన్ పెట్టేసింది స్వాతి. ఆమెలో అసహనం హరీష్ కి అర్థమయ్యింది. "అలా ఏమి కాదురా" అని హరీష్ చెప్తే స్వాతికి ధైర్యం. కానీ అతని ఆలోచనలు, ఆమెకి ఆ నమ్మకం ఎలా ఇయాలి అని. అందుకే మాట్లాడలేకపోయాడు. 


హరీష్ అలా ఆలోచిస్తూ అన్విత దగ్గరకి వచ్చి కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వాతి నుంచి హరీష్ కి కాల్ రాగా "చెప్పు స్వీటీ" 


"నేనూ అన్నయ్యా ఈ పెద్ద వాళ్ళ మధ్యలో నుంచి జంప్ అవుతున్నాము. అటు రావచ్చా" 


"ఆ అడగడమేంటి. రండీ..... " 


స్వాతి నవ్వి "సరే" అని ఫోన్ పెట్టేసింది



Comments