నాలో "నీ" నేను ఎపిసోడ్ 3

 రోజులు గడుస్తునాయి. ప్రదీప్ మాత్రం ఆ అబ్బాయి ఎవరా అని కనుక్కోవటానికి తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉనాడు.


ఒక రోజు,"అన్నయ్యా, "జావా"  చాలా కష్టం గా ఉంది. చూస్తూ ఉండగానే పరీక్షలు కూడా వచ్చేస్తాయి. నాకేమో ఇది బుర్ర కి ఎక్కటం లేదు. నువ్ చెప్పగలవా" అనడిగింది స్వాతి బతిమాలుతూ.


"నాది ఫైనాన్స్ సైడ్ కదరా. ఆ కంప్యూటర్స్ నాకస్సలు తెలీదు"


"పోనీ నీకు తెల్సినవాళ్లెవరన్నా ఉన్నారా, చెప్పగలరేమోను" 


"మీ రెబెల్ స్టార్ ఉంది కదా. తనని అడుగు" నవ్వుతూ చెప్పాడు ప్రదీప్. 


"అదీ, మనోజ్ వేరే గ్రూప్ కదా అన్నయ్యా. నాకు ఈ సబ్జెక్టు నచ్చదంటే వినకుండా, నన్ను తీసుకోచ్చి దీంట్లో పడేసారు మీరు". తల్లి, అన్నగారు చేసింది గుర్తు తెచ్చుకుని అలిగింది. 


ఇంతలో వీళ్ళ మాటలు వింటున్న వాళ్ళ అమ్మ గారు వచ్చి, "హరీష్ ది కూడా కంప్యూటర్సె కదా. వాడు కొన్నాళ్ళు ఇన్స్టిట్యూట్ లో కూడా చేసాడు వాడికి తెలుస్తుందేమో అడిగి చూడు". 


ప్రదీప్ కూడా, "అవునురా. ఈ ఐడియా కూడా బానే ఉంది. వాడిని అడిగి చూడు. ఇన్స్టిట్యూట్ లో చేసాడంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను బాగా ఎక్స్ ప్లయిన్ చేయగలడు కూడా. ఈ టైం లో అయితే ఇంట్లోనే ఉంటాడేమో" అంటూ ఫోన్ ఇచ్చాడు ప్రదీప్. 


"నాకు ఓకేనా కాదా అని కూడా అడక్కుండా ఫోన్ చేసేసి ఎలా  ఇచ్చేస్తున్నారో" అని గొణుక్కుంటూ ఫోన్ తీసుకుంది స్వాతి. 


హరీష్ వాళ్ళ అమ్మ గారు ఫోను తీయగా, కుశల సమాచారాలు అడిగి "అత్తయ్యా, నాకు కంప్యూటర్స్ ... జావాలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. బావ చెప్తాడేమో అడుగుదామని కాల్ చేసాను" అంది స్వాతి మొహమాటంగా. 


"అడగటానికి ఏం ఉంది. వాడి సబ్జెక్టు కూడా అదే. రేపెలాగో సండే కదా, వాడు ఇంట్లోనే ఉంటాడు. నువ్వు రా, వాడికి నేను చెప్తానులే" అంటూ ఫోను పెట్టేసారు ఆవిడ. 


"అత్తయ్య రేపు రమ్మంది అన్నయ్యా. నువ్వూ వస్తావా" ఇబ్బందిగా ప్రదీప్ వైపు చూసింది. 


ప్రదీప్ "నువ్వు డౌట్స్ చెప్పించుకుంటుంటే నేనేం చేస్తాను. కావాలంటే నిన్ను దింపేసి వచ్చేస్తాను" అన్నాడు ప్రదీప్, చెల్లెలి ఇబ్బందేమిటో గమనించకుండా. 


"ఏమక్కర్లేదులే. ఏదో  పెద్ద ఆఫర్ ఇస్తున్నావు. రెండు సందుల అవతల ఉన్న ఇంటికి దింపటానికి నువ్వేం కష్టపడక్కర్లేదు. నేనే వెళ్తా " అంటూ బుంగ మూతి పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయి రమ్య కి ఫోన్ చేసింది. 


"రమ్మీ,  రేపు మా బావ దగ్గరకి వెళ్తున్నా" అంది స్వాతి, స్నేహితురాలితో నవ్వుతూ బావ అనే మాటని వత్తి పలికి. 


"ఏమిటో స్పెషల్ " రమ్య కూడా సాగదీస్తూ అడిగింది నవ్వి. 


"ఐ లవ్ యు అని చెప్పటానికే " అంది స్వాతి కొంటెగా నవ్వుతూ  


రమ్య "నీ మొహానికి అంత సీన్ లేదులే. అదే ఉంటే ఈ పాటికి స్టోరీ ఇంకోలా ఉండేది. నీ భయాలు, సిగ్గుకి మీ బావే వచ్చి చెప్పినా ఆమ్మో అని అక్కడనుండి పరిగెడతావు. నువ్వు ప్రొపోజ్ చేయటం కూడాను" అంది స్వాతిని ఉడికించటానికి


స్వాతి బుంగమూతి పెట్టి "ఎందుకే అలా అంటావు. చూస్తూ ఉండు. నువ్వు అన్నందుకు అయినా నేను రేపే చెప్పేస్తాను" 


"సరే బెట్. నువ్వు చెప్పకపోతే,  నేనే ప్రదీప్ అన్నయ్య కి చెప్పేస్తాను ఓకే నా" 


"గుద్దుతాను. బెట్ ఏమి అక్కర్లేదు. ఏదో  సరదాగా అంటాను కానీ తన మీద నాకలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవసలు. పెడ్తున్నా ఫోన్ " అంటూ ఫోన్ పెట్టేసింది స్వాతి, ఇంకా లైన్ లో ఉంటే ఏమంటుందో అని.


స్వాతి ఆలోచనలో పడింది. మనోజ్ మాటలు గుర్తు వచ్చాయి. 'ఫ్యూచర్ లో ఫీల్ అవకూడదు'....  నేను అలాగే ఆలోచిస్తే ఇక్కడ బంధువులము, నా వలన అమ్మా వాళ్ళు మాట పడతారు. నా ఎమోషన్స్ కంట్రోల్ లో ఉంచుకోవాలి. అయినా, నాకు తనంటే ఇష్టం కానీ తనకి నా మీద అసలు కొంచమైనా ఇంటరెస్ట్ ఉందా?? అసలు ఎందుకు అంత లాగా అలోచిస్తున్నాను?? సబ్జెక్టు కోసం వెళ్తున్నాను. నేర్చుకుంటాను, వచ్చేస్తాను. అంతేగా" అని వందల ఆలోచనలతో  ఎప్పటికో నిద్ర పట్టింది. 


పొద్దున్న లేస్తూనే, త్వరగా రెడీ అయిపొయింది స్వాతి. అద్దం ముందర నిల్చుని "బావా....  నీకు ఇష్టమైన బ్లూ కలర్ వేసుకున్నా. నీకు తెలుసో లేదో కాని, ఈ కలర్ నాకు కూడా ఫేవరెట్ అండ్ ఇది నా లక్కీ డ్రెస్. ఏమో ఈ డ్రెస్ మహిమ వలన నన్ను చూడగానే లవ్ లో పడిపోతావేమో. నేనేమి చెప్పకుండానే నీకు అర్థమైపోతుందేమో..... ఏంటి బావా ఇదీ. నేనెంత డిస్టర్బ్ అవకూడదనుకుంటే అంత లాగా నిన్నే ఆలోచిస్తున్నా. నీకేమో అసలు కొంచం కూడా ఫీలింగే లేదు. ఉందేమోలే. బావా నువ్వే వచ్చి ఐ లవ్ యు స్వాతి అంటే వినాలని కోరిక బావా" అని తన ప్రతిబింబాన్ని చూసి తన బావని ఊహించుకుంటూ తనలో తనే మాట్లాడుకోసాగింది.


అటుగా వెళ్తున్న ప్రదీప్, స్వాతిని చూసి, "ఏంటిరా నీకు నువ్వే అంతలా మైమరచిపోయి చూసుకుంటున్నావు. ఏంటి సంగతి" 


"అదేం లేదన్నయా,  ఈరోజు అత్తయ్య రమ్మంది కదా. రెడీ అవుతున్న. అంతే"


"ఇప్పుడే వెళ్తావా. నువ్వెళ్ళి వాడిని లేపాలి. సండే రోజు ఇంత పొద్దున్న ఎవరు లేస్తారురా. నువ్వైతే మంచం కూడా దిగవూ. కానీ ఈరోజేంటో స్నానం కూడా చేసేసి రెడీ అయిపోయావు. ఏదో జరుగుతోంది. నిజంగా అత్తయ్య వాళ్ళింటికే వెళ్తున్నావా, అసలే ఒకదానివి వెళ్తున్నావు" అన్నాడు స్వాతిని అనుమానంగా చూస్తూ. 


"నేనొక్కదాన్ని వెళ్తా అన్నానా, నిన్నూ రమ్మని అడిగాను కదా. రానని చెప్పి ఇప్పుడు నన్ను అలా అనుమానిస్తావా. నేనెక్కడికి పోతాను. ఎక్కడికీ వెళ్ళనులే " అంటూ ఏడుపు మొహం పెట్టింది. 


"హహా.....  లేదురా సరదాగా అన్నాను కాని. మరీ ఇంత పొద్దునే ఎందుకులే అని. నేనెలాగో బయటకి వెళ్తాను తర్వాత, అప్పుడు దింపుతాను. సరేనా. ముందే చెప్తున్నా రమ్మని చెప్పకూ. నేను వేరే పని మీద వెళ్తున్నా" అన్నాడు చెల్లెలిని ప్రసన్నం చేస్తూ. 


కొంచం సేపటి తర్వాత స్వాతిని దింపేసి ప్రదీప్ వెళ్ళిపోయాడు. అత్తయ్య స్వాతిని చూసి నవ్వుతూ, "రావే కూర్చో. వాడు పైన వాడి రూం లో ఉన్నాడు. ఇందాకటి నుంచి నువ్వు వస్తావనీ వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు" అంది. 


"బావ నాకోసం వెయిట్ చేస్తున్నాడా" అని స్వాతి తనలో తనే నవ్వుకుంది. "అదేం లేదు అత్తయ్య. ఇందాకే వద్దామనుకున్నా, కానీ సండే కదా పొద్దునే బావా లేస్తాడో లేదో అని మెల్లిగా వచ్చాను. బావ రూమ్ కి వెళ్ళచ్చా అత్తయ్యా"  


"వెళ్ళూ. ఏదైనా కావాలంటే పిలవండీ" అంటూ అత్తయ్యా వంటిట్లోకి వెళ్ళిపోయింది. 


స్వాతి పైకి వెళ్లేసరికి తలుపు తెరిచే ఉంది. కానీ ఏదో  మొహమాటంగా అనిపించి అక్కడే నిల్చుని తలుపు కొట్టింది. తలుపు దగ్గరకి వచ్చి స్వాతిని చూసి, హరీష్ "తీసే ఉంది కదా, రా" అంటూ లోపలికి వెళ్ళాడు. తను ఇంకా ఏదో మాట్లాడ్తున్నట్లున్నాడు,  కానీ  హరీష్, వైట్ షర్ట్ డార్క్ జీన్స్ లో తన ముందు ఎంతో హ్యాండ్సమ్ గా నిల్చుని ఉంటే, స్వాతి చెవులకి ఇంకేం వినిపిస్తాయి. 


"ఎంత ముద్దుగా ఉన్నావో. ఎన్నాళ్ళయ్యిందో బావ నిన్ను చూసీ" ఆ మాటలు స్వాతి మనసులో అనుకుందనుకున్నారా, అనుకుంటూనే బయటకే అనేసింది. 


హరీష్, ఆ మొదటి మాట వినిపించుకోలేదు కానీ ... "అవును. పక్కనే ఉంటావు అస్సలు ఒకసారీ ఇంటికి రావు. చిన్నప్పుడు అందరమూ కలిశామంటే ఆడుకోటాలు, కబుర్లకు టైమే సరిపోయేది కాదు. ఇప్పుడేమో ఇంటి ముందు నుంచే వెళ్తావు ఒక్కసారి మొహం చూపించవూ" 


"బావా నిజంగా నువ్వు నాకోసం వెయిట్ చేస్తున్నావా?? లేదా చుట్టాలు కాబట్టి అంటున్నావా?? నీకు దగ్గరగా ఉంటే 'బావా నువ్వంటే  నాకు పిచ్చి' అనేస్తానేమో అని రాను"  అనుకుంది స్వాతి ఈసారి మాత్రం మనసులోనే. 


తనని అలా ఆలోచించటం చూసీ,  "అవునూ ఏవో డౌట్స్ ఉన్నాయన్నావు కదా. ఏంటో అడుగు" అన్నాడు హరీష్  ఆమె చేతిలో పుస్తకం చూసి.  


***********************************************



Comments