29

 "వదిన,  అన్నయ్యగారు....  రండి రండి.  చాలా రోజులకి వచ్చారు" అంటూ తలుపు తీస్తూనే పలకరించారు అన్విత వాళ్ళ అమ్మగారు 


పద్మగారు.....  "ఏదో ఒక పనులతోనే అయిపోతోంది సుధా.  ఎలా ఉన్నావు.  తమ్ముడు లేడా" 


""ఉన్నారు.....  ఇదిగోండి మంచినీళ్ళు తీస్కోండి. ఈయనకి చెప్పి వస్తాను" అంటూ అన్విత వాళ్ళ నాన్నగారికి చెప్పి ఇద్దరూ వచ్చారు 


అయన వస్తూనే.....  "బావగారు.....  బాగున్నారా. స్వాతి రాలేదా" 


రామ్ గారు....  "మేము బావున్నాము.  స్వాతి కి నిన్నంతా కొంచం ఒంట్లో బాగోలేదు. అందుకే ఇంట్లోనే ఉంది.  అన్విత లేదామ్మా" 


"లేదన్నయ్యగారు.  ప్రాజెక్ట్ వర్క్ ఉందని వెళ్ళింది" 


కొద్దిసేపు ఇలా కబుర్లేవో మాట్లాడుకున్నారు.  రామ్ గారు పద్మగారిని మాట్లాడమని ఆవిడ వైపు చూస్తుంటే మీరు చెప్పండి అంటూ ఆవిడ... ఇద్దరి  సైగలు గమనించి


"ఏదో విశేషం లేనిదే ఇద్దరూ కలిసిరారు.  ఏమిటక్కా సంగతులు" అని అన్విత నాన్నగారు అడిగారు 


"ఏమి లేదురా. మీ ఇద్దరితో అన్విత పెళ్ళి గురించి మాట్లాడదామని" 


"అన్విత పెళ్ళా....  నువ్వే కదా ఇప్పుడప్పుడే దాన్ని సతాయించకు. చదువు అవ్వనీయి అన్నావు" 


"నేనూ ఇప్పుడేమి చేసేయమనటం లేదు. కానీ....  " అంటూ పద్మగారు చెప్పటానికి సంకోచిస్తుంటే


అన్విత వాళ్ళ అమ్మగారు, "వదినా, మీ మాట మేమెప్పుడూ కాదనలేదు. మీరేదో చెపుదామని,  చెప్పలేక ఇబ్బందిపడ్తున్నారనైతే అర్థమయ్యింది.  విషయం చెప్పండి" అని అడిగేసరికి 


"అదీ వదినా....  అన్వి మా స్వాతితో పెరిగిన అమ్మాయి, మా ఇంట్లో పిల్ల.... " 


"అవునక్కా. ఇప్పుడెవరుకాదన్నారు. అదేమన్నా చేసిందా. నేను గట్టిగా చెప్తాను" అంటూ అన్విత ఏదైనా తప్పుగా మాట్లాడిందేమో అని ఖంగారుగా అన్నారు వాళ్ళ నాన్నగారు 


రామ్ గారు...  "తను ఏం చేస్తుంది రమేష్.  చాలా మంచమ్మాయి.  అందుకే మా ప్రదీప్ కి,  మీ అన్వితని అడుగుదామని వచ్చాము,  మీ ఇద్దరికీ అభ్యంతరము లేకపోతేనే. ప్రదీప్ తో ఈ విషయం ఇంకా మాట్లాడలేదు.  ముందర అన్వితని అడగండి. మీ అందరికీ ఇష్టమైతే వాడికి చెప్తాము. మీకు వాడి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. మంచి జాబ్ లోనే ఉన్నాడు. వేరే అలవాట్లు ఏమి లేవు. బాధ్యతలు తెలిసినవాడు. మాకు తెలిసీ వాడు ఒకే ఒక్కటి  అడుగుతాడు, 'స్వాతి పెళ్ళయ్యాకే చేస్కుంటా' అని. మేము అడిగామని ఒప్పుకోనవసరము లేదు.  మీరందరు మాట్లాడుకుని, ఏ విషయం చెప్పండి.  మీకు ఈ సంబంధం ఇష్టం లేకపోయినా మన మధ్యన ఎలాంటి విభేదాలు రావని ముందరే మాటిస్తున్నాము" 


"అవును సుధా.... అన్నయ్య వాళ్ళతో అయినా ఈ విషయం అడిగించచ్చు.  కానీ అందరిలో మిమ్మల్ని, అన్వితని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేకే మేము వచ్చాము. మీకు ఈ సంబంధం ఇష్టమున్నా, లేకపోయిన మనము ఎప్పటిలాగే ఉంటాము" 


"అక్కా....  మీరు అంతలాగ చెప్పాలా. ప్రదీప్ చాలా మంచి పిల్లాడు. మాకు మాత్రం తెలియదా. నాకెలాంటి అభ్యంతరము లేదూ.  కానీ అన్వితని కూడా అడిగి చెప్తాము" 


"అలాగే. మీరిద్దరూ కూడా ఆలోచించుకుని అన్విత తో మాట్లాడండి. దాన్ని బాగా ఆలోచించుకుని చెప్పమనండి. బలవంతం చేయకండి. మేమూ వెళ్ళొస్తాము" అంటూ బయల్దేరారు 


స్వాతి వాళ్ళింట్లో.... 


"చిన్నూ....  " 


"అన్నయ్యా.... ఎలా అయింది ట్రిప్. దర్శనం బాగా అయ్యిందా. ఇంతకీ ఎవరెవరు వెళ్ళారు" 


"దర్శనం బాగా అయ్యింది.  డ్రైవ్ చాలా బావుండింది.  త్రీ  బైక్స్ మీద వెళ్ళాము ఫ్రెండ్స్ అందరమూ. అమ్మ ఏది" 


"అమ్మా, నాన్నగారు రమేష్ మావయ్య ఇంటికి వెళ్ళారు. వచ్చేస్తారేమో" 


"ఎందుకూ" 


"ఊరికే అనుకుంట" 


"సరేలే.  ఇంతకీ చిన్నూ......  మొన్న ఎందుకు ఏడ్చావు" 


"నువ్వు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు" అంది బుంగమూతి పెట్టి.


"అందుకని ఏడుస్తావా చిన్నపిల్లలా. ఎక్కడికి వెళ్ళిపోతాను. వర్క్ ఎక్కువుంటోంది కదా, ఫ్రెండ్స్ కూడా ఎప్పటినుండో ఔటింగ్ అంటున్నారని బ్రేక్ కోసం వెళ్ళాను. వెళ్తే ఇంక తిరిగి రానా. ఏడుస్తారా చిన్ను అందుకోసం. రేపు ఆఫీస్ పని మీద వెళ్ళవలసివస్తే ఏం చేస్తావు"


"అప్పుడు చెప్పి వెళ్తావు కదా. ఆ రోజు కోపంగా మాట్లాడి తినకుండా పడుకున్నావ్. పొద్దున లేచేసరికి వెళ్ళిపోయావు. మరి ఏడుపు రాదా"


"అందుకని ఏడుస్తూ కూర్చున్నావా అప్పటినుండి. మొహం చూడు ఎంత నీరసంగా ఉందో. ఆరోగ్యం బాలేదా. ఏమన్నా తిన్నావా"


స్వాతి "బానే ఉందన్నయ్యా. తోచటం లేదని పడుకున్నాను. నువ్వు ఫ్రెష్ అయ్యి రా. అమ్మ వంట చేసేసి వెళ్ళింది. నువ్వొస్తే తినమని చెప్పింది" 


"సరే. రెస్ట్ తీసుకో. ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇద్దరం భోజనం చేద్దాము" అని ప్రదీప్ లోపలికి వెళ్ళాడు 


తను తిరిగి వచ్చేసరికి హరీష్ లోపలికి వచ్చి "హాయ్ స్వాతి.... " అంటూ చుట్టూ చూసాడు హరీష్ 


తన చూపులు అర్ధమయ్యి,  "ఇంట్లో ఎవరూ లేరు బా...,  అదీ, నేనూ తప్పా" అన్నాడు ప్రదీప్ నవ్వుతూ 


హరీష్ హమ్మయ్య అన్నట్లుగా ఊపిరి తీస్కుని, స్వాతి దగ్గర కూర్చుని "ఏమయ్యిందసలు నిన్న. బాలేదు, ఓపికగా లేదు అన్నాకా, కొంచం సద్దుకున్నాక అయినా మెసేజ్ చెయద్దా స్వీటీ. నాకింక ఇంట్లో టెన్షన్ కి ఉండలేక ఏదైతే అదని వచ్చేసాను. ఇప్పుడెలా ఉందీ" హరీష్ ఆపకుండా ప్రశ్నలడుగుతుంటే 


"చిన్నూ ఏమైంది. బాలేదా" అంటూ ప్రదీప్, స్వాతి దగ్గరకి వచ్చి జ్వరం ఉందేమో అని చూసాడు 


స్వాతి,  హరీష్ ని కోపంగా చూస్తూ, "బావా బానే ఉన్నాను కదా.... నాకేమి అవలేదు కదా" అంటూ ప్రదీప్ ముందర ఏమి అనకూ అన్నట్లుగా వత్తి పలికింది


ప్రదీప్ కి అది అర్ధమయ్యి,  "ఏమయ్యిందో చెప్పు ముందర. ఏంటి బాలేకపోవటం" అంటూ రెట్టించి అడిగాడు


పద్మగారు లోపలికి వస్తూ,  "నువ్వెంత అడిగినా అది చెప్పదురా. నిన్నంతా వామిటింగ్స్, కడుపు నొప్పని ఏడుపు.  సాయంత్రానికి నీరసమైపోయి చివరికి డాక్టర్ సెలైన్ ఎక్కించి, టాబ్లెట్ ఇచ్చాక సద్దుకుంది" 


"మరి దానికలా ఉంటే మీరు పొద్దునే ఊరి మీదకి వెళ్ళాలా, ఒకదాన్ని వదిలేసి" 


"అదే వెళ్ళమని తోసేసింది. అప్పటికి నువ్వు దగ్గర్లో ఉన్నావన్నాకే బయలుదేరాము" 


హరీష్ "సెలైన్ ఎక్కించారా?? అత్తయ్యా...బావ ఇంట్లో లేడు కదా. నన్నైనా పిలవద్దా. అసలు ఏమయ్యిందన్నారు డాక్టర్" 


స్వాతి, హరీష్ కి కనిపించకుండా పద్మ గారితో,  "చెప్పకమ్మా, దణ్ణం పెడ్తా. పరువు తీయకు.  అన్నయ్య తిడతాడు" అంటూ సైగలు చేసింది 


పద్మ గారు స్వాతి సైగలుకేసి చూడటం గమనించి అనుమానంగా స్వాతి వైపు చూసాడు హరీష్. 


ప్రదీప్ "అమ్మా అదలాగే అంటుంది కానీ ఏమయ్యిందో  చెప్పు" అన్నాడు కొంచం గట్టిగ, స్వాతిని చూడకుండానే


"ఏమవుతుంది. మొత్తం నీ వలనే అసలు ఇదంతాను" అన్నారు కొడుకుని మందలిస్తూ


ప్రదీప్ నేను వెళ్ళానని ఏడుస్తూ కూర్చుని తిండి మానేసిందా?? అప్పుడన్నా నాకు చెప్పవా నువ్వు" కోపంగా అడిగాడు తల్లిని.


హరీష్ "తినటం మానేయటం ఏంటి. ఎందుకు తినలేదూ" ఆదుర్దగా అడిగాడు. 


"తినటం ఏమీ మానేయలేదు" అన్నారు పద్మ గారు నవ్వి.


"మరి??" అయోమయంగా అడిగారు ప్రదీప్, హరీష్


"అదొక కోతి అని తెలిసి కూడా దాన్ని మీ నాన్నగారికి అప్పచెప్పావు. నువ్వు ఉంటేనే బుద్ధిగా ఉంటుంది. నువ్వు ఊళ్ళో లేవని,  ఆయన్ని పీకేసి పానీపూరి తిన్నారు ఇద్దరూ వెళ్ళి. ఇంకేమవుతుంది మరి" అన్నారు ప్రదీప్ ని చూసి నవ్వి 


"చెప్పేసింది " అనుకుంటూ మొహం చున్నీతో కప్పేసుకుంది స్వాతి


హరీష్ "పానీపూరీలు హెల్త్ కి మంచిది కాదని ఎన్ని చూడటం లేదు. అన్ హైజెనిక్ కాదని చెప్తున్నారు కదా స్వాతి" 


రామ్ గారు "దానితో పాటు నేనూ తిన్నాను హరి. మరి నాకూ తేడా చేయాలి కదా. అది దాని వలన కాదేమోలే. ఏదో అలా అయ్యిందంతే" అంటూ కూతుర్ని వెనకేసుకొచ్చారు


ప్రదీప్ "బా...  అసలు దానికి పానీపూరినే కాదు  ఏ బయట ఫుడ్ తిన్నా కొంచం కూడా పడదు. వెంటనే తేడా చేసేస్తుంది. నాన్నా మీకు తెలిసీ ఎందుకు ఇప్పించారు" 


రామ్ గారు "పొనీలేరా. రేపొద్దున పెళ్ళయ్యాకా అమ్మాయిలకి అన్నీ సరదాలు తీరతాయేంటి. మొగుడికి నచ్చకపోతే అన్నీ ఎలాగో మానేసుకోవాలి దాని సరదాలు మనం కాకపొతే ఎవరు తీరుస్తారు చెప్పు" 


స్వాతి హరీష్ ని చూడసాగింది, చున్నీ చాటు నుంచే. 


ప్రదీప్ "వాడు ఇప్పించడని మీరు అడిగినవన్నీ చేసేసి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారా?? దానికి ఒద్దని మీరన్నా చెప్పాలిగా" 


స్వాతి, హరీష్ ఇబ్బందిని చూసీ నవ్వుకుంటుంటే,  హరీష్ "బావా ఆ మొగుడు నీ పక్కనే ఉన్నాడు. ఇలా మీరు మీరు నా గురించీ వాదించుకోవటం ఏం బాలేదు" అని ప్రదీప్ చెవిలో చెప్పి, 


"స్వాతి, పానీపూరి తినాలంటే ఈసారి మా ఇంటికి రా. నేను సూపర్ గా చేస్తానంటుంది అమ్మ" 


స్వాతి చున్నీ మొహంమీంచి లాగేసుకుని,  "నిజంగానా బావా. నీకొచ్చా" 


స్వాతి కళ్ళలో మెరుపు చూసీ అందరూ గట్టిగా నవ్వేశారు. హరీష్ వెళ్ళాక, ప్రదీప్ కూడా కొంచం సేపు రెస్ట్ తీసుకుందామని తన గదిలోకి వెళ్ళాడు. 


స్వాతి  "అమ్మా వెళ్ళిన పని ఏమయ్యింది" 


"మేము చెప్పాల్సింది చెప్పాము. మావయ్య వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. అన్వి తో కూడా మాట్లాడి చెప్పమన్నాము. తొందరేమీ లేదని చెప్పాము" 


"సరే అమ్మా" 


నాలుగు రోజులు తర్వాత,  అన్వితకి, వాళ్ళింట్లో వాళ్లకి ఈ సంబంధం ఇష్టమేనని ఫోన్ చేసి చెప్పారు రమేష్ గారు. 


"ప్రదీపు....  నీకు అన్విత కి పెళ్ళి చేస్తే బావుంటుందని మా ఆలోచన. తను మన ఇంట్లో కలిసిపోతుంది. స్వాతి, అన్వి మంచి స్నేహితులు కాబట్టి వాళ్ళూ కలిసి ఉంటారు, దాన్ని నీ అంతే ప్రేమగా ఆ అమ్మాయి చూసుకుంటుంది. నువ్వూ ఒకసారి ఆలోచించరా" అన్నారు రామ్ గారు 


"నాన్నా...  మీరు అన్నీ ఆలోచించే చేస్తారు కదా. మీ ఇష్టం. కానీ చిన్నూ పెళ్ళి తర్వాతే నేను చేసుకోవాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. ముందరైతే అన్వితని అడగండి.  వాళ్ళు వెయిట్ చేస్తాను అంటే నాకే అభ్యంతరము లేదూ" 


"ఏంటన్నయ్యా ఇదీ. నీకోసం నన్ను అర్జెంటు గా పెళ్ళి చేసుకోమంటావా" అంది స్వాతి బాధ నటిస్తూ 


"అర్జెంటు ఏమి లేదురా. నువ్వెప్పుడూ చేసుకుంటే ఆ తర్వాత ముహుర్తంకే నా పెళ్ళి అంటున్నా"


స్వాతి నవ్వుతూ "నాకేం పర్లేదు. నేను ఇప్పుడన్నా కూడా రెడీనే" 


పద్మగారు.... "స్వాతీ నువ్వాగు.  అన్వితకి ఇష్టమే అని చెప్పిందిరా. వాళ్లకి నువ్వు చెప్పిన మాట మేము ముందరే చేప్పాము.  వాళ్ళూ ఒప్పుకున్నారు" 


రామ్ గారు "ప్రదీపు....  నువ్వు, తను ఒకసారి కలుసుకుని ఇద్దరూ మాట్లాడుకుంటే బావుంటుంది" 


"సరే నాన్నా. మీ ఇష్టం" అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.


స్వాతి, రామ్ గారిని గట్టిగా పట్టుకుని, "మా నాన్న సూపర్" 


"అంతేలే" అంటూ పద్మగారు అక్కడ నుంచి వెళ్ళబోతుంటే, ఆవిడ మీదకి దూకి గట్టిగా ముద్దుపెట్టుకుని, స్వాతి... "మా బుజ్జి అమ్మ,  నువ్వింకా సూపర్" 


రామ్ గారు... "అది కాదురా బంగారం, వాడేంటి అన్నిటికి మీ ఇష్టం నాన్నా అంటాడు. వాడికి ఇష్టం అనే కదా మనం చేస్తున్నాము" 


"నాన్నా....  ష్....  అన్నయ్య వింటాడు" అని స్వాతి అనేసరికి అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. 

ప్రదీప్, అన్విత పెద్దవాళ్ళు చెప్పినట్లుగా బయట  కలుసుకున్నారు. ఇద్దరూ ఒక దగ్గరే ఉన్నారు కానీ వారి మధ్యన దూరం ఇంకా ఉందన్నట్లుగానే దూరంగా  కూర్చున్నారు. వాళ్ళిద్దరి మధ్య మౌనానికి తెర తీస్తూ,  


ప్రదీప్ " అన్వి .....అమ్మా వాళ్ళు వచ్చి మాట్లాడారని నాకు నిజంగా తెలీదురా"


ప్రదీప్ మాట పూర్తయ్యేలోపు అన్విత,  ప్రదీప్ ని కోపంగా చూసి "నాకు తెలుసు. ఆ రోజు నేనడిగినది ఏంటి, ఇంట్లో చెప్పు అన్నాను అంతే కదా. ఆ మాటకి నా నుంచి దూరం గా వెళ్ళిపోయావు. నువ్వు వచ్చావు మళ్ళీ, కాని అప్పుడూ ఇంట్లో  మాట్లాడవు. ఇంకొన్నాళ్ళ తర్వాతన్నా మళ్ళీ అదే జరుగుతుందనే భయపడ్డాను. అలాంటిది ఇప్పుడు మాత్రం నువ్వు చెప్తావని ఎందుకనుకుంటాను. నిన్ను కాకుండా ఇంకెవరినన్నా పెళ్ళి చేసుకోవాల్సి వస్తుందేమో అనే ఊహతో రోజూ ఎంత ఏడ్చానో"  అంది బాధగా.  అనేసరికి 


ప్రదీప్ "సారీ రా, నీ విషయంలో ధైర్యంగా ముందడుగు వేయలేకపోయాను. నాదే తప్పు. కానీ నీకు దూరంగా ఉంటూ నేనూ అంతే  బాధపడ్డానురా" అన్నాడు అన్వి ముందర మోకాళ్ళ మీద కూర్చుని 


"బావా ఏంటిది. లే బావ ముందర" అంటూ లేపబోతుంటే 


ప్రదీప్, అన్విత చేయి పట్టుకుని, "సారీ అన్వి. ఈ ఒక్కసారికి నన్ను  క్షమించేయవా, ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టనురా. గుండెల్లో పెట్టుకునీ చూసుకుంటాను, ఏ కష్టం రానీయనురా. లవ్ యూ సో మచ్ అన్వి. అమ్మ వాళ్ళు అడగటం కాదు,  నేనడుగుతున్నాను. నన్ను పెళ్లిచేసుకోవా" అంటూ తన చేతిలో ఉన్న రింగ్ ని అన్విత కి పెట్టాడు. 


అన్విత సిగ్గుపడుతూ "సరే బావ " అని అనగానే ప్రదీప్ నవ్వుతూ తనని దగ్గరకి తీసుకున్నాడు. 


ఇద్దరూ కొంచం సేపు మాట్లాడుకుని,  ఇళ్ళకి వెళ్లిపోయారు.  ప్రదీప్ కి చాలా రోజుల తర్వాత మనసు చాలా సంతోషంగా ఉండి,  మంచం మీద పడుకోగానే నిద్ర పట్టేసింది. ఏదో మెసేజ్ వచ్చిందని చూసిన ప్రదీప్ ఖంగారుగా స్వాతి రూమ్ కి పరుగున వెళ్ళాడు.



Comments