28
పద్మగారు కోపంగా "స్వాతి ఏం జరుగుతోందసలూ" అంటూ గట్టిగా అడిగారు
ఆవిడని అంత గట్టిగా మాట్లాడటం ఎప్పుడూ వినని రామ్ గారు లోపలికి వస్తూ నివ్వెరపోయారు. ఆయన కూడా వినలేదు.
"పద్మా..... ఏమయ్యిందీ" అంటూ కొంచం కోపంగా అడిగారు
పద్మగారు మాత్రం స్వరం తగ్గించకుండా, "చెప్పూ ఏం జరుగుతోందో. నిన్న అంతా వాడు మొహం వేలాడేసుకుని కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పు. ఏమవుతోంది ఇంట్లో" అంటూ గట్టిగా అడిగేసరికి అప్పటి వరకు కళ్ళలో దాచిన నీళ్ళు బయటకి వచ్చి గట్టిగా ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది స్వాతి
"తల్లీ ఏమయ్యిందమ్మా" అంటూ రామ్ గారు స్వాతిని పట్టుకున్నారు
పద్మగారు, స్వాతి పక్కన కూర్చుని తనని దగ్గరకి తీస్కుని తల నిమురుతూ, "చెప్పవే ఎందుకలా ఉన్నావు. కోపం కాదు. ఏమయ్యింది నిన్నటి నుంచి. నాతో చెప్పమ్మా" అంటూ ప్రేమగా మాట్లాడేసరికి
స్వాతి.... "అమ్మా నా వలన అందరికీ బాధే ఉందమ్మా. పుట్టాకా, అమ్మ చనిపోయింది. నాన్నా ఆరోజు నుంచి ఈరోజుకీ బాధ పడుతూనే ఉన్నారు. నేనెక్కడుంటే అక్కడ చెడు జరుగుతుంది"
"దానికి నువ్వేం చేస్తావురా. అందులో నీ తప్పేముంది. వాళ్ళు లేకపోతే ఏంటి. మేమున్నాము, అన్నయ్య ఉన్నాడు. నువ్వొచ్చినప్పటి నుండి మేము సంతోషంగా ఉన్నాము కదరా" అంటూ రామ్ గారు స్వాతిని ఓదార్చారు.
"లేదు నాన్నా..... అన్నయ్య సంతోషంగా లేడు. అదీ నా వలనే. నేనే బాధపెడ్తున్నా. నాకసలు ఉండాలని లేదు"
"అసలేమయ్యిందే. వాడేమన్నా అన్నాడా. అందుకేనా పొద్దున నువ్వు వెళ్ళిపోతే వాడొచ్చేస్తాడు అన్నావు" అంటూ పద్మగారు ప్రదీప్ కి కాల్ చేస్తూ "తిక్క వెధవ. వాడేం మాట్లాడాడో. నువ్వు సరిగ్గా అర్థం చెస్కోలేదేమో. వాడేప్పటికీ.... "
"హలో ప్రదీపు.... దీన్ని ఏమన్నావురా"
అప్పటివరకూ స్వాతి ఆవిడ చేతిలో ఫోన్ ని గమనించలేదు. వెంటనే గట్టిగా ఏడుస్తూ, "అన్నయ్య ఏమి అనలేదమ్మా. తను డ్రైవ్ లో ఉన్నాడు. నువ్విప్పుడు ఖంగారు పెట్టేస్తావా. తను నన్ను అంటాడా లేదో నీకు తెలీదా" అంటూ ఫోన్ కట్ చేసేసింది.
రామ్ గారు " బంగారం నువ్వు ముందు ఏడుపు ఆపి అసలేమయ్యిందో చెప్పరా. నువ్వు ఇంటినుండి వెళ్ళిపోతా అన్నావా"
"అప్పుడేదో అన్నాను నాన్నా కానీ ఇప్పుడు సమస్య వేరు. మీ ఇద్దరూ నాకు ప్రామిస్ చెయ్యాలి. ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉంటుందని. ఎవరితోనూ చెప్పకూడదు, అన్నయ్యకి కూడా"
ఇద్దరూ ముఖ్త కంఠం తో "సరే" అన్నారు. స్వాతి, అన్విత చెప్పిన విషయమంతా పూర్తిగా చెప్పి, "నా వలన అన్నయ్య వాళ్ళ పెళ్ళి అవటం లేదమ్మా. ఇద్దరూ బాధపడుతున్నారు, నా వలన" అంటూ ఏడ్చింది
పద్మగారు, రామ్ గారి వైపు అయన ఏమంటారో అని చూసారు. "సరే ఆలోచిద్దాంలే. మాకు చెప్పావు కదా. నువ్వింక బాధపడకు" అని అంటుండగా, రామ్ గారు కల్పించుకుని "అన్విత మన ఇంట్లో అమ్మాయి కదా. మనం ఎందుకు ఒప్పుకోము. వాడికి కావాలంటే, నీ పెళ్ళి తర్వాతే, చేయచ్చు, కానీ ముందర మాట్లాడుకోవటంలో తప్పేముంది"
"ఏమో నాకేమి అర్థం కావటం లేదు నాన్నా"
రామ్ గారు స్వాతి కళ్ళు తుడుస్తూ, " మేము రేపే వెళ్ళి మావయ్య వాళ్ళ ఇంటికి అన్వితని పెళ్ళి గురించి అడుగుతాము. నువ్వు చెప్పినట్లుగా కాదు, మాకు మేముగా అడుగుతాము. సరేనా. ఇప్పటికన్నా ఏడువకురా" అంటూ దగ్గరకి తీసుకున్నారు
స్వాతి కళ్ళు తుడుచుకుని రామ్ గారిని పట్టుకుని కూర్చుంది. ఇంతలో రామ్ గారికి ప్రదీప్ కాల్ చేసాడు
"నాన్నా ఏమయ్యిందీ. ఎందుకు చిన్నూ ఏడుస్తోంది. ఫోన్ కట్ చేసేశారెందుకు. మళ్ళీ చేస్తుంటే తీయటం లేదు. ఏమయ్యింది. నేను వచ్చేయనా"
అయన చిన్నగా నవ్వి "అదేమీ లేదురా. వాళ్ళిద్దరికీ ఎప్పుడూ ఉండేదే కదా. ఏదో సరదాగా గొడవ పడ్తున్నారంతే. నువ్వెళ్లిరా. ఇప్పుడేం రావక్కర్లేదు"
"నాన్నా ఒకసారి చిన్నూ కి ఫోన్ ఇయ్యండి"
"అదిక్కడ లేదు. ఇప్పుడే అలిగి లోపలికి వెళ్ళింది. వచ్చాక ఫోన్ చేయిస్తాలే. దాని ఫోన్ కూడా ఇక్కడే ఉంది"
"అమ్మకీయ్యండి"
పద్మగారు ఫోన్ తీస్కుని, "ఏమయిపోలేదురా ఈలోపున. ఏం చేసేస్తావ్ వెనక్కొచ్చేసి. మేమున్నాం కదా"
"నువ్వెందుకు దాన్ని సతాయిస్తావు. ఏమన్నావ్ "
"ఏమంటాను. ఇక్కడ పెళ్ళి టాపిక్ నడుస్తోంది. అంతే. గుడికి బయల్దేరావ్. దర్శనం చేస్కుని రా, జాగ్రత్తగా"
"పెళ్ళి లేదు, ఏంలేదు. దాని చదువవ్వనీ. నేను లేను కదా అని దాన్ని సతాయించకు. త్వరగా వచ్చేస్తాలే. ఉంటా "
కొద్దిసేపటికి పద్మగారు.... "స్వాతి ఇదేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా"
"ఇప్పటికైతే ఇంతేనమ్మా. అన్విత చాలా మంచిది. అన్నయ్యంటే చాలా ఇష్టం దానికి. అది ఏడుస్తుంటే ఏమి చేయలేకపోయాను. అసలు పొద్దునే అన్నయ్యతో మాట్లాడుదామనుకున్నా కానీ నాకు దొరక్కుండా వెళ్ళిపోయాడు"
"సరే మేము చూసుకుంటాము అన్నారు కదా నాన్నా. నువ్వింకెప్ప్పుడూ నీ వలన అందరూ బాధపడుతున్నారని అనకు. అసలు వాడికి నువ్విలా అన్నావని తెలిస్తే ఎంత బాధపడతాడు"
"అదేకదమ్మా. తను తట్టుకోలేడు. నేను పెళ్ళి చేస్కుని వెళ్ళిపోతానే అంటే అన్విత తిట్టిందమ్మా, ఇద్దరమూ నీతో ఇంకెప్పటికీ మాట్లాడాము మా వలన నువ్వు పెళ్ళి చేసుకుంటే అంటూ. ఇంకేం చేయనూ. అందుకే మీకు చెప్పాను"
"సరేలే, లే. లేచీ ఫ్రెష్ అయ్యిరా" అంటూ స్వాతిని పంపించి రామ్ గారి వైపు చూసారు
"ఏంటి పద్మా.... నన్ను చూస్తున్నావు. నేనేమంటానోననా. మన పిల్లలికన్నా ఇంకేదీ మనకి ముఖ్యం కాదని నీకు తెలీదా. అన్విత మన ఇంట్లో కలిసిపోతుంది. స్వాతికి స్నేహితురాలు. మీ వాళ్ళు మా వాళ్ళు అనేది ఎప్పుడూ మన మధ్యన లేదు. మరి నేను ఒద్దంటానని అనుమానం ఎందుకు. పదా" అంటూ వాళ్ళూ లోపలికి వెళ్ళారు
ఫ్రెష్ అయ్యి, మంచం మీద వాలిపోయిన స్వాతి కి హరీష్ కాల్ చేసాడు.
"పొద్దున్న కాల్ చేస్తే తర్వాత చేయవా అంటూ పెట్టేసావు. ఇప్పుడు మాట్లాడచ్చా"
**** నిన్న ఎపిసోడ్ లో రమ్య కాల్ చేసిందని చెప్పింది కదా, అప్పుడు కాల్ చేసింది హరీషే" ****
"ఆ చెప్పు బావ. పొద్దున్న అన్విత వచ్చింది. మాట్లాడదామని పెట్టేసాను. ఏమనుకోకు"
"పర్వాలేదు. నువ్వెందుకు డల్ గా ఉన్నావు. గోంతెందుకు అలా ఉంది"
స్వాతి, అన్విత చెప్పిన విషయాలు, దానికి వాళ్ళ నాన్నగారి నిర్ణయం కూడా చెప్పగా,
హరీష్ "ఇంకేంట్రా. ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింది కదా. మరెందుకు నువ్వు డల్ గా ఉన్నావు"
"ఏమిలేదు బావ. బానే ఉన్నాను. నువ్వు చెప్పు నీ ఆఫీస్ కబుర్లు. మావయ్యా వాళ్లేమంటున్నారు"
"ఆఫీస్ వి ఏముంటాయిరా. వర్క్ ప్రెషర్ పెరుగుతోంది. యు ఎస్ వెళ్లమంటున్నారు. నాకు ఇష్టం లేదని చెప్పాను. వాళ్లేమో అట్లీస్ట్ వన్ మంత్ కి వెళ్లమంటున్నారు"
"మరి, వన్ మంత్ అంటే వెళ్తావా"
"లేదురా. అస్సలు ఇంటరెస్ట్ లేదు. పెళ్ళయాక మనిద్దరం వెళదాంలే" అంటూ నవ్వాడు
స్వాతి ఆలోచిస్తూ... "ఆ చూద్దాంలే" అంది
"స్వీటీ వీడియో కాల్.... తీయి"
"బావా.... అమ్మా వాళ్ళున్నారు ఇంట్లో"
"ఇయర్ ఫోన్స్ పెట్టుకో. కానీ ముందర ఆన్ చేయి" అంటూ తొందర చేసాడు. ఇంక తప్పించుకోలేక, మంచం మీద లేచీ కూర్చుని, కళ్ళు తుడుచుకుని వీడియో కాల్ ఆన్ చేసింది
"స్వీటీ.... ఎందుకలా ఉన్నావు. కళ్లేందుకు ఎర్రగా ఉన్నాయి. ఏమయిందిరా" అంటూ ఆతృతగా అడిగాడు.
"ఏమవలేదు.....బావ, నువ్వు ఎంత త్వరగా మాట్లాడి పెళ్ళికి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నావో అంత లేట్ అవుతోంది. అదీ ప్రతీసారి నేనే పోస్టుపోన్ చేస్తున్నాను. అలా అవుతోందని బాధ ఒక ఎత్తైతే, ఇలా ఎందుకవుతోంది చివరికి ఏమవుతుందో అనే భయం ఇంకో వైపు. అన్నిటికన్నా ఎక్కువా..... నిన్ను కూడా బాధపెడుతున్నాను"
స్వాతి ఫోన్ పక్కకి పెట్టేసింది, వీడియో కాల్ అవటం వలన హరీష్ తనని ఏడుస్తున్నప్పుడు చూడకూడదని. కానీ హరీష్ పిలవటంతో కళ్ళు తుడుచుకుని ఫోన్ తీసుకుంది
" స్వీటీ నువ్వు నన్ను బాధపెట్టలేవురా. నువ్వేడిస్తేనే బాధనిపిస్తుంది. పెళ్ళి అంటావా... మనం ఇలా దూరంగా ఉండలేక, నీపక్కనే ఎప్పుడూ ఉండాలని, నువ్వలా నా గుండెల్లోకి దూరిపోతే నిన్ను గట్టిగా పట్టుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని...."
"ఛీ పో బావా.... " అంది స్వాతి సిగ్గుపడుతూ
"హాహా.... చూడు నవ్వితే ఎంత బావున్నావో. మనమెలాగో ముందర అనుకున్నదే కదా, ఈ ఇయర్ అయిపోవాలని. మధ్యలో నేనే తొందరపెట్టేసాను. ఇంకో నాలుగు నెలలు ఉన్నాయేమో, అంతే కదా. అయ్యాకే చెప్పచులే. ఖంగారేమి లేదు. కానీ నువ్వు మాత్రం ఏడువకురా. నువ్వు నా లక్కీ చార్మ్ అన్నానా...."
"నేను లక్కీ ఏంటి బావ, నా వలన నువ్వెక్కడ బాధపడతావో అనే భయంగా ఉంది ఇప్పుడు"
"చుప్. అలా అనద్దు అని చెప్పానా. నిన్న అనుకున్నాము చెప్పేద్దాము అని కానీ కుదరలేదు దానికే అంత ఆలోచించాలా. నిదానమే ప్రధానం అన్నారు కదా"
"ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు"
"స్వీటీ .. ఓర్పుగా ఉండటం చేదుగా (కష్టంగా) ఉన్నా, ఫలితం తియ్యగా ఉంటుందిట నాన్న చెప్తుంటారు. అందుకే ఓర్పుగా ఉండు. ఇవన్నీ వదిలేసి చక్కగా మళ్ళీ చదువు మీదకి మళ్ళించు మైండ్ ని. అయినా, నిన్నొక క్వశ్చన్ అడిగాను ఎప్పుడో. ఇప్పటి వరకు ఆన్సర్ చెప్పలేదు"
"ఏంటి బావ"
"ఈ కోర్స్ అయ్యాకా ఏం చేద్దామని ప్లాన్. పెళ్ళి అనకు. అది కాకుండా"
"ఏమో బావ. ఆలోచించలేదు"
"మరైతే అది చించు. అనవసరపు ఆలోచనలు మానేసి"
"సరే "
"ఒక్కసారి నాక్కావల్సింది ఇచ్చేస్తే నేను పెడతాను"
"ఏం ఇయ్యాలి నువ్వేం పెడతావు"
"హహహ.... నువ్వు నవ్వితే నేను ఫోన్ పెడతాను అంటున్నా. ఇంకేమనుకున్నావ్"
నవ్వుతూ..... "నేనేమనుకోలేదు. ఉంటా. బాయ్"
"బాయ్" అని ఫోన్ పెట్టేసాడు
స్వాతి ఆలోచనలో పడింది. ఇంతలో ప్రదీప్ కాల్ చేసాడు.
"అన్నయ్యా ఎలా ఉంది ట్రిప్"
"బావుందిరా. నువ్వేం చేస్తున్నావ్"
"ఏంలేదు అన్నయ్యా"
"చిన్నూ ఇందాక ఏడ్చావా. అమ్మ ఏమందీ. నేను రాగానే అమ్మ వాళ్ళతో బావ గురించీ మాట్లాడ్తానురా. నువ్వేమి బాధపడకు. లేదా ఇప్పుడు వచ్చేయనా"
"అన్నయ్యా. అమ్మ ఏమననేలేదు నన్ను. ఇప్పుడేమి మాట్లాడకూ. ముందు ఈ కోర్స్ అవనీయి. నేనేదో, బావ ఆలోచించమంటే, చించుతున్నా... అంతే"
ప్రదీప్ నవ్వుతూ... "ఏంటో అంత చించమన్నది. మాతో చెప్పచ్చా"
"అబ్బా అన్నయ్యా..... అంత సీక్రెట్లు ఏమి లేవు. లైఫ్ లో నెక్స్ట్ ఏం చేయాలని ఉందో అలోచించి చెప్పాలంట. పోనీ నువ్వే చెప్పు బాబూ అంటే చెప్పడట. నా డెసిషన్ ఏదన్నా కూడా తను సపోర్ట్ చేస్తాడు కానీ సలహా ఇయ్యడుట. నువ్వు చెప్పన్నయ్యా ఏంచేయనూ"
"చిన్నూ...... నీకంటూ ఏదో ఒక థాట్ ఉండే ఉంటుంది కదా. అసలైతే ఆలోచించక్కర్లేదు"
"ఉందన్నయ్యా. కానీ నా ఇంటరెస్ట్ ఎవరికీ నచ్చదు. ఎవరికో ఎందుకు ముందు అమ్మే తిడుతుంది. ఇంక బయటికేం చెప్తానులే"
"ఏంటది"
"ఇప్పుడు కాదులే, నువ్వొచ్చాకా చెప్తా. ఈలోపు ఇంకోటేదన్నా ఆప్షన్ ఆలోచిస్తా. నువ్ త్వరగారా"
"సరే చిన్నూ బాయ్. నువ్వు జాగ్రత్త" అని పెట్టేసాడు. స్వాతి తో మాట్లాడాకా ప్రదీప్ కి కొంచం మనసు కుదుటపడింది.
రాత్రి భోజనాలు చేస్తూ, రామ్ గారు "బంగారు... ఎల్లుండి, మంచిరోజు. అప్పుడు వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాము అన్విత వాళ్ళింట్లో"
"సరే నాన్నా. కానీ.... "
"మాకు వచ్చిన ఆలోచనే అని చెప్తాము. దీంట్లో మీ ఎవరిని మధ్యలోకి తీసుకునిరాము. నువ్వు ఖంగారు పడకు"
"సరే నాన్నా"
**** ఇంతకీ స్వాతి ఇంటరెస్ట్ ఏమయ్యి ఉంటుంది 🤔🤔🤔... మీరేమనుకుంటేన్నారు. తర్వాత ఎపిసోడ్ కైనా చెప్తుందో లేక అలవాటు ప్రకారం దాచేసి ఇంకా వెయిట్ చేయమంటుందో. వేచి చూడాల్సిందే... *******
Comments
Post a Comment