27

 "మాది బ్రేకప్ అయిపొయింది. జరిగిపోయిందాని గురించీ ఇప్పుడెందుకు కోపం తెచ్చుకోటం. అసలు విషయం పూర్తిగా తెలుసుకోనే లేదు. అయిపోయిందేదో అయిపొయింది. నువ్వెళ్ళి తినేసిరా" అంటూ తన పనిలో కి దూరిపోయాడు 


ఇంక తను ఏమడిగినా చెప్పడని తెలిసీ అక్కడ నుంచి వెళ్ళిపోయింది స్వాతి.  


పద్మగారు "ఏంటే వెళ్ళినదానివి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు. ఇంట్లో ఎంత ఖంగారు పడ్తున్నామో.  నాన్నగారు అలా బయటే కూర్చున్నారు వచ్చినప్పటి నుంచి" 


"అమ్మా, ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది.  చూసుకోలేదు. తెలిసినవాళ్ళు కనిపిస్తే కబుర్లు చెప్తూ ఆగిపోయాను. ఈలోపునే అందరూ కాల్ చేసేసారు" 


"ఎవరే ఆ తెలిసినవాళ్ళు. ఇంటికి రావాలని కూడా మర్చిపోయి కూర్చునిపోవటానికి" 


"అబ్బా ఏంటమ్మా.  వచ్చేసాను కదా. ఆకలేస్తోంది.  ఏమైనా పెట్టు ముందరా.  అన్నయ్యని పిలువు" 


"వాడు తినను. కడుపులో బాలేదన్నాడు. పద మీ ఇద్దరికీ పెడతాను" అంటూ భోజనాలు ముగించుకుని, హరీష్ కి మెసేజ్ చేసింది.  


" బావ ఒక్కసారి కాల్ చేయచ్చా" 


"చేయరా.  అడగాలా" అంటూ అక్కడ నుంచి రిప్లై  


స్వాతి ఫోన్ చేసి,  "బావా నువ్వేమనుకోనంటే ఒక చిన్న రిక్వెస్ట్" 


"ఏంటిరా" 


"అత్తయ్య వాళ్లకి ఇప్పుడే చెప్పకూ. అన్నయ్య,  అన్వి కి మధ్యన ఏదో జరిగింది. అది ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడే ఇంట్లో చెప్పేస్తే వాళ్ళ ప్రాబ్లెమ్ పక్కకి పోతుందని. నువ్వేమంటావు" 


"స్వీటీ.... ఇప్పుడే చెప్పొద్దన్నావు కదా. సరే. అసలు వాళ్ళ ప్రాబ్లెమ్ ఏంటో ముందర తెలుసుకో" 


"అలాగే బావ.... బావా....  సారీ. త్వరగా  ఇంట్లో చెప్పేసి త్వరగా మన మధ్య దూరాన్ని తగ్గిద్దామనుకుంటే నేను అడ్డుపుల్ల వేస్తున్నాను" 


"పర్వాలేదురా. నీలో నాకు నచ్చినదే అది. మన చుట్టూ అందరూ సంతోషం గా ఉండాలని చూస్తావు. నాకూ అదే ఇష్టం. ముఖ్యంగా నువ్వు సంతోషంగా ఉండటం కావాలి. సరే బజ్జో. రేపు మాట్లాడుకోవచ్చు" 


"సరే బావా. గుడ్ నైట్" అని ఫోన్ పెట్టేసి "రేపు ఎలాగైనా అన్నయ్యని అడగాలి" అనుకుని పడుకుంది 


పొద్దున్న లేచీ....  రోజూ లాగే పెరట్లో అందరూ కాఫీ తాగటానికి కూర్చున్నారు. 


"అమ్మా,  అన్నయ్య ఏడీ. ఇంకా లేవలేదా" 


"వాడు తెల్లవారుఝామునే లేచీ శ్రీశైలం వెళ్ళాడు, ఫ్రెండ్స్ తో కలిసి. రాత్రి ప్లాన్ వేస్కున్నారుట అందరూ" 


"అదేంటమ్మా..... నాతో ఒక్క మాట కూడా చెప్పనే లేదు. ఎప్పుడొస్తాడు"


"ఎల్లుండికి వస్తాడేమో" 


"అన్వి గురించి అడగకుండా బయటకి తప్పించుకున్నాడా?? లేక నిన్న నేను కోపంగా వెళ్లినట్లుగా తనూ అలాగే కోపాగా వెళ్లాడా?? కానీ అన్నయ్యకి నా మీద కోపం రాదులే. తనతో మాట్లాడకపోతే ఏంజరిగిందో ఎలా తెలుస్తుంది. అయినా సడన్ గా శ్రీశైలం వెళ్ళటం ఏంటి" అని ఆలోచిస్తూ" అని అనుకుంటూ "సరేలే" అంది పైకి నీరసంగా అంది. 


"బంగారూ నిన్న ఎక్కడికెళ్ళావమ్మా. రాత్రి మమ్మల్ని భయపెట్టేసావు. నిన్నెవరైనా ఏమైనా అన్నారా" 


"అదేమిలేదు నాన్న. నన్నెవరంటారు. సరే కాని,  ఎక్కడికెళదాం ఈరోజు. అన్నయ్య లేడు  కదా ఫుల్ గా తిరగాలి. నాన్నా పానీపూరి తిందాము సాయంత్రం. ఇంకా....  ఇల్లంతా చిందరవందరగా పడేసి ఫోటో తీసి పంపిద్దాం " 


పద్మగారు "ఆ ఫోటో ఒక్కటి చాలు వెంటనే ఇంట్లో ఉంటాడు. అందులోను, ఇంటికి వచ్చేవరకు కూడా అరుస్తూనే వస్తాడు" 


"నాకూ తెలుసు ఎలా రప్పించాలో. కానీ, సరేలే ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని ఊరుకుంటున్నా. కానీ నా డౌట్ ఏంటంటే అసలు తను ఎవరితో వెళ్ళాడో ఏం చేస్తున్నాడో ఏమి పట్టించుకోరు మీరు. నేను మాత్రం ఒక్కసారి బయటకి వెళ్ళానంటే ఎవరికోసం వెళ్ళావ్, ఎవరితో వెళ్ళావ్, ఎక్కడికెళ్ళావ్, ఎందుకెళ్లావ్ అంటూ ప్రశ్నలు మీద ప్రశ్నలు" 


"నీ నుంచి టాపిక్ వాడి వైపు తిప్పకు" 


"అంతేనమ్మా. నీకెంతైనా మీ అబ్బాయంటేనే ఇష్టం. నేనూ మా నాన్నా ఒక పార్టీ"


"ఇందాకేదో వాడు లేడు కదా అని ఎగిరావుగా,  ఈరోజు వంటిట్లో కొంచం సాయం చేయి. వంట నేర్చుకో. రేపు పెళ్ళయ్యాక ఈమాత్రం కూడా నేర్పించలేదా మీ ఇంట్లో అని మీ అత్తగారు వాళ్ళు మమ్మల్ని అంటారు"


"ఆ మా అన్నయ్య నన్ను వంటింట్లోకి కాలు పెట్టనీయలేదు. నేను చేసుకునేవాడు కూడా వంటిట్లోకి కాలు పెట్టనీకుండా చూస్కునేవాడినే చేస్కుంటా. అయినా, నాన్నా ఊరికే నా పెళ్లెనకాల పడ్తుందేంటి అమ్మ. నేను చేస్కోవలనప్పుడు చెప్తాలే అప్పుడు చేయండి,  అది కూడా మా అన్న ఓకే అంటేనే" 


"సరేలే బంగారం. నిన్న మంచి మార్కులొచ్చాయిరా. మరి ఫైనల్స్ లో ఎంత వస్తాయి" అన్నారు పెళ్ళి మాట మారుస్తూ 


"అవి కూడా బాగా రావటానికి ప్రయత్నిస్తాను నాన్నా. కష్టపడి చదువుతాను" 


"గుడ్ రా తల్లీ" 


అలా కొంచం సేపు కబుర్లు చెప్పుకుని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. వంటింట్లో పని చేసుకుంటున్న పద్మగారి దగ్గరి దగ్గరకి వెళ్ళి వెనకనుండి వెళ్ళి హత్తుకుంది. పద్మగారు నవ్వుతూ "ఇందాక నువ్వూ మీ నాన్నాక పార్టీ అన్నావుగా. ఇప్పుడు నా వెనకకి చేరావు" అన్నారు.


స్వాతి ఏమీ మాట్లాడకపోవటంతో, అనుమానంగా వెనక్కి తిరగగా స్వాతి మొహంలో బాధ చూసి "ఏమయ్యిందే ఉన్నట్లుండి. ఎందుకు మొహం అలా ఉంది. ఏవం..." అంటూ భర్తని పిలవబోతుంటే స్వాతి ఆవిడ నోరు మూసేసింది, పిలవనీయకుండా.


"అమ్మా, అన్నయ్య ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళలేదు. నిన్న నేను బాధపెట్టాననేమో, నాకు చెప్పకుండా వెళ్ళాడు" అంది బాధగా.


"ఛ... అలా అనుకోకు. వాడి ఫ్రెండ్స్ ఎప్పటినుండో అడుగుతున్నారుట. నిన్న మరీ గొడవ చేసేసరికి వెళ్ళాడు. నువ్వు పడుకున్నావని మాతో చెప్పమన్నాడు".


"మీరు నేనూ ఒకేసారి పడుకున్నాముగా. మిమ్మల్ని లేపి చెప్పినట్లు నాకూ చెప్పచ్చుగా. నువ్వెప్పుడూ అన్నయ్యనే సపోర్ట్ చేస్తావు. నేను వెళ్ళిపోతానంటే అన్నయ్య వస్తాడేమో అడుగు"


"పిచ్చి మాటలు మాట్లాడకు స్వాతి. ఖాళీగా కూర్చుంటే ఇలాగే పిచ్చి ఆలోచనలు వస్తాయి. మీ అన్న గురించి నీకు బాగా తెలుసు కదా. నువ్విలా మాట్లాడావని తెలిస్తే వాడేంత బాధపడతాడు. అయినా రెండు రోజులకి వాడు బయటకి వెళ్తే ఉండలేకపోతె రేపు పెళ్ళైతే మా అందరిని వదిలి వెళ్ళాలి. అప్పుడేం చేస్తావు. లే... లేచి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. ఏదన్నా చదువుకో." అని కోప్పడి లోపలికి పంపించారు. 


కొద్దిసేపటికి అన్విత ఇంటికి రాగానే, పద్మగారు.... "ఏంటి అన్వి ఎలా ఉన్నావు. అసలెక్కడా కనిపించటం లేదు" ఆంటూ పలకరించారు.


"ఏం చెప్పమంటావ్ అత్తయ్యా. చదువులు ఎగ్జామ్స్ బిజీ అయిపోయిందసలూ" అన్విత మాట వినీ స్వాతి బయటకొచ్చింది. స్వాతిని చూసీ,  అన్విత.... "నాకేమో ఫోన్ చేయటానికే టైమ్ కుదరటం లేదు. ఇదిగో మీ అమ్మాయిగారేమో కష్టపడి ఫోన్ చేసినా తీయదు" 


"ఏంటే.....  నిన్న ఫోన్ సైలెంట్ లో ఉండింది. ఆ కొంచం సేపట్లోనే అందరూ చేసేసారు. సరేలే రా లోపలికి" అంటుంటే ఏదో కాల్ వచ్చిందని లోపలికి వ్వెళ్ళి ఫోన్ లో మాట్లాడేసి, బయటకి వచ్చి "అమ్మా,  రమ్మీ అన్విని నన్ను ఇంటికి రమ్మని గోల చేస్తోంది. మేము అటు వెళ్ళొచ్చేస్తాము" 


పద్మగారు "అదెప్పుడో కానీ రాదు. దాన్ని బయటకి తీసుకుపోతావేంటి. లంచ్ తిని వెళ్ళండి". పద్మ గారు కూడా స్నేహితురాళ్ళతో ఉంటే స్వాతి మనసు తేలిక పడుతుందని పంపించటంతో ఒప్పుకున్నారు. 


"సరేలే" అని భోజనం చేసి కొంచం సేపు అన్విత వాళ్ళ అమ్మగారితో కబుర్లు చెప్పి ఇద్దరూ బయటకి కదిలారు. 


బయటకి రాగానే, స్వాతి కాల్ చేసి, " రమ్మీ, నేను అమ్మకి మీ ఇంటికి అని చెప్పి బయటకొచ్చానే. నువ్వు బుద్ధిగా మా అమ్మ కి ఫోన్ చేసేయకు నేను కాల్ తీయకపోతే. నీకదో చెత్త అలవాటు. అన్నీ నంబర్స్ కి కాల్ చేసేస్తావ్. బాయ్" అని ఫోన్ పెట్టేసింది. 


అన్వి "అదేంటే, రమ్య వాళ్ళింటికన్నావ్ కదా. మరి ఎక్కడికెళ్తున్నాం. అత్తయ్య కెందుకు అబద్ధం చెప్పటం" 


స్వాతి కోపంగా చూడగా, అన్విత "ఏంటే ఇందాకటి నుంచి సీరియస్ లుక్కులిస్తావు, ఏమైందీ" 


"ముందు ఎక్కడన్నా కూర్చోటానికి వెళ్దామా తర్వాత మాట్లాడతా" అంటూ ఒక చోటికి వెళ్ళి కూర్చున్నారు. 


అన్విత "ఇప్పుడు చెప్పు తల్లీ" 


"ఎందుకు కోపమొచ్చిందో తెలీదా. నిన్న సడన్ గా నాకు ఫోన్ ఎందుకు చేసావ్. ఎందుకు పొద్దునే వచ్చావు" 


"అది కాదే...." 


"ఏది  కాదే, నువ్వు నాతో అన్నీ చెప్తావనుకున్నా. సరేలే, అసలేమయ్యింది. అన్నయ్యేంటి బ్రేకప్ అంటాడు" 


"నిన్నేమో, మేము ఇష్టపడ్డామని ఫీల్ అయ్యావు ఈరోజు బ్రేకప్ అయ్యిందని ఫీల్ అవుతున్నావా" అంది నవ్వుతూ, కాదు రాని నవ్వుని తెప్పించుకుంటూ 


"ముయ్యి.... నిన్న నేను ఫీల్ అయ్యింది దానికోసం కాదు. నువ్వు, అన్నయ్యా నాకు చెప్పలేదని బాధపడ్డాను. అందులోను అన్నయ్యకన్నా నువ్వు నాతో చెప్పలేదని ఇంకా ఎక్కువ బాధనిపించింది. మనం క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటాం కానీ నీ షేర్ ఆఫ్ సీక్రెట్స్ నీకూ ఉన్నాయి" అంది బాధగా 


"అది కాదు స్వాతి, ఫస్ట్ లో ప్రదీప్ ప్రపోజ్ చేసినప్పుడు, కొత్తగా అనిపించలేదు. తను నావాడే ఎప్పటికి అనే ధైర్యం వచ్చింది". అన్విత కళ్ళలో నీళ్ళతో "మేమూ పెద్దగా బయట తిరిగేసేవాళ్ళము కాదు, అలా అని గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకునేవాళ్ళము కాదు. కానీ చూస్కోకుండా ఉండలేకపోయేవాళ్ళము. అందరితోనూ కూర్చుని కబుర్లు చెప్తూనే ఉన్నా ఎవరికీ వినిపించని ఎన్నో కబుర్లు మేము కళ్ళతోనే మాట్లాడుకునేవాళ్ళము. ఒకరి మనసేంటో చెప్పకుండా ఇంకొకరం అర్థం చేస్కునేవాళ్ళము. కానీ..." 


"కానీ ఏంటి అన్వి.....  అంత అర్థం చేస్కునేవాళ్ళు విడిపోడమేంటి" 


"ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మన విషయం ఇంట్లో చెపుదాం అని అడిగాను. నీ పెళ్ళి జరిగితే కానీ తను చేసుకోనన్నాడు. మా ఇద్దరికీ నువ్వు చాలా ఇంపార్టెంట్. మా కోసం నీకు పెళ్ళి చేసెయ్యాలని కాదు. కానీ ఇంట్లో చెప్తే నాకు వేరేవి చూడరు కదా,  ఆగమంటే ఆగుతారుగా. నా ప్రాబ్లెమ్ కూడా అర్థం చేసుకోవాలి కదా. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నానురా అంటే టెన్షన్ ఎందుకూ,  నా వలెనే కదా. నన్నొదిలేస్తే నీకూ టెన్షన్ ఉండదని ఎంత సింపుల్ గా చెప్పేసాడో. ఫోన్ కి కూడా రెండు రోజులు దొరకలేదు. కోపం తగ్గాక చేసాడు, కానీ నేనూ ఇంక ఆ టాపిక్ మాట్లాడద్దని గట్టిగా చెప్పాను" 


"అంత ఒకళ్ళనొకళ్ళు అర్థం చేస్కొగలిగినప్పుడు తను మళ్ళీ వస్తే నువ్వలా అనటం కరెక్టా. అయినా ఏదో విసుక్కుని ఉండచ్చేమో. అంతలా ప్రేమిస్తే నీకు దూరంగా అన్నయ్య  ఉండగలడా. నిన్న రాత్రి తన కళ్ళలో నీళ్ళు చూసాను అన్వి. తను బాధపడుతున్నా ఏమి మాట్లాడలేకపోయాను. పొద్దున సద్దుకున్నాక అడుగుదామనుకుంటే లేచేలోపు ఊరు వెళ్ళిపోయాడు చెప్పకుండా" 


"స్వాతి....  తన బాధ నాకు తెలీదా. 'వస్తున్నా వస్తున్నా నీ వెనకే వస్తున్నా' అని పాడినప్పుడు,  మీకర్థం కాలేదు కానీ, తను చెప్పేది నాకర్థం అయ్యింది. తనతో నేను అలా అనటానికి కారణం,  ఇప్పటికీ తను మా ఇంట్లో మాట్లాడడు. అప్పుడోసారి పెళ్ళిచూపులయ్యాయి, మీ అమ్మ వచ్చి మాట్లాడింది. ఆ తర్వాత నేనూ ఇప్పుడే పెళ్ళొద్దు అని  చెప్పగలిగాను. కానీ అలా ఎన్నాళ్లని పోస్టుపోన్ చేయగలను. మళ్ళీ ఇంకో నాలుగు నెలలకి ఇదే జరిగితే.... నేను తట్టుకోలేను స్వాతి. మళ్ళీ మళ్ళీ నా దారి నన్ను చూసుకోమంటే, మళ్ళీ తనే వెనక్కి వస్తాడని ఎదురుచూడలేను"


"సరే నా పెళ్ళే కదా మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లెమ్. నేను ఇంట్లో నా గురించి ఈరోజే చెప్పేస్తాను. అప్పుడు నాది సెటిల్ అవుతుందీ మీ ప్రాబ్లెమ్ కూడా తీరుతుంది" 


"నోర్మూయి. నీ పెళ్ళి మాకు సమస్య కాదు. మీ అన్నయ్య ధైర్యం గా మాట్లాడకపోటమే మా సమస్య. నువ్వు నీ చదువవ్వగానే చెప్పాలనుకున్నావు. అప్పటి వరకు చెప్పటానికి వీలులేదు. నువ్వలా చేస్తే మేమిద్దరమూ సంతోషంగా ఉండలేము స్వాతి. నిన్ను హరీష్ అన్నయ్య కి దూరంగా ఉండమని ఫస్ట్ లో చెప్పాను గుర్తుందా. నువ్వు బాధపడ్డావు కూడా. దానికి కారణం కూడా ఇదే. మీ అన్నయ్య తో నేను ఉండలేకపొతూ, తన ఎదురుగా ఏమి జరగనట్లు తిరగటం, మాములుగా ఉండటం ఎంత నరకమో తెలుసా. ఆ బాధ నువ్వు పడకూడదనే అన్నాను. ఈరోజుకీ తనని చూసిన ప్రతీసారీ నా గుండె లయ తప్పుతుంది. మనసులో ఉన్న ప్రేమని నవ్వుతూ దాచలేము స్వాతి" 


స్వాతికి ఏమని చెప్పి అన్వితని ఓదార్చాలో అర్థం కాలేదు. ఇద్దరూ కన్నీళ్లతో మౌనంగా ఉండిపోయారు. చివరికి అన్విత లేచీ,  


"నేను బయల్దేరుతాను అన్వి. అమ్మ ఎదురుచూస్తుంటుంది. నువ్వు మాత్రం మాకోసం ఇంట్లో నీ పెళ్ళి గురించీ మాట్లాడితే మాత్రం మేమిద్దరమూ నీతో మాట్లాడము. ప్రదీప్ నిన్నెప్పుడు చెల్లెలిలాగా చూడలేదు, ఎవరికైనా పరిచయం చేసినా కూడా 'మా అమ్మాయి' అంటాడు. అది నీకూ తెలుసు. తనకి నేనెప్పుడూ తోడుగానే ఉంటాను, ఐ మీన్...  అదే...  నీ విషయంలో. పదా" అంటూ స్వాతిని తీస్కుని ఇద్దరూ బయల్దేరారు.


అన్వితని పంపించి ఇంటికి నడుస్తూ, స్వాతి "అవును అన్వి, నువ్వు చెప్పినట్లు అన్నయ్య నన్ను ఎప్పుడూ చెల్లెలిగా చూడలేదు. తన అమ్మాయిని తను వదిలేసి ఎందుకు వెళ్తాడు. అందుకే అమ్మ నన్ను కోప్పడింది... కానీ మీ సమస్యకి నేను పరిష్కారం ఆలోచిస్తాను. నా వలనే మీ ఇద్దరూ బాధపడ్తున్నారు" అని ఆలోచిస్తుండగా, ప్రదీప్ ఫోన్ చేయటంతో 


"అన్నయ్యా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను .... చెప్పు" 


"సారీ రా,  చెప్పకుండా బయల్దేరాను. లాస్ట్ మినిట్ లో ప్లాన్. నువ్వు  పడుకుంటావని లేపలేదు" 


"పర్వాలేదు అన్నయ్యా. తప్పకపోతేనే వెళ్ళి ఉంటావు. ఎప్పుడొస్తావు" 


"డ్రైవ్ కదా, ఎల్లుండికి వచ్చేస్తాను. చిన్నూ గొంతేంటి అలా ఉందీ. ఏమయిందిరా" 


"ఆ...  నువ్వు లేవని బెంగపెట్టేస్కున్నాలే. హాహా....  సరేలే జాగ్రత్త. త్వరగా వచ్చేయి. లెక్కపోతే అమ్మ నీకు వేసే అక్షింతలు కూడా నాకే వేసేస్తుంది" అంటూ ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళింది. 


ఇంటికి చేరిన స్వాతిని చూసీ,  పద్మగారు "అన్విత ఏది"


"అది ఇంటికి వెళ్లిపోయిందమ్మా" 


పద్మగారు కోపంగా "స్వాతి ఏం జరుగుతోందసలూ" అంటూ గట్టిగా అడిగారు



Comments