26

 స్వాతి భయపడుతున్న ఆ ఎగ్జామ్స్ రానే వచ్చాయి,  ఎగ్జామ్స్ అన్నీ  బాగా రాసింది.  కాలేజీ లో రిజల్ట్స్ రాగానే ప్రదీప్ కి ఫోన్ చేసింది.


"చిన్నూ ఏమయిందిరా" 


"అన్నయ్యా రిజల్ట్స్ వచ్చాయి. గెస్ వాట్.... నాకు 80% పర్సెంట్ వచ్చిందీ" అంటూ అరిచింది. 


"వావ్ కంగ్రాట్స్ రా. అమ్మ, నాన్న కి చెప్పావా " 


"చెప్పాను. ఈ పెర్సెంట్ వలన మొత్తం మీద చాలా పెరిగింది. అన్నయ్యా నాకు ఇప్పుడు కాలేజ్ లో ఉండాలని లేదు ఇంటికి వెళ్ళిపోతాను" 


"చిన్నూ ఆగరా. నేను వచ్చి పిక్ చేసుకుంటాను. మరి ట్రీట్ ఇయ్యాలి కదా. సరదాగా బయట లంచ్ చేసి ఇంటికెళదాం. అమ్మకి నేను చెప్తాలే" 


"అన్నయ్యా ట్రీట్ ఇప్పించాలంటే బావకి ఇయ్యి. తనసలు ఒక టైమ్ టేబుల్ ఇచ్చి, ఫాలో అయ్యేవరకూ బుర్ర తినేసాడు. పాపం తనకే ట్రీట్ ఇయ్యాలి" 


"అవునురా. నిజమే. ఉండు తనకి కాల్ చేసి అడుగుతాను" 


"అన్నయ్యా నేనే చేసి అడుగుతాను. పాస్ అయ్యానని నేను చెప్తే బావుంటుంది కదా" 


"సరే ఏ విషయం నాకు చెప్పండి" అంటూ ప్రదీప్ ఫోన్ పెట్టేసాడు 


స్వాతి,  హరీష్ కి ఫోన్ చేసి విషయం చెప్పగానే తనూ చాలా సంతోషించాడు. ముగ్గురూ కలిసి లంచ్ చేసాక,  


స్వాతి....  "అన్నయ్యా,  నీకో విషయం చెప్పాలి"


"ఏంటిరా" 


"అన్నయ్యా.....  నాకూ హరీష్ బావ అంటే చాలా ఇష్టం, నేను తనని ప్రేమిస్తున్నాను. తననే పెళ్ళి చేసుకుంటాను" అంటూ కళ్ళు మూసుకుని పాఠం అప్పచెప్పినట్లు చెప్పేసింది. ప్రదీప్ మాట రాకపోయేసరికి కళ్ళు తెరిచి ప్రదీప్ వైపు చూసింది. 


ప్రదీప్ కోపంగా చూస్తుండటంతో, "అన్నయ్యా ప్లీజ్ అన్నయ్యా కోపం తెచుకోకు. ఒప్పుకోవా" 


"నీకేనా తనకీ సేమ్ ఫీలింగా" అంటూ హరీష్ వైపు చూసాడు 


హరీష్.... "బావా....  నాకు తనంటే ప్రాణం" 


"బావ కి ఎప్పుడో తెలిసీ కూడా ఇలా మాట్లాడ్తున్నాడేంటి. ఎందుకింత కోపమొస్తోంది" అని అయోమయంలో ఉండగా,  అది గమనించినట్లుగా ప్రదీప్,  స్వాతికి కనిపించకుండా కన్ను కొట్టాడు. అప్పటికి హరీష్ స్తిమితపడ్డాడు. 


"ఇన్ని రోజులు నుంచి పక్కనే ఉంటూ నువ్వూ చెప్పలేదు బా...  ఇంకేం మరీ. ఇద్దరూ ఎలాగో ఫిక్స్ అయిపోయారు కదా. ఇంకా నేను ఒప్పుకోవటం ఎందుకు. అదెలాగో నేనక్కర్లేదనుకుంది. ఒకప్పుడు ప్రతీ దానికి అన్నయ్యా అంటూ చెప్పేది ఇప్పుడేది చెప్పటం లేదు...." 


"బావ. నువ్వూరుకో. తను ఏడ్చేసేలాగా ఉంది..." అంటూ స్వాతి పక్కకి వెళ్ళాడు. 


ప్రదీప్ స్వాతి ని దగ్గరకి తీసుకుంటూ "ఓయి చిన్నూ...... ఫేస్ ఎందుకలా అయిపోయింది. నేను సరదాగా అన్నానమ్మా. నీకు నచ్చాడన్నాక నేను కాదంటానా చెప్పు"


స్వాతి... "ఏమక్కర్లేదు. నేను ఏడుస్తానని ఒప్పుకోవక్కర్లేదులే" 


"చిన్నూ......  నాకు మీ సంగతీ తెలుసనీ నీకెప్పుడో డౌట్ వచ్చింది కదా మరి నాకు తెలిసినా నిన్నెప్పుడన్నా ఒక్క మాట అన్నానా లేదా బావ తో నిన్ను కలవనీయకుండా చేసానా??" 


"లేదనుకో"


"అసలూ నాకు తెలుసనీ ఎలా డౌట్ వచ్చిందిరా నీకు" 


"హాహాహా....  అదా....  నన్ను హాస్పిటల్ కి తీస్కుని వెళ్ళకముందర నువ్వు అన్నావు....  'నేను చాలానే దాస్తున్నాను నీ దగ్గరా' అని.  నీ దగ్గర చెప్పనిది ఇదొక్కటే కదా" అంటూ నవ్వేసింది. "సరే కానీ,  నీకు ఓకేనా అన్నయ్యా. బావకి కూడా ముందరే చెప్పేసాను. ఇంట్లో అందరినీ ఒప్పించాకే పెళ్ళి చేసుకుందామని" అంటూ హరీష్ వైపు చూసింది 


"నీకు నచ్చాడు కాబట్టి నాకూ ఇష్టమే. అదే కాకుండా తను నిన్ను ఏ కష్టం రానీయకుండా చూస్కుంటాడనే నమ్మకం నాకుంది. నీకు తెలీకుండా నీ విషయంలో ఎంత కేర్ తీసుకున్నాడో నాకు తెలుసు. నువ్వు బాధపడితే చూడలేడు. ఇంకేం కావాలిరా. నా చెల్లికి ఇంతకన్నా మంచిగా చూస్కునేవాడొస్తాడా చెప్పూ" 


స్వాతి...."థాంక్యూ అన్నయ్యా" 


"సరే నేను బిల్ పే చేసి కార్ దగ్గరుంటాను. మీరు రండి" అంటూ ప్రదీప్ లేచీ వెళ్ళిపోయాడు 


స్వాతి,  హరీష్ ఇద్దరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుని కార్ దగ్గరకి వెళ్ళారు. హరీష్ ఆఫీస్ కి వెళ్ళిపోతాననటం తో తను క్యాబ్ లో, వీళ్ళు వాళ్ళ కార్ లో ఇంటికి చేరారు. ఇంట్లో 


ప్రదీప్......  "చిన్నూ.....  నాకొక్క విషయం అర్థం కాలేదురా" 


"ఏంటన్నయ్యా" 


"నాతో చెప్పటానికి ఎందుకు ఆలోచించావా అని" 


"అన్నయ్యా ఫస్ట్ రీసన్ అయితే,  చదువు డిస్టర్బ్ అవుతుందని కోప్పడతావేమో అనుకున్నాను. అందుకే మంచి మార్క్స్ తెచ్చుకుని అప్పుడు చెప్పాలనుకున్నా. ఇంకో రీసన్ అంటావా, నేను ఎవరినన్నా ప్రేమిస్తున్నానంటే కోప్పడతావేమోనని చాలా భయపడుతూ ఉన్నా. అందుకనే ప్రతీసారి నువ్వొద్దంటావేమో అనే భయంతో పోస్టుపోన్ చేస్తూ వచ్చా"


"నేను ప్రేమించినప్పుడు లేనిది నీ ప్రేమని ఎందుకు కాదంటానురా" 


"అన్నయ్యా నువ్వు ప్రేమించావా?? ఎవరినీ?? నాకెప్పుడూ చెప్పనే లేదు" 


"అబ్బా తెలిసి కూడా తెలీనట్లు ఎంత యాక్టింగ్ చేస్తున్నావురా. మా గురించి నీకు తెలీదేంటి. అది నీకన్ని చెప్తుంది కదా " 


స్వాతి అయోమయంగా "ఎవరన్నయ్యా??"


"అన్వి... ఇంకెవరూ"


"నిజంగా నాకు తెలీదన్నయ్యా. అదెప్పుడూ చెప్పలేదు"  అంటూ స్వాతి తన రూమ్ లో కి వెళ్ళిపోయింది 


స్వాతి ఆలోచనలు ఒక చోట మొదలయ్యింది ఎక్కడి వరకో అల్లుకుపోయాయి. 


స్వాతి వాళ్ళ అమ్మగారు "స్వాతి రూమ్ లో నుంచి బయటకిరా. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నావు,  సాయంత్రం కావొస్తోంది"  


"ఏమోనమ్మా చికాకుగా ఉంది" 


"అలా లోపలే ఉంటే అలాగే ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడన్నా కొంచం సేపు మాతోను కబుర్లు చెప్పచ్చు కదే" 


"మీ అబ్బాయి ఉన్నాడు కదా. వెళ్ళి తనని అడుగు కబుర్లు చెప్పమని" 


ఆ మాటకి పద్మగారు కోపం చూడ్డంతో,  "అలా చూడకమ్మా. నేను మామూలుగానే అన్నాను. ఏం చేస్తున్నాడు అన్నయ్య" 


"వాడు మధ్యాహ్నం వచ్చేసాడు కదా, ఆఫీస్ పనేదో ఉందంటూ కూర్చున్నాడు" 


"సరేలే నేనలా బయట వాక్ కి వెళ్తాను. మైండ్ ఫ్రెష్ అవుతుందీ. ఇంట్లో బోర్ గా ఉంది" 


"సరే నేనూ వస్తాను ఆగు" 


"నాన్న వచ్చే టైమ్ అయ్యింది. ఆయన వచ్చాక కాఫీ అదీ ఇయ్యాలి కదా. నువ్వేం అక్కర్లేదు. నేను ఒకదాన్ని వెళ్లగలనూ. ఇంతలో నన్నెవడు ఎత్తుకుపోడులే" అంటూ ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయింది


స్వాతి అలా బయటకి వెళ్ళాక, చాలా సేపటి వరకు ఇంటికి చేరలేదు. స్వాతి వాళ్ళ అమ్మ, నాన్న గారు గుమ్మం దగ్గరే నిల్చుని ప్రతి అయిదు నిమిషాలకి గేట్ బయటకి వెళ్ళి వస్తున్నారు చెరోసారి. 


ప్రదీప్ పని ముగించుకుని రూమ్ లో నుంచి వస్తూ,  " ఏంటి ఇద్దరూ ఇక్కడ కూర్చున్నారు. చిన్నూ ఏది" అంటూ పిలవటానికి వెళ్ళబోయాడు 


రామ్ గారు "అది ఇంట్లో లేదురా. వాక్ కి వెళ్తానని వెళ్ళిందిట. రెండు గంటలయింది. అదే ఖంగారుగా ఉంది" 


"అది వెళ్తా అంటే ఎలా పంపించారు. నాకన్నా చెప్పద్దా. ఇంట్లోనే ఉన్నా కదా. ఏడవుతోంది. ఫోన్ చేయండి" 


పద్మ గారు.... "ఫోన్ చేయాలనీ మాకు తెలీదా. చేస్తూనే ఉన్నాము. తీయటం లేదు. ముందరోసారి తీసింది. వస్తానులే కాల్ చేయద్దని పెట్టేసింది. మళ్ళీ చేస్తుంటే తీయటం లేదు. ఇందాకటి నుంచి కాళ్ళు చేతులు ఆడటం లేదు"


"సరేలే అమ్మా.....  నువ్వు వంట పని చూస్కో. అదెక్కడికి వెళ్తుంది. నేను చూస్తాలే"  అంటూ ప్రదీప్ ఫోన్ కోసం లోపలికి వెళ్ళాడు. తను ఫోన్ చేసినా కట్ చేసింది. 


"ఏంటిదీ నా ఫోన్ ఎప్పుడూ కట్ చేయదూ. ఎందుకిలా తీయటం లేదు. ఏదన్నా ప్రాబ్లెమ్ ఉందా. ఇందాక వరకు బానే ఉంది. ఇప్పుడు టెన్షన్ పెడుతోంది" అని అనుకుంటుండగా ప్రదీప్ కి చివరిగా వాళ్ళు మాట్లాడుకున్నవి గుర్తొచ్చి,  


"అమ్మా అది వెళ్లే ముందర ఏమన్నా చెప్పిందా" 


"చికాకుగా ఉంది వాక్ కి వెళ్తాను అనే అందిరా" 


ప్రదీప్ కి విషయం అర్ధమయ్యి,  తన ఫోన్ తీయదనుకుంటూ హరీష్ కి ఫోన్ చేసాడు 


"బా...  ఎక్కడున్నావు" 


"ఇంటికి వెళ్తున్నా బావ. చెప్పు పర్వాలేదు. బండి పక్కకి ఆపానులే" 


"స్వాతి ఏమన్నా మాట్లాడిందా నీతో. ఎక్కడికెళ్ళిందో చెప్పిందా" 


హరీష్ ఖంగారుగా "నాతో ఏం మాట్లాడలేదు బావ. ఇంట్లో లేదా. ఏమయిందసలు"


"నా మీద కోపమొచ్చినట్లుంది. వాక్ కి వెళ్తా అని చెప్పిందిట ఇంట్లో. రెండు గంటలయింది,  చీకటి పడుతోంది. మా ఫోన్స్ తీయటం లేదు. నేను కాల్ చేసినా కట్ చేస్తోంది. ఒక్కసారి నువ్వు కాల్ చేసి కనుక్కోవా" 


"బావ  నేను కనుక్కుంటాను. మళ్ళీ చేస్తా" అంటూ ఫోన్ పెట్టి స్వాతి కి ఫోన్ చేసాడు 


స్వాతి "చెప్పు బావా" 


"ఏం చేస్తున్నావురా" అంటూ ఏమి తెలియనట్లు మాములుగా మాట్లాడాడు హరీష్ 


"ఏం లేదు బావ కాఫీ షాప్ కి వచ్చాను. నువ్వేం చేస్తున్నావ్" 


"ఏమిలేదురా. ఇంటికి వెళ్తూ, నీకు కాల్ చేశా. హేయ్ నేను దగ్గర్లోనే ఉన్నాను. రావచ్చా" 


"రా బావ. ఒక్కదాన్నే ఉన్నాను, మూడ్ ఏం బాలేదు" 


"సరే" అని ఫోన్ పెట్టేసి ప్రదీప్ కి కాల్ చేసాడు 


"బావా తను దగ్గర్లోనే  ఉంది. నేను వెళ్తున్నాను. ఒక పావుగంటలో తనకి కాల్ చేసి మాట్లాడు నేను తనని తీసుకొస్తాలే ఖంగారుపడకు" అని చెప్పి స్వాతి దగ్గరకి వెళ్ళాడు 


"ఏంటిరా స్వీటీ ఇక్కడ ఒక్కదానివే కుర్చున్నావ్" 


"అలా నడుచుకుంటూ వచ్చేసా బావ. కాఫీ తాగుదామని ఇక్కడ ఆగాను, చికాకుగా  ఉండింది"


"సరే.....  కాఫీ తాగావా మరి" 


"హాహా ఒక కప్పు తాగాను. నీతో మళ్ళీ ఇది రెండోది. నువ్వు వస్తున్నావని ముందే ఆర్డర్ చేసేసా" అంటూ కాఫీ అందుకుంది 


"నీకీ కాఫీ పిచ్చేంట్రా. సరేలే ఇంతకీ ఎందుకో చికాకుగా ఉందన్నావ్ ఏమైందీ" 


"బావా... మధ్యాహ్నం అన్నయ్య తన లవ్ గురించి చెప్పాడు" 


"ప్రదీప్ బావకి లవ్వా. హహ్హహ్హ....  అయినా దానికి నువ్వు చిరాకు పడటమేంటిరా" 


"ఎవరో తెలుసా అసలూ ..." అంటూ చెప్పబోతూ ఆగిపోయింది 


అది గమనిస్తూ...... " చెప్పాలని లేకపోతే వదిలెయ్యి కానీ ఇంటికి వెళదాము పదా" 


"బావా.....  అన్నయ్య,  అన్వి ప్రేమించుకుంటున్నారు" 


"అవునా. పాపం అన్వి. మీ అన్న కోపాన్ని భరించగలదా. హాహా సరే,  కానీ స్వీటీ, నీకిష్టం లేదా" 


"అది కాదు బావ... అన్వి నాతో ఒక్క సారి కూడా చెప్పనే లేదు. అన్నయ్యా చెప్పలేదు. నన్నెంతలాగా దూరం పెట్టేశారో. అంత అక్కర్లేకుండా పోయనా ....." 


"స్వాతి ..... " సౌండ్ గట్టిగానే వచ్చింది,  కానీ మళ్ళీ సద్దుకుని,  "స్వీటీ,  బావ నీతో చెప్పనంత మాత్రాన దూరం పెట్టేసారనా. మరి నువ్వెన్ని విషయాలు దాచేస్తూ ఉంటావు. అంటే నువ్వూ మా అందరినీ దూరం పెట్టేసినట్లా,  మేమెవరమూ నీకక్కర్లేదనా" 


"నేనెప్పుడు దాచాను" 


"ఎప్పుడో ఎందుకు, ఇందాకా అన్వి పేరు చెప్పబోయి ఆగిపోయావ్. మరి దాచటానికి ప్రయత్నం చేసావ్ కదా,  ఆ రోజు ఆక్సిడెంట్ అయినప్పుడు,  జరగగానే విషయం చెప్పావా?? లేదు కదా. అత్తయ్యకి ఎప్పుడు చెప్పావు అసలు?? మీ అన్న కి నువ్వు ప్రేమిస్తున్న విషయం ఎప్పుడు చెప్పావు?? అన్విత కి నువ్వు ప్రతీది చెప్పావా?? నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్న విషయం నాతో చెప్పక ముందర తనకి ఎప్పుడన్నా చెప్పావా?? కానీ అది మాత్రం నీకు అన్ని చెప్పెయ్యాలా" 


"బావా నీకు తెలీదా ఎందుకు చెప్పలేదో" 


"అదేరా చెప్పేది. నువ్వు చెప్పకపోటానికి నీ రీసన్స్ నీకున్నట్లు అవతల వాళ్ళ రీసన్స్ వాళ్ళకీ ఉంటాయి కదా. చెప్పనంత మాత్రాన దూరం పెట్టేశారని కాదు" 


ప్రదీప్, స్వాతి కి ఫోన్ చేస్తుంటే స్వాతి కాల్ కట్ చేయటం చూసీ,  హరీష్ "నువ్విలా వాళ్ళతో మాట్లాడకుండా ఇక్కడ కూర్చునుంటే వాళ్లేమనుకుంటారు. నీకు వాళ్లిద్దరూ కలిసుండటం ఇష్టం లేదనుకోరా??" 


"కానీ నాకు ఇష్టం ఎందుకు ఉండదు"


"ఆ మాట వాళ్లకి చెప్పాలి కదరా. నీ గురించి నాకు తెలుసు. మీ అన్నయ్య వాళ్ళందరూ ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటారు. చీకటి పడింది కూడా" 


ఇంతలో పద్మగారి కాల్ చూసీ, స్వాతి.... "అమ్మా వచ్చేస్తాను. ఎందుకన్ని సార్లు కాల్ చేస్తున్నావు" 


"చిన్నూ ఎక్కడున్నా ఒక అరగంటలో ఇంట్లో ఉండాలి, లేదా... " 


ప్రదీప్ మాట పూర్తవనీయకుండానే,  "లేదన్నయ్యా, వచ్చేస్తున్నాను. బావతో మాట్లాడుతున్నా. బయల్దేరుతున్నాము" అంటూ పెట్టేసింది 


"బావా,  అరగంటలో ఇంటికి వెళ్ళాలిట. దింపవా." 


"సరే పదా" 


"థాంక్స్ బావా. నువ్వు చెప్పావు కాబట్టి సరిపోయింది. లేకపోతే, సరిగ్గా మాట్లాడకపోయేసరికి వాళ్ళు ఫీల్ అయి నేను ఫీల్ అయ్యి ఇన్ని ఫీలింగ్స్ అయిపోయేవేమో" అంది నవ్వుతూ 


"స్వాతీ నువ్వు మరీ ఎక్కువ ఆలోచించేస్తావ్ అనవసరంగా. చక్కగా ఏదైనా ఉంటే బయటకి మాట్లాడితే క్లియర్ అయ్యేదానికి ఒకటికి వంద ఆలోచించేస్తున్నావ్" అని మెత్తగా మందలించి బైక్ ఎక్కారు


స్వాతి,  హరీష్ ని వెనక నుంచి గట్టిగా పట్టుకుని తన మీద తల వాల్చింది.


"స్వీటీ" 


"మ్మ్... " 


"ఏంచేస్తున్నావురా" 


"మా బావని కౌగిలించుకున్నా. ఈరోజు ఒక మెట్టు ఎక్కేసాం. ఇంకా రెండు మెట్లు. అమ్మ వాళ్ళు,  అత్తయ్యా వాళ్ళని ఒప్పించటం. ఆ తర్వాత మన పెళ్ళే" అంటూ సిగ్గుపడింది


హరీష్ బైక్ ఆపుచేసాడు. ఇద్దరూ దిగీ, "ఏంటి బావ మెయిన్ రోడ్ కాకుండా సందులోకి వచ్చావు" అని స్వీటీ అడిగేలోపు తనని గట్టిగా కౌగిలించుకుని తన పెదవుల మీద చిన్న ముద్దుపెట్టాడు. 


"స్వీటీ.... లవ్ యూ రా. ఈరోజే ఇంట్లో చెప్పేస్తాను. నీకు దూరంగా ఇంక ఉండలేనురా" అంటూ ముద్దు పెట్టుకున్నాడు


"సరే కృష్ణా,  నీ ఇష్టం" అంటూ హత్తుకుంది, హరీష్ కౌగిట్లో మైమరచిపోయి 


హరీష్ తన కళ్ళలోకి చూస్తూ  "ఏం పిలిచావ్" 


స్వాతి తనేమందో అర్ధమయ్యి,  "అయ్యో..... అదేదో వచ్చేసింది. నాకు కృష్ణుడు అంటే ఇష్టం. నీ పేరు లోను కృష్ణ ఉంది. నిన్ను మనసులో ఎప్పుడూ అలాగే పిల్చుకుంటాను.అలా బయటకి వచ్చేసింది. సారీ బావ" 


"లేదురా,  బావుంది. అలాగే పిలువు. నన్నెవరూ అలా పిలవలేదు. బావుంది" 


"సరే కృష్ణా" అంటూ నవ్వేసింది. "ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళకపోతే అర్జునుడు ఉగ్రుడవుతాడేమో" 


"రాక్షసివే" అంటూ ముద్దు పెట్టి బయల్దేరారు. స్వాతిని ఇంటి దగ్గర దింపేసి హరీష్ వాళ్ళింటికి వెళ్ళిపోయాడు. 


ప్రదీప్ దగ్గరకి వెళ్ళి,  " అన్నయ్యా  వచ్చేసాను" 


"సరే వెళ్ళి తినేసిరా. అమ్మ వాళ్ళు ఖంగారు పడ్తున్నారు ఇద్దరూ"


"మరి నువ్వో" 


"నాకు ఆకలిగా లేదు. మీరు తినేసెయ్యండి" 


"నువ్వెందుకు అలా ఉన్నావ్"


"మాది బ్రేకప్ అయిపొయింది. జరిగిపోయిందాని గురించీ ఇప్పుడెందుకు కోపం తెచ్చుకోటం. అసలు విషయం పూర్తిగా తెలుసుకోనే లేదు. అయిపోయిందేదో అయిపొయింది. నువ్వెళ్ళి తినేసిరా" అంటూ తన పనిలో కి దూరిపోయాడు 


*******************************************************


మధ్యలో ఈ ప్రదీప్ అన్విత వచ్చారేంటి అనుకుంటున్నారా.  వాళ్ళు ముందర నుంచే ఉన్నారు,  మనమే గమనించలేదు. 



Comments