24

 "బావా...  ఏం చేస్తున్నావ్ " అంటూ తలుపు తీస్కుని లోపలికి వెళ్లేసరికి హరీష్ ఇంకో అమ్మాయి తన మంచం మీద కూర్చుని ఉన్నారు. హరీష్ కి సర్ప్రైస్ ఇద్దామనుకున్న స్వాతికి షాక్ తగిలింది


"హేయ్ స్వీటీ.....  ఏంటి సడన్ గా.  రా లోపలికి" అంటూ హరీష్ తలుపు దగ్గరకి వెళ్ళి స్వాతిని రూమ్ లో కి పిలిచి,  తనకి కుర్చీ ఇచ్చి అతను మళ్ళీ మంచం మీద ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు.  


స్వాతికి ఆ అమ్మాయి ఎవరో అర్థం కాలేదు. తనని కుర్చీ లో కూర్చోమని ఆమెతో మంచం మీద కూర్చోవటం అసలు నచ్చలేదు. "నువ్వూ, నీ రూమ్, నీ మంచం, నీకు సంబందించిన ప్రతీది నా సొంతం. ఇదెవత్తో వచ్చిందని నన్ను నీకు దూరంగా కూర్చోమంటావా" అని అరవాలనుంది స్వాతికి.  కానీ మాట బయటకి రాలేదు.  


స్వాతి ఆ అమ్మాయినే అలా చూస్తుండటం చూసీ,  "స్వీటీ... తను ప్రియాంక,  మేమందరము ప్రియా అంటాము. ప్రియా...  తను స్వీటీ" స్వాతి మాత్రం "ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో, ప్రియా అంట", అనుకుంటూ చిరాకుపడింది


ప్రియ  "హాయ్ స్వీటీ" 


"హాయ్. నా పేరు స్వాతి అండి"  చిన్న నవ్వు నవ్వి,  అలా చెప్పినందుకు హరీష్ ని కోపంగా ఒక చూపు చూసింది.


హరీష్ కూడా నవ్వేసి అదేమీ పట్టించుకోకుండా, "నేనూ, ఇదీ, వాసుగాడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మా బ్యాచ్ లో. ఇదీ బెంగళూరు లో ఉంటోంది,  వాళ్ళ అమ్మ వాళ్ళతో. మేము ఊరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినప్పుడు చూడటమే. ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపొయింది కదా. ఏదో ఇంటర్వ్యూ ఉందని రాత్రి సడన్ గా దిగింది, లేకపోతే ఇప్పటికీ వచ్చేది కాదు" 


"ఓహ్ " అంది స్వాతి, ఇంక అంతకన్నా ఏం మాట్లాడాలో తెలీలేదు. తన బావ ఎంతో సంతోషంగా ఉన్నాడు, మరి తననలా చూస్తూ స్వాతికి ఎందుకు సంతోషంగా అనిపించటం లేదో ఆమెకి అర్థం కాలేదు. 


"నీ దగ్గరకి రావాలంటే చెప్పి రావాలేంటి. ఆ ఇంటర్వ్యూ అయ్యి జాబ్ వస్తే మాత్రం నేనైతే మీ ఇంట్లోనే ఉంటాను,  ముందరే చెప్తున్నా. ఆ రూమ్ లో ఉండటాలు, మెస్ భోజనాలు నా వల్ల కాదు" 


"ఇక్కడెందుకే,  వాసు గాడి రూమ్ లో ఉండు. మెస్ భోజనం కూడా అక్కర్లేదు, వాడే వంట చేసి పెడ్తాడు. హాయిగా తిని పెట్టు. వాడు బలవుతాడనుకో నీకు చేయలేక, కానీ నేను సేఫ్ కదా" గట్టిగా నవ్వుతున్నాడు హరీష్.


"ఒరేయ్ హరీ.... అయిపోయావ్ రా నా చేతుల్లో. ముందరే మీ ఇంట్లో ఉండద్దని చెప్పేస్తున్నావా" అంటూ హరీష్ ని కొడుతుంటే, హరీష్ రూమ్ లో నుంచి బయటకి పరిగెత్తి కిందకి వాళ్ళ అమ్మ గారి దగ్గరకి వెళ్ళాడు. తన వెనకాలే ప్రియా కూడా వెంబడిస్తూ వెళ్ళింది 


హరీష్ రూమ్ లో స్వాతి ఒక్కత్తి కూర్చుంది. అక్కడ కూర్చున్న ప్రతి క్షణం ముళ్ళ మీదున్నట్లుగా ఉంది. ఇద్దరూ కిందకి వెళ్ళి అయిదు  నిమిషాలు దాటిందీ,  ఎవరూ రాలేదు. "బావ కూడా నేనిక్కడున్నానని మర్చిపోయాడా"....  ఆ ఆలోచన రాగానే స్వాతికి తన కింద నేల కంపించినట్లుగా అయ్యింది. అక్కడింక ఒక్క క్షణం ఉండలేక తిరిగి వెళ్ళిపోదామానుకుని మేనత్తకి చెప్పటానికి వెళ్ళింది. 


"అత్తయ్యా,  నేను బయల్దేరుతాను" 


"అదేంటే అప్పుడే వెళ్తావా. ఉండు కొంచం సేపు." 


"లేదతయ్యా,  మళ్ళీ వస్తాను. బావ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్నాడుగా. తర్వాత వీలు చూసుకుని వస్తానులే. ఏమనుకోకు" అంటూ గబా గబా గుమ్మం తలుపు తీయగానే ఎదురుగా హరీష్ అదే తలుపుని తీయబోతున్నాడు. స్వాతి వెళ్ళిపోతోందని అర్ధమయ్యి 


"వాసు ఇల్లు వెతుకుంటుంటే బయట నిల్చున్నా. వాడు వస్తున్నాడు. నువ్వెక్కడకి??" 


"నిన్ను చూడాలనిపించి వచ్చాను, కాల్ చేసి రావాల్సిందీ. నువ్వూ మీ ఫ్రెండ్స్ తో బిజీ గా ఉన్నావ్ కదా. తర్వాత ఎప్పుడన్నా వస్తానులే" అంటూ కదలబోయింది. తనని గుమ్మం బయటకి లాగి,  తలుపు దగ్గరకి వేసి 


"స్వీటీ ఆగరా....  ప్లీజ్. నీకన్నా ఏదీ ఇంపార్టెంట్ కాదురా. ఉండరా. నా కోసం" అంటూ హరీష్ బతిమాలుతూ అడిగేసరికి స్వాతి కాదనలేకపోయింది. ఇంతలో ప్రియ, వాసు వస్తున్న అలికిడి అవటం చూసీ తలుపు తీస్కుని లోపలికి వెళ్ళాడు హరీష్. 


"వచ్చావా. స్వాతి ఇప్పుడే వెళ్ళిందిరా. మీ ఫ్రెండ్స్ తో ఉన్నావు కదా. మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను అంది" అంటూ వాళ్ళ అమ్మ గారు బయటకి వచ్చారు 


"వెళ్లలేదమ్మా. ఉంటుంది" అంటూ స్వాతి వైపు తన సమాధానం కోసం చూసాడు. స్వాతి కూడా సరే అని కళ్ళతోనే సమాధానం చెప్పింది. 


"స్వాతి నువ్వూ రూమ్ లో ఉండు, ఇప్పుడే వస్తా. ఒక్కసారి అమ్మ వాళ్ళని వాడు కలిసేసాక,  మనం కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఊ అనరా. నీతో ఎప్పుడో కానీ టైమ్ దొరకదూ"


"సరే బావా"  అని హరీష్ రూమ్ లోకి వెళ్ళింది. 


ఆ రూమ్ ని ఎప్పుడూ పూర్తిగా చూడనేలేదు. రూమ్ లో  ఒక వైపుగా బుక్ షెల్ఫ్ ఉంది.  బుక్స్ అన్ని చాలా చక్కగా సద్ది ఉన్నాయి. అన్ని కూడా కంప్యూటర్స్ కి సంబంధించినవే. కిందన ఒక్క షెల్ఫ్ లో మాత్రం ఇంగ్లీష్ నవెల్స్ ఉన్నాయి. 


"బావా ఈ విషయం లో మాత్రం నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది. నేను పుస్తకాలు అస్సలు చదవలేను" అనుకుంది నవ్వుకుంటూ. 


అటు పక్కగా డ్రెస్సింగ్ రూమ్. లోపలికి వెళ్ళి చూసింది. అదే ఒక పెద్ద రూమ్ లాగా ఉంది. అన్ని చాలా నీట్ గా సద్ది ఉన్నాయి. ఒక  షెల్ఫ్ మొత్తం ఫోటోస్,  దాంట్లో ఒక్క ఫోటో మాత్రం వెనకగా పెట్టి ఉంది. అది తీసి చూసింది.... స్వాతి హరీష్ ని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటున్న ఫోటో,  వాళ్ళ చిన్నప్పటిది.  సిగ్గుపడుతూ ఆ ఫోటో ని తడిమింది. ఆ ఫోటో ని బుక్ షెల్ఫ్ లో ఒక  పుస్తకం లో దాచింది. 


మళ్ళీ చుట్టూ చూసింది. ఇన్నాళ్ళ లో ఎప్పుడూ గమనించని చందమామ పుస్తకాల కలెక్షన్ చూసీ ఆశ్చర్యపోయింది. ఎన్ని ఉన్నాయో. కానీ అన్ని అటక మీద ఉన్నాయి. మంచం మీద ఒక స్టూల్ వేసుకుని మొత్తానికి ఒక చందమామ పుస్తకం సంపాదించింది. గబా గబా అది తీస్కెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో లైట్ వేస్కుని తలుపు దగ్గరకి పెట్టేసి మూల కి చదువుతూ కూర్చునిపోయింది. 


కొద్దిసేపటికి హరీష్,  వాసు,  ప్రియా రూమ్ లో కి వచ్చారు. స్వాతి కనిపించకపోగా,  మంచం మీద స్టూల్ పడిపోయి ఉండటం తో అసలేం జరిగిందో అర్థం కాలేదు. 


హరీష్... "స్వీటీ " అంటూ కంగారుగా పిలిచాడు. కానీ స్వాతి చందమామ ని తినేసే పనిలో ఉండి అదసలు వినిపించుకోలేదు. 


"పాపం బోర్ కొట్టి వెళ్లిపోయిందేమోరా" అని వాసు అన్నాడు 


"కాదురా,   తను వెళ్ళదు. అసలు ఈ స్టూల్ మంచం మీద ఎందుకుంది. ఏమయ్యిందో  అర్థం కావట్లేదు" అంటూ స్వాతికి ఫోన్ చేయబోయి తన ఫోన్ అక్కడే ఉండటం తో ఆగిపోయాడు.


ప్రియా... "ఒరేయ్ ఖంగారు పడకు. వాష్రూమ్ కి వెళ్ళిందేమోలే"


హరీష్ అటు చూసాడు,  డోర్ ఓపెన్ చేసి ఉంది.  పక్కగా ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లో లైట్ ఆన్ చేసి ఉంది కానీ తలుపు క్లోజ్ చేసి ఉండటం తో,  అనుమానంగా తలుపు తీసాడు. ఆ తలుపు చప్పుడుకి స్వాతి,  చదువుతున్న పుస్తకం దాచేసింది. 


హరీష్ లోపలికి వెళ్ళి....  "స్వీటీ.....  ఏమయిందిరా. ఎందుకిక్కడ మూలగా కుర్చున్నావ్. భయపడ్డావా. అసలేమయ్యింది. ఏంటి వెనకాల దాస్తున్నావు " అంటూ ఖంగారుగా తన దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని అడిగాడు. ఇంతలో వాసు ప్రియా కూడా అక్కడికి వచ్చారు. 


స్వాతి చేసిన పని చెప్పటానికి మొహమాట పడిపోయి ఏం చెప్పాలో అర్థం కాలేదు. "బావా...  ఏమి కాలేదు. బానే ఉన్నా నువ్వు పదా. నేనొస్తాను" అంటూ హరీష్ ని వెళ్ళమని తోసింది. 


"లేదు నువ్వేమయ్యిందో చెప్తే కానీ కదలను. ఏం దాస్తున్నావు వెనకాల" అని మొండిగా అక్కడ నుంచి కదలలేదు. 


ఇంక చేసేది లేక,  హరీష్ కి దగ్గరగా వచ్చి "బావా పుస్తకం చదువుతూ కూర్చుండిపోయాను"


"ఏం బుక్" 


స్వాతి వెనకాల దాచేసిన బుక్ తీసి చూపించింది. ముగ్గురూ పగలబడి నవ్వారు. "దీన్ని అంత దాక్కుని చదవాలా" 


"ఏమో బావా అంత ఆలోచించలేదు. చందమామ పుస్తకాలంటే చాలా ఇష్టం. అవి చదువుతుంటే అన్నయ్య సతాయిస్తాడని దాక్కుని చదివేదాన్ని. ఇప్పుడా బుక్ చూసేసరికి అన్ని మర్చిపోయి ఇక్కడ కూర్చుండిపోయాను. నువ్వు  తలుపు తీసేవరకు నేనెక్కడున్నానో కూడా గుర్తులేదు" అంది తప్పు చేసి దొరికిపోయిన చిన్న పిల్లల్లాగా.


"సరే పదా" అని ముగ్గురూ రూమ్ లో కి వస్తూ,  "స్వీటీ స్టూల్  వేస్కుని పైన నుంచి తీసావా ఆ బుక్ ని" 


"అవును" అంది తలొంచుకుని. 


"పుస్తకం కావాలంటే నేను తీసి ఇస్తాను కదా,  అలా ఎక్కితే పడిపోయుంటే ఎంత ప్రమాదం. ఇంకెప్పుడూ అలా చేయకురా.  కూర్చో. సరే కానీ  వీడు.....  " అని చెప్పబోతుంటే ప్రియా హరీష్ నోరు మూసేసి,  "నేను చెప్తా..... వీడు వాసు,  మా ఇద్దరి లాగా కాదులే చాలా బుద్ధిమంతుడు" 


స్వాతి మాత్రం హరీష్ నోటి మీద పెట్టిన ప్రియా చేతినే చూస్తోంది. ప్రియా అదేమీ పట్టించుకోకుండా,  "వాసూ....  తను స్వీటీ...  కాదు కాదు స్వాతి" అంటూ హరీష్ నోటి మీద చేయి తీసి నవ్వింది. 


స్వాతికి ప్రియా తనని చూసీ నవ్వటం ఇబ్బందిగా అనిపించి తలొంచుకుని నిల్చుంది. హరీష్ అది గమనించి, స్వాతి మీద చేయి వేసాడు,  పట్టించుకోకు అన్నట్లేమో 


అప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న వాసు,  "వాడికి మాత్రమే స్వీటీ తర్వాత అందరికీ స్వాతినే.  ఏమంటారు సిస్టర్" అని నవ్వుతూ మాట్లాడాడు 


తలొంచుకుని ఉన్న స్వాతి సడన్ గా తల ఎత్తి వాసు ని హరీష్ ని మార్చి మార్చి చూసీ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ "హలో అండి" అంది 


"అదేంటి సిస్టర్,  నేను సిస్టర్ అంటుంటే మీరేమో అండి  అంటారు" 


వసు అలా పిలిచేసరికి స్వాతి నవ్వు ఆపుకోలేకపోయింది. గట్టిగా నవ్వేసి, నోటికి చేయి అడ్డు పెట్టుకుని నవ్వాపుకుంటూ "సారీ... సారీ అన్నయ్యా" 


హరీష్.... "స్వీటీ ఎందుకంత నవ్వొస్తోంది" 


"అది కాదు బావా....  నువ్వూ,  రమ్య ఐ లవ్ యూ అంటే.... "


హరీష్.....  "ఏమందీ" 


"ఐ లవ్ యూ అంటే... " స్వాతి బుర్ర కి అప్పుడు వెలిగింది. ప్రియా, వాసు ని చూసీ సిగ్గుపడి హరీష్ వెనకాల దాక్కునిపోయింది. 


వాసు  నవ్వుతూ...  "పర్వాలేదులే సిస్టర్. మేమేం అనుకోము" 


హరీష్, స్వాతి ని వెనక నుంచి ముందుకి లాగి, తన భుజం మీద చేయి వేసి దగ్గరకి తీసుకున్నాడు. 


"సారీ అన్నయ్యా....  మీరు సిస్టర్ అన్నందుకు నవ్వురాలేదు,  తనని ఆట పట్టిద్దామనుకుని వచ్చిన మా ఫ్రెండ్ ని సిస్టర్ అన్నారు అది గుర్తొచ్చింది" 


"మీ ఫ్రెండ్ అని ఇంకా మర్యాదగా సిస్టర్ అన్నాడు,  ఎవరన్నా ఆ మాట అన్నారే అనుకో, ముందర చెయ్యే మాట్లాడ్తుంది వాడికి. ఎంత సరదాగా ఉంటాడో అంతే కోపిష్టి" 


"కోపమా....  మా బావకా. నేను నమ్మను"


"హహహ.....  నా మీద ఏదో కొంచం మంచి ఇంప్రెషన్ ఉందిరా వాసు తనకి. పాడుచేయకు. సరే కానీ,  అందరమూ సరదాగా బయటకి  వెళ్దామా" అని అడగగానే ప్రియా, వాసు సరే అన్నారు. 


స్వాతి "నేనూ బయల్దేర్తాను. మీరు వెళ్ళి రండి" అంటూ వెళ్ళబొయింది. 


"అదేంటి సిస్,  అందరమూ వెల్దామనుకుంటే మీరు రానంటారు. మా హరి ని ఒక్కడిని వదిలేస్తారా" 


"ఒక్కడేంటిరా,  తను రాకపోతేనేం, మనం ఉంటాము కదా" అంటూ హరీష్ ఇంకో చేతిని గట్టిగా పట్టుకుంది ప్రియా. తను  అన్నమాటకి తుళ్ళిపడింది స్వాతి. హరీష్ ఆమెని పొదవిపట్టుకుని ఉండటంతో అతని షర్ట్ ని గట్టిగా పట్టుకుంది, అతనిని ఎక్కడ ప్రియ లాక్కుని వెళ్ళిపోతుందేమోనని భయంగా. 


స్వాతిలో మార్పుని గమనించి, ప్రియ చేతిలోనుండి తన చేతిని తీసి స్వాతి చేతి మీద వేసి "స్వీటీ....  నేను అడగనా ప్రదీప్ ని" అంటూ ఆమె చేతిని నొక్కాడు. ఆ స్పర్శతో అతని కళ్ళలోకి చూసింది.


ఆ కళ్ళలో హరీష్ ప్రేమ కనిపించటంతో స్వాతి కుదుటపడి, "లేదులే బావ. అమ్మని అడుగుతాను. ఒక్క క్షణం ఇప్పుడే వస్తాను" అంటూ డ్రెస్సింగ్ రూమ్ లో కి వెళ్ళి పద్మ గారికి కాల్ చేసింది. హరీష్ వుంటాడనటంతో ఆవిడా ఒప్పుకున్నారు. 


ప్రియా "హరి లంచ్ బయటే చేద్దాము. ఆంటీ కి చెప్పేసెయ్యి" 


హరీష్ చెప్దామని కిందకి వెళ్తుంటే,  "బావా నువ్వు రెడీ అయ్యి రా. నేను చెప్పి వస్తానులే అత్తయ్యతో" అంటూ స్వాతి హరీష్ వాళ్ళ అమ్మగారికి లంచ్ విషయం చెప్పింది. 


వాళ్ళ అమ్మగారు "ఈ పిల్ల వచ్చిందంటే చాలు హడావిడి చేసేస్తుంది. ఎంత కలుపుగోలుగా ఉంటుందో. డబ్బున్న వాళ్ళు, ఒక్కతే పిల్ల. ఆ అమ్మాయికి వీడంటే ఇష్టం. వీడికీ ఆ అమ్మాయంటే ఇష్టం.ఇంకేం కావాలి. ఆ అమ్మాయిని హరీష్ కి అడిగితె ఎలా ఉంటుందంటావే".


స్వాతికి తల తిరిగినవు అయ్యింది ఆ మాటకి.



Comments