20

 


"అన్నయ్యా నీ  దగ్గరో విషయం దాచాను" అంది బాధగా.  నిన్న పొద్దున్న కాలేజ్ లో దింపాక తన గొంతుని మళ్ళీ ఇప్పుడే వినటం. ఆ మాటలో ప్రదీప్ కి తప్పు చేసాను అనే భావము కనిపించింది


"నా దగ్గర దాచాల్సిన పనేముందిరా,  ఏ విషయం"


"నిన్న మేము బయటకి వెళ్ళినప్పుడూ..... మాతో పాటు అబ్బాయిలు  కూడా ఉన్నారు. అందరమూ బైక్స్ మీద వెళ్ళాము"  అంది నెమ్మదిగా. 


ప్రదీప్ ఒక్క క్షణం ఆగి "సరే నీ తప్పు లేదులే,  అసలు పూర్తిగా కనుక్కోకుండా నువ్వు చెప్పగానే ఒప్పేసుకున్నాను కదా నన్నే అనుకోవాలి. అయినా ఇదొక్కటే ఏంటీ,  చాలానే దాస్తున్నావు కదా. ఇప్పుడు మాత్రం చెప్పటం ఎందుకు వెళ్ళొచ్చేసావుగా" అంటూ చాలా కోపంగా స్వాతిని చూసాడు.  స్వాతి కిందకి చూస్తోంది. ఆ కళ్ళలో బాధ తెలుస్తోంది కానీ అది తన దగ్గర దాచినందుకా,  లేక తను కోప్పడ్డందుకా లేక ఇంకేదైనానో తెలీలేదు.  


కార్ పక్కకి ఆపాడు.  స్వాతి సీట్ లో తల దించుకుని  కళ్ళు మూసుకుంది.  బయట చుట్టూ వెతుకుతున్న ప్రదీప్ కి చేయి ఊపి రోడ్ క్రాస్ చేసి హరీష్ తన కార్ వైపు వస్తూ కనిపించాడు. 


డోర్ ఓపెన్ చేయగానే స్వాతిని చూసీ ఆగిపోయిన హరీష్ తో, "తనని కాలేజ్ లో దింపేసి వెళదాము.  వెనకాల కూర్చో"


హరీష్ అవేవి వినకుండా,  "బావా.... స్వాతి ఎందుకు ఏడుస్తోంది.  ఏమయ్యింది" అని అనేదాక స్వాతీ కన్నీళ్ళని గమనించలేదు ప్రదీప్.  


"చిన్నూ......  నిన్నేమీ అనలేదమ్మా.  కోపమేమి లేదు నాకు.  సారీ రా గట్టిగా అనేశాను. చిన్నూ ప్లీజ్ నాన్నా"  అంటూ కళ్ళు తుడిచాడు.  "చిన్నూ ఏంటిరా,  ఇంత జ్వరం ఉంది.  అసలు చెప్పనేలేదు" అని ఖంగారుగా అడిగాడు,  స్వాతి ఏమి మాట్లాడలేదు


హరీష్ ఇంతలో వెనకాల సీట్ లో కూర్చున్నాడు.  "బావా..... బ్లడ్....  స్వాతీ ఏమయ్యిందసలూ " అంటూ గట్టిగా అరిచి తన చేతికి చుట్టి ఉన్న చున్నీని తీసాడు. "బావా....  చాలా నొప్పిగా ఉందీ బావా" అంటూనే ప్రదీప్ మీద వాలిపోయింది స్వాతి. 


హరీష్ ఖంగారుగా, " బావా,  ముందు హాస్పటల్ కి పదా. నేను తనని పట్టుకుంటాను" అనేసరికి ప్రదీప్ కార్ స్టార్ట్ చేసి వెళ్లారు.


డాక్టర్ తనని చెక్ చేసి, "తనకి చేసిన డ్రెస్సింగ్ సరిగ్గా చేయలేదు,  అది రప్చర్ అవ్వటంతో బ్లీడింగ్ అయ్యింది. నిన్నటి నుంచి తినకపోవడం వలన కళ్ళు తిరిగాయి. ఇంజక్షన్ ఇచ్చాను కొద్దిసేపట్లోనే కళ్ళు తెరుస్తారు.  నర్స్ వచ్చి డ్రెస్సింగ్ చేస్తుంది" అని చెప్పి వెళ్లిపోయారు 


ప్రదీప్ కి స్వాతిని అలా చూసేసరికి అసలు ఏమి అర్థంకాకుండా ఉందీ.  "బావా....  ఆ దెబ్బలేంటి. అసలేం జరిగిందో నిన్న అర్థం కావటం లేదు. అన్ని దెబ్బలు తగిలితే,  పిచ్చిది బయటకి చెప్పకుండా ఒక్కత్తి ఓర్చుకుందా. ఇలాంటివి పడకూడదనే కదా తీస్కొచ్చేసాను, అయినా కూడా నేను చూస్కోలేకపోయాను. అమ్మ వాళ్ళు దాన్ని భయపెట్టద్దంటే,  ఆ విషయం దానికి తెలుసులే అనుకునేవాడిని కానీ నాకు కూడా చెప్పుకోలేనంత కఠినంగా ఉంటున్నా అనుకోలేదు. ఇందాకా కూడా దాని కళ్ళు ఎందుకో బాధగా ఉన్నాయనిపించింది కానీ అర్థం చేస్కోలేకపోయాను బావా" అంటూ హరీష్ ని పట్టుకుని ఏడ్చేశాడు 


"బావా......  తనకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వెప్పుడూ తనని బాధపెట్టలేదు. నాకు తెలిసీ నువ్విప్పుడు ఇలా బాధపడ్తున్నావంటే తన వలెనే అని ఇంక ఎక్కువ కృంగిపోతుంది. నువ్వు ధైర్యం గా ఉండు. ముందు ఈ మంచినీళ్ళు తాగు. బావా ఒక్కసారి కార్ కీస్ ఇయ్యవా ఇప్పుడే వస్తాను" అంటూ మంచినీళ్ళు ఇచ్చి కీస్ తీసుకునీ బయటకి వెళ్ళి కార్ లో దిగాలుగా కూర్చుండిపోయాడు.


తన బాధ ఎవరికి చెప్పుకుంటాడు,  తనకి ధైర్యం ఎవరు చెప్తారు. అసలేమయ్యిందో అర్థం కావట్లేదు. అబ్బాయిలతో వెళ్ళటం వలన ఏదైనా సమస్యా?? నిన్న తను లొకేషన్ షేర్ చేసినది చూస్తూనే ఉన్నాడు. కానీ మధ్యాహ్నం తర్వాత అది ఆగిపోయిందీ. అప్పటికి తను అక్కడికి వెళ్ళి చూసీ వచ్చాడు. అక్కడెవరూ లేకపోవటంతో ఆఫీస్ కి వెళ్లిపోతుంటే దారిలో బండి పాడయ్యింది. అది మెకానిక్ ఇచ్చి ఇంటికి ప్రదీప్ తో వచ్చినప్పుడు కూడా స్వాతిని కలుద్దామని వాళ్ళింటికి వెళ్ళాడు. తను వచ్చి టైర్డ్ గా ఉండి పడుకుందన్నాకే స్థిమిత పడ్డాడు. మొన్న సాయంత్రం నవ్వుతూ మాట్లాడింది కానీ మళ్ళీ ఈరోజు  కళ్ళనీళ్ళ తో, రక్తంతో చూసాడు. హరీష్ తలపట్టుకుని కూర్చున్నాడు. ఏదో గుర్తొచ్చినట్లు గబా గబా కార్ లో నుంచి స్వాతి కాలేజ్ బాగ్ తీసుకునీ ప్రదీప్ దగ్గరకి వెళ్ళాడు.  


"బావా...  తన ఫోన్...  విరిగిపోయింది. ముందర తనకి ఏం జరిగిందో తెలుసుకో,  తను లేస్తుంది ఇంకొంచం సేపట్లో. నువ్వు ముందర ధైర్యంగా ఉండు"  అంటూ ప్రదీప్ పక్కన కూర్చున్నాడు 


కొద్దిసేపటికి స్వాతి కళ్ళు తెరిచి ప్రదీప్ వైపుకి చూసింది. ప్రదీప్ తల పట్టుకుని కూర్చుని ఉంటే,  హరీష్ స్వాతి విరిగిపోయిన ఫోనే పట్టుకుని ఆలోచనల్లో ఉన్నాడు 


"అన్నయ్యా" నూతిలో నుంచి వచ్చినట్లుగా చిన్నగా వినిపించింది 


"చిన్నూ.....తల్లీ.....  ఎలా ఉన్నావురా. ఏమయిందిరా అసలూ. ఈ దెబ్బలేంటిరా ఇంత నొప్పిగా ఉంటే నాతో చెప్పలేదేంటమ్మా" అంటూ  ఏడ్చేశాడు 


హరీష్,  ప్రదీప్ భుజం మీద చేయి వేసాడు, తనని సద్దుకో మన్నట్లుగా. "స్వాతి..... ఇప్పుడెలా ఉందీ" తన చేతిని చూస్తూ, "నొప్పి ఎక్కువగా ఉందా" అంటూ ప్రేమని బాధని పంటి బిగువున పెట్టి  అడిగాడు. 


హరీష్ ని చూసీ తన బాధ అర్థమయ్యి ఏమి చేయలేక ప్రదీప్ ని చూసీ "అన్నయ్యా....  నన్ను క్షమించవా.....  నిన్న మీకు చెప్పకుండా వెళ్ళి నేను తప్పు చేసాను. అంతే తప్ప వేరే ఇంకేం తప్పు చేయలేదూ" అంటూ ఏడ్చింది


ప్రదీప్ "చిన్నూ, నిన్నెవరూ తప్పుపట్టటం లేదురా. ఇప్పుడెలా ఉందొ చెప్పు ముందు" అంటూ నుదుటి మీద చేయి వేసాడు 


"అన్నయ్యా నిన్న బైక్ ఆక్సిడెంట్ అయ్యింది. మీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ విరిగిపోయింది. అయినా అప్పుడు ఇవన్నీ నొప్పి అనిపించలేదు, ఏంటో కంపరంగా అనిపించింది. ఇంటికొచ్చాక చెపుదాం అనుకున్నా కాని నొప్పి ఎక్కువగా ఉందని ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటే నిద్రపట్టేసింది.  అమ్మతో చెప్తే ఖంగారు పడ్తుంది, నువ్వొచ్చాక నీకు చెప్తే నువ్వు మెల్లిగా చెప్తావని చెప్పలేదు. రాత్రి నీ దగ్గరకొచ్చాను అన్నయ్యా, కానీ నువ్వు పడుకునుంటే లేపాలనిపించలేదు"


ప్రదీప్....  "చిన్నూ నాకు నువ్వు ఇంపార్టెంట్ అని నీకు తెలీదా.  అట్లీస్ట్  లేచాక అయినా చెప్పావా,  చూసుకుని ఉండకపోతే ఇంత జ్వరం తో కాలేజ్ లో దింపేసేవాడిని. నేనే నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదమ్మా. నీకు నేనంటే ప్రేమనుకున్నా కానీ భయం అని తెలీలేదురా" 


"అన్నయ్యా నువ్వలా అనకూ. నాకు అసలే చాలా గిల్టీ గా ఉంది. నువ్వలా అంటుంటే నాకు చచ్చిపోవాలనుంది. నిన్ను కూడా  బాధపెడుతున్నాను నేను. సారీ అన్నయ్యా" అంటూ ప్రదీప్ చేయి పట్టుకుని ఏడ్చేసింది 


"స్వాతి...." కొంచం గట్టిగా అరిచాడు హరీష్. మళ్ళీ అంతలోనే సద్దుకుని "బావా....  ఏంటిది ఇద్దరూ. స్వాతి చచ్చిపోవటం ఏంటి?? ఏంటా మాటలు?? నీకేదన్నా అయితే మేమందరము ఏమవుతాం?? ఆ ఆలోచనలన్నీ మానేసి కొంచం సేపు పడుకో,  నర్స్ ని పిలిచాను. తనొస్తుంది.... బావా తన మనసులో నీ స్థానం ఏంటో నీకు తెలీదా. చెప్పలేకపోయానని బాధపడుతోంది కదా. నువ్వు అలా ఉంటే తనూ సద్దుకోలేదు" 


నర్స్ చెక్ చేయటానికి వచ్చిందని ప్రదీప్, హరీష్ రూమ్ లో నుంచి బయటకి వచ్చి,  


ప్రదీప్  "బా.....  ఇప్పటికీ అది పూర్తిగా జరిగింది చెప్పటం లేదు. ఏదో అయ్యింది" 


"అదేంటి బావా" 


"అది అబద్దం చెప్తే దాని కళ్ళు పక్కకి తిప్పేస్తుంది. అది అబద్దం చెప్తోంది లేదా నిజం దాస్తోంది. నన్ను చూసీ మాట్లాడలేదు. నాకు తెలుసూ కానీ అదేంటో తెలీదు" 


హరీష్... "బావా ఇప్పటికైతే ఇంటికి రానీయి. తర్వాత కనుక్కోవచ్చు" 


ఇంతలో నర్స్ వచ్చి టాబ్లెట్స్ కావాలని ప్రిస్క్రిప్షన్ ఇయటం తో ప్రదీప్ అటు వెళ్ళాడు 


హరీష్,  స్వాతి దగ్గరకొచ్చి కూర్చున్నాడు 


స్వాతి.... "బావా....  అన్నయ్య ఏడి" 


"మందులు తీసుకొస్తా అని వెళ్ళాడు" 


"బావా నిన్ను పట్టుకోవచ్చా" అని స్వాతి అడగగానే హరీష్ తనని కూర్చోపెట్టి తనని హత్తుకున్నాడు 


"స్వీటీ....  నాకు భయమేసేసిందిరా.....  ఎవరితో చెప్పుకోవాలో తెలీక ఇందాకటి నుంచి పిచ్చివాడిలాగా తిరుగుతున్నాను. నీకేదైనా అయితే నేనేమైపోతానురా. అసలేమయ్యింది. నువ్వెందుకు ఫోన్ చేయలేదు. నీ ఫోన్ విరిగి పోతే ఎవరో ఒకళ్ళ ఫోన్ నుంచి చేయచ్చు కదా. ఎందుకురా ఇలా భయపెట్టేసావు" అంటూ ఆమెని గట్టిగా పట్టుకున్నాడు. 


"నేనిప్పుడు బానే ఉన్నాను కదా బావా. తగ్గిపోతుందిలే. ఖంగారు పడకు. మీరిద్దరూ ఉండగా నాకేమైపోతుంది చెప్పూ" అంటూ హరీష్ ని ఓదార్చింది 


"మేమిద్దరమూ ఉన్నా ఏమి చేయలేకపోయాము. నువ్వు మమ్మల్ని దూరం పెట్టేసావు. స్వీటీ అసలేమయ్యిందిరా. నిజం చెప్పు" 


స్వాతి,  హరీష్ నుంచి దూరం జరుగుతూ "బావ నేనెవరితోను, ఎప్పుడూ తెలిసో తెలియకో కూడా అబ్బాయిలతో నా లిమిట్ క్రాస్ చేయలేదు. నన్ను ముట్టుకుంది, ముద్దుపెట్టుకుంది నువ్వు మాత్రమేను. నాకు ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడితో అయినా చేతులు వేసి మాట్లాడే చనువు కూడా ఇయ్యను. నేనెప్పుడూ ఏ తప్పూ చేయలేదు" 


"స్వీటీ ఇదే మాట ఇప్పటికీ చాలా సార్లు చెప్పావు. నువ్వు తప్పు చేశావని మేమెందుకు అనుకుంటాము. మాకు తెలీదా" 


"ఏమో బావా... నిన్నటి నుంచి నన్ను నేను ఇదే ప్రశ్నించుకుంటున్నాను. నిన్న అక్కడికి వెళ్ళామా....  అక్కడ మా క్లాస్మేట్ ఒక్కడూ విక్రమ్ అని,  నా మీద పడుతూ,  రాసుకుంటూ తిరుగుతూ ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తూ చాలా ఇబ్బంది పెట్టాడు బావా. వాడితో ఎప్పుడూ మాట్లాడిందీ లేదు. మొన్న రమ్య అందుకే కోప్పడింది...వాడు వస్తే అక్కడకి వెళ్ళద్దని. నేను వాడి దగ్గరకి వెళ్లకపోతే వాడు నన్నేం చేస్తాడులే అనుకుని దాని మాట కూడా పట్టించుకోలేదు. కానీ, అక్కడ ఉండలేకపోయాను. వచ్చేదామనుకుంటే అతని బైక్ మీదే రావాలి. అప్పటికే నాకు ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. ఆ చికాకులో రోడ్ మీదకి వచ్చి ఒక బైక్ వస్తుంటే పట్టించుకోకుండా అడ్డం వెళ్ళిపొయాను.  అది తగలటం తో పక్కన పడిపోయాను. నా ఫోన్ విరిగిపోయింది. అక్కడ వాళ్ళు  దగ్గర్లో ఏదో హాస్పిటల్ కి తీసుకునీ వెళ్లారు. అక్కడ నుంచి క్యాబ్ లో ఇంటికి వచ్చాను. అమ్మ ఖంగారు పడుతుందని లోపలికి వెళ్ళి హాస్పిటల్ లో ఏవో టాబ్లెట్ ఇస్తే  అవేసుకుని పడుకున్నాను. పొద్దున్న జ్వరంగా ఉందని తెలుసు కానీ ఇంట్లో ఉండలేకపోయాను. కాలేజ్ కి కూడా వెళ్లేదాన్ని కాదేమో. వెళ్తే మళ్ళీ విక్రమ్ ని చూడాలి. ఏమో నేను కాలేజ్ కి వెళ్లనూ. అన్నయ్యకి చెప్పవా, నేను ఇంటి నుంచి ఎగ్జామ్స్ రాస్తాను" అంటూ ఏడిచింది 


"స్వీటీ....  ఇంత జరిగితే ఇందాక మరి మీ అన్న అడిగితె ఎందుకు చెప్పలేదు" 


"ఏమని చెప్పమంటావు బావా.....  ఒక అబ్బాయి నన్ను అసభ్యంగా టచ్ చేసాడు అని చెప్పనా. అన్నయ్య నన్ను బాధపెడితే ఎవరినైనా కానీ ఊరుకోడు, నాన్న మీదే చేయి లేపాడు 5 ఇయర్స్ బ్యాక్,  నాకు తెలుసని తనకి తెలీదు. ఎలా తెలుసని మాత్రం అడక్కు. అలాంటిది అన్నయ్య వాడితో గొడవ పడితే,  వాడు అన్నయ్యని ఏమైనా చేస్తాడేమో. అసలే వాడి సర్కిల్ ఏమి మంచిగా లేదు. అప్పుడు బాధపడేదీ నేనే కదా. తన మీద ప్రేమతోనే చెప్పలేదు బావా.  నాకు మీ ఇద్దరూ కావాలి"


హరీష్,  స్వాతిని తల మీద ముద్దుపెట్టుకుని,  "సరే ఏమికాదురా. వాడి గురించీ ఆలోచించకు. ఇదిగో చూడు ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఉన్నావు. నువ్వు ఆ మధ్య చెప్పావు కదా నా దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటుందని"అంటూ తల మీద తన తల ఆనించి, "ఈ స్పర్శ,  ఈ ముద్దు గుర్తుంచుకో" అంటూ ముద్దు పెట్టాడు.


"ఇప్పుడు హాయిగా బజ్జో..... అవును స్వీటీ,  పొద్దున్న నువ్వేమి తినలేదా. అత్తయ్య అలా ఎలా పంపించింది" అంటూ తను జరిగి స్వాతి  తలని ఒళ్ళో పెట్టుకునీ తల మీద రాస్తూ జో.... కొడుతున్నాడు


"అదేం అడుగుతావులే బావా....  అసలైతే అన్నయ్య తో మాట్లాడే వరకూ నాకు స్థిమితం లేదు బావా,  తినాలనే లేదు. తను నన్ను నమ్మి పంపించాడు,  నేను తనని మోసం చేసాను బావా. అన్నయ్య నన్ను క్షమించేసినా నన్ను నేను క్షమించుకోలేను" అంటూ  కళ్ళ నీళ్ళ పెట్టుకుంది. 


"స్వీటీ.... 


మళ్ళీ తనకి తనే సద్దుకుని,  ".... ఇంతలో పొద్దున్న లేపుదామని వచ్చిన అమ్మ కి కాలు మీద తగిలిన దెబ్బలు కనిపించాయి. అన్నయ్య మీద అరుస్తూ వెళ్ళబోతే బతిమాలుకొని,  అన్నయ్యనేదైనా అంటే నిరాహారదీక్ష చేస్తా అని బెదిరించాను. నేనే చెప్తా తనని చెప్పద్దన్నాను. అమ్మ ఆ టెన్షన్ లో తిరిగేస్తోంది ఏం చేయాలో తెలీక,  నేను తినేసా అని బయటకి వచ్చేసాను. అది సరే కానీ నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా..... అన్నయ్యకి  మన గురించీ తెలుసు. నేనేం చెప్పలేదని వెయిట్ చేస్తున్నాడు" 


"మరెందుకు చెప్పలేదురా, తప్పు కదా తన దగ్గర దాచటం. నాకు జాబ్ రావాలని వెయిట్ చేశాను కానీ ఇప్పుడు చెప్పటానికి ఏంటీ ప్రాబ్లెమ్" 


"నీవలనే" 


"నేనేం చేసానురా" అంటూ అర్థం కాన్నట్లుగా అడిగాడు 


"నువ్వే కదా మంచి పెర్సెంటేజ్ తెచ్చుకోమన్నావ్. అప్పుడైతే నీకూ గొప్పగా ఉంటుంది కదా అని ఆగాను. చెప్పేస్తే నాకూ రిలాక్స్డ్ గా ఉంటుంది. కానీ బావా.....  చుట్టాల్లో ఒద్దు,  నేనొప్పుకోనూ అంటే ఏంచేద్దాం" 


"నువ్వే చెప్పూ అది కూడా. అయినా,  మీ అన్నయ్య నీ ఇష్టం కాదంటాడా ఎప్పుడైనా" అన్నాడు ఆమె కొంచం నవ్వుతూ మాట్లాడేసరికి హరీష్ కూడా తేలికపడ్డాడు. 


"కాదనడూ... కాని నేను బాధపడ్తా అని ఒప్పుకోకూడదు కదా. అందుకే ఆలోచన" 


"సరే.... స్వీటీ..... కొంచం సేపు బజ్జో నాన్నా" 


"బావా ఇక్కడే ఉండవా.... అయ్యో లంచ్ టైమ్ ఏమో కదా. ఏమైనా తినేసి రండి. నేను ఉంటాలే. పర్వాలేదు" 


"మేము తింటాము కానీ నువ్వు పడుకోరా.  ఇక్కడే ఉన్నాను కదా. బావొస్తే బాగోదు. నీ ఎదురుగానే ఉంటాను బజ్జో"  అంటూ తనకి ముద్దు పెట్టి లేచీ పక్కన కూర్చున్నాడు 


కొద్దిసేపటికి స్వాతికి నిద్రపట్టాక,  రూమ్ లో నుంచి బయటకి వచ్చిన హరీష్ కి ప్రదీప్ అక్కడే కుర్చీ లో కూర్చుని కనిపించాడు. 


"ఏంటి బావా ఇక్కడ ఉన్నావు. ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా" అంటూ పలకరించాడు హరీష్ 


"చిన్నూ కొంచం సద్దుకుని కబుర్లు చెప్తోంది కదా అని ఇక్కడే కూర్చున్నా" 


అంటే కబుర్లు చెప్పడం విన్నాడంటే ఏం విన్నాడో  అని ఖంగారుగా,  హరీష్ "బావా....  అదీ... " అంటూ చెప్పేలోపు 


"అది చెప్పింది కదా బా.... అన్ని తెలుసని నాకూ" అంటూ హరీష్ కళ్ళలోకి చూసాడు ప్రదీప్



Comments