నాలో "నీ" నేను ఎపిసోడ్ 2
మర్నాడు ప్రదీప్ ఆఫీసుకి వెళ్తూ, "అమ్మా మనం సింగల్ బెడ్ రూమ్ ఇంటికి షిఫ్ట్ అయిపోదాము"
"అదేంటిరా?? ఎవరికి వాళ్ళకి రూమ్ లు ఉండేలాగా మీ నాన్న దగ్గరుండి సొంత ఇల్లు కట్టించుకుంటే, ఇది వదిలేసి చిన్న ఇంటికి అద్దె కి వెళదాం అంటావేంటి" అంటూ వాళ్ళ అమ్మ గారు కోప్పడ్డారు
"ఇల్లు పెద్దదయ్యేసరికి మనుషులు కనిపించటం లేదు మరి? మా చెల్లులు ఇంట్లో ఎక్కడో తప్పిపోయినట్లుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి దర్శనం అవలేదు" అన్నాడు అమ్మ వేసిన దోశలు తింటూ.
"నీ మొహం. అందుకని ఇల్లు మారిపోదామంటావా. అది తల నొప్పిగా ఉందని పడుకుంది"
"మరి కాలేజీ కి లేట్ అవటం లేదా. అదే ఇంకొకళ్ళుంటే నీ ప్లేస్ లో రెండు తగిలించి మరీ పంపిస్తారు. తల నొప్పి అని మానేస్తే ఊరుకున్నావా??" అసలు విషయం అది కాదులే అని మనసులో అనుకుంటూ అడిగాడు ప్రదీప్.
"అదేమన్నా చిన్నపిల్ల ఏంటిరా, రెండు తగిలించటానికి. అయినా దాన్ని ఏదన్నా అంటే తండ్రి కొడుకులు నా మీద ఇంత ఎత్తున లేస్తారు, నా చేయి లేస్తే ఊరుకుంటారు మరి" అన్నారు ఆవిడ చిరుకోపంగా.
"సరేలే అమ్మా నేను వెళ్ళొస్తా" అంటూ ఆఫీస్ కి బయల్దేరాడు ప్రదీప్ స్వాతి గది వైపు చూస్తూ.
మన హీరోయిన్ ఏమన్నా తక్కువదా. అన్న గారి బైక్ సౌండ్ వినిపించీ, తను వెళ్లిపోయాడని కన్ఫర్మ్ చేస్కున్నాక అప్పుడు ముసుగు తీసీ మంచం దిగింది.
"అదేంటే నువ్ కనిపించలేదని మీ అన్నయ్య ఇల్లు మారాలి అంటుంటే వాడు వెళ్ళాక లేచావు. పైగా కాలేజీ టైం కూడా దాటిందీ. కొంచం ముందర లేవద్దా. నిన్నేదో గారం చేసేస్తున్నా అని మళ్ళీ నాకు క్లాస్" అంటూ ఆవిడ లేట్ అయినా తన స్టైల్ లో సుప్రభాతాలు మొదలు పెట్టారు.
"అది నిన్ను అనటం కాదమ్మా. నేను కాలేజీ మానేయటం ఎందుకని. ఏదో ఒక్క రోజు వెళ్లకపోయేసరికి పొద్దునే పంచాయతీ పెట్టేసారు ఇద్దరూనూ" అంటూ అక్కడ నుంచి తుర్రుమంది స్వాతి.
"నీకేం తెలుసమ్మా. అన్నయ్య బుద్ధిమంతుడు అనుకుంటున్నావ్. నిన్న తన మాటలు వినాల్సింది. నన్ను మనోజ్ కి ఓకే చెప్పటానికి ఒప్పించేసేయబోయాడు. నేనేదో స్ట్రాంగ్ కాబట్టి సరిపోయింది. అయినా అన్నయ్యకి ఎదురుపడితే, ఎవర్ని ఇష్టపడ్తున్నావ్ అంటూ చెప్పేవరకూ చంపేస్తాడు. లేదా మీ ముందరే నిలదీసేస్తే..... అమ్మో. నాకు అంత ధైర్యం లేదు తల్లి. అందుకే బయటకి రాలేదు ఇప్పటివరకూ" అని మనసులోనే అనుకుంటూ ఫ్రెష్ అయ్యింది స్వాతి.
సాయంత్రం అన్నయ్య వచ్చే లోపు "రమ్య ఇంటికి చదువుకోడానికి వెళ్తున్నా" అంటూ వెళ్ళిపోయింది, ప్రదీప్ నుంచి తప్పించుకోవచ్చని.
రమ్యకి మనోజ్ చెప్పినదంతా పూస గుచ్చినట్లు చెప్పేసింది. అసలే రమ్య వీళ్ళ గ్రూప్ లో రెబెల్ స్టార్, తను ఊరుకుంటుందా.... కోపం గా మనోజ్ కి ఫోన్ చేసి, "ఏంటిరా ఇది, మనం టెన్త్ నుంచి మంచి ఫ్రెండ్స్. నీకు కూడా తెలుసు కదా, అది ఇంకొకళ్ళని ఇష్టపడ్తోందని. దాని సంగతి తెలిసి నువ్వు అలా ఎలా అన్నావు. నిన్ను తప్పించుకోటానికి ఈ పిచ్చిది భయపడిపోతోంది" అని గట్టిగ నిలదీసింది రమ్య.
మనోజ్ నుంచి ఒక్క క్షణం సౌండ్ లేదు. తను తేరుకుని, "రమ్య ఫోన్ స్వాతి కి ఇయ్యవా. నీ పక్కనే ఉంది కదా, మాట్లాడాలి"
"ఎందుకురా, నాకు చెప్పిందని గొడవ చేస్తావా ఇప్పుడూ" కోపంగా అడిగింది రమ్య
"అది కాదమ్మా మహంకాళి, స్పీకర్ లో పెట్టు" అన్నాడు మనోజ్, ఆమెని బతిమాలుతూ.
స్పీకర్ ఆన్ చేసి, "పెట్టాను, చెప్పు" అరిచినట్లే చెప్పింది రమ్య.
మనోజ్ "ఏంటిది స్వాతి. నువ్వు ఈరోజు కాలేజీ కి రాకపోతేనే అనుకున్నాను, నువ్వు హర్ట్ అయ్యావని. ఐ ఆం రియల్లీ వ్వెరీ సారీరా. మనం మంచి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఉంటాం. నాకు నిజం గా నువ్వు ఎవరినో ఇష్టపడ్తున్నావని తెలియదు. రమ్య అనటం విన్నాను కానీ, సరదాగా అనుకున్నా. సీరియస్ అనుకోలేదు. సరే రేపు నువ్వు కాలేజీ కి వస్తునావు, అంతే. నువ్వు రేపు రాలేదనుకో నేను రేపు సాయంత్రం మీ ఇంటికి వస్తాను, అలొచించుకో. సరే మరి ఇద్దరికీ బాయ్." అని పెట్టేసాడు.
"తెలియక చెప్పాను అంటున్నాడుగా, పాపం క్షమించేయవే. రేపు కాలేజీకి వెళ్ళకపోతే నిజంగానే ఇంటికి వచ్చినా వచ్చేస్తాడు. అప్పుడు ఆంటీ వాళ్ళకి తెలిస్తే బాగోదు. అందుకని ధైర్యం తెచ్చుకుని కాలేజీకి రా" అంది రమ్య.
ఇక చేసేది లేక తర్వాత రోజు కాలేజీ కి వెళ్ళింది కానీ మనోజ్ నుంచి మాత్రం రోజంతా చాలా సార్లు తప్పించుకుని, చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు దొరికి పోయింది.
"హాయ్. పొద్దున్న నుంచి తప్పించుకోటానికి చాలా కష్టపడ్తున్నావ్, కొంచెం మాట్లాడేది ఉంది. అది చెప్పేసి వెళ్ళిపోతాను. తర్వాత మాట్లడాలా వద్దా అనేది నీ ఇష్టం" ఎదురుగా వచ్చి నిల్చున్నాడు మనోజ్.
స్వాతికి తను భయపడాల్సిందేముందని అనిపిస్తున్నా, అలాంటి సిట్యుయేషన్ ఫస్ట్ టైం అవటంతో కంగారుగా అనిపించింది.
ఇంకా అక్కడే ఉండి వింటోంది అని నిర్ధారించుకున్నాక, "ఇంట్లో అన్నయ్య పెళ్లి పనుల గోలలో నాకొచ్చే అమ్మాయి ఎలా ఉండాలా అనుకుంటుంటే నీలాగా నెమ్మదిగా ఉండాలి, రమ్య లాంటి రాక్షసి వస్తే జీవితాంతం భరించలేను అనుకున్నాను. నీలాగా ఎందుకు నిన్నే అడిగేస్తే బెటర్ అని అడిగేసాను. నేను నాకు అనిపించింది చెప్పాను, నీకు ఇష్టం లేకపోతె అందులో తప్పేమి లేదు. నేను కూడా అడగలేదే, అని ఫ్యూచర్ లో ఫీల్ అవకూడదు కదా. దీనికోసం ఎప్పటి నుంచో ఉన్న మన ఫ్రెండ్షిప్ ని వదిలేయకు. నేను ఒట్టేసి చెప్తున్నా, మన మధ్యన ఈ విషయం మళ్ళీ రానీయను. నన్ను నమ్ము. ఇంక బెదిరించటం అంటావా, అలా అనక పొతే ఇంకో వారం అయినా నువ్వు కాలేజీ కి రావు అందుకని అలా అన్నాను. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం" అని వెళ్ళిపోయాడు, స్వాతి ఏమంటుందో కూడా వినిపించుకోకుండా.
స్వాతికి కూడా మనోజ్ ఒక మంచి ఫ్రెండ్. అందుకే అతను చెప్పింది అర్థం చేస్కుంది. సాయంత్రం ప్రదీప్ ఆఫీసు నుంచి వచ్చాక,
" ఈరోజు అయినా కాలేజీ కి వెళ్ళావా" అని అడిగాడు.
"వెళ్ళాను అన్నయ్యా."
"మరి ఏమయింది. మనోజ్ కనిపించాడా?? మాట్లాడావా??"
"మాట్లాడాను. కాదు కాదు మాట్లాడాడు. సారీ చెప్పాడు" అంది స్వాతి
"మరి ఇంతకీ నీకు ఎవరు ఇష్టమో చెప్పలేదు" కళ్లెగరేస్తూ చెల్లెలిని సూటిగా చూసాడు
"అన్నయ్యా ఇప్పుడు ఇంకా ఏమి లేదు, వన్ సైడ్ అంతే. ఏమైనా ఉంటె చెప్తాను" అంది ప్రదీప్ మరో ప్రశ్న వేయకుండా అతని చూపుని తప్పించుకుని. ప్రదీప్ కూడా చెల్లెలిని ఇబ్బంది పెట్టలేక మౌనంగా ఉండిపోయాడు.
Comments
Post a Comment