16
"స్వాతి నువ్వు బానే ఉన్నావా"
"ఏం చెప్పాలి అన్వి. అందరూ నా చుట్టూ కంచెలాగా నిల్చున్నారు. నన్ను ఒక్క మాట అన్నా కూడా ఎవరూ ఊరుకోరు. కానీ మనసులో ఏముందో చెప్పనా..... ఎవరితోనూ చెప్పుకోలేనిది"
"ఏంటే"
"నాన్న ఒక్క మాట మాట్లాడినా వీళ్ళు ఊరుకోరు. ఆయన ఒక్క మాటైనా మాట్లాడితే బావుండని నాకుంది"
@@@@@@@@@@@@@@@
అన్వి... "వాళ్ళు ఊరుకోరు అంటున్నావు కానీ అందరూ కూడా నీకోసమే కదే, నువ్వు బాధపడకూడదనే కదా " అంది బాధగా
"నేననేది అదేనే. ఆ మనిషి బాధ పెట్టేలాగే మాట్లాడతారు, కానీ ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడితే బావుండును అనే నా బాధ కూడా. అన్నయ్య వాళ్ళని ఎందుకంటానే. తనే లేకపోతే ఈరోజు నాకీ లైఫే లేదు. అన్న అయినా కూడా నావరకూ తను నాన్నే "
"చిన్నూ.... "
ప్రదీప్ పిలుపుతో స్వాతి, అన్విత అటు చూసారు.
"చెప్పన్నయ్యా"
"అమ్మ ఇద్దరినీ పిలుస్తోంది . జరగని వాటి గురించి ఆలోచించటం మానేసి రండి" అని వెళ్ళిపోయాడు
తను వెళ్ళగానే హరీష్ నవ్వుతూ లోపలికి వచ్చాడు
అన్వి.... "అన్నయ్యా నీకు తెలుసా ఆ హిట్లర్ ఇక్కడే ఉన్నాడని. నువ్వైనా చెప్పద్దా "
"చెప్తే మీ ఫేస్ లో ఈ టెన్షన్ చూడటానికి అయ్యేది కాదు కదా"
"అన్నయ్య ఎప్పుడొచ్చాడు బావా" అంది స్వాతి మెల్లిగా
"అన్వి నిన్ను 'బానే ఉన్నావా' అన్నప్పుడు. మీ అన్నకి ఆ ఆన్సర్ తెలుసుకుందామనేమో అక్కడే ఆగి, వినీ అప్పుడు వచ్చాడు. సరే కానీ, పదండీ" అంటూ ముగ్గురూ కదిలారు
ఇంటి బయట కార్ ఆగి ఒక మధ్య వయస్క వ్యక్తి అందులో నుంచి దిగి లోపలికి వచ్చారు. పెద్దవాళ్ళు లేచీ ఆయన్ని పలకరిస్తున్నారు. అయన అందరిని చిరునవ్వుతో చూస్తూ లోపలికి వచ్చారు. ప్రదీప్ లేచి వెళ్ళి ఆయన్ని పలకరించి కూర్చోమని చెప్పాడు.
స్వాతి పక్కన కూర్చుని ఉన్న అన్వితని పిలిచి ఆయనకి మంచి నీళ్లు ఇయ్యమని పంపించి, తను వెళ్ళగానే చెల్లెలి చేయి పట్టుకుని అక్కడే కూర్చున్నాడు.
హరీష్ అప్పటి వరకూ స్వాతినే చూస్తుండగా, తను ఎందుకో సడన్ గా ఇబ్బంది పడటం, స్వాతి లేవబోతుంటే ప్రదీప్ అక్కడ కూర్చోటం, తనని కదలనీయకుండా చేయి పట్టుకోటం చూసీ ఏమి అర్థం కాలేదు.
అలా చూస్తున్న హరీష్ ని స్వాతి గమనించి, "ఏంటీ" అని కళ్ళతోనే అడిగింది
"ఏమైందీ " అంటూ హరీష్ కూడా కళ్ళతోనే ప్రశ్నించాడు
ఆ వచ్చిన పెద్దాయన్ని చూపిస్తూ "నాన్న" అంది
"ఓహ్..." అంటూ కళ్ళు ఎగరేసి అయన వైపు చూసాడు. ఆయన ఎంతో గంభీరంగా కనిపిస్తున్నా, నవ్వుతూ అందరితో కబుర్లు చెప్తూ సరదాగా కనిపించారు. "ఈయన స్వీటీ ని బాధపెట్టారా" అనుకుంటూ, స్వాతి వైపుకి తిరిగి, "పర్వాలేదులే నువ్వు ముందర పూజ చూడు" అని కళ్ళతోనే సైగ చేసాడు
"హ్మ్.... అయ్యాయా అన్నయ్యా మీ కళ్ళతో కబుర్లు" అన్విత మాట కి తనని చూసీ నవ్వుకుని, "అదేం లేదు. ఏదో టెన్షన్ పడ్తుంటే ఏమయిందో అని"
"ఇంకేముంది. 'ఎంటర్ ది డ్రాగన్' కదా, ఆయన్ని ఇబ్బందిపెట్టటం ఎందుకని లోపలికి వెళ్ళిపోతానంది. అదిగో ప్రదీప్ బావ వచ్చి మూసుకుని కూర్చోమని, అదేలే ఆ మాట అనకుండా, కదలకుండా చేయి పట్టి ఆపేసాడు" అని జరిగింది చెప్పింది అన్విత
"కానీ ఆయన్ని చుస్తే అలా అనిపించటం లేదు. అందరితో సరదాగా ఉన్నారు కదా"
"మనిషి మంచి వాళ్ళే. రామ్ మావయ్య (ప్రదీప్ వాళ్ళ నాన్నగారు) ఆ సారథి గారు, రామ లక్ష్మణులు అనేవాళ్ళు. ఈరోజుకీ అయన మాట అంటే వేదం. కానీ దాన్ని(స్వాతి) మాత్రమే, పురుగుకన్నా హీనంగా చూస్తారు. ఎన్ని సార్లు మార్చాలనుకున్నా ఎవరి వల్లా కాలేదు. చివరికి ఆ ఒక్క విషయంలోనే రామ్ మావయ్య మాట కూడా పట్టించుకోలేదు" అని అయన గురించి చెప్పింది
తర్వాత పూజ అయ్యాక, భోజనాలు చేసి అందరూ బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. స్వాతి లోపల నుంచి బయటకి రాబోతుంటే, సారథి గారిని చూసీ, "నాన్నా బావున్నారా" అంటూ పలకరించింది
ఆ మాటకి ఆయన ఎంతో విసురుగా, "నన్ను ఒంటరివాడిని చేసేసావు. మళ్ళీ బావున్నావా అని అడుగుతున్నావా. ఎన్ని సార్లు చెప్పనూ నాకు ఎదురుపడద్దని, దరిద్రపురాల" అంటూ స్వాతి ని చేత్తో పక్కకి తోసేసి లోపలికి వెళ్లిపోయారు
ఆ తోసేయటంలో పడిపోబోతున్న స్వాతిని హరీష్ పట్టుకుని తనని దగ్గరకి తీసుకునీ, "స్వీటీ... ఏం కాలేదు కదా నీకు" అంటూ ఖంగారుగా అడిగేసరికి, కళ్లలోనుంచి వచ్చే నీళ్ళని ఆపుకుని బలవంతంగా నవ్వుతూ "ఏమవ్వలేదు బావా. పడిపోలేదు కదా. బానే ఉన్నా" అంటూ తన చేతులలో నుంచి దూరం జరిగింది.
"సరేలే బయట అందరమూ కూర్చున్నాము, రా" అంటూ తన భుజం మీద చేయి వేసి తీస్కెళ్ళాడు.
ప్రదీప్ వాళ్ళ పెద్ద మావయ్య అబ్బాయి, అతని ఫ్యామిలీ, అన్విత, అలాగే ఊరు నుంచి వచ్చిన రామ్ గారి అక్క పిల్లలు అందరితో కూర్చుని కబుర్లు చెప్తూ, హరీష్ స్వాతి ని భుజం మీద చేయి వేసి తీసుకుని రావటంతో ఇద్దరినీ చూసీ ఒక్క సెకండ్ అర్థంకాక మళ్ళీ అనుమానం గా స్వాతి వైపు చూసాడు ప్రదీప్. స్వాతిని చూడగానే ఏదో జరిగిందని అర్ధమయ్యి, ఇద్దరినీ పక్కకి తీసుకువెళ్ళి,
"చిన్నూ....." అంటూ తల పైకెత్తేసరికి స్వాతి కళ్ళలో నీళ్లు చూసీ ఖంగారుగా "ఏమయిందిరా" అనడిగాడు
"అన్నయ్యా"అంటూ ప్రదీప్ ని చుట్టేసి గట్టిగా ఏడ్చేసింది.
ఏమయ్యి ఉంటుందో ఊహించిన ప్రదీప్, "చిన్నూ.... ఇది జరుగుతుందని అనుకున్నదే కదరా. ఏడవకు. ఆ మనిషి మారడు. అయన కోసం నీ కన్నీళ్ళు వేస్ట్ చేయకూ. నువ్వు మా ఇంటి మహాలక్ష్మీవిరా. ఇలా ఏడిస్తే మాకు మంచిది కాదు కదా. మాకోసం నవ్వరా. ప్లీజ్ రా చిట్టి తల్లీ" అంటూ స్వాతీ కన్నీళ్ళని తుడిచాడు
"లేదన్నయ్యా.... నేను బానే ఉన్నానులే. వెళ్దాం పదా" అంటూ కదలబోయింది
"సరే నువ్వెళ్ళు నేనొస్తా"
"ఎందుకు, గొడవ పెట్టుకోటానికా"
"కాదురా చిన్నూ. ప్రామిస్ చేసాను కదా ఏమి అనను అనీ. నువ్వు వాళ్ళతో కూర్చో. ఇప్పుడే వస్తా" అని చెప్పి స్వాతిని పంపించి, హరీష్ వైపు చూసాడు.
హరీష్ కి ఒక పక్క కోపం ఇంకో పక్క స్వాతి ఏడ్చేసారికి మనసులో పీకేసి బాధా, ఇప్పుడేమో ఆశ్చర్యం అన్ని కలిపి అయోమయంగా చూస్తున్నాడు.
"ఏంటీ బా.... మా చెల్లి భుజాల మీద చేతులేసి మరీ వస్తున్నావ్ ఏంటీ సంగతి. నాకు తెలీకుండా ఏమైనా జరుగుతోందా" అంటూ సీరియస్ టోన్ తోనే చిలిపిగా అడిగాడు
"తను చాలా ఖంగారు పడిపోయింది. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు" అంటూ తప్పు చేసినట్లుగా సంజాయిషీ ఇచ్చాడు హరీష్
"హాహా... పర్వాలేదులే బా... నేనూ సరదాగానే అన్నాను. నువ్వెంటి అలా ఉన్నావు. ఏమయిందసలు"
"మొన్న స్వాతి డల్ గా ఉండటం చూసా, మీరు ఇద్దరూ దేనిగురించో ఆలోచిస్తున్నారనుకున్నా కానీ ఆయన మాటలు విన్నాక మాత్రం కన్న కూతురితో అలా కూడా ప్రవర్తిస్తారా అనిపిస్తోంది"
"దాన్ని ఈ ఇంటికి తీస్కొచ్చినప్పుడు దానికి ఏడేళ్ళు బావా. అది పుట్టినప్పుడు రెండేళ్ల వరకూ మా ఇంట్లోనే ఉంది. అమ్మ దానికేమి లోటు రానీయలేదు. ఆ తర్వాత, 'పిన్ని పోయిన దుఃఖంలో బాబాయ్ ఒంటరిగా ఉంటున్నాడు. పిల్ల తనతో ఉంటే బాధ్యత తెలుస్తుందీ' అంటూ మా అత్తయ్య గొడవ చేస్తే దాన్ని పంపించారు. ఒక మనిషిని పెట్టి చూసేవారు. కానీ ఆవిడ ఇక్కడ మానేసి వెళ్లిపోవాల్సి వచ్చినప్పుడు మా అమ్మ తో స్వాతి గురించి చెప్పి బాధపడిందావిడ. అప్పటి వరకూ మాకసలు విషయాలు తెలీనీయలేదు. ఆ మనిషి కోపం వచ్చిన ప్రతీసారి దీనిమీదే చూపించేవాడుట, చిన్న పిల్ల అని చూడకుండా కొట్టేవాడు, తిందో లేదో, ఉందొ లేదో కూడా పట్టించుకోలేదు. అలాంటి టైమ్ లో ఆవిడ వెళ్ళిపోయింది. మేము ఇంటికొస్తాం అంటే బయట ఊళ్ళో ఉన్నాను అనేవాడు. ఒక సారి ఎందుకు అనుమానం వచ్చిందో కానీ, చూసొద్దాం అని నాన్న తీసుకుని వెళ్లేసరికి తాళం పెట్టిన ఇంట్లో ఇదొకత్తే అలా పడుకునుంది. ఆ మనిషి ఇది ఉందని కూడా మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు. ఒక పక్క జ్వరం, ఇంకో పక్క తిండి లేదు, బట్టలు సరిగ్గా లేవు. ఆ రోజు నేను దాన్ని ఎలా చూశానో ఈరోజుకీ కళ్ళముందే ఉంది బావా. నేను తీసుకుని వచేద్దాం అని చాలా గొడవ చేసాను. అమ్మా వాళ్లకి అదే ఆలోచన ఉన్నా, చుట్టూ సమాజం కోసం ఒకింత ఆలోచించారు కానీ నేను ఒప్పుకోవట్లేదని దాన్ని తీస్కొచ్చేసాము. ఇంటికి తీసుకొచ్చి, మనిషి సద్దుకుని మనుషుల్లో పడింది కానీ మనసు ఇప్పటికీ కోలుకోలేదు బావా. ఇంట్లో రోజూ చూస్తూనే ఉంటుందా, ఒక్క పూట ఏదైనా విసుక్కున్నానంటే ఆయన లాగా మేమూ వదిలేస్తున్నామేమో, దూరం పెట్టేస్తామేమో అనేసుకుంటుంది. ఎన్ని సార్లు చెప్పినా ఆ దెబ్బ మాత్రం మానటం లేదు. కానీ ఈరోజుకీ చుసిన ప్రతీసారి ఆ మనిషి మాత్రం బాధపెడుతూనే ఉన్నాడు. గట్టిగా ఏదైనా అందామంటే మా నాన్న తమ్ముడు కదా, ఎంత లేదన్నా ఆయనకీ బాధనిపిస్తుంది వాళ్ళ తమ్ముడ్ని అంటే. అందుకే ఊరుకోటం"
"సారీ బావా నీకవన్నీ గుర్తు చేసి బాధపెట్టాను"
"లేదు బా.... ఈరోజు వరకూ నేనూ ఎవరితోనూ వీటి గురించి షేర్ చేసుకోలేదు. నాకూ రిలీఫ్ గా ఉందిలే"
"బావా.... అసలాయనకి ఎందుకంత కోపం తనంటే"
"అది పుట్టాక మా పిన్ని చనిపోయింది. ఆవిడంటే మా బాబాయ్ కి చాలా ఇష్టం. కానీ ఇది పుట్టటం వలెనే ఆవిడ పోయిందని కోపం పెంచేసుకున్నాడు. ఆ కోపం పెరిగి పెరిగి అసహ్యం లోకి మారింది. చిన్న పిల్ల దానికేం తెలుసు. దాన్ని కొడితే అదేం చేయగలదు. విన్నావుగా ఇందాకా, ఆ పిచ్చిది ఈ మనిషి దాన్ని ప్రేమగా దగ్గరకి తీస్కుంటాడేమో అని ఇంకా ఆశగా చూస్తోంది. . కానీ ఆ మనిషిని ఏదో ఒకటి చేయాలి" అంటూ పిడికిలి బిగించాడు. "అది సరే కానీ ఇంతకీ ఏమన్నాడు ఇందాకా "
"నువ్వు చెప్పినదాన్నిబట్టి అయితే, ఎప్పుడూ అనేవే అన్నాడు. బావా.... నువ్వేమనుకోకపోతే ఒక చిన్న కోటింగ్ ఇచ్చేసొస్తా. నిన్నెలాగో మీ చెల్లి కట్టేసింది కదా" అన్నాడు నవ్వుతూ
"పర్మిషన్ అడగాలేంటి. ఇచ్చేయి . నేనూ వస్తా. వినీ సంతోషపడతాను. పదా" అంటూ ఇద్దరూ వెళ్లారు.
అలా వాళ్లిద్దరూ వెళ్తుంటే, అన్విత "ఏంటే.... హిట్లర్ హరీష్ అన్నయ్య తో తెగ క్లోజ్ అయ్యాడు. విషయం తెలిసిందంటావా" అంది అనుమానంగా
"తెలిస్తే..... క్లోజ్ గా కాదు, నా చుట్టుపక్కలోకి రానీయడే బాబూ. అయినా ఎలా తెలుస్తుందీ, నువ్వు చెప్పావేంటి కొంపదీసి" అంటూ స్వాతీ అన్విత ని అనుమానంగా చూసింది
"లేదమ్మా తల్లీ.... నీ మీద ఒట్టు పెట్టాక ఇంకెందుకు చెప్తాను"
"గుడ్.... ఆ మాత్రం భయముండాలిలే" అంటూ నవ్వేసింది స్వాతి
Comments
Post a Comment