15
స్వాతి తయారయ్యి వచ్చేసరికి పద్మ గారు అలా చూస్తూ ఉండిపోయారు. "ఎంత ముద్దుగా ఉన్నావమ్మా, నా దిష్టే తగిలేలా ఉంది" అంటూ కాటుక చుక్క చెవి వెనకాల పెట్టి మురిసిపోయారు.
ప్రదీప్ కూడా రెడీ అయ్యి వచ్చేసరికి, తన చేయి పట్టుకుని... "అన్నయ్యా నువ్వు చెప్పు నేనెలా ఉన్నానో"
"నీకేంట్రా.... నువెప్పుడూ సూపేరే" అని ప్రదీప్ వెళ్లిపోతుంటే,
"అన్నయ్యా నా మీద ఇందాకా కోపమొచ్చింది కదా"
"నీమీద కోపమేమి లేదురా. నువ్వెక్కడ మళ్ళీ మాటలు పడాల్సొస్తుందో అని నా భయం" పద్మ గారి వైపు చూస్తూ, "వీళ్ళేమో అవేమి పట్టించుకోరు అందరూ కావాలి, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి అక్కర్లేదు"
"ఏంటిరా మాట్లాడుతున్నావు. ఎవరి గురించి ఎవరికి అక్కర్లేదు? అది నీకు చెల్లెలైతే మాకు కూతురు, నేను కనకపోయినా కూడా అది నా కూతురే. మీ ఇద్దరిలో ఎప్పుడూ తేడా చూపించలేదు. మాకు మాత్రం తెలీదా అది బాధపడ్తుందని. నేను, దానొక్కదాని గురించే కాదు, మీ నాన్న గారి గురించి కూడా ఆలోచిస్తాను. మీ నాన్నని ఎంతమంది అవమానించినా అయన మీ వరకూ ఎప్పుడూ రానీయలేదు. ఇప్పుడు నువ్వు పెద్దవాడివైపోయావు కదా. ఈ ఒక్కసారి ఆయన్ని మాట పడకుండా చూస్కో. అయినా ఇన్ని అంటున్నావు, దాన్ని అడుగు ఎందుకు పిలవమందో అందరిని?? ఎందుకు నిన్ను ఏమి మాట్లాడద్దందో?? అది ఇంట్లో విషయాలు అర్థం చేసుకోగలదు మేము పట్టించుకోకపోటం కాదు నువ్వు మమ్మల్ని ఎప్పుడైనా పట్టించుకున్నావా" అంటూ కళ్ళలో నీళ్లు ఆపుకుంటూ ఆవేదనగా అన్నారు
స్వాతి ఆవిడ కళ్ళు తుడుస్తూ "అమ్మా..... నా పుట్టినరోజున నువ్వు ఏడుస్తే నాకేమన్నా బావుంటుందా చెప్పు. అన్నయ్య ఇప్పుడసలు మా ఇద్దరినీ వేరుగా చూసావని అన్నాడా? ఎవరు కాదన్నా కూడా నేను మీ కూతురినే. కానీ నువ్విలా బాధపడుతూ ఉంటే నాకేమి బాలేదు. నిన్న నువ్వు నన్ను ఏడవకూడదు ఈరోజు అని చెప్పావు కదా. ఎవరివలనైనా బాధ అనిపిస్తే వెంటనే అన్నయ్యతో చెప్పు తను చూసుకుంటాడు అన్నావా లేదా?? ఇప్పుడు నువ్వేడుస్తుంటే నాకూ ఏడుపొస్తోంది. ఏడ్చేయానా" అంటూ కళ్ళు తుడుచుకుంటూ "ఏంటో సమయానికి నీళ్లు రావటం లేదూ" అని మెల్లిగా ఆవిడకి వినిపించేలా అంది.
"చాల్లే పుట్టినరోజు పూట ఏడుపేంటి. ఎవరూ ఏడవక్కర్లేదు" అన్నారు ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ .
"అదీ. గుడ్ గర్ల్. పూజ చేస్కుంటూ ఏడుస్తారా ఎవరైనా"
"అన్నయ్యా నువ్వెటో వెళుతున్నావ్ కదా, నీ పని చూస్కోలే" అంటూ వెళ్ళమని కళ్ళతో బతిమాలుతూ అడిగేసరికి ప్రదీప్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
"అమ్మా ఇప్పుడన్నయ్య ఏమన్నాడని. తన భయం తనదీ నీ బాధ నీది. ఎవరిదీ తప్పులేదు. నువ్వెప్పుడైనా ఏంజరుగుతోందో అన్నయ్యకి చెప్తే కదా తెలిసేది. సరేలే, ఇప్పుడవన్నీ ఎందుకూ. నాన్న వింటే బాధపడతారు. పద పదా.... ఇంకా వంటిట్లో ఏమున్నాయో చూడూ... లేదా నన్ను రమ్మంటావా"
"అక్కర్లేదు తల్లీ. నువ్వొస్తే వాడు నా పీక పట్టుకుంటాడు. నేనే వెళ్తాను"
ఆవిడ లోపలికి వెళ్ళాక ప్రదీప్ దగ్గరకి వెళ్ళి,
"ఇప్పుడు చెప్పు అన్నయ్యా"
"అది కాదు, ముందు నాన్నని ఎవరేమన్నారో చెప్పు"
"ఏంలేదులే అన్నయ్యా "
"సరే నీ ఇష్టం. నువ్వూ చెప్పకు"
"అన్నయ్యా.... చెప్తాలే. కానీ ఇప్పుడు కాదు. ఈ హడావిడి అయిపోనీ తర్వాత కబుర్లు చెప్పుకోవచ్చులే. అన్నట్లు పెద్ద అత్తయ్యని తీసుకుని రావటానికి వెళ్లాలేమో కదా. వెళ్ళొచ్చేయి" అని లోపలికి వెళ్ళిపోయింది.
కొద్దిసేపటికి హరీష్ "అత్తయ్యా..." అంటూ లోపలికి వచ్చేసరికి స్వాతి దేవుడి దగ్గర ముగ్గు వేస్తూ కనిపించింది. పట్టు లంగా వోణి, జడ లో పూవులు, చెవులకి బుట్టలు, జడ కుచ్చులు, మెడలో చిన్న గొలుసు. బుట్ట బొమ్మ లాగా ఎంతో అందంగా ఉన్న స్వాతిని చూస్తూ హరీష్ అలా నిల్చునిపోయాడు.
"అమ్మ వంటిట్లో నైవేద్యం చేస్తోంది బావా" అంటూ హరీష్ తనని కన్నార్పకుండా చూస్తూండేసరికి సిగ్గుతో తల దించేసుకుంది.
తనని అలాగే చూస్తూ, "మావయ్య వాళ్ళు?"
స్వాతి.... "నాన్న, ఆయన రూమ్ లో ఉన్నారు. అన్నయ్య, పని మీద బయటకి వెళ్ళాడు"
స్వాతి చెప్తోంది కానీ హరీష్ చెవులకేమి వినిపించటం లేదు. కళ్ళ ముందర అందాన్ని అలా చూస్తూ తనవైపుకి అడుగులు వేసాడు. స్వాతి అతని చూపుల్ని తప్పించుకోడానికి అక్కడ నుంచి తన రూమ్ లో కి వెళ్ళగా, తనూ ఆమె వెనకాలే వెళ్ళాడు. లోపలికి వెళ్ళాక, ఎటూ తప్పించుకోలేక ఆగిపోయింది. హరీష్ ఆమెని ప్రేమగా దగ్గరకి తీసుకోబోయి, స్వాతి మొదట్లో చెప్పిన మాటలు గుర్తు వచ్చి ఆమెని బాధపెట్టటం ఇష్టంలేక ఆగిపోయాడు. హరీష్ ఎందుకలా ఆగిపోయాడో స్వాతికి అర్థమయ్యింది.
హరీష్... స్వాతి మొహాన్ని చేతుల్లోకి తీసుకునీ, "చాలా బావున్నావురా" అని తన నుదిటి మీద ముద్దు పెట్టి బయటకి వెళ్ళిపోబోయాడు.
కానీ స్వాతి, హరీష్ ని వెళ్లనీయకుండా వెనకాల నుంచి అతన్ని హత్తుకుని అలాగే ఉండిపోయింది, వెళ్ళద్దు అన్నట్లుగా. హరీష్ ఒక్క క్షణం అలాగే ఉండి ఆమె వైపుకి తిరిగి,తన తలని ఎత్తి కళ్ళలోకి చూసేసరికి అతని చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకొంచం బిగించింది. హరీష్ కూడా స్వాతిని దగ్గరకి తీసుకునీ తన బుగ్గల మీద ముద్దు పెట్టి, వణుకుతున్న ఆమె పెదవులపై అంటీ అంటన్నట్లుగా ముద్దు పెట్టాడు. స్వాతి సిగ్గు పడి అతని గుండెల్లో తలదాచేస్కుంది.
హరీష్... "లవ్ యూ రా"
హరీష్ నోటి నుంచి వచ్చిన మాటకంటే అతని గుండె చప్పుడులో అవే మాటలు వింటూ నవ్వుకుంటూ సిగ్గుపడింది.
అలాగే ఒక్క క్షణం ఉండి ఆమె తల మీద ముద్దు పెట్టి "స్వాతి... నీకొక గుడ్ న్యూస్ చెప్తా అన్నాను కదా, చెప్పనా" అన్నాడు తనని అలాగే పట్టుకుని
స్వాతి, తల పైకెత్తి "చెప్పు బావా "
"నాకు మీ అన్నయ్య కంపెనీలోనే జాబ్ వచ్చింది. నిన్ననే కన్ఫర్మ్ అయ్యింది"
"బావా..... కంగ్రాట్యులేషన్స్" అంటూ హరీష్ కళ్ళలోకి చూసీ తన గుండెల మీద ముద్దు పెట్టింది. స్వాతి మొహం వెలిగిపోతోంది. ఇందాకా సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి ఆ ఎరుపు మీద సంతోషం తో మెరుపు వచ్చి మొహం లో కొత్త వెలుగు కనిపిస్తోంది స్వాతి లో హరీష్ కి.
"ఇదిగో ఈ సంతోషం చూడటానికే, ఫోన్ లో చెప్పకుండా ఇప్పటి వరకూ ఆగాను. నీకు ఆ రోజే చెప్పానా, నువ్వు ఎదురొస్తున్నావు, ఈ జాబ్ నాకు గారంటీ అనీ, కానీ నువ్వు నమ్మలేదు. నువ్వు నా లక్కీచార్మ్ రా. నీకు ఎదురుగా చెప్పాలనిపించి ఇప్పటి వరకూ ఆగాను" అన్నాడు స్వాతి ముంగురులని వెనక్కి సద్దుతూ
ఈసారి స్వాతి తల పైకెత్తి హరీష్ కళ్ళలోకి చూసింది. కళ్ళలో సన్నటి కన్నీటిపొర.
హరీష్ ఖంగారుగా, "స్వీటీ.... ఏమయిందిరా... ఎందుకా కన్నీళ్ళు. నేనేదన్నా బాధపెట్టానా. చెప్పరా" అంటూ స్వాతి నుంచి దూరం జరగబోయాడు
హరీష్ ని కదలనీయకుండా మళ్ళీ గట్టిగా పట్టుకుని తన గుండెల మీద వాలిపోయింది. హరీష్ కి తను అలా పట్టుకోవటం వలన స్వాతి బాధపడలేదని అర్ధమయ్యి, తనని గట్టిగా హత్తుకుని "ఏమయిందిరా... చెప్పు" అంటూ బతిమాలాడు
"నన్ను లక్కీ చార్మ్ అంటే కొత్తగా ఉంది. నా కన్న తండ్రే నా నీడ ఎదురైనా దరిద్రం అన్నారు బావా. అలాంటిది నేను అదృష్టవంతురాలినా??" అంటూ ఏడ్చేసింది
"మావయ్య నిన్ను అంత మాట అన్నారా. మావయ్యకి నువ్వంటే ప్రాణం. పేరు పెట్టి పిలవటం కూడా ఎప్పుడూ వినలేదు, బంగారం అంటారు అలాంటిది అయన అలా అన్నారంటే నమ్మలేకపోతున్నాను"
"బావా.... నాన్న గురించి అనటం లేదు, అయన నా కన్న తండ్రి కాదు. నీకు తెలీదా??" అంటూ హరీష్ ని చూసింది
హరీష్ కి మతి పోయింది. "వాట్😲😲😲😲😲😲.... ఏం చెపుతున్నావు. నాకు తెలీదురా. మరి మీ నాన్నా ..... అసలేమయ్యింది"
"బావా... నీకు తెలుసనే అనుకున్నాను. ఆ టాపిక్ కూడా ఎప్పుడూ రాలేదనుకో. ఇంట్లో పెద్దవాళ్లందరికి తెలుసూ, కానీ ఏం జరిగిందనేది తెలీదేమో. మా నాన్న వస్తారు ఇంకొంచం సేపట్లో చూపిస్తాను" అంది బాధగా
హరీష్ స్వాతిని పట్టుకుని ఉన్నాడు కానీ, ఏదో ఆలోచనలో ఉండిపోయాడు. కొద్ది క్షణాలు గడిచాయి. ఇద్దరి మధ్యన మౌనం.
"అసలేమయ్యి ఉంటుంది, నాకెందుకు ఈ విషయం గుర్తులేదు. అసలెప్పుడూ ఎవరూ మాట్లాడుకోటం కూడా వినలేదు. స్వాతి ఈరోజుకీ బాధపడుతోందంటే చిన్నప్పుడు అన్ని ఇబ్బందులు పడిందా" అంటూ తన ఆలోచనల్లో తను ఉండిపోయాడు.
స్వాతికి కళ్ళలో నుంచి నీళ్లు ఆగటం లేదు. హరీష్ చేతులలోంచి స్వాతి దూరం జరగబోయింది. అతనూ ఏదో ఆలోచనల్లో ఉండటం తో స్వాతి జరగబోతుంటే ఆమె చుట్టూ ఉన్న అతని చేతుల్ని వదిలేసాడు.
స్వాతి ఏడుస్తూ "బావా..... ఇప్పుడు నేను నీకు వొద్దా" ఆ మాట కి హరీష్ ఆలోచనలలోంచి బయటకి వచ్చాడు. స్వాతి చేతుల్ని పట్టుకుని అతని దగ్గరకి లాగి, తన గుండెలకి అదుముకుని ,
"స్వీటీ.... అత్తయ్యా వాళ్ళని చూసీ నిన్ను ఇష్టపడలేదు. నువ్వు నచ్చి నిన్ను ప్రేమించాను. ఏమయ్యిందో నాకు తెలీదు. నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు. చెప్పకపోయినా నాకు అక్కర్లేదు. నాకు నువ్వు కావాలి. నీ విలువేంటో నీ కన్న తండ్రికి తెలీదేమో కానీ మా మావయ్య అన్నట్లుగా నువ్వు బంగారు తల్లివి. నువ్వు నా స్వీటీవి. ఇంకొకళ్ళ మాటలు వినీ నిన్నెందుకు వదిలేసుకుంటానురా" అంటూ తల మీద ముద్దు పెట్టుకున్నాడు
"బావా... ఆ ఒక్క మాట చాలు నాకు" అంటూ హరీష్ బుగ్గ మీద ముద్దు పెట్టి మళ్ళీ అతని గుండెల్లో తల దాచేస్కుంది
హరీష్ నవ్వుకుని .... "నువ్వు మాత్రం బాధపడకు"
"లేదు బావా. అమ్మకి మాట ఇచ్చాను. నవ్వుతూ ఉంటాలే "
"నవ్వుతూ ఉండటం కాదు, ఆయనేదన్నా అన్నా కూడా మనసుకి తీస్కోకు. నిన్ను పెళ్ళి చేసుకునేది నేను. నాకు నువ్వు దొరకటం నా అదృష్టం.... అదే గుర్తుపెట్టుకో. సరే పదా, ఎవరన్నా ఇలా మనల్ని చూస్తే బాగోదు"
"చూస్తే ఏమవుతుంది బావా" అంది అమాయకంగా మొహం పెట్టి
"స్వీటీ.... మనం వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్లకి తెలియాలి కానీ వాళ్లకి దొరికిపోయినప్పుడు కాదు. అది మనవాళ్ళకి మనమిచ్చే గౌరవం. సరేలే, పదా" అని హరీష్ స్వాతి రూమ్ నుంచి బయటకి వెళ్ళిపోయాడు.
పద్మ గారు వంటిట్లో నుంచి వస్తూ, "హరీష్ నువ్వెప్పుడొచ్చావు. కాఫీ పంపిస్తాను. కూర్చో"
"కాఫీలు ఏమి ఒద్దు కానీ, ఏవైనా పనులు ఉంటే చెప్పు అత్తయ్యా"
"పనులేమీ లేవురా"
స్వాతి "అమ్మా... బావ కి జాబ్ వచ్చిందిట. అన్నయ్య కంపెనీలోనే"
"మంచి న్యూస్ చెప్పావురా. పోనీలే మీ అమ్మకో టెన్షన్ తగ్గింది. ఇంక అయితే పెళ్ళి సంబంధాలు చూడాలన్నమాట "
"అమ్మా... పొద్దున్న నేనైపోయాను, ఇప్పుడు బావా"
"మీకేం తెలుస్తాయే మా బాధలు. పిల్లలు పెళ్ళి చేస్కుని సెటిల్ అయితే మాకూ సంతోషం"
"మేమూ పెళ్ళి చేస్కుంటాములే. ఈలోపు నువ్వు ఖంగారు పడి, మమ్మల్ని పెట్టకు" అని హరీష్ వైపు చూసీ కన్నుకొట్టింది. పద్మ గారికి స్వాతి అసలు ఉద్దేశం అర్థమవ్వకపోయినా పెళ్ళికి టైమ్ ఉంది అందని ఊరుకున్నారు.
బంధువులందరూ ఒక్కొక్కరూ వచ్చారు. ప్రదీప్ అందరిని పలకరించి లోపలికి తీసుకెళ్తున్నాడు. స్వాతి, వాళ్ళ అమ్మా నాన్న పక్కనే కూర్చుని అవసరమైనవి అందిస్తోంది.
అన్విత వాళ్ళు రాగానే, "ఏంటే ఇంత లేట్. నిన్ననే వచ్చేయవే అంటే ఈరోజు వచ్చావు అదీ లేట్ గా" అంది స్వాతి అన్వి ని పలకరిస్తూ
"ఏం చేయనే. నిన్నేమో కుదరలేదు. పూజకి రెడీ అవ్వాలి అంటే మరి మాటలేంటి. అందుకే ఇంత లేట్"
"సరేలే, మేడ మీదకి పదా. పెద్ద బావా, అక్క, పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు" అంటూ తీసుకెళ్లింది.
"స్వాతి, మావయ్య వాళ్ళ వాళ్ళు రాలేదా "
"మా అత్తయ్య వచ్చారు. పూజ దగ్గర కూర్చున్నారు. ఒదిన వాళ్ళు రావాలి ఇంకా. ఇంకా..... అంటే... నువ్వడిగే వాళ్ళు ఇంకా రాలేదు. నాన్న పిలిచారు కాబట్టి వస్తారేమో అని అనిపిస్తున్నా, నా పుట్టినరోజు కదా. అందుకోసం అసలు రారు. ఏమోలే నన్నే గుర్తు పెట్టుకోరు ఇంకా నా పుట్టినరోజు ఏం గుర్తుంటుందిలే"
"స్వాతి నువ్వు బానే ఉన్నావా"
"ఏం చెప్పాలి అన్వి. అందరూ నా చుట్టూ కంచెలాగా నిల్చున్నారు. నన్ను ఒక్క మాట అన్నా కూడా ఎవరూ ఊరుకోరు. కానీ మనసులో ఏముందో చెప్పనా అన్వి..... ఎవరితోనూ చెప్పుకోలేనిది"
"ఏంటే"
"నాన్న ఒక్క మాట మాట్లాడినా వీళ్ళు ఊరుకోరు. ఆయన ఒక్క మాటైనా మాట్లాడితే బావుండని నాకుంది"
Comments
Post a Comment