14
హరీష్ మనసులో "స్వీటీ నీకు లోపల ఏం బాధ ఉందో నాకు తెలీటం లేదురా. కానీ, నువ్వు చెప్పేవరకూ, అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను" అంటూ స్వాతి తల మీద ముద్దు పెట్టుకునీ కార్ పక్కకి ఆపాడు.
స్వాతి కి కొద్దిసేపటికి మెలుకువొచ్చి, కార్ ఆగి ఉండటంతో, "వచ్చేసామా" అని అడుగగా,
"దగ్గర్లో ఉన్నాము"
"ఒహ్హ్. లేపలేదేం" అనడిగింది హరీష్ భుజం మీంచి తల ఎత్తుతూ
"అలా పడుకునుంటే లేపాలనిపించలేదు" అంటూ కార్ స్టార్ట్ చేసాడు. స్వాతి తనలో తనే నవ్వుకుంది.
కాఫీ షాప్ బయట ప్రదీప్ స్వాతి కోసం ఎదురు చూస్తూ, వాళ్ళు వచ్చాక అందరూ లోపలికి వెళ్ళీ కూర్చుని,
ప్రదీప్ "బా... రెస్యూమ్ ఒకసారి పంపించు. మా కంపెనీ లో ఓపెనింగ్స్ పడ్డాయి. ఫార్వర్డ్ చేసి చూద్దాము. డీటెయిల్స్ పంపిస్తాను. ఈ వీక్ లోనే ఇంటర్వ్యూ ఉండచ్చు"
"సరే బావా.... ఇప్పుడే పంపిస్తాను"
ప్రదీప్ "చిన్నూ... ఇందాకా కాలేజ్ వాళ్ళు మెసేజ్ చేస్తారన్నావ్ కదా. చేశారు. ఆ మెసేజ్ చూసాకే నీకు కాల్ చేసాను. నాన్న ఫోన్ నేనే తీసుకుని వెళ్ళిపోయాను పొద్దున, నా ఫోన్ అనుకుని. నేను కాల్ చేసి వాళ్ళతో మాట్లాడాను. నువ్వు ఇంట్లోనే ఉన్నావని చెప్పేశా. దాని గురించేమీ భయపడక్కర్లేదు" అన్నాడు నవ్వుతూ
స్వాతి "అవునా, మరి ఇందాక చెప్పలేదేం. టెన్షన్ పడ్తుంటే. ఒకేసారి ఎన్నని ఆలోచించనూ... అసలే చిన్న బుర్ర. వేడెక్కిపోయింది" అంది తల పట్టుకుంటూ
ఆ మాటకి హరీష్, ప్రదీప్ ఇద్దరూ గట్టిగా నవ్వారు.
"మరి ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావంటే ఆ మాత్రం భయపెట్టకపోతే ఎలా. చిన్న బుర్ర అని తెలుసు కదా మరి ఎందుకురా అన్ని ఆలోచనలు. అందుకనే చదివింది బుర్రకి ఎక్కటం లేదు" అంటూ నవ్వుతూ స్వాతి మొహం ఎర్రగా మారుతుంటే ఆపేసాడు.
"నువ్వు పెళ్ళి చేసేస్తా అని బెదిరించకూ ఊరికూరికే. ఆ టెన్షన్ లోనే చదవలేకపోతున్నా అసలు" అంది బుంగమూతి పెట్టి. హరీష్ వైపు చూస్తూ, "బావా చెప్పటం మర్చిపోయా. మా అన్నగారు ఈ వీకెండ్ లో పెళ్ళి చూపులు అరేంజ్ చేస్తారుట. నువ్వూ రా తప్పకుండా. అందరూ తనేదో బుద్ధిమంతుడు అనుకుంటారు చూడు ఎలా సతాయిస్తాడో, చెప్పినా నమ్మరు"
హరీష్ కి ప్రదీప్ సరదాగా అన్నాడో సీరియస్ గా అన్నాడో అర్థం కాలేదు. ఆ కన్ఫ్యూషన్ ని కవర్ చేస్కుంటూ, "ఏంటీ బావా నువ్వు మరీను. చదవకపోతే ఏమవుతుంది? అయినా ఈసారి బానే చదువుతుంది. మంచి మార్కులు వస్తాయి చూడు. ఎగ్జామ్స్ అయ్యే వరకు వెయిట్ చెయ్"
ప్రదీప్ "హహహ... ఏదో సరదాగా ఆటపట్టిస్తున్నా, ఇప్పుడప్పుడే ఏం ఆలోచనలు లేవు. అయినా నేను చేసేస్తా అంటే అయిపోతుందేంటీ, మా నాన్నా ఒప్పుకోవాలి కదా ముందర"
స్వాతి ఏడుపు మొహం పెట్టి "నువ్వు ఒప్పించేయగలవు. అందుకే కదా భయపడి చచ్చేది నువ్వలా అంటుంటే"
హరీష్ ధైర్యం చెప్తూ "లేదులే స్వాతి, సరదాగా అంటున్నారు. అవన్నీ ఆలోచించకుండా నువ్వు ముందర ఎగ్జామ్స్ మంచి మార్కులతో పాసై చూపించు. నీ ఛాలెంజ్ లో నువ్వు విన్ అవ్వాలి... సరే ఇంక నేను బయల్దేరతాను"
"సరే బా.. సాటర్డే వస్తున్నావ్ కదా"
"సాటర్డేనా ఎందుక??"
"ఎందుకేంటీ. దీని పుట్టినరోజు కదా. అన్నట్లు నువ్వోస్తున్నావుగా"
హరీష్ కి ఒక్కసారిగా పొలమారి "నేనా?? నేను రావటమేంటి. తను చెప్పిందా " అంటూ కంగారుగా స్వాతిని చూసాడు
ఆమె తల అడ్డంగా తిప్పి నవ్వగా, ప్రదీప్ "అదే చెప్పాలేంటి. మా అమ్మ ఫోన్ చేసింది కదా, వ్రతం ఉంది రమ్మనీ. సరిపోదా?? అబ్బాయిగారు ఇంటల్లుడు మరీ, అందరూ వచ్చి పేరు పేరునా రమ్మనీ ఆహ్వానించటానికి"
స్వాతి.... "అన్నయ్యా" అరిచినట్లే పిలిచింది, ప్రదీప్ అలా ఎందుకు అంటున్నాడో అర్థంకాక.
హరీష్ మనసులో.... "ఓరి బావోయ్.... నువ్వు తెలిసి అంటున్నావో తెలీకపోయినా మామూలుగానే అంటున్నావో కానీ ఇంకొంచం సేపు ఉన్నానంటే నేనే చెప్పేసేలాగా ఉన్నాను"
ప్రదీప్ అంతే సరదాగా.... "లేకపోతే, నువ్వు కూడా చెప్పాలా చిన్నూ, రమ్మనీ. అమ్మ చెప్తే సరిపోదా?? అందరూ వస్తున్నారు బా. నువ్వూ రా సరదాగా "
స్వాతి ఆ మాట వినగానే "హ్మ్మ్.... అందరూ వస్తారు కదా" అంటూ నిట్టూర్చగా, ప్రదీప్ "నేనున్నా కదా" అన్నట్లుగా ఆమె భుజం మీద చేయి వేసాడు.
హరీష్ కి అక్కడ ఏం జరుగుతోందో, స్వాతి ఎందుకలా బాధపడుతోందో తెలీకపోయినా, అడగలేకపోయాడు.
"బావా పూజ గురించి నాకు తెలీదు. అత్తయ్య చెప్పింది కదా, వస్తాములే. నేను బయల్దేర్తాను. బాయ్ స్వాతి" అంటూ లేచీ వెళ్ళిపోయాడు
హరీష్ వెళ్ళగానే, వాళ్ళూ లేచీ ఇంటికి వెళ్లారు.
హరీష్ ఇంట్లో....
హరీష్.... "స్వీటీ ఎందుకంత బాధపడింది. మళ్ళీ ప్రదీప్ కనిపించగానే ఏమి జరగనట్లుగా వేరేవాటి గురించి మాట్లాడుతూ మాములుగా ఉంది. 'అందరూ వస్తారు కదా' అంటూ ఆగిపోయింది ఇందాకా. అంటే మన వాళ్లలోనే స్వాతి ని బాధపెట్టే వాళ్ళూ ఉన్నారా. అందుకే నాకు చెప్పటానికి ఆలోచిస్తోందా. ఎవరయ్యి ఉంటారు" అని ఆలోచనలో పడ్డాడు
హరీష్ వాళ్ళ నాన్నగారు తనని అలా చూసీ, "ఏమయిందిరా హరీ, ఏమిటంత ఆలోచిస్తున్నావు"
"ఏమిలేదు నాన్నా, ప్రదీప్ వాళ్ళు కలిశారు. పూజ ఏదో ఉందిట కదా రమ్మని చెప్పారు"
"అవునురా. వ్రతం చేసుకుంటున్నారు. అత్తయ్య, మావయ్య ఇందాకే చెప్పారు. అయినా అందులో అంత ఆలోచించేది ఏముందీ "
"అది కాదు నాన్నా, ప్రదీప్, స్వాతి ఏదో విషయం లో గొడవపడ్తున్నారు. కానీ అర్థం కాలేదు. అదే ఆలోచిస్తున్నా"
"ప్రదీప్ ఆట పట్టిస్తాడు కానీ దానిని ఎవరూ ఒక్క మాట అననీయడురా, అత్తయ్యని అయినా సరే" అన్నారు ఆ అన్న చెల్లెళ్ళ అనురాగన్ని తల్చుకుంటూ
చూస్తుండగానే వ్రతం రోజు వచ్చేసింది. ఆ ముందు రోజు అర్థరాత్రి, ఫోన్ మోగుతుండటం తో స్వాతి కి మెలుకువ వచ్చి ఎవరో కూడా చూడకుండానే నిద్ర మత్తులో, "హలో" అనేసరికి
"విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే బంగారం" హరీష్ గొంతు వినీ సంతోషంగా "బావా.... థాంక్యూ సో మచ్. నువ్వెంటి ఈ టైమ్ లో కాల్ చేసావు"
"నీ బర్త్డే కి ఫస్ట్ నేనే విష్ చేద్దామని. అదీగాక, ఇంటికి వస్తే ఫార్మల్ గా మాట్లాడాలి. నా స్వీటీ తో ఇలా హ్యాపీ గా మాట్లాడటానికి అవ్వదు కదా"
"హాహాహా.... సరే. బావా పొద్దున్న వస్తున్నావు కదా"
"వస్తానురా. ఇంతకీ నీకేం గిఫ్ట్ కావాలి"
"రేపు మొత్తం నాతోనే ఉంటావా బావా. పక్కనే ఉన్నా మనసారా నీతో మాట్లాడలేకపోవచ్చేమో కానీ నువ్వు నాతో ఉన్నావన్న సంతోషమైనా ఉంటుంది కదా"
"సరేరా..... రేపు మొత్తం నీతోనే ఉంటాను. ఓకే నా "
"హాహా.... థాంక్యూ బావా"
"చక్కగా బజ్జో. రేపు పొద్దునే ఏదో ఒక హడావిడి ఉంటుంది కదా. రెస్ట్ తీస్కో. రేపు నీకో గుడ్ న్యూస్ చెప్తాను. నీ బర్త్డే కి అదే నా గిఫ్ట్"
"ఏంటీ బావా"
"అది రేపే చెప్తాను" అని ఫోన్ పెట్టేసాడు.
తెల్లవారగానే..... ప్రదీప్, వాళ్ళ అమ్మా, నాన్నా గారు స్వాతి దగ్గరకి వచ్చి పుట్టినరోజు విషెస్ తో నిద్ర లేపారు.
"చిన్నూ... నీ గిఫ్ట్" అంటూ ఒక పెద్ద బాక్స్ తన చేతిలో పెట్టాడు ప్రదీప్
"ఏంటన్నయ్యా ఇదీ"
"గెస్ చేయి .... నీకు చాలా ఇష్టమయినది "
"నేను అనుకునేది కాదేమో.... వావ్ టెడ్డి బేర్...... థాంక్యూ. ఇష్టమైనది అనగానే అనుకున్నా.... కానీ కాదేమో అని డౌట్ వచ్చింది. థాంక్యూ అన్నయ్యా..... థాంక్యూ థాంక్యూ థాంక్యూ" అంటూ అన్నయ్యని హగ్ చేసుకుంది
"ఇంకా టెడ్డి బేర్ లు ఏంట్రా. దానికి పెళ్ళి కొడుకు ని తీసుకుని రావాల్సిన టైమ్ వస్తుంటేను"
"అన్నయ్యా" అంటూ ప్రదీప్ వెనకాల సిగ్గుతో దాక్కుంది
"అమ్మా... డిగ్రీ అవగానే మాస్టర్స్ చెయ్యకపోతే ఎలాగా అంటూ దాన్ని పీజీ చేయిస్తున్నావ్... అది ఇంకా పూర్తవ్వలేదు. అప్పుడే పెళ్ళి అంటున్నావ్. ఆ మాస్టర్స్ అయ్యాక దాని ఇష్టం. అప్పటి వరకూ ఏమి అనకూ"
"మా మంచి అన్నయ్య" అంది ప్రదీప్ చెయ్యి పట్టుకుని
"సరేరా బంగారు తల్లీ, ముందర రెడీ అవ్వు లేచీ. అందరూ వచ్చే టైమ్ అవుతోంది". వాళ్ళ నాన్నగారి మాటకి ప్రదీప్, వాళ్ళ అమ్మ గారు వెళ్లబోతుంటే....
"నాన్నా.... ఆగండి. మీ ముగ్గురిని ఒకటడగాలి" స్వాతి మాటలకి తన వైపుకి తిరిగారు. అప్పటి వరకు, చిన్న పిల్లలాగా గెంతిన స్వాతి, సడన్ గా సీరియస్ అయిపొయింది
"ఏంటి చిన్నూ "
"అన్నయ్యా... నాకు మీ ముగ్గురూ ఒక ప్రామిస్ చేయాలి"
ముగ్గురికీ అర్థం కానట్లుగా తన వైపు చూస్తుంటే
"ఈరోజు ఇంటికి ఎవరొచ్చినా సరే... ఏం జరిగినా సరే... అందరితోనూ నవ్వుతూనే ఉండాలి. ఎవరినీ బాధ పెట్టకూడదు. వాళ్ళు ఏమన్నా కూడా. మీరు దీనికి ఒప్పుకుంటేనే నేను రెడీ అవుతాను. లేదా ఈ గదిలో నుంచి బయటకి రాను"
స్వాతి వాళ్ళ అమ్మా, నాన్నగారు "సరే తల్లీ. నీ ఇష్టం. మేమెవరిని ఏమి అనము"
స్వాతి ప్రదీప్ వైపు తన సమాధానం కోసం. "ఏ వాళ్ళ మీద ప్రేమ పొంగిపోతోందా?? నేను మామూలుగానే ఉంటా. కానీ నిన్ను మళ్ళీ ఎవరైనా బాధపెడితే మాత్రం ఊరుకోను. అయినా ఇలా అడుగుతున్నావంటే నీకూ ఎక్కడో అనుమానం ఉంది కదా" అని కోపంతో ఊగిపోయాడు
స్వాతి "అన్నయ్యా.... నన్ను ఒద్దనుకున్నారు కానీ నాకు అందరూ కావాలి. అయినా నాకు అనుమానం ఏమి లేదు. వాళ్ళు ఎప్పుడూ ఒకేలాగా ఉన్నారు. కొత్తగా బాధపెట్టటానికి ఏమి లేదు" మాట బొంగురుపోయింది. స్వాతి వాళ్ళ అమ్మగారు తనని దగ్గరకి తీసుకునీ, ప్రదీప్ ని ఒప్పుకోమన్నట్లుగా సైగ చేసారు. స్వాతి "నువ్వు నేనడిగినదానికి ఒప్పుకుంటావా లేదా అన్నయ్యా" అంది మళ్ళీ రెట్టిస్తూ
పద్మగారు అప్పటికే ఒప్పుకోమని చెప్పటంతో, "సరే" అని చెప్పి ప్రదీప్ అక్కడ నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. స్వాతి కూడా ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయింది.
Comments
Post a Comment