13

తర్వాత రోజు పొద్దున్న అందరూ లేచీ ఫ్రెష్ అయ్యి,  స్వాతి వాళ్ళ అమ్మ గారు కాఫీ ఇయ్యగా అందరూ వరండాలో కూర్చున్నారు.  


ప్రదీప్ ఎంత మాట్లాడించినా స్వాతి మొహం తిప్పుకోటం చూసీ వాళ్ళ నాన్నా గారు స్వాతి తో,  "ఏమయ్యిందమ్మా.....  అన్నయ్య మాట్లాడుతుంటే సమాధానం చెప్పవేం" అని అడిగారు 


"నాన్నా...  నేను అన్నయ్య తో మాట్లాడను" అంది మొహం తిప్పి 


"ఎందుకురా ఏమయినా అన్నాడా నిన్ను" 


ప్రదీప్ ని కోపంగా చూస్తూ "నన్ను అడుగుతారేం. తననే అడగండి ఏం చేసాడో"


"ఏం చేసావురా. నా బంగారాన్ని ఎందుకు సతాయిస్తున్నావు" 


"నేనేం చేస్తాను నాన్నా. అది చెప్పటం మీరు నన్ను అడగటం. అసలు నేను ఏమననేలేదు" 


"ఏమి అనలేదా " స్వాతి కోపంగా చూసింది ప్రదీప్ ని 


"నిన్ను ఏమన్నా అన్నానా అసలూ. హరీష్ వస్తే మాట్లాడుతున్నాను, దీనికి కోపమొచ్చింది నాన్నా. తనతో మాట్లాడటం కూడా తప్పేనా" అమాయకంగా అడిగాడు ప్రదీప్. 


"నాన్నా....   బావా వచ్చినప్పుడు "నేను వంటింట్లోకి వెళ్తే చేతులు కాల్చుకుంటాను",  "ఇంట్లో ఒకదాన్ని ఉండటానికి భయపడ్తాను" అని చెప్తున్నాడు. నా పరువు తీసేసాడు తన ముందర" అంది ఏడుపు మొహం పెట్టి 


"పరువు తీయటానికి ఏముందిరా. నిజమే చెప్పాడు కదా. నేనింకా నీ మీద కోప్పడ్డాడేమో అనుకుని దెబ్బలాడదాం  అనుకున్నాను"


స్వాతి తప్ప అందరూ నవ్వేశారు 


స్వాతి వాళ్ళ అమ్మగారు.... "వచ్చే వారం ఇంట్లో వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము. ప్రదీపు నీకు ఒక రోజు సెలవు దొరుకుతుందా. సామాన్లు అవీ తెచ్చుకోటానికి,  ఇంట్లో చిన్న చిన్న పనులకి నువ్వుంటే వీలుగా ఉంటుంది" 


"సరే అమ్మా,  కుదురుతుందిలే. అయినా సడన్ గా వ్రతం ఏంటీ. ఎవరెవరిని పిలుస్తున్నావు" 


స్వాతి ని చూసీ నవ్వుతూ "ఆ రోజు స్పెషల్ ఏంటో నువ్వు మర్చిపోయావా. అందుకే వ్రతం చేసుకుందామని. అయినా ఎవరిని పిలుస్తాము. అటు మీ నాన్నా వాళ్ళ అక్క ని తమ్ముడిని ఇటు మా అన్నయ్యలు,  తమ్ముడు,  మీ ఫ్రెండ్స్ ని పిలుచుకుంటే వాళ్ళూ. అంతే" 


స్వాతి ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడ నుంచి లేచీ వెళ్ళిపోయింది. 


ప్రదీప్ తన వెనకాలే వెళ్తూ "ఏంటమ్మా ఆ రోజే దాన్ని బాధపెట్టాలని ఫిక్స్ అయ్యావా. చేస్తే ఎవరిని పిలవకుండా నువ్వు పూజ చేస్కో లేదా మానేసేయ్యి. దాన్ని బాధపెడితే మాత్రం ఊరుకోను" అంటూ గట్టిగా చెప్పి స్వాతి వెనకాలే లోపలికి వెళ్ళాడు 


"స్వాతి నీకు నచ్చనిది ఏది ఇక్కడ జరగదు. నువ్వు బాధపడకూ. ప్లీజ్ రా" 


"అదేమీ లేదన్నయ్యా కాలేజ్ కి టైమ్ అవుతోంది స్నానం చేసి రెడీ అవుదామని వచ్చాను అంతే. నేనెందుకు బాధపడ్తాను. నువ్వు మరీను" అంటూ ప్రదీప్ పక్కనుంచి లోపలికి వెళ్ళిపోయింది. 


స్వాతి ఫ్రెష్ అయ్యి,  "అమ్మా కాలేజ్ లో స్పెషల్ క్లాస్ ఉందిట. రమ్య మెసేజ్ చేసింది. బాక్స్ ఏమి ఇయ్యకు. నేను బయట తినేస్తాలే" అంటూ బాగ్ తీసుకొని బయల్దేరబోతుంటే.... 


స్వాతి వాళ్ళ నాన్న గారు తనని ఆపుతూ  "బంగారం.... ఈ ఇంట్లో నీకు నచ్చనిది ఏది జరగదు. ఈ ఇంటికి వచ్చేవాళ్ళు కూడా నీకు నచ్చకపోతే రారు. మనం మాత్రమే పూజ చేసుకుందాము. అంతేకాని ఆ కోపం భోజనం మీద చూపించకు. పద్మా (మీకు చెప్పటం మర్చిపోయాను,  అదేనండి స్వాతి వాళ్ళ అమ్మగారి పేరు పద్మ).... ఆ లంచ్ బాక్స్ ఇయ్యి" 


పద్మ గారు బాక్స్ తీసుకొచ్చి స్వాతి కి ఇచ్చేసి వెళ్ళబోతుండగా, ఆవిడ కళ్ళలోని సన్నటి నీటిపొర  స్వాతి చూపుని తప్పించుకోలేదు. స్వాతి ఆవిడని వెళ్లనీయకుండా చేయి పట్టి ఆపి "నాన్నా....  నేను బాధపడుతున్నానని చెప్పానా. ఏదో హడావిడిలో కాలేజ్ లో తింటాను అన్నాను. అంత మాత్రాన ఎవరికీ వాళ్ళు ఏదేదో ఊహించేస్కుంటారేం. నాకు నచ్చని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. పిలుద్దామనుకున్నది మన వాళ్ళనే. మీరు అనుకున్నట్లు అందరిని పిలవండి. అందరూ వస్తేనే నాకూ సంతోషంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా. ఇదే ఫైనల్" 


వాళ్ళ అమ్మగారి వైపు చూస్తూ "అమ్మా అందరికి ఈరోజే ఫోన్ చేయి. కానీ ఒక్క విషయం లో మాత్రం నేను అలిగాను" ఆవిడ బాధగా స్వాతిని ఎందుకన్నట్లు చూడగా "అన్నయ్యని ఆఫీస్ మానేయమన్నావ్ కాని నాకు కాలేజ్ మానేయమని చెప్పలేదు. నేను హర్టు" అంది బుంగమూతి పెట్టి. 


తనని అలా చూసేసరికి పద్మగారు నవ్వేశారు. "హమ్మయ్య నవ్వేసావా. ఇప్పుడు వెళ్ళచా నేను" అంది పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు నవ్వుతూ 


"టిఫిన్ చేసేసి వెళ్ళమ్మా " అన్నారు ఆవిడ ప్రేమగా 


"ఒద్దమ్మా. లేట్ అవుతోంది. నేను వెళ్తా. మళ్ళీ బస్ మిస్ అవుతుందీ" 


"పర్వాలేదు నేను దింపుతాను ఈరోజు. పదా" 


"ఎందుకు అన్నయ్యా. నేను వెళ్తాను"


"నేను వస్తా అన్నాను కదా. పదా. నా లాప్టాప్ లోపల ఉండిపోయింది తీసుకునీరా,  షూస్ వేసేసుకున్నాను"


"సరే" అని లోపలికి వెళ్ళగానే, "సారీ అమ్మా ఇందాకా కొంచం గట్టిగా మాట్లాడాను. అది డల్ అయ్యేసరికి ఏంటోగా అయిపొయింది" 


"పర్వాలేదురా. నువ్వు కూడా తినకుండానే వెళ్తావా" 


"లేదులే. ఇద్దరం బయట తినేసి దాన్ని దింపి నేను వెళ్తాను"


"సరే "


"నాన్నని ఎక్కువ ఆలోచించద్దని చెప్పు. నేను చూస్కుంటానులే. అది చెప్పింది కదా అందరిని పిలవమని. రమ్మనూ" అని కార్ దగ్గరకి వెళ్ళాడు.


స్వాతి వచ్చి కార్ ఎక్కాక ఇద్దరూ బయట టిఫిన్ చేసి, ఆమెని కాలేజ్ లో దింపాడు. ఆ గంట ప్రయాణం లో స్వాతి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రదీప్ కూడా తననేమి అడగలేదు. ఇద్దరూ ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడాలో కూడా తెలీని నిశ్శబ్దం. 


కాలేజీ దగ్గర కార్ దిగబోతుంటే,  "చిన్నూ.... నీకు మేమందరము ఉన్నాము. ఎక్కువ ఆలోచించకు. సరేనా" 


తెచ్చిపెట్టుకున్న నవ్వుతో తల ఊపి కాలేజ్ లో కి వెళ్ళింది. కాలేజ్ లో ఉందనే కానీ చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ కళ్ళ ముందే తిరుగుతున్నాయి. 


స్వాతి క్లాసుమేట్ : హేయ్ స్వాతి....  మేము క్లాస్సేస్ మాస్ బంక్ కొడ్తున్నాము. నువ్వూ మాతో పాటు జాయిన్ అవుతావా 


స్వాతి: అందరూనా 


స్వాతి క్లాసుమేట్ : ముగ్గురు నలుగురు తప్ప అందరమూనే 


స్వాతి : "స్కిప్  చేసి ఏం చేస్తారు" అంది అయోమయంగా 


క్లాసుమేట్ : మూవీ అనుకుంటున్నాం 


స్వాతి : సరే నేను బయటకి వస్తాను కానీ మూవీ కి రానులే. నాకు మూడ్ ఏం బాలేదు. బయట వరకూ వస్తాను మీతో


క్లాసుమేట్ : సరే నీ ఇష్టం 


అలా స్వాతి కాలేజ్ నుంచి బయటకి వచ్చి, ఎక్కడికెళ్లాలో తెలియక గుడికి వెళ్ళి ఏడుస్తూ కూర్చునిపోయింది.


చాలా సేపటికి హరీష్ "కాలేజ్ కి వస్తాను. బస్ లో వెళ్ళిపోకు. దగ్గర్లోనే ఉన్నాను" 


అది చూస్తూనే,  స్వాతి "కాలేజ్ లో లేను బావా....  మనసేమి బాలేదు. ఎందుకు అని అడగకు. ఈరోజుకి నేను ఒకదాన్ని వెళ్ళిపోతాను. ఏమి మాట్లాడలేను. ఏమనుకోకు బావ. అయినా " 


ఆ మెసేజ్ చూసిన హరీష్ కి ఏమి అర్థం కాలేదు


"స్వీటీ...  నీకు మాట్లాడాలనిలేకపోయినా పర్వాలేదు. నిన్ను చూడాలనుంది. ఎక్కడున్నావు"


"కాలేజీ దగ్గర గుడిలో" 


హరీష్ "వస్తున్నా" అంటూ ఫోను పెట్టేయగా ఇంతలో స్వాతి కళ్ళు తుడుచుకుని అతని కోసం చూసింది. అతను వెంటనే గుడి దగ్గరకి చేరుకుని, స్వాతిని చూసీ కంగారుగా,  "స్వీటీ ఏమయిందిరా. ఎందుకలా ఉన్నావ్?  కాలేజ్ టైమ్ లో ఇక్కడున్నావేంటి"  అంటూ ఆగకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు


స్వాతి, హరీష్ కంగారుని చూసీ ... "బావా కాలేజ్ లో మాస్ బంక్ అంటే బయటకి వచ్చేసాను ఇందాక" 


"బంక్ కొట్టి గుడికొచ్చావా" అర్థం కానట్లుగా అడిగాడు 


"హాహా...  కాదు బావా వాళ్ళు మూవీ కి వెళ్లారు. నాకు ఇంటరెస్ట్ లేక ఇక్కడే కూర్చున్నా" 


"అయితే  ఇంటికి వెళ్ళచ్చు కదా. పదా వెళదాము" స్వాతి ఏదో చెప్పబోయేలోపు, "నేనేమి వినను. ముందు ఇక్కడ నుంచి పద. నీకెప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడే వెల్దువుగాని ఇంటికి" 


స్వాతి లేచీ కార్ దగ్గరకి వెళ్లబోతుంటే క్లాసుమేట్ దగ్గరనుండి మెసేజ్ వచ్చింది.


"అందరమూ బుక్ అయ్యామే. పేరెంట్స్ కి కాల్స్ వస్తాయట ఈరోజు. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం" అని


స్వాతి ఎవరికో మెసేజ్ చేసి కార్ లో కూర్చుని ఆలోచిస్తుండగా, హరీష్ "ఏంటిరా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు" 


"ఏంలేదు బావా. ఒక రోజు హ్యాపీ గా ఉంటే ఇంకో రోజు బాధగా గడుస్తోంది. ఏంటో లైఫ్, తెలీటం లేదు" 


"లైఫ్ అంటేనే అదీ. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ కష్టం వచ్చినప్పుడు అలా డల్ అయిపోకూడదు. ఆ దేవుడు ఒక రోజు హ్యాపీ మూమెంట్స్ ఎందుకిస్తాడో తెలుసా, బాధ వచ్చినప్పుడు ఆ మెమోరీస్ మనకి లైఫ్ మీద ఇంటరెస్ట్ ని కలిగించటానికి. మనమేమో ఆ హ్యాపీ మూమెంట్స్ మర్చిపోయి ఈరోజు వచ్చిన ప్రోబ్లెంనే తల్చుకుంటాము" 


ఇంతలో ప్రదీప్ కాల్ చేయటం చూసీ హరీష్ వైపు చూడగా, అతనకి అర్ధమయ్యి "పర్వాలేదు మాట్లాడమన్నట్లుగా" కళ్ళతోనే సైగ చేస్తాడు. 


"హలో అన్నయ్యా" 


"ఏమైందీ. నేను రానా చిన్నూ" 


"అది కాదు అన్నయ్యా, ఒక హెల్ప్ కావాలి" 


"ఏంటిరా" 


"నువ్వు ప్లీజ్ తిట్టకూ" 


"ఏంటో చెప్పరా" 


"అందరూ క్లాస్సేస్ బంక్ కొడ్తుంటే నేనూ బయటకొచ్చేసాను ఇందాకా. ఇప్పుడేమో వాళ్ళు మెసేజ్ చేశారు, కాలేజ్ నుంచి ఫోన్ చేసి పేరెంట్స్ కి కాల్స్ చేస్తారని. నాన్న నెంబర్ ఉంది రికార్డ్స్ లో దానికి చేస్తే, అమ్మ తీసిందనుకో నా పనైపోతుంది. అందుకే ఇంట్లో ఉన్నావేమో ఆ కాల్ చూస్తావు కదా అని అడిగాను" 


"   "


"అన్నయ్యా" 


"కాల్ సంగతి  సరే.....  నువ్వెక్కడికెళ్ళావు ఇప్పటి వరకూ"


"చచ్చాను" అని తల మీద చేయి పెట్టుకునీ ఓరకంటితో హరీష్ ని చూసింది. హరీష్ నవ్వు ఆపుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. 


"పొద్దున్న ఇంట్లో జరిగినదే ఆలోచిస్తున్నావు కదా " అని అడిగేసరికి స్వాతి కి మాట రాలేదు. తను అలా మౌనంగా ఉండేసరికి,  


"చిన్నూ.....  నీకన్నా మాకు ఏది ఇంపార్టెంట్ కాదురా. వాళ్ళెవరూ మాకొద్దు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలురా మాకు" 


"అన్నయ్యా....  ఎవరిని ఒద్దంటున్నావు. వాళ్ళని వద్దంటే అమ్మా నాన్నా సంతోషంగా ఉంటారా? రేపు నాకు పెళ్లయ్యాక నా మొగుడో పిల్లలో వచ్చి, నిన్ను కలవద్దంటే లేదా నిన్ను చూడనీయకపోతే నా పరిస్థితేంటి. నేనెంత బాధపడ్తాను?? నీకెలా ఉంటుంది?? అమ్మా, నాన్నకి ఆ బాధ అవసరమా?? అందుకే పొద్దున్న అందరికి చెప్పమని అన్నాను. నేను చాలా కాలం నుంచి అందరికి దూరంగా ఉంటున్నాను. ఒక్కసారిగా వాళ్ళ ఊహ వచ్చేసరికి బాధగా ఉంది, నేనూ  సద్దుకుంటాను కొంచం టైమ్ కావాలి అంతే. ఇవి ఇంట్లో చెప్పలేను అన్నయ్యా. నువ్వైనా అర్థం చేస్కో" అంటూ ఏడుస్తూ ఫోన్ కట్ చేసేసింది 


హరీష్ కి తను ఏం మాట్లాడిందో ఏమి అర్థం కాలేదు. కానీ స్వాతిని అడిగి ఇబ్బంది పెట్టలేక,  స్వాతి చేతి మీద చేయి వేసాడు ఓదార్పుగా. హరీష్  అలా వేసేసరికి తన భుజం మీద తల పెట్టుకునీ వాలిపోయింది. అతనికి ఆమె కంటి తడి తెలుస్తున్నా  ఏమి మాట్లాడలేకపోయాడు. 




స్వాతి సడన్ గా ఏదో గుర్తొచ్చినదానిలా,  వెంటనే ఫోన్ తీసి మళ్ళీ ప్రదీప్ కి కాల్ చేసింది


"అన్నయ్యా.....  సారీ. ఇందాకా ఏదేదో మాట్లాడేసాను. సారీ"


"పర్వాలేదురా. చిన్నూ నేను పిక్ చేసుకుంటాను. ఎక్కడ ఉన్నావు"


"అన్నయ్యా.... హరీష్ బావ కనిపించారు. తనతో వస్తున్నాను" 


"సరే. ఒక పని చేయి ఇంటి దగ్గర కాఫీ షాప్ కి వచ్చేయండి. వెయిట్ చేస్తూ ఉంటా" అని ఫోన్ పెట్టేస్తాడు 


స్వాతి మళ్ళీ హరీష్ భుజం మీద అలాగే పడుకుంది. హరీష్ ఆశ్చర్యంగా, " అదేంటీ నేనొచ్చాను అని చెప్పావు సడన్ గా" 


"పర్వాలేదు. మూడ్ బాలేదు కదా, పక్కన నువ్వున్నావంటే తనూ కొంచం ధైర్యంగా ఉంటాడని చెప్పాను. సారీ నిన్ను అడగకుండా చెప్పేసాను" 


"నాకేం పర్వాలేదురా. అది కాదు కానీ, నేనెప్పుడూ నిన్ను, ప్రదీప్ బావని కలవకూడదు అని రెస్ట్రిక్టు చేయనూ" అన్నాడు సీరియస్ గా 


స్వాతి అర్థం కానట్లుగా చూస్తుంటే, హరీష్ నవ్వేసి "నీ మొగుడు నిన్ను మీ అన్న ని చూడనీయకపోతే అన్నావు కదా, నీ మొగుడ్ని నేనే కదా అందుకే ముందరే చెప్పేసాను"


"నువ్వు చెప్పక్కర్లేదు బావా. నాకు నీ మీద ఆ నమ్మకం ఉంది....బావా... " 


"హ్మ్మ్ "


"బావా "


"చెప్పరా" 


"లవ్ యూ " 


"లవ్ యు టూ " అని హరీష్ స్వాతి తల మీద ముద్దు పెట్టుకున్నాడు


******************************************************


అక్షర దోషాలని క్షమించండి.  


కథని అనుసరిస్తున్న, అలాగే మీ కామెంట్ తో నన్ను ప్రోత్సహిస్తున్న అందరికి, పేరు పేరున ధన్యవాదాలు.  ఈరోజు కథలో ఏమి జరిగి ఉండచ్చని మీరనుకుంటున్నారు.  కామెంట్ చేసి చెప్పండి. 



Comments