11

 లోపలికొచ్చి ఫోన్ చూసుకున్న స్వాతి,  హరీష్ మెసేజ్ చూసీ  ఆశ్చర్యపోయింది.


హరీష్....  "ఎందుకంత టెన్షన్ పడ్తున్నావ్. ఏమయిందిరా అసలూ. ఇంట్లో ఏమైనా అన్నారా. కాల్ చేయి. వెయిట్ చేస్తూ ఉంటా " 


"అసలు బావ ఎందుకిలా మెసేజ్ చేసాడు. రాత్రి ఇక్కడ జరిగినది తనకెలా తెలిసి ఉంటుంది,  లేదా ఇంకేదైనా అయ్యిందా. సరే ఒక సారి మాట్లాడి చూద్దాం" అనుకుంటూ హరీష్ కి ఫోన్ చేసింది


"స్వాతీ.....  ఏమయిందిరా" అన్నాడు హరీష్ ఫోన్ తీస్తూనే 


"బావా ఏమైంది. నేను బానే ఉన్నాను. ఎందుకలా కంగారు పడుతున్నావు" 


"నిజంగా ఏమవలేదా. మరి మన పెళ్లి ఎవరికీ ఇష్టముండదని ఎందుకు అనుకుంటున్నావు. రాత్రి ఎందుకు ఏడుపొచ్చేస్తోంది అన్నావు " 


"బావా....  అదీ...  నీకెలా తెలుసూ" 


"అంటే నిజమనే కదా. అయినా కూడా నాకు చెప్పలేదు.  నాకెలా తెలుసంటే,  మీ రమ్య కి రాత్రి మెసేజ్ చేసావ్ కదా" 


"ఆ "  


"ఆ మెసేజ్ తనకి పంపిస్తున్నా అనుకుని నాకే పంపించావు" 


"అవునా" అనుకుంటూ ఫోన్ మళ్ళీ చూసుకుంది 


దాంట్లో,  హరీష్ మెసేజ్ కి ముందర స్వాతి మెసేజ్ చేసింది కనిపించింది. అప్పటి వరకూ తను అది గమనించనే లేదు.


"రమ్యా...  నాకు బావ కావాలి కానీ మా పెళ్లి ఎవరికీ ఇష్టముండదేమో.  భయంగా ఉందే.  రమ్మీ ఏడుపొచ్చేస్తోంది. పక్కనే అమ్మా, నాన్నా,  అన్నయ్య అందరూ ఉన్నా,  ఎవరితోనూ చెప్పుకోలేక ఒక్కదాన్ని అయిపోయినట్లుగా ఉందే "


ఆ మెసేజ్ చూసీ.....  "అయ్యో బావా.....  చూసుకోలేదు. సారీ"  అంది కంగారుగా 


"సారీ లు కాదురా. ఏమైందో చెప్పూ" 


"నేనే ఏవేవో ఆలోచించేసా. ఏమవలేదులే ....  బావా నిన్నొక్కసారి చూడాలనుంది. కానీ కుదరదూ" అంది బాధగా 


"స్వీటీ....  నాకూ నిన్ను చూడాలనుందిరా. నేనేదో ఒకటి చేస్తాను. సరేనా. కానీ అలా డల్ గా ఉండకూ. ఏమి ఆలోచించకుండా హ్యాపీగా ఉండూ" 


"సరే బావా" 


ఫోన్ పెట్టేసి స్వాతి ఆలోచిస్తూ అక్కడే నిల్చునిపోయింది


ఎంతసేపటికి తను రాకపోటంతో లోపలికి వెళ్ళీ "స్వాతీ" అని అన్విత పిలవటం తో మళ్ళీ ఈ లోకం లో కి వచ్చి....  "వస్తున్నానే పదా" అంది స్వాతి 


"ఏమాలోచిస్తున్నావు. నా మీద కోపమొచ్చిందా. నిన్న రాత్రి నేను కొంచం సీరియస్ అయిపోయానే. సారీ..... కానీ ఒక్కటి చెప్తున్నాను. పెద్దమ్మ వాళ్ళని కాదని నిన్నైతే సపోర్ట్ చేయడూ, వాళ్ళు ఒప్పుకోకపోతే  పెళ్ళి చేసుకోనంటాడు లాస్ట్ లో,  ఇంకోటి నువ్వక్కడ అడ్జస్ట్ అవలేవేమో అనీ,  అంతే కానీ నీ మీద కోపం కాదు."


స్వాతీ "సరే అన్వి...  పర్వాలేదు. నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు. చూద్దాం లే ఏమవుతుందో " అంది స్వాతి ఆ టాపిక్ ని అక్కడితో ఆపెయ్యాలని 


"కానీ ఇంట్లో తెలిసేవరకూ మాత్రం జాగ్రత్తగా ఉండు. ఎక్కువ హోప్స్ పెట్టేసుకోకు" అనీ చిన్న వార్నింగ్ ఇచ్చింది 


"సరేనే" 


"సరే కాదు నీకోసమనే చెప్తున్నా" అంది ఈసారి కొంచం గట్టిగా 


స్వాతి...  "అలాగే" అనీ ఒత్తి పలికింది. అన్విత క్వశ్చన్ మార్క్ ఫేస్ తో   చూస్తుంటే,  స్వాతి.... "నువ్వే కదా సరే కాదు అన్నావ్ అందుకే అలాగే అన్నాను" అనీ నవ్వేసి అక్కడ నుంచి వచ్చేసింది


తర్వాత కొంచం సేపటికి, "అన్నయ్యా గుడికి తీసుకెళ్తావా" అనడిగింది స్వాతి


"అన్వి నీకోసం వస్తే,  దాన్నొదిలేసి గుడికి వెళ్దామంటావ్ ఏంటిరా. దాన్ని కూడా రమ్మనూ"


"అది అమ్మ తో కబుర్లు మొదలు పెట్టింది. రెడీ అయ్యి వచ్చేసరికి గుడి  మూసేసే టైమ్ అవుతుంది"


"అంత అర్జెంటుగా ఈరోజే, ఇప్పుడే వెళ్ళాలా. రేపెప్పుడో వెళ్ళచ్చు  కదా"


"నాకు మూడ్ ఏం బాలేదన్నయ్యా. కాలేజ్ కి వెళ్తే మళ్ళీ కుదరదూ. నువ్వొస్తావా నాన్నని అడగనా, కానీ నువ్వు తీసుకెళ్లటం లేదని చెప్తాను" అంటూ బెదిరించింది.


"నేను తీస్కెళ్ళను అన్నానా అసలూ. పదా వెళ్ళొద్దాం. అమ్మకి చెప్పేసిరా" అనీ ఇద్దరూ బయల్దేరారు 


గుడిలో,  దేవుడికి దణ్ణం పెట్టుకుని అక్కడే కొంచం సేపు కూర్చున్నారు. 


"తండ్రీ....  బావ తో నేను సంతోషంగా ఉండగలనని నమ్మకం నాకుంది. కానీ నన్ను ఎవరూ నమ్మటం లేదు. నాకు తోడుగా ఉంటాడని నాకు తెలుసు. మా ఇళ్లలో మా పెళ్ళికి ఒప్పుకుని, నేను తనతో సంతోషంగా ఉంటానని నువ్వూ అనుకుంటే, నీకూ ఆ నమ్మకం ఉంటే, నాకేదో ఒక సిగ్నల్ ఇయ్యవా. నా టెన్షన్ తగ్గటం కోసమైనా. ప్లీజ్" 


దణ్ణం పెట్టుకునీ కళ్ళు తెరిచేసరికి,  ప్రదీప్ తననే చూస్తూ,  "వెళ్దామా " అనీ కళ్ళతోనే అడిగి అక్కడ నుంచి కదిలారు. బైక్ ఎక్కుతూ .... 


ప్రదీప్....  "చిన్నూ....  ఏమైంది. ఎందుకలా ఉన్నావు. ఎవరైనా ఏమైనా అన్నారా" 


"లేదన్నయ్యా....  ఏంటోగా ఉందీ. నా ప్రాబ్లెమ్ ఏంటో నాకే అర్థం కావటం లేదు" 


"ఏదైనా ఉంటే చెప్తే కదా,  అర్థమయ్యేది" అంటూనే బైక్ స్టార్ట్ చేసాడు,  స్వాతి సమాధానం వినకుండా. కాదేమో,  సమాధానం రాదని తనకీ తెలుసేమో


అక్కడ ఇంటి దగ్గర....


అన్విత.... "అత్తయ్యా....  లంచ్ చేసి నేను బయల్దేరతాను. నాన్న మీకు కుదిరితే మిమ్మల్ని రమ్మన్నారు సాయంత్రం" 


"అదేంటే సడన్ గా" అన్నారు స్వాతి వాళ్ళ అమ్మగారు


"నువ్వే మాట్లాడుకో" అనీ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది 


ఆవిడ ఫోన్ మాట్లాడి పెట్టేసాక,  ఫోన్ ఇచ్చేస్తూ ... "పెళ్ళి చూపులు అని చెప్పటానికి అంత సిగ్గెంటే" 


"సిగ్గా...  ఇంకేదన్నానా.  చిరాకొస్తోంది అత్తయ్యా. స్వాతీ వాళ్లింకా రాలేదా" అంది చాలా విసురుగా 


"రాలేదు కానీ.... చిరాకు ఎందుకే. నీకిష్టం లేదా" 


ఆ మాటకి కోపంగా చూసింది ఆవిడని. ఆవిడ స్వాతిని అన్వితని ఇద్దరినీ ఒకేలాగా చూస్తారు. ఆవిడ దగ్గర ఏదైనా చెప్పుకోగలిగే చనువు ఉంది అన్విత కి


"ఏంటి అత్తయ్య,  స్వాతి నేను ఒక ఏజ్ వాళ్ళమే కదా. దానికి మీరు చూస్తున్నారా సంబంధాలు?? మీ తమ్ముడికి ఎందుకంత అంత తొందర. నాకిష్టం లేదా అంట....  అసలు నా ఇష్టం ఏంటో అడిగారెంటీ. ఫైనల్ ఇయర్ కి రాకుండానే చూడటాలు మొదలెట్టారు. చదువయ్యేవరకూ కూడా ఆగలేరా. నా వరకూ రావట్లేదు కదా అని ఇన్నాళ్ళు ఊరుకున్నా.  ఇప్పుడేమో పెళ్ళి చూపులంట. వస్తారు కదా రానీయి వాళ్ళని తరిమేయకపోతే చూడు" 


"ఏంటే ఆ మాటలు. ఇక్కడ అరిచేదేదో మీ నాన్న దగ్గరే చెప్పొచ్చు కదా. నేను చెప్తే మాత్రం వింటాడేంటి. వాడి ఆలోచనలేంటో "


"ఇంతకీ ఏంటీ నువ్వొస్తున్నావా లేదా. అయినా నీ మాట విననప్పుడు నువ్వు రావటం ఎందుకూ? వచ్చేవాళ్ళ ముందర గంగిరెద్దు లాగా తయారుచేయటానికా" 


"చిట్టీ తల్లీ.... అలా నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను. సరేనా. నువ్విప్పుడే కదా చెప్పావు నీకిష్టం లేదని. ఈరోజుకి ఇది కానీయి. తర్వాత మీ నాన్నతో నేను మాట్లాడతాను. సరేనా"  అంటూ తనని దగ్గరకి తీసుకున్నారు బుజ్జగిస్తూ 


"సరే అత్తయ్యా"


స్వాతి ఇంట్లోకి వస్తూ అన్విత వాళ్ళని చూసీ...  "ఏంటే మా అమ్మ మీద సడన్ గా ప్రేమ పొంగిపోతోంది" 


"ఆ....  సాయంత్రం మా నాన్న బావి లోకి తోసేస్తాడుట, అత్తయ్య వచ్చి దగ్గరుండి దింపుతుందిట" అంది వెటకారంగా 


"ఏంటే పిచ్చి మాటలు" అని అన్విత తల మీద చిన్నగా తట్టి,  "ఈరోజు దీనికి పెళ్ళిచూపులుట. త్వరగా వెళ్తా అంటోంది. నేనూ మధ్యాహ్నం వెళ్తాను దీనితో పాటు" 


"నేనూ వస్తా అయితే.....  చూస్తా ఎలా ఉంటుందో" 


"ఏంటి చూసేది,  నువ్వు అన్నయ్య ఇంట్లో ఉండండి" 


"సరేలే నేనుంటా,  అన్నయ్య కి ఫ్రెండ్స్ ఎవరో పిలిచారుట. తను బయటకి వెళ్తాడేమో" 


"అక్కర్లేదు, ఇంట్లోనే ఉంటానమ్మా" ప్రదీప్ బయట నుంచే అరిచాడు


"నన్నెవరూ ఎత్తుకుపోరులే అన్నయ్యా . వెళ్ళిరా. కానీ త్వరగా వచ్చేయి"


అన్విత కళ్ళనీళ్ళతో "అయిపోయిందా మీ ఆరెంజ్మెంట్స్. నా బాధ ఎవరికీ అర్థం కాదు. ఎంత సెపూ మీ గోల మీదేనా. నాకివన్నీ ఇష్టం లేదూ" అప్పటి వరకూ ధైర్యంగానే ఉన్నా, స్వాతి వచ్చాక స్నేహితురాలిని హత్తుకుంది, ఆమె అయినా తన బాధని అర్థం చేసుకుంటుందని.


స్వాతి "హేయ్ ఏడుస్తావేందుకే. నీకు ఇష్టం లేదా??" అని ఖంగారుగా అడుగగా, స్వాతి వాళ్ళ అమ్మ గారు "అన్వి నేను చెప్పానా, నేను మాట్లాడతానని. అలా ఏడవకూడదు" అంటూ బుజ్జగించారు. 


మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ చెరో  దారిలో బయటకి వెళ్లగా, స్వాతీ ఇంట్లో బోరుగా ఉందని హరీష్ కి చెప్పగానే తను వాళ్ళింటికి వచ్చాడు. కబుర్లు చెప్పుకుంటూ... 


"బావా...  అన్వి కి పెళ్ళిచూపులని నీకు తెలుసా "


"అవునా....  లేదురా తెలీదు. నాకెలా తెలుస్తుంది" 


"అంటే.....  పొద్దున్న ఫోన్ చేసినప్పుడూ,  నేనేదో ఒకటి చేస్తాను అన్నావూ. తర్వాతేమో అది ఇంటికి వెళ్ళిపోయింది, అమ్మా వాళ్ళు కూడా వెళ్లారు. అందుకే నువ్వేమన్నా చేశావా అనీ" అంది నవ్వుతూ 


"ఓయి...  నేనెలా అరేంజ్ చేస్తాను. పొద్దున్న అన్నాను కానీ ఏం చేయాలో తెలీక పిచ్చెక్కుతోంది,  ఇంతలో నువ్వే కాల్ చేసావు"



Comments