10
ఇంటికి వెళ్లిన స్వాతి, హరీష్ తో మాట్లాడినవి తల్చుకుని నవ్వుకుంటుండగా, అతనే ఫోను చేయటం చూసి సంతోషంగా ఫోను తీసి "హలో " అంది
"ఏం చేస్తున్నావురా "
"ఏం లేదూ..... ఆలోచిస్తున్నా"
"ఏమిటో అంత ఆలోచనలు"
"ఇందాకా మరీ ఎక్కువ ఏడ్పించేశానేమో అనీ.... ఆలోచిస్తున్నా " అంది దీర్ఘం తీస్తూ
"అంటే..... నా గురించే ఆలోచిస్తున్నా..... అంటావ్ " హరీష్ కూడా స్వాతి లానే దీర్ఘం తీస్తూ అనేసరికి నవ్వొచ్చి
" హాహా అదేం లేదులే బావ. సరే కానీ ఊరికే చేశావా"
"నిన్నొకటి అడుగుదామని కాల్ చేశా"
"ఏంటి బావా"
హరీష్ నవ్వుతూ "వెళ్ళేటప్పుడు ఏదో అనేసి పరిగెత్తావ్ కదా, ఏమన్నావా అని.... నాకు సరిగ్గా వినిపించలేదూ"
స్వాతీ కూడా నవ్వాపుకుంటూ "అల్ ది బెస్ట్ అన్నాను, రేపు ఇంటర్వ్యూ ఉందన్నావ్ కదా"
"కాదూ చివర్లో ఇంకేదో అన్నావు కదా, ఏమన్నావ్"
"నేనేమి అనలేదు కాని. అమ్మొస్తుందేమో నేను పెట్టేస్తున్నా"
హరీష్, స్వాతి కంగారుకి నవ్వుతూ.... "సరేలే బాయ్"
"బాయ్ హాట్టి.... ఇందాకా ఇదే అన్నాను" అని హరీష్ ని మాట్లాడనీయకుండా ఫోన్ పెట్టేసింది
హరీష్ నవ్వుతూ, "నేను హాట్టి అయితే నువ్వు స్వీటీ వా 😉" అంటూ మెసేజ్ చేసాడు
ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ ఉండగా, స్వాతికి మళ్ళీ ఫోన్ వస్తుంది. పేరు కూడా చూడకుండానే, "నేను కాదూ"
"ఏంటి నువ్వు కాదూ" అన్విత మాట వినేసరికి అప్పుడు ఫోన్ చూసుకుని
స్వాతి..... "నువ్వా.... ఎవరో అనుకున్నా. ఏంటే సంగతీస్ "
"ఏంటే ఫుల్ హ్యాపీ గా ఉన్నట్లున్నావ్. ఏంటో స్పెషల్"
"మామూలుగానే ఉన్నానే. అయినా స్పెషల్ ఉంటేనే హ్యాపీ గా ఉంటామేంటి. నేనెప్పుడూ హ్యాపీ నే"
"నువ్వు హ్యాపీ గానే ఉంటావే. ఇక్కడ నాకే నిద్ర పట్టట్లేదు. ఏదో సీక్రెట్ చెప్పాలంటావ్, చెప్పవే అంటే చెప్పవూ. నేనేమో సస్పెన్సు తట్టుకోలేకపోతున్నా. ఏంటో చెప్పవే"
"నువ్విక్కడికొస్తే చెప్తా. ఫోన్ లో చెప్పేది కాదు. అయినా అసలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా"
"ఏంటే.... కొత్తగా నాకు చెప్పకూడదని కూడా ఆలోచిస్తున్నావా"
స్వాతీ ... "అవునమ్మా. మరేం చేస్తాం. కొత్తగా నేను చెప్పేవి అన్నయ్య తో చెప్తుంటే నేనూ చెప్పాలా వొద్దా అని ఆలోచించాల్సొస్తోంది" అంది కోపంగా
"అబ్బా అప్పుడేదో టెన్షన్ లో చెప్పేసానే బాబూ. ఇంకోసారి చెప్పనంటున్నా కదా, అదేంటో చెప్పూ"
"సరేలే.... అంత తెలుసుకోవాలనుంటే నువ్వు రా. చెప్తా"
ప్రదీప్ "స్వాతీ ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి కదా. ఫోన్ లో అంతసేపు ఎవరూ " అనడిగాడు స్వాతి రూమ్ దగ్గర నుంచుని
అన్విత ఫోన్ లో ప్రదీప్ మాట వినీ, " ఆ హిట్లర్ కి నేనని చెప్పకే, నీ బదులు నాకు తిట్లు పడతాయి"
"అన్వి... అన్నయ్యా "
ప్రదీప్ "ఏమంటుందీ "
"ఆ హిట్లర్ కి నేనని చెప్పకూ అంటోంది" అని నవ్వేసింది
అన్విత ఫోన్ లో "చచ్చాను....నేను లేను పెట్టేస్తున్నా" అని ఫోన్ పెట్టేసింది
ప్రదీప్ "హిట్లరా.... ఏది ఇటియ్యి ఫోన్"
"ఇంకెవరితో మాట్లాడతావ్ అది పెట్టేసింది" అంది గట్టిగా నవ్వుతూ
"అదైపోయింది నా చేతుల్లో"
"ఎందుకన్నయ్యా దాన్ని భయపెడ్తావ్. అదేమో ఇంటికి రమ్మంటే నీకు భయపడే రావట్లేదేమో అసలూ"
"ఏంటిరా ఇద్దరికీ ఎక్కువవుతోందా. దాన్నేమన్నాను ఎప్పుడన్నా అసలూ, రావటం మానేయటానికి "
"హహ్హహ్హ..... నువ్వేమనలేదూ. నేనే సరదాగా అంటున్నా. అది శనివారం వస్తుందేమో అనుకుంటున్నా"
"సరేలే.... నువ్వేమన్నా ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసావా. అప్పుడు హరీష్ తో చెప్పించుకున్నవి అర్థమయ్యాయా. మళ్ళీ వెళ్లినట్లు లేవు"
"బాగా చెప్పాడు. చాలానే టాపిక్స్ కవర్ చేసాడు. వేరే సబ్జక్ట్స్ చదివేసుకుని తర్వాత వెళ్తాను మళ్ళీ "
"సరే.... చదువుకో" అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు
చూస్తుండగా శనివారం రానే వచ్చింది.
డోర్ బెల్ మోగటం తో స్వాతి వాళ్ళ అమ్మ గారు తలుపు తీయగానే "అత్తయ్యా" అంటూ ఆవిడని గట్టిగా హత్తుకుంది. ఆవిడ ఆశ్చర్యంగా "అన్విత.... ఇదేంటి నువ్వొస్తున్నావని చెప్పనేలేదు వీళ్ళు. రా లోపలికీ "
"వాళ్ళకి సర్ప్రైస్ అత్తయ్యా" అంది అన్విత నవ్వుతూ
"సర్ప్రైస్ అని నువ్వనేసుకుంటే సరిపోదు కదా" అన్నాడు ప్రదీప్ లోపలికి వస్తూ
"అదేంటీ. మీకు తెలిసేంటి నేనొస్తున్నా అని"
"స్వాతి మొన్నే చెప్పిందీ నువ్వు వస్తావు వీకెండ్ అని. అందుకే మూవీ ప్లాన్ వేసాము, అది వస్తే బయల్దేరచ్చు"
అన్విత.... "అదేంటీ బావా మీకేదో సర్ప్రైజ్ అనుకుంటే మీరిద్దరూ నాకు షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏం మూవీ బావా "
ప్రదీప్ కోపంగా "హిట్లర్"
"ఆ అత్తయ్యా..... వస్తున్నా" అంటూ స్వాతీ వాళ్ళ అమ్మా గారు పిలవకపోయినా అక్కడ నుంచి పరిగెత్తింది
కొంచం సేపటికి స్వాతి వచ్చాక, "నువ్వెలా గెస్ చేసావే నేనొస్తానని" అనడిగింది అన్విత
స్వాతి నవ్వుతూ "నువ్వు సస్పెన్సు తట్టుకోలేవ్ కదా. అందుకే తెలుసు"
అందరూ సినిమా కి వెళ్లొచ్చి రాత్రి పడుకునేటప్పుడు, స్వాతీ అన్విత ముచ్చట్లు మొదలు పెట్టారు.
"ఇప్పుడు చెప్పవే ఏంటి సంగతులు. ఏదో చెప్పాలన్నావ్ ఏంటి"
"చెప్పాలనే ఉందీ కానీ అన్నయ్య తో చెప్పేస్తావేమో అని భయమేస్తోంది"
"చెప్పనే. నువ్వు చెప్పేవి అలా ఎవరితోనైనా మాట్లాడానా అసలూ"
"సరే నా మీద ఒట్టు వేయి, చెప్పవనీ "
"ఏంటే టూ మచ్ చేస్తున్నావ్ "
"వేస్తావా లేదా"
"సరే నీ మీదొట్టు ఎవరితోనూ చెప్పనూ" అంది అన్విత స్వాతి ఎందుకలా అంటోందో భయపడుతూనే
స్వాతీ తన బావని ప్రేమిస్తున్నానని అతనికీ తనంటే ఇష్టమని చెప్పి, ఇంకా ఏదో మాట్లాడబోతుంటే
అన్విత..... "నువ్వసలేం మాట్లాడ్తున్నావో తెలుస్తోందా. అసలు హరీష్ అన్న తో లవ్ ఏంటి. నీకసలు అలాంటి ఫీలింగ్స్ ఉన్నట్లు ఒక్కసారైనా కూడా చెప్పలేదేంటి. ఏదైనా ప్రాబ్లెమ్ అయితే మళ్ళీ మొహాలు చూసుకోగలరా. ఇంత ఆలోచించకుండా ఎలా డిసైడ్ అవుతావు" అంటూ చాలా కోపంగా అనేసరికి
"హా .. అంతే అంటావా..... సరేలే చూద్దాం" అంది స్వాతికి ఇంకేమి చెప్పాలో తెలీలేదు. మౌనంగా కళ్ళు మూసుకుంది.
అన్విత..... "స్వాతీ" అంటూ ఏదో మాట్లాడబోయింది. కానీ స్వాతి కళ్ళు మూసుకుని ఉండటం తో పడుకుందేమో అనుకుని తనూ పడుకుండిపోయింది.
పడుకున్నారు కాని ఇద్దరి మనసులూ అల్లకల్లోలంగా ఉన్నాయి.
అన్విత మనసులో, "ప్రదీప్ బావ కి ఈ విషయం చెప్పేయటం మంచిదేమో. తనే దీనికి చెప్పగలడు నా మాట వినిపించుకోదు. కానీ ఈ పిచ్చిది ఒట్టేయించుకుంది కదా. ఇప్పుడెలా. అయినా అదలా చెప్పగానే నేను గట్టిగా మాట్లాడేశానని నాతో కూడా చెప్పటం మానేస్తుందేమో, ఇప్పుడు అట్లీస్ట్ నాతో అయినా చెప్తోంది కదా. ఏదైనా ప్రాబ్లెమ్ అయ్యేలా అనిపిస్తే అప్పుడే ఇంట్లో చెప్పచు. సరేలే పొద్దున్న మళ్ళీ మాట్లాడతాను" అనుకుంటూ నిద్రలోకి జారుకుంది
స్వాతి మనసులో, "అన్నయ్య మా ఇద్దరినీ ఒప్పుకోడనుకుంటూ ఉన్నాను. కానీ అన్వి ఇలా అంటుందనుకోలేదు. నా గురించి బాగా తెలిసినది, అదే నా ప్రేమని అర్థం చేసుకోలేదు. ఇంకా అన్నయ్య కి ఏం చెప్తాను. అలా అని బావ ని మర్చిపోమంటే ఆ థాట్ నాకు కోసేస్తున్నట్లుగా ఉందీ. తను లేకుండా నేనుండలేను" అలా ఆలోచిస్తూ హాల్ లో కి వచ్చి, రమ్య కి మెసెజ్ చేసి అలా అక్కడే పడుకుండిపోయింది.
పొద్దున్న...
"స్వాతీ ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు. లోపలికెళ్ళి పడుకో " అంటూ వాళ్ళ నాన్నగారు లేపటంతో మెలుకువ వచ్చింది. రాత్రంతా ఏడవటంతో మొహం వాడిపోయి కళ్ళు ఉబ్బిపోయాయి.
"ఇంకా పడుకోటం ఏంటి నాన్నా, ఎలాగో లేచింది కదా" అంటూ ప్రదీప్ తన రూమ్ లో నుంచి బయటకి వచ్చాడు
"అదేంటమ్మా మొహమలా ఉందీ. ఏమయ్యిందీ" అనడిగారు స్వాతిని చూసీ కంగారుగా
"ఏంలేదు నాన్నా. లేట్ గా పడుకున్నా కదా. అందుకేనేమో" అంటూ ప్రదీప్ తన మొహాన్ని చూడనీయకుండా వాష్రూమ్ కి వెళ్ళిపోయింది.
"ఏమయిందిరా దానికి. రాత్రేమైనా గొడవ పడ్డారా" అంటూ వాళ్ళ నాన్నగారు ప్రదీప్ ని గట్టిగా అడిగారు
"ఏంటి నాన్నా. దానికేమైనా నేనే అరిచినట్లా. నాకేం తెలుసు ఏమయ్యిందో. రాత్రి బానే ఉందీ నేను పడుకున్నప్పుడు" అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు
అలా వాష్రూమ్ లో కి వెళ్లిన స్వాతి, స్నానం కూడా చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసింది. మనసులో ఉన్న అలజడిని మొహం మీదకి రానీయకుండా తన ప్రయత్నం తను చేస్తోంది
తను బయటకి వచ్చేసరికి వాళ్ళ అమ్మ గారు అందరికీ కాఫీలు కలిపి తీసుకొచ్చారు.
"అదేంటే పొద్దునే ఆరింటికల్లా స్నానం చేసేసావు. రోజూ బతిమాలాలి కదా"
"ఏంలేదమ్మా ఊరికే. నేను ఫస్ట్ చేద్దామని ఈరోజు" అంది వాళ్ళ నాన్నగారి దగ్గర గారం గా కూర్చుంటూ
వాళ్ళ అమ్మా గారు..... "అన్విని కూడా లేపవే"
"ఏమక్కర్లేదు. రాత్రి లేట్ గా పడుకున్నాము. ఇప్పుడది అర్జెంటుగా లేచీ చేసేదేముంది"
ప్రదీప్..... "అర్థరాత్రి వరకూ ఏముంటాయి కబుర్లూ. అయినా లోపల నుంచి సోఫా లో కి ఎందుకొచ్చావు. ఏం కొట్టుకున్నారు ఇద్దరూనూ" అసలు అనుమానాన్ని బయటపెట్టాడు
"మేమేం కొట్టుకుంటాము నిద్ర పట్టక హాల్ లో కూర్చున్నా, దానికి డిస్టర్బ్ అవుతుందేమో అని. మొబైల్ చూస్తూ అలాగే పడుకునిపోయా " అంది ప్రదీప్ కి ఎక్కడా అనుమాన పడే ఛాన్స్ ఇయకుండా.
లోపలినుంచి, వరండా లో కి వస్తున్న అన్విత, స్వాతి మాటలు వినీ, "అదేంటే హాల్ లో పడుకున్నావా??? ఎందుకూ "
"మీ ఇద్దరూ ఎందుకో కొట్టుకున్నారు కదా... అందుకేట " అన్నాడు ప్రదీప్ ఈసారి అన్విత ఏం చెప్తుందో గమనించటానికి
"నువ్వెన్ని పుల్లలు వేసినా మేమేం కొట్టుకోములే " అంది అన్విత
ఉన్నట్టుండి స్వాతీ కి తన మొబైల్ గుర్తొచ్చి లోపలికీ వెళ్ళబొయింది. అదే టైమ్ కి అన్విత కుర్చుంటుంటే, అందుకే స్వాతి లోపలికి వెళ్ళిపోతోందేమో అనుకుని అన్విత.... "ఏమైందే" అని "మాట్లాడవా" అని మెల్లిగా అడిగిందీ
"వస్తానే. ఫోన్ లోపలుండిపోయింది" అని ఫోన్ తీసి చూసేసరికి ఆశ్చర్యపోయింది.
Comments
Post a Comment