నాలో "నీ" నేను ఎపిసోడ్ 1

మనోజ్.... "ఐ లవ్ యు స్వాతి.  మనందరమూ అయిదేళ్ళ నుండి  ఫ్రెండ్స్.  నీ మీద ఈ ఫీలింగ్ ఎప్పుడు మొదలయ్యిందో కూడా తెలీలేదు.  మనసులో పెట్టుకుని నీదగ్గర దాచటంకన్నా నీతోనే చెప్పాలనిపించింది. నాకు ఇప్పటికిప్పుడే ఆన్సర్ ఇయ్యక్కర్లేదు. బాగా ఆలోచించుకునే చెప్పు. నువ్వు సరే అంటే మీ పేరెంట్స్ తో మా అమ్మా వాళ్ళు మాట్లాడతారు."

తను ఇంకా ఏదో చెప్పేలోపే, స్వాతి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 

స్వాతి ఇంటికి ఎలా చేరిందో తనకే తెలియదు. చెవుల్లో ఇంకా మనోజ్ మాటలే వినిపిస్తున్నాయి. మనసులో ఏదో అలజడి. అది కోపమో బాధో అర్థం కాలేదు. "అదేంటే వస్తూనే మంచం ఎక్కావు. కాళ్ళు చేతులు కడుక్కునిరా, అన్నం తిందువుకాని" అమ్మ మాటలకి మళ్ళీ ఈ లోకం లో కి వచ్చింది స్వాతి. 

"ఒద్దమ్మా ఏమి తినాలనే లేదు, అలసటగా ఉంది .  కొంచం సేపు పడుకుని లేస్తా" అంటూ కళ్ళు మూసుకుంది. ఏదో మగత నిద్రే. 

సాయంత్రం  లేచి అమ్మ ఇచ్చిన టీ తాగుతూ,  "అమ్మా ఏదోగా ఉంది.  గట్టిగా ఏడవాలనుంది, కాదు గట్టిగా అరవాలనుందమ్మా" అంది ఏదో ఆలోచిస్తూ. 

"ఎందుకే,  ఏమయ్యిందీ.  కాలేజీ లో ఏమయినా అయ్యిందా" అని అమ్మ అడుగుతుంటే

"బాబోయ్.  ఏదో ఆలోచిస్తూ అమ్మ దగ్గరే అన్నానా.  ఇప్పుడు తెలుసుకునేవరకూ వదలదు.  అయినా ఇదేమన్నా అమ్మ కి చెప్పుకునే విషయమా" అనుకుంటూ "అదేమీ లేదమ్మా.  ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి కదా. అందుకే టెన్షన్ గా ఉంది" అంటూ పుస్తకాలు పట్టుకుని రూమ్ లో కి వెళ్ళింది.

ఆఫీస్ నుంచి వచ్చి బైక్ పార్క్ చేస్తూ, వాళ్ళ మాటలు విన్న ప్రదీప్ " ఏమయిందమ్మా దానికీ" అంటూ కూర్చున్నాడు. 

"నువ్వే విన్నావు కదా,  నాకేమన్నా చెప్పిందేంటి" అంటూ వాళ్ళ అమ్మ గారు లోపలికి వెళ్లిపోయారు. 

లోపల స్వాతి పుస్తకాలతో కుస్తీ పడుతోంది కానీ బుర్ర లో కి ఏమి ఎక్కటం లేదు. "అమ్మా తలకి మసాజ్ చేయవా"  అంటూ నూనె బాటిల్ తో వచ్చింది. 

"ఎప్పుడు పడితే అప్పుడేనా. రాత్రిళ్ళు రాసుకోరు"  అంటూ గట్టిగా చెప్పారు ఆవిడ.

"అమ్మా,  దానికేదో చికాకుగా ఉందేమో.  పోనీ రాయచ్చు కదా" అంటూ చెల్లెలికి వంత పాడాడు ప్రదీప్. ఇక వాళ్ళతో వాదించలేక నూని రాశారు.

రాత్రి భోజనాలయ్యాక  అన్నా చెల్లెలు డాబా ఎక్కి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.  ఎంతకీ  స్వాతి ఏం జరిగిందో చెప్పకపోటంతో, ప్రదీప్  డైరెక్ట్ గా అడిగేశాడు.  

"ఏమయిందిరా కాలేజీ లో. ఎందుకలా ఉన్నావు".
ఏమిలేదని చాలా సేపు ఒప్పించటానికి ప్రయత్నం చేసింది కానీ ప్రదీప్ వదలకపోటం తో చెప్పక తప్పలేదు. 

"అన్నయ్యా మనోజ్ నేనంటే ఇష్టం, నాకూ ఓకే అయితే పెళ్లి కూడ చేస్కుంటా అన్నాడు. వాడసలు అలా మాట్లాడతాడని ఊహించనేలేదు" అంటూ పొద్దున్న నుంచి ఆపుకున్న కన్నీళ్లు ఇంక ఆగలేనని వచ్చేసాయి. 

ప్రదీప్ చాలా ప్రశాంతంగా, "ఇంతేనా. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అంతే కానీ దానికోసం బుర్ర పాడుచేసేసుకుని ఏడవటం ఎందుకు"

"అన్నయ్యా ,  వాడినేమి  అనకుండా నన్ను ఏడవటం ఎందుకంటావేంటి. వాడు నన్ను పెళ్ళిచేసుకుంట అంటాడా" అంటూ స్వాతి ప్రదీప్ తో ఏడుస్తూనే గొడవ కి దిగింది. 

"సరే ఇప్పుడేమంటావ్.  మనోజ్ ని పిలిచి సినిమాలలో లాగా కొట్టనా లేదా వార్నింగ్ ఇస్తే సరిపోతుందంటావా" అన్నాడు నవ్వుతూ. ఈసారి మాత్రం అన్నయ్య ని తినేసే లాగా చూసింది. 

"అలా చూడకురా" అంటూ చెల్లెలి భుజం మీద చేయి వేసి కన్నీళ్లు తుడుస్తూ "నిన్ను లవ్ చేస్తున్నాను.  ఊరు మీద పడి తిరుగుదాము అనలేదు కదా.  బుద్ధిగా అమ్మ వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేస్కుంటా అన్నాడు. నీకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదనుకో,  ఆలా కాదు ఏడాది ఆగాలనో రెండేళ్లు టైం కావాలనో చెప్పు. అంతే కానీ అంత బాధపడిపోయేదేముంది"

"అన్నయ్యా, మనోజ్ తో పెళ్ళా? అసలు నువ్వేం చెప్తున్నావు" ఆశ్చర్యంగా అడిగింది స్వాతి.

"వాడికేం తక్కువరా. బాగా చదువుతున్నాడు.  స్టడీస్ అవగానే వాళ్ళ నాన్న గారి బిజినెస్ చూసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. వేరే అలవాట్లు లేవు. అన్నిటికన్నా ముఖ్యంగా, నువ్వెంటో బాగా తెలిసినవాడు. ఇంతకన్నా అమ్మ వాళ్ళన్నా ఏం చూస్తారు నీకు పెళ్ళి సంబంధాలు వెతికేటప్పుడు"

"అన్నయ్యా ఊరుకుంటే నన్ను ఒప్పించేసి రేపే పెళ్లి చేసేసేలాగా ఉన్నావే" అంది స్వాతి ప్రదీప్ దగ్గర నుంచి దూరం జరిగి కోపంగా చూస్తూ. "అయినా అన్నయ్యా, వాడికి నా గురించి బాగా తెలుసా?? ఏం తెలుసు అన్నయ్యా?? తెలిసినవాడైతే నేను ఇంకొకరిని ఇష్టపడ్తున్నా అని తెలిసి కూడా నన్ను ప్రపోజ్ చేసాడంటే ఏమనుకోవాలి. అసలు ఆ విషయానికే ఇంకా ఎక్కువ బాధగా ఉంది. నాకు..." స్వాతి మాట మధ్యలో ఆగిపోయింది. ప్రదీప్ మొహం చూడగానే స్వాతి ఏమి మాట్లాడిందో తెలిసి, అన్నయ్య నుంచి ఇంకో మాట వచ్చే లోపే అక్కడ నుంచి కిందకి పరుగు తీసింది. 

ప్రదీప్  ఇంకా అక్కడే స్వాతి  వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు. "దీనికి ఇంకొకళ్ళంటే ఇష్టమా?? ఆ మనోజ్ తో తప్ప ఇదసలు అబ్బాయిలతోనే మాట్లాడదూ. మరింకెవరున్నారు. అంటే నా దగ్గర దాస్తోందా?? ఇప్పుడేం చేయాలి. పూర్తిగా అది చెప్పనిదే నేనేమి చేయలేను. మెల్లిగా మళ్ళీ మాట్లాడాలి" అనుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు 


Comments